Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


పెట్రోలు, డీజిలు మీద వందల రెట్లు పన్నులు పెంచి ఇదంతా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చేందుకే అని చెబితే నిజమే కదా అనుకొని మాట్లాడకుండా అంగీకరించారు వారు. నరేంద్రమోడీ మీద ఏర్పడిన నమ్మకం అది.
పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనం రద్దు, ఉగ్రవాదులకు నిధులు చేరకుండా చూస్తున్నామని చెబితే నోట్ల మార్పిడి కోసం పనులు మానుకొని బాంకుల ముందు వరుసల్లో నిలుచోవటం దేశభక్తి అని భావించారు. ఇదేమిటన్న వారిని ఎంతో అనుభవం ఉన్న నరేంద్రమోడీ అంత తెలివితక్కువ పని చేస్తారా అని ఎదురు ప్రశ్నించారు.
రైతుల కోసం తెచ్చామని చెప్పిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా కర్షకులు ఉద్యమించినపుడు మనం కర్షకులం కాదు కదా అని వారు ప్రేక్షక పాత్ర వహించారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని మోడీ సర్కార్‌ మోసం చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తే, అధికారంలో ఉండగా వారు చేసిందీ అదే కదా ఎవరైనా అంతే అని పెదవి విరిచారు. మోడీ సర్కార్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నైపుణ్య అభివృద్ది పధకంతో మంచి ఉద్యోగాలు వస్తాయి, ప్రపంచంలోనే ఉత్తమ నిపుణులుగా తయారవుతామని డాలర్‌ కలలు కన్నారు. ఎక్కడా అలాంటి జాడలు లేవు.
నాలుగుదశాబ్దాలల్లో ఎన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగులు పెరిగారన్న వార్తలు రాగానే అబ్బెఅబ్బె లెక్కలన్నీ తప్పు, సరిగా వేయలేదు, పకోడీల బండి పెట్టుకున్నవారికి కూడా ఉపాధికల్పించినట్లే కదా అని నరేంద్రమోడీ అన్నపుడు ఇదేదో తేడా కొడుతోంది అనుకున్నారు తప్ప మరొక రకంగా ఆలోచించలేదు. ఇప్పుడు మూడేండ్ల నాటి కంటే నిరుద్యోగం ఇంకా పెరిగింది.
అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మనెంటు చేయాలని వారు రోడ్ల మీదకు వస్తే మనకేమిటి సంబంధం, అసలు పనే లేదు కదా, మనవంతు వచ్చినపుడు చూసుకుందాంలే అని పక్కన నిలబడి చూశారు వారు. ఇప్పుడు మిలిటరీలో కూడా వాటికి తెరలేపారు.
ఎన్‌పిఎస్‌(నూతన పెన్షన్‌ ) కాదు ఓపిఎస్‌(పాత పెన్షన్‌ ) కావాలని ఉద్యోగులు ఆందోళన చేస్తే వారికి ఏదో ఒక పెన్షన్‌ ఉంది. మాకసలు ఏ ఉద్యోగమూ లేదు కదా అని పట్టించుకోలేదు వారు. ఇప్పుడు మిలిటరీలో చేరినా మూడో వంతు మందికి ఉద్యోగమూ ఉండదు, నాలుగేండ్ల సర్వీసుకు పెన్షనూ ఉండదు.
ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తుంటే, తెగనమ్ముతుంటే మనకు పోతున్నదేమీ లేదు, నష్టాలు వచ్చే వాటిని అమ్మితే మంచిదే కదా అనుకున్నారు. ఇలా దేశంలో ఏం జరుగుతున్నా స్పందించకుండా పాలకుల మీద ఆశ, భ్రమలతో తమ కెరీరే ముఖ్యంగా బతుకుతున్న వారు ఎక్కడ చూసినా కనిపిస్తారు. ఇప్పుడు ఏ క్షణంలోనైనా ఎత్తివేసే ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో సర్దుబాటు చేస్తామని నమ్మబలుకుతున్నారు.


దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. ఇంట్లో పరువు పోతోంది, బతుకుతెరువు కోసం ఏదో ఒక ఉద్యోగం అని చూస్తే ఎక్కడా పర్మనెంటులేదు, దొరికిన పనికి సరైన వేతనమూ లేదు. గొర్రెతోక బెత్తెడు. జుమాటో, స్విగ్గీ వంటి గిగ్‌ ఉపాధే గతి,ఐనా ఆత్మగౌరవం కోసం తప్పుదనుకున్నారు. అప్రెంటిస్‌ పేరుతో ఏండ్ల తరబడి పర్మనెంటు పని చేయిస్తున్నా కలిసి రాలేదు లేదా మన ఖర్మ అనుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను నింపరు, వాటి మీద ఆశలు వదులుకోవాల్సిందే, దగా దగా కుడి ఎడమల దగా అన్న నిరాశలో కూరుకుపోయారు తప్ప రోడ్లెక్కలేదు. సరిగ్గా అటువంటి స్థితిలో కరోనా వచ్చింది. ఎవరూ ఏమీ చేయలేం కదా అని సరిపెట్టుకున్నారు. రెండు సంవత్సరాలుగా మిలిటరీ రిక్రూట్‌మెంట్లు లేవు. అర్హత పరీక్షలు కొన్ని పూర్తి చేసుకొని చివరి పరీక్ష, నియామకాల కోసం ఎన్నో ఆశలతో ఈ ఏడాది వాటికి సిద్దమౌతున్న స్థితిలో…….. అగ్నిపథ్‌ పేరుతో చివరికి మిలిటరీలో కూడా తాత్కాలిక ఉద్యోగాలకు తెరలేపటం అగ్గిమీద గుగ్గిలం వేసినట్లయింది. ఏటా లక్షల మందిని మిలిటరీలో చేర్చుకోరు. పరిమితమే కావచ్చుగానీ ఎన్నో ఆశలతో ఉన్నవారికి ఇది ఆశనిపాతంగా మారటంతో ఒక్కసారిగా కడుపు మండి వీధుల్లోకి వచ్చి అగ్గివీరులుగా మారారు.మిలిటరీ అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్దం కావటమే, అలాంటి తమను కాంటాక్టు సైనికులుగా మారుస్తామనే సరికి రక్తం సలసలా కాగింది.


మరిగే నీరు వంద డిగ్రీల వేడెక్కిన తరువాతే ఆవిరిగా కొత్త రూపం సంతరించుకుంటుంది. అంటే దాని అర్ధం అప్పటివరకు నీటిలో మార్పేమీ జరగలేదని కాదు. వెలుపలికి కనిపించదు. గుణాత్మక మార్పుల తరువాత పరిణామాత్మక మార్పు సంభవిస్తుంది. మంచి రోజులు తెస్తామన్న పాలకుల మాటలు నమ్మి అవి జుమ్లా అని అర్ధం అవుతున్నా దేశంలో సంవత్సరాల తరబడి అసంతృప్తి పేరుకు పోయిన యువతలో అలాంటి మార్పు ఇప్పుడు కనిపిస్తోందని చెప్పవచ్చు. 2022 జూన్‌ 14న అగ్నిపథ్‌ పధకానికి రక్షణ వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిసింది. ఆ మరుసటి రోజున జెడి(యు) – బిజెపి పాలిత బీహారులో ప్రారంభమైన ఆందోళన దేశంలోని అనేక రాష్ట్రాలకు విస్తరించింది. అనేక చోట్ల ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. శుక్రవారం నాడు సికిందరాబాదులో కాల్పులకు దారితీసి ఒకరిని బలిగొన్నది. శనివారం నాడు బీహార్‌లో బంద్‌కు పిలుపునిచ్చారు. విస్తరిస్తున్న ఆందోళనను నీరుగార్చేందుకు గత రెండు సంవత్సరాలుగా ఎంపికలు లేవు గనుక ఈ ఒక్క ఏడాదికి గరిష్ట వయస్సు పరిమితిని 21 నుంచి 23 సంవత్సరాలకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. సిఆర్‌పిఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌లో పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తామని శనివారం నాడు మరొక ప్రకటన చేశారు. అసలు ఈ పధకమే వద్దు అంటుంటే ఈ బుజ్జగింపులతో జోకొట్టాలని చూస్తున్నారు. ఈ రెండు బిస్కెట్లు కాకుండా ఇంకా ఏమైనా వేస్తారేమో చెప్పలేము.


ఏండ్ల తరబడి ఖాళీగా ఉంచిన పదిలక్షల కేంద్ర ప్రభుత్వ పోస్టులను భర్తీ చేసేందుకు పూనుకున్నట్లు ప్రకటన వెలువరించటం, తరువాత అగ్నిపథ్‌ స్కీమును ప్రకటించటం ఒక ఎత్తుగడతో చేసిందే అన్నది స్పష్టం. చేదు మాత్రను మింగించటానికి పంచదార పూత పూసినట్లుగా పదిలక్షల ఖాళీల భర్తీ ప్రకటనగా భావించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పోస్టుల భర్తీ ఎంత ప్రహసనంగా ఉందో మిగతా చోట్ల దానికి భిన్నంగా ఉంటుందని అనుకోలేము. అందుకే పదిలక్షల పోస్టుల ప్రకటన నిరుద్యోగుల్లో పెద్ద స్పందన కలిగించలేదన్నది స్పష్టం. అది ఎంతకాలానికి నెరవేరుతుందో ఈ లోగా ఎన్ని లక్షల పోస్టులు ఖాళీ అవుతాయో చెప్పలేము.
ఏడాదికి పైగా సాగిన రైతు ఉద్యమాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. దాని వెనుక ఖలిస్తానీ ఉగ్రవాదులు, కమిషన్‌ ఏజంట్లు ఉన్నారని తప్పుడు ప్రచారం చేసినట్లుగానే అగ్నిపథ పధకాన్ని వ్యతిరేకిస్తున్న వారి వెనుక ప్రతిపక్షాలున్నట్లు అప్పుడే ప్రచారం ప్రారంభించారు. రైతు ఉద్యమం కొన్ని ప్రాంతాలు, రాష్ట్రాలకే పరిమితం కాగా ఇది దేశమంతటా తలెత్తింది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ వ్యవస్థలో అడితీదార్లు లేదా కమిషన్‌ ఏజంట్లను ఏ పార్టీ కూడా సమర్ధించలేదు. రైతులు ఢిల్లీలో ఏడాదిపాటు తిష్టవేస్తే దానివెనుక వారి పాత్ర ఉందంటూ బిజెపి, గోడీ మీడియాతో సహా దాని మద్దతుదార్లు పెద్ద చర్చ పేరుతో రచ్చ చేశారు. విధిలేక క్షమాపణలు చెప్పి మరీ సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నారు మంచిదే, మరి సదరు ఏజంట్లను ఇంకా కేంద్ర ప్రభుత్వం అలాగే ఎందుకు కొనసాగిస్తున్నట్లు ? వారిని తొలగించవద్దని ఏ రైతు సంఘమూ కోరలేదే ! సాగు చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధరలకు చట్టబద్దత గురించి పరిశీలించేందుకు ఒక కమిటీని వేస్తామన్నారు, దాని గురించి ఊసేలేదు. రైతుల మాదిరి మోసపోయేందుకు కుర్రకారు రైతులు కాదని ప్రారంభంలోనే స్పష్టం చేశారు. ఇది ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేము. నిప్పుతో చెలగాటాలాడని నరేంద్రమోడీ సర్కార్‌ సిద్దపడుతోందా ?


ఈ పధకాన్ని ఎందుకు తెచ్చారన్నది ప్రశ్న. తక్కువ వేతనాలతో ప్రయివేటు స్కూళ్లలో పని చేసేందుకు టీచర్లు దొరుకుతున్నపుడు ఎక్కువ వేతనాలిచ్చి ప్రభుత్వం ఎందుకు నియమించాలన్న ప్రపంచబాంకును సంతృప్తి పరచేందుకు స్కూళ్లలో విద్యావలంటీర్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రైల్వేల వంటి చోట్ల పాక్షిక ప్రయివేటీకరణ, రిటైరైన సిబ్బంది నియామకాలు, వివిధ శాఖల్లో పొరుగుసేవలు, కాంట్రాక్టు సిబ్బంది, అప్రెంటిస్‌ వంటివన్నీ ప్రపంచ బాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాల ఫలితమే. వేతనాలు, అలవెన్సులు, సామాజిక భద్రతా పధకాల ఖర్చు లేకుండా చేసేందుకే ఇదంతా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖకు సైతం వర్తింపచేసి సైనికుల పెన్షన్‌ బిల్లును తగ్గించుకొనేందుకు నాలుగేండ్ల పాటు పని చేసే నియామకాలకు శ్రీకారం చుట్టింది.


2014 లోక్‌సభ ఎన్నికల తరుణంలో మాజీ సైనికులు, సర్వీసులో ఉన్న వారి కుటుంబాల ఓట్లు పొందేందుకు ఒకే రాంకు-ఒకే పెన్షన్‌ వంటి వాగ్దానాల సంగతి తెలిసిందే. ఇప్పుడు నాలుగేండ్ల సర్వీసుతో అలాంటి రాంకులు ఉండవు-అసలు పెన్షనే ఉండదు. ఈ పధకంలో చేరిన వారిలో 25శాతం మందిని ప్రతిభ ఆధారంగా పర్మనెంటు చేస్తారట. అంటే శిక్షణ ముగిసిన దగ్గర నుంచి తన తోటివారిని ఎలా వెనక్కు నెట్టి తాను పర్మనెంటు ఎలా కావాలా అన్న తపన తప్ప వారిలో మరొకటి ఉంటుందా ? బుట్టలో తవుడు పోసి కుక్కలను ఉసికొల్పినట్లుగా ఉండదా ! ఇప్పటికే సివిల్‌ సిబ్బందిలో ప్రమోషన్లు, మంచి పోస్టులు, స్థలాల కోసం ఎలాంటి అవాంఛనీయపోటీ, అక్రమాలకు పాల్పడుతున్నారో తెలిసిందే. రేపటి నుంచి అదే మిలిటరీలో పునరావృతం కాదనే హామీ ఏముంటుంది.


నాలుగేండ్ల సర్వీసులో చేరి వెలుపలికి వచ్చిన వారికి సిఆర్‌పిఎఫ్‌ వంటి పారామిలిటరీలో చేరేందుకు తిరిగి ఫిట్‌నెస్‌ పరీక్ష పెట్టి చేర్చుకుంటారని నమ్మబలుకుతున్నారు. ఈ బిస్కెట్లన్నీ ఎందుకు ? కొనసాగింపుగా వారిని తరువాత పారామిలిటరీ, ఇతర భద్రతా సంస్థల్లో, ఏ రాష్ట్రానికి చెందిన వారిని ఆ రాష్ట్రాల సాయుధ బలగాల్లో చేరుస్తామని చెబితే గొడవే ఉండదు. రాష్ట్రాలకు శిక్షణా భారం తప్పుతుంది. వెంటనే విధుల్లోకి వచ్చే సిబ్బంది దొరుకుతారు కదా ! ఆ విధంగా వివిధ విభాగాల్లో పర్మనెంటుగా నియమిస్తామని, వారి పెన్షన్‌కు ఢోకా ఉండదని ముందుగానే హామీ ఇస్తే ఇంత జరిగేది కాదు కదా ? ఆర్మీలో ఒకసారి చేరిన తరువాత నిరంతరం ఫిట్‌నెస్‌ ఉండేందుకు చూస్తారు, తిరిగి పారామిలిటరీకి పరీక్ష ఎందుకు ? అందుకే ఇవన్నీ తప్పుదారి పట్టించే వాదనలు. దీనికి ఎలాంటి ప్రతిఘటన లేకపోతే తరువాత వంతు సిఆర్‌పిఎఫ్‌ వంటి పారామిలిటరీ, ఇతర దళాలకు దీన్ని పొడిగిస్తారు. అదే బాటలో రాష్ట్రాలు ఇప్పుడున్న హౌంగార్డులకు తోడు నాలుగేండ్ల పోలీసులను ప్రవేశపెట్టవనే హామీ ఏముంది? విదేశాల్లో ఇలాంటి పద్దతి ఉంది అని చెబుతున్నారు. ఉంటే ఉండవచ్చు, విదేశాల నుంచి అన్ని అంశాలను తీసుకుంటూ దీన్ని కూడా తీసుకుంటే అదొక దారి అలా లేదే. అమెరికాలో ఇలాంటి సైనికులతో పాటు అక్కడ నిరుద్యోగులకు ఉన్న భృతి, సామాజిక భద్రతా పధకాలను ఇక్కడ కూడా ముందు ప్రవేశపెట్టి యువతకు భరోసా కల్పించిన తరువాత ఇలాంటి వాటిని ప్రవేశపెడితే అదొక తీరు, మోడీ సర్కార్‌ అలాలేదే !


రెగ్యులర్‌ ఆర్మీకి వంద మందిని ఎంపిక చేయాలంటే 1000 మందిని పిలిచి ఫిల్టర్‌ చేస్తారట. ప్రతిభావంతులైన యువకులు మిలిటరీలోకి వస్తారట. ఇప్పుడు తీసుకుంటున్నవారికి కూడా అన్ని పరీక్షలు పెట్టే తీసుకుంటున్నారు కదా ! ఆరుపదులు దాటిన వారినేమీ తీసుకోవటం లేదు కదా !యువత మరీ అంత అమాయకంగా ఉందని భావిస్తున్నారా ? ఫిల్టర్‌లో కొత్తేముంది, ప్రతి ఉద్యోగానికి, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటి సీట్లకు జరుగుతున్నది అదే కదా ! కానీ అగ్నిపథ్‌లో వంద మందికి గాను ఐదు వందల మందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి వారిలో వంద మందిని పర్మనెంటు చేసి మిగతా నాలుగువందల మందికి నాలుగేండ్ల తరువాత పన్నెండు లక్షలు ఇచ్చి ఇంటికి పంపుతారని, ఇతర రంగాల్లో సర్దుబాటు చేస్తారని, నాలుగేండ్లు ఇంటి దగ్గర ఉన్నవారు ఇంత సంపాదించగలరా అంటున్నారు. దేశంలోని యువత అందరికీ ఇలాగే మిలిటరీగాక పోతే ఎవరికి తగిన రంగంలో వారికి శిక్షణ ఇచ్చి అందరికీ నాలుగేండ్ల ఉపాధి, పన్నెండు లక్షలు ఇచ్చే పధకాన్ని కూడా కేంద్రం ప్రవేశపెడితే ఎవరికీ ఇబ్బంది ఉండదు. స్వచ్చందంగా ఎవరికి నచ్చిన దానిలో వారు చేరతారు. ఎలాంటి ఆందోళనలు ఉండవు. దేశానికి నిపుణులైన పనివారు దొరుకుతారు కదా !


ఉట్టికెగరలేని వారు స్వర్గానికి ఎగరగలరా ! కరోనాలో వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు అవసరమైన రైలు ఛార్జీలు ఎవరు భరించాలి అన్న చర్చకు తెరలేపిన కేంద్ర ప్రభుత్వ పెద్దల నిర్వాకం చూసిన తరువాత ఇంతటి మహత్తర లబ్ది కల్పిస్తారని చెబితే నమ్మేదెవరు ? పకోడీల బండి ద్వారా పొందే ఉపాధి కూడా ప్రభుత్వం కల్పించినదానిలో భాగంగానే లెక్కించాలని ప్రధాని నరేంద్రమోడీ గారు సెలవిచ్చిన సంగతి మరచిపోగలమా ? కార్పొరేట్లకోసం తెచ్చిన మూడు సాగు చట్టాలను రైతుల కోసం అని నమ్మించేందుకు చూశారు, వీలుగాక క్షమాపణ చెప్పి మరీ వాటిని రద్దు చేశారు.అదే సందర్భంగా కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీని వేస్తామని చెప్పారు. నెలలు గడుస్తున్నా దాని ఊసులేదు. ఇలాంటి వారి మాటలు నమ్మాలని వాట్సాప్‌ పండితులు బోధలు చేస్తున్నారు. జైకిసాన్‌ అంటూనే వారికి వెన్నుపోటు పొడిచేందుకు చూసిన వారు ఇప్పుడు జై జవాన్లకు పెన్షన్‌ లేకుండా చేసేందుకు పూనుకున్నారు.


ఆందోళనలు చేస్తున్నవారు హింసాకాండకు పాల్పడటాన్ని ఎవరూ సమర్ధించరు,హర్షించరు. అలాంటి చర్యలకు పాల్పడటానికి ప్రత్యేక శిక్షణ ఎలా ఉంటుందో కళ్ల ముందే కరసేవ పేరుతో బాబరీ మసీదును కూల్చివేసిన తీరు వెల్లడించింది. భక్తులుగా వచ్చిన వారు గునపాలు, పెద్ద సుత్తులు ఎందుకు తెచ్చారు, ఎలా తెచ్చారు అని అడిగి తెలుసుకొని ఉంటే, ఈ రోజు రైళ్లు తగులబెడుతున్న వారికి అవి ఎలా దొరుకుతాయో తెలిసి ఉండేది. దేశం కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్దపడి సైనిక ఎంపికలకు సిద్దం అవుతున్నవారు కడుపుమండితే ఎంతకైనా తెగిస్తారు. ఇలా చెప్పటమంటే వారిని సమర్ధిస్తున్నట్లు కాదు. బాబరీ మసీదును కూడా కడుపు మండినవారు కూల్చారుతప్ప మాకేమీ సంబంధం లేని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు అప్పుడు చెప్పారు కదా ! వాట్సప్‌ గ్రూపుల ఏర్పాటు వాటి ద్వారా సందేశాలు, కుట్రల గురించి చెబుతున్నారు. నిజమే అనుకుందాం కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలేమి చేస్తున్నట్లు ? నివారణ చర్యలేమి తీసుకున్నట్లు ?


. 2016లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆకస్మికంగా తీసుకున్నారు. దాన్ని ముందుగా చర్చిస్తే నల్లధనం ఉన్నవారు జాగ్రత్తపడతారని చెప్పకుండా చేశారనుకుందాం. కానీ దాని గురించి కూడా ఆశ్రితులకు ముందుగానే ఉప్పందించారన్న విమర్శలు తెలిసిందే. అందుకే నల్లధనం ఒక్కపైసా కూడా దొరకలేదు. ఒకేదేశం-ఒకే పన్ను పేరుతో తగిన సన్నాహం లేకుండా తెచ్చిన జిఎస్‌టి ఎలాంటి పర్యవసానాలకు దారి తీసిందో చూశాము. జమ్ము కాశ్మీరు అసెంబ్లీ తీర్మానం, చర్చతో నిమిత్తం లేకుండా ఆర్టికల్‌ 370,ఏకంగా ఆ రాష్ట్రాన్నే రద్దు చేసిన తీరు తెలిసిందే. ఉమ్మడి జాబితాలో ఉన్న వ్యవసాయం గురించి మూడు సాగు చట్టాలను ఎంత హడావుడిగా ప్రహసన ప్రాయంగా చేసిందీ చూశాము. వాటి అనుభవం నుంచి పాఠాలేమీ నేర్చుకున్నట్లు లేదు. మిలిటరీ రిక్రూట్‌మెంటులో సమూల మార్పులను తలపెట్టి అగ్నిపథ్‌ పధకాన్ని తీసుకువచ్చే ముందు దానిలోని అంశాలను ముసాయిదా రూపంలో చర్చకు పెట్టకుండా మూసిపెట్టి ఆకస్మికంగా అమల్లోకి తీసుకురావటం ఏ రకపు ప్రజాస్వామ్యం ? అదేమీ గుట్టుగా ఉంచాల్సింది కాదు కదా !

యువతలో ఉన్న అసంతృప్తి బిజెపి-జెడియు ఏలుబడిలో ఉన్న బీహార్‌లో ఈ ఏడాది జనవరిలోనే వెల్లడైంది. రైల్వే ఉద్యోగార్దులు నరేంద్రమోడీ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. కేంద్ర పెద్దలు తమకు పార్లమెంటులో మంద మెజారిటీ ఉంది కదా అని నిరంకుశంగా ఏది బడితే అది చేసి ఆమోదం పొందాలనే ఒక అప్రజాస్వామిక వైఖరితో ముందుకు పోతున్నారు. అది కుదరదని అగ్నిపథ్‌పై స్పందన వెల్లడించింది. దీన్నుంచైనా గుణపాఠం తీసుకొని లేబర్‌ కోడ్‌ల పేరుతో కార్మికవర్గంపై తలపెట్టిన దాడిని వెనక్కు తీసుకుంటారా ? ఇప్పుడు అగ్నిపథ్‌ గురించి చర్చించేందుకు సిద్దం అని కేంద్ర మంత్రి అంటున్నారు. ఎవరితో చర్చిస్తారు, ఆ పని ముందే ఎందుకు జరగలేదు. ప్రతి ఆందోళనకూ ఉన్నట్లే ఇప్పుడు తలెత్తిన ఆందోళనకు పరిమితులు ఉంటాయి. మిలటరీలో చేరాలనుకొనే వారికి భ్రమలు తొలుగుతున్నాయి. మిగతా వారు వారి మాదిరి స్పందించకపోవచ్చు. రేపు తమ ఉద్యోగాలకూ, ఉపాధికి ఇదే గతి అన్న ఆలోచనకు తాజా ఆందోళన నాంది పలుకుతుంది. నరేంద్రమోడీ సర్కార్‌ మీద పెట్టుకున్న – పెంచుకున్న భ్రమలను పటాపంచలు చేస్తుంది. ప్రతి మహానదీ ప్రారంభంలో చిన్న వాగు-వంక మాదిరే ప్రారంభం అవుతుంది. ఇదీ అంతే !!