Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఇందు మల్హోత్రా మాదిరిగా ఉన్న ఒక మహిళ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన ఒక వీడియో వైరల్‌గా మారిందంటూ దాని గురించి మీడియాలో ప్రముఖంగా 2022 ఆగస్టు చివరి వారంలో వార్తలు వచ్చాయి. దాని గురించి వివరణ ఇవ్వాలని మీడియా సంస్థలు కోరగా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ మహిళను ఇందు మల్హోత్రాగానే భావించిన కేరళ ప్రభుత్వం ఆమె మాట్లాడిన తీరును తప్పు పట్టింది. ఇందు మల్హోత్రాను కొందరు తప్పుదారి పట్టించి ఉంటారు, వాస్తవాలను సరి చూసుకొని ఆమె మాట్లాడి ఉండాల్సిందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి కెటి థామస్‌ అన్నారు. ఆమె మాట్లాడిందాన్లో తప్పు లేదని బిజెపి, దాని అభిమానులు సమర్ధించారు. ఆమె తీరు ఆందోళన కలిగిస్తోందని అనేక మంది సామాజిక మాధ్యమంలో స్పందించారు. భక్తులతో మాట్లాడినపుడు ఇందు మల్హోత్రా మాస్క్‌ ధరించి ఉన్నారు, వీడియో అధికారికమైనది కాదు, ఆమె వివరణ తీసుకొనేందుకు ఫోన్‌, వర్తమానం, మెయిల్‌ ద్వారా ప్రయత్నించగా ఫలించలేదని ” ద ఫెడరల్‌ ” న్యూస్‌ పోర్టల్‌, వివరణ రాలేదని టెలిగ్రాఫ్‌ పత్రిక పేర్కొన్నది.

ఇంతకీ ఆమె చేసిన వ్యాఖ్యలేమిటి ?2022 ఆగస్టు 28న ఆమె తిరువనంతపురం పద్మనాభ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా భక్తులలో ఒకరు ఆలయం వెలుపల ఆమెతో మాట్లాడుతూ పద్మనాభస్వామి ఆలయ కేసులో మంచి తీర్పు ఇచ్చారని ప్రశంసించినపుడు స్పందించిన ఇందు మల్హోత్రా వారితో మాట్లాడుతూ ” ఈ కమ్యూనిస్టు ప్రభుత్వాలతో జరుగుతున్నది అదే. కేవలం దేవాలయాలకు వస్తున్న ఆదాయం కారణంగానే వారు దేవాలయాలను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. అన్ని చోట్లా వారు స్వాధీనం చేసుకున్నారు….. అన్ని చోట్లా, కేవలం హిందూ దేవాలయాలనే. కాబట్టే జస్టిస్‌ (యుయు) లలిత్‌ నేను కుదరదని చెప్పాం, మేము దాన్ని అనుమతించం. మేం అడ్డుకోకుండా ఉండి ఉంటే ఇంకా కొనసాగేవి ” అని మాట్లాడినట్లుగా వీడియోలో ఉంది.మీ గురించి మేము ఎంతో గర్విస్తున్నాం, మీరు అలాంటి అద్భుతమైన పని చేశారు అన్న కొందరి మాటలు కూడా సదరు వీడియోలో ఉన్నాయి. పద్మనాభ స్వామి దేవాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని 2011లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దేవాలయం తమ నిర్వహణలోనే కొనసాగాలన్న పూర్వపు రాజవంశీకుల అప్పీలుపై 2020 జూలై 13న జస్టిస్‌లు యుయు లలిత్‌, ఇందు మల్హోత్రాలతో కూడిన బెంచ్‌ వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.2021 మార్చి 13న ఇందు మల్హోత్రా పదవీ విరమణ చేయగా జస్టిస్‌ లలిత్‌ ప్రస్తుతం సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సంగతి తెలిసిందే.


నిజంగా కేరళ ప్రభుత్వం దేవాలయాలను స్వాధీనం చేసుకోవాలనుకున్నదా ?2007లో ఆనంద పద్మనాభన్‌ అనే ఒక లాయరు రాజకుటుంబ వారసత్వ హక్కులను సవాలు చేస్తూ తిరువనంతపురం కోర్టులో ఒక కేసును దాఖలు చేశారు. ఆలయ ఆస్తుల పరిరక్షణకు కొత్త ట్రస్టీలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆలయం, ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. శతాబ్దాలుగా ఉన్న తమహక్కును రద్దు చేసేందుకు లేదంటూ రాజకుటుంబం హైకోర్టుకు అప్పీలు చేసింది. 1950నాటి చట్టంలోని ఒక సెక్షన్‌ ప్రకారం సంస్థాన విలీన ఒప్పందంలో గుర్తించిన చివరి రాజు 1991లో మరణించిన తరువాత వారసులు స్వతసిద్దంగా ఆలయ నిర్వహణ హక్కులను పొందలేరని అందువలన ప్రభుత్వం వెంటనే ఆలయ స్వాధీనానికి ఒక కొత్త ట్రస్టును లేదా చట్టపరమైన అధారిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీని మీద రాజు, నాటి ఆలయ అధికారి సుప్రీం కోర్టులో విడిగా అప్పీలు చేశారు. పద్మనాభ స్వామి దేవస్థానాన్ని స్వాధీనం చేసుకొనే ఆలోచన తమకు లేదని, ప్రస్తుత యాజమాన్యం గురించి ఎలాంటి ఫిర్యాదులు లేవని ప్రభుత్వం (ముఖ్యమంత్రి విఎస్‌ ఆచ్యుతానందన్‌) తిరువనంతపురం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.(2010 మార్చి 16, హిందూ పత్రిక). 1949లో కేంద్ర ప్రభుత్వం-తిరువాన్కూర్‌-కొచ్చిన్‌ సంస్థానం చేసుకున్న విలీన ఒప్పందంలో రాజు వారసులు దేవాలయ యాజమాన్యంలో కొనసాగవచ్చనే నిబంధన ఉంది. సుప్రీం కోర్టు దాన్ని గుర్తించి ఆ మేరకు తీర్పు ఇచ్చింది.1950 చట్టం ప్రకారం కేరళలోని దేవాలయాలన్నీ దేవస్థానాల బోర్డుల అజమాయిషీల కిందకు వచ్చినప్పటికీ సంస్థాల విలీన ఒప్పందం ప్రకారం పద్మనాభ స్వామి ఆలయం మాత్రం రాజు వారసుల నిర్వహణలోనే ఉంటుందని పేర్కొన్నారు.కార్యనిర్వహణ అధికారిని, ముగ్గురు సలహాదారులను కూడా నియమించే అధికారం ఉంది.1965లో రాజు మేనేజింగ్‌ ట్రస్టీగా, నలుగురు సభ్యులతో పద్మనాభ స్వామి ఆలయ ట్రస్టును ఏర్పాటు చేశారు.


హైకోర్టు తీర్పును కొట్టివేసిన సుప్రీం కోర్టు రాజకుటుంబం విధానపరమైన నిర్ణయాలు తీసుకొనేందుకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ముగ్గురితో ఒక సలహా కమిటీ ఏర్పాటు, దానికి అధ్యక్షత వహించేందుకు ఒక రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి, రాజు నియమించిన ఒక ప్రముఖ వ్యక్తి, రాజుతో సంప్రదించి అధ్యక్షుడు నియమించే ఒక చార్టెడ్‌ ఎకౌంటెంట్‌ ఉండాలి. ఆలయపాలనకు ఐదుగురితో ఒక కమిటీ, దానిలో రాజు వారసుల అదుపు, పర్యవేక్షణకు లోబడి పని చేసే విధంగా జిల్లా జడ్జి, రాజు ప్రతినిధి, ప్రధాన పూజారి, కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులు ఉండాలని సుప్రీం కోర్టు పేర్కొన్నది. ఈ తీర్పును సవాలు చేయరాదని సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం నిర్ణయించింది.


పద్మనాభ స్వామి ఆలయంలోని ఐదు నేలమాళిగల్లో లక్షల కోట్ల విలువ గల వజ్రాలు, కిరీటాలు, సింహాసనాలు, బంగారు నగలు,నాణాలు, ఇతర వస్తువులు ఉన్నట్లు 2011లో వెల్లడైన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన అమికస్‌ క్యూరీ గోపాల సుబ్రమణియం, కాగ్‌ మాజీ అధిపతి వినోద్‌ రాయి వాటిని తనిఖీ చేసి ఒక నివేదికను సమర్పించారు. మరో నేలమాళిగను తెరిస్తే ప్రళయం సంభవిస్తుందని రాజకుటుంబం, భక్తుల పేరుతో కొందరు వాదించారు. 1990 తరువాత అనేక సార్లు దాన్ని తెరిచారని ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు జరగలేదని కోట్లాది విలువైన వస్తువులు మాయమైనట్లు వినోద్‌ రాయి తన నివేదికలో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు దాన్ని తెరవటం గురించి ఆలయ యాజమాన్యకమిటీ నిర్ణయానికే వదలి వేసింది.


హిందూ దేవాలయాలను కమ్యూనిస్టు ప్రభుత్వం దోచుకుంటున్నదని చేస్తున్న ప్రచారం అబద్దమని అనేకసార్లు గతంలో వెల్లడైంది. అక్కడ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే మరో ఐదు సంవత్సరాలు సిపిఎం ఉన్న చరిత్ర తెలిసిందే.తొలిసారిగా వరుసగా రెండవ సారి గతేడాది సిపిఎం అధికారానికి వచ్చి చరిత్ర సృష్టించింది. 2014 ఏప్రిల్‌ 22న కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ విటి బలరాం బిజెపి నేత ఎఎన్‌ రాధాకృష్ణన్‌కు సమాధానమిస్తూ ఫేస్‌బుక్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం మలబార్‌ దేవస్థానం బోర్డుకు అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం వేతనాల కోసం రు.22 కోట్లు చెల్లించింది. పద్మనాభ స్వామి దేవాలయానికి రాష్ట్ర ప్రభుత్వం 1970 నుంచి ఏటా రు.ఇరవైలక్షలు చెల్లిస్తున్నది.2011 నుంచి 2014వరకు శబరిమల ఆలయం రు. 60కోట్లు పొందింది.2015 డిసెంబరు ఏడున కేరళ అసెంబ్లీకి నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇలా ఉంది.” శబరిమలతో వివిధ ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖర్చుల కోసం ఖజానాకు జమ చేస్తున్నారన్నది ఆధారం లేని ఆరోపణ. తిరువాన్కూర్‌, కొచ్చిన్‌, మలబార్‌, గురువాయుర్‌ దేవస్థానం బోర్టుల పరిధిలోని ఆలయాల ఆదాయం నేరుగా వాటి బాంకు ఖాతాలకే జమ అవుతుంది. తిరువాన్కూర్‌, కొచ్చిన్‌ బోర్డుల లావాదేవీలను హైకోర్టు నేరుగా నియమించే ఆడిటర్లే తనిఖీ చేస్తారు, ఇతర వాటిని లోకల్‌ ఫండ్‌ డిపార్ట్‌మెంట్లు తనిఖీ చేస్తాయి. ఆ నివేదికలను ఎవరైనా చూడవచ్చు.2011 నుంచి 2015వరకు ప్రభుత్వ నిధుల నుంచి వివిధ ఆలయాలకు రు.231 కోట్లు ఖర్చు చేసింది.”

ఆగస్టు 29(2022) అసెంబ్లీలో చర్చకు ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు, ఇతర అంశాల గురించి ప్రభత్వం వివరాలను ఇచ్చింది. దేవస్థానాల మంత్రి కె రాధాకృష్ణన్‌ ఇచ్చిన సమాచారం మేరకు కరోనాతో ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించేందుకు గత ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం వివిధ దేవాలయాలకు రు.165 కోట్లు ఇచ్చింది. ఈ ఏడాది జూలై 31వరకు తిరువాన్కూర్‌ బోర్డుకు 20 కోట్లు , మలబార్‌ బోర్డుకు రు.44 లక్షలు ఇచ్చింది.” మితవాద హిందూత్వ శక్తులు పదే పదే చేసిన ప్రచారం రిటైర్డ్‌ న్యాయమూర్తిని ప్రభావితం చేసి ఉండవచ్చు. ప్రభుత్వం ఏ దేవాలయాన్ని స్వాధీనం చేసుకోలేదు.2018 నుంచి 2022 వరకు ఐదేండ్లలో వివిధ బోర్డులకు కరోనా, వరదలపుడు ఆదుకొనేందుకు రు.449 కోట్లు ప్రభుత్వం ఇచ్చిందని,30 కోట్లతో శబరిమల మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు పూనుకున్నదని, రిటైర్డ్‌ న్యాయమూర్తి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని రాధాకృష్ణన్‌ మీడియాకు చెప్పారు. మాజీ ఆర్ధిక మంత్రి, సిపిఎం నేత థామస్‌ ఐజాక్‌ స్పందిస్తూ కేరళ ప్రభుత్వ నిధుల గురించి జస్టిస్‌ ఇందు మల్హోత్రాకు తెలియదని, ఆమెకు కమ్యూనిస్టుల గురించి తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లున్నదని అన్నారు.


కరోనా పేరుతో ఆలయాలను మూసివేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ప్రచారం చేసిన శక్తులే తరువాత రాబడి కోసం తెరిచారని, కానుకలు ఇవ్వవద్దని పిలుపులు ఇచ్చాయి. పూజారులుగా కేవలం బ్రాహ్మలు మాత్రమే ఉంటూ, దళితులను అసలు ఆలయ దరి చేరనివ్వని రోజుల సంగతి తెలిసిందే. దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాలని కోరుతూ కేరళలో జరిగిన ఉద్యమాలకు ఏకె గోపాలన్‌ వంటి కమ్యూనిస్టు నేతలు సారధ్యం వహించారు.2017లో పినరయి విజయన్‌ ప్రభుత్వం తిరువాన్కూర్‌ దేవస్థానం బోర్డులోని ఆలయాల్లో ఆరుగురు దళితులతో సహా 36 మంది బ్రాహ్మణేతర పూజారులను నియమించిన సంగతి తెలిసిందే.రుతు క్రమం జరిగే వయస్సులో ఉన్న మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం కూడదని దాఖలైన పిటీషన్లను కొట్టి వేస్తూ ఎవరైనా దర్శించవచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు గురించి తెలిసిందే. ఆ కేసును విచారించిన ఐదుగురు ధర్మాసనంలో ఒకరుగా ఉన్న ఇందు మల్హోత్రా నలుగురి మెజారిటీ అభిప్రాయాన్ని తిరస్కరిస్తూ తన అసమ్మతిని తెలపటమే గాక రుతు క్రమ వయస్సులో ఉన్న మహిళలు ఆలయంలో ప్రవేశించరాదన్న వాదనను సమర్ధించారు. ఇప్పుడు ఆ తీర్పు మీద కొందరు పునర్విచారణకు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. దానితో పాటు బోహ్రా ముస్లింలలో మహిళలకు అంగచ్ఛేదము, ముస్లిం మహిళలకు మసీదుల ప్రవేశనిషిద్దం, వేరే మతం వారిని చేసుకున్న పార్సీ మహిళలకు వారి మత దేవాలయ ప్రవేశ నిషిద్దం వంటి పెద్ద అంశాలన్నింటినీ కలిపి విచారించాలని సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అదింకా తేలలేదు.


జస్టిస్‌ ఇందు మల్హోత్రా వీడియో వైరల్‌ కాగానే బిజెపి నేతలు మరోసారి దాడికి దిగారు.కేరళ బిజెపి నేత కెస్‌ రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ మార్క్సిస్టు నేతలు ఆలయ నిధులను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ఇందు మల్హోత్రా చెప్పిందాన్లో తప్పేమీ లేదన్నారు. జర్మన్‌ నాజీ ప్రచార మంత్రి గోబెల్స్‌ను ఆరాధ్య దైవంగా భావిస్తూ కాషాయదళాలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి జస్టిస్‌ ఇందు మల్హోత్రా మాట్లాడినట్లుంది తప్ప కేసు పూర్వపరాలను లోతుగా పరిశీలించినట్లు లేదు. ఇది నిజంగా విచారకరం, అంతకు మించి ఆందోళనకరం. తీర్పుల మీద తప్పుడు ప్రచారాల ప్రభావం ఉంటుందని జనాలు భావించేందుకు ఆస్కారం ఉంది. పద్మనాభస్వామి ఆలయ కేసులో తాను ఇచ్చిన తీర్పులో ఏమి చెప్పారో కూడా కూడా ఇందు మల్హోత్రా మరిచిపోవటం పరిహాసమని లైవ్‌ లా వెబ్‌సైట్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌, మను సెబాస్టియన్‌ ఒక ట్వీట్‌లో విమర్శించారు.ఆలయానికి ప్రభుత్వం చేసిన ఖర్చుకు గాను పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ కమిటీ రు.11.70 కోట్లు చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొన్నది. తమ ముందుకు వచ్చిన ఒక కేసులో దిగువ కోర్టుల్లో దాఖలైన అఫిడవిట్లలో ఏమున్నదో కూడా చూడకుండా ఉన్నత కోర్టులు తీర్పు ఇస్తాయా ?ఒక న్యాయవాదిగా ఉంటూ నేరుగా సుప్రీం కోర్టు జడ్జిగా ఎంపికైన తొలి మహిళగా ఇందూ మల్హోత్రా చరిత్రకెక్కారు. వాస్తవాలతో నిమిత్తం లేకుండా పదవి విరమణ చేసిన న్యాయమూర్తులు తాము ఇచ్చిన తీర్పుల గురించి బహిరంగంగా చర్చించటం, వాటిలోనూ మతాన్ని గురించి వక్కాణించటం, ఒక భావజాలంపై విద్వేషాన్ని వెల్లడించటం తగనిపని. ఇది ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నది ? బహుశా ఇలాంటి ఉదంతం మన దేశంలో ఇదే ప్రధమమేమో !


.