Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


సంక్షోభంలో ఉన్న బ్రిటన్‌ నూతన ప్రధానిగా మంగళవారం నాడు గద్దెనెక్కిన కన్సర్వేటివ్‌ పార్టీ(టోరీ) నాయకురాలు లిజ్‌ ట్రస్‌ తక్షణమే రంగంలోకి దిగుతారు అంటూ అక్కడి మెజారిటీ పత్రికలు, ఆమె గెలిచారు గానీ రానున్న సంక్షోభాన్ని నివారించగలరా అన్న సందేహాలతో కొన్ని ఆమె గురించి శీర్షికలు పెట్టాయి. ద్రవ్యోల్బణం ఇతర ఆర్ధిక దిగజారుడు కారణంగా జీవితాలు గడపటం కష్టమైన కార్మికులు సమ్మెలకు దిగిన నేపధ్యంలో ప్రభుత్వం తమపై దాడులకు పాల్పడవచ్చని భావిస్తున్నారు. బ్రిటన్‌ తదుపరి ఎన్నికలు 2025 జనవరి 28న జరగాల్సిన పూర్వరంగంలో లేబర్‌ పార్టీ నుంచి ఎదురుకానున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆమె ఎలాంటి చర్యలతో కార్యాచరణకు పూనుకుంటారన్నది ఆసక్తి కలిగించే అంశం. జీవన వ్యయ పెరుగుదల నుంచి బ్రెక్సిట్‌ అనంతర పరిస్థితి, ఉక్రెయిన్‌ సంక్షోభం వరకు అనేక అంశాలు ఆమె ముందున్నాయి. గతంలో ఉక్కు మహిళగా పేరు గాంచిన మార్గరెట్‌ థాచర్‌ తరువాత ఇన్ని సమస్యలతో గద్దె నెక్కిన వారు మరొకరు లేరు. భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ను పార్టీ ఎన్నికల్లో ఓడించిన లిజ్‌ ఆరు సంవత్సరాల్లో నాలుగవ ప్రధాని. అక్కడి సంక్షోభానికి ఇన్ని ప్రభుత్వాలు మారటం ఒక సూచిక. ఆమె ఏలుబడిలో 1970 మాదిరి మరోసారి చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని డచ్‌బాంక్‌ సోమవారం నాడు హెచ్చరించింది. పౌండ్‌ విలువను 30శాతం తగ్గించుకోవాల్సి ఉంటుందని, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే స్థితిలో బ్రిటన్‌ లేదని పేర్కొన్నది.వచ్చే ఏడాది 30 బిలియన్‌ పౌండ్ల మిగులు బడ్జెట్‌ బదులు 60 బిలియన్ల లోటు ఉండే విధంగా లిజ్‌ ఆలోచనలు ఉన్నట్లు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పేర్కొన్నది.మార్గరెట్‌ థాచర్‌, థెరెస్సా మే తరువాత లిజ్‌ ట్రస్‌ బ్రిటన్‌కు మూడవ మహిళా ప్రధాని, ముగ్గురూ కన్సర్వేటివ్‌ పార్టీకి చెందినవారే.


లిజ్‌ ట్రస్‌ గురించి దేశ ప్రజల్లో 52శాతం మంది ఆమెను ఒక భయంకర మనిషిగా భావిస్తున్నారు.యు గవ్‌ విశ్లేషణా సంస్థ సేకరించిన సమాచారం ప్రకారం కేవలం పన్నెండుశాతం మంది మాత్రమే ఆమె మీద విశ్వాసం ప్రకటించారు.ఆమె ఒక భయంకరి అని 52శాతం భావిస్తున్నారు. మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్ను భయంకరుడిగా 55శాతం భావించారని వెల్లడైంది. ఈ సర్వే ఆమె ఎన్నికకకు వారం రోజుల ముందు జరిగింది. లిజ్‌ ట్రస్‌ గొప్ప అన్న వారు రెండుశాతం, మంచిది అన్నవారు పదిశాతం, ఫరవాలేదని 20శాతం, అధ్వానం అని 17శాతం, భయంకరమని 35, తమకు తెలియదని 16శాతం మంది చెప్పారు.


జనానికి ఉపశమనం కలిగిస్తే తమ వాటా తగ్గుతుందని కార్పొరేట్లకు ఆగ్రహం, లేకపోతే జనాందోళనలు మరింత ఉధృతం కావటం తధ్యం. ప్రస్తుతం అనుసరిస్తున్న ఇంథన ఛార్జీల విధానాన్ని స్థంభింపచేసి 2,300 డాలర్లు. అంతకు లోపు చెల్లిస్తున్న గృహ వినియోగదారులకు వచ్చే ఎన్నికల వరకు బిల్లులు పెరగకుండా చేసేందుకు 130 బిలియన్‌ డాలర్లతో ఒక పధకాన్ని రూపొందించినట్లు వార్తలు వచ్చాయి. తొలిసారిగా బ్రిటన్‌ చరిత్రలో శ్వేతజాతికి చెందిన వారినెవరినీ ప్రధాన మంత్రి పదవుల్లోకి తీసుకోకూడదని లిజ్‌ భావిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. జాత్యహంకార పార్టీ అన్న ముద్రను తొలగించుకొనేందుకు, శ్వేతేతర జాతుల వారి ఓట్ల కోసం ఇదంతా అన్నది స్పష్టం. లిజ్‌-సునాక్‌ మధ్య పోటీలో కూడా శ్వేతజాతి ఆధిపత్య భావజాలం పని చేసిందన్నది స్పష్టం. మంత్రులుగా ఎవరున్నారన్నది ప్రధానం కాదు, ప్రభుత్వ విధానాలు ఏమిటన్నదే గీటురాయి. మరో టోరీ ప్రధాని అని తప్ప లిజ్‌ ట్రస్‌ విధానాల మీద కార్మికుల్లో ఎలాంటి భ్రమలు లేవు.


ప్రధాని పదవికి పోటీ పడుతున్న ఎన్నికల ప్రచారంలో ఆమె ధనికులకు అనుకూలమైన అంశాల గురించి స్పష్టంగా చెప్పారు. అధికాదాయం ఉన్నవారికి పన్నులు తగ్గించటం న్యాయం అన్నారు. వచ్చే ఏడాది కార్పొరేట్‌ పన్నును 19 నుంచి 25శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకోవచ్చు. బీమా పధకాల్లో ఆమె ప్రతిపాదిస్తున్న మార్పుల ప్రకారం పేదలకు ఏడాది 7.66 పౌండ్లు మాత్రమే లబ్ది కాగా ధనికులకు 1,800 పౌండ్లు మిగులుతాయి. బ్రిటన్‌లో కార్మికవర్గంతో పాటు పెట్టుబడిదారీ విధానం కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నది. దాని భారాన్ని కార్మికవర్గం మీద నెట్టేందుకు పూనుకుంది.ఐరోపా సమాఖ్యలో కొనసాగటం కంటే వెలుపల ఉంటేనే తమకు ఎక్కువ లబ్ది అని అక్కడి కార్పొరేట్‌లు భావించిన కారణంగానే దాన్నుంచి వెలుపలికి వచ్చింది. వాటికి మార్కెట్‌ను సంపాదించి పెట్టటం లిజ్‌ సర్కార్‌కు పెద్ద పరీక్ష కానుంది. ఇదే తరుణంలో కరోనా, ఉక్రెయి, తదితరాల కారణంగా తలెత్తిన సమస్యల నుంచి బయటపడటం అంత తేలికేమీ కాదు. గత దశాబ్దన్నర కాలంగా బ్రిటన్‌ పెట్టుబడిదారులు ప్రభుత్వం మీదనే ఎక్కువగా ఆధారపడ్డారు.


రష్యా, చైనాల పట్ల రిషి సునాక్‌ మెతకగా ఉంటారంటూ ఎన్నిక ప్రచారంలో లిజ్‌ ట్రస్‌ విమర్శించారు. రష్యా-ఉక్రెయిన్‌ రాజీని చెడగొట్టటంలో మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కీలక పాత్రపోషించాడు. ఇప్పుడు అతని బూట్లలో కాళ్లు పెట్టిన లిజ్‌ ఎలా నడుస్తారో చూడాల్సి ఉంది. నిజానికి రిషికి చైనా అంటే ప్రత్యేక అభిమానమేమీ లేదు. ఒక పెట్టుబడిదారుగా చైనాతో వచ్చే లబ్దిపొందాలన్నదే తప్ప మరొకటి కాదు. లిజ్‌ ట్రస్‌తో ఎన్నికల పోటీలో భాగంగా చైనా మీద ధ్వజమెత్తిన సునాక్‌ సరిగ్గా ఏడాది క్రితం మాట్లాడుతూ చైనాతో సన్నిహిత ఆర్ధిక సంబంధాలు పెట్టుకోవాలని ప్రబోధించాడు. 2021 జూలై ఒకటవ తేదీన మాన్షన్‌ హౌస్‌ వార్షిక విధాన ఉపన్యాసం చేస్తూ 55లక్షల కోట్ల విలువగల చైనా ఆర్ధిక సేవల మార్కెట్‌ గురించి ఐరోపా సమాఖ్య ఒప్పందానికి రావటంలో విఫలమైందని, బ్రిటన్‌ సంస్థలు దాన్ని దక్కించుకొనే లక్ష్యంతో పని చేయాలని సునాక్‌ ఉద్బోధించాడు. అమెరికా కంటే కూడా చైనా మీద ఎక్కువగా కేంద్రీకరించి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నాడు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వెలుపలికి వచ్చిన తరువాత 2021 జనవరి ఒకటి నుంచి సమాఖ్య షేర్‌ మార్కెట్‌ లావాదేవీల సేవలు లండన్‌ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌, పారిస్‌, న్యూయార్క్‌ నగరాలకు తరలాయి.ఐరోపా సమాఖ్యతో ఎలాంటి ఒప్పందం లేకుండానే బ్రిటన్‌ బయటపడింది. సమాఖ్యతో పోలిస్తే భిన్నమైన షరతులను చైనా అంగీకరించే అవకాశం ఉన్నందున మన విలువలతో రాజీపడకుండా పరస్పరం లబ్ది పొందే విధంగా బ్రిటన్‌ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సునాక్‌ వాదించాడు. ఇప్పుడు ట్రస్‌ ఈ అంశాల గురించి ఎలా స్పందిస్తారు, ఏమి చేస్తారు అన్నది చూడాల్సి ఉంది.పార్టీ సభ్యులలో 81,326 ఓట్లు లిజ్‌కు రాగా 60,399 రిషి సునాక్‌ పొందారు. బిబిసి పేర్కొన్నదాని ప్రకారం 82.6శాతం మంది ఎన్నికలో పాల్గొన్నారు.


నూతన ప్రధాని ఎన్నిక ప్రక్రియ జరుగుతుండగానే బ్రిటన్‌లో వివిధ రంగాల్లోని కార్మికులు సమ్మెలకు పూనుకున్నారు.ఈ నెల 15న పన్నెండు కంపెనీలకు చెందిన 40వేల మంది రైల్వే కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. పొదుపు పేరుత ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక చర్యలకు నిరసనగా, ప్రభుత్వ సేవలను పరిరక్షించాలని కోరుతూ ఈ సమ్మె జరుగుతోంది. తరువాత కూడా వివిధ తేదీలలో రైల్వే కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. రైల్వే కార్మికులకు వేతన స్థంభన లేదా వేతన కోతల ప్రతిపాదనలను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. గత ఏడాది కాలంలో బ్రిటన్‌లో కార్మికుల జీవన పరిస్థితులు దిగజారుతున్నాయి. ఏప్రిల్‌ నాటికి ఇంథన బిల్లులు 50శాతం పెరిగ్గా, అక్టోబరు నాటికి 80శాతానికి చేరనున్నాయి. గత వేసవిలో సగటున 1,277 పౌండ్ల మేర బిల్లులు రాగా ఈ ఏడాది 3,549 పౌండ్లకు పెరగనున్నాయి. ఇవి ముందుగా బిల్లు చెల్లించేవారికి, తరువాత కట్టే పేదవారికి 3,608 పౌండ్లకు పెరుగుతాయి. గృహస్తులకే గాక స్కూళ్లు, సంరక్షణ కేంద్రాలు, చిన్న దుకాణాలు అన్నింటికీ పెరగనున్నాయి. వచ్చే జనవరి తరువాత మరింతగా పెరుగుతాయి.మొత్తం 70లక్షల పేద కుటుంబాల మీద దీని ప్రభావం పడనుంది. ఇంథన దారిద్య్రాన్ని అంతమొందించాలనే ఉద్యమ సంస్థ అంచనా ప్రకారం రాబడిలో పదిశాతాన్ని ఖర్చు చేస్తున్నారని,105లక్షల కుటుంబాల మీద ప్రభావం ఉందని పేర్కొన్నది. మరొక అంచనా ప్రకారం 2023 జనవరి నాటికి ఇంథన దారిద్య్రంలో మూడింట రెండు వంతుల కుటుంబాలు కూరుకుపోతాయి. ప్రభుత్వం జనం కంటే ఇంథన కంపెనీల లాభాలను కాపాడేందుకే ప్రాధాన్యత ఇస్తున్నది. ఒక వైపు జనం ఇబ్బందులు పడుతుంటే బోరిస్‌ జాన్సన్‌ప్రభుత్వం ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇచ్చేందుకు ఆగస్టు పదిహేను నాటికి 2.3బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది.


రానున్న రోజుల్లో ఆహార, ఆరోగ్య సంక్షోభం కూడా పెరగనుంది. 2009-10లో బ్రిటన్‌లోని స్వచ్చంద సంస్థలు ఆహారాన్ని అందచేసేవి నామమాత్రం. వాటిలో ఒకటైన ట్రస్సెల్‌ట్రస్టు 35 కేంద్రాలను నిర్వహించి 61వేల ఆహార పొట్లాలను అందచేసింది. తరువాత 2019-20 నాటికి కేంద్రాలు 1,400కు పెరగ్గా పది లక్షల 90వేలకు, 2020-21లో 26లక్షలు, 2021-22లో 22లక్షల ఆహార పొట్లాలు అందచేసింది. కరోనాకు ముందు దేశంలోని నాలుగు శాతం కుటుంబాలు తీవ్రమైన ఆహార భద్రత సమస్యను, మరో నాలుగుశాతం పరిమితమైన సమస్యను ఎదుర్కొంటున్నట్లు సర్వేలు వెల్లడించాయి.ఆహార కేంద్రాలు ఎక్కువ భాగం చర్చ్‌లలో ఉండటంతో కొంత మంది ఆకలిని భరించటానికి ఇష్టపడ్డారు తప్ప అక్కడికి వెళ్లేందుకు సిగ్గుపడ్డారని, దూరంగా ఉండటం, అవి తెరిచే సమయాల వలన కూడా కొందరు వెళ్లటం లేదని కూడా వెల్లడైంది. గత పన్నెండు నెలల్లో సర్వే చేసి ఉంటే పరిస్థితి ఇంకా దిగజారినట్లు తేలి ఉండేదని అమెరికా సర్వే సంస్థ ఒకటి పేర్కొన్నది. జీవన వ్యయం పెరుగుతున్న కొద్దీ ఈ కేంద్రాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్నది.
లిజ్‌ ట్రస్‌ సారధ్యంలో భారత్‌-బ్రిటన్‌ సంబంధాలు ఎలా ఉంటాయని కొందరు చర్చ ప్రారంభించారు. గతంతో పోలిస్తే పెద్ద మార్పులు ఉండే అవకాశాలు లేవు. తమ వస్తువులకు మన మార్కెట్‌ను తెరవాలంటూ గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న వత్తిడి కొనసాగనుంది. ద్రవ్యోల్బణం దాని తరువాత మాంద్యంలోకి జారనుందనే పరిస్థితిలో మన ఎగుమతులైన వస్త్రాలు,దుస్తులు, ఆభరణాల వంటి వాటికి ఏ మేరకు డిమాండ్‌ ఉంటుందో చెప్పలేము.2020-21లో ఇరు దేశాల లావాదేవీలు 13.2 నుంచి మరుసటి ఏడాది 17.5 బి.డాలర్లకు పెరిగాయి. మన ఎగుమతులు 10.5 బి.డాలర్లు కాగా దిగుమతులు ఏడు బిలియన్‌ డాలర్లు. రెండు దేశాల మధ్య కస్టమ్స్‌ సుంకాలను భారీగా తగ్గించాలని రెండు దేశాలూ భావిస్తున్నాయి. దీపావళి నాటికి రెండు దేశాలూ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవచ్చని భావిస్తున్నారు. ఆర్ధికంగా ఐరోపా సమాఖ్య నుంచిదూరమైన బ్రిటన్‌ అంతర్జాతీయ మార్కెట్ల వేటలో అమెరికాతో జతకట్టటం తప్ప మరొక మార్గం లేదు.