ఎం కోటేశ్వరరావు
ధరలు ఎంత పెంచినా జనం ఆమోదిస్తున్నారు, ఎక్కడా నిరసన తెలపటం లేదు. విశ్లేషకులు, జర్నలిస్టులకు ఎందుకు ? ఇదీ ఇటీవల బిజెపి నేతలు వేస్తున్న ప్రశ్నలు, చేస్తున్న ఎదురుదాడి. శ్రీలంక పరిణామాలు ఇక్కడా పునరావృతం అయ్యేంతవరకు అలానే మాట్లాడతారు అది వేరే అనుకోండి. 2022 జూలై మొదటి వారంలో సాధారణ వంటగాస్ ధరను మరో రు.50 పెంచారు. దీంతో హైదరాబాదులో రు.1,105కు చేరింది. అంతకు ముందు ఎంత పెంచినా జనాలు కిక్కురు మన లేదు, ఇప్పుడూ అంతే. పార్టీల పిలుపుల్లో కారకర్తలు తప్ప ఇతర జనాలు కనిపించరు. మంచం ఉన్నంత వరకే కాళ్లు ముడుచుకొని నిద్రించటం అలవాటైన వారం కదా ! సర్దుకు పోవటంలో మన తరువాతే ఎవరైనా ! కందకు లేని దురద కత్తిపీటకెందుకు అన్నట్లుగా జనానికి లేనిది ఎవరికైనా ఎందుకు మరి ! అయినా సరే కొన్ని అంశాలను చెప్పక తప్పదు. ఆసక్తి ఉన్న వారు చదవండి మరి !
జూలైలోనే ప్రభుత్వం విండ్ ఫాల్ టాక్సు పేరుతో చమురు సంస్థల మీద పన్ను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది మామూలుగా విధించే పన్నుకు అదనం, తాత్కాలికం. దాని వలన కేంద్ర ప్రభుత్వానికి లక్ష నుంచి లక్షా 30వేల కోట్ల వరకు వస్తుందని కొందరు చెబుతుండగా ఇంకా ఎక్కువ ఉండవచ్చని కొన్ని అంచనాలు. సరే ఎంతైనా అది సెస్ గనుక వాటిలో రాష్ట్రాలకు వచ్చేదేమీ ఉండదు. అమ్మకపు పన్ను, జిఎస్‌టి, మరొక పన్ను గురించో విన్నాం గానీ విండ్‌ఫాల్ టాక్సు గురించి పెద్దగా తెలియదు. దీనికి తెలుగులో సరైన పదాన్ని నిఘంటువులేవీ చూపటం లేదు. గాలి వాటు (ఆదాయంపై ) పన్ను అందాం. ఒక కంపెనీకి దాని ప్రమేయం లేకుండా ఆర్ధికంగా పెద్ద మొత్తంలో లాభాలు, లబ్ది పొందటాన్ని విండ్ ఫాల్ అంటున్నారు. నదులకు భారీగా వరదలు వచ్చినపుడు లంకల్లో ఉన్న పొలాలకు సారవంతమైన ఒండ్రు మట్టి చేరి పంటలు బాగా పండుతాయి. కొత్తగా కొన్ని లంకలు ఏర్పడి భూమిగా అందుబాటులోకి కూడా రావచ్చు. దీనికి రైతుల ప్రమేయం లేదా ప్రయత్నాలుగానీ ఉండవు. అలాగే పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు అలాంటి లాభాలు వస్తాయి.ఉక్రెయిన్ వివాద ఫలితంగా మన దేశంలోని చమురు కంపెనీలకు అలాంటి అపరిమిత లాభాలు వస్తున్నందున వాటి మీద కేంద్ర ప్రభుత్వం పన్ను విధించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు గాలివాటు పన్ను ఇలా ఉంది. మన దేశం నుంచి ఎగుమతి చేసే పెట్రోలుకు రు.6, డీజిలు మీద రు.13, విమాన ఇంథనానికి లీటరుకు ఒక రూపాయి, దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురు మీద టన్నుకు రు.23,250 చెల్లించాల్సి ఉంటుంది.
కొన్ని దేశాల్లో గాలివాటు లాభాలపై పన్ను విధిస్తుంటే జర్మనీలో ఇంథన సంస్థలను ఆదుకొనేందుకు వినియోగదారుల మీద భారాలు మోపేందుకు అక్కడి సర్కారు ఆలోచిస్తున్నది. పెరుగుతున్న ఇంథన ధరల మేరకు అదనంగా వసూలు చేసేందుకు చట్టసవరణకు పూనుకుంది. రష్యా ప్రభుత్వం కూడా ఇంథన రంగ సంస్థ గాజ్‌ప్రోమ్ గాలి వాటు లాభాలపై 20బిలియన్ డాలర్ల మేరకు పన్ను విధించింది. సెప్టెంబరు నుంచి మూడు నెలల పాటు నెలకు 6.5బి.డాలర్ల చొప్పున పన్ను వసూలు చేస్తారు. ఈ సొమ్ము ప్రభుత్వ ఖజనాకు చేరుతుంది. ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన తరువాత ఐరోపాకు, చమురు, గాస్ సరఫరాను తగ్గించినప్పటికీ ఈ సంస్థ రోజుకు పది కోట్ల డాలర్లకు పైగా సంపాదిస్తున్నది. సరఫరాలు తగ్గినా గత ఏడాది వచ్చిన దానికి సమంగా సంపాదిస్తున్నది. ఇటలీలో ఇంథన ధరలు పెరిగిన కారణంగా ప్రభావితులైన వినియోగదారులు, వాణిజ్య సంస్థలను ఆదుకొనేందుకు అక్కడి చమురు సంస్థల లాభాలపై 25శాతం పన్ను విధించినట్లు ప్రకటించారు.బ్రిటన్‌లో 2022 మే26 వతేదీ తరువాత వచ్చిన లాభాలపై పన్నును 40 నుంచి 60శాతానికి పెంచారు. దీనికి ఇంథన ధరల లెవీ అని పేరు పెట్టారు.2025 తరువాత దాన్ని తొలగిస్తారు. మనం ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో ఈ పన్ను ఎందుకు విధించారు. ఆ వచ్చిన రాబడితో వంటగాస్, పెట్రోలు, డీజిలు ధరలను తగ్గించాల్సి ఉండగా గాస్ ధరను రు.50 ఎందుకు పెంచినట్లు ? ఎవరి కోసం ఈ పన్ను ఆదాయాన్ని ఖర్చు చేస్తారు ? ప్రశ్నించకుండా నోరు మూసుకున్నవారు దేశభక్తులు, అడిగినవారు దేశద్రోహులు !
దేశంలో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో వంటగాస్‌ను ప్రోత్సహించారు.ప్రజల కొనుగోలు శక్తి తక్కువగా ఉన్నందున దానికి గాను సబ్సిడీలు కూడా ఇచ్చారు. దీంతో వినియోగదారులు గణనీయంగా పెరిగారు. కరోనా లాక్‌డౌన్ విధించిన 2020లో పెట్రోలు కంటే దేశంలో తొలిసారిగా గాస్‌ను ఎక్కువగా కొనుగోలు చేశారు. తరువాత తిరిగి పెట్రోలు పెరిగిందనుకోండి. సబ్సిడీలను ఎత్తివేసేందుకు గాను వేసిన ఎత్తుగడ ఏమంటే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వినియోగదారుల ఖాతాలో వేస్తామంటూ గాస్ ధర మొత్తాన్ని ముందుగా చెల్లించే అలవాటు చేశారు. తరువాత స్వచ్చందంగా సబ్సిడీ వదులు కోవాలన్న తతంగం నడిపారు. బిజెపి దేశభక్తులు కూడా వదులుకోకపోవటంతో క్రమంగా సబ్సిడీ ఎత్తివేశారు. ఐదుశాతం మంది స్వచ్చందంగా వదులు కున్నట్లు చెప్పగా కాగ్ సదరు అంకెలతో అంగీకరించలేదు. 2014లో గాస్ ధర రు.414 కాగా తాజా పెంపుదలతో అది రు.1,105(హైదరాబాదు)కు పెరిగింది. 2014 తరువాత నిజానికి అంతర్జాతీయ మార్కెట్లో గాస్ ధర ముడిచమురుతో పాటు గణనీయంగా తగ్గింది.
అబ్జర్వర్ రిసర్చ్ ఫౌండేషన్ (ఒఆర్‌ఎఫ్) 2021 డిసెంబరు నాలుగవ తేదీన ప్రచురించిన ఒక విశ్లేషణలో పేర్కొన్న అంశాల సారాంశం ఇలా ఉంది.2013-14 నుంచి 2019-20 కాలంలో అంతర్జాతీయ ఎల్‌పిజి(వంటగాస్) ధర 48శాతం తగ్గింది. అదే 2020-21తో పోల్చితే తగ్గుదల 31శాతం ఉంది.2014 ఏప్రిల్ నుంచి 2021 అక్టోబరు వరకు మన దేశంలో ధరను 110శాతం పెంచారు. కరోనా లాక్‌డౌన్ల ఎత్తివేత తరువాత మాత్రమే అంతర్జాతీయ ధర పెరిగింది.అంతకు ముందు ఆరు సంవత్సరాలు తగ్గింది. ఈ కారణంగానే ప్రభుత్వం మీద సబ్సిడీ భారం తగ్గింది.2013-14 నుంచి 2015 – 16 మధ్య ప్రభుత్వం భరించిన సబ్సిడీ భారం 64శాతం తగ్గింది. అంకెల్లో 746.1 నుంచి 263 బిలియన్ల రూపాయలకు( మన కోట్లలో చెప్పుకుంటే 74,610 నుంచి 26,300 కోట్లకు) తగ్గింది. ఇదే కాలంలో చమురు కంపెనీలు భరించిన సబ్సిడీ మొత్తం 98శాతం అంటే రు.69,128 నుంచి రు.1,268 కోట్లకు తగ్గింది.వినియోగదారులకు నేరుగా చెల్లించిన సబ్సిడీ మొత్తం 2015-16 నుంచి 2020-21 కాలంలో రు.27,570 కోట్ల నుంచి రు.3,658 కోట్లకు తగ్గింది.
ధనికులకు సబ్సిడీని తగ్గించి పేదలకు పెంచామంటూ ప్రచార ఆర్భాటం చేసి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(పిఎంయువై) పధకం పేరుతో మంజూరు చేసిన గాస్ కనెక్షన్ల ప్రచారాన్ని అనేక మంది ప్రశ్నించారు. సబ్సిడీల గురించి అనుసరించిన లెక్కల పద్దతిని కాగ్ ప్రశ్నించింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఓటర్ల కోసం ఈ పధకాన్ని ప్రారంభించారు.2015-16లో ఈ పధకం కింద ఇచ్చినట్లు చెప్పిన సబ్సిడీ రు.2,990 కోట్లు కాగా 2019-20కి అది రు.1,293 కోట్లకు తగ్గింది. ఈ పధకం కింద గాస్ కనెక్షన్లు పొందిన వారి ఆదాయం పెరగని కారణంగా, సబ్సిడీ కోత వలన సిలిండరును తీసుకోలేకపోయారు.
పిఎంయువై పధకం కింద గాస్ కనెక్షను ఉన్నవారికి సిలిండర్‌కు రు.200 సబ్సిడీ ఇస్తున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది.2022 మే 12వ తేదీన హిందూ పత్రిక వార్తలో వెల్లడించిన సమాచారం ప్రకారం గత ఆర్ధిక సంవత్సరంలో 90 లక్షల మంది ఉజ్వల లబ్దిదార్లు గాస్‌ను తీసుకోలేదు. కోటి మంది ఒక సిలిండరు మాత్రమే తీసుకున్నారు. 2016 మే ఒకటవ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ప్రధాని నరేంద్రమోడీ ఈ పధకాన్ని ప్రారంభించారు.2020 మార్చి నాటికి ఎనిమిది కోట్ల కనెక్షన్లు ఇవ్వాలని చెప్పారు, తరువాత మరొక కోటి పెంచారు. సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా గత ఆర్ధిక సంవత్సరంలో (2021 మార్చి నాటికి) ఇచ్చిన కనెక్షన్లలో ఐఓసిలో ఒకసారి మాత్రమే సిలిండర్లు తీసుకున్నవారు 65, హెచ్‌పిసిలో 9.1, బిపిసిలో 15.96లక్షల మంది ఉన్నారు. 2019 సెప్టెంబరు వరకు తాము ఇచ్చిన కనెక్షన్ల గురించి బిపిసి ప్రత్యేకంగా పేర్కొన్నది. ఐఓసిలో ఒకసారి మాత్రమే తీసుకున్నవారు 52,హెచ్‌పిసిలో 27.58, బిపిసిలో 28.56లక్షల మంది ఉన్నారు.ఈ ఏడాది మార్చి నెలలో లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఏటా ఈ పధకం కింద కనెక్షన్ పొందిన వారు సగటున ఒక్కొక్కరు 3.6 సిలిండర్లు మాత్రమే తీసుకున్నారు. 2020 ఏప్రిల్ ఒకటి నుంచి డిసెంబరు వరకు కేంద్ర ప్రభుత్వం మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నట్లు ప్రకటించగా ఈ పధకం తీసుకున్న సిలిండర్ల సంఖ 14.17కోట్లని మరొక ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం తెలిపిందని హిందూ పత్రిక పేర్కొన్నది. తొమ్మిది కోట్ల మంది మూడు చొప్పున తీసుకుంటే 27 కోట్లు కావాలి, అంటే కరోనాలో కూడా ఉచితంగా ఇచ్చినా తీసుకొనే స్థితి లేదన్నది స్పష్టం. అలాంటపుడు కేవలం రెండువందల సబ్సిడీ ఇచ్చి తాజాగా పెంచిన రేటు ప్రకారం రు.900 పెట్టి కొనుగోలు చేసేందుకు ఎందరు ముందుకు వస్తారన్నది ప్రశ్న.వంటగాస్ ధరలకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సగటున ఒక లీటరు ధర జూలై నాలుగవ తేదీ నాటికి 80 సెంట్లు ఉంది. మన కరెన్సీలో రు.63.39 కాగా మన దేశంలో 87 సెంట్లు, రు.68.94 ఉంది. మన కంటే ఆస్ట్రేలియాతో సహా 28 దేశాలలో ధర తక్కువగా 22 చోట్ల ఎక్కువగా ఉంది. విశ్వగురువుగా అభిమానుల నుంచి అభినందనలు అందుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ ఏ దేశాలను ఆదర్శంగా తీసుకుంటారు ?
గాలి వాటు లాభాలు ఎలా ఉన్నాయంటే ప్రభుత్వ రంగ ఓఎన్‌జిసి 2020-21లో సంపాదించిన మొత్తం రు.1,10,345 కోట్లకు గాను దానికి వచ్చిన లాభం రు.40,306 కోట్లు. మన దేశంలో ఓఎన్‌జిసితో పాటు చమురును వెలికి తీసే వేదాంత ప్రైవేటు కంపెనీకి సైతం పెద్ద మొత్తంలో లబ్ది కలిగింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విధించిన గాలివాటు పన్నుతో ఈ రెండు కంపెనీల నుంచే కేంద్రానికి 69వేల కోట్ల మేరకు రాబడి ఉంటుందని పిటిఐ వార్తా సంస్థ పేర్కొన్నది. రిలయన్స్ కంపెనీ జామ్‌నగర్‌లోని చమురుశుద్ధి కర్మాగారం నుంచి ఎగుమతి చేస్తున్న చమురు ఉత్పత్తులపై ఆ కంపెనీ అపరిమిత లాభాలు ఆర్జిస్తున్నది. గాలివాటు పన్ను విధించిన తరువాత కూడా దానికి గణనీయ లాభాలు ఉంటాయని చెబుతున్నారు. జూన్ చివరి వారంలో కంపెనీ జిఆర్‌ఎం ఒక పీపాకు 24 నుంచి 26 డాలర్లవరకు ఉందని మోర్గన్ స్టాన్లీ అంచనా వేసింది. ఈ కంపెనీ శుద్ధి చేసిన ఉత్పత్తుల్లో 58శాతం ఎగుమతి చేస్తున్నట్లు జఫరీస్ సంస్థ తెలిపింది. గాలి వాటు పన్ను వలన జిఆర్‌మ్ ఒక పీపాకు 7 నుంచి 12 డాలర్లు తగ్గుతుందని అంచనా.2021లో పీపాకు 5.9, 2022లో 9.7 డాలర్లు రాగా రష్యా చమురు కారణంగా 2023లో 16.5 డాలర్లు ఉండవచ్చని నొమురా పేర్కొన్నది. గతంలో కేవలం ఐదు శాతం దిగుమతి చేసుకోగా ఇప్పుడు రష్యా చమురు 25శాతానికి పెరిగింది. గతంలో కేంద్ర ప్రభుత్వం చమురు ధరలు తగ్గినపుడు ఆ మేరకు జనాలకు తగ్గించకుండా సెస్‌లను విపరీతంగా పెంచి లక్షల కోట్లు తన ఖజనాకు మళ్లించింది. చమురు ధరలను తగ్గించలేదు. ఇప్పుడు చమురు కంపెనీలకు వస్తున్న అపరిమిత లాభాల నుంచి కొంత వసూలు చేయటం సమర్ధనీయమే. కార్పొరేట్లకు పన్ను తగ్గించిన కేంద్రం ఆత్మనిర్భర్ పేరుతో వాటికే మరికొంత లబ్ది చేకూర్చింది.గాలి వాటు పన్ను ద్వారా వచ్చే అదనపు రాబడిని ఎవరికోసం ఖర్చు చేస్తారు.కార్పొరేట్లగా సామాన్య జనాలకా ? గాస్, చమురు ధరల పెంపుదల ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారి తీస్తున్నది. పరిశ్రమల వృద్ధి, పెట్టుబడులకు ప్రోత్సాహం పేరుతో కంపెనీలకు ఇస్తున్న పలు రాయితీలు కొనసాగుతూనే ఉన్నాయి, మరి సామాన్యులకు సబ్సిడీల కోత – ధరల మోత ఎందుకు ?