Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


బ్రిటన్‌, ప్రపంచ భద్రతకు చైనా అతి పెద్ద ముప్పుగా ఉందని, స్వేచ్చా దేశాలు చైనా సాంకేతిక దాడిని ఎదుర్కొనేందుకు కొత్త కూటమి ఏర్పడాలని బ్రిటన్‌ కన్సర్వేటివ్‌(టోరీ) పార్టీ నేత రిషి సునాక్‌ అన్నాడు. ఇలా మాట్లాడటం బాధ్యతా రాహిత్యమని, దీని వలన వారి సమస్యలు పరిష్కారం కావని చైనా పేర్కొన్నది. బోరిస్‌ జాన్సన్‌ మంత్రివర్గంలో ఆర్ధిక మంత్రిగా పని చేసిన సునాక్‌ ఆర్ధిక విధానాలతో విబేధాల వలన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెబుతూ జూలై ఐదున రాజీనామా చేశాడు.తరువాత రెండు రోజులకే ప్రధాని జాన్సన్‌ కూడా రాజీనామా ప్రకటించాడు.దాంతో కన్సర్వేటివ్‌ పార్టీ పార్లమెంటరీ నేతగా(ప్రధాని పదవికి) తాను పోటీ చేయనున్నట్లు ఎనిమిదవ తేదీన వెల్లడించాడు.ఆ పరుగులో చివరికి సునాక్‌తో పాటు విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ మిగిలారు.కన్సర్వేటివ్‌ పార్టీ సభ్యులు పోస్టు బాలట్‌ ద్వారా ఒకరిని ఎన్నుకుంటారు. ఫలితం సెప్టెంబరు ఐదున ప్రకటిస్తారు. అప్పటి వరకు ఇరువురు నేతలు మద్దతుదార్లను ఆకర్షించేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తారు. దానిలో భాగంగా టీవీ చర్చలో ఇద్దరు నేతలు పరస్పరం చేసుకుంటున్నదాడులతో పార్టీ నష్టపడి వచ్చే ఎన్నికల్లో లేబర్‌ పార్టీకి అవకాశం ఇచ్చేట్లున్నారని కన్సర్వేటివ్‌ పార్టీ పెద్దలు గగ్గోలు పెడుతున్నారు. మాటలదాడులతో పరస్పరం గోతులు తీసుకుంటున్నారని వాపోతున్నారు. పన్నుల విధింపు, బ్రెక్సిట్‌, చైనా చివరికి తాము చదువుకున్న స్కూళ్లను కూడా వారి దాడులలో ప్రస్తావించారు. తొలి టీవీ చర్చలో ఎవరు బాగా మాట్లాడారన్న సర్వేలో సునాక్‌కు 39శాతం మంది, ట్రస్‌ను 38శాతం బలపరిచారు. కాగా టోరీ పార్టీ మద్దతుదార్లలో ట్రస్‌ను 47శాతం, సునాక్‌ను 38శాతం బలపరిచారు. దీన్ని బట్టి కొత్త ప్రధానిగా ట్రస్‌కే అవకాశాలు ఎక్కువని కొందరు సూత్రీకరించారు.


పార్లమెంటులో అధికార పార్టీ మెజారిటీ కోల్పోతే నూతన ప్రభుత్వం లేదా ఎన్నికలు జరుగుతాయి. బ్రిటన్‌లో కన్సర్వేటివ్‌ పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభంతో బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా ప్రకటించాడు. దాన్ని అవకాశంగా తీసుకొని ప్రతిపక్ష లేబర్‌ పార్టీ మొత్తం ప్రభుత్వం మీదనే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగా అధికార పార్టీ దానికి పోటీగా విశ్వాస తీర్మానం పెట్టి పార్లమెంటులో నెగ్గింది. అందువలన సాంకేతికంగా బోరిస్‌ జాన్సన్‌ మీద మరో ఏడాది పాటు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు కానీ పార్టీ నేతగా విశ్వాసం కోల్పోయాడు. నూతన నేతను ఎన్నుకొనేందుకు నిర్ధిష్ట కాలపరిమితేమీ లేదు. కన్సర్వేటివ్‌ పార్టీలో 1922 కమిటీ అనేది ఒకటి ఉంది. పార్లమెంటులో వెనుక బెంచీలలో కూర్చునే వారితో దీన్ని ఏర్పాటు చేస్తారు. సాధారణంగా దీనికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. మెజారిటీ వచ్చినపుడు ప్రధాని పదవికి లేదా ప్రతిపక్షంగా ఉన్నపుడు ప్రతిపక్ష నేతను ఎంపిక చేసే ప్రక్రియలో దీని పాత్ర ఉంటుంది.గతంలో 2016 థెరెస్సా మే ఎన్నిక మూడువారాల్లోపే ముగిసింది. ఇప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మంది పోటీ పడినందున ఒక్కొక్కరిని తొలగించే ప్రక్రియతో ఆలశ్యమైంది. అక్టోబరులో కన్సర్వేటివ్‌ పార్టీ మహాసభ జరిగే లోగా ఎన్నిక జరగాలని 1922 కమిటీ నిర్ణయించిది.సెప్టెంబరు ఐదున ప్రకటించే విజేతను తదుపరి ప్రధానిగా ఎన్నుకుంటారు. అప్పటి వరకు బోరిస్‌ జాన్సన్‌ పదవిలో ఉంటారు, పార్టీ విశ్వాసం కోల్పోయినందున విధానపరంగా, ఇతర మౌలిక నిర్ణయాలేవీ తీసుకోరు.


పార్టీ నేత ఎన్నిక పోటీలో తొలుత రిషి సునాక్‌ ముందున్నట్లు ఓటింగ్‌ తీరు వెల్లడించింది. దాంతో అతనే నూతన ప్రధాని అవుతాడన్నట్లుగా మన దేశ మీడియా వార్తలు ఇచ్చింది. అయితే విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ దూసుకువచ్చి సవాలు విసరటంతో పోటీ రసవత్తరంగా మారింది. రిషి సునాక్‌ బ్రిటన్‌లో స్ధిరపడిన పంజాబీ కుటుంబంలో పుట్టాడు.నలభై రెండు సంవత్సరాల రిషి విద్యార్ధిగా ఉన్నపుడు మన దేశంలో ఇన్ఫోసిస్‌ అధినేత నారాయణ మూర్తి కుమార్తె అక్షితతో ఏర్పడిన పరిచయం 2009లో వివాహానికి దారి తీసింది. వారికి ఇద్దరు పిల్లలు. సనక్‌-అక్షితలు బ్రిటన్‌లోని సంపన్నుల్లో 2022లో 73 కోట్ల పౌండ్లతో 222వ స్థానంలో ఉన్నారు. భారతీయ సంతతికి చెందిన వారు అనేక దేశాల్లో ప్రముఖులుగా, దేశాధినేతలుగా కూడా పనిచేశారు. అమెరికాకు చెందిన ఇండియాస్పోరా అనే స్వచ్చంద సంస్థ 2021లో వెల్లడించిన సమాచారం ప్రకారం ప్రపంచంలో ఉన్న ఐదున్నర కోట్ల మంది ప్రవాస భారతీయ సంతతిలో పదిహేను దేశాల్లో 200 మంది వరకు వివిధ రంగాల్లో ప్రముఖులుగా ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో తొలి మహిళా ఉపాధ్యక్షరాలుగా ఉన్న కమలా హారిస్‌, అక్కడే లూసియానా రాష్ట్ర గవర్నర్‌గా పని చేసిన బాబీ జిందాల్‌, సౌత్‌ కరోలినా రాష్ట్ర గవర్నర్‌గా, ఐరాసలో అమెరికా రాయబారిగా పనిచేసిన నిమ్రతా నిక్కీ హేలీ, బ్రిటన్‌ హౌం మంత్రిగా ఉన్న ప్రీతి పటేల్‌,ప్రధాని పదవికి ఇప్పుడు పోటీ పడుతున్న రిషి సునాక్‌ వంటి వారు ఎందరో ఉన్నారు. వివిధ దేశాధినేతలుగా 30 మంది భారతీయ మూలాలు ఉన్నవారు పని చేశారు. వారిలో బ్రిటీష్‌ గుయానా అధ్యక్షుడిగా పనిచేసి చెడ్డీ జగన్‌ వంటి ఒకరిద్దరు వామపక్ష వాదులను మినహాయిస్తే మిగిలిన వారందరూ ఆయా దేశాల్లో పాలకవర్గాలకు ఇష్టులుగా, అనుకూలంగా పని చేసిన వారే అన్నది స్పష్టం.ప్రస్తుతం కెనడా, బ్రిటన్‌ వంటి చోట్లమంత్రులుగా ఉన్నవారు కూడా అదే తరగతికి చెందిన వారే. అమెరికాలో తొలిసారిగా ఆఫ్రో-అమెరికన్‌ సామాజిక తరగతికి చెందిన బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా పని చేసిన సంగతి తెలిసిందే. నల్లజాతీయుల పట్ల వివక్ష, దాడులు ఏమాత్రం తగ్గలేదు. అంతకు ముందు పాలకులు అనుసరించిన విధానాలనే తు.చ తప్పకుండా అనుసరించాడు. అందువలన ఇప్పుడు ఒక వేళ రిషి సునాక్‌ విజేతగా నిలిచి గడువు మేరకు 2025వరకు పదవిలో ఉన్నా ఇంతకు ముందు బోరిస్‌ జాన్సన్‌ అనుసరించిన విధానాల కొనసాగింపే తప్ప మౌలికమార్పులేమీ ఉండవు.


ప్రస్తుతం రిషి సునాక్‌ాలిజ్‌ ట్రస్‌ కన్సర్వేటివ్‌ పార్టీ మద్దతుదార్లకు తమ విధానాలను వివరించే పనిలో ఉన్నారు. బ్రిటన్‌తో సహా అమెరికా నుంచి భారత్‌ వరకు అనేక దేశాలను చైనా లక్ష్యంగా చేసుకున్నట్లు రుజువుందని, తాను అధికారానికి వచ్చిన తొలిరోజే బ్రిటన్‌లోని 30 చైనా కన్ఫ్యూసియస్‌ సంస్థలను మూసివేస్తానని, చైనా సైబర్‌ ముప్పును ఎదుర్కొనేందుకు ఒక కొత్త నాటో కూటమిని ఏర్పాటు చేస్తానని రిషి సునాక్‌ ప్రకటించాడు. బ్రిటన్‌ సాంకేేతిక పరిజ్ఞానాన్ని చైనా అపహరిస్తున్నదని, విశ్వవిద్యాలయాల్లోకి తన మద్దతుదార్లను చొప్పిస్తున్నదని, వారిని పంపివేస్తానని, రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌ దురాక్రమణను ప్రోత్సహిస్తున్నదని ఆరోపించాడు. చైనా-బ్రిటన్‌ సంబంధాల అభివృద్ధి అంశంలో పోటీలో ఉన్న వారిలో సునాక్‌ ఒక్కరే స్పష్టమైన,ఆచరణాత్మకమైన వైఖరిని కలిగి ఉన్నారని ఇటీవల చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. దాన్ని పట్టుకొని చైనా, రష్యా పట్ల సునాక్‌ మెతకగా ఉంటారని లిజ్‌ ట్రస్‌ ఆరోపించినదానికి ప్రతిగా చైనా పట్ల కఠినంగా ఉంటానంటూ సునాక్‌ ఎదురుదాడి ప్రారంభించాడు. బ్రిటన్‌లో వ్యూహాత్మకంగా కీలకమైన సంస్థలను చైనా కొనుగోలు చేయటాన్ని అధ్యయనం చేస్తానని, నిషేధిస్తానని పేర్కొన్నాడు.తన స్వంత షింజియాంగ్‌, హాంకాంగ్‌ పౌరులను చిత్రహింసలపాలు చేస్తూ అణచివేస్తుదని,తన కరెన్సీ విలువ పెరగకుండా చూస్తూ ప్రపంచ ఆర్ధికరంగాన్ని తనకు అనుకూలంగా రిగ్గింగ్‌ చేస్తున్నదని అన్నాడు. గుడ్డిగా చైనాను సమర్ధిస్తూ పశ్చిమదేశాలన్నీ దానికి ఎర్ర తివాచీ పరిచాయని జరిగిందేదో జరిగింది, తాను అధికారానికి వచ్చిన తొలి రోజునుంచి ఆ వైఖరిని మార్చివేస్తానని అన్నాడు.


తన కంటే పోటీలో ముందున్న లిజ్‌ ట్రస్‌ను ఎదుర్కొనేందుకు కన్సర్వేటివ్‌ పార్టీలోని చైనా వ్యతిరేకులను సంతృప్తి పరచేందుకు సునాక్‌ యత్నించారన్నది స్పష్టం. మరోవైపు ట్రస్‌ కూడా చైనా మీదనే దాడిని కేంద్రీకరించింది. జి7 కూటమిని ” ఆర్ధిక నాటో ”గా మార్చాలని, అంతర్జాతీయ నిబంధనలను అమలు జరపని పక్షంలో చైనా మీద ఆంక్షలు ప్రకటించాలని చెప్పింది. దక్షిణ చైనా సముద్రాన్ని ఆక్రమిస్తున్నా, తైవాన్ను బెదిరిస్తున్నా, హాంకాంగ్‌లో ఉద్యమాన్ని అణచివేస్తున్నా, ఉఘీర్‌లపై మారణకాండ జరుపుతున్నా గత రెండు సంవత్సరాలలో చైనాతో ఆర్ధిక ఒప్పందాల కోసం ఆర్ధిక మంత్రిగా సునాక్‌ చూశారని, ఇప్పుడు కబుర్లు చెబుతున్న మీరు అప్పుడెక్కడ ఉన్నారని కన్సర్వేటివ్‌ పార్టీ నేత ఇయాన్‌ డంకన్‌ స్మిత్‌ ధ్వజమెత్తాడు. దేశంలో జీవన వ్యయం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపధ్యంలో తాను దుబారాకు దూరంగా ఉంటానని ప్రకటించిన సునాక్‌ ఓట్లకోసం జనం ముందుకు వస్తూ 450 పౌండ్ల విలువగల బూట్లు, మూడున్నరవేల పౌండ్ల ఖరీదైన సూటు ధరించి వస్తున్నారని, అదే తమనేత లిజీ ట్రస్‌ కేవలం నాలుగున్నర పౌండ్ల విలువ గల చెవిపోగులు ధరించి దేశంలో తిరుగుతున్నారని కన్సర్వేటివ్‌ పార్టీ సాంస్కృతిక శాఖ మంత్రి నాదిన్‌ డోరిస్‌ విమర్శించారు.


చైనా మీద ధ్వజమెత్తిన సునాక్‌ సరిగ్గా ఏడాది క్రితం మాట్లాడుతూ చైనాతో సన్నిహిత ఆర్ధిక సంబంధాలు పెట్టుకోవాలని ప్రబోధించాడు. 2021 జూలై ఒకటవ తేదీన మాన్షన్‌ హౌస్‌ వార్షిక విధాన ఉపన్యాసం చేస్తూ 55లక్షల కోట్ల విలువగల చైనా ఆర్ధిక సేవల మార్కెట్‌ గురించి ఐరోపా సమాఖ్య ఒప్పందానికి రావటంలో విఫలమైందని, బ్రిటన్‌ సంస్థలు దాన్ని దక్కించుకొనే లక్ష్యంతో పని చేయాలని సునాక్‌ ఉద్బోధించాడు. అమెరికా కంటే కూడా చైనా మీద ఎక్కువగా కేంద్రీకరించి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నాడు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వెలుపలికి వచ్చిన తరువాత 2021 జనవరి ఒకటి నుంచి సమాఖ్య షేర్‌ మార్కెట్‌ లావాదేవీల సేవలు లండన్‌ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌, పారిస్‌, న్యూయార్క్‌ నగరాలకు తరలాయి.ఐరోపా సమాఖ్యతో ఎలాంటి ఒప్పందం లేకుండానే బ్రిటన్‌ బయటపడింది. సమాఖ్యతో పోలిస్తే భిన్నమైన షరతులను చైనా అంగీకరించే అవకాశం ఉన్నందున మన విలువలతో రాజీపడకుండా పరస్పరం లబ్ది పొందే విధంగా బ్రిటన్‌ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సునాక్‌ వాదించాడు.
కన్సర్వేటివ్‌ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బ్రిటన్‌కు అనేక సవాళ్లను తెస్తున్నాయి. ఐరోపా సమాఖ్య నుంచి వెలుపలికి వచ్చిన తరువాత ఇతర దేశాలతో ఒప్పందాలకు పూనుకొని జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని చూస్తున్నది. కుంభకోణాలు, అవినీతి అక్రమాల కారణంగా రెండుగా చీలిన కన్సర్వేటివ్‌ పార్టీ అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. సునాక్‌, లిజ్‌ ట్రస్‌ ఇద్దరూ మంత్రులుగా ఉండి ఏం చేశారో చెప్పకుండా ఇప్పుడు చైనా పట్ల వైఖరి గురించి మాట్లాడుతున్నారు. అంతర్గత అంశాలపై ఏమి చెప్పినప్పటికీ విదేశాంగ విధానం గురించి చైనా మీద కేంద్రీకరించటం మద్దతుదార్లను తప్పుదారి పట్టించటం,చైనా వ్యతిరేకతతో సంతుష్టీకరించేందుకు పూనుకున్నారు.