Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


బిజెపి అధికార ప్రతినిధి ó(ఆమెను తాత్కాలికంగా నిలిపి ఉంచారు తప్ప పూర్తిగా తొలగించలేదు గనుక ఇంకా ఆ పదవిలో ఉన్నట్లే ) నూపుర్‌ శర్మకు జూలై ఒకటవ తేదీన సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తనపై వివిధ రాష్ట్రాలలో దాఖలైన కేసులన్నింటినీ ఒక్కటిగా చేసి ఢిల్లీలో విచారించాలని ఆమె చేసిన వినతిని కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా ఇద్దరు న్యాయమూర్తులు సూర్య కాంత్‌, జెపి పార్దీవాలాతో కూడిన వేసవి సెలవుల బెంచ్‌ నూపుర్‌ వినతిని విచారించింది. ఆమె నోటి దూల దేశమంతటా నిప్పు రాజేసింది. దేశంలో తలెత్తిన ఉద్రిక్తతలకు ఆమెదే పూర్తి బాధ్యత అని సుప్రీం కోర్టు చెప్పింది. దేశంలో మహమ్మద్‌ ప్రవక్త మీద చేసిన వ్యాఖ్యలతో దేశంలో రగిలించిన ఆవేశాలకుగాను దేశం మొత్తానికి ఆమె క్షమాపణ చెప్పాలన్నది. సుప్రీం కోర్టు నుంచి ఇలాంటి ప్రతిస్పందనను ఎవరూ ఊహించి ఉండరు. నూపుర్‌ శర్మపై సుప్రీం కోర్టు జడ్జీలు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొనేట్లు ఆదేశించాలని అజయ గౌతమ్‌ అనే వ్యక్తి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌ వి రమణకు దరఖాస్తు చేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు అలాంటి వ్యాఖ్యలు చేసినందున ఆమెకు న్యాయం జరగకపోవచ్చని ఆరోపించారు. తన పిటీషన్‌ కాపీని రాష్ట్రపతికి కూడా పంపుతానని అతను పేర్కొన్నాడు.


గ్యానవాపి మసీదు అంశం కోర్టు విచారణలో ఉన్నందున ఒక అజెండాను ముందుకు తేవాలని తప్ప దాని మీద టైమ్స్‌ నౌ ఛానల్‌ చర్చ ఎందుకు నిర్వహించింది అని కోర్టు ప్రశ్నించింది. మే 27వ తేదీన సదరు ఛానల్‌ చర్చలో నూపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్రవివాదాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ” చౌకబారు ప్రచారం కోసం, రాజకీయ అజెండా లేదా దుర్మార్గమైన కార్యకలాపాల కోసం ఆమె మాట్లాడి ఉండాలి. ఆమె వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆమె అలా మాట్లాడాల్సిన అవసరం ఏమిటి ? దేశమంతటా ఆవేశాలను రగిలించేందుకు ఆమె మాట్లాడిన తీరు కారణం, దేశంలో జరుగుతున్నదానికి ఈ మహిళదే ఏకైక బాధ్యత. ఆమె ఎలా రెచ్చగొట్టిందీ చర్చను మేము చూశాము. తరువాత లాయర్నని ఆమె చెప్పుకుంది ఇది సిగ్గుచేటు. ఆమె దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలి. ” అని బెంచ్‌కు అధ్యక్షత వహించిన జస్టిస్‌ సూర్య కాంత్‌ అన్నారు.


నూపుర్‌ శర్మ తరఫు న్యాయవాది మణీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ చర్చ సందర్భంగా నవికా కుమార్‌ మాట్లాడిన దానికి స్పందనగా నూపుర్‌ శర్మ మాట్లాడినట్లు చెప్పగా అయితే చర్చను నిర్వహించిన వారి మీద కూడా కేసు నమోదు చేయాలని కోర్టు అన్నది.అలాంటి ఉద్దేశ్యం యాంకర్‌కు లేదు. చర్చలో మరొకరు పదే పదే శివలింగం కాదు కేవలం ఫౌంటెన్‌ చెప్పారు అని మణిందర్‌ సింగ్‌ అన్నారు. తన కక్షిదారుకు ప్రాణహాని ఉన్నందున కేసులన్నింటినీ ఒకేచోట విచారించాలని మణీందర్‌ సింగ్‌ కోరారు. ” అమెకు ముప్పు ఉన్నదా లేక దేశ భద్రతకే ఆమె ముప్పు తెచ్చారా ? ఉదయపూర్‌లో జరిగిన దురదృష్టకర హత్యకు ఆమె మాటలే కారణం ” అని జస్టిస్‌ పార్దీవాలా అన్నారు. నూపుర్‌ శర్మ తన వ్యాఖ్యల మీద క్షమాపణ చెప్పారని, వెనక్కు తీసుకున్నారని న్యాయవాది చెప్పగా ” దేశానికి క్షమాపణ చెప్పేందుకు ఆమె టీవీ స్టూడియోకు వెళ్లాలి. వెనక్కు తీసుకోవటం కూడా చాలా ఆలస్యమైంది. అది కూడా మనోభావాలు గాయపడితే అనే షరతులతో కూడి ఉంది. రెచ్చగొట్టేందుకు వీరేమీ మతపరమైన వారు కాదు.” అని కోర్టు పేర్కొన్నది.


నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించటం గురించి జస్టిస్‌ సూర్య కాంత్‌ మాట్లాడుతూ ” నూపుర్‌ పిటీషన్‌ ఆమె పొగరును వెల్లడిస్తున్నది. దేశంలోని మెజిస్ట్రేట్‌లు ఆమెకు చాలా చిన్నవారిగా కనిపిస్తున్నారు. ఆమె ఒక పార్టీ అధికార ప్రతినిధైతే ఏమిటి ? తన వెనుక అధికారం ఉందని, దేశంలోని చట్టాలతో నిమిత్తం లేకుండా ఏమైనా మాట్లాడగలనని ఆమె అనుకుంటున్నారు. కేవలం ఒక జాతీయ పార్టీ ప్రతినిధి అయినంత మాత్రాన క్షోభను కలిగించే అంశాలు మాట్లాడేందుకు లైసన్సు ఇవ్వరాదు. కోర్టులో ఉన్న అంశం గురించి ఆమె ఎందుకు మాట్లాడారు ” అని జస్టిస్‌ సూర్య కాంత్‌ ప్రశ్నించారు. ఈ అంశంలో ఢిల్లీ పోలీసుల తీరును కూడా కోర్టు ప్రశ్నించింది.పోలీసులు ఏమి చేశారు ? మా నోరు తెరిపించవద్దు అని సున్నితంగా కోర్టు మందలించింది.వివిధ రాష్ట్రాల నుంచి నిరంతరం వస్తున్న బెదిరింపులతో తన ప్రాణాలకు ముప్పు ఉందని నూపుర్‌ శర్మ తన పిటీషన్‌లో పేర్కొన్నారు.


దేవుడు నైవేద్యం ఆరగించడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే ఎక్కడో ఒక చోట జరిగిన దాని మీద వివిధ రాష్ట్రాల్లో కేసులు పెట్టి ఏండ్లతరబడి తిప్పే అంశం బిజెపికి చెందిన నూపుర్‌ శర్మకు, అందునా లాయర్‌ గనుక ఆమెకు తెలిసినంతగా మరొకరికి తెలియదు.కాషాయ దళాలు ప్రత్యేక శిక్షణతో ఉంటాయి.నీవు నేర్పిన విద్యఏనీరజాక్షా అన్నట్లుగా మిగతావారూ ప్రారంభించారు. బహుశా ఆ దృశ్యాలు కనిపించి తన మీద ఉన్న కేసులన్నింటినీ ఢిల్లీలోనే విచారించాలని కోరి ఉండవచ్చు. నూపుర్‌ శర్మ గురించి సుప్రీం కోర్టు తీవ్రమైన వ్యాఖ్యల నేపధ్యంలో కట్టుకథలకు, వక్రీకరణకు మారుపేరైన కాషాయదళాల నిర్వహణలోని వెబ్‌సైట్‌ ఓపి ఇండియా ఒక తప్పుడు కథనాన్ని ప్రచురించింది. నూపుర్‌ శర్మ దరఖాస్తును విచారించి తిరస్కరించిన ఇద్దరు సభ్యుల బెంచ్‌లో ఒకరు జెబి పార్దీవాలా. సదరు న్యాయమూర్తి గతంలో కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏగా, 1980-90లో గుజరాత్‌ స్పీకర్‌గా పని చేసినట్లు ఆ కథనంలో పేర్కొన్నది. నిజానికి ఆ పదవిలో ఉన్నది పార్దీవాలా తండ్రి బి పార్దీవాలా. పదవిలో ఉన్నది 1990 జనవరి 19 నుంచి మార్చి 16వరకు మాత్రమే, 86 ఏండ్ల వయస్సులో 2015లో మరణించారు. ఉద్రేకపడితే విచక్షణ ఎగిరిపోతుంది. జెబి పార్దీవాలా 2022 మే 9వ తేదీన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరించారు. అన్నీ సక్రమంగా ఉంటే ఇప్పుడున్న వారిలో సీనియారిటీ ప్రకారం 2028 మే నెలలో ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొంది రెండు సంవత్సరాల మూడు నెలలపాటు కొనసాగుతారు. గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసినపుడు ఇచ్చిన ఒక తీర్పులో ప్రస్తావించిన అంశాల మీద అభ్యంతరాలు వ్యక్తం కావటంతో వాటిని వెనక్కు తీసుకున్నారని ఇప్పుడు అదే న్యాయమూర్తి శుక్రవారం నాడు నూపుర్‌ శర్మ మీద అనవసరమైన వ్యాఖ్యలు చేసినట్లు అర్ధం వచ్చే రీతిలో ఒపిఇండియా కథనం ఉంది.


దానిలో పేర్కొన్నదాని ప్రకారం పటేల్‌ సామాజిక తరగతికి రిజర్వేషన్లు కల్పించాలన్న పిటీషన్‌ విచారణ సందర్భంగా ” ఈ దేశాన్ని నాశనం చేసింది లేదా సరైన దారిలో ముందుకు పోయేందుకు ఆటంకం కలిగించిన రెండు అంశాల పేర్లు చెప్పమని ఎవరైనా నన్ను అడిగితే రిజర్వేషన్లు, అవినీతి అని చెబుతా. ఆరున్నర దశాబ్దాల తరువాత రిజర్వేషన్లు కావాలని అడిగితే ఏ పౌరుడికైనా సిగ్గు చేటు. మన రాజ్యాంగాన్ని రూపొందించినపుడు పది సంవత్సరాల పాటు రిజర్వేషన్లు ఉండాలని భావించారు. కానీ దురదృష్టం కొద్దీ స్వాతంత్య్రం వచ్చిన 65 సంవత్సరాల తరువాత కూడా కొనసాగుతున్నట్ల ” పార్దీవాలా అన్నట్లు, దాంతో జడ్జి పదవి నుంచి తొలగించాలని 58 మంది రాజ్యసభ ఎంపీలు 2015లో పిటీషన్‌ దాఖలు చేసినపడు తన పదజాలాన్ని వెనక్కు తీసుకున్నట్లు పేర్కొన్నది. ఇక్కడ గమనించాల్సింది నిజంగా ఓపి ఇండియా రాసినట్లే జరిగిందా మరొకటా అన్నది కాదు. నూపుర్‌ శర్మ మీద సుప్రీం కోర్టు బెంచ్‌ జడ్జీలు చేసిన వ్యాఖ్యలు కూడా రిజర్వేషన్ల మీద చేసిన అంతటి తీవ్రమైనవైతే ఇప్పుడు కూడా బిజెపి, భుజాలు మార్చుకోకుండా దాన్ని మోస్తున్న పార్టీల ఎంపీలందరూ అలాంటి పిటీషన్‌ పెట్టమనండి.


నూపుర్‌ శర్మ నోటి దూల కలిగించిన పరిస్థితి గురించి దేశంలో ఉన్న అనేక మంది మనస్సులో ఉన్న మాటలనే సుప్రీం జడ్జీలు చెప్పారు.దాంతో బిజెపి, దాని అభిమానులకు అన్నింటికీ మించి నూపుర్‌ శర్మ చేసింది సరైనదే అని వాదించే, నమ్ముతున్నవారికి శుక్రవారం నాడు సుప్రీం కోర్టులో చెప్పుకోలేని చోట దెబ్బతగిలింది. సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు చేసిన వా ఖ్యల మీద ” మీడియా నేడు మౌనంగా ఉంది. వారి నోళ్లు మూసుకున్నారు.నూపుర్‌ శర్మ కేసులో ఎవరూ న్యాయమూర్తుల మాటల మీద బహిరంగంగా మాట్లాడటం లేదు. ఇది నిజంగా చెడురోజు ” అంటూ ఒపి ఇండియా సంపాదకులలో ఒకరైన నూపుర్‌ జె శర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలా మాట్లాడటం నూపుర్‌ శర్మకు బరితెగించి మద్దతు ఇవ్వటం తప్ప వేరు కాదు.ఆమె నోటి దూల పర్యవసానాలే ఉదయపూర్‌లోని ఒక సాధారణ దర్జీ ప్రాణాలు తీసేందుకు దారి తీసిందని సుప్రీం కోర్టే చెప్పింది. ఇలా చెప్పటమంటే హంతకులను సమర్ధించినట్లు కాదు. దర్జీ ఉదంతం మర్చిపోక ముందే మహారాష్ట్రలోని అమరావతి పట్టణంలో మరొకరు ఆమె నోటి దూలకు బలైనట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు దాన్ని నిగ్గుతేల్చాల్సి ఉంది. అమిత్‌ మెడికల్‌ స్టోర్స్‌ దుకాణదారు ఉమేష్‌ ప్రహ్లాదరావు కోహ్లే (54) జూన్‌ 21 రాత్రి 10-10.30 మధ్య హత్యకు గురైనాడు. ఆ వెనుకే వస్తున్న కుమారుడు సంకేత్‌, కోడలు ఉమేష్‌ను ఆసుపత్రిలో చేర్చినా ఫలితం లేకపోయింది. పోలీసులు చెబుతున్న ప్రాధమిక సమాచారం ప్రకారం ఉమేష్‌ వాట్సాప్‌ గ్రూపులో నూపుర్‌ శర్మకు మద్దతుగా పెట్టిన లేదా ఫార్వర్డ్‌ చేసిన పోస్టు తన ఖాతాదారులైన ముస్లింలు ఉన్న గ్రూపులో కూడా పెట్టాడు. ఈ కేసులో అరెస్టైన ఐదుగురు నిందితుల్లో ఒకడు మహమ్మద్‌ ప్రవక్తను కించిపరిచిన వారు చావాల్సిందే అని పోలీసులతో చెప్పినట్లు ఒక అధికారి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తన తండ్రి అలాంటి వాడు కాదని తాను కూడా అదే కథనాన్ని విన్నట్లు, డబ్బుకోసమైతే తన తండ్రిని చంపలేదని మాత్రం తాను చెప్పగలనని కుమారుడు చెబుతున్నాడు. పోలీసులు స్పష్టంగా దేన్నీ చెప్పలేదు.


న్యాయమూర్తుల వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఆదేశించాలన్న దరఖాస్తు ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఉంది. దాన్ని ఏమి చేస్తారన్నది ఆసక్తికర అంశం. ఒక వేళ దరఖాస్తు దారు కోరికను మన్నిస్తే కొత్త సమస్యలకు దారి తీస్తుంది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు మౌఖికంగా ఏమీ మాట్లాడేందుకు వీలుండకపోవచ్చు. దీన్ని అంగీకరిస్తే గతంలో సుప్రీంతో సహా వివిధ కోర్టులలో చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కొత్త పిటీషన్లు, కేసులు దాఖలు కావచ్చు.


పాత కేసుల పేరుతో ఎలా వేధించవచ్చో ఆల్ట్‌ న్యూస్‌ జర్నలిస్టు మహమ్మద్‌ జుబేర్‌ ఉదంతం వెల్లడించింది. 2018లో చేసిన ఒక ట్వీట్‌ మీద దాఖలు చేసిన కేసులో గతనెలలో జుబేర్‌ను అరెస్టు చేసి నాలుగు రోజుల పాటు కస్టడీకి పంపారు. ఒక ట్వీట్‌ మీద ఢిల్లీ పోలీసులు నాలుగు సంవత్సరాలుగా విచారణ చేస్తూనే ఉన్నారట. ఒక వేళ అరెస్టు చేయాల్సినంత పెద్ద నేరమైతే అప్పుడే చేసి ఉండాలి. ఇంతకూ మతపరమైన మనోభావాలను గాయపరచినట్లు ఆరోపించిన జుబేర్‌ ట్వీట్‌లో ఉన్నదేమిటి ? ఒక పాత హిందీ సినిమాలో ఒక హౌటల్‌ మీద హనుమాన్‌ హౌటల్‌ అని రాసి ఉన్న ఉన్న చిత్రాన్ని తీసుకొని దాని కింద ” 2014కు ముందు హనీమూన్‌ హౌటల్‌ 2014 తరువాత హనుమాన్‌ హౌటల్‌ ” అని ట్వీట్‌ చేశారు. దాని మీద హనుమాన్‌ భక్త అనే పేరుతో ఉన్న ఒక ట్విటర్‌ ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేశారట. హనుమంతుడు బ్రహ్మచారి, ఇలా రాయటం హిందువులను నేరుగా అవమానించటమే కనుక చర్యతీసుకోవాలని సదరు ట్వీట్టర్‌ పోలీసులకు ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేశాడట. అసలు ఫిర్యాదీ చిరునామా లేకుండా కేసు ఎలా పెడతారని జుబేర్‌ కోర్టులో ప్రశ్నిస్తే చిరునామా లేకుండా ట్వీటర్‌ సంస్థ ఖాతా తెరవదు కదా అని ప్రభుత్వ ప్లీడర్‌ సమాధానం. అది ఊరూపేరులేని ట్విటర్‌ ఖాతా కావచ్చు. ప్రపంచమంతటా అలాంటి నకిలీ ఖాతాలు ఉన్నపుడు ఆ సాకుతో కేసు పెట్టవచ్చు. తమకు నచ్చని లేదా లొంగని వారిని ఎలా వేధించే పరిస్థితి దేశంలో ఉందో ఈ ఉదంతం వెల్లడిస్తున్నది. అంతే కాదు ఒక చిన్న కేసును సంవత్సరాల తరబడి పరిష్కరించలేని అసమర్ధత మన పోలీసు శాఖలో ఉందని ఎవరన్నా అన్నా ఉడుక్కోనవసరం లేదు. అనేక పాత సినిమాలు, విమర్శనాత్మక గ్రంధాలలో అనేక అంశాలు ఉన్నాయి. అవి మా మనోభావాలను దెబ్బతీశాయని కేసులు పెడతారా ? వాటన్నింటినీ విచారిస్తారా ? ఎక్కడికి పోతున్నదీ అసహనం ? దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నామని పాలకులు చెప్పేదానికి అర్ధం ఇదా ?