Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


గత వారంలో మన ఆర్ధిక రంగానికి చెందిన వివరాలు కొన్ని ప్రముఖంగా వార్తలకు ఎక్కాయి.రోజు వారీ పనులతో తీరిక లేనివారికి అవి ఒక పట్టాన అర్ధంగావు. నిత్య జీవితాలతో పరోక్షంగా సంబంధం కలిగినవే అయినా నేరుగా జనాన్ని తాకేవి కాదు గనుక అంతగా పట్టించుకోరు. దీన్ని అవకాశంగా తీసుకొని రాజకీయనేతలు, అందునా అధికారంలో ఉన్నవారు అంకెలతో గారడీలు చేస్తూ జనాలను ఆడుకుంటున్నారు. కొన్ని అంశాల మంచి చెడ్డలను చూద్దాం.


బ్రిటన్ను వెనక్కు నెట్టి మన దేశం జిడిపిలో ప్రపంచంలో ఐదవ స్థానానికి వచ్చిందని కొంత మంది సంతోషం ప్రకటిస్తున్నారు, మంచిదే. వెనుకటికి ఎవరో మాది 101 అరకల వ్యవసాయం తెలుసా అని మీసాలు మెలివేశాడట. మాది అంటున్నావు ఎవరెవరిది అని అడిగితే మా భూస్వామికి వంద, నాటి ఒకటి అన్నాడట. అలాగే మరొకడు మా ఇంటి పక్కనే ముకేష్‌ అంబానీ ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పాడట.ఆ చెప్పిన వాడి ఇల్లు చిరిగిన ప్లాస్టిక్‌ కవర్లతో కూడిన గుడారం వంటిది కాగా అంబానీ ఇల్లు 27అంతస్తులు, మూడు హెలిపాడ్లు కలిగి ఉంది. కరోనాకు ముందు కేవలం పది బిలియన్‌ డాలర్ల సంపద కలిగి అదానీ ఇప్పుడు 141 బి.డాలర్లకు చేరిందని తాజా వార్త.పేద వాడి ప్లాస్టిక్‌ పాక, వీధుల్లో అడుక్కొనే బిచ్చగాండ్ల రాబడి అంబానీ ఇల్లు, అదానీ సంపదలు అన్నింటినీ కలిపే దేశ జిడిపిగా పరిగణిస్తారు. దీన్ని నరేంద్రమోడీ సాధించిన ఘన విజయాల్లో ఒకటిగా కొందరు వర్ణిస్తున్నారు. అంకెలను ఎవరూ తారు మారు చేయలేరు గానీ ఎవరి భాష్యం వారు చెప్పవచ్చు. నాలుగు ఎలా వచ్చిందంటే నాలుగు ఒకట్లను కలిపితే అని, రెండును రెండుతో హెచ్చవేస్తేఅని, కాదు కలిపితే అనీ చెప్పవచ్చు. ఏప్రిల్‌-జూన్‌ మూడు మాసాల జిడిపిని లెక్కలోకి తీసుకుంటే మన దేశానిది 823 బిలియన్‌ డాలర్లుండగా బ్రిటన్‌లో 763బి.డాలర్లని ఐఎంఎఫ్‌ ప్రకటించింది. అదే సంస్థ జనవరి-మార్చి మాసాల్లో మనది 864, బ్రిటన్‌లో 813 బి.డాలర్లు ఉన్నట్లు కూడా పేర్కొన్నది. అంటే గడచిన మూడు నెలల్లో మన జిడిపి 41బి.డాలర్లు తగ్గింది.బ్రిటన్‌తో పోల్చుకొని సంతోష పడాలా మన తీరు తెన్నులను చూసి విచారపడాలా ? ఎవరికి వారు నిర్ణయించుకోవాలి.


ఇవన్నీ డాలరు లెక్కల్లో చెబుతున్న అంకెలు. ఈ కాలంలో మన కరెన్సీ, బ్రిటన్‌ పౌండ్‌ విలువ కూడా డాలరుతో పోలిస్తే తగ్గింది కనుక రెండు దేశాల జిడిపి తగ్గినట్లు ఐఎంఎఫ్‌ పేర్కొన్నది. కనుక ఈ అంకెలను చూపి విరగబాటును ప్రదర్శించాల్సిన అవసరం లేదు. రానున్న రోజుల్లో మన కరెన్సీ విలువ మరింత తగ్గి, బ్రిటన్‌ పౌండ్‌ విలువ పెరిగినా లేక తారుమారైనా భౌతిక సంపదలతో నిమిత్తం లేకుండానే విలువలు మారతాయి.ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం 2022 చివరినాటికి బ్రిటన్‌ జిడిపి 3.38 లక్షల కోట్ల డాలర్లుగా, మనది 3.54లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది. ఈ మాత్రానికే సంబరాలు చేసుకుంటే ఎలా ! అదే ఐఎంఎఫ్‌, దాని కవల సోదరి ప్రపంచబాంక్‌ మన దేశం గురించి చెప్పిన ఇతర అంకెల గురించి ఇలాంటి సంబరాలు చేసుకున్నామా ? ఐదో స్థానానికి చేరినందుకు సంతోషపడితే తలసరి జిడిపిలో మనం 159వ స్థానంలో ఉన్నామని, పక్కనే ఉన్న శ్రీలంక 148లో ఉందని ఎంత మందికి తెలుసు. 2021లో అదే బ్రిటన్‌ 47,334 డాలర్లుండగా మనది 2,277 డాలర్లు, చైనాలో 12,556 డాలర్లుంది.


కనీసం చైనా స్థాయికి చేరాలంటే ఇప్పుడున్న జిడిపి ఐదున్నర రెట్లు పెరగాల్సి ఉంటుంది. నరేంద్రమోడీ గారిని తన మంత్రదండంతో పెంచమనండి. కొడుకును కంటానంటే అత్త వద్దంటుందా అనే పాత సామెత తెలిసిందే. మన జిడిపి తొలి త్రైమాసికంలో రెండంకెల 13.5శాతం పెరుగుదల ఉన్నా ఏడాది చివరకు అది ఒక అంకెకు పడిపోతుందని రిజర్వుబాంకే చెప్పింది. ఒకవైపు అది 6 లేదా ఆరున్నర శాతం అని కొందరు చెబుతుంటే ఎస్‌బిఐ 6.7 నుంచి 7.7శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది. అప్పుడు విచార ప్రదర్శనలకు దిగుతామా ? మన వృద్ధి రేటు చైనా కంటే ఎక్కువగా ఉందని చెబుతున్నారు, ఉండవచ్చు, గతంలో మన కంటే తక్కువ ఉన్న స్థితి నుంచి జిడిపిలో మనల్ని వెనక్కు నెట్టి చైనా ఎలా ముందుకు పోతోందని ఎవరైనా ప్రశ్నిస్తే వారితో మనకు పోలిక ఎందుకని తప్పించుకుంటారు. ఇంకా పొడిగిస్తే మనది ప్రజాస్వామ్యం వారిది నిరంకుశత్వం అని చెబుతారు. చైనాలో ఉన్నది నిరంకుశమో కాదో కాసేపు పక్కన పెట్టి ప్రజాస్వామ్య పద్దతుల్లో మనం ఎందుకు ముందుకు పోలేకపోతున్నామో తర్కానికి నిలిచే సమాధానం చెప్పాలి. మన దేశంలోకి రానున్న పెట్టుబడులు వాటి మంచి చెడ్డల గురించి చెబితే ఒకటి, దాని కంటే చైనా నుంచి తరలివచ్చే పెట్టుబడులు, సంస్థల గురించి కొందరు ఎక్కువగా చెబుతున్నారు. పోనీ ఆ వచ్చే కొన్ని వియత్నాం లేదా మరొక చోటికో వెళుతున్నట్లు వార్తలు తప్ప మన దేశానికి ఎన్ని వచ్చాయో ఎవరినైనా చెప్పమనండి.


జిడిపి గురించి గొప్పలు చెబుతున్నవారు ఆగస్టు చివరివారంలో మన విదేశీమారక ద్రవ్యనిల్వలు రెండేళ్ల నాటి కనిష్ట స్థాయికి ఎందుకు తగ్గినట్లో చెప్పాలి. ఆగస్టు 26తో ముగిసిన వారంలో నిల్వలు 561 బి.డాలర్లకు తగ్గాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభం తరువాత 27 వారాలకు 21 వారాల్లో తగ్గుదల నమోదైంది. గతేడాది అక్టోబరుతో పోలిస్తే 80బి.డాలర్లు తగ్గాయి. ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో జడిపి వృద్ది రేటు 16.2 శాతం వరకు ఉంటుందని ఆర్‌బిఐ చెప్పగా 13.5శాతం ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో 20.1శాతం నమోదైంది. అంటే పురోగమనంలో ఉన్నట్లా తిరోగమనంలో ఉన్నట్లా ? ఇది ఒక అంకెల గారడీ. వచ్చే రోజుల్లో మన జిడిపి పెరిగి 2027 నాటికి జర్మనీని, 2029 నాటికి జపాన్ను వెనక్కు నెట్టి మూడవ స్థానంలోకి వెళుతుందని ఎస్‌బిఐ చెప్పింది. దానికి ఎస్‌బిఐ చెబుతున్నదేమిటి ? చైనాలో కొత్త పెట్టుబడులు మందగిస్తాయని, ఆ మేరకు మన దేశంలో పెరుగుతాయని చెబుతూ చైనాలో జరుగుతున్నదానిలో ఐదో వంతు ఉత్పత్తిని భారత్‌కు తరలించనున్నట్లు చెప్పిన యాపిల్‌ కంపెనీ ప్రకటన ఆశాభావానికి దోహదం చేస్తున్నట్లు చెప్పింది. అదే కంపెనీ ఐపాడ్‌ల ఉత్పత్తిని వియత్నాంకు తరలించనున్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి.యాపిల్‌ కంపెనీ బ్రెజిల్‌,భారత్‌లో తలపెట్టిన ఉత్పత్తులు స్థానిక అవసరాలకు తప్ప ఎగుమతుల కోసం కాదని ఆగస్టు ఏడవ తేదీన లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక రాసింది.


మన దిగుమతులు పెరిగి దానికి అనుగుణంగా ఎగుమతులు లేక వాణిజ్య లోటు పెరుగుతున్నట్లు జిడిపి ఐదవ స్థానానికి ఎదుగుదల వార్తలతో పాటే ప్రభుత్వం వెల్లడించింది. ఇన్వెంటియా డాట్‌కామ్‌ విశ్లేషణ ప్రకారం 2022 ఏప్రిల్‌-ఆగస్టు నెలల్లో మన ఎగుమతులు 192.59 బి.డాలర్లు కాగా దిగుమతులు 317.81 కాగా లోటు 125.22 బి.డాలర్లు. గతేడాది ఇదే నెలల లోటు 53.78 బి.డాలర్లు మాత్రమే. గతేడాది ఆగస్టుతో పోల్చితే లోటు 13.81 నుంచి 28.68 బి.డాలర్లకు పెరిగింది. ఎగుమతులు0.8శాతం తగ్గగా దిగుమతులు 31శాతం పెరిగాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. మన ఎగుమతులు పెరిగి మన జనానికి పని కల్పించే ఎగుమతులు పెరగకుండా మనలను నిరుద్యోగులుగా మార్చే దిగుమతులు పెరుగుతున్నపుడు జిడిపి పెరుగుదలతో సామాన్యులకు ఒరిగేదేమిటి ? సంతోషించే వారు దీనికేమి చెబుతారు.2001 నుంచి చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్న కారణంగా 2018 నాటికి అమెరికాలో 40లక్షల ఉద్యోగాలు పోయినట్లు అంచనా. ఇదే కాలంలో చైనాతో అమెరికా వాణిజ్య లోటు 83 నుంచి 420 బి.డాలర్లకు పెరిగింది. దిగుమతులు పెరిగితే మన పరిస్థితి ఇంతే కదా !


ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నది తెలిసిందే. ఇది సుమతీ శతకంలోనిది. రచయిత బద్దెన లేదా భద్రభూపాలుడు అని చెబుతారు. సదరు శతకకారుడు ఇప్పుడు బతికి ఉంటే దీన్ని రాజకీయపార్టీలకు వర్తింప చేసి ఉండేవాడు. గతంలో కాంగ్రెస్‌ పాలనా కాలంలో డాలరుతో రూపాయి విలువ పతనం గురించి నానా యాగీ చేసిన బిజెపి పెద్దలు మౌనంగా ఉంటే అదొక దారి. దానికి బదులు ఎదురుదాడులకు దిగుతున్నారు. మన కరెన్సీ పతనం కాలేదు, డాలరు విలువ పెరిగితే మనమేం చేస్తాం, ఇతర కరెన్సీలతో పోల్చి చూడండి మనది బలపడింది అని చెబుతున్నారు.గతంలో మన్మోహన్‌ సింగు ఏలుబడిలో ఇదే జరిగినపుడు కూడా జరిగింది అదే కదా ! అప్పుడు ఎందుకు విమర్శించినట్లు ? మన కరెన్సీ బలపడితే లేదా దిగజారితే తలెత్తే పరిణామాలు ఏమిటన్నది గీటురాయి. ముందుగా మన బలపడిందని చెబుతున్న మన కరెన్సీ, ఇతర వాటిని చూద్దాం. ఒక రూపాయికి వివిధ కరెన్సీల మారకపు విలువ.
దేశం ××××× సంవత్సరం,నెల, తేదీ ×× విలువ ×××××సంవత్సరం,నెల, తేదీ××× విలువ
బంగ్లాదేశ్‌ ××× 2021.9.04 ×××××× 1.16649××× 2022.9.4 ××××××× 1.7507
పాకిస్తాన్‌ ××× 2022.3.08 ×××××× 2.3235 ××× 2022.9.3 ××××××× 2.19289
శ్రీలంక ××× 2022.3.08 ×××××× 2.9515 ××× 2022.9.3 ××××××× 4.5166
చైనా ××× 2022.3.08 ×××××× 0.082244 ×× 2022.9.3 ××××××× 0.086548
రష్యా ××× 2022.3.08 ×××××× 1.6893 ××× 2022.9.3 ××××××× 0.75604
ఐరోపా ××× 2022.3.08 ×××××× 0.011933 ××× 2022.9.3 ××××××× 0.012603
అమెరికా ××× 2022.3.08 ×××××× 0.013004 ××× 2022.9.3 ××××××× 0.012544
పై వివరాలను గమనించినపుడు బంగ్లాదేశ్‌, శ్రీలంక, పాకిస్తాన్‌, చైనా, ఐరోపా కరెన్సీలతో పోల్చినపుడు మన రూపాయి కాస్త బలపడింది. రష్యా, అమెరికా డాలరుతో పోలిస్తే బలహీనపడింది.ఏ దేశ కరెన్సీ అయినా బలపడితే దాని ఎగుమతులకు దెబ్బ, కరెన్సీ విలువ పడిపోతే దిగుమతుల ఖర్చు తడిచి మోపెడు అవుతుంది. మన కరెన్సీ విలువ పతనం అవుతున్నా ఆ మేరకు మన ఎగుమతులు పెరగటం లేదు, రెండింటికీ చెడ్డ రేవడిలా మారాము.


మన నరేంద్రమోడీ ఘనత కారణంగా రష్యా మనకు తక్కువ ధరలకు అదీ మన రూపాయలు తీసుకొని చమురు విక్రయిస్తున్నదని ప్రచారం చేస్తున్నారు. అమెరికా, నాటో దేశాల ఆంక్షలను ధిక్కరించి తమకు మద్దతు ఇస్తున్నవారికి వారి చమురు కొనుగోలు చేస్తున్న చైనాతో ఇతర అనేక దేశాలకు కూడా తక్కువ ధరలకే ఇస్తున్నది. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభానికి ముందు మనం రష్యానుంచి కొనుగోలు చేసిన చమురు నామమాత్రం. ఇప్పుడు అక్కడి నుంచే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాము.భారత్‌ నాటి సోవియట్‌, తరువాత రష్యాతో రూపాయి-రూబుల్‌ సంబంధాలు కొనసాగాయి, ఇప్పుడేదో కొత్తగా మొదలైనట్లు చెప్పటం వాస్తవదూరం.2019లో రెండు దేశాల వాణిజ్యంలో సగం డాలర్లలో చెల్లించాము, అది 2021లో 38.3శాతానికి తగ్గి 53.4శాతం రూబుళ్లలో చెల్లించాము. ఇక వర్తమానానికి వస్తే మన చమురు దిగుమతుల్లో కేవలం 0.2శాతంగా ఉన్న రష్యా చమురు ఆరునెలల్లో ఇప్పుడు పదిశాతానికి చేరింది. రూపాయి-రూబుల్‌ లావాదేవీలతో ఆర్‌బిఐకి విదేశీమారక ద్రవ్యం పదహారు శాతానికి పైగా మిగిలింది. అసలే మన డాలర్లు దేశం వదలి పోతున్న తరుణంలో ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తున్నది. ఇక మన దిగుమతులు చైనా నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వారికి డాలర్లలో చెల్లిస్తే మనకు కలిగే లబ్ది ఏమీ ఉండదు, అదే యువాన్‌ – రూపాయి లావాదేవీలు జరిగితే స్వల్పంగా మన కరెన్సీ విలువ పెరిగినందున కొంతమేరకు లబ్ది ఉంటుంది. కానీ చైనాకు మన ఎగుమతులు తగ్గుతున్నాయి తప్ప పెరగటం లేదు. ఇప్పుడు రూపాయితో పోల్చితే రూబుల్‌ విలువ కూడా పెరిగినట్లు పై వివరాలను చూస్తే తెలుస్తుంది. మీ డాలరు విలువ పెరిగింది తప్ప మా రూపాయి తగ్గలేదని చెబుతున్న బిజెపి నేతలు తమ పిల్లల విదేశీ విద్యకు అవసరమైన డాలర్లను ఏ ధరకు కొనుగోలు చేస్తున్నారో చెప్పాలి లేదా జనం అడగాలి. మనం వాడే సెల్‌ఫోన్లు, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇతర పరికరాల ధరలు ఎంత పెరిగాయో ఎవరికి వారు తెలుసుకోవచ్చు.2021లో 57బి.డాలర్ల మేర ఎలక్ట్రానిక్‌ వస్తువులను దిగుమతి చేసుకున్నాము.


మన దేశం డాలర్లు చెల్లించి విదేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తున్నది.2014 ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 పక్షం రోజుల్లో మనం దిగుమతి చేసుకున్న ముడి చమురు ధర సగటున 99.52 డాలర్లు, ఆ రోజుల్లో సగటున మన కరెన్సీ మారకపు విలువ డాలరుకు రు.60.54, ఈ రేటున ఒక పీపాకు మనం చెల్లించిన మొత్తం రు.6,020.94, అదే చమురుకు 2022 జూలై 27 నుంచి ఆగస్టు 26వరకు సగటున పీపాను 98.18 డాలర్లకు కొనుగోలు చేశాము, దీనికి గాను మన రూపాయల్లో డాలరుకు రు.79.52 చొప్పున పీపాకు రు.7,807.27 చెల్లించాము. 2014 ఎన్నికలకు ముందు బిజెపి నేతలు చెప్పినట్లు మన కరెన్సీ విలువను డాలరుతో మారకం రు.40కి పెంచే సామర్ధ్యాన్ని నరేంద్రమోడీ లేదా ప్రభుత్వం గానీ ప్రదర్శించి ఉంటే మనకు ఇప్పుడు ముడిచమురు పీపా రు.3,927.20కే వచ్చేది, ధరల పెరుగుదల ఆమేరకు తగ్గి జనానికి ఎంతో భారం తగ్గేది. నిజంగా మోడీ చెప్పిన అచ్చేదిన్‌ వచ్చి ఉండేవి.