Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఎనిమిదేండ్ల నరేంద్రమోడీ పాలన గురించి కొన్ని అంశాలను మొదటి భాగంలో విశ్లేషించాము. మరికొన్ని అంశాలను ఈ భాగంలో చూద్దాము. 2025 నాటికి దేశ ఆర్ధిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్లకు తీసుకుపోయి, ప్రపంచంలో మూడో స్థానంలో నిలబెడతానని 2019లో నరేంద్రమోడీ ప్రకటించారు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి 2028 నాటికి 4.92లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని ఐదు లక్షల కోట్లు కావాలంటే 2029లోనే సాధ్యమని ఐఎంఎఫ్‌ తాజాగా ప్రకటించింది. తరువాత 2027 అని సవరించింది. అప్పటికి నరేంద్రమోడీ అధికారంలో ఉంటారో లేదో కూడా తెలియదు.2028నాటికి రూపాయి విలువ 2022లో 77.7 నుంచి 94.4కు పతనం కానుందని కూడా ఐఎంఎఫ్‌ పేర్కొన్నది. మరోవైపు మన అధికారులు మాత్రం 2025-26 లేదా మరుసటి ఆర్ధిక సంవత్సరానికి ఐదులక్షల డాలర్లకు చేరతామని అంటున్నారు. ఇక్కడ సమస్య ఎంతకు, ఎప్పుడు చేరుతుందని కాదు, దాని వలన జనానికి ఒరిగేదేమిటి ? ఉపాధి రహిత, వేతన పెంపుదల లేని ఆర్ధిక వ్యవస్థలో సంపదలు పోగుపడితే చెప్పుకోవటానికి గొప్పగా ఉండవచ్చు, కుహనా జాతీయ వాదులను సంతృప్తి పరచవచ్చు తప్ప సామాన్యులకు ఒరిగేదేమీ ఉండదు. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం 2020 నుంచి 2027వరకు తలసరి జిడిపి డాలర్లలో ఇలా ఉండనుంది.
దేశం××× 2020×× 2021×× 2022×× 2023×× 2024×× 2025×× 2026×× 2027
భారత్‌×× 1,935 ××2,185××2,342××2,527××2,720××2,929×× 3,138××3,350
బంగ్లాదేశ్‌× 1,962 ××2,147××2,363 ××2,588××2,814××3,056××3,315××3,587
చైనా×× 10,525 ××12,359××14,029××15,486××16,740××17,991××19,312××20743
తొలిసారి 2020లో భారత తలసరి జిడిపి బంగ్లాదేశ్‌ కంటే వెనుక బడిందని చెప్పటాన్ని కూడా బిజెపి నేతలు దేశద్రోహం అన్నట్లు చిత్రించారు. కావాలంటే బంగ్లాదేశ్‌కు వెళ్లమని చెప్పారు. ఐఎంఎఫ్‌ చెప్పినదాని ప్రకారం 2021 మినహా 2027వరకు మనకంటే బంగ్లాదేశ్‌ తలసరి జిడిపి ఎక్కువగా ఉండనుంది. ఇదేమైనా అంకెల గారడీనా ? కరోనా కారణమా ? కానేకాదు.2014లో బంగ్లాదేశ్‌ తలసరి జిడిపి 1,119 మన దేశంలో 1,574 డాలర్లు ఉంది. మనదేశం ఇతర చోట్ల నుంచి పత్తి దిగుమతి చేసుకొని బంగ్లా పాలకులు దుస్తుల ఎగుమతుల మీద కేంద్రీకరిస్తే మన పాలకులు వాటి బదులు వస్త్రధారణ వివాదాల మీద కేంద్రీకరించటమే అసలు కారణం అని చెప్పవచ్చు. సిఇఐసి సమాచారం ప్రకారం కార్మికశక్తి భాగస్వామ్యం 2021లో మన దేశంలో 45.6శాతం ఉంటే బంగ్లాదేశ్‌లో 57, చైనాలో 68.1శాతం ఉంది.పాకిస్తాన్‌లో 50.1శాతం ఉంది. సిఎంఐఇ సమాచారం ప్రకారం 2022 మార్చినెలలో మన దేశంలో కార్మిక భాగస్వామ్యం 39.5శాతం ఉంది. 2018లో నిరుద్యోగం నాలుగుదశాబ్దాల గరిష్ట స్దాయికి చేరితే తరువాత పెరగటమే తప్ప తగ్గింది లేదు. పని చేసే అవకాశాలు, చేసే వారు పెరగకుండా జిడిపి పెరగదు కదా ! గ్రామీణ ప్రాంతాల్లో పని తగ్గిపోతున్న కారణంగా 2013లో గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద పని చేసిన వారితో పోల్చితే తాజాగా లెక్కల ప్రకారం నాలుగు రెట్లు పెరిగారు. కరోనా కాలంలో ఎనభై కోట్ల మందికి నెలకు తాము ఆరుకిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా ఇచ్చామని బిజెపి నేతలు ఒక ఘనతగా చెప్పుకుంటారు. దాన్ని తిరగేసి చూస్తే జనాన్ని ఎంతగా దరిద్రంలో ఉంచారన్నది వెల్లడిస్తున్నది.


నల్లధనాన్ని వెలికి తీసేందుకు ప్రపంచంలో ఇంతవరకు నరేంద్రమోడీ తప్ప ఏ పాలకుడూ కరెన్సీని రద్దు చేయలేదు.పోనీ ఇంత చేసి సాధించిందేమైనా ఉందా అంటే కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు. జనానికి ఇబ్బందులు, ఆర్ధిక రంగాన్ని కుదేలు చేయటం తప్ప జరిగిందేమీ లేదు. మొత్తం నోట్లలో 99.3శాతం బాంకులకు తిరిగి వచ్చాయి, మిగిలినవి కూడా అనేక మందికి తెలియక డిపాజిట్‌ చేయకపోవటం వంటి కారణాలు తప్ప మరొకటి కాదు. ఈ తప్పిదానికి మన్నించమని నరేంద్రమోడీ జనాన్ని కోరలేదు, అసలు ఉలుకూపలుకు లేదు. దేశంలో నల్లధనం ఎప్పటి మాదిరే తనపని తాను చేసుకుపోతున్నదని అందరికీ తెలిసిందే.2016నవంబరు ఎనిమిదవ తేదీ సాయంత్రం జరిగే కాబినెట్‌ సమావేశానికి మంత్రులెవరూ సెల్‌ఫోన్లు తీసుకురావద్దని చెప్పినట్లు వార్తలు వచ్చాయి, కానీ కొందరు ఆశ్రితులకు ముందే ఈ సమాచారాన్ని చేరవేశారని, వారంతా జాగ్రత్త పడినట్లు తరువాత వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


నరేంద్రమోడీ వాగ్దానం చేసిన అచ్చేదిన్‌ (మంచి రోజులు)కు అర్ధం ఏమిటో ఇంతవరకు తెలియదు.అమెరికా సంస్ధ పూ అంచనా ప్రకారం 2021 నుంచి ఇప్పటికి రెండున్నర కోట్ల మంది ఉపాధి కోల్పోయారు, ఏడున్నర కోట్ల మంది దారిద్య్రంలోకి దిగజారారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని నరేంద్రమోడీ వాగ్దానం చేసినప్పటికీ గత దశాబ్దకాలంలో ఏటా 43లక్షలకు మించలేదు. ఎనిమిదేండ్ల నాటి ధరల పెరుగుల రికార్డులను ఏక్షణంలోనైనా బద్దలు కొట్టే అవకాశం ఉంది. అంటే జనాలకు చచ్చే రోజులు తప్ప అచ్చేదిన్‌ కనుచూపు మేరలో కనిపించటం లేదు. ఉపాధి, గౌరవ ప్రదమైన, కనీస అవసరాలు తీరే వేతనాలు, సరసమైన ధరల స్థితి ఉంటే రోజులు మంచిగా ఉన్నట్లు భావిస్తారు. ఇప్పుడు ఆ స్ధితి ఉందా ? అందుకే అసలు ఆ పదాన్ని పురాతన భాండాగారంలో పెట్టాలని, అసలు మర్చిపోవాలని జనాలు జోకులు పేలుస్తున్నారు. చిల్లర ద్రవ్యోల్బణం ఎనిమిదేండ్ల గరిష్ఠం 7.79శాతానికి చేరింది. నాలుగుశాతం వద్ద అదుపులో ఉంచాలన్నది ఆర్‌బిఐ నిర్దేశిత లక్ష్యం కాగా దానికి రెట్టింపు ఉంది. జిడిపి వృద్ధిరేట్లలో మన దేశంలో ఒక నిలకడ లేదు.1997 నుంచి ఉద్థాన పతనాలు నమోదవుతున్నాయి. కరోనాకు ముందు మూడు మాసాల్లో 42 సంవత్సరాల కనిష్ట వృద్ధి రేటు నమోదైంది. వార్షిక వృద్ది రేటు 2014లో ఎనిమిదిశాతం ఉండగా 2020 మార్చినాటికి నాలుగుశాతానికి పడిపోయింది. తరువాత కరోనా వచ్చి నరేంద్రమోడీ వైఫల్యాల గురించి చర్చకు అవకాశం లేకుండా చేసింది. కరోనా ప్రభావం తొలగి సాధారణ స్థితికి వచ్చింది. కానీ ఆర్ధిక రంగంలో అలాంటి మార్పు కనిపించటం లేదు. దిగజారిన ఆర్ధిక వ్యవస్ధ గణాంకాలను ప్రాతిపాదికగా చేసుకొని 2022లో ఎనిమిదిశాతం వృద్ధి రేటు ఉంటుందని ఊదరగొడుతున్నారు. అది జరిగినా కరోనాతో ముందు పరిస్థితితో పోల్చితే వాస్తవ వృద్ధి ఒకటి రెండుశాతం మాత్రమే ఉంటుందన్నది ఒక అభిప్రాయం. అందువలన తరువాత వృద్ధి అంకెలు అచ్చేదిన్‌ అసలు బండారాన్ని వెల్లడిస్తాయి. ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రయివేటు పెట్టుబడుల లేకపోవటం వంటి అంశాలు ప్రతికూలతను వెల్లడిస్తున్నాయి.


గత పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం వివిధ బాంకుల వద్ద పేరుకు పోయిన బకాయిలను నిరర్ధక ఆస్తుల పేరుతో రు.11,68,095 కోట్లను రద్దు చేసింది. వాటిని తిరిగి వసూలు చేస్తామని చెబుతున్నప్పటికీ ఎంత శాతం అన్నది ప్రశ్న. 2021మార్చినెలతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో రద్దు చేసిన మొత్తం రు.2,02,781 కోట్లు ఉంది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గత ఏడు సంవత్సరాల్లో రద్దు చేసిన మొత్తం రు.10.7లక్షల కోట్లు ఉంది. ఇంతవరకు రుణాలు ఎగవేసిన పెద్దల పేర్లు వెల్లడించేందుకు బాంకులు నిరాకరిస్తున్నాయి. రద్దు చేసిన మొత్తాలలో ప్రభుత్వరంగ బాంకుల వాటా 75శాతం ఉంది.నిరర్దక ఆస్తులను ఖాతాల నుంచి తొలగిస్తే బాంకులకు పన్ను భారం తగ్గుతుందని చెప్పారు.వసూలు అవకాశాలన్నీ మూసుకుపోయిన తరువాతే రద్దు చేస్తారు. తన పాలన అంతా సజావుగా ఉందని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ ఏలుబడిలో బకాయిలు పేరుకు పోవటం అంటే కావాలని ఎగవేతకు పాల్పడటమే. ప్రజల సొమ్ము ప్రతిపైసాకు జవాబుదారీ అని చౌకీదారునని చెప్పుకున్న మోడీ అలాంటి వారి పట్ల ఎందుకు కఠినంగా వ్యవహరించటం లేదన్న ప్రశ్నకు జవాబు లేదు. రద్దు చేసిన బకాయిల్లో వసూలవుతున్న మొత్తం 15-20శాతానికి మించి ఉండటం లేదు.


నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు స్వదేశీ ఉత్పత్తిని పెంచి చమురు దిగుమతులు తగ్గిస్తామని చెప్పారు. గత ఎనిమిది సంవత్సరాల్లో అంతకు ముందున్న స్ధితి కంటే దేశీయ ఉత్పత్తి తగ్గింది. ఎనిమిది సంవత్సరాల క్రితం రూపాయి విలువ డాలరుకు 58 ఉండేది, ఇప్పుడు అది 77.56కు పడిపోయింది. రూపాయి విలువ పతనం ప్రభుత్వ అసమర్దతకు నిదర్శనమని ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్రమోడీ, ఇతర బిజెపి నేతలు ధ్వజమెత్తారు. ఈ అసమర్ధతను నెహ్రూ మీద నెడతారా ? 2014లో పీపా ముడిచమురు ధర 110వద్ద ఉండగా మోడీ అధికారానికి వచ్చారు. తరువాత తగ్గటం తప్ప పెరిగింది లేదు. ఆ మేరకు జనానికి ధర తగ్గించాల్సిన మోడీ సర్కార్‌ తప్పుడు కారణాలు చూపి పెట్రోలు, డీజిలు మీద భారీగా సెస్‌లను పెంచి సొమ్ము చేసుకుంది. రూపాయి విలువను కాపాడలేని మోడీ సర్కార్‌ అసమర్దతకు జనం మూల్యం చెల్లించాల్సి వస్తున్నది.2013-14లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు పీపా సగటు ధర 105.52 డాలర్లు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గత ఎనిమిది సంవత్సరాలలో ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పిపిఏసి సమాచారం మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో సగటు ధర 103.10 డాలర్లు ఉంది.
సంవత్సరం×××× డాలర్లలో ధర
2014-15××× 84.16
2015-16××× 46.17
2016-17××× 47.56
2017-18××× 56.43
2018-19××× 69.88
2019-20××× 60.47
2020-21××× 44.82
2021-22××× 79.18
పైన పేర్కొన్న వివరాలను చూసినపుడు మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడి చివరి సంవత్సరంలో ఉన్న స్ధాయి కంటే ఇప్పటికీ తక్కువగానే ఉన్నా సరే నరేంద్రమోడీ సర్కార్‌ అంతర్జాతీయంగా తగ్గిన మేరకు జనాలకు ధరలను తగ్గించలేదు. భారీ ఎత్తున సుంకాలు పెంచి ఆ మొత్తాలను కార్పొరేట్లకు రాయితీలకు మళ్లించటం, ఇతర అంశాలే దీనికి కారణం. వాటికి తోడు రూపాయి విలువ పతనం కూడా తోడైంది. మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ మన కరెన్సీ విలువ పతనాన్ని అరికట్టటంలో విఫలమైందని నరేంద్రమోడీ సహా అనేక మంది బిజెపి నేతలు గతంలో విమర్శించారు. అందువలన ఇప్పుడు వారి నిర్వాకం కూడా జనాలకు శాపంగా మారింది.


రుణభారాన్ని అదుపు చేసుకోవాలని మోడీ సర్కార్‌ రాష్ట్రాలను కోరుతున్నది. కానీ తాను చేసిన అప్పుల గురించి ప్రస్తావించటం లేదు. 2021 సెప్టెంబరులో రిజర్వుబాంకు విడుదల చేసిన వివరాల ప్రకారం నరేంద్రమోడీ అధికారం చేపట్టే నాటికి అంటే 2014 మార్చి ఆఖరుకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న దేశీయ రుణం రు.54,84,848కోట్లు, విదేశీ అప్పు రు.3,74,483 కోట్లు మొత్తం రు.58,59,331 కోట్లు. 2022-23 బడ్జెట్‌లో పేర్కొన్నదాని ప్రకారం 2023 మార్చినాటికి దేశీయ రుణం రు.147,48,875కోట్లు, విదేశీ అప్పు రు.4,69,034 కోట్లు మొత్తం రు.152,17,910 కోట్లు అవుతుందని అంచనా.ద్రవ్యోల్బణం పెరుగుదల, విదేశీ అప్పులు డాలర్లలో చెల్లించాలి గనుక రూపాయి విలువ రికార్డు పతనం కొనసాగితే ఇంకా పెరిగినా ఆశ్చర్యలేదు. ఈ ఎనిమిది సంవత్సరాల్లో ప్రభుత్వరంగ కంపెనీలను తెగనమ్మి పొందిన సొమ్ము, చమురుపై విధించిన భారీ సెస్సుల ఆదాయమంతా ఎటుపోయినట్లు, తెచ్చిన దాదాపు వందలక్షల కోట్లను ఏమి చేసినట్లు ? చివరికి చూసుకుంటే రికార్డు స్దాయి నిరుద్యోగం, వృద్ది రేటు పతనం, కనుచూపు మేరలో లేని అచ్చేదిన్‌ ! కొనుగోలు శక్తి పడిపోతోంది. ఇప్పటికే ఉన్న పారిశ్రామిక సామర్ద్యాన్ని పూర్తిగా వినియోగించలేని స్థితిలో కొత్తగా పెట్టుబడులు పెడితే తమకు వచ్చేదేమిటని ప్రయివేటురంగం ప్రశ్నిస్తోంది. ఆత్మనిర్భర్‌, కరోనా పేరుతో పొందిన రాయితీలతో లబ్దిపొందుతోంది.


ఎనిమిదేండ్ల క్రితం నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో ముందుకు తెచ్చిన అంశాలను చూసినపుడు బలమైన ఆర్ధిక పునాదులు వేస్తామన్నదే వాటి సారాంశం. కానీ తరువాత గత ఎనిమిదేండ్లలో అటు కేంద్రంలో, ఇటు మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి కేంద్రీకరణ ఆర్ధిక వృద్ధి కంటే మతపరమైన రాజకీయలక్ష్యాలకే తొలి ప్రాధాన్యత ఇచ్చారన్నది స్పష్టం. ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా కట్టుబడిన మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండా అమలుకు అగ్రాసనం వేశారు. దేశాన్ని ప్రామాణిక హిందూ మూలాల్లోకి తీసుకుపోతామని చెబుతున్నారు. గతంలో అలాంటి భావజాలం, మతం దేశాన్ని పారిశ్రామిక విప్లవానికి దూరం చేసింది. తిరిగి అదే స్థితికి తీసుకుపోతామని చెబుతున్నారు. దానికిగాను హిందూమతానికి సంబంధం లేని హిందూత్వను ఆయుధంగా చేసుకొని మధ్య యుగాలనాటి మతవిద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది దేశాన్ని ఆర్ధికంగా దిగజారుస్తుందే తప్ప మంచి రోజుల వైపు తీసుకుపోదు. ఒక ఆర్ధిక వ్యవస్థను ఎలా నాశనం చేయవచ్చు అని ఎవరైనా అధ్యయం చేయదలిస్తే ఎనిమిదేండ్ల నరేంద్రమోడీ పాలనను ఎంచుకోవచ్చని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీలో విఫల నేత అని కొందరు చెప్పవచ్చు. నరేంద్రమోడీ వైఫల్యం, బూటకం గురించి చెప్పింది వాస్తవమే కదా !

ఈ విశ్లేషణ డివివిఎస్‌ వర్మ సంపాదకత్వంలో వెలువడిన మోడీ ”భార” తం ప్రత్యేక సంచికలో తొలుత ప్రచురితమైనది.

మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భాగం) : ఆర్ధిక వృద్ధి కంటే మత విభజనకే పెద్ద పీట !