Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


తనకు ఎదురులేదని ప్రపంచం ముందు కనిపించేందుకు అమెరికా పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. అనేక చోట్ల తగులుతున్న ఎదురుదెబ్బలు అంతరంగంలో అమెరికా పాలకవర్గాన్ని ఉక్కిరిబిక్కిరి ఆడకుండా చేస్తున్నాయి. 2022 జూన్‌ ఆరు నుంచి పదవ తేదీ వరకు అమెరికాలోని లాస్‌ ఏంజల్స్‌ నగరంలో అమెరికా దేశాల తొమ్మిదవ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దక్షిణ(లాటిన్‌) అమెరికా తన వెనుకే ఉందని చెప్పుకునేందుకు చూసిన బైడెన్‌ యంత్రాంగానికి చివరికి భంగపాటే మిగిలింది. శిఖరాగ్ర సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెజ్‌ మాన్యుయల్‌ లోపెజ్‌ ఒబ్రాడర్‌ చేసిన ప్రకటన అమెరికా ఒక చెంపను వాయిస్తే సమావేశానికి హాజరైన అర్జెంటీనా అధ్యక్షుడు మరో చెంప వాయించినట్లు మాట్లాడాడు.” కచ్చితంగా భిన్నమైన అమెరికా దేశాల శిఖరాగ్ర సమావేశం జరగాలని మనం కోరుకుంటాం.హాజరుగాని వారి మౌనం మనల్ని సవాలు చేస్తున్నది. కాబట్టి మరోసారి ఇలా జరగకూడదు. నేను ఒకటి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. భవిష్యత్‌లో జరిగే సమావేశాలకు ఆతిధ్యం ఇచ్చే దేశాలకు మన ఖండంలోని సభ్య దేశాల హాజరుపై ఆంక్షలు విధించేే అధికారాన్ని ఇవ్వకూడదు.” అని అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ చెప్పారు. లాటిన్‌ అమెరికా కరీబియన్‌ దేశాల సంస్థ(సిఇఎల్‌ఏసి) ప్రోటెమ్‌ అధ్యక్షుడిగా కూడా ఫెర్నాండెజ్‌ పని చేస్తున్నాడు.లోపెజ్‌ బాటలో బొలీవియా, హొండురాస్‌, గౌతమాలా, సెంట్‌ విన్సెంట్‌, గ్రెనడా దేశాధినేతలు నడిచారు.ఎల్‌ సాల్వడార్‌, ఉరుగ్వే నేతలు కూడా ఇతర కారణాలతో పాల్గొనలేదు.


ఇదంతా లాస్‌ ఏంజల్స్‌ సమావేశానికి క్యూబా, వెనెజులా, నికరాగువా నియంతృత్వదేశాలంటూ వాటిని ఆహ్వానించరాదన్న అమెరికా నిర్ణయానికి నిరసనే. ఈ సమావేశం ద్వారా అమెరికా సాధించదలచుకున్న లక్ష్యం ఏదైనప్పటికీ సమావేశ వేదిక మీద, వెలుపలా జరిగిన పరిణామాలు మరోసారి అమెరికా నలుగురి నోళ్లలో నానింది. ప్రత్యేకించి అమెరికా ఖండ దేశాలలో పెద్ద చర్చకు దోహదం చేసింది. దాని ద్వంద్వనీతిని బయట పెట్టింది. ఇంకేమాత్రం తమ మీద అమెరికా ఆధిపత్యం చెల్లదని లాటిన్‌ అమెరికా దేశాలు చెప్పకనే చెప్పటమే. అమెరికా పలుకుబడి బండారం ఇతర చోట్ల కూడా మరింతగా జనానికి తెలియచేసే పరిణామమిది. నిన్న ఆఫ్ఘనిస్తాన్‌, నేటి ఉక్రెయిన్‌ సంక్షోభం అమెరికా బలహీనతలను, దాన్ని నమ్ముకుంటే నట్టేట మునగటమే అన్న పాఠం నేర్పింది.1994లో అమెరికాలోనే జరిగిన ఈ సంస్థ సమావేశాలతో పోల్చుకుంటే తాజా పరిణామాలు ఆ ప్రాంతంలో జరిగిన పెద్ద మార్పును సూచిస్తున్నాయి.


ఇటీవలి కాలంలో అమెరికా దేశాల సంస్థ(ఓఎఎస్‌) పని తీరు తీవ్ర విమర్శలకు గురువుతోంది. అది పశ్చిమార్ధగోళంలో కేవలం అమెరికా ప్రయోజనాలను కాపాడే ఒక పని ముట్టుగా మారిందన్నది స్పష్టం. అమెరికాతో పాటు ఈ సమావేశాల్లో ఓఎఎస్‌ కూడా తీవ్ర విమర్శలకు గురైంది. బొలీవియాలో ఎన్నికైన ఇవోమొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసి, తిరుగుబాటునేత జెనీనె ఆనెజ్‌ను అధ్యక్షురాలిగా చేశారు.(ఇప్పుడు ఆమె నేరంపై విచారణ జరుగుతున్నది) దానికి ఆమెరికా దేశాల సంస్థ (ఓఎఎస్‌) మద్దతు ప్రకటించింది. ఈ దుర్మార్గానికి అండగా నిలవటంతో పాటు బొలీవియాలోని సంకేత, సకాబా ప్రాంతాల్లో ఆనెజ్‌ ఏలుబడిలో జరిగిన మారణకాండ గురించి మౌనం దాల్చిన సంస్థ ప్రధాన కార్యదర్శి లూయిస్‌ అలమగ్రో పదవిలో కొనసాగటం ఏమిటని కొందరు ప్రతినిధులు లేవనెత్తినపుడు అతగాడికి కంటిచూపు తప్ప నోట మాట లేదు. మూడు దేశాలను ప్రజాస్వామ్యం పేరుతో మినహాయించి హైతీలో మాజీ అధ్యక్షుడు జువనెల్‌ మోషే హత్య కుట్రలో భాగస్వామిగా ఉన్న ఏరియల్‌ హెన్రీ, కొలంబియాలో ప్రతిపక్షాలను ఊచకోత కోయిస్తున్న ఇవాన్‌ డూక్‌ను మానవహక్కుల పరిరక్షకులుగా ఫోజు పెడుతున్న అమెరికా ఎలా ఆహ్వానించిందని కొందరు ప్రశ్నించారు. క్యూబా, వెనెజులా, నికరాగువా దేశాల ప్రభుత్వ నేతలను మినహాయించిన అమెరికా ఆ దేశాల ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసిన వారిని, అమెరికా ఇచ్చిన నిధులతో వివిధ సంస్థల పేరుతో అమెరికా వ్యతిరేక ప్రభుత్వాల మీద ధ్వజమెత్తే వారిని ఈ సమావేశాలకు ఆహ్వానించింది. మరొక సభ్య దేశం గురించి తీర్పులు చెప్పే అధికారం ఏ దేశానికైనా ఎవరిచ్చారని అనేక దేశాల ప్రతినిధులు ప్రశ్నించారు. మూడు దేశాలను మినహాయించటాన్ని ఖండిస్తూ ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. అమెరికా దేశాల సంస్థను సంస్కరించాలని కోరారు. అనేక మంది కరీబియన్‌ దేశాధినేతలతో పాటు బెల్జి, అర్జెంటీనా, చిలీ అధినేతలు కూడా ఇదే అభిప్రాయాలను ప్రతిధ్వనించారు.


మూడు దేశాలను ఆహ్వానించకపోవటానికి 2001లో లిమాలో జరిగిన అమెరికా ఖండ దేశాల సమావేశం ఆమోదించిన ఆర్టికల్‌ 19ని సాకుగా చూపారు. ప్రపంచ అర్ధగోళంలోని దేశాల్లో ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థలకు ఆటంకం కలిగించటానికి లేదా రాజ్యాంగ వ్యతిరేకంగా మార్చేందుకు పూనుకున్న దేశాలకు భవిష్యత్‌లో జరిగే అమెరికా ఖండ దేశాల సమావేశాల్లో పాల్గొనేందుకు అర్హత ఉండదన్నది దాని సారం. బొలీవియాలో రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ఇవోమొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసింది అమెరికా. వెనెజులా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే సాకుతో ప్రతిపక్ష నేత ప్రభుత్వాన్ని గుర్తించి అక్రమాలకు పాల్పడింది అమెరికా. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు సమావేశాన్ని నిర్వహించేందుకే దానికి అర్హత లేదు. సరిగ్గా సమావేశానికి ఒక రోజు ముందు క్యూబా, వెనెజులా, నికరాగువాలను మినహాయించినట్లు ప్రకటించటం ఆమెరికాలో స్థిరపడిన ఆ దేశాలకు చెందిన, అమెరికా ఖండదేశాల్లోని వామపక్ష వ్యతిరేకశక్తులను సంతుష్టీకరించటం తప్ప మరొకటి కాదు.


అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోని 42దేశాల్లో నివసించే మూడోవంతు జనాభాపై చట్టవిరుద్దమైన ఆంక్షలను అమలు జరుపుతున్న అపర ప్రజాస్వామిక వాది. తనకు నచ్చని ప్రభుత్వాలను ఆ దేశాల పౌరులతోనే కూల్చివేయించే ఎత్తుగడ దీని వెనుక ఉంది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో వెనెజులా మీద, తాజాగా రష్యా మీద ఆంక్షలను మరింతగా పెంచటం దానిలో భాగమే. దశాబ్దాల తరబడి క్యూబాను దిగ్బంధనానికి గురిచేసినా,వెనెజులా, నికరాగువా వంటి చోట్ల ప్రతిరోజూ కుట్రలు చేసినా దాని ఎత్తుగడలు ఎక్కడా పారలేదన్నది కూడా వాస్తవం. గతంలో ఆఫ్ఘనిస్తాన్‌, వెనెజులా, ఇప్పుడు రష్యాలకు చెందిన విదేశాల్లోని ఆస్తులు, బంగారం వంటి వాటిని స్వాధీనం లేదా స్థంభింప చేసిన తరువాత అమెరికా ఆంక్షలకు గురైన దేశాలన్నీ అమెరికా డాలరుతో సంబంధం లేని లావాదేవీల కోసం చూడటం పెరుగుతోంది తప్ప అమెరికాకు లొంగటం లేదు. ఉక్రెయిన్‌పై దాడి చేస్తోందనే పేరుతో ఐరాస మానవహక్కుల సంస్థలో రష్యాకు స్థానం కల్పించకూడదనే అమెరికా తీర్మానానికి అనుకూలంగా 92 ఓట్లు వస్తే తటస్థం లేదా వ్యతిరేకంగా 13 అమెరికా దేశాలతో సహా 82 దేశాలున్నాయి. జనాభా రీత్యా చూస్తే అత్యధికులు ఈ దేశాల్లోనే ఉన్నారు.
లాస్‌ ఏంజల్స్‌ సమావేశానికి మూడు దేశాలను ఆహ్వానించకూడదన్న అమెరికా ఆలోచనలను ముందే పసిగట్టిన మెక్సికో అధినేత లోపెజ్‌ అదే జరిగితే తాను వచ్చేది లేదని ముందుగానే స్పష్టం చేశాడు. గత కొద్ది నెలలుగా బుజ్జగించేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. దీన్ని మరొక విధంగా చెప్పాలంటే లాటిన్‌ అమెరికాలో బలపడుతున్న పురోగామి శక్తుల బంధాన్ని వెల్లడించింది. లాటిన్‌ అమెరికాలో గత రెండు దశాబ్దాల్లో ఎగురుతున్న ఎర్రబావుటాల వాస్తవాన్ని గుర్తించేందుకు అమెరికా నిరాకరిస్తున్నది. గత మొరటు పద్దతులతోనే తన పెత్తనాన్ని సాగించాలని విఫలయత్నం చేస్తున్నది. వెనెజులాలో తన కుట్రలు విఫలమైన తరువాత ప్రతిపక్షనేత జువాన్‌ గుయిడో ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వాన్ని గుర్తించిన ట్రంప్‌ అవసరమైతే దాడులకు సైతం తెగబడతానన్న ప్రేలాపనలతో ఊగిపోయాడు. ప్రస్తుత బైడెన్‌ అలా నోరుపారవేసుకోకపోయినా అదేబాటలో నడుస్తున్నాడు. మదురోను తిరస్కరించినా గుర్తించిన జువాన్‌ గుయిడోను ఆహ్వానించే సాహసం చేయలేకపోయాడు.


వామపక్ష శక్తులు అనేక చోట్ల అధికారానికి వస్తుండటం, తాము బలపరిచిన మితవాద శక్తులను జనాలు తిరస్కరిస్తుండటాన్ని గమనించిన తరువాత అక్కడి పరిణామాలు అమెరికన్లకు మింగుడుపడటం లేదు,వామపక్షాలను ఎలా ఎదుర్కోవాలో దానికి తోచటం లేదు. తాజాగా కొలంబియా ఎన్నికల్లో కూడా మితవాదశక్తులకే అమెరికా మద్దతు ఇచ్చింది. అమెరికా-మెక్సికో సరిహద్దు నుంచి వలస వచ్చే వారిని అడ్డుకొనేందుకు అడ్డుగోడ నిర్మాణంతో సహా ట్రంప్‌ తీసుకున్న చర్యలన్నింటినీ బైడెన్‌ కూడా కొనసాగిస్తున్నాడు. అమెరికా ఖండదేశాల మధ్య వలసలు ఒక ప్రధాన సమస్యగా ఉంది. ఇలాంటి వాటిని చర్చించేందుకు ఏర్పాటు చేసిన శిఖరాగ్రసభకు అన్ని దేశాల నేతలు వచ్చినపుడే కొంతమేరకు పరిష్కారం దొరుకుతుంది. అమెరికాకు మెక్సికో, గౌతమాలా, ఎల్‌సాల్వడార్‌, హొండురాస్‌ నుంచి పెద్ద ఎత్తున వలసలు వస్తారు. ఈ దేశాలనేతలెవరూ లేకుండానే సమావేశాలు ముగిశాయి.


అమెరికా ఏకపక్ష, నిరంకుశ నిర్ణయాలు, వైఖరిని నిరసిస్తూ లాస్‌ ఏంజల్స్‌లో జరిగిన అమెరికా దేశాల తొమ్మిదవ శిఖరాగ్ర సమావేశానికి పోటీగా అదే తేదీల్లో అదే నగరంలో వివిధ దేశాలకు చెందిన పలు సంస్థలు, ఉద్యమాల ప్రతినిధులతో పోటీగా ” ప్రజాస్వామ్యం కోసం ప్రజాశిఖరాగ్ర సమావేశాలు ” జరిగాయి. వివిధ అంశాలను చర్చించటంతో పాటు అమెరికా వైఖరికి నిరసనగా ప్రదర్శనలు కూడా చేశారు. జూన్‌ 10 నుంచి 12వ తేదీ వరకు మెక్సికోలోని తిజువానాలో కార్మికుల శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో కూడా వివిధ దేశాలకు చెందిన వారితో పాటు అమెరికా వీసాలు నిరాకరించిన క్యూబా, వెనెజులా, నికరాగువా తదితర దేశాల ప్రతినిధులు ఇక్కడ పాల్గన్నారు. రెండు సమావేశాల్లో అమెరికా నిరంకుశ పోకడలతో పాటు వాటికి వ్యతిరేకంగా ప్రజలను ఎలా సమీకరించాలో కూడా చర్చించారు. అమెరికా ఖండాల ప్రజలందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. లాస్‌ ఏంజల్స్‌ సమావేశాల్లో భౌతికంగా, ఆన్‌లైన్‌లో 250 సంస్థలకు చెందిన వారు భాగస్వాములైనారు. ఈ సమావేశాలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అధికారిక సమావేశం జరిగే ప్రాంతం చుట్టూ కంచెవేసి నిరసనకారులను అడ్డుకున్నారు. నగరంలోని ఒక కాలేజీలో వేదికను ఏర్పాటు చేసుకొని వివిధ అంశాలపై ప్రజాసంస్థలు చర్చలు జరిపాయి. అమెరికా పెత్తందారీ పోకడలకు గురవుతున్న దేశాలకు బాసటగా నిలుస్తామని దీక్ష పూనాయి.