Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


బీహార్‌లో మరో ఏకనాధ్‌ షిండేను సృష్టించాలన్న బిజెపి మంత్రాంగం బెడిసి కొట్టింది. అక్కడ అధికారంలో ఉన్నది ఎత్తుగడలలో తలపండిన జెడియు నితీష్‌ కుమార్‌ను తక్కువ అంచనా వేసినట్లు కనిపిస్తోంది.గత కొద్ది రోజులుగా బీహార్‌లో జరుగుతున్న బిజెపి-జెడియు కూటమి కుమ్ములాటలు మంగళవారం నాడు కేవలం ఆరుగంటల్లోనే అధికారాన్ని మార్చివేశాయి. బిజెపితో తెగతెంపులు చేసుకున్న నితీష్‌ కుమార్‌ మహాకూటమి మద్దతుతో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏడు పార్టీలు, కొందరు స్వతంత్రులతో సహా 164 మంది మద్దతు ఉన్న తాను కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను కలిసేందుకు వచ్చినట్లు నితీష్‌ కుమార్‌ ప్రకటించారు. మంగళవారం నాటి పరిణామాల క్రమం ఇలా ఉంది.


ఉదయం పదకొండు గంటలకు జెడియు ఎంఎల్‌ఏలు, ఎంపీలతో నితీష్‌ కుమార్‌ సమావేశం.11.15కు వేరే చోట ఆర్‌జెడి ఎంఎల్‌ఏల భేటీ, ఒంటి గంట మాజీ సిఎం రబ్రీదేవి ఇంట్లో ఆర్‌జెడి, కాంగ్రెస్‌, వామపక్షాలతో కూడిన మహాకూటమి భేటీ.నితీష్‌ కుమార్‌కు మద్దతుగా లేఖపై సంతకాలు. నాలుగు గంటలకు నితీష్‌ కుమార్‌ గవర్నర్‌ ఫాగు చౌహాన్‌తో భేటీ, పదవికి రాజీనామా, 4.45కు రబ్రీదేవి ఇంటికి వచ్చిన నితీష్‌ కుమార్‌. 5.20కి తిరిగి గవర్నర్‌ను కలసి కొత్త కూటమి ప్రభుత్వ ఏర్పాటు చేస్తానంటూ ఎంఎల్‌ఏల సంతకాలతో కూడిన లేఖ అందచేత. ప్రస్తుతం అసెంబ్లీలో పార్టీల వారీగా ఆర్‌జెడి 79, బిజెపి 77, జెడియు 45, కాంగ్రెస్‌ 19, సిపిఐ(ఎంఎల్‌ లిబరేషన్‌) 12,హెచ్‌ఎంఎం 4, సిపిఎం, సిపిఐలకు ఇద్దరేసి, మజ్లిస్‌ ఒకటి, ఇండిపెండెంట్లు ఒకరు ఉన్నారు. అసెంబ్లీలో 243 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 122 కావాల్సి ఉంది. ఆర్‌జెడి-జెడియు రెండు పార్టీలకే 124తో సంపూర్ణ మెజారిటీ ఉంది..


2020 నవంబరు నెలలో అధికారం చేపట్టినప్పటి నుంచి బిజెపి-జెడియు కూటమిలో ఎవరి ఎత్తుగడలతో వారు కొనసాగుతున్నారు.ఆగస్టు ఆరవ తేదీన రాజీనామా చేసిన జెడియు నేత ఆర్‌సిపి సింగ్‌ను బీహార్‌ ఏకనాధ్‌గా మార్చేందుకు బిజెపి పూనుకుందని చెబుతున్నారు. సింగ్‌కు రాజ్యసభ్యత్వాన్ని కొనసాగించేందుకు నితీష్‌ కుమార్‌ నిరాకరించినపుడే తెరవెనుక జరుగుతున్నదానిని పసిగట్టారన్నది స్పష్టం. జెడియు మునిగిపోతున్న పడవ అని ఆర్‌సిపి సింగ్‌ పార్టీ నుంచి రాజీనామా తరువాత ప్రకటించాడు. ఆర్‌సిపి సింగ్‌ శరీరం జెడియులో ఆత్మ బిజెపిలో ఉందని జెడియు అధ్యక్షుడు లాలన్‌ సింగ్‌ అన్నారు.


2005 నుంచి ఇప్పటి వరకు 2014లోక్‌సభ ఎన్నికల్లో తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ నితీష్‌కుమార్‌ గెలిచిన కూటమిలోనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఏ కూటమిలో బిజెపి పెద్ద పార్టీగా అవతరించింది. దానికి ఆర్‌జెడి మద్దతు ఉంటే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. నిజానికి నితీష్‌ను అడ్డుతొలగించుకోవటం దానికి ఒక సమస్య కాదు. అయితే రాజకీయ నాటకం రంజుగా కొనసాగాలంటే అలాంటి పాత్రలు అవసరం. అంతకు ముందే పంజాబ్‌లో అకాలీదళ్‌, మహారాష్ట్రలో శివసేనతో బెడిసి కొట్టింది. అదే పరిణామం బీహార్‌లో పునరావృతం కాకుండా ఉండాలంటే తప్పనిసరై బిజెపి లొంగి ఉంది తప్ప మరొకటి కాదు. తమిళనాడులో అన్నాడిఎంకె నాయకత్వాన్ని బెదిరించే యత్నాలు బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. మాతో ఉంటారో లేదో తేల్చుకోండి అన్నట్లుగా అన్నాడిఎంకె నేతలు ప్రకటించారు. నితీష్‌ కుమార్‌ కూడా లేకపోతే బీహార్‌లో అధికారం రాదు. బిజెపి తమనెక్కడ మింగివేస్తుందో అన్న భయంతో రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఉన్న స్థితిలో అలాంటిదేమీ ఉండదు చూడండి బీహార్‌ను అని ఇంతకాలం చెప్పుకున్నారు. అదే సమయంలో తమ పార్టీని బలపరుచుకొనేందుకు పావులు కదిపారు. ఏకనాధ్‌ షిండే రూపంలో మహారాష్ట్రలో శివసేనను దెబ్బతీశారు. తప్పనిసరై తామే పెద్ద పక్షంగా ఉన్నప్పటికీ ఏకనాధ్‌ను సిఎంను మాజీ సిఎం ఫడ్నవీస్‌ను ఉప ముఖ్యమంత్రిని చేసి తెరవెనుక నుంచి కథ నడిపిస్తున్నారు. నితీష్‌ కుమార్‌ కీలుబొమ్మగా పని చేసే రకం కాదు గనుక వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి మొత్తంగా బీహార్‌ను తమ దారికి తెచ్చుకొనేందుకు ముందునుంచే ఎసరు పెట్టారు. మూడవ పక్ష స్థాయికి తగ్గినా అక్కడున్న లెక్కల్లో ఏదో ఒక పక్షానికి నితీష్‌ అవసరం. అందుకే అందలం ఎక్కిస్తున్నారు.


గత మూడు దశాబ్దాల ఎన్నికలను చూసినపుడు బీహార్‌లో లాలూ, నితీష్‌, బిజెపి ప్రధాన శక్తులుగా ఉన్నాయి. 2014లోక్‌సభ ఎన్నికల్లో లాలూ-నితీష్‌ విడిగా పోటీ పడిన కారణంగా బిజెపి గెలిచింది. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో లాలూ-నితీష్‌ కలయికతో బిజెపి చతికిల పడింది. కొంత మందికి ఇష్టం లేకున్నా నితీష్‌తో సర్దుబాటుకు దిగక తప్పలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌-బిజెపి బంధంతో ఆ కూటమి స్వల్ప మెజారిటీతో గెలిచింది. నితీష్‌ పార్టీని ఓడించేందుకే బిజెపి పని చేసిందని, దానిలో భాగంగా అనేక మంది తన నేతలను పాశ్వాన్‌ పార్టీ ఆర్‌ఎల్‌జెపి గుర్తు మీద పోటీకి దింపిందని, కొన్ని చోట్ల జెడియును పని గట్టుకు ఓడించినట్లు విమర్శలు వచ్చాయి. అది కూడా ఇప్పుడు ఆ కూటమి పతనానికి ఒక కారణంగా చెప్పవచ్చు. మహారాష్ట్ర పరిణామాలను చూసిన తరువాత బిజెపి లోబరచుకున్న తమ నేత ఆర్‌సిపి సింగ్‌ మరొక ఏకనాధ్‌ షిండే కాకున్నప్పటికీ మరో పద్దతిలో తనను ఎంతో కాలం సిఎంగా కొనసాగనివ్వదనే అంచనాకు నితీష్‌ వచ్చినట్లు చెబుతున్నారు. సిఎం నితీష్‌ అధికారాలను అడ్డుకోవటం, తాము చెప్పిన పద్దతిలో నడవాలని నిర్దేశించేందుకు పూనుకున్నదని వార్తలు. బిజెపి కారణంగా తన పునాదులు కదులుతున్నట్లు నితీష్‌ గ్రహించారు. గత కొద్ది రోజులుగా రెండు పార్టీలు పైకి ఏమి మాట్లాడినప్పటికీ అంతర్గతంగా ఎవరి పావులు వారు కదుపుతున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం గురించి అమిత్‌ షా జూలై 17న ఏర్పాటు చేసిన సమావేశానికి నితీష్‌ డుమ్మా కొట్టారు.ఈ నెల ఏడవ తేదీన నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్‌ సమావేశానికీ రాలేదు. జూలై 22న దిగిపోనున్న రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ వీడ్కోలు విందుకు, తరువాత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికీ వెళ్లలేదు. కరోనా గురించి ప్రధాని ఏర్పాటు చేసిన సమావేశానికి అనారోగ్యం అని చెప్పి రాలేదు.


బిజెపికి చెందిన స్పీకర్‌ విజయ కుమార్‌ సిన్హాను తొలగించాలని నితీష్‌ చేసిన యత్నాలను బిజెపి అడ్డుకుంది. అంతే కాదు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేట్లుగా స్పీకర్‌ చేసిన విమర్శలను బిజెపి అనుమతించింది. స్పీకర్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్లు నితీష్‌ కుమార్‌ విమర్శించారు.2019 లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలో తమకు రెండు మంత్రి పదవులు కావాలని నితీష్‌ అడిగితే ఒకటి కంటే ఇచ్చేది లేదని మోడీ తిరస్కరించటంతో తమకసలు పదవులే వద్దని నితీష్‌ చెప్పారు. అయితే జెడియు నేతగా ఉంటూ అప్పటికే బిజెపి ప్రభావంలో ఉన్న ఆర్‌సిపి సింగ్‌ను పార్టీ అనుమతి, నితీష్‌ కుమార్‌తో నిమిత్తం లేకుండా నేరుగా బిజెపి కేంద్ర మంత్రిగా చేసింది. తనకు పదవి గురించి అమిత్‌ షాతో నితీష్‌ కుమార్‌ చర్చించినట్లు ఆర్‌సిపి సింగ్‌ ప్రకటించారు. తాజాగా సింగ్‌కు జెడియు సీటు నిరాకరించటంతో మంత్రి పదవి పోయింది. ఆ ఉక్రోషంతో తాజాగా రాజీనామా చేసి పార్టీ మునికిపోతున్న పడవ అంటూ ధ్వజమెత్తారు.ఏడు జన్మలెత్తినా నితీష్‌ ప్రధాని కాలేరని అన్నారు. రామవిలాస్‌ పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ బహిరంగంగానే నితీష్‌ కుమార్‌ను విమర్శిస్తారు. నిత్యం బిజెపి సంబంధాలలో ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఏ కూటమిలో ఉంటూనే జెడియు పోటీ చేసే స్థానాల్లో మాత్రమే తన అభ్యర్ధులను నిలిపి ఓట్లను చీల్చారు. దీన్ని చిరాగ్‌ మోడల్‌ అని పిలిచారు. ఇప్పుడు ఆర్‌సిపి సింగ్‌ ద్వారా పార్టీని చీల్చేందుకు బిజెపి పూనుకున్నట్లు చెబుతున్నారు. దాన్ని గమనించిన నితీష్‌ కుమార్‌ ఆర్‌సిపి సింగ్‌, అతని కుటుంబం పొందిన 24 ఎకరాల భూమి గురించి సంజాయిషి ఇవ్వాలని పార్టీ ద్వారా నోటీసు పంపించారు.తరువాతే సింగ్‌ రాజీనామా చోటు చేసుకుంది. అంతకు ముందు సింగ్‌తో సంబంధాలు ఉన్న పార్టీ వారి మీద చర్యలు తీసుకున్నారు. ఇటీవలి అగ్నిపధ్‌ ఆందోళనల్లో బీహార్‌లో బిజెపి నేతల ఇండ్ల మీద దాడులు జరిగాయి. వాటిని జెడియు ప్రోత్సహించినట్లు బిజెపి ఆరోపణ. దుండగులకు స్వేచ్చ నిచ్చారంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ జైస్వాల్‌ ధ్వజమెత్తారు. నిరసనకారులతో కేంద్రం చర్చించాలని జెడియు కోరింది. తాజా పరిణామాలు దేశంలోని వివిధ పార్టీల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాల్సి ఉంది.