Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


మన కరెన్సీ రూపాయి ఏ రోజు ఎంత పతనం అవుతుందో తెలియని స్థితిలో ఉన్నాము. వచ్చే వారం (జూలై 18-24)లో రు.80.50కి పతనం కావచ్చని కొందరి అంచనా. అంతేనా లేక బలపడుతుందా, ఇంకా దిగజారుతుందా అంటే నోరు విప్పి ప్రధాని నరేంద్రమోడీ గారే చెప్పాలి. ఈ సందర్భంగా కొన్ని అంశాలను చెప్పుకుందాం. పురాతన చరిత్ర కలిగిన కరెన్సీలలో మన రూపాయి కూడా ఒకటి. క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దిలోనే నాణాన్ని విడుదల చేసినట్లు చెబుతున్నారు. క్రీస్తు పూర్వం 340-290 కాలంలో చంద్రగుప్త మౌర్యుడి పాలనలో ప్రధాన మంత్రిగా ఉన్న చాణుక్యుడు రాసిన అర్ధశాస్త్రంలో స్వర్ణ రూప, సీస రూప, తామ్ర రూప నాణాలతో పాటు రూపయ రూప అంటూ వెండినాణెం గురించి కూడా ప్రస్తావన ఉంది. తరువాత కాలంలో ఉన్న కరెన్సీ లేదా ద్రవ్య వ్యవస్థల గురించి అంత స్పష్టంగా లేదు. షేర్‌ షా సూరి పాలన 1540-45లో 178 గ్రెయిన్స్‌( తేలికైన గింజలు) లేదా 11.53 గ్రాముల బరువుతో వెండి నాణాలను ప్రమాణికంగా తయారు చేయించి దానికి రుపియా అని కూడా పేరు పెట్టారు. ఇప్పుడు ఒక డాలరుకు ఇన్ని రూపాయలు అన్నట్లుగా బాబరు కాలంలో 50 ఇత్తడి నాణాలకు రెండు వెండి నాణాలు సమంగా ఉండేవి.బ్రిటీష్‌ వారు అధికారానికి వచ్చే వరకు ఇవి కొనసాగాయి. బ్రిటీషు వారి ఏలుబడిలో మన రూపాయి పతనం తొలిసారిగా 1873లో జరిగిందని చెప్పవచ్చు. ఐరోపా, అమెరికాలో తీవ్ర ఆర్ధిక మాంద్యం సంభవించింది.ఆరు సంవత్సరాల పాటు కొనసాగింది. అమెరికా, అనేక ఐరోపా వలస దేశాలలో వెండి నిల్వలను కనుగొనటం కూడా దీని కారణాలలో ఒకటి. విస్తారంగా దొరుకుతున్న కారణంగా దీని విలువ తగ్గి బంగారానికి గిరాకీ ఏర్పడింది.దాంతో అప్పటి నుంచి బంగారం ప్రామాణికంగా విదేశీ లావాదేవీలు నడిచాయి.


ఇక వర్తమానానికి వస్తే 1947ఆగస్టు 15న మన రూపాయి ఒక డాలరుకు సమంగా ఉన్నట్లు సమాచారం, ఏడాది సగటు రు.3.50 గా, 4.16గా ఉందని రెండు రకాల సమాచారం. కొనుగోలు, అమ్మకం ధరల్లో తేడా కూడా ఈ గందరగోళానికి కారణం కావచ్చు. ఒన్‌ ఇండియా డాట్‌ కామ్‌లో 2020 ఆగస్టు 14న ప్రచురితమైన ఒక విశ్లేషణ ప్రకారం 2005 జనవరిలో రు.43.47 గా ఉన్నది 2014 మే నెలలో రు.59.44గా ఉంది. అప్పటి నుంచి మధ్యలో తగ్గినా, పెరిగినా మొత్తం మీద ఈ నెలలో రు.79.99కి పడిపోయింది. ఇక రూపాయి పతనం గురించి వివిధ పత్రికల్లో వచ్చిన సమాచారం,హాస్య భరితమైన రచనలు, ట్విటరైట్ల జోకుల తీరు తెన్నులు ఎలా ఉన్నదీ చూడండి. వీటి గురించి చెప్పుకోవాలంటే ఇబ్బందిగా ఉన్నా ఈ పరిస్థితికి కారణం మనం(జనం) కాదు గనుక విషాదంలో వినోదం మాదిరిగా చూద్దాం.
” ఎస్కలేటర్‌ మీద డాలర్‌ , వెంటిలేటర్‌ మీద రూపాయి, ఐసియులో దేశం.. దేవుడు రక్షించుగాక ”
” రూపాయి పడుతున్నదంటున్నారు ఎక్కడో చెప్పండి నేను వెతికి తెచ్చుకుంటా ”
” హమ్మయ్య ఎట్టకేలకు జరిగింది….. దశాబ్దాల తరువాత పెట్రోలు కంటే ఇప్పుడు బీరు చౌక. ఇంక మనం కొత్త నినాదం ఇవ్వవచ్చు జస్ట్‌ డ్రింక్‌ డోంట్‌ డ్రైవ్‌ ( తాగండి తప్ప బండి నడపొద్దు) ”
” రూపాయి-డాలరు బంధం పటిష్టత గురించి డాలరుతో చర్చలకు భారత్‌ సిద్దం ”
” రూపాయి పని తీరు ఎంత దారుణంగా ఉందో చైనా వారు గనుక తెలుసుకుంటే వారు అరుణాచల్‌ ప్రదేశ్‌ జోలికి రారని అనుకుంటున్నా ”
” భగవంతుడా నీకు కృతజ్ఞతలు. ఎందుకంటే డాలర్‌, యూరో మాదిరి లోదుస్తుల బ్రాండ్‌గా రూపాయి లేదు. ఒక వేళ ఉంటే అది జారిపోతున్నపుడు యావత్‌ దేశ రూపం కనిపించేది ”
” డిస్నీలాండ్‌ కొత్త రైడ్‌ను ప్రారంభిస్తోంది. దానిలో ఎంతో ఎత్తు నుంచి కొద్ది సెకండ్లలోనే మీరు కిందికి జారిపోవచ్చు. దానికి వారు భారత రూపాయి అనే పేరు పెట్టబోతున్నారు ”
” రూపాయి సీనియర్‌ సిటిజన్‌గా మారినందుకు అభినందనలు ”
” రూపాయి పైకి వెళ్లేది ఒకే ఒక్కసారి అది టాస్‌ వేసినపుడు ”
” రూపాయిని రక్షించాలంటే ఒకే మార్గం ఉంది, డాలరుకు రాఖీ కట్టి రక్షించమని అడగాలి ”
” మీరు గనుక జీవితంలో ఓడినట్లు విచారపడుతుంటే ఒక్కసారి రూపాయిని చూడండి ”
” న్యూటన్‌ గనుక ఇప్పుడు బతికి ఉంటే గురుత్వాకర్షణ సిద్దాంతం గురించి రూపాయి పతన ప్రాతిపదిక మీద కొత్తగా చెప్పి ఉండేవాడు. ఆపిల్‌ పండ్లు మెల్లగా పడి ఉండేవి ”


వాషింగ్టన్‌ పోస్ట్‌ డాట్‌కామ్‌ నివేదిక ప్రకారం ” రూపాయి చిహ్నం ప్రారంభం ఒక అశుభ దినాన జరిగిందని దేశంలోని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు. చిహ్నంలోని అడ్డగీత రూపాయి నాలుక చీరేస్తా అన్నట్లుగా కనిపిస్తోంది ” అన్నారు.ప్రముఖ జ్యోతిష్కుడు బెజాన్‌ దారువాలా రూపాయి చిహ్న రూపకల్పనలో లోపం ఉందనటాన్ని అంగీకరించలేదు.” నవంబరు నుంచి గురుడి స్థితిని బట్టి అదృష్టం, అంతులేని సంపదల యోగం బలంగా ఉంది. డాలరు మీద రూపాయి బలపడుతుంది, షేర్‌ మార్కెట్లో కూడా అదే జరుగుతుంది, ఆందోళన చెందాల్సిన పనిలేదు. నేను ఎంతగానో అభిమానించే ప్రధాన మంత్రి శని ప్రభావంలో ఉన్నారు. శని అంటే వృద్ది నెమ్మదిగా ఉంటుంది, ఆలశ్యం అవుతుంది, కుంభకోణాలు బయటికి వస్తున్నాయి. రోజుకు రోజుకు డాలరుతో రూపాయి బలహీనపడుతుంది. నవంబరు నుంచి ప్రధాని తారాబలం కూడా మెరుగుపడుతుంది.” రూపాయి చిహ్నాన్ని రూపొందించిన ధర్మలింగం ఉదయకుమార్‌ విమర్శల నుంచి పట్టించుకోలేదు.” నేను రూపాయి చిహ్నాన్ని రూపొందించినపుడు పరిస్థితులు వేరు ఇప్పుడు జరుగుతున్నది వేరు. ఆర్ధిక వ్యవహారాల గురించి వ్యాఖ్యానించేందుకు తగిన వాడిని కాదు.చిహ్న రూపకల్పన గురించి అడిగితే చెబుతా ” అన్నారు.


భారత క్రికెట్‌ కంట్రోలు బోర్డు ఆధిపతిగా ఉన్న ఎన్‌ శ్రీనివాసన్‌ తన జ్యోతిష్కుడి సమక్షంలో ప్రపంచ నేతలను సవాలు చేశారు.” వచ్చే వారం నాటికి రూపాయి స్థిరపడని పక్షంలో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తీవ్రతరం కాకుండా చూసేందుకు ఒక ఏడాది పాటు భారత టీము అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా బిసిసిఐ నిరోధిస్తుంది.ఐతే మేము ఐపిఎల్‌లో ఆడతాము, హిందీ వ్యాఖ్యానంతో వాటిని కేవలం దూరదర్శన్‌ మాత్రమే ప్రసారం చేయాలి. విదేశాలు తమ దేశాల్లో ఐపిఎల్‌ను ప్రసారం చేయాలంటే ఇప్పుడు మేము చెల్లిస్తున్నదానికి పది రెట్లు మాకు చెల్లించాలి. స్వదేశంలో కూడా క్రికెట్‌ ఆడవద్దని మేము శ్రీలంకను కూడా కోరతాము. ఐపిఎల్‌తో సహా ఏ రకమైన క్రికెట్‌ ఆడవద్దని మన మంచి దోస్తులైన దక్షిణాఫ్రికాను కూడా కోరతాము. మన ఆర్ధిక వ్యవస్థ స్థిరపడేవరకు ప్రపంచమంతటి నుంచి క్రెకెటర్లు భారత్‌ రావాల్సిందే, ఎక్కడా ఏ విధమైన ఫార్మాట్‌లోనూ క్రికెట్‌ ఆడకూడదు.” అని శ్రీనివాసన్‌ అన్నారు.


బిసిసిఐ అభిజ్ఞవర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం రూపాయి పతనం సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ బాటింగ్‌ సగటును దాటే అవకాశం ఉందనే భయం కూడా ఉంది.రూపాయి వేగాన్ని సచిన్‌ టెండూల్కర్‌ కూడా అధిగమించలేదు. ఒక నాడు తన కెరీర్‌ను కాపాడుకొనేందుకు రాహుల్‌ ద్రావిడ్‌ వికెట్‌ కీపింగ్‌ చేపట్టాడు. రూపాయిలో మార్పులు రావాలని కూడా ద్రావిడ్‌ చెప్పాడు. బహుశా నోట్లు గుండ్రంగాను, నాణాలను చతురస్రంగా మార్చాలని కావచ్చునని బిసిసిఐ వర్గాలు చెప్పాయి. రూపాయికి ఒక విలువను నిర్ణయించలేమని శ్రీశాంత్‌ ట్వీటాడు. బిసిసిఐ సాంకేతిక కమిటీ సభ్యుడు రవిశాస్త్రి వివరణ ఇస్తూ మరొక ఐపిఎల్‌ నిర్వహణ లేదా కేవలం భారత్‌లోనే క్రికెటర్లు ఆడేవిధంగా చూడాలి. తద్వారా విదేశీ పెట్టుబడిదార్లను దేశానికి ఆకర్షించాలి. ఇది గిరాకీ-సరఫరా ఆట, మనం గిరాకీని సృష్టించాలి.”
రాయల్‌ ఛాలెంజర్స్‌ అధిపతి డాక్టర్‌ విజయ మాల్య నిలిపివేసిన కింగ్‌ఫిషర్‌ జెట్‌ ఒకదానిలో కూర్చొని శ్రీనివాసన్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపాడు. తన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ను కూడా ఆదుకోవాలని బిసిసిని కోరాడు. ఆర్‌సిబి మరియు సిఎస్‌కె మామూలుగా అయితే ప్రత్యర్దులు, కానీ చూస్తే ఇద్దరూ కలిసి సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ శ్రీనివాసన్‌ ఆ భేటీ తరువాత విలేకర్లతో చెప్పింది వేరేగా ఉంది. మా ఇద్దరికీ పనికిరాని కొడుకులున్నారు, కాబట్టి మాకు చక్కగా కుదిరిందన్నాడు. రూపాయి తిరిగి బలపడుతుందా అని తెలుసుకోవాలని దేశం కోరుకుంటోంది కనుక ప్రముఖ రాజకీయనేతలు, క్రికెటర్లు, ప్రపంచ నేతలతో తన న్యూస్‌ అవర్‌ కార్యక్రమంలో చర్చించేందుకు ఆర్నాబ్‌ గోస్వామి ఏర్పాట్లు చేసుకున్నాడు.


భక్తోం, మిత్రో ఆగ్రహించకండి, విశ్వగురువుగా ప్రపంచంలో నీరాజనాలు అందుకుంటున్న మన ప్రధాని ఎంతైనా నరేంద్రమోడీ, పాలన గురించి ఇలా జోకులేస్తారా, వాటిని మీరు మా ముందు పెడతారా అని కోప్పడకండి. పైన పేర్కొన్న జోకులన్నీ 2013లో యుపిఏ హయాంలో మన్మోహన్‌ సింగ్‌ మీద వేసినవిగా గమనించాలి. ఇప్పుడు జోక్స్‌ వేయాలన్నా, షేర్‌ చేయాలన్నా ఎక్కడ కేసులు నమోదై ఇబ్బందులు పడతామో అన్న భయం వలన కావచ్చు అంతగా రావటం లేదు. పూర్వం రాజు గారు నవ్వితే నవ్వాలి లేదా తనను నవ్వించమని అడిగితే నవ్వించాలి తప్ప ఏదీ మనంతట మనం చేయకూడదు. రాజు గారు నవ్వేంత వరకు ఎదురు చూడాల్సిందే మరి. తొమ్మిదేండ్ల క్రితం రూపాయి మాదిరి ఇప్పుడూ ఉంది. కరోనాలో చూసిన పాతసినిమాలే చూసినట్లు ఇప్పుడు పాత జోకులతోనే సరిపెట్టుకుందాం.రోజులు బాగుంటే కొత్త జోకులు వస్తాయి.


”యుపిఏ ఏర్పడినపుడు రూపాయి-డాలరు నిష్పత్తి రాహుల్‌ గాంధీ వయస్సుతో సమంగా ఉంది, ఈ రోజు సోనియా గాంధీ వయస్సుకు దగ్గరగా ఉంది, మన్మోహన్‌ సింగ్‌ వయస్సును తాకుతుందేమో అన్నది మా అనుమానం” అని బిజెపి నేత రవిశంకర ప్రసాద్‌ ప్రసాద్‌ 2014కు ముందు జోక్‌ చేశారు. కాలం కలసి రాక ఇప్పుడు ఆ పెద్ద మనిషి రాజకీయ నిరుద్యోగిగా ఉన్నారు. లాయరు గనుక తిరిగి కోర్టులకు వెళుతున్నారో లేదో తెలియదు. చైనాతో వంద బిలియన్‌ డాలర్ల లావాదేవీలు జరపాలని మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేర్చటంలో మన ప్రధాని నరేంద్రమోడీ విజయం సాధించారు.తొమ్మిదేండ్ల క్రితం రవిశంకర ప్రసాద్‌ చెప్పినట్లు సోనియా గాంధీ వయస్సు 67(ఇప్పుడు 75)ను దాటించారు. ఊపు చూస్తుంటే మన్మోహన్‌ సింగ్‌ వయస్సు80(ఇప్పుడు 89)కు చేరారు. తరువాత తన రాజకీయ గురువైన ఎల్‌కె అద్వానీ 85(ఇప్పుడు 94) గారికి దక్షిణ సమర్పించినా ఆశ్చర్యం లేదు. ఇంకా ఎన్ని చిత్రాలు చూడాలో కదా !