Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


బిజెపి అధికార ప్రతినిధి నూపూర్‌ శర్మ నోటి తుత్తర లేదా అదుపులేని తనం కారణంగా తెలుగువాడైన మన ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడికి అవమానం జరిగింది. కతార్‌ పర్యటనలో అధికారిక రాత్రి విందును అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. కతార్‌ ఉప ఎమిర్‌ (రాజు)కు కరోనా అన్న అనుమానం అని దానికి సాకు చెప్పారు. ఇప్పటి వరకు ముస్లిం విద్వేష ప్రకటనలు మన అంతర్గత అంశంగా ఉండగా ఇప్పుడు మహమ్మద్‌ ప్రవక్త మీద దాడితో ” మన దేశ ప్రతిష్టను ” నరేంద్రమోడీ అనుచరులు అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయారు. ఇస్లామిక్‌ దేశాల్లో మన దేశం గురించి పతాకశీర్షికల్లో వార్తలు వెలువడ్డాయి.దీంతో కతార్‌, కువైట్‌లోని కొన్ని దుకాణాల నుంచి మన దేశ వస్తువులను తొలగించినట్లు బిబిసి పేర్కొన్నది.ఒమన్‌ గ్రాండ్‌ మప్తీ కూడా మన దేశ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చాడు.


మహమ్మద్‌ ప్రవక్త గురించి అనుచితంగా మాట్లాడిన బిజెపి నేత నూపూర్‌శర్మ (ఆమె ఢిల్లీ సిఎం అరవింద కేజరీవాల్‌పై పోటీచేశారు) మీద ఇంతవరకు ఎలాంటి కేసులు లేవు. రెచ్చగొట్టిన ఆమె మాటలతో తలెత్తిన ఉదంతాల్లో మాత్రం ఎందరి మీదో కేసులు నమోదు చేశారు. మే 27వ తేదీన గ్యాన్‌వాపి మసీదు పేరుతో చర్చ జరిపిన టైమ్స్‌ నౌ ఛానల్‌లో మాట్లాడిన నూపూర్‌ శర్మ మాటలను కోట్లాది మంది చూశారు. అనుచితంగా మాట్లాడుతున్న ఆమెను సదరు ఛానల్‌ మోడరేటర్‌ నివారించలేదు, అలాంటి మాటలు మాట్లాడటం తమ ఛానల్‌ వైఖరి కాదు అని కూడా ప్రకటించలేదు. ముందే చెప్పుకున్నట్లు నూపూర్‌ మీద గాని సదరు ఛానల్‌ మీద గానీ ఎలాంటి కేసులు లేవు. చర్చలో నూపూర్‌ శర్మ మాటలున్న భాగాన్ని తీసుకొని తీసుకొని ట్వీట్‌ చేసిన ఆల్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ ప్రతినిధి మహమ్మద్‌ జుబేర్‌ మీద మాత్రం కేసులు పెడతారు. మామ తిట్టటం కాదు దాన్ని చూసిన తోడల్లుడు కిసుక్కున నవ్వటం ఘోరం అన్నట్లుగా లేదూ !


ముస్లింలు, ఇస్లాం గురించి ఎంత విద్వేషపూరితంగా మాట్లాడితే అంత దేశభక్తి. మేకిన్‌ ఇండియా అంటే కుప్పలు తెప్పలుగా అలాంటి వివాదాలు, మాటల సృష్టే అన్నట్లుగా మారింది. బిజెపి ఫ్యాక్టరీలో పని చేస్తున్న నూపూర్‌ శర్మ ఉత్పత్తి కాన్పూర్‌లో హింసాకాండకు, కేసులకు దారి తీసింది. పలుచోట్ల ముస్లింలు తమ ప్రవక్తమీద మాట్లాడిన అనుచిత పదజాలానికి నిరసన తెలుపుతున్నారు. ఇంత జరిగినా కేంద్ర ప్రభుత్వానికి లేదా, బిజెపిలో ఎలాంటి స్పందన లేదు. కానీ నూపూర్‌ శర్మ నిర్వాకం ఇస్లామిక్‌ దేశాల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. మన దేశపు సరకులను బహిష్కరించాలన్న పిలుపులు వెలువడ్డాయి. కొన్ని ప్రభుత్వాలు అధికారికంగా స్పందించి మన రాయబారులను పిలిపించి ఇదేం పని అని మందలించటం, నిరసన తెలుపుతున్నాయి. క్షమాపణ చెప్పాలని కోరాయి. ఇంత జరిగిన తరువాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం, బిజెపి నేతలు నష్ట నివారణకు పూనుకున్నారు. మేనెల 27న నూపూర్‌ శర్మ మాట్లాడితే అది పార్టీ విధానం కాదంటూ జూన్‌ ఐదున ఆమెను సస్పెండ్‌ చేయటాన్ని ఏమనాలి ! అందుకే ఈ చర్యలోగానీ, తన మాటలను వెనక్కు తీసుకుంటున్నట్లు ఆమె ప్రకటనలో గానీ ఎక్కడా చిత్తశుద్ది కనపడదు.


నూపూర్‌ శర్మ ట్వీట్‌ ద్వారా చేసిన ప్రకటన ఇలా ఉంది.” మన మహదేవ్‌ను అవమానిస్తూ, అగౌరవపరుస్తూ కొనసాగుతున్న టీవీ చర్చలకు నేను గత కొద్ది రోజులుగా హాజరువుతున్నాను. కనిపించింది శివలింగం కాదు ఒక ఫౌంటెన్‌ అని వెక్కిరింతగా మాట్లాడుతూ ఢిల్లీలో రోడ్లపక్క ఉన్న స్థంభాలు, చిహ్నాలంటూ శివలింగాన్ని అపహాస్యం కూడా చేస్తున్నారు.మన మహదేవ్‌ను ఇలా అవమానించటం, అగౌరవపరచటం కానసాగటాన్ని నేను సహించలేను. దానికి స్పందనగానే నేను కొన్ని అంశాలను చెప్పాను. నా మాటలు ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది కలిగించినా ఎవరి మత భావాలనైనా గాయపరిచినా, ఏదైనా కానివ్వండి బేషరతుగా నా మాటలను ఉపసంహరించుకుంటున్నాను. ఎవ్వరి మతభావనలను గాయపరచటం నా ఉద్దేశ్యం కాదు.” అని పేర్కొన్నారు. ఈ పశ్చాత్తాపం కలగటానికి తొమ్మిది రోజులు పట్టిందంటే అసలు కథేమిటో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ ఆమె మాట్లాడిన మాటలేమిటి ? ఆ సుభాషితాన్ని పూర్తిగా వివరించనవసరం లేదు. వికీపీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం అయిషా అనే ఆరేండ్ల బాలికను మహమ్మద్‌ ప్రవక్త వివాహం చేసుకున్నట్లు, ఆమెకు తొమ్మిదేండ్లు వచ్చిన తరువాత సంసారం చేసినట్లు నూపూర్‌శర్మ చెప్పినట్లుగా ఉంది.గ్యానవాపి మసీదులో కనిపించింది ఏమిటో అధికారికంగా నిర్ధారించిన తరువాత అది శివలింగమా-ఫౌంటెనా అన్నదాని గురించి ఎవరి అభిప్రాయం చెప్పుకోవచ్చు. బిజెపి అధికారికంగా ఎక్కడా శివలింగమే అది అని తాము నమ్ముతున్నట్లు ఇంతవరకు చెప్పలేదు. పోనీ దాని గురించి చర్చలో మహమ్మద్‌ ప్రవక్త ప్రస్తావన అవసరం ఏమిటి ?


తన నోటితుత్తర కాన్పూర్‌లో హింసాకాండకు దారి తీసినందుకు నూపూర్‌ శర్మ ఎలాంటి విచారం ప్రకటించలేదు, వివరణ ఇచ్చేందుకు కూడా పూనుకోలేదు. తన మాటలను ఉటంకిస్తూ ఆల్ట్‌ న్యూస్‌ మహమ్మద్‌ జుబేర్‌ విడుదల చేసిన వీడియో చూసిన వారు తన మాన ప్రాణాలను హరిస్తామంటూ చేస్తున్న బెదిరింపులకు అతనే బాధ్యత వహించాలని, తన మాటలను వక్రీకరించి అసందర్భంగా చూపారని ఆరోపించారు. ఒక వేళ అదే నిజం అనుకుంటే తన మాన ప్రాణాలకు నిజంగా ముప్పు తలెత్తిందని భావిస్తే తాను మాట్లాడిన వీడియోను తీసుకొని తానే దాన్ని విడుదల చేసి జనాల్లో తలెత్తిన అనుమానాలను తీర్చవచ్చు, అదేమీ ఆమె వైపు నుంచి లేదు. తామెలాంటి మార్పులు చేయలేదని ఆల్ట్‌ న్యూస్‌ మరొక ప్రతినిధి ప్రతీక్‌ సిన్హా స్పష్టం చేశారు. నూపూర్‌ శర్మ వ్యాఖ్యలు ప్రపంచమంతటా ముఖ్యంగా గల్ఫ్‌ ఇస్లామిక్‌ కౌన్సిల్‌ దేశాల్లో సామాజిక మాధ్యమాల్లో బిజెపికి పైసా ఖర్చు లేకుండా ఎంతో ప్రచారాన్నిచ్చాయి.దాంతో ముస్లింలు అధికంగా ఉండే దేశాలను సంతుష్టీకరించేందుకు నరేంద్రమోడీని పురికొల్పాయి. కతార్‌ ప్రభుత్వం మన రాయబారిని పిలిపించి తక్షణమే ఖండించాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. అనేక దేశాల్లో కూడా అదే జరిగింది. అయితే ఆ మాటలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని, నోటి తుత్తర శక్తులు చేసిన వ్యాఖ్యలని మన రాయబారులు, విదేశాంగశాఖ సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది.


నూపూర్‌ శర్మను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు తప్ప బహిష్కరించలేదు. ఢిల్లీకి చెందిన మరొక బిజెపి నేత నవీన్‌ జిందాల్‌ చేసిన ఒక ట్వీట్‌లో మహమ్మద్‌ ప్రవక్తను కించపరిచినందుకు పార్టీ నుంచి తొలగించారు. అతగాడు తన ట్వీట్‌ను తొలగించినప్పటికీ చర్యతప్పలేదు. ఇటీవల పార్టీల్లో పదవుల పందారం జరిగినపుడు అధిష్టానం వారిపేరుతో విడుదల చేసే లేఖలను ప్రదర్శించటం మీడియాలో ఒక ధోరణిగా మారింది. దాని కొనసాగింపులోనే కొన్ని ఛానళ్లు, వెబ్‌సైట్‌లు నూపూర్‌శర్మ, నవీన్‌ జిందాల్‌కు రాసిన లేఖలను ప్రదర్శించాయి, వాటిలో వారి చిరునామాలున్నాయి. తన కుటుంబానికి హాని ఉన్నందున తన చిరునామాను వెల్లడించవద్దని నూపూర్‌ శర్మ మీడియాను కోరారు. తాను పోలీసు రక్షణ కోరినట్లు జిందాల్‌ పేర్కొన్నారు. ఎఎన్‌ఐ వార్తా సంస్థ ఆ లేఖను తొలగించింది. అయితే అప్పటికే ఆమె అడ్రస్‌ జనాలకు కేరింది. అసలు చిరునామాలను చెరపకుండా బిజెపి ఆఫీసు నుంచి మీడియాకు ఆ లేఖలు ఎలా వచ్చాయన్నది ఆసక్తి కలిగిస్తోంది.


ధర్మ సంసద్‌ల పేరుతో జరిపిన సభల్లో హిందూత్వ నేతలు ముగ్గురు చేసిన విద్వేషపూరిత ప్రసంగాల గురించి ఆల్ట్‌ న్యూస్‌ ప్రతినిధి మహమ్మద్‌ జుబేర్‌ చేసిన ట్వీట్లకు గాను ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు కేసు పెట్టారు. ఈ చర్యను పదకొండు డిజిటల్‌ న్యూస్‌ సంస్థలతో కూడిన డిజిపబ్‌ న్యూస్‌ ఇండియా ఫౌండేషన్‌ ఖండించింది.విద్వేష ప్రసంగాలు చేసిన వారిని వదలివేసి వారి మాటలను జనాలకు నివేదించిన జర్నలిస్టులను వేధించటం తగనిపని అని పేర్కొన్నది.హిందువుల మనోభావాలను కించపరిచినట్లు, ఐటి చట్టాన్ని దుర్వినియోగం చేసినట్లు పోలీసులు ఆరోపించారు. మే నెల 27న జుబేర్‌ చేసిన ఒక ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు.” ఇప్పటికే యాంకర్లు స్టూడియోలనుంచి ఎంతో చేస్తుండగా ఒక సామాజిక తరగతికి లేదా ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు యతి నరసింగానంద సరస్వతి, మహంత్‌ బజరంగ్‌ లేదా ఆనంద స్వరూప్‌ వంటి విద్వేషం వెదజల్లే వారికి ధర్మసంసద్‌లను ఏర్పాటు చేయటం ఎందుకు ?” అని ప్రశ్నించారు. దేశంలో జరుగుతున్న అనేక పరిణామాలను చూసినపుడు అసలేం జరుగుతోంది అన్న సందేహాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గల్ఫ్‌ దేశాల్లో మన దేశానికి చెందిన లక్షలాది మంది కార్మికులుగా పని చేస్తున్నారు. ఆర్ధికంగా ఆ దేశాలతో అనేక లావాదేవీలు కూడా పెద్దఎత్తునే ఉన్నాయి. బిజెపి నేతల నోటి తుత్తర ఈ సంబంధాల మీద రానున్న రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.ఇటీవలి ఎన్నికల్లో బిజెపి ముందుకు తెచ్చిన 80-20 ప్రచారం ఒక అంశాన్ని స్పష్టం చేసింది. తమకు ఇరవైశాతం ముస్లింల ఓట్లు పడకపోయినా ఫరవాలేదని, మెజారిటీ హిందువులు తమను శాశ్వతంగా అధికారంలో కూర్చోబెడతారనే అభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. దానికి నిదర్శనంగానే ఎక్కడా ముస్లిం అభ్యర్ధులను నిలపటం లేదు. ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితిలో ఇస్లామిక్‌ దేశాలతో సంబంధాలు అవసరం గనుక, తన ప్రతిష్టకు మచ్చపడకుండా చూసుకొనేందుకు ఎత్తుగడగా నరేంద్రమోడీ నాయకత్వం ఇప్పుడు ఇద్దరు బిజెపి నేతల మీద చర్యలు ప్రకటించటం ఒక ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.