Tags
china communist party, imperialism, Joe Biden, Mao Zedong, Taiwan independence, Taiwan Matters, US-China standoff over Taiwan, Xi Jinping
ఎం కోటేశ్వరరావు
” నూతన యుగంలో తైవాన్ సమస్య మరియు చైనా పునరేకీకరణ ” అనే పేరుతో ఆగస్టు పదవ తేదీన చైనా ఒక శ్వేత పత్రాన్ని ప్రకటించింది. తైవాన్ తనలో అంతర్భాగమే అని మరోసారి స్పష్టం చేసింది. ఒకే చైనా సూత్రానికి ఐరాస సాధారణ అసెంబ్లీ 2758వ తీర్మానం ద్వారా కల్పించిన చట్టబద్దతపై ఎలాంటి సందేహం లేదని, ప్రపంచమంతటా గుర్తింపు పొందిందని దానిలో పేర్కొన్నారు. శాంతియుతంగా పునరేకీకరణ జరగాలని, తప్పనిసరైతే బలప్రయోగం తప్పదని కూడా స్పష్టం చేశారు. ఒకే దేశం-రెండు వ్యవస్థలనే విధానం కింద తైవాన్‌కు హామీ ఇస్తున్నట్లు తెలిపింది. అమెరికా కాంగ్రెస్( పార్లమెంటు దిగువ సభ ) స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన మరుసటి రోజు నుంచి తైవాన్ చుట్టూ ఐదు రోజుల పాటు (ఆగస్టు 4-7తేదీలు) మిలిటరీ విన్యాసాలు జరిపింది. తరువాత మరుసటి రోజు నుంచి చైనా నిరవధిక విన్యాసాలు కొనసాగిస్తున్నది.
ఏ దేశమైనా తన వద్ద ఉన్న ఆధునిక ఆయుధ సంపత్తిని మిలిటరీ విన్యాసాలలో రేఖా మాత్రంగానే వెల్లడిస్తుందన్నది తెలిసిందే. ఇప్పుడు తైవాన్ను ఎలా దిగ్బంధనం చేయగలదో ప్రపంచానికి ముఖ్యంగా అమెరికా, జపాన్‌లకు చైనా చూపుతున్నది. తొలుత నాలుగు రోజులు, తరువాత కొనసాగిస్తున్న నిర్ణీత గడువులేని డ్రిల్లు లక్ష్యం అదే అని షీ జింపింగ్ పరోక్షంగా వెల్లడించారు. ప్రస్తుతం ఉక్రెయిన్లో రష్యాను ఎదుర్కొనేందుకు అమెరికా తన వద్ద ఉన్న ఆధునిక ” హైమర్స్” క్షిపణి వ్యవస్థలను అంద చేసింది. దానికి ధీటుగా చైనా వద్ద ఉన్న ఎంఎల్‌ఆర్ వ్యవస్థలను తైవాన్ చుట్టూ జరిపిన డ్రిల్సులో ప్రయోగించినట్లు, ఈ పరిణామం తైవాన్‌పై అమెరికా ఆడుతున్న ఆట తీరునే మార్చి వేస్తుందని యురేసియన్ టైమ్స్ పత్రిక ఆగస్టు ఎనిమిదిన ప్రకటించింది.చేయాల్సిందంతా చేసి నెపాన్ని ఇతరుల మీద నెట్టినట్లుగా తాజా పరిణామాలపై జో బైడెన్ తీరు ఉన్నదని, ఇది మరింతగా రెచ్చగొట్టటమే అని చైనా వర్గాలు పేర్కొన్నాయి. తైవాన్‌కు సంబంధించి ఇంతకు మించి వారు చేసేదేమీ ఉండదు కానీ వారి తీరే ఆందోళన కలిగిస్తున్నదని బైడెన్ విలేకర్లతో అన్నాడు. చైనా స్పందనకు ప్రతిగా అమెరికా యుద్ధనౌకలను తరలిస్తుందని వార్తలు వచ్చినప్పటికీ అదేమీ లేదు. దాంతో ఉక్రెయిన్ మాదిరి తమను కూడా ముందుకు నెట్టి అమెరికా వెలుపలే ఉంటుందా అని అనేక మందిలో తలెత్తిన సందేహాల పూర్వరంగంలో అమెరికన్లు, తైవాన్ వేర్పాటు వాదులను సంతృప్తిపరచేందుకు బైడెన్ ఇలాంటి చౌకబారు ప్రకటనలు, జిమ్మిక్కులకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు. తన ప్రమాణ స్వీకార ఉత్సవానికి తైవాన్ ప్రతినిధులను ఆహ్వానించిన తొలి అమెరికా నేతగా కూడా గతేడాది ఇలాంటి జిమ్మిక్కునే చేశాడు.
ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు, మరోవైపు జో బైడెన్ పలుకుబడి గురించి వెలువడుతున్న సర్వేల వివరాలు డెమోక్రటిక్ పార్టీకి కంగారు పుట్టిస్తున్నాయి.ఆగస్టు పదిన స్టాటిస్టా ప్రకటించిన వివరాల ప్రకారం కేవలం పదిశాతం మంది అమెరికన్ల దృష్టిలో మాత్రమే జో బైడెన్ బలమైన నేత. మరో 25శాతం మంది కొంత మేరకు అని చెప్పగా నలభైమూడు శాతం చాలా బలహీనుడు, 23శాతం కాంత మేర బలహీనుడు అని వెల్లడైంది. మొత్తం మీద చూసినపుడు 66శాతం మంది బలహీనుడిగా భావిస్తున్నారు. ప్రపంచ చరిత్రను చూసినపుడు పాలకులు బలహీనపడినపుడు పిచ్చిపనులకు, జిమ్మిక్కులకు – ఎన్నికలు వచ్చినపుడు మన దేశంలో ఏదో ఒక ఉదంతం జరుగుతుందని జనం నమ్ముతున్నట్లుగా- పాల్పడతారని తేలింది. ఇప్పుడు జో బైడెన్ కూడా అదే స్థితిలో ఉన్నారన్నది కొందరి భావన. తైవాన్ను తురుపుముక్కగా వాడుతున్న అమెరికా రానున్న రోజుల్లో మరింతగా రెచ్చగొట్టవచ్చని, దానిలో భాగంగానే నేడు ఉక్రెయిన్ రేపు తైవాన్ అన్న ప్రచారం ప్రారంభించిందని అది ఎలా ఆలోచించినా, ఏమి చేసినా తాము దేనికైనా సిద్దంగా ఉన్నట్లు చైనా స్పష్టం చేయదలచుకుంది.తాజాగా మిలిటరీకి అందచేసినవాటితో సహా విన్యాసాల్లో భూ, సముద్ర, గగన తల అస్త్రాలన్నింటినీ బహిరంగంగానే చూపింది. మరికొన్నింటిని కూడా ప్రయోగించనుంది. బహుశా ఈ కారణంగానే తైవాన్ జలసంధిలోకి అమెరికా నౌకలు రాలేదన్నది కొందరి విశ్లేషణ. రానున్న రోజుల్లో తమ దళ నౌకలు చైనా ప్రాంతంలో స్వేచ్చా విహారం చేయవచ్చని అమెరికా పేర్కొన్నది. ఒక వేళ వచ్చినా దూర దూరంగా తిరగటం తప్ప చైనా విధించిన తాత్కాలిక ఆంక్షలు అమల్లో ఉన్నంతవరకు తైవాన్ ప్రాంతానికి చైనా విన్యాసాలు ముగిసిన తరువాతే తప్ప జరుగుతుండగా వచ్చే అవకాశం లేదు.
చైనా వైఖరిలో వచ్చిన ఈ మార్పు గురించి ఆలోచించాల్సి ఉంది. ఉక్రెయిన్ సంక్షోభం తరువాత చైనా-రష్యా బంధం మరింతగా బలపడిన పూర్వరంగంలో చైనా మీద మరింతగా కేంద్రీకరించాలని అమెరికా గూఢచార సంస్థలు తాజాగా ఒక నిర్ణయానికి వచ్చాయి. ఆల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థల మీద ఇప్పటికీ ప్రాధాన్యత ఉన్నప్పటికీ దాని కంటే చైనా మీద ఎక్కువగా వనరులు, నిధులను ఖర్చు చేయాలని అధికారులు స్పష్టం చేశారని వార్తలు. ఆఫ్ఘనిస్తాన్నుంచి అమెరికా తోకముడిచి ఏడాది గడచిన సందర్భంగా బైడెన్ నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయానికి వచ్చారు. చైనా గురించి ఇప్పటికే ఆలశ్యం చేసినట్లు కొందరు బైడెన్ సమీక్షపై స్పందించారు. అమెరికా తరహా జీవన విధానాన్ని చైనా దెబ్బతీస్తున్న మాదిరి ఉగ్రవాద సంస్థలు చేయలేవని డెమోక్రటిక్ పార్టీ ఎంపీ జాసన్ క్రో అన్నాడు. అవసరానికి మించి ఉగ్రవాదం మీద గత కొద్ది సంవత్సరాలుగా కేంద్రీకరించామన్నాడు. క్వాంటమ్ సైన్సు, కృత్రిమ మేథ,ఇతర సాంకేతిక పరిజ్ఞానాలపై చైనా లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసిందని దాని గురించి సమాచారం వెల్లడి కావటం లేదని అమెరికన్లు ఆందోళన చెందటమే తాజా కేంద్రీకరణకు కారణం. చైనా గురించి ఒకటి, చైనా సాంకేతిక పరిజ్ఞానం గురించి కేంద్రీకరించేందుకు రెండు పధకాలను గతేడాది సిఐఏ ప్రకటించింది.
అమెరికాకు ప్రజాస్వామ్యం అంటే అక్కడి ఆయుధపరిశ్రమలకు లాభసాటి లావాదేవీ మాత్రమే. ఇతర దేశాల మీద అమెరికా దాడులకు దిగటం తప్ప చరిత్రలో అమెరికా మీద అలాంటి దాడి ప్రయత్నాలు కూడా లేవు. 2022 ఆగస్టు నాటికి ప్రపంచంలోని 14దేశాల వద్ద 47 విమానవాహక యుద్ధ నౌకలు పని చేస్తున్నాయి. వాటిలో ఒక్కొక్కటి 80 విమానాలను మోసుకుపోగలిగిన పదకొండు అమెరికా వద్దే ఉన్నాయి. అయినప్పటికీ ఒక్కొక్కటి 13-14 బిలియన్ డాలర్ల విలువ చేసే పది కొత్త విమానవాహక నౌకల తయారీకి డోనాల్డ్ ట్రంప్ సర్కార్ ఆర్డరు పెట్టింది. ఇవి అణ్వాయుధాలు ప్రయోగించేందుకు వీలైనవి.ఇన్ని ఉన్నప్పటికీ లేని చిన్న దేశాలను తప్ప వాటితో చైనా, రష్యాలను అమెరికా బెదిరించలేదు. ఎందుకంటే అవి కూడా స్వంతంగా విమానవాహక నౌకలను రూపొందించగలిగినవే. వాటి వద్దా అణ్వాయుధాలు ఉన్నాయి.
అమెరికా పార్లమెంటు స్పీకర్ నాన్సీ పెలోసీ చైనా అభ్యంతరాలను ఖాతరు చేయకుండా తైవాన్ గడ్డ మీద అడుగు పెట్టి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. నిజానికి అమెరికా వ్యూహకర్తల ఎత్తుగడ అది. ముందే చెప్పుకున్నట్లు ప్రస్తుతం జనంలో పలుకుబడి లేని జో బైడెన్ వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు, ప్రపంచ రాజకీయాలను తాను శాసిస్తున్నట్లు ప్రదర్శించుకొనేందుకు ఈ అవకాశాన్ని ఎంచుకున్నారు. ఇక గతానికి సంబంధించి చూస్తే1949లో చైనా విముక్తి జరిగినప్పటికీ దాన్ని సుస్థిరం కావించుకొనేందుకు కమ్యూనిస్టులకు పది సంవత్సరాలు పట్టింది.అమెరికా ప్రభుత్వం బహిర్గతపరచిన కొన్ని పత్రాల్లో ఉన్న సమాచారం తైవాన్ విలీనం గురించి కొన్ని అంశాలను వెల్లడించింది. .1958లో తైవాన్ విలీనానికి పూనుకోవాలని మావో నిర్ణయించారు. దాన్ని గ్రహించిన అమెరికన్లు వెంటనే ఉన్నత సమావేశం జరిపి తైవాన్ రక్షణకు మిలిటరీని పంపుతామని ప్రకటించారు. వెంటనే సప్తమ నౌకా దళాన్ని దాడికి వీలైన దూరానికి నడిపించారు. ఒక వేళ మిలిటరీ తైవాన్ను కాపాడలేకపోతే అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు అధ్యక్షుడు ఐసెన్ హౌవర్ అనుమతి ఇచ్చాడు. తైవాన్ పాలకుడు చాంగ్‌కై షేక్‌ను, తైవాన్ను ఎలాగైనా కాపాడటం అమెరికాకు ప్రాముఖ్యత కలిగిన అంశం. అందుకు పూనుకొని విఫలం కావటం ఆసియాలో పరువు తక్కువ, దాన్ని కాపాడుకొనేందుకు ఎంతకైనా తెగించాల్సిందేనని మిలిటరీ జనరల్స్ చెప్పారు. అప్పటికే అవసరం లేకున్నా జపాన్‌పై అణు దాడి జరిపిన అమెరికా కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనేందుకు ఎంతకైనా తెగించేందుకు పూనుకుంది. తైవాన్‌కు సమీపంలోని ప్రధాన భూభాగంలో ఒక చిన్న మిలిటరీ కేంద్రం తప్ప చైనా వద్ద అప్పటికి అణుబాంబులు గానీ, విమానవాహక నౌకలుగానీ లేవు. ఆర్దికంగా పటిష్టత కూడా లేదు. సోవియట్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.1959లో టిబెట్‌లో దలైలామా తిరుగుబాటు, అదే ఏడాది చైనా అణుకార్యక్రమానికి సహకరించేది లేదని సోవియట్ ప్రకటించింది. రెండు దేశాల పార్టీల మధ్య సైద్దాంతిక విబేధాలు తీవ్రమౌతున్న తరుణంలో అన్ని అంశాలను చూసినపుడు వెనక్కు తగ్గటమే మంచిదని నాటి చైనా నాయకత్వం భావించింది. తరువాత దేశాన్ని పటిష్టం గావించటం మీద శ్రద్ద పెట్టింది.
సోవియట్ మీద ఆధారపడకుండా స్వంత అణుకార్యక్రమానికి చైనా పూనుకుంది.1964 అక్టోబరు 16న తొలి అణుపరీక్ష జరిపింది. అంతే కాదు అప్పటికి చైనా వద్ద విమానవాహక నౌకలు కూడా లేవు. పాతబడిన ఒక నౌకను ఆస్ట్రేలియా రద్దు కింద అమ్ముతామని 1985లో ప్రకటించగా చైనా దానిని కొనుగోలు చేసింది. దానిలో కీలకమైన భాగాలన్నింటినీ తొలగించినందున పనికి రాదని అందరూ భావించారు. అయితే దాన్ని చైనా రద్దుకింద మార్చకుండా తన మిలిటరీకి శిక్షణకు, తాను సొంతంగా రూపొందించిన నౌకలకు నమూనాగా ఉపయోగించినట్లు తరువాత వెల్లడైంది.1995, 2000 సంవత్సరాల్లో రష్యా నుంచి రెండు నౌకలను కొనుగోలు చేసి వాటినీ రద్దు కింద మార్చకుండా చైనా నిపుణులు పరిశీలించారు. ఒక నౌకను విలాసవంతమైన టూరిస్టు హౌటల్‌గా, మరొక నౌకను ప్రదర్శనశాలగా మార్చారు. మకావు ప్రయివేటు కంపెనీ ద్వారా మరొక రష్యా నౌకను 1998లో కొనుగోలు చేసి దాన్ని 2007 నాటికి పరిమితంగా పునరుద్దరించినట్లు వార్తలు. తరువాత దాన్ని పూర్తి స్థాయిలో పునరుద్దరించి కొత్త పేరుతో 2012లో నౌకా దళంలో తొలి స్వంత నౌకగా ప్రవేశపెట్టారు.తరువాత పూర్తిగా స్వంత పరిజ్ఞానంతో రూపొందించిన నౌకను 2017లో ప్రారంభించారు. సరికొత్త నౌక మూడవ దానిని ఈ ఏడాది జూన్‌లో రంగంలోకి దించారు. నాలుగవ నౌక ఇప్పుడు నిర్మాణంలో ఉంది, 2030నాటికి మరో రెండు చేరవచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం జరుపుతున్న మిలిటరీ డ్రిల్లును అమెరికా, ఇతర దేశాలు కూడా పరిశీలించి తమ ఎత్తుగడలను రూపొందించుకుంటాయని తెలియనంత ఆమాయకంగా నేడు చైనా లేదు. నిజమో కాదో చెప్పలేము గాని ఇప్పుడు చైనా గురించి అమెరికన్లకు ఒక భయం పట్టుకుంది. మెదడును అదుపు చేసే జీవ ఆయుధాలను రూపొందిస్తున్నట్లు అనుమానంతో మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ ప్రాజెక్టులో భాగస్వాములన్న అనుమానంతో అనేక కంపెనీలపై అమెరికా ఆంక్షలు పెట్టింది.ఇది ఒక ప్రచార ఎత్తుగడ, దాడిలో భాగం కూడా కావచ్చు. గతంలో ఐసెన్ హౌవర్ మాదిరే ఇప్పుడు జో బైడెన్ కూడా ఉక్రెయిన్ మాదిరి కాకుండా అవసరమైతే మిలిటరీని దింపుతామని ప్రకటించాడు. గతంలో మావో మాదిరి ఇప్పుడు షీ జింపింగ్ వెనక్కు తగ్గేందుకు సిద్దం కాదు. అన్ని రంగాల్లో ఢ అంటే ఢ అనేందుకు ధీటుగా దేశాన్ని రూపొందిస్తున్నాడు. సరిహద్దులో ఉన్న నాటో దేశాలే ఉక్రెయిన్‌కు మిలిటరీని పంపేందుకు సిద్దం కాలేదు. తైవాన్ అంశానికి వస్తే దానికి సమీపంలోని జపాన్ ఒకినావా దీవుల్లో, దక్షిణకొరియాలో ఉన్న అమెరికా మిలిటరీ తప్ప పన్నెండువేల కిలోమీటర్ల నుంచి అమెరికా తన సేనలను తీసుకురావాల్సి ఉంది. చైనాకు మద్దతుగా అణ్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియా ఉంది. పక్కనే రష్యా కూడా తన వంతు పాత్ర పోషించనుంది. ఇప్పటికిప్పుడు చూస్తే మరోఅణుశక్తి దేశమైన పాకిస్తాన్ వివిధ కారణాలతో అమెరికా కంటే చైనాకు దగ్గరగా ఉంది. మరో దేశమైన ఇరాన్ కూడా చైనాకు దగ్గరగా ఉంది. మావో కాలంలో ఇలాంటి సానుకూల అంశాలు చైనాకు లేవు. అందుకే షీ జింపింగ్ బైడెన్‌తో భేటీలో నిప్పుతో చెలగాటాలాడవద్దని హెచ్చరించగలిగాడు.