Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


శివలింగాల కోసం మసీదులను తవ్వేద్దామన్నారు బిజెపి ఎంపీ బండి సంజయ. ప్రతి మసీదులో శివలింగం కోసం చూడటం ఎందుకు అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ సుభాషితం పలికారు. గ్యానవాపి వివాదాన్ని కొత్తగా రేపగా అది కొనసాగుతున్న వివాదమని భగవత్‌ చెప్పటం గమనించాల్సిన అంశం. ఇద్దరూ ఒకే సంస్థకు, భావజాలానికి చెందిన వారు. ఇద్దరి ఆలోచనలు పరస్పరం తెలియని స్థితిలో ఉన్నారా ? ఒకరు పిర్రగిల్లాలి, మరొకరు జోలపాడాలి. ఎవరికి తెలియని నాటకమిది ? భలేగా జనాన్ని ఆడుకుంటున్నారు కదా ! బాబరీ మసీదు మీద సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు రాముడి జన్మభూమి రాజకీయం నడిపారు. ఇప్పుడు శివలింగాల మీద కేంద్రీకరించారు.లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే. రాజకీయ, మత వ్యాపారులు దీనికి మినహాయింపుగా ఎలా ఉంటారు ?


ఆమె మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి. పదవీ కుమ్ములాటల కారణంగా బిజెపి నుంచి బహిష్కరణకు గురై భారతీయ జనశక్తి పార్టీ పేరుతో స్వంత దుకాణం నడిపి లాభం లేకపోవటంతో తిరిగి బిజెపి దుకాణంలో చేరారు, ఆమె పేరు ఉమా భారతి.రామజన్మభూమి ఆందోళనలో ప్రముఖ పాత్రధారి, బాబరీ మసీదును కూల్చివేసినపుడు అక్కడే ఉన్నారని వార్తలు. ఇప్పుడు ఆమె ఒక శివాలయాన్ని ఏడాది పొడవునా తెరిచి ఉంచకపోతే తనకు నిదరపట్టదని, అన్నం మానివేస్తానని బెదిరింపులకు దిగారు. మధ్యప్రదేశ్‌లోని రాయిసేన్‌ జిల్లాలోని రాయిసేన్‌ కోట భారత పురావస్తుశాఖ (ఎఎస్‌ఐ) ఆధీనంలో ఉంది. పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం దాని ఆధీనంలో ఉన్న ఆలయాలను సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచి పూజలకు అనుమతిస్తారు. ఇక్కడ మహాశివరాత్రి రోజు పూజలు చేస్తారు. దాన్ని ఏడాది పొడవునా తెరిచి ఉంచాలని ఉమాభారతి డిమాండ్‌ చేశారు. ఏప్రిల్‌ నెలలో ఆ కోటను సందర్శించి గేటు వెలుపల నుంచి శివలింగం మీద నీటిని చల్లి అభిషేక తంతు జరిపారు. తాను గంగ నుంచి నీటిని తెచ్చి అధికారులకు అందచేశానని, గుడిని ఎప్పుడు తెరిచేది చెబితే వచ్చి వాటితో అభిషేకం చేస్తానని ఆమె విలేకర్లతో చెప్పారు. తాళాలు బద్దలు కొట్టటం వంటి పనులకు తాను పాల్పడనని అన్నారు. అసలు ఇక్కడ శివాయం ఉన్నట్లే తనకు తెలియదని మత బోధకుడు ప్రదీప్‌ మిశ్రా ప్రకటనల ద్వారా తెలుసుకొని వచ్చానన్నారు. మద్యపాన నిషేధం పేరుతో ఇటీవల ఆమె తన పార్టీకే చెందిన ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో వివాదపడుతున్నారు. దానిలో భాగంగానే శివాలయ రాజకీయం ప్రారంభించారని భావిస్తున్నారు.


శివలింగ రాజకీయంలో బిజెపి నేతలు తక్కువ తినలేదు. గ్యానవాపి మసీదులో కనిపించిందని చెబుతున్న శివలింగం గురించి బిజెపి తన వైఖరి ఏమిటో ఇంతవరకు ప్రకటించలేదు. కానీ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేసి ప్రస్తుతం స్వదేశీ జాగరణ మంచ్‌ నేతగా ఉన్న పి. మురళీధర రావు మాత్రం వ్యక్తిగతం పేరుతో ప్రకటనలు చేస్తుంటారు. ఇదొక నాటకం. శివలింగపూజను ప్రపంచంలో ఏ శక్తీ అడ్డుకోలేదని మసీదులో శివలింగం ఉందన్న వాస్తవాన్ని ముస్లింలు అంగీకరించాలని ట్వీట్లు చేస్తారు. అక్కడ శివలింగం దొరికింది కనుక అక్కడ పూజలను అనుమతించాలి, అలా చేసినపుడు 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న యధాతధ స్థితిని కొనసాగించాలని 1991లో చేసిన చట్టం కొనసాగటం అసాధ్యమని వాదించారు. 1991నాటి చట్టం అమల్లో ఉండగా బిజెపి అధికారికంగా దానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బంది కనుక మద్దతుదార్లతో కేసులు వేయిస్తారు, వారితో తమకు సంబంధం లేదంటారు. ఏదో ఒక రూపంలో దాని గురించి రోజూ మాట్లాడుతూ ఉంటారు.

మహారాష్ట్రలో మతవాద రాజకీయాలు నడిపేవాటిలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్‌) ఒకటి.దాని నేత గజానన్‌ కాలే ఒక ట్వీట్‌ చేస్తూ ఔరంగాబాద్‌లో ఔరంగజేబు సమాధి ఉండాల్సిన అవసరం లేదని దాన్ని కూల్చివేయాలంటూ రెచ్చగొట్టాడు. ఆ పని చేస్తే అక్కడికి జనాలు వెళ్లరని అన్నారు. దాంతో కొంత మంది దానికి తాళాలు వేసి రక్షణ కల్పించాలని ప్రయత్నించారు. మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ఇటీవల సమాధిని సందర్శించిన తరువాత ఇది జరిగింది. ఈ సందర్శన కొత్త వివాదాన్ని సృష్టించేందుకే అని ఒవైసీ మీద విమర్శలు వచ్చాయి. ఇలా ఎక్కడికక్కడ ఏదో ఒక పేరుతో మత శక్తులు రెచ్చిపోతున్నాయి.


చివరకు హిందువుల వ్యక్తిగత స్వేచ్చను కూడా బిజెపి సహించటం లేదు. గుజరాత్‌లోని వడోదరా పట్టణానికి చెందిన కష్మా బిందు అనే యువతి జూన్‌ 11న ఒక దేవాలయంలో తనను తానే వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించింది. ఇది హిందూత్వకు వ్యతిరేకం గనుక దాన్ని అనుమతించేది లేదని నగర బిజెపి నాయకురాలు సునీతా షుక్లా ప్రకటించారు. దీని వలన హిందూ జనాభా తగ్గిపోతుందని, మతానికి వ్యతిరేకంగా చేసే వాటిని సహించేది లేదన్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే దేశ చరిత్రలో తనును తానే వివాహం చేసుకోవాలనుకోవటం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. అదే యువతి సాధ్విగా మారి ఉంటే ఎలాంటి అభ్యంతరం, హిందూ జనాభా తగ్గుదల అంశం తలెత్తిఉండేది కాదు.


దేశంలో శివలింగ రాజకీయాలు నడుస్తున్నాయి గనుక ఆసక్తికరమైన అంశాన్ని ఇక్కడ చెప్పుకోకుండా ఉండలేం. ఒక హత్య కేసులో ఉన్న కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌ దేవుడు శివుడిని అవమానించారని 2018లో కేంద్ర మంత్రిగా ఉన్న రవిశంకర ప్రసాద్‌ ఆరోపించారు. ఒక కాంగ్రెస్‌ ఎంపీ భయంకరంగా హిందూ దేవుళ్లను అవమానించినందుకు శివ భక్తుడిని అని చెప్పుకున్న రాహుల్‌ గాంధీ సమాధానం చెప్పాలని, హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బెంగళూరు సాహిత్య సమ్మేళనంలో 2018 అక్టోబరు 28న శశిధరూర్‌ ప్రసంగించారు. నరేంద్రమోడీ శివలింగం మీదకు చేరిన తేలు వంటి వారని దాన్ని చేత్తో తీసివేయలేము చెప్పుతో కొట్టనూ లేమని ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఉపమాలంకారంగా ఒక జర్నలిస్టుతో అన్నారని ఆ ప్రసంగంలో శశిధరూర్‌ చెప్పినట్లు ఎఎన్‌ఐ వార్తా సంస్థ నివేదించింది. దాన్ని హిందూమతాన్ని అవమానించినట్లుగా రవిశంకర ప్రసాద్‌ చిత్రించారు. ఈ మాటను శశిధరూర్‌ పాకిస్తాన్‌లో అని ఉంటే నోరు మూయించేవారు, అతను కేవలం ప్రధాన మంత్రినే కాదు ఈ దేశంలోని కోట్లాది మంది శివభక్తులను అవమానించారు అని మరో కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఆరోపించారు. ఈ మాటలకు గాను శశి ధరూర్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని రాహుల్‌ గాంధీని బిజెపి నేత సంబిత్‌ పాత్ర డిమాండ్‌ చేశారు.ఇంతకూ జరిగిందేమిటి ?


శశిధరూర్‌ తన ప్రసంగంలో కారవాన్‌ పత్రిక జర్నలిస్టు వినోద్‌ జోస్‌తో ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుడు నరేంద్రమోడీ శివలింగం మీద తేలుకొండి లాంటివాడని చేత్తో తొలగించలేము, చెప్పుతో కొట్టలేమని అన్న మాటలను ఉటంకిస్తున్నట్లు చెప్పారు.2012 కారవాన్‌ పత్రికలో వినోద్‌ జోస్‌ కథనం ప్రచురితమైంది. దాన్లో ఇలా రాశారు.” నేను గుజరాత్‌ నుంచి వచ్చే ముందు పెద్ద నిట్టూర్పుతో ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ నేత తన భావాలను నాతో ఇలా పంచుకున్నారు.” శివలింగం మీద తేలుకొండి కూర్చుని ఉంది. అది పవిత్రమైన శివలింగం కావటంతో చేత్తో తొలగించలేము-చెప్పుతో కొట్టనూ లేము ” అన్నట్లు రాశారు. సదరు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత పేరు వెల్లడించాలని ఒక ట్విటర్‌ కోరగా ఒక జర్నలిస్టుగా తనకు చెప్పిన వారిని మోసం చేయలేనంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఒక్కరే కాదు నరేంద్రమోడీ మంత్రివర్గంలో హౌం మంత్రిగా పని చేసిన గోర్ధన్‌ జడాఫియా కూడా అదే మాట అన్నట్లు వినోద్‌ జోస్‌ సమాధానమిచ్చారు.


2010 సెప్టెంబరు 12న న్యూస్‌ 9 అనే ఆంగ్ల టీవీ ఆరునిమిషాల వీడియో వార్తను ప్రసారం చేసింది. దానిలో మోడీ ఒక తేలుకొండి అంటూ ఒక భాగం ఉంది. తెరమీద ఆ మాటలను చూపిన వెంటనే గోర్ధన్‌ జడాఫియా వ్యాఖ్య ఇలా మొదలైంది.” నేను గనుక చెప్పాల్సి వస్తే శివలింగం మీద తేలుకొండి కూర్చున్నదని చెప్పగలను. సంఘపరివార్‌ కూడా దాన్ని ముట్టుకోలేదు – శివలింగానికి హానీ కలిగేట్లు దేన్నీ విసరలేదు. మొత్తం పరివారమంతా చూస్తున్నది. వారిలో కూడా ఈ భావనలు ఉన్నా వారేమీ చేయలేరు.” అన్నారు. ఈ జడాఫియా విశ్వహిందూపరిషత్‌ నేత. అహమ్మదాబాద్‌ బిజెపి ప్రధాన కార్యదర్శి, రెండుసార్లు ఎంఎల్‌ఏగా, నరేంద్రమోడీ మంత్రివర్గంలో హౌంమంత్రిగా పనిచేశారు.2002 గుజరాత్‌ మారణకాండలో పాత్రధారి అనే విమర్శలున్నాయి. విశ్వహిందూపరిషత్‌కు అనుకూలంగా ఉన్న పోలీసు అధికారులను కొన్ని చోట్లకు బదిలీ చేసి హింసాకాండకు తోడ్పడేట్లు చేశారని, అతని ఆదేశం మేరకు పోలీసులు నిర్వాశితులైన బాధితుల మీద శిబిరాల్లోనే దాడులు చేయించినట్లు విమర్శలున్నాయి. నరేంద్రమోడీ పొడగిట్టని విశ్వహిందూపరిషత్‌ నేత ప్రవీణ్‌ తొగాడియా అనుచరుడిగా ఉన్న కారణంగా గుజరాత్‌ హింసాకాండ తరువాత జడాఫియాను మంత్రివర్గం నుంచి మోడీ తొలగించారు. దాంతో 2007 ఎన్నికల్లో మహాగుజరాత్‌ జనతా పార్టీ అనే కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. తరువాత బిజెపి నుంచి వెలుపలికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేశూభాయి పటేల్‌ దుకాణమైన గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీలో దాన్ని విలీనం చేశారు.2012 ఎన్నికల్లో అది బిజెపి మీద పోటీకి దిగి భంగపడింది.తరువాత విశ్వహిందూపరిషత్‌ పూర్తిగా నరేంద్రమోడీకి మద్దతు ప్రకటించింది. గుజరాత్‌ కొట్లాటలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం మూడు సార్లు జడాఫియాను ప్రశ్నించింది, నరేంద్రమోడీ పాత్ర గురించి సాక్ష్యం చెప్పేందుకు సుముఖత చూపినట్లు, ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు వత్తిడి తెచ్చి వారించినట్లు దాంతో వెనక్కు తగ్గినట్లు వార్తలు వచ్చాయి. రాజీగా జడాఫియాను తిరిగి పార్టీలో చేర్చుకొనేందుకు ఒప్పందం కుదరటంతో 2014లో గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీని బిజెపిలో విలీనం చేసి పార్టీలో చేరారు.

దేశంలో ప్రస్తుతం ప్రారంభమైన శివలింగాల రాజకీయం ఏ మలుపులు తిరుగుతుందో ! రామజన్మ భూమి మాదిరి ఓట్లను రాలుస్తుందా ? ఈ కొత్త నాటకాన్ని జనం గ్రహిస్తారా ? ఆర్ధిక రంగంలో ఘోరంగా విఫలమై జన జీవితాలు అతలాకుదలం అవుతున్న స్థితిలో వాటి నుంచి జనాన్ని మళ్లించేందుకు అనేక ఎత్తులు వేస్తున్నారు. దానిలో లింగాల రాజకీయం ఒకటి అన్నది స్పష్టం. శ్రీలంక ఆర్ధిక దిగజారుడు, రాజకీయ పరిణామాల నేపధ్యంలో ధరల అదుపునకు జమ్మిక్కులు చేస్తున్నారు. ఆర్ధిక దిగజారుడు మరింతగా జరగకముందే ఏదో ఒకసాకుతో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరిపినా ఆశ్చర్యం లేదు.