Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


గతంలో ఎన్నికల తరుణంలో ప్రవేశపెట్టే వాటికి పత్రికలు ఎన్నికల బడ్జెట్‌ అనే శీర్షికలు పెట్టేవి, ఇప్పుడు బడ్జెట్లతో పని లేకుండానే జిఎస్‌టి మండలి భారాలు మోపుతోంది. పాలకపార్టీలు కేంద్రంలో లేదా రాష్ట్రాల్లో జనాలకు ఉపశమనం కలిగించేది లేకపోయినా ఆ ఏడాదికి భారాలు మోపకుండా చూసేవారు. ఎన్నికలంటే ఇప్పుడు దేశంలో ఏ అనర్ధం జరుగుతుందో లేదా ఏ దుర్మార్గం తలపెడతారో దాన్ని ఏ పార్టీ ఎలా ఉపయోగించుకుంటుందో అని జనాలు ఆలోచిస్తున్నారంటే కొందరికి అతిశయోక్తిగా ఉండవచ్చు గానీ, నిజం. ఇటీవల జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అలాంటి అభిప్రాయం బలపడుతున్నది. ఎన్నికలలో బిజెపి గెలిచేందుకుగాను హిందూత్వ సంస్థలు 2000 దశకంలో ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి వంటివి అనేక బాంబు పేలుళ్లు జరిపినట్లు మహారాష్ట్రకు చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ కార్యకర్త యశ్వంత షిండే 2022 ఆగస్టు 29న నాందేడ్‌ సెషన్స్‌ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. గతంలో కూడా కొందరు మాజీలు ఇలాంటి అంశాలనే వెల్లడించిన సంగతి తెలిసిందే.


నాందేడ్‌ బాంబు పేలుడు కేసులో తనను సాక్షిగా చేర్చాలని, తాను 1990 నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌తో కలసి పని చేశానని యశ్వంత్‌ పేర్కొన్నాడు. నాందేడ్‌ జిల్లాలో బాంబులు తయారు చేస్తుండగా పేలి 2006లో విశ్వహిందూ పరిషత్‌కు చెందిన భజరంగ్‌ దళ్‌ కార్యకర్తతో సహా ఇద్దరు మరణించారు. ఔరంగాబాద్‌ జిల్లాలోని ఒక మసీదు మీద దాడి చేసేందుకు బాంబులు తయారు చేస్తుండగా మరణించిన వారిలో ఒకడైన హిమాంశు పన్సే తనకు తెలుసునని దీర్ఘకాలం హిందూత్వ వాతావరణంలో కలసి ఉన్నామని షిండే అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నేత ఇంద్రేష్‌ కుమార్‌ సూచనల మేరకు 1999లో హిమాంషుతో పాటు ఏడుగురిని జమ్మూలో మిలిటరీ జవాన్లతో ఆధునిక ఆయుధాలు ఉపయోగించటంలో శిక్షణ ఇప్పించేందుకు తీసుకు వెళ్లినట్ల్లు కూడా పేర్కొన్నాడు.( దీని గురించి స్పందించాలని అనేకసార్లు ఫోన్లు చేసినా, మెసేజ్‌లు పెట్టినా ఇంద్రేష్‌ కుమార్‌ స్పందించలేదని స్క్రోల్‌ వెబ్‌సైట్‌ పేర్కొన్నది.1998లో శ్రీనగర్‌లోని శంకరాచార్య ఆలయం వద్ద ఇంద్రేష్‌ కుమార్‌, సీనియర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ దివంగత శ్రీకాంత్‌ జోషితో యశ్వంత షిండే కలసి ఉన్న ఫొటోను కూడా అది ప్రచురించింది ) నాలుగు సంవత్సరాల తరువాత 2003లో పూనేలోని సింహగాద్‌ సమీపంలో బాంబుల తయారీ శిక్షణ కేంద్రానికి తాను, పన్సే హాజరైనట్లు షిండే అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. ఆ కాంపు ప్రధాన నిర్వాహకుడు, మూలకారకుడైన మిలింద్‌ పరండే ఇప్పుడు విశ్వహిందూ పరిషత్‌ జాతీయ నిర్వాహకుడిగా ఉన్నట్లు, కాంపులో ప్రధాన శిక్షకుడి పేరు మిథున్‌ చక్రవర్తి అని చెప్పారని, తరువాత తాను తెలుసుకుంటే అతని అసలు పేరు రవిదేవ్‌ ఆనంద్‌ అని ప్రస్తుతం ఉత్తరాఖండ్‌ విశ్వహిందూ పరిషత్‌ నేతగా ఉన్నట్లు షిండే పేర్కొన్నాడు.


శిక్షణా కేంద్రంలో జరిగినదాన్ని వర్ణిస్తూ ఇలా పేర్కొన్నాడు.” మిథున్‌ చక్రవర్తి ఉదయం పదిగంటలకు వచ్చేవాడు, వివిధ బృందాలకు రెండు గంటలపాటు శిక్షణ ఇచ్చేవాడు. బాంబుల రూపకల్పనకు అవసరమైన మూడు నాలుగు పేలుడు పదార్దాలు, పైప్‌ల ముక్కలు, వైర్లు, బల్బులు, గడియారాలు ఇలా ఏవి అవసరమైతే వాటిని ఇచ్చేవారు. శిక్షణ తరువాత ఒక వాహనంలో సమీపంలోని నిర్ణీత అడవికి తీసుకు వెళ్లి బాంబులు ఎలా పేలేదీ పరీక్షించేవారు. శిక్షణ పొందిన వారు గోతులు తవ్వి వాటిలో బాంబులు, టైమర్లు పెట్టి పైన మట్టి దాని మీద పెద్ద రాళ్లు పెట్టేవారు. బాంబులు విజయవంతంగా పేలితే రాళ్లు చాలా దూరంలో ముక్కలుగా పడేవి.( షిండే పేర్కొన్న అంశాల గురించి స్పందించేందుకు పరండే గానీ ఆనంద్‌ వైపు నుంచీ గానీ ఉలుకూ పలుకూ లేదని స్క్రోల్‌ పేర్కొన్నది.) శిక్షణ తరువాత హిమాంషు మహారాష్ట్రలోని మరట్వాడా ప్రాంతంలో మూడు పేలుళ్లు జరిపాడు. ఔరంగాబాద్‌లో పెద్ద పేలుళ్లు జరిపేందుకు పధకం వేసి బాంబులను రూపొందిస్తుండగా 2006లో నాందేడ్‌లో అవి పేలి అతని ప్రాణాలు పోయాయి. అంతకు ముందు హిమాంషు నుంచి వేరు పడేందుకు తాను ప్రయత్నించినట్లు షిండే తన అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. నాందేడ్‌ పేలుళ్ల కేసు మీద దర్యాప్తు జరిపిన సిబిఐ ఇదొక విడి సంఘటన తప్ప సంఘటిత చర్యల్లో భాగం కాదంటూ 2013లో ఒక చిన్న ఉదంతంగా పేర్కొన్నది. కానీ షిండే దాన్ని సవాలు చేశారు. సంఝౌతా రైలు పేలుడు కూడా కుట్రలో భాగమేనని, మాలెగావ్‌ పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న రాకేష్‌ ధావడే తదితరులు కూడా తమతో పాటు బాంబుల తయారీ శిక్షణ పొందిన కాంపులో ఉన్నాడని చెప్పాడు. వీటిలో నాందేడ్‌ కేసు ఒక చిన్న భాగం మాత్రమే అన్నాడు.


పరండే ఎత్తుగడల గురించి తాను ప్రస్తుత అధిపతి మోహన్‌ భగవత్‌తో సహా అనేక మంది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో చెప్పానని, వారు పట్టించుకోలేదని, ఇవన్నీ చూసిన తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి నేతలందరూ ఉగ్రవాద చర్యలను సమర్ధిస్తున్నట్లు నిర్దారణకు వచ్చానని, 2014లో బిజెపి అధికారానికి వచ్చిన తరువాత ఇంకా ప్రోత్సహిస్తున్నారని షిండే చెబుతున్నారు. ఇన్ని సంవత్సరాల తరువాత ఈ సంగతులన్నీ ఇప్పుడెందుకు చెబుతున్నారన్న ప్రశ్నకు ప్రాణహానితో పాటు తన హృదయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఉందని, హిందూత్వ భావజాలాన్ని గట్టిగా నమ్మినందున సంస్థకు చెడ్డపేరు వస్తుందనే కారణంతో మౌనంగా ఉన్నానని, ఇప్పుడు సంస్థ చెడ్డవారి చేతుల్లో పడిందని, బాగు చేయాలని అనేక మందిని కోరినప్పటికీ ఎవరూ పట్టించుకోవటం లేదని, అధికారం కోసం దేశాన్ని చీల్చుతున్నారని అందుకే శుద్ది చేయాలని భావించి ముందుకు వచ్చానని 49 సంవత్సరాల షిండే చెప్పాడు. తాను పదమూడు-పద్నాలుగు సంవత్సరాలుగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలకు దూరంగా ఉన్నప్పటికీ సభ్యుడిగా కొనసాగుతున్నట్లు చెప్పాడు. సంస్థ కార్యకర్తగా 1999లో షిండే ముంబై భజరంగ్‌ దళ్‌ అధిపతిగా పని చేశాడు. తొమ్మిది సంవత్సరాల పాటు కాశ్మీరులో ఉన్నాడు. అఫిడవిట్‌ దాఖలు చేసే ముందు అమిత్‌ షాకు లేఖ రాశానని స్పందన లేదన్నాడు.నాయకుల తీరుతో ఆశాభంగం చెందినా సంఘపరివార్‌లో అనేక మంది భరిస్తున్నారని తాను నిజం చెబుతున్నట్లు వారంతా గుర్తిస్తారని అన్నారు.


వివిధ మతాల ఉగ్రవాద సంస్థలు, మాఫియా ముఠాల చేతులలో ఒకసారి చిక్కుకున్న తరువాత అందునా నేరపూరిత చర్యల్లో పాల్గొన్నవారు వాటి నుంచి వెలుపలికి రావటం అంత తేలిక కాదు. భన్వర్‌ మేఘవంశీ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త దళితుడిగా సంఘపరివార్‌లో తాను ఎదుర్కొన్న వివక్షను వెల్లడిస్తూ ఏకంగా ఒక పుస్తకమే రాశారు. సానుకూల వైఖరితో ఉండాలని తోటివారు చెప్పారే తప్ప కులవివక్ష, అంటరానితనం అవొక సమస్యలుగా, చర్చించదగినవిగా కనిపించలేదన్నారు. హిందూత్వ కోసం తన జీవితాన్నే అర్పించేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ తన ఇంట్లో వండిన ఆహారాన్ని తినేందుకు బాబరీ మసీదు కరసేవకులు తిరస్కరించారని, భిల్వారా జిల్లా సేవా భారతి నేతగా, ఇరవై సంవత్సరాలు సంఘపరివార్‌ సంస్థల్లో ఉన్నప్పటికీ తనతో పని చేసిన వారు సమాజంలో అసమానతలు తెలిసిందే, వాటిని మనం పోగొట్టలేము. ఇక్కడ మనమే కాదు సాధు, సంతులు, ఇతరులున్నారు, తక్కువ కులానికి చెందిన వారి ఇంట్లో మనం వారికి ఆహారం పెడితే వారికి ఆగ్రహం కలగవచ్చు, వెళ్లిపోవచ్చు కూడా అని చెప్పారని పేర్కొన్నారు. బాబరీ మసీదు కూల్చివేత సందర్భంగా జరిగిన పరిణామాలను పేర్కొంటూ అప్పుడు తనకు అయోధ్య కంటే ఆత్మగౌరవం ముఖ్యం అనిపించిందని, ఆర్‌ఎస్‌ఎస్‌ వంచకుల నుంచి తాను ఎదుర్కొన్న అనుభవాలను వివరించిన తరువాత తన కుటుంబం,గ్రామం నుంచి కరసేవకు ఎవరూ వెళ్లనప్పటికీ ఇతరులను నిరోధించలేకపోయినట్లు పేర్కొన్నాడు. మేఘవంశీ 1990లో కరసేవకు వెళ్లి పోలీసు దెబ్బలు తిని జైలు పాలైనప్పటికీ తరువాత మసీదు కూల్చివేతకు దూరంగా ఉన్నారు. ముస్లింలను అవమానించటంలో తొలుత తానూ ఉత్సాహపడినప్పటికీ తరువాత తగ్గానని అన్నారు.


పాతిక సంవత్సరాల పాటు ఆర్‌ఎస్‌ఎస్‌లో పని చేసిన కేరళకు చెందిన సుధీష్‌ మిన్నీ దాని కుట్రలను వెల్లడిస్తూ రాసిన అంశాలు ఒక పుస్తకంగా వచ్చిన అంశం తెలిసిందే.ఐదు సంవత్సరాలపుడు బాలగోకులం పేరుతో సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమాలతో ఆ సంస్థలో చేరిన సుధీష్‌ తరువాత అంచలంచెలుగా ప్రచారక్‌గా ఎదిగాడు. చిన్నతనంలో తమను కబడ్డీ ఆడిస్తూ ఎదుటి జట్లకు ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టు పేర్లు పెట్టి విద్వేషాన్ని రెచ్చగొడుతూ వారి మీద గెలవాలని ఉద్భోధించేవారని సుధీష్‌ పేర్కొన్నారు. శిక్షణా శిబిరాల్లో కూడా ఇదే విధంగా నూరిపోశారని అన్నారు. వేదగణితం, యోగ పేరుతో ఆకర్షించి అక్కడ కూడా అదే చేస్తారని చెప్పారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ఇద్దరికి పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ నిధులు అందచేసిందని మాలెగావ్‌ పేలుళ్ల కేసులో నిందితుడైన దయానంద పాండే 2009లో పోలీసులకు చెప్పాడు. 2008లో ఆర్‌ఎస్‌ఎస్‌ నేత శ్యాం ఆప్టేను కలిసేందుకు పూనా వెళ్లినపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి మోహన భగవత్‌, ఇంద్రేష్‌ కుమార్‌(ఆర్‌ఎస్‌ఎస్‌లో ముస్లింల విభాగ నేత) పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ నుంచి డబ్బు తీసుకుంటున్నట్లు ఆప్టే చెప్పినట్లు పాండే పేర్కొన్నాడు. దీని గురించి విన్న లెప్టినెంట్‌ కల్నల్‌ శ్రీకాంత్‌ పురోహిత్‌ అభినవ భారత్‌ పేరుతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారిద్దరినీ అంతమొందించాలని కెప్టెన్‌ జోషి అనే అతన్ని కోరినట్లు, జోషి ఆపని చేయలేకపోవటంతో ఆప్టేకు కోపం వచ్చిందని పాండే పోలీసులకు చెప్పాడు. కల్నల్‌ పురోహిత్‌, సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ మాలెగావ్‌ పేలుళ్ల కుట్ర సూత్రధారులని వెల్లడించాడు.


సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ పేల్చివేత కుట్రలో స్వామి అసిమానంద పోలీసుల ముందు అంగీకరించిన అంశాలు కాంగ్రెస్‌ ఎత్తుగడలో భాగమని 2011లో బిజెపి ఆరోపించింది. 2007 సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలు పేల్చివేత కేసులో ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ కార్యకర్త కమల్‌ చౌహాన్‌ 2012లో విలేకర్లతో మాట్లాడుతూ తాను బాంబులు పెట్టానని వెల్లడించాడు. దీన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ తోసి పుచ్చింది. ఎన్‌ఐఏ సిబ్బంది కొట్టిన కారణంగా ఎవరైనా అలా చెప్పి ఉండవచ్చు తప్ప తమకు సంబంధం లేదని అన్నది. దీనిలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఏ పార్టీ అయినా తన పాత్రను అంత తేలికగా అంగీకరించదు. ఇలాంటి స్వచ్చంద ప్రకటనల వెనుక వత్తిడి, ప్రలోభాలు, బెదిరింపులు,పోలీసుల దెబ్బలుంటాయని ఆరోపిస్తారు.


” మత మార్పిడులు : ఒక మాజీ క్రైస్తవుని పాప నివేదన ” అనే శీర్షికతో ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ 2021 డిసెంబరు 29న ఒక వార్తను ప్రచురించింది. హిందూమతానికి ముప్పు వచ్చింది, దేశంలో మనం మైనారిటీలుగా మారుతున్నాం దీన్ని అరికట్టాలంటూ అనేక మందిని హిందూత్వవాదులుగా సంఘపరివార్‌ దళాలు మార్చుతున్నాయి. నేరాలకు పురికొల్పుతున్నాయి. అదే విధంగా క్రైస్తవమతాన్ని పుచ్చుకొని ఏసుక్రీస్తును ఆరాధిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయంటూ మతానికి చెందిన వారు కూడా మతమార్పిడులకు పాల్పడుతున్నారు. హిందూ సమాజంలో మీ పట్ల వివక్ష ఉంది మా మతంలో చేరితే సోదరులుగా చూస్తామంటూ ఇస్లాం కూడా దళితులను మతమార్పిడికి ప్రోత్సహించింది. అలా మారినవారిలో పరివర్తన కలిగితే మతాల పేరుతో చేసిన అక్రమాలను వెల్లడించవచ్చు. లేదా తమను ఎలా మార్చిందీ వివరించవచ్చు. అవి వాస్తవాలని ఆర్గనైజర్‌ పత్రిక, ఆర్‌ఎస్‌ఎస్‌ భావిస్తున్నది. అదే తమ సంస్థల నుంచి వెలుపలికి వెళ్లిన వారు వెల్లడించిన అంశాలు అవాస్తవాలని కొట్టి వేస్తున్నది. తమ వారి మీద వత్తిడి,ప్రలోభాలు వున్నట్లు చెబుతున్న సంఘపరివార్‌ సంస్థలు తమ పత్రికలో ప్రచురించిన పాపనివేదన ప్రకటించిన వారి వెనుక కూడా అలాంటివే ఉన్నట్లు చెబుతాయా ?