Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమై బుధవారం నాటికి 105వ రోజుకు చేరింది. అమెరికా, ఇతర నాటో దేశాలు ప్రపంచం మీద రుద్దిన సంక్షోభ పర్యవసానాలను ఉక్రెేనియన్లు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. పరోక్షంగా మన దేశంతో సహా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వందవ రోజు సందర్భంగా ఆ సంక్షోభం గురించి అనేక మంది పాఠాలు, గుణపాఠాలు అంటూ తమ వైఖరులను వెల్లడించారు. ఏ దాడి లేదా యుద్దంలోనైనా ముందుగా నిజాలు బలి అవుతాయి. వంద రోజులు దాటిన తరువాత కూడా ఉక్రెయిన్లో నిజంగా జరుగుతున్నదేమిటి? అమెరికా కూటమి దేశాలు చెబుతున్నట్లుగా రష్యాకు ఎదురు దెబ్బలు తగిలాయా ఏమిటి అన్నది స్పష్టంగా వెల్లడికావటం లేదు.అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కొన్ని అంశాలను చూద్దాం.


ఇరవై శాతం భూభాగం తమ పట్టునుంచి తప్పిందని స్వయంగా ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ ప్రకటించాడు. అది గత ఎనిమిది సంవత్సరాలుగా స్వాతంత్య్రం ప్రకటించుకున్న తిరుగుబాటుదారులది పైచేయిగా ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతం. ఉక్రెయిన్‌ మిలిటరీ, దాని కనుసన్నలలో పని చేసే కిరాయి నాజీమూకలు ఒక వైపు, రష్యా మద్దతు ఉన్న తిరుగుబాటు దార్ల మధ్య అక్కడ అంతర్యుద్దం జరుగుతున్నది. రష్యా ప్రారంభించిన సైనిక చర్యలక్ష్యాలలో ఈ ప్రాంతంలోని నాజీ మూకలను అంతం చేయటం, నాటోలో చేరి తమ సరిహద్దులో అమెరికా, ఇతర దేశాల మిలిటరీ,ఆయుధాలను మోహరించేందుకు పూనుకున్న ఉక్రెయిన్‌ జీవనాడులను దెబ్బతీసి ఆ ప్రక్రియనుంచి వెనక్కు తగ్గేట్లు చేయటం ఉన్నాయి. ఈ ప్రక్రియ కొద్ది రోజుల్లోనే పూర్తవుతుందని వేసిన అంచనాలు తప్పాయి. పశ్చిమ దేశాలు అందించిన ఆధునిక ఆయుధాలే దానికి కారణం. నయా నాజీ మూకలు, మిలిటరీ దాడుల నుంచి డాన్‌బాస్‌ పౌరులను రక్షించాలన్న లక్ష్యం నెరవేరేందుకు వందరోజులు పట్టింది. ఇక్కడ గ్రహించాల్సిన అంశాలు రెండున్నాయి. ఒకనాడు రష్యాలో అంతర్భాగంగా ఉన్న క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొనేందుకు రష్యాను పురికొల్పిన కారణం కూడా ఉక్రెయినుకు నాటో తీర్ధం ఇవ్వాలన్న పశ్చిమ దేశాల ఎత్తుగడే.


క్రిమియాను తిరిగి స్వాధీనం చేసుకోవటం ఉక్రెయినుకు సాధ్యం కాలేదు, ఇప్పుడు తమ పట్టునుంచి జారిందని చెబుతున్న డాన్‌బాస్‌ ప్రాంతాన్ని కూడా నాటో కూటమి దేశాలు ఎన్ని ఆయుధాలు ఇచ్చినా తిరిగి ఉక్రెయిన్‌ ఆధిపత్యంలోకి వస్తుందా అన్నది అపూర్వచింతామణి ప్రశ్న.పూర్వపు సోవియట్‌ నుంచి విడిపోయి దేశంగా ఏర్పడిన వాటిలో జార్జియా ఒకటి. దీనిలో అబ్కాజియా, దక్షిణ ఒసెట్టి అనే ప్రాంతాలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. వాటిని రష్యా గుర్తించటమే కాదు, అక్కడి ప్రభుత్వాలతో రక్షణ ఒప్పందాలను కూడా కుదుర్చుకొన్నది. జపాన్‌తో అమెరికా రక్షణ ఒప్పందం కుదుర్చుకొని అక్కడ తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసి మిలిటరీని ఎలా దించిందో అదే పద్దతిలో ఇక్కడ రష్యా కూడా ఆ రిపబ్లిక్కులకు రక్షణ కల్పిస్తోంది.ఈ రెండు ప్రాంతాలు జార్జియాలో ఇరవైశాతం కలిగి ఉండేవి. అందువలన డాన్‌బాస్‌ ప్రాంతం కూడా వచ్చే రోజుల్లో ఇదే మాదిరి స్వతంత్ర రాజ్యం లేదా రెండు రాజ్యాలుగా ఏర్పడి రష్యాతో మిలిటరీ రక్షణ ఒప్పందాలను కుదుర్చుకొని విడిగా కొనసాగవచ్చు.


ఉక్రెయిన్‌ సంక్షోభం నేర్పిన ఒక పాఠం ఏమంటే అమెరికాను నమ్ముకుంటే తన ఎత్తుగడలో భాగంగా ఒక దేశాన్ని మరొక దేశం మీదకు ఉసిగొల్పుతుంది తప్ప తన మిలిటరీని పంపి ప్రత్యక్షంగా రంగంలోకి దిగదు అన్నది స్పష్టమైంది. కొరియా, వియత్నాంలపై జరిపిన దాడులు, ఉగ్రవాదులను ఎదుర్కొనే పేరుతో ఆఫ్ఘనిస్తాన్‌లో జోక్యం చేసుకొన్ని తిన్న చావుదెబ్బలే దీనికి కారణం అని వేరే చెప్పనవసరం లేదు. సిరియా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కిరాయి మూకలను పశ్చిమదేశాలు సమీకరించినా అది సాధ్యం కాలేదు. ఉక్రెయిన్లో కూడా దాదాపు పాతిక వేలమందిని సమీకరించి జనం మీద దాడులు చేయించారు. మరియుపూల్‌ నగరంలోని ఉక్కు కర్మాగారాన్ని స్థావరంగా చేసుకొని మూడు నెలలపాటు రష్యన్లను ఎదిరించింది కూడా ఈ మూకలే. ఆ ఫ్యాక్టరీని ముట్టడించిన రష్యన్లు అక్కడి వారికి అవసరమైన సరఫరాలను అడ్డుకోవటంతో చివరికి వేలాది మంది లొంగిపోయిన సంగతి తెలిసిందే. నాలుగు కోట్ల నలభై లక్షల మంది జనాభాలో కోటీ నలభై లక్షల మంది విదేశాలకు శరణార్ధులుగా వెళ్లటం లేదా స్వదేశంలో నెలవులు తప్పటం గానీ జరిగింది. వారిని ఎంతకాలం అలా అనిశ్చితంగా పరాయిపంచల్లో కొనసాగిస్తారో తెలియటం లేదు. ఇరుగుపొరుగు దేశాలు వారిని దీర్ఘకాలం భరించటం అంతతేలిక కాదు. సంప్రదింపుల పేరుతో జెలెనెస్కీ నాటకం ఆడారు తప్ప చిత్తశుద్దిని ప్రదర్శించలేదు.తమకు నాటోలో చేరే ఉద్దేశ్యం లేదని చెప్పిన పెద్దమనిషి ఆ మాటమీద నిలిచి ఉంటే ఈ పాటికి సంక్షోభం సద్దుమణిగి ఉండేది. చావు దెబ్బలు తింటున్నా ఇంకా విదేశీఆయుధాలు తీసుకుంటూ మరింత నాశనానికి కారకుడు అవుతున్నాడు. పశ్చిమ దేశాలకు సమన్య పరిష్కారం కావటం సుతరామూ అంగీకారం కాదని తేలిపోయింది. రష్యన్‌ దాడుల్లో దెబ్బతిన్నవాటి పునరుద్దరణకు రుణాలిస్తామంటూ సంక్షోభం నుంచి కూడా లాభాలు పిండుకొనేందుకు పూనుకున్నారు.


ఈ వివాదాన్ని ఆసరా చేసుకొని రష్యాను బూచిగా చూపి ఐరోపాలో మరోసారి మిలిటరీ శక్తిగా మారేందుకు జర్మనీ పావులు కదుపుతున్నది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మిలిటరీ ఖర్చును తగ్గించి దాన్ని పరిశోధన-అభివృద్ధి, కార్పొరేట్లకు సబ్సిడీల వంటి వాటికి మళ్లించటంతో పారిశ్రామికంగా ఎదిగింది. ఇప్పుడు భారీ ఎత్తున మిలిటరీ ఖర్చుకు నిర్ణయించింది. ఆధునిక ఎఫ్‌35 రకం విమానాలను కొనుగోలు చేస్తానని ప్రకటించింది. ఐరోపాలో పెద్ద మిలిటరీ శక్తిగా ఎదిగేందుకే ఇది అన్నది చెప్పనవసరం లేదు. తటస్థదేశాలుగా ఉన్న స్వీడన్‌, ఫిన్లండ్‌తో పాటు డెన్మార్క్‌ కూడా నాటోలో చేరాలని నిర్ణయించింది. వీటి కదలికల వెనుక ఉన్న అసలు లక్ష్యాలు వెల్లడికావాల్సి ఉంది.


తమ ఆంక్షలతో రష్యా ఆర్ధికవ్యవస్థ కుప్పకూలి జనం పుతిన్‌ మీద తిరగబడతారని పశ్చిమ దేశాలు వేసిన అంచనాలు, పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. మాస్కో స్టాక్‌ మార్కెట్‌ మూతపడింది. రష్యన్‌ కరెన్సీ విలువ తొలి వారాల్లో సగానికి సగం పతనమైనా తిరిగి సైనికచర్యపూర్వపు స్థితికి చేరుకుంది. తమతో కాళ్లబేరానికి వస్తాడని భావించిన పుతిన్‌లో అలాంటి సూచనలేమీ లేవు. దాదాపు 300 బిలియన్‌ డాలర్ల మేర విదేశీమారక ద్రవ్యాన్ని పశ్చిమ దేశాలు స్థంభింప చేశాయి. ఎగుమతులపై నిషేధం విధించి ఆధునిక పరికరాలు, యంత్రసామగ్రి, పరిజ్ఞానం అందకుండా కట్టడి చేశారు.అమెరికా, ఐరోపా దేశాలు చమురు దిగుమతులను నిలిపివేసినా రష్యా ఇప్పటివరకు నిలదొక్కుకుంది. తన ఎగుమతులకు వేరే మార్కెట్లను చూసుకుంది. అమెరికా వడ్డీరేట్లను పెంచుతుంటే రష్యా తగ్గిస్తున్నది. మార్చి నెలలో భారత్‌కు చమురు సరఫరా చేసే దేశాల్లో రష్యా పదవస్థానంలో ఉంటే అది ఏప్రిల్‌ నెలలో నాల్గోస్థానానికి ఎదిగింది. మరో ఆరునెలల పాటు చమురు కొనుగోలుకు మన దేశ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నట్లు తాజా వార్తలు తెలిపాయి. మరోవైపు చైనా కూడా పెద్ద ఎత్తున చమురుతో పాటు ఇతర దిగుమతులను పెంచింది. రష్యా ఆర్థికవ్యస్థ నిలదొక్కుకొనేందుకు ఇదొక ప్రధాన కారణం. కొన్ని ఐరోపా దేశాలు కూడా ఆంక్షలను పక్కన పెట్టి అక్కడి నుంచి చమురు, గాస్‌ దిగుమతి చేసుకుంటున్నాయి. రష్యా వద్ద బంగారం, విదేశీకరెన్సీ గానీ 640 బిలియన్‌ డాలర్ల మేరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే విధించిన ఆంక్షలను అది తట్టుకోగలుగుతోందని చెప్పవచ్చు.


రష్యా మీద పశ్చిమ దేశాల ఆంక్షలు అంటే తమ కాళ్లను తామే తొక్కుకుంటున్నట్లని కొందరు వర్ణిస్తున్నారు. రష్యా నుంచి నిలిపివేసిన ఇంథనాన్ని ఇతర దేశాల నుంచి పొందాలంటే ఐరోపా దేశాలకు వెంటనే కుదిరేది కాదు.తమ నుంచి దిగుమతులు చేసుకోవాలంటే రూబుళ్లలోనే చెల్లించాలని లేకుంటే తామే నిలిపివేస్తామని పుతిన్‌ షరతులు విధించాడు. పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా చమురు ధరలు పెరగటం వలన ఎగుమతుల కారణంగా విదేశీ మారకద్రవ్యం పెద్ద ఎత్తున చెలామణిలోకి రావటం కూడా రూబుల్‌కు సానుకూల అంశంగా మారింది. రూబుల్‌ విలువ పెరగకుండా చూసేందుకు రష్యా రిజర్వుబాంకు వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చింది. తమ నుంచి దిగుమతులను నిలిపివేయటం అంటే ఐరోపా ఆర్ధిక ఆత్మహత్య చేసుకోవటమే అని పుతిన్‌ ఎద్దేవాచేశాడు. ఇంధన ధరలు,ద్రవ్యోల్బణం పెరుగుతాయని అన్నాడు. అయితే రష్యా ఇబ్బందులను ఎదుర్కొంటోందని కూడా చెబుతున్నారు. సైనిక చర్యకు ముందు బడ్జెట్‌లో చమురు ఎగుమతుల ఆదాయం 30శాతం ఉంటే ఇప్పుడు 65శాతానికి పెరిగిందంటున్నారు.
పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు రష్యాకు వరంగా మారాయి. మార్చి రెండవ తేదీన ముడి చమురు ధర 60 డాలర్లవరకు ఉంటే తరువాత 110 డాలర్లు దాటింది. అందువలన రష్యా తన ఖాతాదార్లకు పెరిగిన ధరమీద పెద్ద మొత్తంలో రాయితీ ఇచ్చినా గతంతో పోల్చుకుంటే నష్టం లేదు, మన వంటి దేశాలకు ఎంతగానో కలసి వస్తుంది.రష్యా మీద వత్తిడి తెచ్చేందుకు ఆంక్షల మార్గాన్ని ఎంచుకున్న పశ్చిమ దేశాలు వాటి వలన ఇతర దేశాలకు, చివరికి తమకూ కలిగే ప్రతికూల పర్యవసానాలను ఊహించలేకపోయాయి. కొన్ని ఐరోపా దేశాల వత్తిడికి లొంగి కొంత మేరకు చమురు దిగుమతులకు అనుమతించారు. వందరోజుల తరువాత అనేక దేశాల్లో తలెత్తిన పరిస్థితి అక్కడి పాలకులకు సమస్యలు తెస్తున్నది. 2014కు ముందు రష్యా ఆహారాన్ని దిగుమతి చేసుకోగా ఇప్పుడు ఎగుమతిదారుగా మారింది. అక్కడి నుంచి రవాణాపై ఆంక్షలున్న కారణంగా ప్రపంచంలో సరఫరా తగ్గి ఇప్పుడు ధరలు పెరిగాయి.


వంద రోజుల సైనిక చర్య తరువాత జరగనున్నదేమిటి అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. డాన్‌బాస్‌ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించినందున ఇక ముందు రష్యా తూర్పు నుంచి భారీ దాడులకు సిద్దం అవుతుంది. ఉక్రేనియన్లు ఇంకేమాత్రం దాడులను తట్టుకోలేని స్థితిలోకి వెళుతున్నారు. తమకు ఇంకా ఆయుధాలు ఇమ్మని జెలెనెస్కీ కోరితే ముందు ముందు జనాగ్రహాన్ని ఎదుర్కోవచ్చు. ప్రస్తుత పోరులో ఉక్రెయిన్‌ గెలుస్తుందనే నమ్మకం రోజు రోజుకూ పశ్చిమ దేశాల్లో సడలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరవైశాతం ప్రాంతం మీద తమ పట్టులేదని జెలెనెస్కీ ప్రకటించిన తరువాత ఆ భావన ఇంకా పెరుగుతోంది. ఇప్పుడు పశ్చిమ దేశాలకు ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని కొనసాగించాలా లేదా అన్న ప్రశ్న ఎదురుకానుంది. అమెరికా, ఐరోపా దేశాల్లో ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ధనికదేశాల్లో మాంద్యం తలెత్తవచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అలాంటపుడు రష్యామీద పోరు కొనసాగించి సాధించేదేమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.