ఎం కోటేశ్వరరావు
బిజెపి నాయకురాలు, ఓ ఇప్పుడు మాజీ అంటున్నారు కదా ! కానీ పార్టీ వారు సస్పెన్షన్ అన్నారు తప్ప బహిష్కరించలేదు కనుక ఆమెను ఇంకా ఆ పార్టీనేతగానే చూడాలి. ఆమె అంటే నూపుర్ శర్మ, మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడిన మాటలు ఫ్రింజ్ ఎలిమెంట్స్‌వి తప్ప పార్టీ వైఖరి కాదు అని బిజెపి చెప్పుకుంది. క్రమశిక్షణకు గురైన వారు అలాంటి వారా కాదా అన్నది ఎక్కడా చెప్పలేదు. అసలు ఫ్రింజ్ అంటే ఏమిటి ? నిఘంటువులో వివరించినదాని ప్రకారం కొంగు, అంచు, జాలరు, పట్టిక అని ఉంది. సులభంగా చెప్పుకోవాలంటే చీర అంతా ఒకటిగా ఉండి-కొంగులు మరొక విధంగా ఉండటం తెలిసిందే కదా. కొంగును చూసి అదే చీర అనుకోవద్దు అని బిజెపి చెబుతోంది.
ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటే మరికొన్ని అర్ధాలు కూడా ఉన్నాయి. సూది కోసం సోదికి పోతే పాత బండారమంతా బయటపడిందన్నట్లుగా నూపుర్ శర్మ ఉదంతం తరువాత బిజెపి, దాని మాతృసంస్థ సంఘపరివార సంస్థల నేతల మాటలన్నింటినీ అడిగిన వారందరికీ గూగులమ్మతల్లి టూల్‌కిట్లుగా అందిస్తోంది. ఆమె వంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారని చెబుతోంది. ఇంతకూ గూగుల్ మతం ఏమిటి? ఈ చర్చ-సమాచారం కూడా రెచ్చిపోతున్న మెజారిటీ-మైనారిటీ మతోన్మాదశక్తుల గురించి ఎంత మందికి జ్ఞానోదయం కలిగిస్తుందో చెప్పలేము గానీ కొందరిలోనైనా ఆలోచన రేకెత్తిస్తుంది. ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటే తీవ్రవాదులు, ఆచారవిరోధులు, ఎడ్డెమంటే తెడ్డెమనే బాపతు వంటి వివరణలు ఉన్నాయి. అంతే కాదు తెలుగు ప్రాంతాల్లో వాడుకలో ఉన్న అమాంబాపతు, చిల్లరగాండ్లు, అణాకానీ స్వభావం, నోటితుత్తర, నోటి దూలను ప్రదర్శించేవారు ఇదే కోవకు చెందుతారు. బిజెపి చర్యతీసుకున్న నూపుర్‌శర్మ, నవీన్ జిందాల్, వారిని సమర్ధిస్తూ రంగంలోకి దిగిన వారిని ఏ బాపతు కింద పరిగణించాలో ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే, దాన్ని బట్టే మనమెలాంటి వారమో కూడా జనానికి తెలుస్తుంది.
జకీర్ నాయక్ అనే ముస్లిం బోధకుడు ఏం చెప్పాడో దాన్నే ధైర్యంగా నూపుర్ శర్మ పునశ్చరణ చేశారంటూ ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక పాంచజన్య తన సంపాదకీయంలో మద్దతు పలికింది. సదరు జకీర్ ఒక వివాదాస్పద వ్యక్తి, విద్వేషపూరిత ప్రసంగాలు చేసి 2016లో దేశం విడిచి పారిపోయాడు. అతగాడి మాటలు పాంచజన్యానికి సముచితంగా, వినసొంపుగా ఉన్నాయి. మరి నూపుర్ శర్మ కూడా ఇప్పుడు అదేబాటపడతారా ? హిందువులు అసహనపరులుగా తయారైనట్లు చెబుతూ భారత పేరును దెబ్బతీసేందుకు కొందరు పూనుకున్నారని కూడా పాంచజన్య రాసింది. శుభానికి పోతూ పిల్లిని చంకన పెట్టుకుపోయినట్లు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ వంటి బాపతును ఇంతకాలం తమ ప్రతినిధులుగా చేసిన బిజెపి, ఇతర సంఘపరివార్ సంస్థల సంగతేమిటి ? ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నేత రామ్ మాధవ్ స్పందన ఆ పార్టీ అంతరంగాన్ని వెల్లడించింది.” కొంత మంది పార్టీ ప్రతినిధులు చేసిన ప్రకటనల వివాదాలు నరేంద్రమోడీకి కొత్తేమీ కాదు. దశాబ్దాల తరబడి అలాంటి బురద నుంచి బయటకు వచ్చారు. వాటిని తన రాజకీయాలకు అనువుగా మార్చుకోవటంలో ఆయన దిట్ట ” అని చెప్పారు. అందుకే నూపుర్ శర్మ మీద చర్య ఒక రాజకీయ ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.
బిజెపిలో నూపుర్ శర్మ అచిర కాలంలోనే రామబాణంలా దూసుకువచ్చి పార్టీలో ప్రముఖస్థానాన్ని పొందారు. అమిత్ షా ఆమెకు వెన్నుదన్నుగా ఉన్నారంటారు. ఆమె మాటలు నోటిదూల బాపతు, మాకు సంబంధం లేదని బిజెపి అనేసింది. ఆమె మాట్లాడిన మరుసటి రోజో రెండోరోజో ఆపని చేసి ఉంటే అదొకదారి. ముస్లిం దేశాలు తీవ్ర నిరసన తెలిపిన తరువాత చేశారు. సంతుష్టీకరణలో నరేంద్రమోడీ కూడా తక్కువ తినలేదని నిరూపించుకున్నారు. వసుదేవుడికే గాడిద కాళ్లు పట్టుకోక తప్పలేదంటారు కదా !
నోటి దూల మతోన్మాదశక్తులకు మాత్రమే కాదు. బాబరీ మసీదు వివాద సమయంలో ఉత్తరాది పత్రికలు కొన్ని అదే బాటలో నడవగా ఇప్పుడు కొన్ని టీవీ ఛానళ్లకూ పాకింది. ఇటీవలి ముస్లిం విద్వేష ప్రచారంలో చేర్చిన కొత్త అస్త్రం ముస్లింలు తమ దుకాణాలు, హౌటళ్లలో తయారు చేసే ఆహార పదార్ధాల మీద వారు ఉమ్మిన తరువాత విక్రయిస్తారంటూ ” థూక్ జిహాద్ ” పేరుతో ప్రచారం చేస్తున్నారు.అలాంటి ఒక నకిలీ వీడియోను తీసుకొని న్యూస్ 18 ఛానల్లో అమన్ శర్మ అనే యాంకర్ ఒక చర్చనే నడిపారు. దాన్ని చూసి హిందూ రక్షాదల్ పేరుతో ఉన్న వారు హనుమాన్ చాలీసా పఠనం పేరుతో కొన్ని ప్రాంతాల్లో మాంస దుకాణాలనే మూసివేయాలంటూ రోడ్లెక్కారు. టీవీ ఛానళ్ల తీరు తెన్నులను చూస్తే చర్చలను నిర్వహించే యాంకర్లు, మోడరేటర్లు తాము అభిమానించే పార్టీల ప్రతినిధులు, మతశక్తుల కంటే మరింతగా రెచ్చిపోతుండటం గమనించవచ్చు. కొన్ని ఛానళ్లలో అభిమాన పార్టీల మీద విమర్శలకు అవకాశం ఇవ్వరు. మొత్తంగా చూసినపుడు టీవీల రేటింగ్‌లు పెంచటమే వారి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మహమ్మద్ ప్రవక్త అయినా మరొక అంశమైనా వారికి కావాల్సింది తమ ఛానల్‌కు లాభం ఎంత అని మాత్రమే. తెలుగులో కొన్ని ఛానళ్లకు ఉన్న రంగుల గురించి, వాటిలో మాట్లాడే రంగుల విశ్లేషకుల గురించి తెలిసిందే. గతంలో ఛానళ్లు, పత్రికలతో రాజకీయ పార్టీలు, శక్తుల పాకేజ్‌ల గురించే తెలుసు ఇప్పుడు కొన్ని ప్రాంతీయ, జాతీయ ఛానళ్లలో విశ్లేషకులపేరుతో వచ్చే వారికి కూడా పాకేజ్‌లు ఉన్నాయంటున్నారు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లుగా కొందరు విశ్లేషకులకు, ఛానళ్లకు మినహాయింపు ఉందని మనవి.
పార్టీ ఒక్కటే కాదు చివరికి ప్రభుత్వం కూడా బిజెపి నేతలు మాట్లాడిన, ట్వీట్ చేసిన వాటిని నోటిదూల గలవారిగా వర్ణించింది. వారి మీద చర్యలు తీసుకున్నారు, ప్రభుత్వానికి సంబంధం లేదు అని విదేశాలను సంతృప్తిపరచేందుకు చూసింది. విద్వేష పూరితమైన, రెచ్చగొట్టేట్లు మాట్లాడకపోతే కొందరు జనానికి కిక్కు ఎక్కించలేని స్థితికి వచ్చారు.దాని ఫలితాలను చూస్తూనే ఉన్నాం. మధ్యప్రదేశ్‌లో మతిస్థిమితం సరిగా లేని భవర్‌లాల్ జైన్ అనే 65ఏండ్ల వ్యక్తి ఒక వివాహానికి వెళ్లి వస్తుండగా దారితప్పాడు. మూడు రోజుల తరువాత శవమైకనిపించాడు. కిక్కు ఎక్కిన దినేష్ కుష్వహా అనే బిజెపి కార్యకర్త సదరు వృద్దుడిని కొడుతూ నీ పేరేమిటి ? మహమ్మదేనా, ఆధార్‌కార్డు చూపు అంటూ మాట్లాడిన వీడియో ప్రచారంలోకి వచ్చింది. సదరు దినేష్ తమ పార్టీవాడేనని బిజెపి అంగీకరించగా, అతని భార్య బిజెపి మాజీ కార్పొరేటర్ అని పోలీసులు చెప్పారు. మూర్ఛరోగులమని మెడలో బిళ్లలు వేసుకొని తిరిగినట్లుగా ఇక ముందు ఎవరైనా – ఎందుకంటే అనేక మంది గడ్డాలు పెంచుతున్నారు గనుక – తమ పేరు, మతం, ఆధారకార్డు వివరాలను తగిలించుకొని తిరగకపోతే బిజెపి జనాలు అలాంటి వారిని ముస్లింలుగా పరిగణించి చావచితకకొడతారని భావించాల్సి వస్తోంది. ” దసరా సందర్భంగా హిందువులు రావణబొమ్మలను దహనం చేసినట్లుగా ముస్లింలను తగులబెట్టాలంటూ ” ఒకసారి, వారికి ఓటింగ్ హక్కు రద్దు చేయాలని, రెండవ తరగతి పౌరులుగా చూడాలని మరోసారి బీహార్ బిజెపి ఎంఎల్‌ఏ హరిభూషన్ ఠాకూర్ బచువల్ సెలవిచ్చారు.
అశ్వనీ ఉపాధ్యాయ బిజెపి నేత, సుప్రీం కోర్టు లాయర్ కూడా. ఉమ్మడి పౌరస్మృతి కావాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిపిన ప్రదర్శనలో ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసినందుకు అరెస్టు చేశారు.ముస్లింలను హతమార్చాలంటూ నినాదాలిచ్చినట్లు కేసు నమోదైంది. ఈ పెద్దమనిషి హరిద్వార్ ధర్మసంసద్‌గా పేరుమోసిన విద్వేష సభలో దర్శనమిచ్చినట్లు వార్తలు వచ్చాయి. మయన్మార్‌లో రోహింగ్యాలను హతమార్చినట్లుగా మన దేశంలో కూడా ముస్లింలను ఊచకోత కోయాలన్న ప్రసంగాలు ఆ సభలో అనేక మంది చేసిన సంగతి తెలిసిందే.హిందూత్వ ప్రభాకరన్‌గా మారే వారికి ఏడాదికి వంద కోట్లు ఇస్తానని యతి నరసింగానంద ప్రకటించారు.హిందూ మతానికి ముప్పుగా మారతారనే తలపు వచ్చినా వారిని సహించకూడదన్నారు. అతగాడి మీద వెంటనే కనీసం కేసు పెట్టలేదు, పెట్టిన తరువాత వెంటనే బెయిలు వచ్చింది. పూజా షుకున్ పాండే అనే హిందూ మహాసభ నాయకురాలు ” మనలో వంద మంది సిద్దమైనా సరే 20లక్షల మంది వారిని(ముస్లింలను) చంపి విజయంతో జైలుకు పోవచ్చు ” అని పిలుపునిచ్చారు.హిందూమతానికి ముప్పుగా పరిణమించిన వారి నుంచి మతరక్షణకు గాను ఏ విధంగానైనా సరే పూనుకోవాల్సిందే అని అదే సభలో ప్రతిజ్ఞ చేశారు.ఈ సభలోనే బిజెపి మహిళామోర్చా నేత ఉదిత త్యాగి ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఏ మయంకేశ్వర్ సింగ్ ఏమన్నాడో తెలుసా ” హిందూస్తాన్‌లోని హిందువులు గనుక మేలుకుంటే గడ్డాలను లాగి జడలుగా మార్చివేస్తారు. హిందూస్తాన్‌లో జీవించాలంటే రాధే రాధే అని చెప్పాలి, లేకపోతే దేశవిభజన సమయంలో మాదిరి పాకిస్తాన్ వెళ్లాలి, మీ వలన ఇక్కడ ప్రయోజనం లేదు ” అని మాట్లాడిన వీడియోలున్నాయి.
కర్ణాటకలోని కొడుగు జిల్లాలో భజరంగ్ దళ్ నిర్వహించిన ఆయుధ శిక్షణ శిబిరంలో ముగ్గురు బిజెపి ఎంఎల్‌ఏలు కెజి బోపయ్య, అప్పాచురంజన్, సుజా కుషాలప్ప ఉన్నారు.వారి మీద కేసు నమోదు చేసిన పోలీసు అధికారిని లోకాయక్త ఆఫీసుకు బదిలీ చేసి కసి తీర్చుకున్నారు.” తనకు ఓటు వేయని హిందువుల నరాల్లో ముస్లింల రక్తం ఉన్నట్లే. అలాంటి వాడు ద్రోహి, జైచంద్‌కు పుట్టినవాడే, హిందూ వ్యతిరేకులను నాశనం చేస్తా” అంటూ ఉత్తర ప్రదేశ్ బిజెపి ఎంఎల్‌ఏ రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ చెలరేగారు. ఇంకా ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు ముస్లింల మీద కూడా చేశారు. ఇలా చెప్పాలంటే అనేక నోటి దూల ఉదంతాలున్నాయి..వారిమీద ఎలాంటి చర్యలూ లేవు, వారివి దూల నోళ్లనీ చెప్పలేదు.నూపూర్ శర్మలో మాత్రమే నోటి దూల కనిపించింది. ద వైర్ పోర్టల్ నమోదు చేసిన వివరాల ప్రకారం 2021 అక్టోబరు నుంచి నాలుగు నెలల్లో ఆరు ఉత్తరాది రాష్ట్రాల్లో 89 ఉదంతాల్లో వివిధ సంస్థలకు చెందిన వారు విద్వేష ప్రసంగాలు చేసినట్లు తేలింది. వాస్తవానికి ఇంకా ఎక్కువే ఉంటాయి. అక్టోబరు నెలలో పండుగల తరుణంలో 29 విద్వేష నేరాలు జరగ్గా అవన్నీ ముస్లింలకు వ్యతిరేకంగా జరిగినవే. హర్యానాలో ముస్లింలు ప్రార్ధనలు చేసే స్థలంలో గోవర్ధన పూజల పేరుతో పోటీగా నిర్వహించారు. ప్రభుత్వ స్థలాల్లో నమాజ్ చేసుకొనేందుకు గతంలో అంగీకరించిన ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్ తరువాత రద్దు చేశారు. నవరాత్రుల పేరుతో మాంసం దుకాణాలను బందు చేశారు.
ధర్మ సంసద్ తరువాత సుదర్శన్ న్యూస్ అధినేత సురేష్ చవాణ్కే భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు అవసరమైతే పోరాడాలి, చావాలి, చంపాలి అని పిలుపునిచ్చాడు. నూతన పౌరసత్వ చట్టానికి నిరసనగా దేశంలో నిరసనలు తెలుపుతున్నవారి గురించి ఝార్ఖండ్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ ముస్లింల గురించి పరోక్షంగా మాట్లాడిందేమిటి ? ” అగ్గిని వ్యాపింప చేస్తున్నవారెవరో వారి దుస్తులను బట్టి గుర్తించవచ్చు ” అన్నారు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలను చెదపురుగులని, వారిని బంగాళాఖాతంలో కలపాలని అమిత్ షా బిజెపి అధ్యక్షుడిగా ఉన్నపుడు మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు 2020లో బిజెపి ఎంపీ పర్వేష్ వర్మ మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.” ఢిల్లీ పౌరులు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి.వారు(ముస్లింలు) మీ ఇండ్లలోకి వస్తారు, మీ సోదరి, కూతుళ్లను మానభంగం చేస్తారు.వారిని చంపివేయండి. మీకు ఇంకా వ్యవధి ఉంది. రేపు మిమ్మల్ని రక్షించేందుకు మోడీగారు, అమిత్ షా రారు.” 2014 ఎన్నికలకు ముందు ఫతేపూర్ బిజెపి ఎంపీగా ఉన్న నిరంజన్ జ్యోతి ఢిల్లీ సభలో మాట్లాడుతూ మీకు రాముడి సంతానం కావాలో జారుల సంతానపు ప్రభుత్వం కావాలో తేల్చుకోండి అని రెచ్చగొట్టారు. ఆమె తిరిగి 2019లో గెలిచారు. సాక్షి మహరాజ్ అనే మరోబిజెపి ఎంపీ 2015లో మాట్లాడుతూ ” ఇక్కడ నలుగురు భార్యలు-40 మంది సంతానాన్ని కనటం భారత్‌లో కుదరదు.అయితే హిందూమతాన్ని కాపాడేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు సంతానాన్ని కనాలి ” అన్నారు.
నూపూర్ శర్మ మాట్లాడింది తప్పే అంతమాత్రాన మానభంగం చేస్తామని, హతమారుస్తామని బెదిరించటం ఏమిటని చాలా మంది ఆందోళన్యక్తం చేస్తున్నారు. నిజమే చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదు, స్వంత చట్టాలను ముందుకు తేగూడదు. ఆమె నోటిదూల కారణంగా గుర్తుతెలియని సంస్థలు, వ్యక్తుల పేరుతో బెదిరింపులు వచ్చినట్లు చెబుతున్నారు. అవి నిజం కావచ్చు లేదా నకిలీవి కావచ్చు. పోలీసులు గుర్తు తెలియని వారి పేరుతోనే కేసు నమోదు చేశారు. కానీ ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో భజరంగ్ మునిదాస్ అనే ఒక ఆశ్రమ పెద్ద బహిరంగంగా ముస్లిం మహిళలను కిడ్నాప్ చేసి బహిరంగంగా మానభంగం చేయిస్తానంటూ వేసిన వీరంగం, దానికి పెద్ద ఎత్తున మద్దతు పలికి హర్షం వెల్లడించిన జనాలను చూస్తే దేశంలో ఎలాంటి శక్తులు చెలరేగుతున్నాయో, జనం ఎలా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఏప్రిల్ రెండవ తేదీన పోలీసుల కాపలాతో ఒక మసీదు ముందు రెచ్చగొట్టిన ఈ ప్రబుద్దుడి మీద కేసు నమోదు చేసేందుకు పోలీసులు కొన్ని వారాలు తీసుకున్నారు. నూపుర్ శర్మ మాదిరి ఏ ముస్లిం మహిళైనా నోరు పారవేసుకుంటే ఆమెను మానభంగం చేయిస్తానని ఎవరైనా అంటే అదొక తీరు, అది ఆధునిక హిందూ సంస్కృతి అని సరిపెట్టుకోవచ్చు. మొత్తం ముస్లిం మహిళలేమి తప్పుడు మాటలు మాట్లాడారు లేదా ఏ నేరం చేశారని మునిదాస్ నోరుపారవేసుకున్నట్లు ? బిజెపి నేత ఉమాభారతి మరొక అడుగు ముందుకు వేసి ” నూపుర్ శర్మను మా పార్టీ శిక్షించింది, అంతమాత్రాన ఆమెను తోడేళ్లకు అప్పగించలేము కదా ! ఆమెకు బెదిరింపులు మన దేశ సంస్కృతి కాదు ” అని చెప్పారు. మరి మునిదాస్ ప్రవర్తన గురించి, మొత్తం ముస్లింలనే అంతం చేయాలనే ధర్మ సంసద్ ప్రబోధకులను ఆమె ఎందుకు ఖండించలేదు ? అప్పుడు సంస్కృతి గుర్తుకు రాలేదా ?
నూపూర్‌శర్మ చిల్లర మాటల తరువాత సామాజిక మాధ్యమంలో సరికొత్త ప్రచారం మొదలైంది. ఆమె మాటలకు నిరసన తెలిపిన దేశాల్లో కతార్ ఒకటి. పట్టుమని ముఫ్పైలక్షల జనాభా కూడా లేని ఒక చిన్న దేశం మనకు పాఠాలు చెప్పటమా అని దురహంకారంతో కొందరు రెచ్చగొడుతున్నారు. చిన్నదా పెద్దదా అని కాదు దేశమా కాదా అన్నదే గీటు రాయి. మరి అంత చిన్న దేశమైతే నరేంద్రమోడీ సర్కార్ అంత పెద్ద సంజాయిషీ ఎందుకు ఇచ్చుకున్నట్లు ? ఆ కతార్‌లోనే ఆప్ఘన్‌తాలిబాన్లతో తెరచాటు మంతనాలు ఎందుకు జరిపినట్లు ? రాజీకుదర్చమని ఎందుకు ప్రాధేయపడినట్లు ? అసలు కథనడిపింది కతార్ కాదు, దాని వెనుక అమెరికా ఉంది అంటూ వాట్సాప్ పండితులు ప్రచారం మొదలు పెట్టారు. ఎందుకటా ఉక్రెయిను వివాదంలో అమెరికా మాట విననందుకట. అలాంటపుడు అదే అమెరికా నేతలు అంతకు ముందు తనను అవమానించినా, అబద్దాలు చెప్పినా కిమ్మనకుండా చెట్టపట్టాలేసుకొని తిరిగేందుకు విశ్వగురువు అంటున్న నరేంద్రమోడీ ఎందుకు తహతహలాడుతున్నట్లు ? ఇంత రచ్చ జరిగినా నోరు ఎందుకు విప్పటం లేదు, అమెరికా అంటే భయమా, ఏమిటీ బలహీనత ? దేశంలోని 70-80శాతం గోరక్షకులు నకిలీలని నరేంద్రమోడీ వ్యాఖ్యానించిన ఉదంతం తెలిసిందే.2016 జూలై, ఆగస్టు నెలల్లో గో రక్షకులుగా అవతారమెత్తిన వారు కొందరు దళితుల మీద జరిపిన దాడులతో వారెక్కడ పార్టీకి దూరమౌతారో అన్న భయంతో అప్పుడు అలా మాట్లాడారు. ఇప్పుడు దేశమంతటా చర్చకు తెరలేపి, ముస్లిం దేశాల్లో తలెత్తిన నిరసనకు కారణమైన పార్టీ నేతల వ్యాఖ్యల మీద మౌనం దాలుస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఎవరి గురించీ నోరు విప్పలేదు. నూపూర్ శర్మ మాటల వలన కొత్తగా దూరమయ్యే ఓటర్లు లేరు, తాత్కాలికంగా తలెత్తిన నిరసన సద్దుమణిగిన తరువాత ముస్లిం విద్వేషాన్ని తలకు ఎక్కించుకున్నవారు మరింత గట్టి మద్దతుదార్లుగా మారతారనే ఎత్తుగడతోనే ఈ మౌనమా ! రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ! గత ఎనిమిది సంవత్సరాల్లో ఎందరికి సాధికారత వచ్చిందో లేదో తెలియదు గానీ చిల్లరగాళ్లు చెలరేగటాన్ని బట్టి వారికి వచ్చిందని చెప్పవచ్చు. బిజెపి సర్కార్ లేదా మేథావులు ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో ఫ్రింజ్ అనే పదానికి కొత్త అర్ధాన్ని చేరిస్తే తప్ప అప్పటి వరకు ఇలాంటి వారందరినీ చిల్లర, నోటి దూలగాళ్లుగానే భావించాల్సి ఉంటుంది.