Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేసి పారిపోక ముందు మే పదవ తేదీన ఒక ఉదంతం జరిగింది. మహింద వీర విధేయుడైన అభిమాని ఒకడు కొలంబో వీధుల్లో మద్దతు ప్రకటించాడు. అప్పటికే మద్దతుదార్లను జనం మీదకు ఉసిగొల్పిన మహింద సంగతి తేల్చాలని నివాసం వైపు నిరసనకారులు వెళుతుండగా ఈ ఉదంతం జరిగింది. ఆగ్రహించిన జనం అతన్ని చితక్కొట్టి దారిన వస్తున్న ఒక చెత్తబండిలో కూర్చోపెట్టి తరిమికొట్టారు. ఆ వీడియో వైరలైంది. దెబ్బలు తిన్న అతను సింహళీయుడే చితక బాదిన వారు కూడా ఆ సామాజిక తరగతికి చెందిన వారే. ఆదివారం నాడు (జూలై 17)న ఉత్తర ప్రదేశ్‌లోని మధుర పట్టణంలో ఒక కాంట్రాక్టు పారిశుధ్యకార్మికుడు తన బండిలో చెత్తతో పాటు ప్రధాని నరేంద్రమోడీ, సిఎం యోగి ఆదిత్యనాధ్‌ ఫొటోలను తరలిస్తున్న వీడియో వైరల్‌ కావటం, దాన్ని చూసిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు సదరు కార్మికుడిని విధుల నుంచి తొలగించటం సంచలనాత్మక ఘటనగా మారింది. దేశ అదృష్టం కొద్దీ ఉపాధి పోగొట్టుకున్న కార్మికుడూ హిందువే, చెత్తబండి నుంచి మోడీ, యోగి, అబ్దుల్‌ కలామ్‌ చిత్రాలను రక్షించిన వారూ హిందువులే.


ఈ ఉదంత వివరాల్లోకి వెళితే మున్సిపల్‌ కార్మికుడు బాబీ బండిలో మోడీ, యోగి ఫొటోలు ఉండటాన్ని రాజస్తాన్‌లోని ఆళ్ల్వారు నుంచి మధుర వచ్చిన ఇద్దరు భక్తులు గమనించారు. సదరు బండిని వీడియో తీశారు. అంతటితో ఆగలేదు. కార్మికుడిని నిలిపి ఆ ఫొటోలను ఎందుకు చెత్తబండిలో వేశావని అడిగారు. వాటితో తనకేమీ సంబంధం లేదని చెత్తకుప్పలో ఉన్నవాటిని తీసి బండిలో వేసి తీసుకుపోతున్నట్లు చెప్పాడు. ఆళ్వారు భక్తులు మోడీ,యోగి చిత్రాలను బండిలో నుంచి తీస్తుండగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చిత్రం కూడా కనిపించిందట. ఆ ఫొటోలను తీసుకొని వాటిని నీటితో శుభ్రం చేసి తమతో ఆళ్వారు తీసుకు వెళతామని, మోడీగారు,యోగి గారు ఈ దేశ ఆత్మలని వారు అన్నారు.


ఈ ఉదంతంపై సామాజిక మాధ్యమంలో భిన్నమైన అభిప్రాయాలు వెలువడ్డాయి. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారి చిత్రాలను అందరూ గౌరవించాలి. వారి చిత్రాలను చెత్తబండిలో తీసుకుపోవటం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పిదమే కనుక శిక్షించాలని కొందరు అన్నారు. కార్మికుడిపై వేటును కొందరు ప్రశ్నించారు. ఫొటోలు పాతబడి, చిరిగినపుడు అవి ఎవరివైనా ఒకటే. అధికారంలో ఉన్నవారి పాత పొటోలను ఏం చేయాలి, ఎలా తొలగించాలి అనేందుకు ఏదైనా పద్దతి ఉందా అని కొందరు ప్రశ్నించారు. చెత్తకుప్పలో ఉన్న వాటిని బండిలో వేసిన కార్మికుడిది విధి నిర్వహణ తప్ప తప్పెలా అవుతుంది, అతన్ని ఎందుకు శిక్షించాలి అని కొందరు ప్రశ్నించారు. కార్మికుడు తన బండిలో ఆ ఫొటోలను తెలియకుండానే ఉంచాడు. అతని నిర్లక్ష్యానికి గాను అతన్ని వెంటనే పని నుంచి తొలగించినట్లు మధుర-బృందావన్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ సత్యేంద్ర కుమార్‌ తివారీ ప్రకటించారు. సదరు కార్మికుడు వాటిని బండిలో వేసేటపుడు ఎందుకు చూడలేదని ప్రశ్నించారు.


ప్రముఖులు, ప్రజాప్రతినిధుల చిత్రాలు చెత్తలో కనిపించినపుడు ఏమి చేయాలో కార్మికులకు ఎందుకు వివరించలేదో సంజాయిషీ ఇవ్వాలంటూ శానిటరీ ఇనస్పెక్టర్‌, సూపర్‌వైజర్లకు కార్పొరేషన్‌ నోటీసులు జారీ చేసి, విచారణకు ఆదేశించింది.తనను పనిలోంచి తొలగించిన నిర్ణయాన్ని పునరాలోచించాలని కార్మికుడు బాబీ ఒక దరఖాస్తులో ప్రార్ధించాడు. చెత్తసేకరణ కేంద్రంలో ఉన్నదాన్నే తన బండిలో వేశానని, తనకు చదువురాదని, ఫొటోలను గుర్తించలేకపోయానని, జరిగిందానికి మన్నించాలని కోరాడు. దేశ ప్రధాని, ముఖ్యమంత్రుల ఫొటోలు తెలియదంటే కుదరదని, వాటిని సులభంగా గుర్తించవచ్చని ఒక అధికారి అన్నారు. ఈ ఉదంతం గురించి నిజనిర్దారణకు ఒక కమిటీని వేసి 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని కోరినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ అనునయ ఝా చెప్పారు.


వారం రోజుల ముందు ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌ పట్టణంలో జూలై పదిన నరేంద్రమోడీని విమర్శిస్తూ రెండు చోట్ల హౌర్డింగులు పెట్టినందుకు గాను పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. వాటిలో ధరల పెరుగుదల, రైతుల నిరసన, నిరుద్యోగం వంటి అంశాల కార్టూను, బై బై మోడీ అనే హాస్టాగ్‌ ఉన్నాయి. జాతీయ సమగ్రతకు భంగం కలిగించటం, వివిధ తరగతుల మధ్య విద్వేషం, శత్రుత్వం, తప్పుడు ఆలోచనలు కలిగించటం వంటి సెక్షన్లతో కేసులు పెట్టి ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రధాని పేరుకు మచ్చ తెచ్చేందుకు వాటిని ఉద్దేశించారని ఆరోపించారు. వాటిని తెలంగాణాలోని టిఆర్‌ఎస్‌కు చెందిన శాయి అనే అతని కోరిక మేరకు పెట్టారని పోలీసులు చెప్పారు. అనికేత్‌ కేశర్వాని, అభయకుమార్‌ సింగ్‌, రాజేష్‌ కేశర్వాని, శివ, ధర్మేంద్ర కుమార్‌ అనే వారిని అరెస్టు చేశారు.వారిలో ఫ్లెక్సీని ముద్రించిన ఒకరిని, ఒక కార్యక్రమాల నిర్వహణ కంపెనీ ప్రతినిధి ఉన్నారు. హౌర్డింగ్‌లు పెట్టినందుకు శాయి అనే అతను తమకు పదివేల రూపాయలు ఆన్‌లైన్లో చెల్లించినట్లు అనికేత్‌ కేశర్వానీ చెప్పాడు.

ఈ రెండు ఉదంతాలను చూసినపుడు జనం అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందుల పాలు కావచ్చు, ఉద్యోగాలు పోగొట్టుకోవచ్చు, ఊచలు లెక్కించవచ్చు. మనోభావాలను దెబ్బతీశారంటూ కేసులు ఎక్కడ నుంచైనా, ఎవరిమీదనైనా పెట్టవచ్చు, అందుకే జర జాగ్రత్త. అసలు చెత్తబండిలో ఫొటోల వెనుక ఏదైనా కుట్ర ఉందా, ఆ ఫొటోలను చెత్తకుప్పలో వేసింది ఎవరన్నది తేల్చేందుకు యోగి సర్కార్‌ సిబిఐ, ఎన్‌ఐఏలతో దర్యాప్తు జరిపిస్తుందేమో చూడాలి. మరోసారి చెత్తబండ్ల పాలు కాకుండా వీధికి ఒక ఫొటో రక్షకుడిని ఏర్పాటు చేసి ఎవరు చిత్రాలను చెత్తలో వేస్తున్నదీ నిఘాపెట్టిస్తుందో చెప్పలేము. దోషులు తేలితే వారి ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయించినా ఆశ్చర్యం లేదు. ఈ ఉదంతం తరువాత రాష్ట్రాల్లోని మున్సిపల్‌ కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రముఖుల ఫొటోలు చిరిగినా, దుమ్ముపట్టినా, చీడపట్టినా, చెదపురుగులు తిన్నట్లు కనిపించినా వెంటనే ఉన్నతాధికారులకు నివేదించాలి లేదా వారికి అప్పగించాలి. లేనట్లయి అనవసర వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. సిఎం యోగి మెప్పు పొందేందుకు మధుర అధికారుల మాదిరి ఎక్కడైనా ఉన్నతాధికారులు అదే చేయవచ్చు కదా !