Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఉజ్బెకిస్తాన్‌లోని పురాతన నగరమైన సామరకండ్‌లో 2022 సెప్టెంబరు 15, 16వ తేదీల్లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) వార్షిక సమావేశం జరిగింది. ప్రపంచంలో అతి పెద్దదైన ప్రాంతీయ కూటమి ఇది.యురేసియా (ఐరోపా-ఆసియా ఖండం) లోని 60శాతం విస్తీర్ణం, ప్రపంచ జనాభాలో 40శాతం, ప్రపంచ జిడిపిలో 30శాతం ఉన్న కూటమి ఇది. తొలుత షాంఘై ఐదుగా పిలిచిన రష్యా, చైనా, కజకస్తాన్‌, కిర్ఖిజిస్తాన్‌, తజికిస్తాన్‌ మధ్య 1996లో అవగాహన కుదిరింది, తరువాత దాన్ని 2001లో షాంఘై సహకార ఆర్గనైజేషన్‌గా మార్చారు, అదే ఏడాది ఉజ్బెకిస్తాన్‌ చేరింది. అప్పటి నుంచి క్రమంగా విస్తరిస్తూ ప్రస్తుతం 27 దేశాలు, మూడు సంస్థలతో ఉంది.2006 నుంచి పరిశీలక దేశాలుగా ఉన్న భారత్‌, పాకిస్తాన్‌ 2017లో సభ్య దేశాలుగా చేరాయి. సామరకండ్‌ సమావేశంలో ఇరాన్‌ పూర్తి సభ్య దేశంగా చేరింది. అమెరికా నాయకత్వంలోని కూటమి ప్రపంచ దేశాలను మాతో చేరతారా లేదా మేం చెప్పినట్లు చేస్తారా చస్తారా అన్నట్లుగా ప్రవర్తిస్తున్న పూర్వరంగంలో దానికి భిన్నమైన పద్దతుల్లో అభివృద్ధి,ఆర్ధిక, సాంస్కృతిక సహకారం, సమానత్వం ప్రాతిపదికగా ఐరాస నిరంత అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు పోవాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు ఎస్‌సిఓ సామరకండ్‌ ప్రకటన పునరుద్ఘాటించింది.


ఈ కూటమి ఒక దేశానికి లేదా నాటో వంటి మిలిటరీ కూటములకు వ్యతిరేకంగా ఏర్పడినది కాదు. సోవియట్‌ను విచ్చిన్నం చేసిన తరువాత దానిలోని పూర్వ రిపబ్లిక్‌లు స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. అవి చైనాతో కొత్త సరిహద్దులకు తెరలేపిన పూర్వరంగంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించుకొనేందుకు, మిలిటరీల మధ్య సమన్వయం-విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు, ఉగ్రవాదం తదితర అంశాలపై ఏకాభిప్రాయ సాధనకు గాను చైనా చొరవతో ఏర్పడింది.ప్రధాన కార్యాలయం బీజింగ్‌లో, దాని ప్రధాన కార్యదర్శి చైనీయుడే అయినా ప్రతి ప్రాంతీయ కూటమిలో ఉన్నట్లే కొన్ని దేశాలతో కొన్నింటికి విబేధాలు ఉన్నప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా కలిశాయి. ఈ బృందంలోని దేశాల ఉమ్మడి ఆర్ధికశక్తి అమెరికాకు సమానం.ప్రపంచంలో ఇంకా నిక్షిప్తంగా ఉన్నట్లు అంచనా వేస్తున్న చమురు, సహజవాయు నిల్వల్లో 45శాతం వరకు ఈ దేశాల్లోనే ఉన్నాయి. అనేక ఖనిజాలకు కూడా ఈప్రాంతం పెట్టింది పేరు. మరోవైపు అమెరికా ఆధిపత్యంలోని నాటో కూటమి దేశాల్లో 6,065 అణ్వాయుధాలు ఉండగా, ఈ కూటమిలోని దేశాల్లో 6,928 ఉన్నాయి. అందువలన ఈ కూటమిని విస్మరించటం ఏ విధంగానూ ఏ దేశానికైనా అంత తేలిక కాదు.


ఈ సంస్థలో అమెరికా బాధిత లేదా దాని పెత్తనాన్ని ఎదుర్కొనే దేశాల కారణంగా అమెరికా లేదా పశ్చిమ దేశాల వ్యతిరేక కూటమిగా, తూర్పు దేశాల నాటోగా చిత్రించి జనాలను తప్పుదారి పట్టించి కొన్ని దేశాలను దూరం చేసేయత్నాలు లేకపోలేదు. కూటమి ఏర్పడిన 2001 నుంచీ దీన్ని భూతంగా చిత్రించేందుకు చూసినప్పటికీ అది విస్తరిస్తూనే ఉండటం ఒక ప్రత్యేకత. సంస్థ స్ఫూర్తికి భిన్నంగా తీరు ఉందంటూ వెళ్లిపోయిన దేశమేదీ లేదు. పరిశీలక దేశాలుగా బెలారస్‌, మంగోలియా,ఆఫ్ఘనిస్తాన్‌ , చర్చల భాగస్వాములుగా టర్కీ, శ్రీలంక, కంపూచియా, అజర్‌బైజాన్‌, ఆర్మీనియా, నేపాల్‌ ఇప్పటికే ఉండగా 2023 నుంచి ఈజిప్టు, సౌదీ అరేబియా, కతార్‌లకు అదే స్థాయి కల్పించేందుకు అవగాహన కుదిరింది. ఈ జాబితాలో చేరేందుకు బహరైన్‌, మాల్దీవులు, కువైట్‌, ఐక్యఅరబ్‌ ఎమిరేట్స్‌,మయన్మార్‌లను అంగీకరించారు. బెలారస్‌ శాశ్వత దేశహౌదా పొందనుంది. అతిధులుగా ఐరాస, సిఐఎస్‌, ఆసియన్‌ సంస్థల ప్రతినిధులు, తుర్కిమెనిస్తాన్‌ ప్రతినిధులు ఉంటారు. దీన్ని మరింతగా విస్తరించేందుకు అవకాశం ఉంది. ఉక్రెయిన్‌ వివాదంలో ఒక వైపు మధ్యవర్తిగా ఉంటూనే అమెరికాకు అండగా ఉన్న నాటో కూటమిలోని టర్కీ, తటస్థవైఖరితో ఉన్న భారత్‌, చైనాలు, రష్యాకు పూర్తి మద్దతు ఇస్తున్న ఇరాన్‌, బెలారస్‌ ఈ భేటీలో భాగస్వాములుగా ఉన్నాయి. చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేసిన చతుష్టయ(క్వాడ్‌) కూటమిలో మన దేశం చురుకుగా ఉన్న సంగతి తెలిసిందే. సంస్థలోని దేశాల్లో ఎక్కువ భాగం పశ్చిమ దేశాల విస్మరణ, వివక్షకు గురైనవే కావటంతో కొన్ని అంశాల మీద స్పష్టమైన వైఖరిని ప్రకటించటం తప్ప శత్రుకూటములను గట్టటం, ఘర్షణకు దిగటం, మూడోపక్షానికి ముప్పుతెచ్చే పనికి ఇంతవరకు పూనుకోలేదు.ఇదే దాని విజయ రహస్యం. ఈ దిశగా మరొక ముందడుగు అని చెప్పవచ్చు.


అజెండాలో సంచలనాత్మక లేదా ఇప్పటికే ప్రపంచంలో ఉన్న ఉన్న వైరుధ్యాలను మరింతగా ఎగదోసే విధంగా సామరకండ్‌ సమావేశంలో ఎలాంటి చర్చలూ, పరిణామాలు లేవు. కానీ ఈ సందర్భంగా వివిధ దేశాల నేతల మధ్య జరిగిన విడి విడి సమావేశాల గురించి ఎక్కువగా వార్తలు వచ్చాయి. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించినట్లుగా విశ్లేషణలు, భాష్యాలు వెలువడ్డాయి. ” నేటి యుగం యుద్ద యుగం కాదు, దీని గురించి నేను మీతో ఫోన్లో మాట్లాడినపుడు చెప్పాను ” అని ప్రధాని నరేంద్రమోడీ సామరకండ్‌లో పుతిన్‌తో జరిపిన భేటీలో స్పష్టం చేసినట్లు ఒక వార్త. దీన్ని తీసుకొని ఉక్రెయిన్‌పై భారత వైఖరిలో మార్పు వచ్చిందని, పోరుకు ఇది సమయం కాదని మోడీ చెప్పినట్లుగా, ఇలా చెప్పటానికి ఎంతో ధైర్యం కావాలని అమెరికా మీడియా దానితో జతకలిసే ఐరోపా పత్రికల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మచ్చుకు కొన్ని శీర్షికలు ఇలా ఉన్నాయి. ” ఉక్రెయిన్‌ మీద యుద్దంపై పుతిన్‌కు చివాట్లు పెట్టిన మోడీ ” వాషింగ్టన్‌ పోస్టు, ” ఇది యుద్ధాలకు తగిన సమయం కాదంటూ పుతిన్‌కు చెప్పిన భారత నేత ” న్యూయార్క్‌ టైమ్స్‌. ఇక అమెరికా మంత్రులు, అధికారులు తమవైన శైలిలో మాట్లాడారు. రష్యా దురాక్రమణ ప్రభావాల గురించి ప్రపంచమంతటా ఉన్న ఆందోళనకు ప్రతిస్పందనను మీరు చైనా, భారత్‌ నోట వింటున్నారని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ విలేకర్లతో అన్నాడు. ” మీ ఆందోళన గురించి నాకు తెలుసు, సాధ్యమైన మేరకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాలనే కోరుకుంటున్నాం, కానీ జెలెనెస్కీ సిద్దం కావటం లేదని ” మోడీకి పుతిన్‌ బదులిచ్చినట్లుగా వార్తలొచ్చాయి.


ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తొలి రోజుల్లో అమెరికా అధినేత జో బైడెన్‌ ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్‌ చేసి రష్యా నుంచి చమురు కొనుగోలు పెంచటం తగినపని కాదని చెప్పాడు. తరువాత అమెరికా ఉప భద్రతా సలహాదారు దలీప్‌ సింగ్‌ మాట్లాడుతూ రష్యాకు వ్యతిరేకంగా విధించిన ఆంక్షలను విఫలం చేసేందుకు భారత్‌ చురుకుగా ప్రయత్నిస్తే పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని బెదిరించిన సంగతి తెలిసిందే. దీని మీద దేశాధినేతగా నరేంద్రమోడీ నుంచి ఎలాంటి స్పందన లేదు. గత ఎనిమిది సంవత్సరాల్లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టటానికి, కొత్తగా తంపులు పెట్టటానికి ఇది తగిన తరుణం కాదని నరేంద్రమోడీ ఎన్నడూ అమెరికా కూటమికి ఇంతవరకు చెప్పలేకపోయారు. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని రుద్దింది పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా అన్నది నరేంద్రమోడీకి తెలియని అంశం కాదు, దాని సెగ మన దేశానికి కూడా తాకింది. తన ప్రభుత్వానికీ ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మీడియా ప్రశంసలు కురిపించటంలో ఆశ్చర్యం లేదు. తమ శిబిరంలో ఉంటారనుకున్న మోడీ తటస్థంగా ఉంటారని పశ్చిమ దేశాలు ఊహించలేదు. ఆగ్రహించినా, రెచ్చగొట్టినా, బెదిరించినా, బ్రతిమాలినా ఇప్పటివరకు అదే వైఖరితో ఉన్నారు. నిజానికి పుతిన్‌తో నరేంద్రమోడీ మాట్లాడిన మాటలు శత్రుపూరితం కాదు, అలా మాట్లాడే స్థితిలో కూడా లేరు. అమెరికా శిబిరంలో చేరితే మనకు రష్యా నుంచి వస్తున్న చౌక చమురు వెంటనే ఆగిపోతుంది. అది నిలిచిపోతే అంబానీకి వస్తున్న లాభాలకు గండిపడుతుంది. మన మిలిటరీకి అవసరమైన సాయుధ సంపత్తి, విడిభాగాలు, ఎస్‌-400 వంటి కీలక రక్షణ వ్యవస్థలు నిలిచిపోతాయి. అన్నింటినీ మించి ఆర్ధికంగా అనేక ఇబ్బందులు పెరుగుతున్నందున ఒక పెద్దమనిషి కోరుకున్నట్లుగానే ఉన్నాయి. అయితే ఆ మాత్రం కూడా గత ఆరున్నర నెలలుగా మోడీ నోట వెలువడనందున చూశారా ఇన్ని నెలల తరువాత పుతిన్‌ వైఖరిని భారత్‌ కూడా తప్పు పట్టింది, మనం చేస్తున్నది సరైనదే అని తమ జనాన్ని, తమ మద్దతుదార్లను సంతుష్టీకరించేందుకు అమెరికా పాలకులకు వంతపాడే పత్రికలు చేసిన హడావుడి అది. ఇదే సమయంలో చైనాను పక్కాగా వ్యతిరేకిస్తున్న చతుష్టయ కూటమిలో మోడీ చురుకుగా ఉన్నారు. తటస్థ వైఖరితో రష్యాను మంచి చేసుకున్నట్లుగానే ఆగ్రహిస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మిత్రులనుంచి వస్తున్న వత్తిడిని తట్టుకోలేక వారిని సంతృప్తిపరచేందుకు కూడా మోడీ ఆ మాట చెప్పి ఉండవచ్చు.


ఇది ఒకటైతే చైనా అధినేత షీ జింపింగ్‌ ాపుతిన్‌ భేటీలో ఉక్రెయిన్లో జరుగుతున్నదాని గురించి జింపింగ్‌ ప్రశ్నించినట్లు, ఆందోళన వ్యక్తం చేసినట్లు, మద్దతుపై పునరాలోచనలో పడినట్లుగా కూడా వ్యాఖ్యానాలు వెలువడ్డాయి.” దీని గురించి షి జింపింగ్‌ ప్రశ్నలు, ఆందోళనను మేము అర్ధం చేసుకున్నాం, మా వైఖరిని కూడా వివరించామనుకోండి. దీని గురించి ఇంతకు ముందే మాట్లాడినప్పటికీ మరింతగా వివరిస్తాం ” అని పుతినే చెప్పారు. వీటికి అనుకూలంగానూ ప్రతికూలంగానూ భాష్యం చెప్పవచ్చు. ఏ తీరులో మాట్లాడిందీ విన్నవారెవరూ లేరు. నిజంగా ప్రతికూలంగా చెప్పినా లేదా చైనా వైఖరిలో మార్పు ఉంటే అమెరికా మీడియాలో నరేంద్రమోడీని ఆకాశానికి ఎత్తినట్లుగా షి జింపింగ్‌ను పొగడలేదేం !


ఉక్రెయిన్‌ సంక్షోభ తీరు తెన్నులు, పూర్వరంగాన్ని చూసినపుడు ప్రపంచ భద్రతకు నూతన రూపకల్పన జరగాల్సిన అగత్యం కనిపిస్తున్నది. తనకు దక్కనిదాన్ని ఇతరులకూ దక్కనివ్వను అన్నట్లుగా ఇప్పటి వరకు ఏర్పడిన ప్రపంచ వ్యవస్థలపట్ల సామ్రాజ్యవాదులు వ్యవహరిస్తున్నారు. తన నేతృత్వంలో ఏక ధృవ ప్రపంచాన్ని సృష్టించాలని అమెరికా చూస్తుంటే సర్వజన సంక్షేమం కోసం బహుధృవ ప్రపంచాన్ని రూపొందించాలని దాన్ని వ్యతిరేకించే శక్తులు చూస్తున్నాయి.ఐరాస నిబంధనల మేరకు పాలన సాగాలని కోరుకుంటున్న శక్తులే దాన్ని ఖాతరు చేయటం లేదు, పరస్పర సహకారం, అభివృద్ధి కోసం ఏర్పడిన ప్రపంచబాంక్‌, ఐఎంఎఫ్‌ సంస్థలను ధనిక దేశాలు తమ వస్తువుల మార్కెట్ల కోసం వత్తిడి చేసే, బలహీన దేశాల మీద షరతులను రుద్దే అస్త్రాలుగా మార్చాయి. ప్రపంచ వాణిజ్య సంస్థను రూపొందించిన వారే దాన్ని పక్కన పెట్టి మనం మనం విడిగా చూసుకుందామంటూ ద్విపక్ష వాణిజ్య ఒప్పందాలకు, ప్రాంతీయ కూటముల ఏర్పాటుకు పూనుకుంటున్నాయి. వాటి గత చరిత్రంతా అదే. వలస దేశాల ఆక్రమణ పోరులో ఎనభై సంవత్సరాల పాటు యుద్ధాలు చేసుకున్న స్పెయిన్‌-డచ్‌, 30 సంవత్సరాల జర్మన్‌ యుద్ధాలకు రాజీగా 1648లో అమల్లోకి వచ్చిన వెస్ట్‌ ఫాలియా శాంతి ఒప్పందాన్ని తొలి ప్రపంచ వ్యవస్థకు నాందిగా పరిగణిస్తారు. తరువాత ఐరోపాను ఆక్రమించుకొనేందుకు ఫ్రెంచి పాలకుడు నెపోలియన్‌ ప్రారంభించిన దురాక్రమణలు, దానికి వ్యతిరేకంగా కట్టిన కూటముల మధ్య రెండు దశాబ్దాల పాటు సాగిన పోరు తరువాత 1815 వియన్నా ఒప్పందం జరిగింది. అది కూడా విఫలమై మొదటి ప్రపంచ యుద్దం తరువాత నానాజాతి సమితి ఏర్పాటు, దాన్ని తుంగలో తొక్కిన కారణంగా రెండవ ప్రపంచ యుద్దం పర్యవసానంగా ఐరాస ఏర్పడింది. ప్రత్యక్ష వలసలకు అవకాశం లేకపోవటంతో మార్కెట్ల ఆక్రమణ కోసం తీసుకు వచ్చిందే 1995లో ఏర్పడిన ప్రపంచ వాణిజ్య సంస్థ. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ప్రపంచ బలాబలాల్లో వచ్చిన మార్పులు గతం మాదిరి సామ్రాజ్యవాదులకు అనుకూలంగా మరో వ్యవస్థ ఏర్పాటు అంత తేలిక కాదు.