ఎం కోటేశ్వరరావు
ఎవ్విరిబడీ లవ్స్ ఏ గుడ్ డ్రాట్ ( మంచి కరువును ప్రతివారూ ప్రేమిస్తారు) అనే పేరుతో ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి శాయినాధ్ పాతికేండ్ల క్రితం రాసిన పరిశోధనాత్మక కధనాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అవి నిత్య సత్యాలు. వర్తమానంలో కొనసాగుతున్న ఉక్రెయిన్ సంక్షోభాన్ని చూసిన తరువాత ” మంచి యుద్ధాన్ని ప్రేమిస్తారు ” అనే పేరుతో విశ్లేషణలు రాయవచ్చు. ఉక్రెయిను మీద సైనిక చర్య జరుపుతున్న రష్యా మీద తాము విధించిన ఆంక్షలను భారత్ ఖాతరు చేయటం లేదని అమెరికా, ఐరోపా ధనిక దేశాలు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. వలలో పడుతుందనుకున్న పిట్ట జారిపోయిందని ఆశాభంగం చెందినట్లుగా మింగలేక కక్కలేక ఎప్పటికైనా తిరిగి పడకపోతుందా అన్నట్లుగా వలలు పన్ని ఎదురు చూస్తున్నాయి.
ప్రతిదేశ రాజకీయ వైఖరుల వెనుక ఆ దేశ పాలకవర్గాల ఆర్ధిక ప్రయోజనాలుంటాయన్నది జగమెరిగిన పచ్చినిజం.అమెరికాను శాసించే సంస్థల్లో ఒకటైన అమెజాన్ కంపెనీ సిఇవో బెజోస్ భారత్ వచ్చినపుడు నరేంద్రమోడీ కలుసుకొనేందుకు ఇష్టపడలేదు. విదేశాలకు వెళ్లి మరీ పెద్ద పీటవేసి పెట్టుబడులను ఆహ్వానించినట్లు చెప్పుకున్న మోడీ ఏకంగా మన దేశానికి వచ్చిన అమెజాన్ అధిపతి పట్ల అలా ఎందుకు వ్యవహరించినట్లు ? అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఏమంటే అమెజాన్ కంపెనీ తన జియోకు ఎక్కడ పోటీ వస్తుందో, ఎలా మింగివేస్తుందో అని ముకేష్ అంబానీ భావించటమే. తరువాత జరిగిన అనేక పరిణామాలు దీన్నే నిర్ధారించాయి. తమకు అనుకూలంగా మోడీ సర్కార్ ఉంది కనుక అంబానీ మీడియా నరేంద్రమోడీకి భజన చేస్తుంటే అమెజాన్ కంపెనీకి అవకాశం ఇవ్వటం లేదు గనుక అదే కంపెనీకి చెందిన వాషింగ్టన్ పోస్టు పత్రిక విమర్శనాత్మకంగా ఉంది, మోడీ సర్కార్‌ను విమర్శిస్తూ రాస్తున్నది. ఉక్రెయిన్ వివాదంలో కూడా అమెరికా మీడియా మొత్తంగా అదే చేస్తున్నది. ఇక ఉక్రెయిన్ సంక్షోభం ముకేష్ అంబానీకి ” మంచి యుద్ధం ” గా మారి లాభాలు కురిపిస్తున్నదంటే చాలా మంది నమ్మకపోవచ్చు గానీ ఇది పచ్చినిజం.
అమెరికా ఆంక్షలను ధిక్కరించి రష్యా నుంచి చౌకధరలకు మన దేశం కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్న ముడి చమురు వివరాలను చూస్తే అసలు కధ ఏమిటో అర్ధం అవుతుంది. మన దేశం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురు ఏప్రిల్ నుంచి 50 రెట్లు పెరిగింది. ఈ చమురులో 69శాతం రిలయన్స్, నయారా వంటి సంస్థలే దిగుమతి చేసుకుంటున్నట్లు వార్తలు.ప్రభుత్వ లేదా ప్రయివేటు సంస్థలు ఏవి దిగుమతి చేసుకున్నా దిగుమతి ఖర్చు తగ్గినపుడు జనాలకు ఆమేరకు తగ్గాలి. అలా తగ్గటం లేదు ఎందుకని ? రిలయన్స్, నయారా తదితర ప్రైవేటు బంకుల్లో చమురు విక్రయాలు దాదాపు లేవు, ఎక్కడైనా తెరిచి ఉంచినా కొనుగోలు చేసే వారు కూడా ఉండరు. మరి దిగుమతి చేసుకున్న చమురును శుద్దిచేసి ఏమి చేస్తున్నట్లు ? విదేశాలకు, అమెరికా, ఆఫ్రికా, ఐరోపాకు ఎగుమతి చేసి లాభాలు పోగేసుకుంటున్నాయి.
రాయిటర్స్ వార్తా సంస్థ జూన్ ఒకటవ తేదీ కధనం ప్రకారం 2021 తొలి ఐదు నెలల్లో మన దేశం ఎగుమతి చేసిన చమురు ఉత్పత్తుల కంటే ఈ ఏడాది అదే కాలంలో 15 శాతం పెరిగినట్లు కెప్లర్ సంస్థ సమాచారం వెల్లడించింది. ఒక లీటరు డీజిలు మీద రు.20, పెట్రోలు మీద రు.17 నష్టం వస్తున్నందున ప్రయివేటు చమురు శుద్ధి సంస్థలు మార్కెటింగ్‌ను గణనీయంగా తగ్గించాయి. శ్రీలంక పరిణామాలను చూసిన తరువాత ధరల పెరుగుదలతో ప్రభుత్వం మీద జనంలో అసంతృప్తి తలెత్తుతుందనే భయంతో కేంద్ర ప్రభుత్వం కొంత మేరకు పన్ను తగ్గించటంతో పాటు ఏప్రిల్ ఆరు నుంచి ధరల సవరణను స్థంభింపచేసింది. రిలయన్స్ కంపెనీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న శుద్ధి కర్మాగారాన్ని వార్షిక నిర్వహణలో భాగంగా కొంతకాలం మూసి పనులు చేపట్టాలని భావించింది.అలాంటిది ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా అందుబాటులోకి వచ్చిన చౌక ధర రష్యా చమురు కారణంగా నిర్వహణ పనులను వాయిదా వేసి శుద్ది కొనసాగిస్తూ ఎగుమతులతో లాభాలను పొందుతున్నది. ఆ సంక్షోభం ఎంతకాలం కొనసాగితే అంతకాలం లాభాలే లాభాలు. మన దేశం కొనుగోలు చేసే ధరల కంటే పీపాకు 30 డాలర్ల వరకు రష్యా రాయితీ ఇస్తున్నది. మరో ఆరునెలల పాటు ఒక నిర్ణీత ధరకు సరఫరా చేస్తారా అంటూ ఈ కంపెనీలు రష్యాతో ఇప్పుడు బేరమాడుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. అందుకే అంబానీకి ఇది మంచి యుద్ధంగా, జనానికి చెడుగా మారింది. ప్రధానంగా లబ్ది పొందుతున్నది రిలయన్స్, వచ్చే ఎన్నికల్లో ఆదుకొనే వాటిలో ఆ కంపెనీ ఒకటి గనుక అమెరికా బెదిరింపులను నరేంద్రమోడీ ఖాతరు చేయటం లేదని వేరే చెప్పనవసరం లేదు.
ఇటీవల మన దేశానికి చమురును సరఫరా దేశాల్లో రెండవ స్థానంలో ఉన్న సౌదీని వెనక్కు నెట్టేసి రష్యా రెండవ స్థానానికి చేరుకుంది. జర్మనీని రెండవ స్థానానికి నెట్టి చైనాకైతే మొదటిదిగా మారింది. అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆంక్షల పర్యవసానాలు దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో చెప్పలేము గానీ, ముడి చమురు ధరలు పెరిగిన కారణంగా రాయితీ ఇచ్చినప్పటికీ రష్యాకు లాభంగానే ఉంది. గత ఏడాది కంటే సగటున 60శాతం ధర పెరిగింది. ఈ స్థితిని అంచనా గట్టటంలో అమెరికా, పశ్చిమదేశాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఐరోపాకు 75శాతం ఇంధన ఎగుమతి తగ్గినప్పటికీ ధరల పెరుగుదల వలన రోజుకు పది కోట్ల డాలర్లు వస్తున్నట్లు, గతేడాదితో సమంగా ఉన్నట్లు అంచనా.ఉక్రెయిన్ సంక్షోభం తొలి వంద రోజుల్లో ( ఫిబ్రవరి 24 నుంచి జూన్ 3 వరకు) ఇంథన ఎగుమతుల ద్వారా రష్యా 98బి.యురోలను పొందింది. వాటిలో 61శాతం ఐరోపా దేశాల నుంచే ఉంది. దేశాల వారీ చూస్తే చైనా 12.6, జర్మనీ 12.1, ఇటలీ 7.8, నెదర్లాండ్స్ 7.8, టర్కీ 6.7, పోలాండ్ 4.4, ఫ్రాన్స్ 4.3, భారత్ 3.4, బెల్జియం బి.యురోల మేరకు దిగుమతి చేసుకున్నాయి. మన అవసరాల్లో రష్యా నుంచి దిగుమతులు ఫిబ్రవరి 24కు ముందు ఒకశాతం ఉంటే మే నెలలో 18శాతానికి పెరిగాయి. మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు నుంచి తయారు చేసిన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
అమెరికా వడ్డీరేట్లు పెంచటం, అక్కడ, ఇతర ధనిక దేశాల్లో మాంద్యం తలెత్తవచ్చనే అంచనాల వెల్లడితో ఇటీవల 124 డాలర్లకు చేరిన ప్రామాణిక బ్రెంట్ రకం ముడిచమురు ధర గత వారంలో 103 డాలర్లవరకు పడిపోయింది.జూన్ 24వ తేదీన 113 డాలర్లుంది. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు వడ్డీ రేట్ల పెంపు వలన ప్రయోజనం ఉండదని, ఏడాది-ఏడాదిన్నరలో అక్కడ మాంద్యం తలెత్తవచ్చని అనేక మంది ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారు. నవంబరులో జరిగే పార్లమెంటు ఎన్నికలలో ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు జో బైడెన్ కూడా చమురు పన్ను తగ్గించే ప్రతిపాదనలో ఉన్నట్లు వార్తలు. డాలరు విలువ పెరుగుతున్నందున చమురు దిగుమతి చేసుకొనే దేశాల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు. దానికి నిదర్శనంగా మన రూపాయి విలువ పతనంలో ఇటీవల కొత్త రికార్డులను నెలకొల్పుతున్నది.
ఇక అదానీ కంపెనీల విషయానికి వస్తే నరేంద్రమోడీ సర్కార్ ఆస్ట్రేలియాలోని అదానీ బొగ్గు గనుల నుంచి దిగుమతులు చేసుకొనేందుకు అనువైన పరిస్థితిని కల్పించింది. అదానీకి మంచి రోజుల కోసమే ఇదంతా అన్నది స్పష్టం. మన దేశంలో 1,07,727 మిలియన్ టన్నుల మేరకు బొగ్గు నిల్వలున్నట్లు నిర్ధారణైంది. ప్రపంచంలో ఐదవ దేశంగా 9శాతం కలిగి ఉంది. వర్తమాన వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ నిల్వలు 111.5రెట్లు ఎక్కువ. ఇంత మొత్తం ఉన్నప్పటికీ బొగ్గు తవ్వకంలో నరేంద్రమోడీ సర్కార్ వైఫల్యం కారణంగా విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టిపిసి ఆస్ట్రేలియాలోని అదానీ కంపెనీ నుంచి పదిలక్షల టన్నుల బొగ్గు దిగుమతి ఒప్పందం చేసుకుంది. మరో సంస్థ డివిసి మరో పదిలక్షల టన్నుల దిగుమతికి సంప్రదింపులు జరిపింది. దిగుమతి చేసుకున్న బొగ్గుధర ఎక్కువగా ఉంది. అదానీ వంటి కంపెనీలకు లబ్ది కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకున్న బొగ్గును విధిగా దేశీయ బొగ్గుతో మిశ్రమం చేసిి వినియోగించాలని ఆదేశించింది. ఇది విద్యుత్ చార్జీల పెంపుదలకు దారి తీస్తున్నది. నరేంద్రమోడీ పాలనలో దేశీయ చమురు ఉత్పత్తి కూడా పడిపోయిన సంగతి తెలిసిందే.
కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి ఆర్‌కె సింగ్ మే నెలలో అన్ని రాష్ట్రాలకు రాసిన లేఖలో విదేశీ బొగ్గు దిగుమతుల గురించి ఆదేశించారు.2022 అక్టోబరు వరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గాను రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు, ప్రయివేటు సంస్థలకు షరతులు విధించారు. మే నెలాఖరులోగా వాటి అవసరాల్లో పదిశాతం దిగుమతులు చేసుకోని పక్షంలో జరిమానాగా తరువాత 15శాతానికి పెంచుతారు. జూన్ 15లోగా విదేశీ-స్వదేశీ బొగ్గును మిశ్రితం ప్రారంభించని పక్షంలో జరిమానాగా స్వదేశీ బొగ్గు కేటాయింపులో ఐదుశాతం కోత విధిస్తారు. దేశంలోని 173 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో సగటున ఏడు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలులేని స్థితిలో ఈ ఆదేశాలను జారీ చేశారు.97 కేంద్రాలలో ఏడు రోజుల కంటే తక్కువ, 50 కేంద్రాలలో నాలుగు రోజుల కంటే తక్కువ, కొన్నింటిలో ఒక రోజుకు సరిపడా నిల్వలున్నట్లు పేర్కొన్నారు. మొత్తం విద్యుత్ కేంద్రాలలో కేవలం 18 మాత్రమే బొగ్గుగనుల సమీపంలో(ఉదా: కొత్తగూడెం) ఉండగా 155 కేంద్రాలు 500 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.