Tags
BILL GATES, Monkeypox, Monkeypox Conspiracy Theory, Monkeypox goes global, Monkeypox Vaccines, Smallpox
ఎం కోటేశ్వరరావు
ఒకనాడు కేవలం ఆఫ్రికా ఖండానికే పరిమితం అనుకున్న మంకీపాక్స్ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని ఆవరించనుందా ? కరోనా మాదిరి మహమ్మారిగా మారనుందా ? నివృత్తి జరిగేంతవరకు అనేక అనుమానాలు, సందేహాలు వెలువడుతూనే ఉంటాయి. తెలుగు నాట మసూచి, పెద్ద అమ్మోరు, స్ఫోటకంగా పిలిచిన వైరస్‌కు ఇది సోదరి. ప్రస్తుతానికి అలాంటి తీవ్ర హెచ్చరికలు వెలువడలేదుగానీ కరోనా నేపధ్యంలో అనేక వార్తలు భయపెడుతున్నాయి. ఇది పాక్స్ జాతికి చెందిన వైరస్‌గా కోతుల్లో గుర్తించినందుకు దానికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. ఇది మసూచికి సంబంధించిందైనప్పటికీ అంతటి ప్రమాదకారి కాదని కొందరు అంటున్నా ,అప్పుడే నిర్దారించలేమని మరికొందరు హెచ్చరిస్తున్నారు.వరియోలా మేజర్, వరియోలా మైనర్‌గా పిలిచిన వైరస్‌లు మసూచి కారకాలు, ఇది గతశతాబ్దిలో 30 కోట్ల మందిని, అంతకు ముందు మరో ఇరవై కోట్ల మందిని బలితీసుకుందని అంచనా.పదహారవ శతాబ్దిలో బ్రిటన్‌లో దీన్ని స్మాల్‌పాక్స్ అని పిలిచారు.1980లో ప్రపంచంలో పూర్తిగా నిర్మూలించినట్లు ప్రకటించి ఈ వైరస్ ఇప్పుడు అమెరికా, రష్యాల్లోని రెండు పరిశోధనా సంస్ధలలో మాత్రమే ఉంది.
ఐరోపా, ఉత్తర అమెరికా, ఆసియా ఖండాల్లోని 14 దేశాల్లో మే నెల మూడవ వారం వరకు 120 నిర్దారణ లేదా అనుమానాస్పద కేసులు నమోదైనాయి. ఒక ప్రాంతంలోని జనాభాతో మరొక ప్రాంత జనాభాకు సంబంధలేనప్పటికీ ఇన్ని చోట్ల వ్యాప్తి చెందటం ఆసక్తి కలిగిస్తున్నదని ఆఫ్రికాలోని కాంగోలో పదేండ్ల క్రితం ఈ వైరస్ మీద పరిశోధన చేసిన అమెరికా శాస్త్రవేత్త అనే రిమోయిన్ చెప్పారు. ఇది మసూచి సంబంధిత వైరస్ కనుక కరోనా మాదిరి వ్యాప్తి చెందదని మరోశాస్త్రవేత్త జే హూపర్ అన్నారు. ఇది సోకిన వ్యక్తులు దగ్గినపుడు అతి సమీపంలోని వారికి మాత్రమే సోకే అవకాశం ఉందన్నారు. ఇది సోకిన వారు ఎలాంటి చికిత్సలేకుండానే కొన్ని వారాల తరువాత ఎక్కువ మంది కోలుకుంటారని కూడా హూపర్ అంటున్నారు. ఇది ప్రాధమిక దశలో ఉన్నందున ఇప్పటికిప్పుడే నిర్ధారణగా దేన్నీ చెప్పలేమని మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని మరో వైరాలజిస్టు గుస్తావ్ పాలాసియో చెప్పారు. ఆఫ్రికా దేశాల్లో ఇది కనిపించినప్పటికీ ఐరోపా, అమెరికాల్లో వ్యాప్తి చెందటానికి ఉన్న సంబంధం ఇంకా తెలియలేదు.ప్రస్తుతానికి మన దేశంలో ఈ వైరస్ దాఖల్లాలేవు. సోకిన దేశాల నుంచి వచ్చిన వారి మీద నిఘావేసి, లక్షణాలున్నవారి నుంచి రక్త నమూనాలను సేకరించాలని ఆదేశించారు.స్త్రీ-పురుషుల సంపర్కం ద్వారా మంకీపాక్స్ వ్యాపించదని భావించిన ఈ వైరస్ ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చుకొనేట్లు చేసింది. బ్రిటన్‌లో వెలువడిన కేసులలో ఎక్కువ మంది స్వలింగ, ద్విలింగ సంపర్క పురుషుల్లో కనిపించింది.
సంబంధం లేని దేశాల జనాభాలో ఇది కనిపించటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మసూచి(స్మాల్‌పాక్స్)ను పూర్తిగా నిర్మూలించినందున దాని సోదరి మంకీపాక్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంతకాలంగా భావిస్తున్నారు. బలహీనం, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారిలో మంకీపాక్స్ సోకవచ్చని భావిస్తున్నారు.కాంగోలో కనిపించిన తరువాత 39 ఏండ్లకు 2017 నుంచి నైజీరియాలో రెండువందల నిర్ధారిత, ఐదు వందల అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి. 2003లో ఘనా నుంచి దిగుమతి చేసుకున్న ఎలుకల నుంచి అమెరికాలోని ఇల్లినాయిస్ కుక్కలకు తరువాత 70 మంది మనుషులకు సోకింది. తాజాగా వివిధ దేశాల్లో కనపడిన కేసుల వెనుక బిల్‌గేట్స్ హస్తం ఉందంటూ కొన్ని కుట్ర సిద్దాంతాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. వాక్సిన్ల తయారీలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్న బిల్‌గేట్స్ వాటిని అమ్ముకొనేందుకు వైరస్‌లను కూడా సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏడాది క్రితం ఒక సభలో మాట్లాడిన బిల్‌గేట్స్ త్వరలో మరో పెద్ద మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని, దీని కోసం ప్రపంచ ఆరోగ్య సంస్ద కొత్త సంస్దను ఏర్పాటు చేయాలని, జీవాయుధాలుగా వైరస్‌లను ఉగ్రవాదులు వినియోగించవచ్చని హెచ్చరించాడు. ఆ మాటలకు ఇప్పుడు జరుగుతున్న వాటికి సంబంధం కలిపి వార్తలు వెలువడుతున్నాయి. అంతకు ముందు కూడా గేట్స్ ఇలాగే మాట్లాడిన ఉదంతాలున్నాయి. గతవారంలో పెద్ద మొత్తంలో మంకీపాక్స్ వాక్సిన్ను అమెరికా కొనుగోలు చేయటం వాటికి ఊతమిస్తున్నాయి.
బ్రిటన్‌లో తొలికేసు నైజీరియా వెళ్లి వచ్చిన పురుషుడిది కాగా తరువాత వారికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదు. అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఒకరికి నిర్దారణైంది. అతను ఇటీవలే కెనడా వెళ్లి వచ్చినట్లు తేలింది. దాంతో 119మిలియన్ డాలర్ల విలువగల మంకీపాక్స్ వాక్సిన్లు సరఫరా చేయాలని అమెరికా సర్కార్ కోరిందని బవేరియన్ నోర్డిక్ కంపెనీ ప్రకటించింది. అంతకు ముందే ఇచ్చిన ఆర్డర్‌తో కలిపితే 299 మిలియన్ డాలర్లని, కోటీ30లక్షల డోసులమేర కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. వీటిని 2024,25లో సరఫరా చేస్తారు. మంకీపాక్స్ సోకినవారిలో నూటికి పది మంది మరణించినట్లు గత సమాచారం వెల్లడిస్తున్నది.
మంకీపాక్స్‌ను పరిశోధనకు తెచ్చిన కోతుల్లో 1958లో కనిపించింది.మానవుల్లో తొలికేసు 1970లో నమోదైంది. ఇది వివిధ పద్దతుల్లో , రకరకాలుగా సోకే అవకాశం ఉంది. వైరస్ ఉన్న జంతువు మనిషిని కరచినా, దాని రక్తం, స్రవించిన ద్రవాలను ముట్టుకున్నా, ఈకలను తాకినా రావచ్చు. ఎలుకలు, ఉడుతలు, వైరస్ సోకిన జంతుమాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా ఈ వైరస్ సోకుతుంది. సంభోగం ద్వారా కూడ సంక్రమించవచ్చు. మనుషుల్లో జ్వరం, కండరాల నొప్పి,దద్దుర్లు, గాయాలుకావటం, చలి వంటి లక్షణాలుంటాయి. సాధారణంగా వైరస్ సోకిన తరువాత ఐదు నుంచి 21 రోజుల్లో లక్షణాలు కనిపించవచ్చు.
2003 అక్టోబరు 29న న్యూసైంటిస్టు డాట్‌కామ్‌లో డెబోరా మెకంజీ అనే విశ్లేషకుడు ” అమెరికా వృద్ధి చేసిన ప్రాణాంతక వైరస్‌లు ” అనే పేరుతో రాశారు. అమెరికా ప్రభుత్వ నిధులతో పరిశోధనలు చేసిన ఒక శాస్త్రవేత్త మసూచి వైరస్ నుంచి జన్యుమార్పిడితో ప్రమాదకర మౌస్‌పాక్స్‌ను తయారు చేసినట్లు పేర్కొన్నారు.యాంటీ వైరల్ వాక్సిన్లు ఇచ్చినప్పటికీ ఇది సోకిన ఎలుకలు మరణించాయి. తరువాత కౌపాక్స్(ఆవు) వైరస్‌ను కూడా రూపొందించారు. ఇలా రూపొందించిన వాటిని ప్రమాదకారులుగా మార్చేందుకు కూడా వీలుంది. మానవుల్లో కూడా వైరస్‌ను ప్రవేశపెట్టేవిధంగా మార్చ వచ్చని 2003నాటి ఆర్టికల్‌లో హెచ్చరించారు. లాభాల కోసం ఎంతకైనా తెగించే అమెరికన్లు దేనికైనా పాల్పడతారని చరిత్ర రుజువు చేసింది.
ఐరోపాలో స్మాల్‌పాక్స్, మంకీపాక్స్, కౌపాక్స్ చికిత్సకు ” టెకోవిరిమాట్” అనే ఔషధాన్ని అనుమతించారు.దాన్ని టిపాక్స్ పేరుతో విక్రయిస్తున్నారు. అమెరికాలో స్మాల్‌పాక్స్‌కు మాత్రమే అనుమతించారు.తాజాగా వ్యాపిస్తున్న మంకీపాక్స్ పాతదేనా కొత్త రకమా అన్నది ఇంకా నిర్దారణ కాలేదు. అనేక దేశాల్లో కనిపించిన తీరును చూస్తే వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని అర్ధం కరోనా మాదిరి వేగంగా విస్తరిస్తుందని కాదని కూడా అంటున్నారు.
మంకీపాక్స్ మరోరూపంలో వచ్చిన మసూచికం అని కొందరు చెబుతున్నారు.1999లో పరిశోధనా సంస్దల్లో ఉన్న మసూచి వైరన్‌సు నాశనం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచించింది. ప్రస్తుతం ఆ సంస్ద వద్ద ఐదులక్షల డోసుల వాక్సిన్ ఉండగా ఇతర దేశాల్లో 60నుంచి 70 మిలియన్ల డోసులు ఉందని, అనేక నిల్వలు సక్రమంగా లేవని చెబుతున్నారు. అమెరికాలో 50 నుంచి వంద లక్షల మందికి వేసేందుకు సరిపడా ఉందని అంచనా.1980నాటికి వరియోలా వైరస్ 76 పరిశోధనా సంస్ధల్లో ఉంది. వైరస్‌ను నాశనం చేయాలన్న సూచన మేరకు తమ 74 కేంద్రాలు నాశనం చేయటం లేదా తమ వద్ద ఉన్న నిల్వలను ప్రపంచ ఆరోగ్య సంస్ధకు అంద చేశాయి. అమెరికాలోని అట్లాంటాలో సిడిసి, రష్యాలోని కోల్ట్‌సోవో వైరాలజీ సంస్ధలో మాత్రమే ఉంది. కొందరి అనుమానం ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్ధకు తెలియ కుండా కొన్ని చోట్ల దాచారని, జీవాయుధంగా వాడేందుకుగాను కొత్త వైరస్ సృష్టికోసమే ఇలా చేశారనే ఆరోపణలున్నాయి గాని, నిర్ధారణ కాలేదు.
. ప్రపంచంలో వైరస్‌తో జీవాయుధాలను తయారు చేసి యుద్దాలలో వినియోగించే అంశాల గురించి కొందరు నిపుణులు వెలిబుచ్చిన అభిప్రాయాలను, అనేక అంశాలను పేర్కొంటూ చైనా మిలిటరీ వైద్యుడు గ్జు డెహౌంగ్ 2015లో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అదేమీ రహస్యం కాదు, అమెజాన్ ద్వారా ప్రపంచమంతా కొనుగోలు చేసింది. చైనాలో 2002,04 సంవత్సరాలలో బయటపడిన సార్స్ మహమ్మారి విదేశాల నుంచి అసహజ పద్దతిలో జన్యుమార్పిడి జరిగి వచ్చిన వైరస్ (ఇది కూడా కరోనా వైరస్ రకాలలో ఒకటి) అని చైనా పుస్తకంలో అభిప్రాయపడ్డారు. చైనాకు వ్యతిరేకంగా విదేశాల్లో ఉగ్రవాదుల జీవ ఆయుధాల తయారీని కూడా కాదనలేమని సంపాదకుడు గ్జు పేర్కొన్నారు. ప్రపంచంలో జీవ ఆయుధాల ప్రయోగాలు, యుద్దంలో వాటి వినియోగం గురించి కూడా దానిలో చర్చించారు. 1941లోనే అమెరికా జీవ ఆయుధాల పరిశోధన ప్రారంభించిందని, తరువాత వాటి తయారీకి ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసిందని, 1940-45 సంవత్సరాల మధ్య జపాన్ జీవ ఆయుధాలను ఉపయోగించి తూర్పు చైనాలోని ఝెజియాంగ్, హునాన్ రాష్ట్రంలో ప్రయోగించి ప్లేగు వ్యాధి వ్యాపింప చేసిందని కూడా రచయిత దానిలో పేర్కొన్నారు.
బిల్ మరియు మెలిందా గేట్స్ ఫౌండేషన్ సారధి, మైక్రోసాఫ్ట్‌కు మారు పేరు అయిన బిల్ గేట్స్ చావులను కూడా సొమ్ము చేసుకొనేందుకు పూనుకున్నాడు. కరోనా వాక్సిన్ తయారీ వివరాలను భారత్‌కు మరొక దేశానికి ఇవ్వకూడదని ఆ పెద్దమనిషి చెప్పిన సంగతిని మరచిపోలేము. భద్రతా కారణాల రీత్యా ఇవ్వటం కుదరదన్నాడు. ఒకవేళ ఎక్కడైనా అలా ఇస్తే అది తమ సాయం మరియు నైపుణ్యం ఫలితమే అన్నాడు. 2015లో బిల్ గేట్స్ టెడ్ టాక్ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ రానున్న దశాబ్దంలో ఒక పెద్ద మహమ్మారి రానున్నదని, అది ఐదు కోట్ల మందిని బలితీసుకున్న 1918నాటి మహమ్మారి మాదిరి ఉంటుందని, ఆరునెలల్లో మూడు కోట్ల మందిని చంపి వేస్తుందని చెప్పాడు. దాన్ని యుద్దం మాదిరి ఎదుర్కొనేందుకు ప్రపంచం తీవ్ర ప్రయత్నాలు చేయాలన్నాడు. బిల్ గేట్స్ మాటలను బట్టి గేట్స్ అప్పటికే మైక్రోచిప్ ద్వారా నియంత్రించే ఒక మహమ్మారి వైరస్‌ను ప్రయోగశాలలో రూపొందించి ఉన్నారని కొంత మంది అప్పుడే చెప్పారు. అవి బుద్దిలేని మాటలని తమ ఫౌండేషన్ ద్వారా వాక్సిన్లను కొనుగోలు చేస్తున్నామని అందువలన మహమ్మారుల ప్రమాదం గురించి హెచ్చరించేందుకే తాను చెప్పానన్నాడు.నియంత్రణలతో సురక్షితమైన వాక్సిన్లను తయారు చేయాలి గనుక భారత్ వంటి అభివద్ది చెందుతున్న దేశాలకు తయారీ విధానం గురించి చెప్పకూడదని ఒక ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్ చెప్పాడు.
ప్రపంచంలోని 25 దేశాలలో అమెరికన్లు బయో ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఆగేయ ఆసియా, మాజీ సోవియట్ రిపబ్లికులలో అవి ఉన్నాయి. ఒక్క ఉక్రెయిన్‌లోనే 16 ఉన్నాయంటే అమెరికా కుట్రలను అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలోని మేరీలాండ్‌లోని ఫ్రెడరిక్ అనే ప్రాంతంలో ఫోర్డ్ డెట్రిక్ ప్రయోగశాలలో ఎబోలా వంటి వ్యాధుల కారకాల గురించి పరిశోధనలు చేశారు. దాని మీద వార్తలు రావటంతో 2019లో మూసివేశారు. గత రెండు దశాబ్దాలలో ఇంటా బయటా ఉన్న అమెరికన్ ప్రయోగశాలలో అనేక వందల ఉదంతాలలో ప్రమాదాలు జరిగి ప్రమాదకరమైన వైరస్, బాక్టీరియాలు బయటపడినట్లు యుఎస్‌ఏ టుడే పేర్కొన్నది అమెరికాలో ఇలాంటి సమస్యలున్న కారణంగా ఇతర దేశాలలో అసలు విషయాలను దాచి పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
మానవ కల్యాణం కోసం ఒక ప్రమాదకర వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్‌ను రూపొందించేందుకు ప్రతి దేశానికీ అవకాశం, హక్కు ఉంది. అయితే ఆ ముసుగులో ఆయుధాలు తయారు చేసే దేశాలు మిగతా వాటి మీద బురద జల్లుతున్నాయి. చరిత్రను తిరగేస్తే క్రీస్తు పూర్వం ఆరువందల సంవత్సరంలో క్రిసాను ముట్టడి సమయంలో రాజు సోలోన్ కటుక రోహిణీ అనే పుష్పాల నుంచి తీసిన రసాన్ని ప్రయోగించి విరేచనాలు, ఇతర వ్యాధులు కలిగించినట్టు చరిత్రలో ఉంది. 1155లో రాజు బార్బోసా ఇటలీలోని టోరోంటానాలోని మంచి నీటి బావుల్లో శవాలను పడవేసి కలుషితం కావించాడు. 1495లో ఫ్రెంచి సైనికులను హతమార్చేందుకు స్పెయిన్ రాజులు ఇటలీలోని నేపుల్స్‌లో కుష్టువ్యాధి గ్రస్తుల రక్తం కలిపిన వైన్ సరఫరా అయ్యేట్టు చూశారు.1675లో విషంతో కూడిన బుల్లెట్లను వినియోగించరాదని జర్మనీ-ఫ్రెంచి సైన్యం అంగీకారానికి వచ్చాయి. 1710లో రష్యన్ చక్రవర్తి ప్లేగుతో మరణించిన శవాలను ఫిరంగులకు కట్టి స్వీడన్ పట్టణాలలో పడవేయించాడు. 1763లో అమెరికాలోని గిరిజనులను దెబ్బతీసేందుకు బ్రిటిష్ పాలకులు మసూచి వ్యాధిగ్రస్తులు వాడిన దుప్పట్లు పంపిణీ చేశారు.పర్యవసానంగా దాదాపు రెండువందల సంవత్సరాల పాటు అమెరికాలో మసూచి వ్యాప్తి చెందింది. నెపోలియన్ చక్రవర్తి 1797లో ఇటలీలోని మంటువాలో మలేరియా వ్యాధి వ్యాపింప చేసేందుకు మైదానాలను వరదలతో నింపించాడు. అంతర్యుద్ధ సమయంలో1863లో అమెరికాలోని బానిస వ్యవస్థను కోరుకొన్న తిరుగుబాటు రాష్ట్రాలు యూనియన్ సైనికులకు ఎల్లోఫీవర్, అమ్మోరు సోకిన రోగులు వాడిన వస్త్రాలను విక్రయించేట్టు చూశాయి.
1346లో జెనోయీస్-తార్తార్ల మధ్య నేటి ఉక్రెయిన్‌లో ఆధిపత్య పోరు సమయంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఓటమి దశలో ఉన్న తార్తార్లు ప్లేగువ్యాధి సోకిన, మరణించిన తమ వారిని ఫిరంగులకు కట్టి శత్రు ప్రాంతాల మీద పడేశారు. దాంతో జెనోయీస్ దళాలు వెనక్కు తగ్గాయి. ఈ పరిణామం గురించి గాబ్రియల్ డే ముసిస్ నమోదు చేశాడు. వెనక్కు తగ్గిన జెనోయీస్(ఇటాలియన్లు)లు తమతో పాటు ప్లేగు వ్యాధి కూడా తీసుకు వెళ్లారు. ప్లేగు వ్యాధిగ్రస్తులు, బహుశా దానిని వ్యాపింప చేసే ఎలుకలను కూడా తమ నౌకల్లో తీసుకుపోయి ఉంటారని పేర్కొన్నాడు. ఆ తరువాత అది ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలో మన దేశంతో సహా అనేక దేశాలకు వ్యాపించింది. రెండున్నర కోట్ల మంది ఐరోపాలో దానికి బలయ్యారు. హైదరాబాదు సంస్థానంలో ప్లేగు వ్యాధి పదే పదే వస్తుండటంతో దాన్ని నివారించేందుకు 1591లో చార్మినార్‌ను నాటి నిజాం రాజు కట్టించిన విషయం తెలిసిందే.
మొదటి ప్రపంచ యుద్ధంలో గుర్రాలకు సెంబరోగం (చీమిడి కారటం) వచ్చే ఆంత్రాక్స్ పౌడర్‌ను జర్మనీ, ఫ్రెంచి గూఢచారులు ప్రయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సైన్యాలు రష్యా, ఇతర అనేక దేశాలలో ప్లేగ్, అంతరాక్స్ వంటి వ్యాధులను వ్యాపింపచేసేందుకు ప్రయత్నించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 22సంవత్సరాలకు 179 దేశాలు జీవ ఆయుధాల నియంత్రణకు ఒప్పందంపై సంతకం చేశాయి. ఎట్టి పరిస్ధితుల్లోనూ వాటి తయారీ, సేకరణ, నిల్వ, వినియోగించబోమని ఆ దేశాలు అంగీకారం తెలిపాయి. అయితే వైద్య అవసరాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఇప్పుడు జీవ ఆయుధాలు తయారు చేస్తున్నవారు కూడా ఆ ముసుగుతోనే చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. రసాయనిక, జీవ ఆయుధాలకు పెద్ద తేడా ఉండదు. ఉదాహరణకు వియత్నాంను ఆక్రమించుకొనేందుకు అమెరికా జరిపిన దాడుల సమయంలో కలుపు మొక్కలను నాశనం చేసే పేరుతో ఆరెంజ్ ఏజంట్ అనే రసాయనాన్ని పెద్ద ఎత్తున వియత్నాంలో చల్లారు. యాభై సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అనేక చోట్ల కలుపు మొక్కలే కాదు అసలు ఏ మొక్కా బతకని పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో పుట్టుకతో పిల్లల్లో లోపాలు, కాన్సర్, మధుమేహం వంటి వ్యాధులకు అమెరికా చిమ్మిన విషం కారణమని తేలింది.
మొదటి ప్రపంచ యుద్దం మీద విచారణ జరిపిన నానాజాతి సమితి కమిటీ జీవ ఆయుధాలను ఉపయోగించలేదు గానీ జర్మన్లు రసాయనిక ఆయుధాలు వాడినట్లు పేర్కొన్నది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సామ్రాజ్యవాదులు ఆపరేషన్ చెర్రీ బ్లూసమ్స్ పేరుతో జీవ ఆయుధాలతో అమెరికా సహా అనేక దేశాల మీద దాడి చేయాలనే పథక రచన చేశారు. తన ఆక్రమణలోని చైనాలోని హార్బిన్, కొరియా, మంచూరియా ప్రాంతంలో దాడి చేశారు. దానిలో కలరా, ప్లేగు, అంతరాక్స్, మసూచి వంటి ప్రమాదకర క్రిముల్ని వాడారు. 2002లో ఒక అంతర్జాతీయ సమావేశంలో జపాన్ మిలిటరీ జరిపిన బాక్టీరియా బాంబు దాడుల్లో మరణించిన వారు ఐదు లక్షల ఎనభైవేల మంది ఉన్నట్టు వక్తలు వెల్లడించారు. ఒక్క చైనాలోనే ప్లేగు, కలరా, ఆంత్రాక్స్ వంటి వాటితో నాలుగు లక్షలమంది మరణించారని అంచనా.
జపాన్ జీవ ఆయుధాల తయారీకి 150 భవనాలను, ఐదు శివారు ప్రాంతాలను ఉపయోగించి మూడువేల మంది శాస్త్రవేత్తలతో పని చేయించారు. వాటి తయారీ సమయంలో కనీసం పదివేల మంది ఖైదీలపై వాటిని ప్రయోగించగా మరణించినట్టు తేలింది. వారిలో మూడువేల మంది కొరియా, చైనా, సోవియట్, మంగోలియా, అమెరికన్, బ్రిటిష్, ఆస్ట్రేలియన్ యుద్ద ఖైదీలు ఉన్నట్టు బయట పడింది. జపాన్ జీవ ఆయుధాల విషయం బయటపడిన తరువాత అమెరికా పెద్ద ఎత్తున 1942నుంచి వాటిని రూపొందించేందుకు పూనుకుంది. తాను పెద్ద ఎత్తున జీవ ఆయుధాలను తయారు చేసినట్టుగానే ఇతరులు కూడా తయారు చేసి తమ మీద ప్రయోగిస్తారని అమెరికా భయపడుతోంది. దీనిలో భాగంగానే అనేక కుట్ర సిద్దాంతాలను అమెరికన్లు ప్రచారంలో పెట్టారు.ఏమైనా గత చరిత్రను బట్టి మంకీపాక్సు గురించి అమెరికా, పైన పేర్కొన్న ఇతర దేశాల గురించి వెలువడిన ప్రతి సమాచారాన్ని అనుమానంతో చూడాల్సిందే. తమ దేశాల్లో ఎందుకు విస్తరిస్తున్నదో అవి ప్రపంచానికి చెప్పాల్సి ఉంది.
Sir
Is it true….
Please cross check…
Free Lancer JOURNALIST
Thank you sir…
Yours Obediently,
SHEIK ALI HUSSAIN
LikeLike