Tags
Atomic bombings of Hiroshima and Nagasaki, NATO, Ukraine-Russia crisis, US imperialism, world Peace
ఎం కోటేశ్వరరావు
ఆగస్టు నెల వస్తుందంటే ప్రపంచ శాంతి ప్రియులకు గుర్తుకు వచ్చేది హిరోషిమా-నాగసాకీలపై అమెరికా జరిపిన దుర్మార్గ అణుబాంబుల దాడి.1945 ఆగస్టు ఆరున హిరోషిమా, తొమ్మిదిన నాగసాకి నగరాలపై అవసరం లేకున్నా రెండవ ప్రపంచ యుద్దం దాదాపుగా ముగిసిన తరువాత బాంబులు వేసి తన దగ్గర ఎంతటి ప్రమాదకర మారణాయుధాలున్నాయో, అవెలా విధ్వంసం సృష్టిస్తాయో చూడండని భయపెడుతూ ప్రపంచానికి సవాలు విసిరింది. ఆ తరువాతే దానికి ధీటుగా ఉండేందుకు సోవియట్, బ్రిటన్,ఫ్రాన్స్, చైనా అణ్వస్త్రాలను తయారు చేశాయి. ఇప్పుడు భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియాల వద్దకూడా ఉన్నాయి. మరొక భావన ప్రకారం ఏ దేశంలోనైతే అణువిద్యుత్ కేంద్రాలు ఉన్నాయో అవన్నీ ఏ క్షణంలోనైనా బాంబులు తయారు చేసే స్థితిలో ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటైన ఇరాన్ అణ్వస్త్రాల తయారీ కార్యక్రమం చేపట్టిన కారణంగానే దాన్ని విరమింప చేసేందుకు అమెరికా తదితర దేశాలు పూనుకోవటం, ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవటం వంటి పరిణామాలన్నీ తెలిసిందే. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఇప్పుడు 1945 నాటి అణు బాంబుల కంటే ఇంకా ఎంతో విధ్వంసాన్ని సృష్టించగలిగినవి, కొన్ని వేల బాంబులు తయారై సిద్దంగా ఉన్నాయి.అవేగాక ఇతర మారణాయుధాలు గుట్టలుగా పేర్చుకొని సిద్దంగా పెట్టుకున్నారు. అమెరికా తాను తయారు చేసిన ప్రతి కొత్త ఆయుధం ఎలా పని చేస్తుందో చూసేందుకు అది సృష్టిస్తున్న యుద్దాలలో జనం మీద ప్రయోగించి చూస్తున్నది. ఇప్పుడు ఐరోపాలోని ఉక్రెయిన్ను అందుకు ప్రయోగశాలగా చేసుకుంది.
రెండవ ప్రపంచ యుద్ద చివరి సంవత్సరం 1945 మే ఎనిమిదవ తేదీన జర్మనీ లొంగిపోయింది. తరువాత ప్రధాన శత్రువుగా ఉన్న జపాన్‌పై భారీఎత్తున దాడి చేసేందుకు మిత్రరాజ్యాలు పూనుకున్నాయి. అప్పటికి అమెరికా తలపెట్టిన అణుబాంబుల తయారీ చివరి దశకు వచ్చింది. జూలై నాటికి ప్లూటోనియంతో తయారుచేసిన ” ఫాట్ మాన్ ” యురేనియంతో రూపొందించిన ” లిటిల్ బోయి ” సిద్దంగా ఉన్నాయి.జపాన్నుంచి స్వాధీనం చేసుకున్న సమీపంలోని మరియానా దీవుల్లో ఒకటైన టినియన్‌లో అమెరికా వాటిని ఉంచింది. జపాన్ బేషరతుగా లొంగిపోవాలని 1945 జూలై 26న పోట్స్‌డామ్ ప్రకటనలో మిత్రదేశాలు అల్టిమేటం ఇచ్చాయి. అయితే దానికి ముందే అమెరికా-బ్రిటన్ కూడబలుక్కొని నాగసాకి, హిరోషిమా,కొకురా, నిజిగటా పట్టణాలపై అణుబాంబులు వేయాలని నిర్ణయించాయి. ఆగస్టు ఆరున హిరోషిమాపై లిటిల్‌బోయి, తొమ్మిదిన నాగసాకిపై ఫాట్‌మాన్ బాంబులు వేశారు. లొంగేది లేదని జపాన్ బింకంగా ప్రకటించినప్పటికీ అప్పటికే అది చావుదెబ్బలు తిన్నందున మరికొద్ది రోజుల్లో పతనమై ఉండేది. బాంబులు వేసిన రోజు, తరువాత హిరోషిమాలో లక్షా 29వేల మంది, నాగసాకిలో రెండు లక్షల 26వేల మంది మరణించారు.తరువాత అణుధూళితో మరికొన్ని వేల మంది మరణం, రోగాలపాలైనారు.
అణ్వాయుధాల ముప్పును చూసిన తరువాత వాటిని మరొకసారి వినియోగించరాదనే డిమాండ్‌ను ప్రపంచ శాంతి ఉద్యమం ముందుకు తెచ్చింది. ఎవరైనా తమ మీద ప్రయోగించకపోతే తాముగా ముందు ఉపయోగించబోమని (ఎన్‌ఎఫ్‌యు పాలసీ) అణుశక్తి దేశాలు స్వచ్చందంగా ప్రకటన చేసి కట్టుబడి ఉండాలన్నదే దాని సారం.ఇదేగాక అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని భద్రతామండలిలోని ఐదు శాశ్వత, అణుశక్తి దేశాలు ముందుకు తెచ్చాయి.1964లో అణ్వాయుధాలను సమకూర్చుకున్న చైనా ఏ సమయంలోనూ, ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ముందుగా ఉపయోగించబోమని తొలిసారిగా చేసిన ప్రకటనకు ఇప్పటికీ కట్టుబడి ఉంది. దీనిపై ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికాను డిమాండ్ చేయగా అది తిరస్కరించింది. రష్యా – చైనా పరస్పరం వాటిని ఉపయోగించరాదని ఒప్పందం చేసుకున్నాయి.
మన దేశం 1974లోనే తొలి అణుపరీక్ష జరిపినప్పటికీ, 1998లో రెండవసారి పోఖ్రాన్ పరీక్షల తరువాత మాత్రమే తమ మీద ఎవరూ అణుదాడికి దిగకపోతే తాముగా ముందు ప్రయోగించబోమని 1999లో ప్రకటించింది. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. పరిస్థితులను బట్టి ఆ వైఖరిని సవరించుకోవాల్సి రావచ్చని 2019లో రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ చెప్పినప్పటికీ పాత విధానమే కొనసాగుతోంది.తమ మీద, తమ మిత్ర దేశాల మీద ఎవరైనా దాడి చేస్తే తప్ప తాము ఉయోగించబోమని అమెరికా,బ్రిటన్, ఫ్రాన్స్ చెబుతున్నాయి, గతంలో సోవియట్, తరువాత రష్యా కూడా అదే చెప్పింది. సోవియట్ గనుక దురాక్రమణకు పాల్పడితే అణ్వాయుధాలను వాడతామని నాటో కూటమి చెప్పింది.అమెరికా, బ్రిటన్,ఫ్రాన్స్ దానిలో భాగస్వాములే.1999లో నాటో పదహారవ సమావేశంలో ఎన్‌ఎఫ్‌యు విధానాన్ని ఆమోదించాలని జర్మనీ చేసిన ప్రతిపాదనను సమావేశం తిరస్కరించింది. అణుయుద్దంలో విజేతలెవరూ ఉండరు, ఎన్నడూ పోరుకు పూనుకోవద్దంటూ ఎన్‌పిటి దేశాలు 2022లో ఒక ప్రకటన చేశాయి. ఎన్‌పిటి వివక్షతో కూడుకున్నదంటూ దాని మీద సంతకం చేసేందుకు మన దేశం తిరస్కరించింది.తమకు ఎన్‌ఎఫ్‌యు విధానం లేదని పాకిస్తాన్ చెబుతుండగా తమ దగ్గర అణ్వాయుధాలు ఉన్నదీ లేనిదీ ఇజ్రాయెల్ నిర్దారించటం లేదు. తాముగా ముందు దాడికి దిగబోమని ఎవరైనా చేస్తే ప్రతిదాడి చేస్తామని ఉత్తర కొరియా చెప్పింది. ఉక్రెయిన్ వివాదంలో అవసరమైతే అణుదాడి చేస్తామని పుతిన్ హెచ్చరించినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు.
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ వంటి దేశాలకు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట నిరంతరం ఉద్రిక్తతలు, యుద్దాలు లేకపోతే నిదురపట్టదు. ఒక దగ్గర ముగిస్తే మరోచోట ప్రారంభిస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అవమానకరంగా వెన్ను చూపిన పశ్చిమ దేశాలు ఉక్రెయిన్లో అగ్గిరాజేశాయి. రష్యా బలహీనంగా ఉన్నపుడు తమతో కలుపుకుపోయి చైనాకు వ్యతిరేకంగా నిలబెట్టాలని చూసిన ధనిక దేశాల జి7 కూటమిని విస్తరించి జి8గా మార్చాయి. ఇదే సమయంలో ఎప్పుడైనా తమకు సవాలుగా మారవచ్చని భావించిన ఆ కూటమి నాటో విస్తరణ పేరుతో జార్జియా, ఉక్రెయిన్ను చేర్చుకొని రష్యా ముంగిట ఆయుధాలను మోహరించాలని చూశాయి. రష్యా దాన్ని గ్రహించి ప్రతి వ్యూహంతో ఒక వైపు చైనాతో ఉన్న స్వల్ప వివాదాలను పరిష్కరించుకుంది. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్లో అధికారంలో ఉన్న రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూలదోసి తమ తొత్తులను ప్రతిష్టించాయి.రష్యా తన సరిహద్దులో ఉండి నాటోలో చేరాలని చూసిన జార్జియాలో రెండు ప్రాంతాల్లో తలెత్తిన స్వాతంత్య్ర ఉద్యమాలకు మద్దతు ఇచ్చి వాటిని దేశాలుగా గుర్తించింది.ఉక్రెయిన్లోని డాన్‌బాస్ ప్రాంతంలో ఉన్న మెజారిటీ రష్యన్లు తాము విడిపోయి స్వతంత్ర దేశాలుగా అవతరిస్తామని ప్రారంభించిన తిరుగుబాటుకు మద్దతు తెలిపింది. గతంలో తన భూభాగంగా ఉండి తరువాత ఉక్రెయిన్లో కొనసాగిన క్రిమియా ప్రాంతాన్ని 2014లో రష్యా విలీనం చేసుకుంది. అక్కడ తన సేనలను మోహరించింది. ఈ ఉదంతాన్ని సాకుగా చూపి జి8 బృందం నుంచి రష్యాను బహిష్కరించారు. అప్పటి నుంచి నాటో కూటమి దేశాలు ఉక్రెయినుకు భారీ ఎత్తున ఆయుధాలు సరఫరా చేసి రష్యాను రెచ్చగొట్టాయి.ఐరోపా సమాఖ్య, నాటోలో చేర్చుకొని మిలిటరీని కూడా తరలించాలని చూశాయి. ఇది తమ దేశ భద్రతకు ముప్పు అని, ఉక్రెయిన్ను తమ కూటమిలో చేర్చుకోవద్దని అనేక వేదికల మీద రష్యా చేసిన వినతులను పట్టించుకోలేదు. దీంతో విధిలేని స్థితిలో 2022 ఫిబ్రవరి 24న రష్యా ప్రత్యేక సైనిక చర్యను ప్రారంభించింది. డాన్‌బాస్ ప్రాంతంపై దాడులు చేస్తున్న మిలిటరీ, కిరాయి మూకల నుంచి విముక్తి చేయటంతో పాటు ఉక్రెయిన్ సైనిక పాటవాన్ని దెబ్బతీస్తామని, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొనేది లేదని ప్రకటించింది. ఆ మేరకు భారీ ఎత్తున ప్రాణ నష్టం జరగకుండా ఆచితూచి దాడులు చేస్తున్నది.
ఈ వివాదంలో రెండు వైపులా మరణించిన సైనికులు, పౌరుల సంఖ్య గురించి కచ్చితమైన వివరాలు ఇంతవరకు లేవు. ఇరుపక్షాలు చెబుతున్నవాటిని విశ్వసించలేము.కిరాయి మూకలు లేవని తొలుత ఉక్రెయిన్ చెప్పింది. తరువాత అజోవ్ ప్రాంతంలోని ఉక్కు ఫ్యాక్టరీ నుంచి దాడులకు దిగిన వేలాది మంది కిరాయి మూకలు రష్యన్లకు బందీలుగా చిక్కాయి. ఒక వేళ రష్యా దాడులకు దిగితే తాము అన్ని విధాలుగా సాయం చేస్తామని చెప్పి ఉక్రెయిన్ను వివాదంలోకి దించిన పశ్చిమ దేశాలు తాము ఎన్ని కావాలంటే అన్ని అస్త్రాలను అందిస్తాం తప్ప మిలిటరీని పంపం, వైమానిక దాడులు జరపం అని చెప్పాయి. తొలి రోజుల్లో ఉక్రెయిన్ ప్రతిఘటన, రష్యాను దెబ్బతీస్తున్న తీరు తెన్నులంటూ ప్రపంచాన్ని, తమ ప్రజానీకాన్ని నమ్మింప చూసిన పశ్చిమ దేశాల మీడియా, వాటిని నమ్మి మన జనానికి అందించిన మన మీడియాలో ఇప్పుడు అలాంటి ” కతలు ” కనిపించవు, వినిపించటం లేదు.
పశ్చిమ దేశాలు సృష్టించిన ఈ సంక్షోభానికి ఉక్రేనియన్లు బలిఅవుతున్నారు. జూలై నాలుగు నాటి ఐరాస సమాచారం ప్రకారం 50లక్షల మంది వివిధ దేశాల్లో తలదాచుకున్నారు. మరో 70లక్షల మంది స్వదేశంలోనే నెలవులు తప్పారు.రష్యాదాడుల కారణంగా ఐరోపాలోని ఇతర దేశాలకు వెళ్లిన 35లక్షల మంది తప్ప ఉక్రెయిన్ మిలిటరీ, కిరాయి మూకల దాడులతో 14లక్షల మంది రష్యాలో తలదాచుకుంటున్నారనే అంశం మనకు మీడియాలో కనిపించదు. మన దేశ ఆర్ధిక వ్యవస్థ వృద్ది రేటు కరోనాకు ముందే నాలుగుశాతానికి పడిపోయింది. దీనికి పాలకులు అనుసరించిన విధానాలే కారణం. కానీ ఇటీవల వంటనూనెల ధరలు ఆకాశానికి అంటటానికి,కొరతకు ఉక్రెయిన్ కొంత కారణమైతే ఇక్కడి వ్యాపారుల మీద ప్రభుత్వాలకు వెన్నుదన్నుగా ఉండటం ఒక ప్రధాన కారణం. పామోలిన్, సన్‌ఫ్లవర్ అంటే దిగుమతులు చేసుకుంటున్నాం, మరి వేరుశనగనూనె ఎందుకు కనిపించటం లేదు ? శ్రీలంక ఆందోళనలు, ఏడాదికిపైగా సాగిన రైతుల ఉద్యమ నేపధ్యంలో మరోదారి లేక చమురు ధరలు పెరిగినందున ఎరువుల ధరలను రైతులపై మోపకుండా కేంద్రం సబ్సిడీ రూపంలో భరిస్తున్నది, చమురుపై విధించిన పన్నులను కొంత మేరకు తగ్గించటంతో పాటు ఏప్రిల్ ఆరు నుంచి చమురు ధరలను నరేంద్రమోడీ సర్కార్ స్థంభింప చేసింది తప్ప ఇతర వస్తువుల ధరల పెరుగుదల నుంచి జనాలకు ఎందుకు ఎలాంటి వెసులుబాటు కల్పించలేదు.
రష్యా నుంచి ఎరువులు, గోధుమలు, ఇంథన సరఫరాలు నిలిచిపోవటంతో అనేక దేశాలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వీటన్నింటికీ ప్రపంచ పెత్తనంపై అమెరికా, దాని మిత్రదేశాల కాంక్ష తప్ప మరొకటి లేదు. ఐరోపా సమాఖ్య,నాటోలో చేరేది లేదని ఉక్రెయిన్ అంగీకరిస్తే దాని సార్వభౌత్వానికి, రక్షణకు హామీ ఇస్తామని రష్యా చెబుతున్నప్పటికీ పశ్చిమ దేశాలు పడనివ్వటం లేదు. ఆంక్షలతో రష్యాను దెబ్బతీసేందుకే పూనుకున్నాయి. ఇప్పటి వరకు పశ్చిమ దేశాలు అనుకున్నట్లుగా జరగలేదు. అనిశ్చితి కారణంగా చమురు ధరలు పెరగటంతో అది రష్యాకు వరంగా మారి రాబడిని పెంచింది. మన దేశం, చైనా తదితర దేశాలకు రాయితీలకు చమురు అమ్ముతున్నది. కానీ ప్రపంచమంతా ఇబ్బంది పడుతున్నది.
ఉక్రెయిన్ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేము.పశ్చిమ దేశాల చేతిలో ఉక్రెయిన్ నేత జెలెనెస్కీ కీలుబొమ్మగా మారాడు. రష్యా నుంచి ఇంథన కొనుగోళ్లను నిలిపివేసిన ఐరోపా దేశాల మీద దాని ప్రతికూల పర్యవసానాలు ఇప్పుడే కనిపిస్తున్నాయి.రష్యా మీద కూడా దీని ప్రభావం ఉంది, అయితే ముందుగానే ఊహించినందున ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులకు గురి కాలేదు. ఉక్రెయిన్ ఆర్ధిక వ్యవస్థ 2022లో 45శాతం, రష్యాలో 8-10శాతం వరకు తిరోగమనంలో ఉంటుందని అంచనా. ఐఎంఎఫ్ అంచనా ప్రకారం గతేడాది ప్రపంచ వృద్ది రేటు 6.1శాతం కాగా వర్తమాన సంవత్సరంలో అది 2.6, 2023లో రెండు శాతానికి తగ్గుతుందని తాజా అంచనా. ఐరోపా, అమెరికాల్లో వచ్చే ఏడాది వృద్ది రేటు సున్నా అంటున్నారు. 1970 నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వృద్ది రేటు రెండుసార్లు రెండుశాతానికి పడిపోయింది. ధనిక దేశాల వృద్ది రేటు పడిపోతే మన వంటి దేశాల ఎగుమతుల మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించేందుకు పశ్చిమ దేశాలు ముందుకు రావటం లేదు.
రెండవ ప్రపంచ యుద్దం తరువాత సోవియట్ నుంచి ఐరోపాకు ముప్పు ఉంటుందనే పేరుతో బ్రిటన్‌తో చేతులు కలిపిన అమెరికా నాటో కూటమిని ఏర్పాటు చేసి పగ్గాలు తన చేతిలో ఉంచుకుంది.నాటో తొలి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బ్రిటీష్ జనరల్ హేస్టింగ్ ఇస్మే మాటల్లో ” ఐరోపాకు దూరంగా రష్యా (సోవియట్ )ను నెట్టటం, అమెరికాను లోనికి రప్పించటం,జర్మనీ పలుకుబడిని తగ్గించటం ” అన్నాడు.ఐరోపాలో శాంతి-స్థిరత్వాలకు అది దోహదం చేస్తుందని ప్రపంచాన్ని నమ్మించారు. ఆ సోవియట్ ఇప్పుడు ఉనికిలో లేదు, ఐరోపాకు ముప్పూ లేనప్పటికీ గత మూడు దశాబ్దాలుగా దాన్ని కొనసాగించటమే కాదు, విస్తరిస్తున్నారు. అది ఇప్పుడు అమెరికాను వ్యతిరేకించే దేశాలకు ముప్పుగా మారింది.అమెరికా అణుదాడికి గురైన జపాన్ ఇప్పుడు అదే అమెరికాతో చేతులు కలిపింది. చైనా మీద కాలుదువ్వుతోంది. సోవియట్ విచ్చిన్నం తరువాత నాటోను కానసాగిస్తున్నారు. నాటో పరిధి వెలుపల మిలిటరీ చర్యలకు వినియోగిస్తున్నారు. వాటికి మానవతాపూర్వక దాడులని పేరు పెట్టారు.1994లో బోస్నియాలో నాటో విమానాలు తొలిసారిగా దాడులు చేసి సెర్బియా విమానాన్ని కూల్చాయి.1999లో సెర్బియా మీద 78రోజులు దాడులు చేసింది. ఉగ్రవాదంపై పోరు పేరుతో ఇరాక్‌పై దురాక్రమణను నాటో సమర్ధించింది, తరువాత ఆప్ఘనిస్తాన్ దురాక్రమణ, లిబియాపై దాడుల్లో భాగస్వామిగా మారింది.లిబియానేత గడాఫీని హత్య చేసి తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1991లో సోవియట్ విడిపోయి నపుడు నాటోను విస్తరించబోమని రష్యాకు ఇచ్చిన హామీని ఉల్లంఘించి తూర్పు ఐరోపాలో ఉన్న అనేక దేశాలను చేర్చుకోవటమే తాజా పరిణామాలకు మూలం.తటస్థ దేశాలుగా ఉన్న ఫిన్లండ్, స్వీడన్‌లను చేర్చుకొనేందుకు నిర్ణయించిది. అంటే రష్యా సరిహద్దులో తిష్టకు తెరలేపింది. లాటిన్ అమెరికాలో కూడా నాటో అడుగుపెట్టేందుకు పూనుకుంది. మొత్తం ప్రపంచానికి ముప్పు తలపెట్టింది.
నాటోను ఆసియాకు విస్తరించేందుకు పావులు కదుపుతున్నారు. ఇక్కడ కొత్త కూటమి ఏర్పాటు, దానిని నాటోకు అనుసంధానించే ఎత్తుగడ ఉంది.ఇదంతా చైనాను కట్టడి చేసేందుకే.ప్రపంచంలోని 80 దేశాల్లో అమెరికాకు 800 మిలిటరీ కేంద్రాలున్నాయి. వాటిలో నాలుగు వందలు చైనా చుట్టూ ఉన్నాయంటే అమెరికా కేంద్రీకరణ దానిమీద ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. చైనా పెద్ద ఎత్తున ప్రపంచాన్ని ఆక్రమించేందుకు పూనుకుందన్న ప్రచారం మరోవైపు అదే అమెరికా సాగిస్తోంది. ఒక చిన్న దేశం సింగపూర్‌కే ప్రపంచంలో నాలుగు సైనిక కేంద్రాలున్నాయి. ప్రపంచంలోనే పెద్ద దేశమైన చైనా తన చుట్టూ అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా తదితరదేశాలు పట్టుబిగిస్తున్నా అలాంటి కేంద్రాల ఏర్పాటుకు పూనుకోలేదు. దానికి కంపూచియాలో ఒక నౌకా కేంద్రం, తజకిస్తాన్‌లో ఒక మిలిటరీ పోస్టు, జిబౌటీలో అనేక దేశాల సైనిక కేంద్రాల సరసన దానికి ఒక చిన్న కేంద్రం ఉంది. ఎక్కడైనా స్వేచ్చగా తిరిగే హక్కు తమకు ఉందంటూ అమెరికా నగరమైన న్యూయార్క్ ఇతర సముద్రతీర నగరాల వైపు ఏ విదేశీ మిలిటరీ నౌకలు తిరగటం ఎన్నడూ కనిపించదు. కానీ చైనా చుట్టూ అమెరికా, దాని మిత్రదేశా నౌకలు నిరంతరం తిరుగుతూనే దర్శనమిస్తాయి, ఎందుకని ? దేశమంటే మట్టికాదోయి మనుషులోయి అన్న మహాకవి గురజాడ స్ఫూర్తితో విశ్వమానవాళికోసం హిరోషిమా, నాగసాకి దినం సందర్భంగా ప్రపంచంలోని శాంతి ప్రియులందరూ అమెరికా దాని మిత్ర దేశాల యుద్దోన్మాదాన్ని ఖండించాలి, నిరసించాలి. ప్రపంచాన్ని కాపాడాలి. శాంతి ఉద్యమాల్లో భాగస్వాములు కావాలి.