Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


వెనుకటికి ఒక తుపాకి రాముడు లేదా పిట్టల దొర మీ ఊళ్లో ఉన్న కొండను ఎవరైనా మోయ గలరా అని సవాల్‌ చేశాడట. మా వల్లకాదు గానీ మీరు మోస్తారా అంటే సై అని పందెం కాశాడట. ఎంతసేపు ఉన్నా కొండ చుట్టూ పదే పదే తిరగటం తప్ప చేసిందేమీ లేకపోవటంతో గ్రామస్తులు నిలదీశారు.నేను మోస్తా, మీరంతా దాన్ని ఎత్తి నాతల మీద పెట్టండి, అలా చేసేందుకు మీకు ఎటు నుంచి వీలవుతుందా అని చుట్టూ తిరిగి చూస్తున్నా అన్నాడట. అసలు కథేమిటో అర్ధం అయిందిగా. ఇక విషయంలోకి వద్దాం.
2022 ఏప్రిల్‌ 13న గుజరాత్‌ రాజధాని అహమ్మదాబాద్‌లో ఒక భవనాన్ని నరేంద్రమోడీ వీడియో ద్వారా ప్రారంభించారు. ఆ సందర్భంగా సందేశమిస్తూ ఉక్రెయిన్‌ యుద్దం తరువాత ఏ దేశానికి ఆ దేశం తన ఆహార భద్రత సంగతి తాను చూసుకుంటోందని తాను ఒకసారి అమెరికా అధినేత జో బైడెన్‌తో మాట్లాడినపుడు ప్రస్తావించానని, ప్రపంచ వాణిజ్య సంస్థ గనుక అనుమతి ఇస్తే ప్రపంచానికి ఆహార ధాన్యాలను సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్నాం అని చెప్పినట్లు మోడీ వెల్లడించారు. కరోనా కాలంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలను భారత్‌ ఉచితంగా ఎలా ఇచ్చిందబ్బా అని ప్రపంచమంతా ఆశ్చర్యంతో చూస్తున్నదన్నారు. మన జనానికి సరిపడా ఆహారం ఇప్పటికే మన దగ్గర ఉందని, కానీ మన రైతులను చూస్తుంటే ప్రపంచానికే ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నదని, ప్రపంచ వాణిజ్య సంస్థ ఎప్పుడు అనుమతిస్తుందో తెలియదు గానీ మనం మాత్రం ప్రపంచానికి ఆహారం అందించగలం అని నరేంద్రమోడీ చెప్పారు.( అదే తేదీతో ఉన్న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వార్త)


విశ్వగురువు నరేంద్రమోడీకి ప్రతి అంశం కరతలామలకము(అరచేతిలో ఉసిరి కాయ వంటిది ). ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు, ఒప్పందాలు తెలియవని అనుకోలేము. తెలిసీ అలా మాట్లాడారంటే ఏమనుకోవాలి? నిబంధన ఏమిటంటే ప్రభుత్వాల దగ్గర ఉన్న ధాన్యాల నిల్వలు ఆహార భద్రతకు సంబంధించినవి, వాటిలో ప్రభుత్వ సబ్సిడీ ఇమిడి ఉంటుంది గనుక వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతి ఉండదు. అలా జరగాలంటే సంస్థ నిబంధనావళిని మార్చుకోవాల్సి ఉంటుంది. నిజంగా మోడీ ఎగుమతిని కోరుకుంటే ముందు మన దేశం తరఫున నిబంధనలను సడలించేందుకు అధికారికంగా ప్రతిపాదనలు పంపాలి, ఆమోదం తీసుకోవాలి. మరి అది చేశారా ? లేకుండా మాట్లాడటం అంటే కొండను ఎత్తి తన తలమీద పెట్టమన్న పిట్టల దొరను గుర్తుకు తెచ్చినట్లు కాదా ! నిబంధనలను సడలించాలని కోరటం ప్రపంచ ఆహార ఆహార కార్యక్రమానికి విరుద్దం. ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి మానవతా పూర్వక సాయంగా అనుమతించాలని మన అధికారులు వాదిస్తున్నారు. దానికి ఎప్పుడైనా అవకాశం ఉంది. కరువులు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు ఎవరి అనుమతి అవసరం లేదు. ప్రతిదేశమూ తనకు తోచినది చేస్తూనే ఉంది.
మేనెల నాలుగవ తేదీన ఐరోపాలోని కోపెన్‌హాగన్‌ నగరంలో ఒక సమావేశానికి హాజరైన ప్రధాని మోడీ అక్కడి భారతీయుల సమావేశంలో మాట్లాడుతూ ఆహార ధాన్యాల్లో భారత్‌ స్వయ సమృద్ధి సాధించిందనీ, ఆకలి నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు మన దేశం ముందుకు వచ్చిందని చెప్పారు. ఇది కూడా అంతే, మోడీగారికి తెలియంది కాదు. ప్రపంచ ఆకలి సూచిక 2013లో 78 దేశాల జాబితాలో మనది 63 కాగా శ్రీలంక 43, నేపాల్‌ 49, పాకిస్తాన్‌ 57వ స్థానాలతో మన కంటే ఎగువన ఉన్నాయి.నరేంద్రమోడీ ఎనిమిదేండ్ల పాలన తరువాత 2021లో 116 దేశాలకు గాను 101వ స్థానంలో దేశాన్ని ఉంచారు. శ్రీలంక 65, మయన్మార్‌ 71, నేపాల్‌, బంగ్లాదేశ్‌ 76, పాకిస్తాన్‌ 92 స్థానాల్లో ఉన్నాయి. ఈ వివరాలన్నీ తెలిసిన తరువాత కూడా ప్రపంచ ఆకలి తీరుస్తామని వేదికల మీద చెప్పటం నరేంద్రమోడీకి తప్ప మరొక నేతకు సాధ్యం అవుతుందా ?


మన జనానికి కావాల్సిన ఆహారం పుష్కలంగా సరిపడా ఉంది అని ఏప్రిల్‌ 13న, స్వయం సమృద్ధి సాధించామని మే నాలుగున చెప్పిన ప్రధాని మాటల కొనసాగింపుగా గతేడాది చేసిన 20లక్షల టన్నులను 2022-23లో కోటి టన్నులకు పెంచి గోధుమలను ఎగుమతి చేసే లక్ష్యాన్ని సాధించేందుకు పూనుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇండోనేషియా,ట్యునీషియా, మొరాకో, ఫిలిప్పీన్స్‌,టర్కీ, థాయిలాండ్‌, వియత్నాం, అల్జీరియా, లెబనాన్‌లకు ప్రతినిధి బృందాలను పంపనున్నట్లు మే 12న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ప్రకటించింది.అంతే కాదు, చైనా, ఈజిప్టు, సూడాన్‌, నైజీరియా,బోస్నియా, ఇరాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు కొన్ని దేశాలకు ఎగుమతులు ప్రారంభమైనట్లు కూడా చెప్పారు. చిత్రం ఏమిటంటే మరుసటి రోజే గోధుమల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. తరువాత సెప్టెంబరు తొమ్మిది నుంచి అమల్లోకి వచ్చే విధంగా బాస్మతేతర బియ్యం ఎగుమతులపై ఇరవైశాతం ఎగుమతి పన్ను విధించటంతో పాటు, కొద్దిగా ముక్కలైన బియ్యం ఎగుమతులపై కూడా పూర్తి నిషేధం విధించారు.పార్‌బాయిల్డ్‌ రైస్‌పై ఆంక్షలు, ఎగుమతి పన్నులు లేవు. ఇరవై శాతం దిగుమతి పన్ను చెల్లించి మన దగ్గర కొనేవారెవరూ ఉండరు. పొమ్మన కుండా పొగబెట్టటమే ఇది. స్వేచ్చా మార్కెట్‌ను సొమ్ము చేసుకోవటం ప్రపంచం, మానవత్వం వంటి సుభాషితాలను విశ్వగురువు ఎలా దిగమింగినట్లు ?


ప్రభుత్వ మాటలు నమ్మి గోధుమ ఎగుమతులకు పూనుకున్న వారికి నిషేధం పెద్ద షాక్‌. విధానాలను తగినంత ముందుగా ప్రకటిస్తే దానికి అనుగుణంగా ఎగుమతిదారులు నిర్ణయించుకుంటారు. ప్రభుత్వ నిర్ణయంతో ఓడలకు ఎక్కించేందుకు వివిధ రేవుల్లో ఉన్న ఐదు లక్షల టన్నుల గోధుమలను ఎగుమతిదార్లు వెనక్కు తీసుకువచ్చి మార్కెట్లో అమ్మేందుకు పూనుకోవటంతో మార్కెట్లో పది-పదిహేనుశాతం ధరలు పడిపోయాయి. దాంతో ఎగుమతిదార్ల వత్తిడికి లొంగి రేవుల్లో నమోదైన మేరకు ఎగుమతులు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తరువులను సవరించింది. మొత్తం మీద రైతులు పెద్ద ఎత్తున నష్టపడ్డారు. ఇప్పుడు బియ్యం ఎగుమతులపై నిషేధం వరి రైతాంగంపై ఎలా ఉంటుందో కొత్త పంట వచ్చిన తరువాత గానీ తెలియదు.


ఏడాది పాటు ఢిల్లీ శివార్లలో సాగిన రైతుల ఉద్యమం సందర్భంగా ప్రభుత్వ పెద్దలు, అతనికంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ప్రభుత్వం కంటే ఎక్కువగా సాగు చట్టాలను సమర్ధించి రైతులను తప్పు పట్టిన పెద్దలు గోధుమ, బియ్యం ఎగుమతులపై ఆంక్షల గురించి నోరు విప్పటం లేదు. స్వేచ్చామార్కెట్‌లో ఎక్కడ ధర ఎక్కువగా ఉంటే అక్కడే అమ్ముకోవచ్చు, రైతులు కూడా నేరుగా ఎగుమతులు కూడా చేసుకోవచ్చు అందుకే మూడు సాగు చట్టాలు అని బల్లలు చరిచి, బట్టలు చించుకొని మరీ చెప్పారు. మరి ఇప్పుడు ఆ అవకాశాలను ఎందుకు అడ్డుకున్నట్లు ? తమ మీద ఉద్యమించినందుకు రైతుల మీద కక్ష తీర్చుకుంటున్నారా ? సరఫరా సమస్యల కారణంగా మనం దిగుమతి చేసుకొనే చమురును చివరికి రష్యా నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాము. బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు, రంగురాళ్లు, ఇతర సరకులేవీ ఆగలేదు. ఎరువులకు కొరత లేదని ప్రభుత్వమే చెబుతున్నది. ఉక్రెయిన్‌-రష్యా మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఆ దేశాల రేవుల నుంచి గోధుమల ఓడలు బయలు దేరినట్లు వార్తలు వచ్చిన తరువాత గోధుమల ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేయకపోగా కొత్తగా బియ్యాన్ని కూడా అడ్డుకున్నారు. మరోవైపున పారిశ్రామిక, సేవా ఉత్పత్తుల ఎగుమతులకు ప్రోత్సాహకాలిస్తున్నారు. రైతులపై ఎందుకీ కత్తి ?


చైనా నుంచి మనం దిగుమతులు , ఎగుమతులు నిలిపివేస్తే షీ జింపింగ్‌ మన కాళ్ల దగ్గరికి వస్తాడని ప్రచారం చేసిన దేశభక్తుల గురించి తెలిసిందే. గాల్వన్‌ ఉదంతాల తరువాత అది మరీ ఎక్కువైంది. దిగుమతులను నిషేధించాలని దేశభక్తిని చూపాలని గగ్గోలు పెట్టారు. నిజానికి తమ ఉత్పత్తులను తీసుకోవాలని మన దేశాన్ని చైనా ఎప్పుడూ కోరలేదు, అడిగితే విక్రయించింది, మన ఎగుమతుల పట్ల కూడా అదే పద్దతి.ప్రపంచంలో ఎక్కడా దొరకని వస్తువు మన దగ్గర ఉండి, అది లేకపోతే చైనాకు రోజు గడవదు అనుకుంటే పరిస్థితి వేరు. అలాంటిదేమీ లేదు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రెండు దేశాల వాణిజ్య లావాదేవీలు 91.2బిలియన్‌ డాలర్లకు చేరినట్లు చైనా ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 16శాతం ఎక్కువ. ఆగస్టులో మన దిగుమతులు 9.95 బి.డాలర్లు కాగా మన ఎగుమతులు 1.49 బి.డాలర్లు మాత్రమే. ఇప్పటికిప్పుడు దిగుమతులను నిలిపివేస్తూ మోడీ సర్కార్‌ ఆదేశాలు జారీ చేస్తే తప్ప ఇంకా నాలుగు నెలలు ఉన్నందున మోడీ సర్కార్‌ మరోకొత్త రికార్డును సృష్టించినా ఆశ్చర్యం లేదు.
ఇక చైనా వ్యతిరేకత,కాషాయ దళాల అపర దేశ భక్తిని పక్కన పెడితే మన దేశ దిగుమతులు-ఎగుమతుల తీరు తెన్నులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆగస్టు నెలలో దిగుమతులు 37శాతం పెరగ్గా ఎగుమతులు ఒకటిన్నర శాతం తగ్గాయి. గతేడాది ఆగస్టులో వాణిజ్యలోటు 11.6 బి.డాలర్లు ఉండగా ఈ ఏడాది 28.7బి.డాలర్లకు పెరగటం అసాధారణ పరిణామం. ఇదే తీరు గనుక కొనసాగితే మన దగ్గర వున్న డాలర్లు హరించుకుపోయి చెల్లింపుల సంక్షోభం తలెత్తవచ్చు. రూపాయి విలువ మరింత పతనం కావచ్చు. రష్యా నుంచి చౌకధరలకు ముడిచమురును ప్రభుత్వ రంగ సంస్థలు దిగుమతి చేసుకుంటే వచ్చే రాయితీ ప్రభుత్వానికి లేదా వినియోగదారులకు దక్కుతుంది. కానీ రిలయన్స్‌ వంటి ప్రైవేటు కంపెనీలు దిగుమతి చేసుకొని మరమ్మతులను కూడా వాయిదా వేసి సొమ్ము చేసుకుంటున్నాయి.


ఇటీవలి సంవత్సరాలలో మన ఆర్ధిక వ్యవస్థ తీరుతెన్నులను చూసినపుడు మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడి చివరి సంవత్సరాలు గుర్తుకు వస్తున్నాయి. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లుగా గత ప్రభుత్వ లోపాలను జనం ముందుంచి విజయవంతంగా సొమ్ము చేసుకున్న నరేంద్రమోడీ, బిజెపి పరివారాలు ఇప్పుడు తమ భవిష్యత్‌ను ఊహించుకొని జాగ్రత్త పడుతున్నాయి. అదే అధిక ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, ముడి చమురు ధరలు.ద్రవ్యోల్బణ అదుపు చర్యల్లో భాగంగానే గోధుమ, బియ్యం ఎగుమతుల నిషేధం, మరికొన్నింటి ఎగుమతులపై ఆంక్షలు. ఇవి స్వయంగా ఇబ్బందులు తెచ్చుకోవటం లేదా చేతులు కాల్చుకోవటమే !