Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


అమెరికా ఆధిపత్యంలోని నాటో కూటమి సృష్టించిన వివాదంలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన ప్రత్యేక సైనిక చర్య బుధవారం నాడు 133వ రోజులో ప్రవేశించించింది. డాన్‌బాస్‌లో కొంత మినహా మిగిలిన ప్రాంతం నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ, దానికి అనుబంధంగా ఉన్న కిరాయి నాజీ మూకలను రష్యా మిలిటరీ తరిమివేసింది. లుహానస్క్‌ ప్రాంతాన్ని విముక్తి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్‌ అభినందనలు తెలిపారు. లుహానస్క్‌ వేగంగా పతనం కావటాన్ని చూస్తే రష్యా సేనల మధ్య మెరుగైన సమన్వయం ఉన్నట్లు కనిపిస్తోందని బ్రిటన్‌ రక్షణశాఖ పేర్కొన్నది. మరోవైపు తమ సేనలు వెనక్కు తగ్గటం, రష్యా దళాలను అడ్డుకోవటం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలెనెస్కీ చెప్పాడు. డాన్‌టెస్క్‌ ప్రాంతం కూడా త్వరలో పతనం కానున్నట్లు వార్తలు. మూలనున్న ముసలమ్మలు, ఉయ్యాళ్లలో ఉన్న పసి పిల్లలు కూడా తుపాకులు పట్టి పుతిన్‌ సేనలను తరిమికొడుతున్నారన్న కథలు ఇప్పుడు ఎక్కడా వినిపించటం లేదు. ఒక వేళ చెప్పినా నాటో కూటమి దేశాల్లో జనం క్రమంగా చెవుల్లో పూలు తొలగించుకుంటున్నారు గనుక నమ్మని పరిస్థితి. కనుక ఆయాసపడినా ఫలితం ఉండదని గ్రహించి వాటిని తగ్గించారు.


గత నెలలో జర్మనీలో జి7, మాడ్రిడ్‌లో నాటో కూటమి సమావేశాలు జరిగాయి. రెండుచోట్లా రష్యాను ఎలా దెబ్బతీయాలి, కొత్త చోట్ల ఎలా చిచ్చు పెట్టాలన్న ఆలోచనల చుట్టూ చర్చలు, నిర్ణయాలు చోటు చేసుకున్నాయి. అంతర్గతంగా జరుగుతున్న మల్లగుల్లాల్లో మాత్రం ఉక్రెయిన్‌ సంక్షోభం నుంచి బయటపడేదెలా ? అనుకున్నదాని కంటే రష్యా మెరుగ్గా ఎలా ఉంది, నెలల తరబడి చేసిన కసరత్తు వృధాగా మారిందా? అన్న అంశాలున్నాయని వార్తలు. ఐరోపా సమాఖ్య(ఇయు) ఆర్ధిక పురోగతికి, దేశాల మధó్య ఆటంకాలను తొలగించుకొనేందుకు ఏర్పడింది.అలాంటి వేదికపై ఇప్పుడు మిలిటరీ అంశాల గురించి చర్చలు చోటు చేసుకుంటున్నాయి. నిరంతరం ప్రపంచంలో సామ్రాజ్యవాదులు రెండు రంగాల్లో యుద్ధాలు చేస్తున్నారు. ఒకటి ఆర్ధిక, రెండవది మిలిటరీ. రష్యా మీద ఆంక్షల రూపంలో అమెరికా, ఐరోపా సమాఖ్య తన నిర్ణయాలను ప్రపంచం మీద రుద్దాలని చూస్తున్నది. వందల కోట్ల డాలర్ల మేరకు ఆయుధాలను అందిస్తూ నాటో కూటమి ఉక్రెయినుకు వెన్నుదన్నుగా ఉంది.


వ్లదిమిర్‌ పుతిన్‌కు దగ్గరగా ఉన్నట్లు భావించిన వారిలో 1,100 మంది ఆస్తులను పశ్చిమ దేశాలు ఆర్థిక ఆంక్షల్లో భాగంగా స్థంభింప చేశాయి. ఐరోపా ద్రవ్యమార్కెట్లకు రష్యన్‌ బాంకులను దూరం చేశారు. రష్యా ఎగుమతులతో పాటు అది ఐరోపా నుంచి చేసుకొనే దిగుమతులపై ఆంక్షలు పెట్టారు.దాదాపు వంద బిలియన్‌ యురోల విలువగల వస్తువులను అడ్డుకున్నారు. దీన్ని ” ఎగుమతి నియంత్రణలను మిలిటరీకరించటం ”గా పిలుస్తున్నారు. ఆర్ధిక కూటమి నుంచి భద్రతా కూటమిగా స్వయంగా మార్పు చెందటంగా చెబుతూ ఇటీవలి కాలంలో ఆ దిశగా ఇయు చేసిన చట్టాలను ఉటంకిస్తున్నారు. అమెరికా ఆదేశాలను ఇయు సభ్య దేశాలపై రుద్దుతున్నది. పరిస్థితిని ఆసరా చేసుకొని అనేక అధికారాలను స్వంతం చేసుకుంది. అమెరికా తాను తీసుకున్న నిర్ణయాలను ముందుగా ఇయుకు చెప్పి తరువాత ఇతర దేశాలతో సంప్రదింపుల తతంగం జరుపుతున్నది. రష్యా మీద అమలు జరిపిన ఈ ఎత్తుగడను చైనాకు విస్తరించేందుకు పూనుకున్నారు.


గతేడాది నవంబరులో అమెరికా సిఐఏ డైరెక్టర్‌ బిల్‌ బర్న్‌ ఐరోపా సమాఖ్య ప్రధాన కార్యాలయం ఉన్న బ్రసెల్స్‌ వచ్చి రహస్య సమావేశాలు జరిపి ఉక్రెయిన్‌ మీద పెద్ద ఎత్తున దాడి చేసేందుకు పుతిన్‌ సిద్దం అవుతున్నాడు, ఏం చేద్దామని అడిగాడు. గత కొద్ది నెలలుగా పుతిన్‌ సన్నద్దం అవుతున్నాడు. మీరు కూడా భాగస్వాములవుతారు గనుక చలికాలంలో గాస్‌ అవసరం మీకుంటుంది. మిమ్మల్ని ఇరుకున పెట్టేందుకుగాను మీరు నిల్వ చేసుకొనేందుకు వీల్లేకుండా గాస్‌ సరఫరాలను తగ్గించాడని కూడా చెప్పాడు. మిలిటరీగా నాటో జోక్యం కుదిరేది కాదు గానీ, కావాలంటే 2014 క్రిమియా విలీనం తరువాత మీరు చేస్తున్న ఆర్ధిక దాడుల్లో మేము కూడా భాగస్వాములం అవుతామని ఇయు నేతలు అంగీకరించారు. ఐదు రకాలుగా ఆంక్షలు అమలు జరపాలని ముందే పధకం వేశారు. తరువాత కసరత్తు చేసి ఎలా అమలు జరుపుతున్నదీ తెలిసిందే. రష్యా సైనిక చర్య డాన్‌బాస్‌ ప్రాంతానికే పరిమితం అవుతుందని, మనకు పెద్దగా పని ఉండదని అనేక మంది భావించారు. ఏకంగా రాజధాని కీవ్‌ మీదనే దాడులు జరపటంతో అంతకు ముందే అనుకున్న దశలవారీ ఆంక్షలను వేగంగా వెంటనే ప్రకటించారు. అది కొన్ని దేశాలకు ఇబ్బందికరంగా మారింది. ఎయిర్‌ బస్‌ కంపెనీకి అవసరమైన టిటానియంను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు. దాంతో నాలక్కరుచుకొని అబ్బే వాటికి వర్తించవని సడలించారు. అలాగే కొన్ని దేశాలకు ఇంథన సరఫరాలకు మినహాయింపునిచ్చారు.


ఆంక్షల్లో ఉన్న లోపాలను ఆధారం చేసుకొని మూడవ పక్ష దేశాల నుంచి రష్యన్లు కంప్యూటర్లు, కార్ల విడిభాగాల వంటి వాటిని దిగుమతి చేసుకున్నారు. తమ నుంచి దిగుమతి చేసుకొనే వారు రూబుళ్లలోనే చెల్లించాలన్న ఎత్తుగడ కూడా కొంత మేరకు ఫలించింది.అన్నింటికీ మించి పశ్చిమ దేశాలు ఊహించని విధంగా లబ్ది పొందింది. ఇంథన ఉత్పత్తిని తగ్గించినప్పటికీ ఇప్పటి వరకు గతం కంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. తమ ఆంక్షల ఫలితంగా రష్యాలో పదిశాతం ఉత్పత్తి తగ్గుతుందని, ఇరవై శాతం పెట్టుబడులు ఆగుతాయని, అవసరమైన విడి భాగాలకు కొరత ఏర్పడి ఆయుధ పరిశ్రమల మూత, చివరికి ట్రాక్టర్లకు సైతం కొరత, వీటన్నింటి ఫలితంగా ఆర్ధిక సంక్షోభం, రాజకీయంగా పుతిన్‌కు ఎసరు వస్తుందని రాసుకున్న నివేదికలన్నింటినీ పశ్చిమ దేశాలు ముందు వేసుకొని నాలుగు నెలలు గడిచినా అలా ఎందుకు జరగటం లేదని పదే పదే చదువు కుంటున్నాయి. మరోవైపున అమెరికాతో సహా పశ్చిమ దేశాల్లో ద్రవ్యోల్బణం, ఆర్ధిక దిగజారుడు మాంద్యానికి గురికానున్నట్లు వార్తలు. పెరుగుతున్న ఇంథన ధరలు ఐరోపాలోని అనేక దేశాల్లో దారిద్య్రం పెరగనుందని రష్యన్‌ మీడియా చెబుతోంది.


పశ్చిమ దేశాలు ఊహించని మరొక అంశం. రష్యా సరిహద్దులకు వెలుపల మాస్కో నుంచి 1,257 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న రిపబ్లిక్‌ కలినిన్‌గ్రాడ్‌. దీని జనాభా ఐదు లక్షలు. రష్యా నుంచి రోడ్డు మార్గంలో రావాలంటే ఒక వైపున లాత్వియా, లిథువేనియా మీదుగా, మరోవైపు నుంచైతే బెలారస్‌,లిథువేనియా మీదుగా రావాల్సి ఉంటుంది. నౌకా మార్గంలోనైతే బాల్టిక్‌ సముద్రం నుంచి చేరుకోవచ్చు.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత జర్మనీ-సోవియట్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం జర్మనీ కలినిన్‌గ్రాడ్‌ ప్రాంతాన్ని సోవియట్‌కు అప్పగించింది. 1990దశకంలో సోవియట్‌ విడివడిన తరువాత అది రష్యా ఆధీనంలోకి వచ్చింది. ఉక్రెయిన్‌ వివాదం తలెత్తిన తరువాత ఈ ప్రాంతానికి రష్యా నుంచి సరఫరాలను అనుమతించాలా లేదా అన్నది సమస్యగా మారింది. ఉక్కు, అల్యూమినియం వంటివి ఆంక్షల జాబితాలో ఉన్నప్పటికీ వాటి రవాణాను పునరుద్దరించాలని ఐరోపా సమాఖ్య తాజాగా నిర్ణయించింది. జూన్‌ పదిహేడవ తేదీ నుంచి రైళ్ల ద్వారా నిర్మాణ సామాగ్రి, బొగ్గు,ఖనిజ రవాణాను లిథువేనియా నిలిపివేసింది. ఉక్రెయిన్‌ వివాదానికి ముందు ఎంత పరిమాణంలో సరఫరా ఉంటే అంతే అనుమతిస్తామని ఐరోపా సమాఖ్య చెబుతోంది. కలినిన్‌ గ్రాడ్‌ నుంచి ఇతర దేశాలకు సరఫరా కాకుండా అడ్డుకొనేందుకు ఈ షరతు విధిస్తున్నారు.లిథువేనియా వైఖరితో విబేధించిన జర్మనీ ఐరోపా సమాఖ్య ద్వారా తన నిర్ణయాన్ని అమలు చేయిస్తున్నదని వార్తలు వెలువడ్డాయి. రష్యా-ఉక్రెయిన్‌ వివాదంలో ఆంక్షలను జర్మనీ సమర్ధిస్తున్నప్పటికీ యుద్ధంలో నాటో భాగస్వామి కాకూడదని కోరుకుంటోంది. అనవసర వివాదాలతో రష్యాను మరింతగా రెచ్చగొట్టవద్దని కూడా చెబుతోంది. అయితే లిథువేనియా దీని గురించి రుసరుసలాడుతోంది. ఐరోపా కమిషన్‌లో రష్యా భయాన్ని నింపిందని, ఇది కొన్ని రైల్వే వాగన్ల అంశం కాదని, రష్యా బెదిరింపులకు లొంగినట్లు కనిపిస్తోందని, ఇది ఇంతటితో ఆగదని, ఐరోపాలో చీలికలు తెచ్చేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుందని, తమ పరువు తీశారని, ఇప్పుడు నాటోలో భాగంగా లిథువేనియాలో ఉన్న జర్మన్‌ దళాలను ఉంచుతారా వెనక్కు తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉందని అక్కడి విశ్లేషకులు చిత్రిస్తున్నారు. చివరికి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాల్సి ఉంది.


జి7, నాటో సమావేశాల్లో ఆంక్షలను మరింతగా పెంచాలని సంకల్పం చెప్పుకున్నారు, ఉక్రెయినుకు ఆయుధ సరఫరాను పెంచాలని నిర్ణయించారు. ఇదే సమయంలో తమ పరువు కాపాడుకుంటూ వివాదాన్ని ఎలా ముగించాలా అనే ఆలోచన కూడా చేస్తున్నారు. తొలి రోజుల్లో ఉక్రెయిను గట్టిగా నిచినట్లు కనిపించినా దాని అడుగుజారుతున్నట్లు అంతర్గతంగా పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. మిలిటరీ, ఆర్ధిక లక్ష్యాలను దెబ్బతీస్తూ రష్యా అడుగులు వేస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే పశ్చిమ దేశాలు ఇచ్చిన అస్త్రాలతో ఉక్రెయిన్‌ ఆత్మరక్షణకు పాల్పడుతున్నది తప్ప రష్యా చేతికి చిక్కిన ప్రాంతాలను తిరిగి పొందే అవకాశం కనిపించటం లేదు. ఉక్రెయిన్‌తో పోలిస్తే ఆర్ధికంగా, ఆయుధపరంగా రష్యా పైచేయితో ఉంది. దాడులు మరికొంత కాలం ఇదే తీరుతో కొనసాగితే అంతర్గతంగా ఉక్రెయిన్‌ జనం స్పందన ప్రతికూలంగా మారవచ్చు.ఇరుగు పొరుగు దేశాలకు శరణార్ధులకు ఆశ్రయం కల్పించటం,ఆర్ధిక సాయం భారంగా మారవచ్చు.


సైనిక చర్య ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, ఇంకా ఎంత మేరకు ఉక్రెయిన్‌ ధ్వంసమౌతుందో అంచనా లేదు. ఇప్పటి వరకు జరిగినదాన్నుంచి పునర్‌నిర్మాణం జరగాలంటే 750బిలియన్‌ డాలర్లు అవసరమని, ఈ బాధ్యతను ప్రజాస్వామిక ప్రపంచమే చేపట్టాలని జెలెనెస్కీ డిమాండ్‌ చేస్తున్నాడు. ఉక్రెనియన్లలో అసంతృప్తి తలెత్తకుండా చూసేందుకు పునర్‌నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లు హడావుడి చేస్తున్నారు. ఇప్పటి వరకు 6.84 బిలియన్‌ డాలర్ల ప్రతిపాదనలు వచ్చినట్లు ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్స్‌ ప్రకటించారు, ఎక్కడ 750 ఎక్కడ 6.84 బి.డాలర్లు ? స్విడ్జర్లాండ్‌లో జరిగిన రెండు రోజుల సమావేశంలో 40 దేశాలు, సంస్థలకు చెందిన వారు తాము భాగస్వాములం అవుతామని సంతకాలు చేశారు. ఈ సంక్షోభం పరోక్షంగా ప్రపంచమంతటినీ ప్రభావితం చేస్తోంది. పరిస్థితి ఇంకా దిగజారితే దాన్ని ఎగదోస్తున్న పశ్చిమదేశాల వైపు చూపే వేళ్ల సంఖ్య పెరుగుతుంది.