Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


” నరేంద్ర మోడీ ఎనిమిదేండ్ల పాలన కారణంగా విదేశాల్లో ఉన్న భారత సంతతి దేశానికి మరింత దగ్గరైంది, ప్రపంచ వేదిక మీద భారత ప్రతిష్ట ఎన్నడూ లేని విధంగా ఉన్నత స్థాయిలో ఉంది ” 2022 జూన్‌ 14వ తేదీ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో శివప్రకాష్‌ అనే బిజెపి జాతీయ సంయుక్త కార్యదర్శి రాసిన ఆణిముత్యాలలో చెప్పిన అంశమిది. సరిగ్గా నెల రోజులకు ప్రపంచ ఆర్ధిక వేదిక విడుదల చేసిన ప్రపంచ లింగ సమానత్వ నివేదిక మన దేశం గురించి చెప్పిందేమిటో ఒక్కసారి చూద్దాం.


ప్రపంచ ఆర్ధిక వేదిక ప్రపంచ లింగ సామ్య లేదా పోలిక నివేదిక 2022ను తాజాగా విడుదల చేసింది.లెక్కలు కట్టే పద్దతి సరిగా లేదు లేకుంటేనా అన్నట్లుగా వివిధ ప్రపంచ సూచికల్లో మన స్థానం గురించి అధికారంలో ఉన్నవారు మాట్లాడతారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ మాటలు వినీ వినీ చిరాకు పుడుతోంది. లెక్కించే పద్దతి తప్పైతే, అది మన దేశ స్థానాలను సరిగా ప్రతిబింబించటం లేదు అనుకుంటే ఆ సర్వేల నుంచి మనం తప్పు కోవచ్చు లేదా వాటితో సంబంధం లేదని ప్రకటించవచ్చు. ఆడలేక మద్దెల ఓడు అంటే ఎలా ! ప్రపంచంలో 195 దేశాలున్నాయి, వాటిలో 193 ఐరాస సభ్యదేశాలు. పాలస్తీనా, వాటికన్‌ సిటీలకు పరిశీలక హౌదా కల్పించారు. ప్రపంచ సూచికల్లో ఈ దేశాలన్నీ ఉండవు. కనుక మనం కూడా తప్పుకోవచ్చు, పరువును మరింతగా పెంచుకోవచ్చు, చెప్పుకోవచ్చు.


2022 లింగ పోలిక నివేదికలో 146 దేశాలను చేర్చారు. దానిలో మనది 135వ స్ధానం, 2021నివేదికలో 156కు గాను మనది 140వ స్థానం చూశారా గతేడాది కంటే ఐదు స్థానాలు మెరుగుపరుచుకున్నాం అన్నట్లుగా చూపుతున్నారు. దేశాల సంఖ్య తగ్గింది. మన మెరుగుదల తరుగుదల మనం సాధించిన పాయింట్లను బట్టి చూడాలి. 2021లో వచ్చింది 0.629 కాగా 2022లో 0.625 గా నమోదు. పాయింట్లు పెరిగితే మన స్థానం మెరుగుపడి సూచికలో ఎగువకు పోతాం. కనుక ఇది మెరుగుదల అంటే చూసి నవ్వాలా ఏడవాలా ఎవరికి వారు తేల్చుకోవాల్సిందే. 2020లో 112లో ఉన్నాము. 2022లోప్రధమ స్థానంలో ఉన్న ఐస్‌లాండ్‌కు 0.908 రాగా రెండవ స్ధానంలో నిలిచిన ఫిన్లాండ్‌కు 0.860 వచ్చాయి. ఆడా మగా తేడా లేదు అంతాసమానం అని చెప్పుకొనే అమెరికా 0.769 స్కోరుతో 27వ స్ధానంలో, 25వ స్ధానంలో ఉన్న కెనడాకు 0.772 వచ్చాయి. దక్షిణాసియాలో బంగ్లాదేశ్‌ 71, నేపాల్‌ 96, శ్రీలంక 110, మాల్దీవులు 117, భూటాన్‌ 126, భారత్‌ 135, పాకిస్తాన్‌ 145, ఆప్ఘనిస్తాన్‌ 146వ స్థానంలో ఉంది. వీటిని చూపి మనం చివరి రెండు దేశాల కంటే మెరుగ్గా ఉన్నామని ఎవరైనా చెప్పుకుంటే నిజంగా సిగ్గు చేటు.


ప్రపంచంలో ఇప్పుడున్న స్థితిగతులను బట్టి లింగ సమానత్వాన్ని సాధించాలంటే మరో 132 సంవత్సరాలు పడుతుందని అంచనా. ఇది ప్రపంచ సగటు మాత్రమే. ప్రాంతాల వారీగా ఉత్తర అమెరికా 59, ఐరోపా 60, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల్లో 67,ఆఫ్రికాలోని సబ్‌ సహారా ప్రాంతంలో 98, ఉత్తర ఆఫ్రికా, మధ్య ప్రాచ్యంలో 115, మధ్య ఆసియా 152, తూర్పు ఆసియా, పసిఫిక్‌ ప్రాంతంలో 168, దక్షిణాసియాలో 197 సంవత్సరాలు పడుతుందని అంచనా. 2021 నివేదికలో ఇది 195.4 సంవత్సరాలుగా ఉంది. ఈ లోపల కరోనా వంటి మహమ్మారులు, ఇతర కల్లోలాలు వస్తే మరింత ఆలశ్యం అవుతుందని వేరే చెప్పనవసరం లేదు. కరోనాకు ముందు లింగసమానత్వ సాధనకు పట్టే సగటు కాలాన్ని వంద సంవత్సరాలుగా అంచనా వేశారని గమనించాలి. కరోనాతో మరో 32 సంవత్సరాలు వెనక్కు వెళ్లింది. కల్లోలాలు వచ్చినపుడు ముందుగా దెబ్బతినేది మహిళలే. గతేడాదితో పోలిస్తే నాలుగు సంవత్సరాలు తగ్గింది.


వివిధ ప్రపంచ సూచికల్లో మనం ఎక్కడున్నాం అన్నది వాటిని ప్రకటించినపుడల్లా కేంద్ర ప్రభుత్వ పెద్దలు తలెత్తుకోలేని స్థితిలో ఉన్నారు. కొన్ని సూచికల్లో మన స్థానాలేమిటో చూద్దాం.
ప్రపంచ పోటీ తత్వం 2022 – 37
ప్రజాస్వామ్య సూచిక 2021-46
నవకల్పన 2021-46
సులభతర వాణిజ్యం 2021- 63
డిజిటల్‌ నైపుణ్యం 2022 – 63
ఆరోగ్య భద్రత 2021 – 66
ప్రపంచ నైపుణ్యం 2022 – 68
ఆహార భద్రత 2021 – 71
చట్టబద్ద పాలన 2021 – 79
లంచాల ముప్పు 2021 – 82
అవినీతి సూచిక 2021- 85
ఆకలి సూచిక 2021 – 101
మానవ స్వేచ్చ 2020 – 111
పిల్లల హక్కులు 2021-113
ఇంటర్నెట్‌ వేగం 2022 – 115
ఆర్ధిక స్వేచ్చ 2021-121
యువజన అభివృద్ధి 2021- 122
అసమానతల తగ్గింపు కట్టుబాటు 2021-129
మానవ అభివృద్ది 2020 – 131
ప్రపంచ శాంతి 2021-135
సంతోష సూచిక 2021 -136
ప్రపంచ పత్రికా స్వేచ్చ 2022 -150
పర్యావరణ పనితీరు 2022-180


బేటీ బచావో బేటీ పఢావో అంటూ 2015 జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన ప్రచారం తరువాత లింగ సమానత్వంలో దేశం మరింత దిగజారింది. ఆర్ధిక రంగంలో భాగస్వామ్యం-అవకాశాలు, విద్య,ఆరోగ్యం-ప్రాణ రక్షణ, రాజకీయ సాధికారత అంశాల ప్రాతిపదికన లింగ సమానత్వ సూచికను ఖరారు చేస్తారు. తాము అధికారానికి వస్తే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్పిన పెద్దలు ఉభయ సభల్లో మెజారిటీ ఉన్నా దాని గురించి మాట్లాడరు. దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి ఏలుబడిలో మహిళలకు రాజకీయ సాధికారతకు ఒక సూచికగా పరిగణించే అంశంలో దిగజారటం తప్ప మార్కులు పెరగటం లేదు. 2019లో 23.1శాతంగా ఉన్న మహిళా మంత్రులు 2021 నాటికి 9.1శాతానికి తగ్గారు. చట్టసభల్లో, సీనియర్‌ అధికారులు, మేనేజర్లుగా ఉన్న మహిళలు 2022 నివేదిక ప్రకారం 17.6 శాతం మందే.


ఇన్ని వివరాలు చూసిన తరువాత నిజంగా కలికాలం లేదా కలి మహత్యం కాకపోతే ప్రపంచంలో దేశ ప్రతిష్టను నరేంద్రమోడీ పెంచారని ఎనిమిదేండ్ల తరువాత కూడా పాడిందే పాడరా అన్నట్లుగా ఇంకా చెప్పుకోవటం ఏమిటి ? జనం చెవుల్లో పూలు పెట్టటం అంటే ఇదే. బిజెపి నేతలకు, నరేంద్రమోడీ భక్తులకు నిజంగా ఈ వివరాలేవీ తెలియవా లేక తెలవనట్లు నటిస్తున్నారా ? ఇలాంటి తప్పుడు తప్పుడు ప్రచారాలకు విశ్వగురువు జర్మన్‌ నాజీ హిట్లర్‌ ప్రచార మంత్రిగా పనిచేసిన గోబెల్స్‌. మన దేశంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని చూసి ఇప్పటి వరకు గోబెల్స్‌ ప్రచారం అనే బదులు ఇక ముందు బిజెపి లేదా మోడీ ప్రచారం అని పిలుస్తారేమోనని స్వర్గంలో ఉన్న గోబెల్స్‌ ( ఇలాంటి వారిని నరకం భరించలేదు ) ఇటీవల భయపడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మన ప్రధాని నరేంద్రమోడీ మానస మిత్రుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికాలో కుహనా వార్తలు, ప్రచారాన్ని తట్టుకోలేక 2017 నవంబరు 27న ఫేక్‌ న్యూస్‌ అవార్డు, దానికి గాను ఫేక్‌ న్యూస్‌ ట్రోఫీ ఇస్తే బాగుండునని ఒకట్వీట్‌లో ప్రతిపాదించాడు. మోడీ గారు ఇంకా అధికారంలో ఉండటమే కాదు, 2024లో కూడా తిరిగి రావాలని కోరుకుంటున్నారు గనుక జనాన్ని చైతన్య పరిచేందుకు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ పర్యవేక్షణలో ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో !