ఎం కోటేశ్వరరావు
జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు జర్మనీలోని బవేరియా ఆల్ఫ్స్ ప్రాంతంలోని ఎలమౌ కాజిల్ రిసార్ట్‌లో 48వ జి7 శిఖరాగ్ర సమావేశం జరిగింది. ” ధర్మ బద్ధ ప్రపంచం వైపు పురోగమనం ” అనే ఇతివృత్తంతో దీన్ని నిర్వహించారు. ఈ సభ కొనసాగింపుగా 29-30 తేదీల్లో స్పెయిన్లోని మాడ్రిడ్ నగరంలో నాటో కూటమి సమావేశాలను ఏర్పాటు చేశారు. జి7 సమావేశానికి మన ప్రధాని నరేంద్రమోడీతో పాటు అర్జెంటీనా, దక్షిణ ఆఫ్రికా, ఇండోనేషియా, సెనెగల్ దేశాధినేతలను కూడా ఆహ్వానించారు. ఎడతెగని, ఎప్పుడూ ఉండే,ఎవరూ పాటించని పర్యావరణం, ఉగ్రవాద నిరోధం, ఆహార భద్రత వంటి అంశాల గురించి ఈ సమావేశంలో సుభాషితాలను పక్కన పెడితే రెండు కీలక అంశాల మీద అమెరికా పెత్తనంలోని ఈ కూటమి కేంద్రీకరించిందని చెప్పవచ్చు. అవి రష్యా మీద మరిన్ని ఆంక్షలు, చైనాను నిలువరించే పధకాలు. ఉక్రెయిన్ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య ఐదవ నెలలో ప్రవేశించింది. ఇప్పటికే తూర్పున ఉన్న డాన్‌బాస్ ప్రాంతాన్ని, కీలక రేవులు, పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ మిలిటరీ, దానితో కలసి ప్రతిఘటిస్తున్న కిరాయి మూకలను ఆ ప్రాంతం నుంచి రష్యా తరిమివేసింది. కొత్త ప్రాంతాలకు దాడులను విస్తరించింది.చమురు ఎగుమతులపై విధించిన ఆంక్షలు పెద్దగా ప్రభావం చూపకపోవటంతో బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలని జి7 కూటమి పిలుపునిచ్చింది. దీంతో పాటు మరిన్ని ఆయుధాలను పంపాలని నిర్ణయించింది.
నవంబరులో జరిగే పార్లమెంటు ఎన్నికలలో అధికార డెమోక్రటిక్ పార్టీకి దెబ్బతగుల నుందన్న వార్తల నేపధ్యంలో లబ్దిపొందేందుకు జో బైడెన్ ఈ సమావేశాలను వినియోగించుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఒక అంశం మాత్రమే అని చెప్పవచ్చు. ఉక్రెయిన్ మిలిటరీ అనేక ప్రాంతాల నుంచి వెనుదిరుగుతున్న పూర్వరంగంలో అనేక దేశాలు పునరాలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నందున నాటో కూటమి, ఇతర దేశాలను నిలువరించేందుకు అమెరికా పూనుకుంది. రష్యా నుంచి బంగారం దిగుమతులపై నిషేధం కేవలం ఒక ప్రచార అస్త్రం తప్ప రష్యా మీద పెద్దగా ప్రభావం పడదని విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది 15.5బిలియన్ డాలర్ల మేరకు అక్కడి నుంచి ఎగుమతులు జరిగాయి. ప్రపంచంలో పదిశాతం( 2021లో 333.4 టన్నులు) బంగారాన్ని ఉత్పత్తి చేస్తూ రష్యా రెండవ స్థానంలో ఉండగా 370 టన్నులతో చైనా ప్రధమ స్థానంలో ఉంది.రష్యా నుంచి దిగుమతులు చేసుకొనే దేశాల్లో మనది కూడా ఒకటి. దాని ఎగుమతులపై నిషేధం వలన చమురు ధరలు పెరిగినట్లుగానే బంగారం ధరలు, వాటితో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరగవచ్చు. చమురును ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లుగానే బంగారానికి కూడా మార్కెట్లను రష్యా చూసుకుంటుందని చెబుతున్నారు.
తాము సృష్టించిన ఉక్రెయిన్ సంక్షోభాన్ని మరింత ఎగదోసేందుకు తప్ప పరిష్కరించేందుకు జి7 సమావేశం ఎలాంటి చొరవ చూపలేదు. రానున్న ఐదు సంవత్సరాల కాలంలో లాభాలు వచ్చే పధకాలపై పెట్టుబడులకు 600బిలియన్ డాలర్లు సేకరించాలని ఈ సమావేశం పిలుపునిచ్చింది తప్ప అనేక దేశాల్లో తలెత్తిన ఆకలి మంటల గురించి ధనిక దేశాలు పట్టించుకోలేదు. ఆసాధారణ ప్రపంచ ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, ప్రపంచ ఆహార మార్కెట్‌ను స్థిరంగా ఉండేట్లు చూడాలని, ధరల ఒడిదుడుకులను నివారించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్ జి7 కూటమిని కోరారు. ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో 29శాతం వాటా కలిగిన ఉక్రెయిన్, రష్యాల నుంచి ఎగుమతుల పునరుద్దరణకు ప్రభావశీలమైన పరిష్కారాన్ని కనుగొనకపోతే ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. నేతలు తమ ప్రసంగాల్లో ఆహార భద్రత గురించి ప్రస్తావించటం తప్ప నిర్దిష్ట చర్యలు లేవు. ఉక్రెయిన్ రేవుల్లో నిలిచిన రవాణా పునరుద్దరణ, తమ దేశం నుంచి ఎరువులు, ఆహార ధాన్యాల ఎగుమతులకు విధించిన ఆంక్షల ఎత్తివేతతో పాటు సముద్రాల్లో ఉక్రెయిన్ ఏర్పాటు చేసిన మందుపాతరలను తొలగించాలని రష్యా డిమాండ్ చేస్తోంది.
ప్రపంచంలో వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆరువందల బిలియన్ డాలర్లు సేకరించాలని జి7 కూటమి నిర్ణయింది. ఈ మొత్తం చైనాను అడ్డుకొనేందుకు అని ఎక్కడా చెప్పకపోయినా దాని బిఆర్‌ఐ పధకాన్ని అడ్డుకొనేందుకే అని మీడియా పేర్కొన్నది. ప్రపంచ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల కోసం భాగస్వామ్యం(పిజిఐఐ) అనే పేరుతో ఒక పధకాన్ని అమలు జరపాలని గతేడాది లండన్ సమావేశంలోనే ఒక పధకాన్ని ఈ కూటమి ప్రకటించింది. ఇప్పుడు 2027నాటికి ఆరువందల బిలియన్లతో ఒక నిధిని ఏర్పాటు చేయాలని సంకల్పం చెప్పుకున్నారు. ఇది చైనా 2013 నుంచి అమలు చేస్తున్న బిఆర్‌ఐ పధకానికి పోటీగా పరిగణిస్తున్నారు. ఇదేదో దయా-ధర్మం కాదు దీనిలో పెట్టుబడులు పెట్టిన వారందరికీ అమెరికన్లతో సహా అందరికీ ఫలితాలు ఉండాల్సిందే అని స్పష్టం చేస్తున్నా అని జో బైడెన్ చెప్పారు.అభివృద్ధి చెందుతున్న దేశాలలో అవసరమైన మౌలిక, ఆధునిక వసతుల కల్పనకు 40లక్షల కోట్ల డాలర్లు అవసరమని అంచనా. తాము 200 బిలియన్ డాలర్లు ఇస్తామని అమెరికా చెబుతుండగా తాము 317బి.డాలర్లు సమకూర్చుతామని ఐరోపా సమ్యాఖ్య పేర్కొన్నది.
అసలు జి 7 అంటే ఏమిటన్న ప్రశ్న కొంతమందికైనా తలెత్తటం సహజం.అమెరికా,జపాన్, కెనడా, నెదర్లాండ్స్‌తో తలెత్తిన వివాదంలో ఆ దేశాలకు చమురు సరఫరాలపై నిషేధం విధిస్తున్నట్లు ఒపెక్ దేశాలు చేసిన ప్రకటన 1973లో చమురు సంక్షోభానికి దారి తీసింది. దాన్నుంచి బయడపడేందుకు ధనికదేశాల ఆలోచన నుంచి పుట్టిందే జి7. చమురు, విత్త సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ధనిక దేశాలు ఉమ్మడిగా చేసిన ఆలోచనకు ఒక రూపమే 1975లో ఏర్పడిన ఈ దేశాల బృందం. నాటి ఫ్రెంచి అధ్యక్షుడు వాలెరీ గిస్కార్డ్, జర్మన్ ఛాన్సలర్ హెల్మట్ స్మిత్ చొరవతో పారిస్‌లో అమెరికా,బ్రిటన్,ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ నేతలు తొలి సమావేశం జరిపారు.మరుసటి ఏడాది కెనడా, 1998లో రష్యా చేరింది. దాంతో అది జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్ ఏలుబడిలో ఉన్న క్రిమియా ప్రాంతాన్ని రష్యా స్వాధీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి తొలగించిన తరువాత తిరిగి జి7గా మారింది.1981 నుంచి ఐరోపా సమాఖ్య(ఇయు)ను శాశ్వత ఆహ్వానిత సంస్థగా మార్చారు. ప్రతి సంవత్సరం ఒక సభ్యదేశ ఆతిధ్యంలో శిఖరాగ్ర సమావేశాలు జరుగుతాయి.సహజంగా ఆ దేశాధినేతలే ఏడాది పాటు అధ్యక్ష స్థానంలో ఉంటారు. ఈ బృందానికి ఒక కేంద్ర స్థానం లేదా శాశ్వత సిబ్బందిగానీ ఉండరు. ఇప్పటి వరకు గత ఎనిమిది సంవత్సరాల్లో నరేంద్రమోడీ మూడు సమావేశాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు మన్మోహన్ సింగ్ పదేండ్ల కాలంలో ఐదు సార్లు అతిధిగా వెళ్లారు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రపంచ రాజకీయాలు, ఆర్ధిక రంగంలో మన దేశానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా మన దేశానికి ప్రతిదేశం ఆహ్వానం పలుకుతోంది. గత ఎనిమిదేండ్లలో మూడు సార్లు ఆహ్వానించటం నరేంద్రమోడీ ఘనత అన్నట్లు కొందరు చిత్రిస్తున్నారు.
ఉక్రెయిన్ సంక్షోభం తలెత్తిన తరువాత రష్యా సైనిక చర్యను ఖండించటమా లేదా అన్న అంశంపై ప్రపంచ దేశాలు మూడు శిబిరాలుగా మారాయి. ఒకటి అమెరికా బాటలో ఖండించే, రెండవది రష్యాను సమర్ధించే, మూడవది తటస్థంగా ఉండే దేశాలు. మనది, చైనా మూడవ తరగతిలో ఉన్నాయి. ఖండించని దేశాలన్నీ రష్యాను సమర్ధించినట్లేనని అమెరికా కూటమి చిత్రిస్తోంది. జర్మనీ సభకు భారత్‌ను ఆహ్వానించటం గురించి అమెరికా జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త జాన్ కిర్బీ మాట్లాడుతూ లోతైన, భిన్నమైన అజెండా ఉన్న కారణంగానే భారత్‌ను ఆహ్వానించారు తప్ప రష్యా నుంచి వేరు చేసేందుకు కాదన్నారు. ఆహ్వానించాలా లేదా అని జర్మనీ మల్లగుల్లాలు పడినట్లు వార్తలు వచ్చాయి తప్ప నిజానికి అందుకే పిలుస్తున్నట్లు ఎవరూ ఎక్కడా చెప్పలేదు. కానీ అమెరికా ప్రతినిధి కడుపు ఉబ్బరాన్ని ఆపుకోలేక అంతరంగాన్ని మరో రూపంలో వెల్లడించాడు. ఇతివృత్తం ఒకటైతే నిజానికి అక్కడ జరిగిన ప్రధాన చర్చ అంతా చైనా, రష్యాలను దెబ్బతీయటం ఎలా అన్నదాని చుట్టూనే తిరిగింది. ఆర్ధిక స్థిరత్వం, మార్పు, ప్రపంచ ఆరోగ్యమెరుగుదల, ప్రపంచ పర్యావరణ రక్షణ, నిరంతర పెట్టుబడుల వంటి వన్నీ మాయపుచ్చే అంశాలే. ప్రపంచ చట్టబద్ద సంస్థలు చేసిన నిర్ణయాలు, లక్ష్యాలనే ఈ దేశాలు ఖాతరు చేయటం లేదు. తొలి రోజు సమావేశంలో రష్యా చమురు ధరలను ఎలా అదుపు చేయాలన్న అంశం మీద, ఉక్రెయినుకు మరిన్ని ఆయుధాలిచ్చి ఎలా నిలబెట్టాలా అన్నదాని మీద కేంద్రీకరించారు తప్ప తమతో సహా అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్న ద్రవ్యోల్బణాన్ని పట్టించుకోలేదు. గోధుమలపై మన దేశం నిషేధం విధించినపుడు పశ్చిమ దేశాలు విమర్శించాయి, తరువాత దాన్ని పంచదారకు పొడిగించారు. మోడీ జర్మనీ వెళుతుండగా బియ్యం ఎగుమతులపై నిషేధ ఆలోచన ఉన్నట్లు వార్తలొచ్చాయి.
ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో మన ప్రధానులు తొమ్మిది సార్లు అతిధులుగా పాల్గొన్నారు.అతిధులుగా వెళ్లిన వారు ఎవరైనప్పటికీ ధర్మోపన్యాసాలు చేయటం, ఆతిధ్యాన్ని పుచ్చుకోవటం తప్ప అజెండాను నిర్ణయించే అవకాశం ఉండదు. హాజరైన దేశాధినేతలు, సంస్థల ప్రతినిధులతో తాను అభిప్రాయ మార్పిడి చేసుకుంటానని జర్మనీ వెళ్లే ముందు ప్రధాని నరేంద్రమోడీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కూటమి దేశాల నేతలు ఒక వైపు ఇలాంటి శిఖరాగ్ర సమావేశాల్లో గొప్ప ప్రకటనలు చేస్తూనే మరోవైపు తమ స్వంత అజెండాలతో వివిధ దేశాలతో వ్యవహరించటం తెలిసిందే. ఇతర దేశాల మీద దాడులు, ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేయటంలో దాదాపు అన్నీ ఒక గూటి చిలుకలుగానే ఉంటాయి. ఉక్రెయిను సంక్షోభం గురించి ఈ బృందనేతలు మాట్లాడుతున్న సమయంలో మన ప్రధానిగా ఎవరున్నా మౌన ప్రేక్షుకుడిగా ఉండటం లేదా ఏదో ఒకమిషతో వెలుపలికి రావాల్సిందే తప్ప మన వైఖరిని వెల్లడించే లేదా సమర్ధించుకొనే అవకాశం ఉండదు. అమెరికా దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెనెజులా, క్యూబాలను మినహాయించిన అమెరికా దుశ్చర్యను అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్ ఆ సమావేశంలో సభ్య హౌదాలో ఉతికి ఆరేశారు. అదే జి7 సమావేశంలో ఆహ్వానితుడిగా ఉన్నందున ఆ విధంగా మాట్లాడలేరు. ఎవరికైనా ఈ పరిమితులు ఉంటాయి. ఉక్రెయిను వివాదంలో మన దేశాన్ని తమవైపు తిప్పుకొనేందుకు అమెరికా కూటమి ఎప్పటికప్పడు గాలాలు వేస్తూనే ఉంటుంది.చైనాను బూచిగా చూపి మనలను తమవైపు తిప్పుకొనేందుకు చేయని యత్నం లేదు. వర్తమాన రాజకీయ అంశం ఉక్రెయిన్ వివాదంలో పశ్చిమ దేశాలతో చేతులు కలపకపోయినా మిగతా అంశాలలో మీతోనే ఉంటామనే సందేశాన్ని ఇప్పటికే నరేంద్రమోడీ సర్కార్ ఇచ్చింది. దాని కొనసాగింపుగానే ఈ సమావేశానికి హాజరైనట్లు చెప్పవచ్చు.
జర్మనీ జి7 సమావేశాల్లో నరేంద్రమోడీని అమెరికా అధినేత జో బైడెన్ పలుకరించిన తీరును మీడియా ప్రత్యేకంగా చూపింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడేవ్‌తో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చి నరేంద్రమోడీ భుజం తట్టి మరీ జో బైడెన్ పలుకరించారు. ఇది నరేంద్రమోడీ ఘనతగా చిత్రిస్తున్నారు.మన దేశాన్ని తమ కూటమిలో చేర్చుకొనేందుకు ఎలాంటి గాలం వేస్తారో డోనాల్డ్ ట్రంప్ తీరు తెన్నులు వెల్లడించాయి.జి 7 కూటమి కాలం చెల్లిన దేశాలతో ఉంది, దాన్ని విస్తరించాలని ట్రంప్ ఒకసారి చెప్పాడు.ఆస్ట్రేలియా,భారత్, దక్షిణ కొరియా, రష్యాలతో విస్తరించాలని అందుకే 2020 సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పాడు. నరేంద్రమోడీకి ఫోన్ చేసి మరీ ఆహ్వానం పలికాడు. నిజమే అనుకొని మన దేశం జి7లో చేరినట్లుగానే కొందరు కలలు కన్నారు. అమెరికా తరువాత పెద్ద ఆర్ధికశక్తిగా ఉన్న చైనాను పక్కన పెట్టి ధనికదేశాల బృందాన్ని విస్తరించటం అంటే అది చైనాను కట్టడి చేసేందుకే అన్నది స్పష్టం. ఇప్పుడు జి7 సమావేశానికి వెళ్లి సాధించిందేమిటో నరేంద్రమోడీ దేశానికి చెప్పాల్సి ఉంటుంది.