Tags
BJP, Haj quota, Kerala CPI(M), Kerala LDF, Narendra Modi, RSS, UDF Kerala
ఎం కోటేశ్వరరావు
ఒకవైపు హజ్ యాత్ర సంబంధిత అంశాల గురించి కాషాయ దళాలు చేసిన, చేస్తున్న నానా యాగీ గురించి తెలిసినదే.మరోవైపు హిందూత్వ హృదయ సామ్రాట్టుగా నీరాజనాలందుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ భారత్ నుంచి హాజ్ యాత్రకు భారత్ నుంచి కోటా పెంచాలని, పురుషుల తోడు లేకుండా మహిళలను అనుమతించాలని కోరుతూ సౌదీ అరేబియాకు లేఖ రాశారు. ఈ విషయాన్ని భారత్ హాజ్ కమిటీ అధ్యక్షుడు, బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడైన ఎపి అబ్దుల్లా కుట్టి స్వయంగా చెప్పారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా కేరళ సందర్శించిన సందర్భంగా కోజికోడ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ విశ్వాసులకు నరేంద్రమోడీ ఒక బోధకుడి వంటి వారని ఆకాశానికి ఎత్తారు.హజ్ యాత్రకు ప్రభుత్వం చేస్తున్న సాయం గురించి పదే పదే ప్రస్తావించారు. కాంగ్రెస్ ఏలుబడిలో హజ్‌యాత్ర గురించి హంగామా చేసే వారని, ప్రజాధనాన్ని దోచుకున్నారని అబ్దుల్లాకుట్టి ఆరోపించారు. అబ్దుల్లా కుట్టి గతాన్ని చూస్తే సిపిఎం తరఫున ఎంపీగా ఎన్నికై 2008లో నరేంద్రమోడీని పొగడటంతో పాటు క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు బహిష్క్‌రణకు గురైన తరువాత కాంగ్రెస్‌లో చేరారు.ఆ పార్టీలో ఉంటూ 2019లో మరోమారు నరేంద్రమోడీని పొగటంతో కాంగ్రెస్ కూడా సాగనంపింది. అక్కడి నుంచి బిజెపి ఆశ్రయం పొందారు.నరేంద్రమోడీని పొగడటంలో అబ్దుల్లాకుట్టి పేరుమోశారు. కోజికోడ్ సభలో దాని కొనసాగింపుగానే పొగడ్తలు కురిపించిన తీరు మీద నెటిజన్లు తరువాత అబ్దుల్లాకుట్టితో ఒక ఆట ఆడుకున్నారు. రాష్ట్రంలో పెద్ద చర్చకు దారి తీసింది. దాంతో నష్ట నివారణ చరó్యకు పూనుకున్నారు. కోజికోడ్ సభలో హజ్ యాత్రకు సంబంధించి నరేంద్రమోడీ గురించి చెప్పిన మాటలు తప్పిదమేనని, నోరు జారినట్లు పది రోజుల తరువాత సంజాయిషి ఇచ్చుకున్నారు. తాను సభలో మాట్లాడుతున్నపుడు తమ నేత కృష్ణదాస్ తనకు మంచి నీరు ఇచ్చారని, తాగిన తరువాత తన ప్రసంగం అదుపు తప్పిందని అబ్దుల్లా కుట్టి చెప్పినట్లు కేరళ కౌముది పత్రిక రాసింది.
అబ్దుల్లాకుట్టిని హజ్‌కమిటీ జాతీయ అధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా మేనెల మొదటి వారంలో ఒక సంస్ధ ఇచ్చిన ఇప్తార్ విందు, కుట్టి అభినందన కార్యక్రమానికి ముస్లిం లీగు నేతలు కొందరు హాజరుకావటం వివాదాస్పదమైంది. ఎవరూ అభినందన సభలకు హాజరు కావద్దని లీగ్ నాయకులు ఆదేశించిన తరువాత ఇది జరిగింది. అది అభినందన సభగా మారుతుందని తమకు తెలియదని ఇప్తార్ ఇచ్చింది తమ బంధువు కావటంతో వెళ్లినట్లు లీగు కన్నూరు జిల్లా కార్యదర్శి తాహిర్ సంజాయిషి ఇచ్చుకున్నారు.
మరోమారు నోరు పారవేసుకున్న పిసిసి అధ్యక్షుడు కె సుధాకరన్
కేరళ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కె సుధాకరన్‌కు నోటి దురుసు ఎక్కువ. ఒక కల్లుగీసేవాడి కొడుకు హెలికాప్టర్లలో తిరుగుతున్నాడంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై గతంలో నోరు పారవేసుకున్నారు. తన తండ్రి ఒక గీత కార్మికుడు, తన అన్న ఇప్పటికీ గీత వృత్తిమీదనే బతుకుతున్నాడని, అలాంటి కష్టజీవుల కుటుంబంలో పుట్టినందుకు గర్విస్తున్నానని అప్పుడు విజయన్ తిప్పికొట్టారు. తాజాగా త్రిక్కకర అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా సుధాకరన్ మాట్లాడుతూ గొలుసు తెంచుకున్న కుక్క మాదిరి విజయన్ త్రిక్కకర నియోజకవర్గంలో తిరుగుతున్నారంటూ మరోసారి అదేపని చేశారు. ఒక డివైఎఫ్‌ఐ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాలారివట్టం పోలీసులు కేసు నమోదు చేశారు. తమ నేత నోటవెలువడిన సంస్కారహీనమైన పదజాలాన్ని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సతీశన్ సమర్ధించారు. కన్నూరు ప్రాంతంలో అలాంటి పదజాలం సాధారణమే కనుక తప్పేంలేదని వెనుకేసుకు వచ్చారు. విజయన్ నియోజకవర్గంలో తిష్టవేసి ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నందున అలా అన్నానని, దానికి ఎవరైనా బాధపడితే మాటలను వెనక్కు తీసుకుంటానంటూ సుధాకరన్ అహంకారంతో మాట్లాడారు.
ఎర్నాకుళం జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి, త్రిక్కకర అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేత ఎంబి మురళీధరన్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి సిపిఎం అభ్యర్ధికి మద్దతు ప్రకటించారు. ఎల్‌డిఎఫ్‌తో కలసి పని చేస్తానని చెప్పారు. 2020 ఎన్నికల్లో ఓడిపోక ముందు కొచ్చి కార్పొరేషన్‌లో మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. త్రిక్కకర ఉప ఎన్నికల్లో చర్చి నిలిపిన అభ్యర్ధులెవరూ లేరని ఏ ఎన్నికలోనూ ఎప్పుడూ ఒక అభ్యర్ధికి మద్దతు ఇవ్వలేదని సిరో మలబార్ చర్చ్ ఆర్చిబిషప్ జార్జి అలంచెరీ చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఉమా థామస్, మాజీ సిఎం ఊమెన్ చాందీ తదితర కాంగ్రెస్ నేతలు అలంచెరీని కలసి మద్దతు ఇవ్వాలని కోరారు. తరువాత అలంచెరీ విలేకర్లతో మాట్లాడారు. సిపిఎం అభ్యర్ధి డాక్టర్ జో జోసెఫ్‌ను చర్చికి సంబంధించిన భవనంలో అభ్యర్ధిగా ప్రకటించటం గురించి అడగ్గా అదొక యాదృచ్చిక ఘటన తప్ప చర్చికి దానికి సంబంధం లేదన్నారు. డాక్టర్ జోసెఫ్ పని చేస్తున్న ఆసుపత్రి ఒక చర్చి నిర్వహణలో ఉంది, ఆ ఆసుపత్రిలోనే మీడియాకు అభ్యర్ధిత్వాన్ని వెల్లడించారు. దాంతో ఇంకేముంది చర్చి తరఫునే నిలుపుతున్నారంటూ ప్రచారం ప్రారంభించారు. దీని వెనుక పెద్ద కుట్ర వుందంటూ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఎన్నికలో సిపిఎం, కాంగ్రెస్, బిజెపి అభ్యర్ధులతో పాటు ఐదుగురు స్వతంత్రులు పోటీలో ఉన్నారు.
పన్నెండు జిల్లాల్లోని స్ధానిక సంస్ధల వార్డులకు గతవారంలో జరిగిన ఉపఎన్నికల్లో 42కు గాను 24 చోట్ల సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్ గెలిచింది.కాంగ్రెస్‌కు 12, బిజెపికి ఆరు వచ్చాయి. ఎన్నికల్లో 31పంచాయతీ, ఏడు మున్సిపాలిటీ, రెండు కార్పొరేషన్ వార్డులకు పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ మొత్తం మీద గతంలో ఉన్ని ఎనిమిది వార్డులను కోల్పోయింది. ఎల్‌డిఎఫ్ నుంచి మూడు సీట్లను కాంగ్రెస్, రెండింటిని బిజెపి గెలుచుకుంది.కొన్ని చోట్ల కాంగ్రెస్-బిజెపి కుమ్మక్కైనట్లు వార్తలు వచ్చాయి. బిజెపి కూడా రెండు స్దానాలను కోల్పోయింది.
సిపిఎం నేతల సమక్షంలో మతాంతర వివాహం
కోజికోడ్ జిల్లా కొడంచెరికి చెందిన భిన్న మతాలకు చెందిన ఎంఎస్ షెజిన్, జోస్నా మేరీ జోసెఫ్ సిపిఎం కార్యకర్తల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఏప్రిల్ నెలలో వీరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవటం పెద్ద వివాదానికి దారి తీసింది. లవ్ జీహాద్ పేరుతో కొందరు రెచ్చగొట్టేందుకు చూశారు. షెజిన్ కన్నోత్ ప్రాంత డివైఎఫ్‌ఐ కార్యదర్శి, స్దానిక సిపిఎం కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ప్రత్యేక వివాహచట్టం కింద వారి వివాహం జరిగింది. డివైఎఫ్‌ఐ రాష్ట్రకమిటీ సభ్యుడు దీపు ప్రేమనాధ్,తిరువంబాడి సిపిఎం ఏరియా కమిటీ సభ్యులు షిజి అంటోనీ, కెపి చాకోచన్ వివాహానికి హాజరయ్యారు. తన కుమార్తెను బలవంతం, బందీగా చేసి వివాహానికి ఒప్పించినట్లు ఆరోపిస్తూ జోస్నా మేరీ తండ్రి జోసెఫ్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. రాష్ట్ర వెలుపలి సంస్ధతో విచారణ జరిపించాలని కోరారు. జోస్నాను కోర్టుకు రప్పించి తండ్రి ఆరోపణ నిజమేనా అని ప్రశ్నించగా తాను మేజర్‌నని, తననెవరూ బలవంతపెట్టలేదని ఆమె చెప్పటంతో కోర్టు ఆ పిటీషన్ కొట్టివేసి వివాహానికి అనుమతించింది. దాంతో మరుసటి రోజే వివాహం చేసుకున్నారు.ఈ వివాహం వలన స్దానికంగా పార్టీకి దగ్గర అవుతున్న కైస్తవ సామాజిక తరగతిని దూరం చేస్తుందని సిపిఎం మాజీ ఎంఎల్‌ఏ జిఎం థామస్ చెప్పటాన్ని సిపిఎం తప్పు పట్టటమే కాదు తగని పని బహిరంగంగా అభిశంచింది. తాను తప్పుమాట్లాడినట్లు థామస్ అంగీకరించటంతో ఆ వివాదం సద్దుమణిగింది.
ఈ ఉదంతంలో లబ్దిపొందేందుకు బిజెపి చూసింది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్ జోస్న తలిదండ్రులను కలసి కేంద్ర సంస్దలతో దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్‌కు మద్దతు తెలిపారు. దీని వెనుక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా హస్తం ఉందని ఆరోపించారు. మీ కుమార్తె ఆ సంస్ధ అలప్పూజ ఆఫీసులో ఉంటుందని అన్నాడు. కొందరు పగలు డివైఎఫ్‌ఐ కార్యకర్తలుగాను వారే రాత్రి ఫ్రంట్ కార్యకర్తలుగా ఉంటారని ఆరోపించారు.