Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆగస్టు ఐదవ తేదీతో ముగిసిన వారంలో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు 572.978 బిలియన్‌ డాలర్లని ఆర్‌బిఐ నివేదికలో పేర్కొన్నది. అంతకు ముందు వారంలో ఉన్న మొత్తం 573.875బి.డాలర్లు. జూలై మాస ఆర్‌బిఐ నివేదిక ప్రకారం ఆ నెలలో ఉన్న స్థితిని బట్టి 2022-23లో తొమ్మిదిన్నర నెలల దిగుమతులకు డాలర్‌ నిల్వలు సరిపోతాయి. ఈ అంచనాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.2014 జూలై 28 నాటి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విశ్లేషణ ప్రకారం డాలర్‌ నిల్వలు 317బి.డాలర్లకు పెరిగాయి.అవి ఎనిమిది నెలల దిగుమతులకు సరిపోతాయి. ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి(2008) ముందున్న కొనుగోలు శక్తి స్థాయికి తిరిగి పుంజుకోవాలంటే వాటిని 500బి.డాలర్లకు పెంచాల్సి ఉంటుందని, 2008కి ముందు మన దగ్గర ఉన్న నిల్వలు పదిహేను నెలల పాటు దిగుమతులకు సరిపోతాయని పేర్కొన్నారు. 2013 ఆగస్టులో 275 బి.డాలర్లు ఉండగా 2014 జూలై 18 నాటికి అవి 317.8 బి.డాలర్లకు పెరగటానికి ఆర్‌బిఐ ప్రవాస భారతీయుల డిపాజిట్లకు ప్రోత్సాహాకాలివ్వటం, విదేశీ బాంకుల నుంచి రుణాలు తీసుకోవటాన్ని ప్రోత్సహించటమని కూడా చెప్పారు. డాలరు అప్పులు 420 బి.డాలర్లు ఉన్నందున ఆ పరిస్థితి మన కరెన్సీని వడిదుడులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల నరేంద్రమోడీ ఏలుబడిలో 2022 మార్చినెలాఖరు నాటికి మన విదేశీ అప్పు 620.7 బి.డాలర్లకు పెరిగింది. ఎనిమిదేండ్ల క్రితం డాలరుకు రు.68 ఉండగా ఇప్పుడు 80కి దిగజారిన సంగతి తెలిసిందే.


2022 మార్చి నెలాఖరుకు ఉన్న 607.3 బి.డాలర్లు అంతకు ముందు ఏడాది లావాదేవీలను బట్టి పన్నెండు నెలల దిగుమతులకు సరిపడా ఉన్నట్లు ఏప్రిల్‌ 16న ఎకనమిక్‌ టైమ్స్‌ వార్త పేర్కొన్నది. సిఇఐసి సమాచారం ప్రకారం 2022 మే నెలలో ఉన్న నిల్వలు 8.5 నెలల దిగుమతులకు సరిపడా ఉంటే జూన్‌ నాటికి అవి 7.5నెలలకు తగ్గాయి. మన డాలరు నిల్వలు 573 బి.డాలర్లలో సింహభాగం 509.646 బి.డాలర్లు విదేశీ కరెన్సీ ఆస్తులు(ఎఫ్‌సిఏ)గా ఉన్నాయి. అవి నెలనెలా తగ్గుతున్నాయి.(జూలై 8నాటికి 518.089 బి.డాలర్లు) మన రూపాయి విలువ పతనం, పెరుగుదల మీద ఈ నిల్వలు ప్రభావం చూపుతాయి. ఇవిగాక బంగారం నిల్వల విలువ 40.313 బి.డాలర్లు, ఐఎంఎఫ్‌ నుంచి ఎస్‌డిఆర్‌లు 18.031 బి.డాలర్లు, ఐఎంఎఫ్‌ నిల్వలు 4.987 బి.డాలర్లు ఉన్నాయి.
తొలిసారిగా మన డాలరు నిల్వలు 2020 జూన్‌లో 500 బిలియన్‌లకు,2021జూన్‌లో 600, అదే ఏడాది సెప్టెంబరు ఎనిమిదిన మరో రికార్డు 642.453 చేరాయి.2022 జూలై 29కి 573.9 బి.డాలర్లకు తగ్గాయి


చమురు మార్కెట్లో ధరల పెరుగుదల వివరాలను చూస్తే మన విదేశీ మారకద్రవ్యంపై దాని వత్తిడి ఎలా ఉందో అర్ధం అవుతుంది. 2014-15 నుంచి 2021-22వరకు ఎనిమిది సంవత్సరాల్లో మనం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా సగటు ధర 61.08 డాలర్లు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు13 వరకు అది 106.45 డాలర్లకు పెరిగింది. దీన్ని బట్టి మన దిగుమతి బిల్లు ఎంత పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. గతంలో చమురు ధరలు తక్కువగా ఉండటాన్ని కూడా తన ఘనతగా బిజెపి చెప్పుకోవటమే కాదు, పాత అప్పులు తీర్చేందుకని, మిలిటరీకి ఖర్చు చేసేందుకని, రోడ్లు వేసేందుకని, కరోనా వాక్సిన్ల కోసమనీ పెద్ద ఎత్తున చమురుమీద పెంచిన భారాన్ని సమర్ధించింది. 2014 మే 29 నుంచి జూన్‌ 11 వరకు సగటున ఒక డాలరు రు.59.17 ఉంటే ఇప్పుడది 2022 జూన్‌ 29 నుంచి జూలై 27వరకు రు.79.54 ఉంది. దీన్ని గోడదెబ్బ చెంపదెబ్బ అనవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరను అదుపుచేసే శక్తి నరేంద్రమోడీకి లేదు. కానీ రూపాయి విలువ దిగజారకుండా కాపాడి ఉంటే ఒక డాలరుకు ఇరవై అదనంగా చెల్లించవలసి వచ్చేది కాదు. దీన్నే మరో విధంగా చెప్పాలంటే మోడీ సర్కార్‌ నిర్వాకానికి జనం చెల్లిస్తున్న మూల్యమిది.


రూపాయి పతనం ఒక్క చమురుకే కాదు, మనం చేసుకుంటున్న దిగుమతులన్నింటికీ అదనపు భారమే. మన విద్యార్ధుల విదేశీ చదువులు కూడా భారంగా మారాయి. మేడిన్‌ లేదా మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ వంటి కబుర్లతో ఎనిమిదేండ్లుగా జనాన్ని మభ్య పెట్టటం తప్ప దేశం నుంచి ఎగుమతులు పెరగటం లేదు. గత ఏడాది వాణిజ్యలోటు జిడిపిలో 1.2శాతం ఉండగా వర్తమానంలో మూడుశాతం కావచ్చని అంచనా వేస్తున్నారు. గతేడాది జూలై నెలతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ఎగుమతులు 2.14శాతం పెరిగి 36.27 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఇదే మాసంలో దిగుమతులు 43.61 శాతం పెరిగి 66.27 బి.డాలర్లకు చేరాయి. గతేడాది జూలై వాణిజ్య లోటు 10.63 బి.డాలర్లు కాగా ఈ ఏడాది 30బి.డాలర్లకు పెరిగింది.ఏప్రిల్‌-జూలై ఎగుమతులు 157.44 బి.డాలర్ల విలువ గలవి జరగ్గా దిగుమతుల విలువ 256.43 బి.డాలర్లు. వాణిజ్య లోటు గతేడాది 42బి.డాలర్లతో పోలిస్తే ఈ ఏడాది 98.99 బి.డాలర్లకు చేరింది. దిగుమతుల్లో చమురు వాటా గతేడాదితో పోలిస్తే జూలైలో 12.4 నుంచి 21.13 బి.డాలర్లకు చేరింది.ఈ ఏడాది తొలి ఆరునెలల్లో చైనాతో మన వాణిజ్యలోటు 48 బి.డాలర్లు ఉంది. ఒక వైపు చైనా వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతూ, మరోవైపు భారీ ఎత్తున చైనా నుంచి దిగుమతులకు మోడీ సర్కార్‌ అనుమతిస్తున్నది. కమ్యూనిస్టు వ్యతిరేకులను మానసికంగా సంతృప్తి పరచేందుకు చైనా వ్యతిరేక కబురు, ప్రచారం, కార్పొరేట్ల నుంచి నిధులు పొందేందుకు వారి లాభాల కోసం చైనా నుంచి గత రికార్డులను బద్దలు కొడుతూ వస్తు దిగుమతులకు పచ్చజెండా, జనానికి దేశ భక్తి సుభాషితాలు.విశ్వగురువు లీలలు ఎన్నని చెప్పుకోగలం !


ప్రపంచంలో విదేశీమారకద్రవ్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో మనది నాల్గవ స్థానమని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆగస్టు ఐదవ తేదీన చెప్పారు. ఇది నరేంద్రమోడీ భజనపరులకు వీనుల విందు, కనులకు పసందుగా ఉంటుంది. ఇదే ప్రాతిపదికైతే మనం అమెరికా కంటే కూడా గొప్పవారం అని చెప్పాల్సి ఉంటుంది. బంగారం మినహా విదేశీ మారకద్రవ్య నిల్వల గురించి వికీపీడియా సమాచారం ప్రకారం అది పదమూడవ స్థానంలో ఉంది. కొన్ని దేశాలు వారానికి ఒకసారి మరికొన్ని నెలకు ఒకసారి వివరాలు వెల్లడిస్తాయి. అందువలన అవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. 2022లో కొన్ని దేశాల విదేశీమారకద్రవ్య వివరాలు బిలియన్‌ డాలర్లలో ఇలా ఉన్నాయి. చైనా 3,275.490(జూలై),జపాన్‌ 1,311.254(జూన్‌), స్విడ్జర్లాండ్‌ 960.084(జూన్‌), రష్యా 574.8(ఆగస్టు 5), భారత్‌ 572.978(ఆగస్టు 5), తైవాన్‌ 548.960(జూన్‌), అమెరికా 234.430(జూలై 8). అంతకు ముందు నెలతో పోలిస్తే చైనా నిల్వలు 28.895, రష్యా 3.6 బి. డాలర్ల చొప్పున పెరిగాయి. కరోనా లాక్‌డౌన్ల కారణంగా చైనా, పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా రష్యా ఇబ్బందులు పడినప్పటికీ వాటి నిల్వలు పెరగ్గా అంతా సజావుగా ఉందని చెబుతున్న మన దేశ నిల్వలు ఎందుకు తగ్గుతున్నట్లు ? పద్మశ్రీ కంగనా రనౌత్‌ చెప్పినట్లు 2014లోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందనుకుందాం, సమర్ధుడైన తొలి ప్రధాని, నరేంద్రమోడీ సురక్షిత హస్తాల్లో దేశాన్ని పెట్టామని అనేక మంది చెప్పారు, బిజెపి కూడా స్వంత డబ్బా కొట్టుకుంది. జనం కూడా నిజమే అని నమ్మారు. మరి ఇప్పుడీ పరిస్థితి ఎందుకు తలెత్తినట్లు ?కాంగ్రెస్‌ ఐదు దశాబ్దాలలో సాధించలేని దానిని నరేంద్రమోడీ ఐదు సంవత్సరాల్లో చేసి చూపారని 2019 ఎన్నికలపుడు ఊదర గొట్టారు. మోడీ సాధించిన ఘనతల్లో విదేశీ మారక ద్రవ్య పెంపుదల ఒకటని చెప్పారు. ఎనిమిది సంవత్సరాలు గడిచిన తరువాత ఇప్పుడు పరిస్థితి ఏమిటి ? విదేశీ మారకద్రవ్య నిల్వల గురించి అంతగా తెలియని(విద్యావంతులైన) జనం ఉన్నారు గనుక బిజెపి ప్రచార దళాలు వాట్సాప్‌ పండితులతో ఏది ప్రచారం చేసినా నడుస్తోందా !