Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో వారసత్వ రాజకీయాలకు తావు లేదని ఇప్పటికీ బలంగా నమ్ముతున్నవారి మనోభావాలను ఎవరూ దెబ్బతీయవద్దు, అన్నింటికీ మించి వారితో దెబ్బలాటకు అసలు దిగకూడదు. ఆజాదీకా అమృత ఉత్సవాల్లో వారిని కంగన రనౌత్‌ చెప్పినట్లు అసలైన స్వాతంత్య్రం వచ్చిన 2014 పోరులో పాల్గొన్న సమరయోధులుగా సన్మానించినా, పెన్షన్‌ ఇచ్చినా తప్పు లేదు. షా నవాజ్‌ హుసేన్‌ అనే బిజెపి నేత శ్రీనగర్‌లో కూర్చుని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడారు. పేరెత్త కుండానే తాత, తండ్రి, మనవడు ముఖ్యమంత్రులయ్యే రోజులు గతించాయి. రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలకు పాల్పడిన వారు గతంలో చేసిన వ్యాపారం, హౌటళ్లు ఏదో ఒకటి చూసుకోవాల్సిందే అన్నారు. సరిగ్గా అదే సమయంలో నాలుగు సార్లు సిఎం, మూడు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్న బిఎస్‌ ఎడియూరప్ప కర్ణాటకలోని షిమోగా సభలో తన రెండవ కుమారుడు విజయేంద్రకు తన నియోజకవర్గం షికారపుర రాజకీయ వారసత్వాన్ని ఇస్తున్నట్లు బహిరంగ సభలో ప్రకటించారు.2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ తన బదులు కుమారుడు పోటీ చేస్తాడని ప్రకటించేశారు. తన తండ్రి వారసత్వాన్ని అంగీకరిస్తూ కుటుంబ పేరు ప్రతిష్టలను కాపాడతానని తనయుడు చెప్పారు. తనకు తండ్రి-పార్టీ రెండు కళ్లు అని ఏ ఒక్కటి లేకున్నా చేసేదేమీ ఉండదని కూడా అన్నారు.ఎడియూరప్ప పెద్ద కుమారుడు రాఘవేంద్ర ప్రస్తుతం షిమోగా ఎంపీగా ఉన్నారు. అయినా సరే అదియును సూనృతమే ఇదియును సూనృతమే అని అనకపోతే పరువు దక్కదు మరి. పేద కుటుంబంలో పుట్టిన ఎడియూరప్ప చిన్నతనంలో నిమ్మకాయలు అమ్మితే తప్ప కుటుంబం గడవని స్థితి. తరువాత కార్మికుడిగా కూడా పని చేశారు. ఒక రైస్‌ మిల్లులో గుమస్తాగా చేరి సినిమాల్లో మాదిరి యజమాని కూతుర్నే వివాహం చేసుకున్నారు. తండ్రీ కొడుకులు వారసత్వ రాజకీయాలను వదలి పూర్వపు వ్యాపారం చేసుకోవాలని షా నవాజ్‌ హుస్సేన్‌ ఇప్పటికైనా తమ పార్టీ నేతలకు చెప్పి మర్యాద దక్కించుకుంటారా ?


ఎనిమిదిసార్లు ఎంఎల్‌ఏ, ఒకసారి ఎంపీగా గెలిచిన బూకనకరె సిద్దలింగప్ప ఎడియూరప్పను 75 ఏండ్లు దాటిన వారికి ముఖ్యమైన పదవులను అప్పగించేది లేదన్న బిజెపి తాను చెప్పిన సుభాషితాన్ని తానే దిగమింగి నాలుగోసారి సిఎం గద్దెమీద కూర్చోపెట్టింది. పదవీ కాలం పూర్తిగాక ముందే రాజీనామా చేయించి బసవరాజు బొమ్మైకి అప్పగించింది. జీవితం తనకు అగ్నిపరీక్షగా ఉందని పదే పదే చెప్పిన ఎడియూరప్ప విధిలేక పదవికి రాజీనామా చేస్తూ రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకొనేది లేదని తన పాత్రను పోషిస్తానని చెప్పారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని మాత్రమే చెప్పారు. విలువల వలువలతో పని చేస్తామని చెప్పే ఈ బిజెపి నేత నాలుగవసారి సిఎంగా గద్దె నెక్కేందుకు పడరాని పాట్లు పడ్డారు. హెచ్‌డి కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఆరుసార్లు విఫలయత్నం చేసి ఏడవ సారి ఎవరేమనుకుంటే నాకేమి అన్నట్లుగా 76 ఏండ్ల వయస్సులో నాలుగోసారి గద్దెనెక్కారు. అంతకు ముందు మూడోసారి పెద్ద పార్టీ నేతగా ప్రభుత్వాన్ని ఏర్పరచి కేవలం 55 గంటలు మాత్రమే పదవిలో ఉండి అసెంబ్లీలో బలనిరూపణకు ముందే రాజీనామా చేశారు. తొలిసారి 2007లో జెడి(ఎస్‌)తో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేవలం ఏడు రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. రెండవ సారి 38 నెలలు, నాలుగవసారి రెండు సంవత్సరాలు పదవిలో ఉన్నారు. అవినీతి కేసులో ఒకసారి జైలుకూ వెళ్లారు, ఇప్పుడు ఒక కేసు విచారణలో ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా ఉన్న ఎడియూరప్ప పదవి కోసం బిజెపి మీద తిరుగుబాటు చేసి గతంలో స్వంత కుంపటి పెట్టుకున్నారు. తిరిగి బిజెపిలో చేరారు. బిజెపిఏ ఎడియూరప్ప – ఎడియూరప్పే బిజెపిగా ఉన్నారు. అలాంటి నేతను ఇటీవల పక్కన పెట్టారు. పార్టీకి ఇతర నేతలు ఉన్నారని రుజువు చేసుకొనేందుకు అధిష్టానం పూనుకున్నది. వారసత్వాన్ని ప్రకటించటం బిజెపి చెప్పే సుభాషితాలకు వ్యతిరేకం. ఎన్నికల ముందు ఎడియూరప్పతో వైరం పెట్టుకుంటుందా ? కుమారుడి కోసం ఏం చేస్తారో చూడాలి.


ఇంకా ఎన్నికలకు ఎంతో వ్యవధి ఉండగా ఇప్పుడెందుకు ఆకస్మికంగా వారసత్వ ప్రకటన చేశారన్నది ప్రశ్న. దాని గురించి విజయేంద్ర మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తాను వరుణ లేదా చామరాజనగర్‌లో పోటీ చేయనున్నట్లు మీడియాలో ఊహాగానాలు వెలువడినందున ఒక స్పష్టత ఇవ్వాలని స్థానిక నేతలు తన తండ్రిపై వత్తిడి తెచ్చిన కారణంగా ఈ ప్రకటన చేశారని చెప్పారు. షికారిపురాలో పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా మద్దతు ఇస్తానని కొన్ని నెలల క్రితం ఎడియూరప్ప చెప్పినందున పార్టీనేతలు ఆశాభంగం చెందారని, అక్కడ ఎడియూరప్ప లేదా విజయేంద్ర మాత్రమే పోటీ చేయాలని వత్తిడి చేస్తున్నారని, అందువలన తప్పనిసరై ప్రకటించాల్సి వచ్చిందన్నారు. నాటి ప్రకటనల గురించి తాను ఇప్పుడు చెబుతున్నానని అంటూ అప్పుడు కాంగ్రెస్‌, జెడిఎస్‌ల నుంచి అనేక మంది బిజెపిలో చేరేందుకు వచ్చారని దాంతో తనను పక్కన పెడుతున్నారేమోనని విచారంతో పాటు ఆశాభంగం చెందానని, అప్పటి నుంచి పార్టీ బలోపేతం కోసం తాను పని చేస్తున్నానని అన్నారు. ఒక కార్యకర్తగా పార్టీలో పని చేస్తున్నాను తప్ప ఎడియూరప్ప కుమారుడిగా కానందున వారసత్వ వాదన తనకు వర్తించదన్నారు. ఈ సారి ఎలాగైనా పోటీ చేయాల్సిందేనని పార్టీ నేతలు వత్తిడి చేసినందున తన తండ్రి ప్రకటించాల్సి వచ్చిందన్నారు. తమకు సీట్లు కావాలని ఢిల్లీ పెద్దలను ఎప్పుడూ అడగలేదన్నారు. 2018లో వరుణా నియోజకవర్గం నుంచి పోటీకి పక్షం రోజులు ప్రచారం చేసుకున్న తరువాత, తాజాగా ఎంఎల్‌సీ అవకాశం ఇచ్చేందుకు విజయేంద్రకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఎడియూరప్పకు పార్టీ మీద పట్టును తగ్గించేందుకు ఢిల్లీ పెద్దలు చూస్తున్నారు. దానిలో భాగంగానే బొమ్మై మంత్రివర్గంలో తన మద్దతుదారులైన మంత్రుల ఎంపికను నిరాకరించారు.కుమారుడికి మంత్రి పదవీ ఇవ్వలేదు. పదవి కోసం ఎంతకైనా తెగించే చరిత్ర ఉన్న ఎడియురప్ప తన కుమారుడిని రాజకీయ నిరుద్యోగిగా చూసి భరించగలరా !


బిజెపి లబ్ది పొందిన అంశాల్లో ప్రత్యర్ధి పార్టీల కుటుంబ వారసత్వంపై దాడి ఒకటి. విధానాలను పక్కన పెట్టి జనం దృష్టిని ఆకర్షించే ఎత్తుగడ అది. ఇప్పుడు ఆ జబ్బుదానికి కూడా అంటుకుంది.రోజు రోజుకూ పెరుగుతోంది. మాధవరావు సింధియా కాంగ్రెస్‌ నేత. అతని మరణం తరువాత కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా పదవిలోకి రావటంతో బిజెపి వారసత్వ రాజకీయమని చెప్పింది. అదే పెద్దమనిషి బిజెపిలో చేరిన తరువాత ఎంపీ పదవితో పాటు మంత్రిపదవి ఇచ్చారు. జ్యోతిరాదిత్య మేనత్త వసుంధరరాజే. ఆమె రాజస్తాన్‌ సిఎంగా చేశారు. ఆమె కుమారుడు దుష్యంత్‌ సింగ్‌ ఆమె స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. వసుంధరరాజే తల్లి విజయరాజే సింధియా తొలుత కాంగ్రెస్‌, తరువాత స్వతంత్ర పార్టీ, అక్కడి నుంచి జనసంఘం, తరువాత బిజెపి నేతగా ఉన్నారు.ఎంపీ, ఎంఎల్‌ఏగా చేశారు. గోవాలో మాజీ సిఎం మనోహర్‌ పారికర్‌ కుమారుడు ఉత్పల్‌ పారికర్‌కు గత ఎన్నికల్లో సీటు ఇచ్చేందుకు బిజెపి తిరస్కరించింది. కానీ అదే పార్టీ అనేక మంది నేతల వారసులకు సీట్లు ఇచ్చింది.జెన్నిఫర్‌ మాన్సరటా మంత్రి, ఆమె భర్త అటానాసియో ఇద్దరికీ సీట్లు ఇచ్చింది. ఆరోగ్యశాఖ మంత్రి, అతని భార్యకు సీట్లు ఇచ్చారు.


2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 543 మందికి గాను వివిధ పార్టీల నుంచి 114 మంది కుటుంబవారసుల నుంచే వచ్చారు. తరువాత 2019లో వారి సంఖ్య 162కు పెరిగింది, ఇది తొమ్మిది శాతం. చిత్రం ఏమిటంటే సగటు కంటే బిజెపి వారసులు ఆ పార్టీకి ఉన్న 388 మందిలో 45 అంటే పదకొండుశాతం ఉన్నారు.2009లో బిజెపి, కాంగ్రెస్‌ నుంచి గెలిచిన వారిలో వారసులు పదకొండు, పన్నెండుశాతాల చొప్పున ఉంటే 2014కు వచ్చేసరికి అవి 20-8 శాతాలుగా మారాయి. ఈ కారణంగానే నరేంద్రమోడీ వారసత్వ రాజకీయాల గురించి కొత్త పల్లవి అందుకున్నారు. 2021 నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ కుటుంబ సభ్యులు రాజకీయ పదవుల్లోకి వస్తే తప్పులేదంటూ ఒక కుటుంబమే తరతరాలుగా పార్టీని నడపటం ప్రజాస్వామ్యానికి ముప్పు అని సూత్రీకరించారు. కుటుంబాల కోసం పార్టీలు, కుటుంబాలే పార్టీలను నడిపితే ప్రజాస్వామిక లక్షణం ఉండదని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి కూడా వ్యతిరేకమని మరో సందర్భంగా చెప్పారు. అందుకే ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నారు.