ఎం. కోటేశ్వరరావు
ఈ నెల 31వ తేదీన కేరళలోని త్రిక్కకర అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఎర్నాకుళం జిల్లాలో కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా తిరిగి నిలుపుకోవాలని కాంగ్రెస్, అక్కడ పాగా వేసి ప్రతిష్టను పెంచుకోవాలని సిపిఎం చూస్తున్నాయి. ఎర్నాకుళం నగరంలో కొంత, కొచ్చి నగరంలో కొంత ప్రాంతం ఉన్న ఉన్న ఈ పట్టణ నియోజకవర్గం ఎర్నాకుళం లోక్‌సభ పరిధిలో ఉంది. హిందూ ఓటర్లు 50, క్రైస్తవ ఓటర్లు 35, ముస్లిం ఓటర్లు 15శాతం ఉన్నారని అంచనా. గతేడాది జరిగిన ఎన్నికలలో సిపిఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్ధిపై గెలిచిన కాంగ్రెస్ సభ్యుడు పిటి థామస్ మరణంతో ఉప ఎన్నిక అవసరమైంది. కాంగ్రెస్ తరఫున థామస్ సతీమణి ఉమ పోటీలో ఉండగా ఈ సారి సిపిఎం తన స్వంత గుర్తుపైనే ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ జో జోసెఫ్‌ను నిలిపింది. బిజెపి కూడా ఇక్కడ పోటీ చేస్తోంది.గత ఎన్నికల్లో ట్వంటీట్వంటీ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్ధికి పదిశాతం ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికల్లో ఆ పార్టీతో కలసి ఆమ్ ఆద్మీ ఉమ్మడి అభ్యర్ధిని నిలుపుతామని, రెండు పార్టీలను విలీనం చేస్తామని చేసిన ప్రకటనలకు భిన్నంగా అసలు పోటీ చేయరాదని, విలీనమూ లేదని రెండు పార్టీలు ప్రకటించాయి. ట్వంటీట్వంటీ(2020) పార్టీని ప్రముఖ పారిశ్రామిక సంస్ధ కిటెక్స్ ఏర్పాటు చేసింది.తమ సంస్ధపై కార్మికశాఖ తనిఖీలు చేసిందంటూ దానికి నిరసనగా కేరళ నుంచి వెళ్లిపోతామని ఆ సంస్ధ బెదిరించిన సంగతి తెలిసిందే ఆ పేరుతో ఏ రాష్ట్రంలో ఎక్కువ రాయితీలు ఇస్తే, కాలుష్యం వంటి అంశాలను పట్టించుకోకుండా ఉండే చోట విస్తరిస్తామని చెప్పింది. ఆ పోటీలో తెలంగాణా సర్కార్ దానితో ఒప్పందం కుదుర్చుకొని వరంగల్‌లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.ఈ సంస్ధకు కేరళ కాంగ్రెస్‌తో కూడా విబేధాలున్నాయి..
ఆమ్ ఆద్మీ పార్టీ కేరళలో అడుగుపెట్టేందుకు కిటెక్స్ యజమానులతో సంప్రదింపులు జరిపింది.దాని బలం ఏమిటో ఇంతవరకు ఎక్కడా రుజువు కాలేదు. కిటెక్స్ సంస్ధ తమ పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేసి గ్రామపంచాయతీని గెలుచుకుంది. మరికొన్ని చోట్ల కూడా పోటీ చేసింది. ఆకస్మికంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిర్ణయం వెనుక కాంగ్రెస్‌ను బలపరిచి సిపిఎంను అడ్డుకోవాలనే ఎత్తుగడ ఉన్నట్లు భావిస్తున్నారు. బహిరంగంగా మద్దతు ఇస్తుందా పరోక్షంగా సహకరిస్తుందా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. గత ఎన్నికల్లో దానికి వచ్చిన పదిశాతం ఓట్లలో ఎవరికి ఎన్ని పడతాయనే చర్చ సాగుతోంది.దివంగత ఎంఎల్‌ఏ పిటి థామస్ ఆ కంపెనీ కాలుష్యం గురించి తీవ్రంగా విమర్శించారు. ఐనప్పటికీ సిపిఎం వ్యతిరేక ఓటు చీలకూడదు, ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ నేతలతో చర్చల తరువాత పోటీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈసారి సిపిఎం గెలిస్తే అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్ బలం 140కి గాను వంద అవుతుంది. వరుసగా రెండవసారి చారిత్రాత్మక విజయం సాధించిన ఎల్‌డిఎఫ్ ఎదుర్కొంటున్న తొలి ఉప ఎన్నిక ఇది. సహజంగానే సిపిఎం కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది.నిజానికి ఈ ఎన్నిక కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యగా మారింది.2011లో కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ సునాయాసంగా గెలిచింది. ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు కె సుధాకరన్, నూతన ప్రతిపక్ష నేత సతీశన్‌కు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు ముదరకుండా చూసుకొనేందుకు, సానుభూతిని సొమ్ము చేసుకోవటంతో పాటు నాయర్ సర్వీస్ సొసైటీ మద్దతును కూడ గట్టేందుకు ఉమను రంగంలోకి దింపినట్లు భావిస్తున్నారు.
సిపిఎం అభ్యర్ధి ఎంపికలో చర్చి అధికారుల ప్రమేయం ఉందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం ప్రారంభించింది. సిరో మలబార్ చర్చ్ ప్రతినిధిగా జో జోసెఫ్‌ను నిలిపినట్లు ఆరోపించింది. ఆ ప్రకటనపై సంబంధిత చర్చి వర్గాల నుంచి నిరసన వెల్లడి కావటంతో తన ప్రకటనను వెనక్కు తీసుకుంది. కాంగ్రెస్ అభ్యర్ధి ఉమ ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. పిటి థామస్‌తో కెఎస్‌యులో కలసి పని చేసినపుడు ఏర్పడిన పరిచయంతో మతాంతర వివాహం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో నాయర్ సర్వీస్ సొసైటీ నేత సుకుమారన్ నాయర్‌ను కలసి ఆయన తనకు తండ్రితో సమానులంటూ తనను బలపరచాలని కోరారు. గత ఎన్నికలలో కూడా అక్కడ క్రైస్తవ సామాజిక తరగతికి చెందిన వారినే సిపిఎం బలపరిచింది. ఎర్నాకుళం నుంచి రెండు సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించటంతో పాటు నాలుగు సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పని చేసిన కాంగ్రెస్ నేత కెవి థామస్ ఈ ఎన్నికల్లో సిపిఎంను బలపరిచేందుకు నిర్ణయించారు. కన్నూరులో సిపిఎం మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సెమినార్‌లో మాట్లాడేందుకు అంగీకరించిన థామస్‌పై ఆగ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం అన్ని పదవుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది తప్ప పార్టీ నుంచి బహిష్కరించలేదు. ఉప ఎన్నిక ముగిసే వరకు ఎలాంటి చర్యలు ఉండకపోవచ్చని చెబుతున్నారు. తాను కాంగ్రెస్‌వాదినేనని ఎల్‌డిఎఫ్ అమలు చేస్తున్న అభివృద్ధికార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌కు రాజీనామా ఇవ్వలేదు, మరొక పార్టీలో చేరలేదని కావాలంటే తనను పార్టీ నుంచి బహిష్కరించుకోవచ్చన్నారు. స్ధానిక కాంగ్రెస్ నేతలు తనను పార్టీ నుంచి వెళ్ళగొట్టేందుకు 2018 నుంచీ చూస్తున్నారని అన్నారు.కెవి థామస్‌కు మీడియా అనవసర ప్రాధాన్యత ఇస్తున్నదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
2011 ఎన్నికల్లో 5.04శాతం ఓట్లు తెచ్చుకున్న బిజెపి 2016లో 15.7శాతానికి పెంచుకుంది, 2021లో 11.32శాతానికి తగ్గింది. ఈ సారి కొత్త అభ్యర్ధిని రంగంలోకి దింపింది.దాని మత అజెండాలో భాగంగా లౌజీహాద్, నార్కోటిక్ జీహాద్ నినాదాలతో క్రైస్తవ ఓటర్లను ఆకర్షించేందుకు పూనుకుంది. గత ఎన్నికల్లో కొత్తగా రంగంలోకి దిగిన ట్వంటీ ట్వంటీ 10.32శాతం ఓట్లు తెచ్చుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఎం, బిజెపి మూడు పార్టీలకు ఓట్లశాతాలు తగ్గినందున ఆ మేరకు ట్వంటీట్వంటీకి పడినట్లు భావిస్తున్నారు. ఆ ఓటర్లు ఈ సారి గతంలో మద్దతు ఇచ్చిన పార్టీలకే తిరిగి వేస్తారా లేదా అన్నది చర్చ.
ఎంపీకి గొడుగుల బహుమతి
డివైఎఫ్‌ఐ నేత, తాజాగా కేరళ నుంచి సిపిఎం తరఫున రాజ్యసభకు ఎన్నికైన ఎఎ రహీంకు అరుదైన బహుమతులు లభించాయి. వివిధ కార్యక్రమాలకు తనను ఆహ్వానించే వారు బంగారుశాలువలు, మెమెంటోలు, ఖరీదైన పుష్పగుచ్చాల వంటివి ఇవ్వవద్దని, అంతగా ఇవ్వాలనుకుంటే గొడుగులు ఇవ్వాలని రహీం సున్నితంగా చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన ఒకసభలో ఆమేరకు వివిధ సంస్ధల వారు రహీంకు రెండువేల గొడుగులు కానుకగా ఇచ్చారు. వాటిని ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు అందచేస్తానని రహీం ప్రకటించారు. గతంలో మంత్రిగా పని చేసిన సిపిఎం నేత ఎంఏ బేబీ తనకు పుస్తకాలు కానుకగా ఇవ్వాలని చెప్పేవారు, వాటిని గ్రంధాలయాలుకు ఇచ్చేవారు.