Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


అగ్నిపథ్‌ పధకాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దాని మీద నిరసనలు తలెత్తటంతో సమర్ధించేందుకు మిలిటరీ అధికారులను దించింది. ఇది ఒక ప్రమాదకర సాంప్రదాయం.మనది పాకిస్థాన్‌, ఇతర అనేక దేశాల మాదిరి మిలిటరీ కనుసన్నలలో నడిచే ప్రభుత్వం కాదు. ఈ పధకం మిలిటరీ రూపొందించింది తప్ప తమది కాదు అని తప్పుకొనేందుకా అన్నట్లుగా ప్రధాని, సంబంధిత శాఖ మంత్రి ఇంతవరకు స్పష్టమైన ప్రకటనతో దేశం ముందుకు రాలేదు. పరోక్షంగా సుభాషితాలు పలుకుతున్నారు. ఈ పధకంతో మిలిటరీ ఎంపికలో సమూల మార్పులు చేశారు. ఇదేమీ రహస్యం కాదు. విద్యుత్‌ సంస్కరణల ప్రతిపాదనల మాదిరి. ముందుగానే ప్రతిపాదనలను బహిరంగంగా విడుదల చేసి అభిప్రాయాలను తీసుకోవచ్చు.


ఈ పధకం గురించి వివరించేందుకు గాను మంగళవారం నాడు త్రివిధ దళాధిపతులు ప్రధాని నరేంద్రమోడీని కలవనున్నారని వార్తలు. ఈ పధకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తరువాతనే జూన్‌ 14న ప్రకటించారు. ఇలాంటి కీలకాంశం గురించి ముందుగా ప్రధానికి వివరించకుండానే ఇదంతా జరుగుతుందంటే ఎవరైనా నమ్ముతారా ? ఒకవేళ అదే జరిగితే నిరసన తలెత్తిన వెంటనే దీని సంగతేమిటని ప్రధాని అడిగి ఉండాలి కదా ! ముందే తెలిపి ఉంటే ఇప్పుడు కొత్తగా చెప్పేదేమిటి ? ఈ పధకం ప్రకటనతో తలెత్తిన శాంతిభద్రతల సమస్య గురించైతే అది మిలిటరీ అధికారులకు సంబంధం లేదు, హౌంశాఖ మంత్రి, ప్రతినిధులు వివరించాలి.తగిన కసరత్తు, ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా తీసుకొనే సంస్కరణలు దేనికి దారితీస్తాయో పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి, మూడు సాగు చట్టాల తీరుతెన్నులను చూశాము. అందుకే నష్టనివారణ చర్యగా ఈ తతంగం జరుగుతోందా అనే సందేహాలు కలగటం సహజం.


ఈ పధకానికి నిరసనగా సోమవారం నాడు భారత బంద్‌కు మిలిటరీ ఎంపికకు సిద్దం అవుతున్నవారు పిలుపుఇచ్చినట్లు వార్తలు.దాంతో ముందు జాగ్రత్త చర్యగా దేశమంతటా ఐదు వందలకు పైగా రైళ్లను రద్దు చేశారు. ఝార్కండ్‌లో స్కూళ్లను మూసివేశారు. ఢిల్లీ వంటి చోట్ల పోలీసుల అతి కారణంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది. హర్యానాలో రెండు జిల్లాల్లో కోచింగ్‌ సెంటర్ల మూసివేతకు ఆదేశించారు. ఈనెల 24న నిరసన తెలుపున్నట్లు రైతు నేత రాకేష్‌ తికాయత్‌ ప్రకటించారు. సోమవారం నాడు బంద్‌ ఎలా జరిగిందన్నది ప్రశ్న కాదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందన్నదే కీలకం. ఒక్కటి మాత్రం స్పష్టం.అగ్నిపథ్‌ పధకం సంగతేమో గానీ దాని కింద శిక్షణ పొందిన వారు అగ్నివీరులమని చెప్పుకొనేందుకు సిగ్గుపడతారు. ఆ పధకం కింద ఎంపికైన వారికి మిలిటరీ శిక్షణలో భాగంగా ఇతర అంశాలతో పాటు బట్టలుతకటం,క్షౌరం చేయటం, చౌకీదార్లుగా నైపుణ్యం కల్పిస్తారట. ఇక ఈ పధకం గురించి విమర్శల వెనుక టూల్‌కిట్‌ గాంగ్‌ ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయవర్గీయ ఆరోపించారు. మరి ఆ గాంగ్‌ చిరునామా ఏమిటో వారి మీద కేంద్రం, బిజెపి పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేమిటో తెలీదు. ఒక వేళ అలాంటి గాంగ్‌ ఉంటే వారు రూపొందిస్తున్న టూల్‌కిట్లకు టూల్స్‌ సరఫరా చేస్తున్నది బిజెపి నేతలే. విమర్శించేవారు చెప్పేది స్పష్టంగా ఉంది. సమర్ధిస్తూ మాట్లాడేవారే అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నారు. రైతు ఉద్యమం సందర్భంగా దిశ రవి అనే యువతి మీద కేంద్ర ప్రభుత్వం టూల్‌ కిట్‌ కేసు పెట్టి దేశద్రోహానికి పాల్పడినట్లు ఆరోపించి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళనకు సంబంధించిన సమాచారాన్ని ఒక చోట చేర్చి సామాజిక మాధ్యమంలో అందుబాటులో ఉంచటాన్నే టూల్‌కిట్‌గా వర్ణించారు.


తమ ఆఫీసులకు అవసరమైన భద్రతా సిబ్బంది నియామకంలో అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది కైలాష్‌ విజయవర్గీయ. ఆ పెద్దమనిషి ఆరుసార్లు ఎంఎల్‌ఏగా, పన్నేండ్లు మంత్రిగా పని చేసి ఇప్పుడు వారసత్వంగా కుమారుడు ఆకాష్‌ను ఎంఎల్‌ఏ చేశారు తప్ప బిజెపి ఆఫీసులో చౌకీదారుగా నియమించలేదు. నోటికొచ్చినట్లు మాట్లాడటం కైలాష్‌కు కొత్తేమీ కాదు. స్వంత రాష్ట్రమైన మధ్య ప్రదేశ్‌లో బిజెపి నేత లక్ష్మీకాంత శర్మ వంటి వారి ప్రమేయ ఉన్న వ్యాపం కుంభకోణం గురించి విలేకర్లు అడిగితే అది మీకు పెద్దది కావచ్చు గాని మాకు చిన్న కుంభకోణం అని సెలవిచ్చారు. దాని గురించి వివరాలు సేకరిస్తున్న జర్నలిస్టు అక్షయ సింగ్‌ అనుమానాస్పద స్థితిలో మరణించటం గురించి అడిగితే మరణించిన ఆ జర్నలిస్టును మరచిపోండి, నాకంటే అతను ముఖ్యమా అని ఎదురు ప్రశ్నించారు. అంతేనా దేశంలో జరుగుతున్న మానభంగాల గురించి అడిగితే మహిళలు వారి హద్దుల్లో వారు లేకపోతే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని సెలవిచ్చారు. ఇండోర్‌ నగరంలో ఒక పాతభవన కూల్చివేతను పర్యవేక్షిస్తున్న ఒక అధికారిని కుమారుడు ఆకాష్‌ హాకీ బాట్‌తో కొట్టటాన్ని సమర్ధించి తన పుత్ర ప్రేమను చాటుకున్నారు. వివాదాస్పద మాటలతో ఎప్పుడూ జనం నోళ్లలో నానుతున్న కైలాష్‌ అగ్నివీరులను బిజెపి ఆఫీసులో చౌకీదార్లుగా పెడతామని చెప్పటంలో ఆశ్చర్యం ఏముంది !


దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్దపడి మిలిటరీలో చేరేందుకు సిద్దపడుతున్న వారిని కించపరిచేలా ఉన్న తన వ్యాఖ్యలు దుమారం రేపటంతో తన మాటలను టూల్‌కిట్‌ గాంగ్‌ వక్రీకరించిందని ఎదురుదాడికి దిగారు. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం కైలాష్‌ ఇలా మాట్లాడారు.” నేను గనుక బిజెపి ఆఫీసులో భద్రతా సిబ్బందిని పెట్టాల్సి వస్తే అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తా, మీరు కూడా చేయవచ్చు. నా స్నేహితుల్లో ఒకరు 35 ఏండ్ల రిటైర్డ్‌ మిలిటరీ వ్యక్తిని సెక్యూరిటీ గార్డుగా పెట్టుకున్నారు, అతని మీద తనకు నమ్మకం ఉందని చెప్పారు. అతను సైనికుడు కాబట్టి తాను భయపడలేదని చెప్పారు.దీని అర్ధం ఏమిటి సైనికుడు అంటే ఆత్మవిశ్వాసం ” అని కైలాష్‌ చెప్పారు. దీని మీద విమర్శలు తలెత్తటంతో వివరణ ఇచ్చుకుంటూ అంతకు ముందు చెప్పినదాన్ని సమర్ధించుకున్నారు.” అగ్ని పథ్‌ పధకం కింద శిక్షణ పొందిన అగ్నివీరులు తమ సర్వీసు పూర్తి చేసిన తరువాత వారు తప్పనిసరిగా నైపుణ్యం పొందుతారు, తమ విధుల పట్ల అంకిత భావంతో ఉంటారు. మిలిటరీలో తమ సేవ పూర్తైన తరువాత ఎంచుకునే రంగాలలో ఈ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇదీ నేను చెప్పదలచుకున్నది. టూల్‌కిట్‌ ముఠాలతో సంబంధం ఉన్న నా మాటలను వక్రీకరించి శ్రమజీవులను కించపరిచేందుకు చూస్తున్నారు. ఇది ఈ దేశ కర్మవీరులకు అవమానం.రాష్ట్ర వీరులు-ధర్మవీరులకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న ఈ టూల్‌కిట్‌ ముఠా గురించి దేశానికి బాగా తెలుసు.” అన్నారు.నైపుణ్యం, అంకిత భావం ఒక్క మిలిటరీకేనా, ఇతర పౌరసేవల్లో ఉన్నవారికి అవసరం లేదా ?


దేశ యువతను అవమానించవద్దని ఢిల్లీ సిఎం అరవింద కేజరీవాల్‌ అన్నారు. వారు దేశం కోసం పని చేసేందుకు సిద్దం అవుతున్నారు తప్ప బిజెపి ఆఫీసు వెలుపల చౌకీదార్లుగా పనిచేసేందుకు కాదు అన్నారు. 2019లో నేను కూడా చౌకీదారునే అనే బిజెపి ప్రచారం అర్ధం ఏమిటో ఇప్పుడు కైలాష్‌ మాటలద్వారా బోధపడిందని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ చమత్కరించారు.బిజెపి ఎంపీ వరుణ్‌ గాంధీ కూడా విమర్శించారు. మిలటరీ అంటే దేశసేవ కోసం తప్ప కేవలం ఉపాధికోసం కాదన్నారు. కేంద్ర టూరిజం మంత్రి జి కిషన్‌రెడ్డి కూడా అగ్నివీరుల గురించి అనుచితంగానే మాట్లాడారు.” అగ్ని వీరులకు ఇతర అంశాలతో పాటు ఎలక్ట్రీషియన్లుగా, డ్రైవర్లుగా, బట్టలుతికేవారిగా, క్షురకులుగా అన్ని రకాల శిక్షణ ఇస్తారు.” అన్నారు. నైపుణ్య శిక్షణ పేరుతో కార్యక్రమం ఉంది కదా అన్న విలేకర్ల ప్రశ్నకు మిలటరీలో శిక్షణ ఇవ్వకూడదా అని ఎదురు ప్రశ్నించారు. ఈ పన్లు చేసేందుకు మిలటరీలో చేరాలా అనే ప్రశ్న ఎదురవుతుందనే విచక్షణ బిజెపి నేతలకు లేకపోయింది. బట్టలుతికేందుకు మిషన్లున్నాయి. మిలిటరీ, పోలీసు క్రాఫ్‌లు చేసేందుకు నిజానికి పెద్ద నైపుణ్యంతో పనేముంది.


2018 ఏప్రిల్‌ 22న ఢిల్లీలో బిజెపి ఎంపీలు, ఎంఎల్‌ఏల సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన హితవచనాలను ఆ పార్టీ నేతలు మరిచినట్లున్నారు. పార్టీ అధికారిక ప్రతినిధి నూపుర్‌ శర్మ చిల్లర మాటలు మాట్లాడి విధిలేని స్థితిలో సస్పెన్షకు గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అగ్నిపథ్‌ పధకం మీద యువత ఆగ్రహించినపుడు ఆ పార్టీ నేతలు తమ నోటి తుత్తరను ప్రదర్శించారు. ఐదు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ చెప్పిందేమిటి? ” మన మీడియాకు మసాలాను ఇస్తున్నాం. కెమెరాలను చూడగానే మనమేదో పెద్ద సామాజిక శాస్త్రవేత్తలం లేదా మేథావులం అన్నట్లుగా ప్రకటనలు చేసేందుకు దూకుతాం. తరువాత చెరుపు చేసే ప్రకటనలను ఉపయోగించుకొని మన పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు మీడియా చూస్తుంది. ఇది మీడియా తప్పుకాదు. ” అన్నారు. బహుశా ఈ కారణంగానే ఎన్ని విమర్శలు వచ్చినా ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రధానిగా మోడీ విలేకర్ల సమావేశం నిర్వహించలేదు.


భారత్‌ బంద్‌ పిలుపుకు సైతం దారి తీసిన అగ్నిపథ్‌ పధకాన్ని నరేంద్రమోడీ సమర్ధించారు. సోమవారం నాడు బెంగళూరులో మాట్లాడుతూ అనేక నిర్ణయాలు, సంస్కరణలు తొలుత అనుచితంగానే కనిపించవచ్చు.తరువాత అవి జాతి నిర్మాణానికి తోడ్పడతాయి. రోజులు గడిచే కొద్దీ ఆ సంస్కరణలతోనే దేశం లబ్ది పొందుతుంది. సంస్కరణల బాట మనలను నూతన లక్ష్యాలు, కర్తవ్యాలవైపు తీసుకుపోతుంది అన్నారు. 1990 నుంచి అమలు జరుపుతున్న సంస్కరణలు దేశం అంటే జనానికి చేసిన లబ్ది ఏమిటన్నది బ్రహ్మ పదార్ధం. వాటిని మరింత వేగంగా అమలు జరుపుతున్నట్లు ప్రధాని గతంలో చెప్పారు. ఈ ఎనిమిదేండ్లలో అవిచ్చిన ఫలితాల కంటే దుష్ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. అందువలన ఇలాంటి సుభాషితాలను నమ్మే స్థితి నుంచి జనం క్రమంగా బయటపడుతున్నారు. దానికి ప్రతిరూపమే అగ్నిపథ్‌ పధకంపై తలెత్తిన నిరసన. ఆ పధకాన్ని ఎలా సమర్ధించుకోవాలో అర్ధం గాక బిజెపి నేతలు రెచ్చగొట్టే-కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు. దేశభక్తి, క్రమశిక్షణ పేరుతో నోరు మూయించాలని చూస్తున్నారు.