Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


తాజాగా లీటరు పెట్రోలు మీద రు.8, డీజిలు మీద రు.6 కేంద్ర ప్రభుత్వం పన్నులను తగ్గించింది. అసల్లేనిదాని కంటే ఏమాత్రం తగ్గినా తగ్గినట్లే కదా అని సంతృప్తి చెందుతున్నారు కొందరు. దీని వలన కేంద్ర ప్రభుత్వం మీద లక్ష కోట్ల భారం పడుతుందని మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అంటే ఏదో రూపంలో తిరిగి జనం మీదనే మోపుతారు. తమ మీద భారం భారం అంటూ మురిపిస్తూ జనం మీద మోపిన విపరీత భారాన్ని మరిపించాలని చూస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా 137 రోజుల పాటు ధరలను స్ధంభింపచేశారు. తరువాత మార్చినెల 22 నుంచి ఏప్రిల్‌ ఆరు వరకు ధరలు పెంచారు. ఢిల్లీలో లీటరు పెట్రోలు రు.95.41 నుంచి 105.41వరకు, డీజిలు ధర రు.86.67 నుంచి 96.67వరకు పెరిగింది రాష్ట్రాల వాట్‌ను బట్టి అన్ని చోట్లా ఒకే రేట్లు ఉండవు.


ఏప్రిల్‌ ఆరు నుంచి ఇప్పటి వరకు (ఇది రాసిన మేనెల 23వరకు) సవరించలేదు. బహుశా దీనికి శ్రీలంకపరిణామాలతో పాటు, ఉక్రెయిన్‌ సంక్షోభం, ఇతర కారణాలతో దేశంలో పెరుగుతున్న ధరలు కారణం అన్నది స్పష్టం. అంతకు ముందు పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు చమురు మీద కేంద్రం భారీగా విధించిన పన్నులను తగ్గించాలని ఆర్‌బిఐతో సహా అనేక మంది ఆర్ధికవేత్తలు సూచించినా కేంద్రం పట్టించుకోలేదు. గత రెండు నెలల్లో పరిస్ధితి మరింతగా దిగజారింది. ఈ ధోరణి మరింతగా విషమించటం తప్ప మెరుగుపడే తీరు కనిపించకపోవటంతో కేంద్రం దిగివచ్చింది. త్వరలో మరికొన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు కూడా దీనికి కారణం కావచ్చు. అప్పటి వరకు చమురు ధరల స్ధంభన కానసాగించి తరువాత మొత్తంగా వడ్డించవచ్చు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా 137 రోజుల పాటు ధరలను సవరించకుండా నిలిపి తరువాత మొత్తాన్ని వసూలు చేసిన సంగతి తెలిసిందే.


అచ్చేదిన్‌ సంగతి గోమాత కెరుక ఇప్పుడున్న ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం వీటి పర్యవసానాలతో మనం ఇంకా శ్రీలంకకు ఎంతదూరంలో ఉన్నాం అని జనం ఆలోచించే పరిస్ధితి వస్తుందని బిజెపి పెద్దలు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడ సింహళ (మెజారిటీ బౌద్దులు) హృదయ సామ్రాట్టుగా నీరాజనాలు అందుకున్న మాజీ అధ్యక్షుడు, ప్రధానిగా పని చేసిన మహింద రాజపక్స ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మహాభారతంలో రారాజుగా కీర్తి పొందిన ధుర్యోధనుడు చివరి రోజుల్లో ప్రాణాలు కాపాడుకొనేందుకు మడుగులో దాగినట్లుగా మేనెల 10వ తేదీ నుంచి ట్రింకోమలీలోని నౌకాదళ కేంద్రంలో రక్షణ పొందుతున్నాడు. మాజీ మంత్రి, ప్రస్తుతం ఎంపీగా ఉన్న కుమారుడు నామల్‌ రాజపక్సతో కలసి మే 18వ తేదీన భద్రత నడుమ పార్లమెంటు సమావేశాలకు మహీంద రాజపక్స హాజరయ్యాడు. అతగాడు దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. సింహళ మెజారిటీ జాతీయవాదాన్ని తలకు ఎక్కించుకున్న ఆ జనమే ఆర్ధిక సంక్షోభంతో తమ జీవితాలు అతలాకుతలం కావటంతో అదే మహింద రాజపక్స కనిపిస్తే చంపేస్తామంటూ వీధులకు ఎక్కిన దృశ్యాలు మెజారిటీ హిందూ హృదయ సామ్రాట్టులకు కనిపిస్తున్నాయా ? ఏమో !
జనానికి ఎంత భారం తగ్గినా మంచిదే కనుక ప్రభుత్వ చర్య మంచిదే అనుకున్నా పన్నుల పెంపుదల పూర్వపు స్ధాయికి చేరితేనే మరింత ఊరట కలుగుతుంది. ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పన్నులు తగ్గింపు ప్రకటన చేసినదాని కంటే – ఏమాటకామాటే చెప్పుకోవాలి -వాటి గురించి ఇచ్చిన వివరణకు నిజంగా ఆమెను అభినందించకతప్పదు. గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్రం చమురు మీద పెంచిన పన్నుల నుంచి రాష్ట్రాలకు ఎలాంటి వాటా రాదు అని ఎందరు మొత్తుకున్నా బుకాయించి వాటి నుంచి 41శాతం వాటా కేంద్రం తిరిగి రాష్ట్రాలకు ఇస్తుందని వాట్సాప్‌ విశ్వవిద్యాలయం ద్వారా చేసిన కాషాయదళాలు చేసిన బోధనలను తలకు ఎక్కించుకున్న వారిని ఇప్పుడు తలలు దించుకోవటమే కాదు, ఎక్కడ పెట్టుకోవాలో తెలియని స్ధితిలోకి నిర్మలమ్మ నెట్టివేశారు. అలాంటి కనువిప్పు కలిగించినందుకు ఆమెకు నీరాజనాలు పలకాల్సిందే మరి. తాజా తగ్గింపు వలన రాష్ట్రాలకు వచ్చే వాటా ఏమాత్రం తగ్గదని, అవి వాటాలేని రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్‌ ఖాతాకు చెందినవని ఆమె స్పష్టంగా చెప్పారు. సెస్‌లు దేనికోసం విధించారో అందుకోసమే ఖర్చు చేయాలి. సెస్‌ల విధింపును సమర్ధిస్తూ కాషాయదళాలు చేసిన వాదనలను ఒక్కసారి వారి బోధనలతో ప్రభావితమైన వారు గుర్తుకు తెచ్చుకోవాలి. గత మన్మోహన్‌ సింగ్‌ చేసిన చమురు(ఇరాన్‌కు) అప్పులు తీర్చేందుకు అని తొలుత చెప్పారు. తరువాత చమురు బాండ్లను తీర్చేందుకుఅన్నారు. గాల్వాన్‌ ఉదంతాల తరువాత సైనికులకు ఖర్చు చేసేందుకు చమురు పన్నువేశారంటే కాదన్న వారిని దేశద్రోహులుగా చిత్రించి జనాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు.తొలుత మొరాయించి తరువాత కరోనా వాక్సిన్‌ ఉచితంగా వేయాల్సి వచ్చే సరికి వీటన్నింటికీ పన్నులు వేయకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటూ ఎదురుదాడి చేశారు.ఎప్పటికెయ్యది అప్పటికా మాటలు చెప్పారు.


పెట్రోలు మీద 8, డీజిలు మీద ఆరు రూపాయల సెస్‌ తగ్గించినందుకు గాను కేంద్రం మీద ఏడాదికి లక్ష కోట్ల మేరకు భారం పడుతుందని, దాన్ని అప్పుల ద్వారా పూడ్చుతామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. దీనికి కూడా ఆమెను అభినందించాల్సిందే. చెంపదెబ్బ-గోడదెబ్బ మాదిరి చమురు పేరుతో రోడ్డు పన్ను మన నుంచి వసూలేగాక రోడ్ల మీద తిరిగినందుకు రోడ్డుపన్ను(టోల్‌టాక్సు) కూడా వసూలు చేశారని అనేక మంది ఆమె ప్రకటన తరువాత గ్రహించిన విద్యావంతులు గుండెలు బాదుకుంటున్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చమురు పన్నుల రూపంలో ఎంత మోపిందో ప్రతిపక్షాలు, విశ్లేషకులు చెబితే జనాలకు ఎక్కలేదు, ఇప్పుడు నిర్మలమ్మే చెప్పారు గనుక నమ్మకతప్పదు.మోడీ ఏలుబడి ప్రారంభంలో పెట్రోలు మీద లీటరుకు రు.9.48 గా ఉన్నదానిని రు.32.98కి, డీజిలు మీద రు.3.56గా ఉన్నదానిని రు.31.83కు పెంచారు. అంటే ఇన్నేండ్లుగా జనాల నుంచి కేంద్రం ఎంత పిండిందో, తమ జేబులకు ఎంత చిల్లిపడిందో ఎవరికి వారు లెక్కలు వేసుకోవచ్చు.


గతేడాది కేంద్రం, బిజెపి పాలిత రాష్ట్రాలు కొంతమేరకు తగ్గించినందుకు, ఆ మేరకు తగ్గించని రాష్ట్రాలు కూడా వెసులుబాటు కలిపించాలని ప్రధాని నరేంద్రమోడీ కొద్ది వారాల క్రితం రాష్ట్రాల మీదకు జనాన్ని ఉసికొల్పారు. నిజం ఏమిటి ? మే 23వ తేదీ హిందూ పత్రిక వార్త ప్రకారం 2015-2021 మధ్య కేంద్ర పన్నులు జిడిపిలో 0.79 నుంచి 1.88శాతానికి పెరిగితే ఇదే కాలంలో రాష్ట్రాల పన్నులు 1.1 నుంచి 1.02శాతానికి తగ్గాయి. ఈ కారణంగానే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు పన్నులు తగ్గించేందుకు అంగీకరించలేదు. బిజెపి పాలిత రాష్ట్రాలకు ఇతరంగా ఏదో రీతిలో సర్దుబాటు చేస్తారు గనుక అవి మౌనంగా ఉన్నాయి. గతేడాది తగ్గించిన మొత్తాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కేంద్రం ఇప్పటి వరకు పెట్రోలు మీద రు.13, డీజిలు మీద రు.16 తగ్గించింది.దీని వలన కేంద్రానికి రు.2,20,000 కోట్ల రాబడి తగ్గుతుందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఇది నాణానికి ఒకవైపు చూపటమే. రెండోవైపు చూస్తే 2014-15లో కేంద్రానికి చమురు రంగం నుంచి వచ్చిన వివిధ రకాల రాబడి రు.1,26,025 కోట్లు కాగా 2020-21లో వచ్చిన మొత్తం రు.4,19,884 కోట్లకు పెరిగింది. అంటే జనాల నుంచి ఎంత గుంజారో వేరే చెప్పనవసరం లేదు. ఈ కాలంలోనే చమురు ధరలు గణనీయంగా తగ్గినా ఆమేరకు జనానికి తగ్గించకపోగా పన్నులు పెంచి చేసిన దోపిడీని ఈ అంకెలు వెల్లడిస్తున్నాయి. వంద పెంచి 50 తగ్గించి చూశారా మా ఘనత అని నమ్మించేందుకు పూనుకున్నారు.


తగ్గింపు మేరకు ఏర్పడిన లోటు పూడ్చుకొనేందుకు అప్పు చేస్తామని నిర్మలమ్మ చెప్పారు. దీనికి కూడా ఆమెను అభినందించాల్సిందే, కేంద్రమే భారం భరిస్తుందని చెప్పలేదు. గతంలో యుపిఏ సర్కార్‌ చమురు సంస్దలకు ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తాన్ని నగదుగా చెల్లించలేక కంపెనీలకు బాండ్ల రూపంలో ఇచ్చింది. ఆ మొత్తం రు.1.44లక్షల కోట్లు, దానికి వడ్డీ 70వేల కోట్లు. దాన్ని తప్పుపట్టటమే కాదు, ఆ బాండ్ల భారాన్ని తీర్చేందుకు అదనంగా పన్నులు వేయాల్సివచ్చిందని అప్పుడు చెప్పారు. ఇప్పుడు తగ్గించిన పన్ను మేరకు బాండ్ల ద్వారా అప్పులు చేస్తామని ఆర్దిక మంత్రి చెబుతున్నారు. రెండింటికీ తేడా ఏమిటో ఎవరైనా చెప్పగలరా ? పోనీ నరేంద్రమోడీ పలుకుబడిని చూసి ఇప్పుడు తీసుకొనే అప్పుకు ఎవరైనా వడ్డీ లేకుండా ఇస్తారా ? తాము చేస్తే సంసారం, అదేపని ఇతరులు చేస్తే మరొకటా ? రేపు మరోసారి ఇదే సర్కార్‌ అప్పు తీర్చే పేరుతో మరిన్ని భారాలు మోపదని హామీ ఏమిటి ? పన్ను తగ్గించిన కారణంగా అప్పుతీసుకుంటామని సాకు చెబుతున్నారు. గత ఎనిమిది సంవత్సరాల్లో పెద్ద మొత్తంలో రుణాలు ఎందుకు తీసుకున్నట్లు ? రుణభారాన్ని అదుపు చేసుకోవాలని మోడీ సర్కార్‌ రాష్ట్రాలను కోరుతున్నది. కానీ తాను చేసిన అప్పుల గురించి ప్రస్తావించటం లేదు. 2021 సెప్టెంబరులో రిజర్వుబాంకు విడుదల చేసిన వివరాల ప్రకారం నరేంద్రమోడీ అధికారం చేపట్టే నాటికి అంటే 2014 మార్చి ఆఖరుకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న దేశీయ రుణం రు.54,84,848కోట్లు, విదేశీ అప్పు రు.3,74,483 కోట్లు మొత్తం రు.58,59,331 కోట్లు. 2022-23 బడ్జెట్‌లో పేర్కొన్నదాని ప్రకారం 2023 మార్చినాటికి దేశీయ రుణం రు.147,48,875కోట్లు, విదేశీ అప్పు రు.4,69,034 కోట్లు మొత్తం రు.152,17,910 కోట్లు అవుతుందని అంచనా. కేంద్రం రాబడి తగ్గితే గతంలో తగ్గించిన కార్పొరేట్‌ పన్నును తిరిగి పెంచాలి. ఏటా పెరుగుతున్న కోటీశ్వరుల నుంచి అదనంగా రాబట్టాలి. వడ్డీ రేట్లు పెంచేందుకు బుర్రను పెద్దగా ఉపయోగించాల్సిన అవసరం లేదని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ చెప్పారు. అప్పుకూడా అంతేగా, లేకపోతే కొత్తగా నోట్లు ముద్రిస్తారు. దానికీ పెద్దగా ఆలోచించాల్సినపనిలేదు.


ఏప్రిల్‌ ఆరు నుంచి ధరలను స్ధంభింప చేసిన కారణంగా తమకు పెట్రోలు మీద లీటరుకు మే నెల 16వ తేదీ మార్కెట్‌ ప్రకారం రు.13, డీజిల్‌కు రు.24 నష్టం వస్తున్నదని రిలయన్స్‌-బిపి కంపెనీ ప్రతినిధులు తెలిపినట్లు మే 23వ తేదీ ఎకనమిక్స్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. తమకు ప్రతినెలా ఏడువందల కోట్ల మేరకు నష్టం వస్తున్నదని సదరు కంపెనీ చెబుతోంది. వారు చెప్పే అంకెలతో ఏకీభవించటమా లేదా అన్నది పక్కన పెడితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పీపా ధర 110 డాలర్లకు అటూ ఇటూగా ఉంటున్నది. దేశంలో 83,027 పెట్రోలు బంకులుండగా రిలయన్స్‌-బిపికి 1,459, మరో ప్రయివేటు కంపెనీ నయారా ఎనర్జీకి 6,568 ఉన్నాయి.మిగిలినవన్నీ ప్రభుత్వ రంగ సంస్దలవే. ఏప్రిల్‌ ఆరు తరువాత మన దేశం కొనుగోలు చేసే చమురు ధరలో ఎగుడుదిగుడులున్నాయి. ఏరోజు ధరపెరిగితే ఆమరుసటి రోజు పెంచుతాము లేదా తగ్గితే తగ్గించే విధానం అమలు చేస్తున్నట్లు ప్రతి రోజూ ప్రకటించిన ధరల గురించి తెలిసిందే. మార్చినెల 28న మనం కొనే చమురు పీపా ధర 112 డాలర్లుంది. తరువాత అది వందకు పడిపోయింది, తరువాత పెరిగింది, తగ్గుతోంది, కానీ ఆ మేరకు సవరించకుండా ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి ధరలను స్ధంభింపచేశారు. ఎందుకిలా చేశారో జనానికి చెప్పాలా లేదా ?నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు 58గా ఉన్న రూపాయి విలువ మే 23న 77.66గా దిగజారింది. అంటే ముడి చమురు ధరలు స్ధిరంగా ఉన్నా మన మీద భారం పెరుగుతూనే ఉంటుంది.


ఉజ్వల పధకం కింద గాస్‌ కనెక్షన్లు పొందిన తొమ్మిది కోట్ల మందికి ఏడాదికి గరిష్టంగా పన్నెండు సిలిండర్ల మీద రు.200 సబ్సిడీ ఇస్తున్నట్లు అందుకు గాను ఏడాదికి 6,100 కోట్లు కేంద్రంపై భారం పడుతుందని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అంటే ఒక్కొక్కరికి రు.2,400 అనుకున్నారు. కాని మంత్రి చెప్పిన దాన్ని సగటు లెక్కిస్తే రు.677 మాత్రమే. పెంచిన గాస్‌ ధరలు, గతంలో ఉన్న సబ్సిడీ కోతను చూస్తే ఇది పెద్ద లెక్కలోనిది కాదు. అసలు ఈ పధకం కింద కనెక్షన్‌ పొందిన వారు 2020-21లో 90లక్షల మంది అసలు గాసే తీసుకోలేదు. కోటీ ఎనిమిది లక్షల మంది ఒకసారి తీసుకున్నారని సమాచార హక్కు కింద అడిగిన ఒక ప్రశ్నకు తాము ఇచ్చిన కనెక్షన్ల గురించి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. తమ వద్ద ఈ పధకం కింద 15.96శాతం మంది అసలు గాస్‌ తీసుకోలేదని భారత్‌ పెట్రోలియం,9.175లక్షల మంది తీసుకోలేదని హెచ్‌పి కంపెనీ తెలిపింది. గాస్‌ ధరలను భరించలేని కారణంగా ఉజ్వల పధకం కింద కనెక్షన్‌ పొందిన వారు అసలు తీసుకోవటానికే ముందుకు రావటం లేదు. లేదా బినామీలకు అప్పగిస్తున్నారు.శ్రీలంక పరిణామాల నుంచి మన జనం ఏమి గ్రహించారో తెలియదు గానీ ఆకాశవాణి బిజెపి నేతలను ప్రత్యేకించి నరేంద్రమోడీని హెచ్చరించినట్లుగా కనిపిస్తోంది.దాని పర్యవసానమే పరిమితంగా మరోసారి పన్ను తగ్గింపు అని ఎందుకు అనుకోకూడదు ?