Tags

, , , , , , ,



ఎం కోటేశ్వరరావు


తన ఆహ్వానాన్ని మన్నించి రాజ్‌భవన్‌ కార్యక్రమానికి రాలేదని, తనను కలవటం లేదని, ప్రోటోకాల్‌ మర్యాదలను మంట గలుపుతున్నారని తెలంగాణా రాష్ట్ర గవర్నర్‌ తమిళశై వాపోవటం, కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి, ఆమె రాజభవన్ను బిజెపి భవన్‌గా మార్చారనే విమర్శలకు గురైన అంశం తెలిసినదే. కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ మరొక అడుగు ముందుకు వేసి స్వయంగా ప్రోటోకాల్‌ను తీసి గట్టున పెట్టి ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ను 2022 సెప్టెంబరు 17న ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంటికి వెళ్లి కలసి వచ్చారు. అంతే కాదు, మరీ ఎక్కువ మాట్లాడితో మరోసారి వెళ్లి కలుస్తా, నా ఇష్టం అంటూ చిందులు వేశారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారమే త్రిసూర్‌లో పదిహేడవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు గవర్నర్‌ కలిసినట్లు అధికారులు చెప్పారని పిటిఐ వార్తా సంస్థ పేర్కొన్నది. తరువాత గవర్నర్‌ విలేకర్లతో మాట్లాడుతూ 2019లో కన్నూరులో తనపై దాడికి యత్నించినవారిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులను ప్రభుత్వం అడ్డుకుంటున్నదని గవర్నర్‌ ఆరోపించారు.


రాజభవన్‌ వెలుపలికి తానుగా వెళ్లి ప్రయివేటు వ్యక్తులను గవర్నర్లు కలిసిన దాఖలా లేదు. 2015లో ఉత్తర ప్రదేశ్‌ రాజభవన్లో నాటి గవర్నర్‌ రామ్‌ నాయక్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ను కలిశారు. వేరే చోట కలిసిన కేరళ గవర్నర్‌ సోమవారం నాడు(19వ తేదీ) తొలిసారిగా విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసిన తన చర్యను సమర్ధించుకోవటమే కాదు, మోహన్‌ భగవత్‌ రాష్ట్రానికి వస్తే మరోసారి వెళ్లి కలుస్తా అని చెప్పారు. తాను అధిపతిగా ఉన్న రాష్ట్రానికి భగవత్‌ వచ్చారు, అసలు ఆయన వస్తున్నట్లు నాకు తెలియదు, తెలియగానే వెళ్లి కలిశాను. మరోసారి గనుక వస్తే తిరిగి కలుస్తాను అంటూ తన చర్య గురించి ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా మాట్లాడారు. దేశ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని తరువాత గవర్నర్‌ వస్తారు. అలాంటి పదవిలో ఉండి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతను వెళ్లి కలవటం మర్యాదలను అతిక్రమించటం కాదా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా ఆర్‌ఎస్‌ఎస్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి వివరించటంతో పాటు తాను వ్యక్తిగతంగా కలసినట్లు సమర్ధించుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలు ఉన్నవారు అనేక రాజభవన్ల పదవుల్లో ఉన్నారు. మీరంతా వారిని కలుస్తున్నారు. అలాంటపుడు రాజభవన్లో ఉన్న వారు ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని కలిస్తే తప్పేమిటంటూ ఎదురుదాడి, కుతర్కానికి దిగారు. తాను కనీసం ఆరుసార్లు ఆర్‌ఎస్‌ఎస్‌ సభలకు వెళ్లానని, ఆ సంస్థతో తనకు ఉన్న అనుబంధం అలాంటిదంటూ దానిలో అసాధారణత ఏముందని ప్రశ్నించారు. సిపిఎం హింసాత్మక భావజాలంతో పని చేస్తున్నదని ఆరోపిస్తూ కేరళలో జరుగుతున్న రాజకీయ హత్యలు తనకు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని గవర్నర్‌ చెప్పుకున్నారు. వాటిలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర కూడా ఉందని విలేకర్లు చెప్పగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ అధికారంలో లేదు, ప్రభుత్వం అలాంటి హింసాకాండను అదుపులో పెట్టాలి అన్నారు.


ఈ పెద్దమనిషి ప్రజాస్వామ్యాన్ని కూడా వద్దంటారు : ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌పై పినరయి విజయన్‌


కమ్యూనిజం విదేశీ సిద్దాంతమంటున్న కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ రేపు ప్రజాస్వామ్యాన్ని కూడా అలాగే తృణీకరిస్తారని కేరళ సిఎం పినరయి విజయన్‌ చెప్పారు. సోమవారం నాడు కన్నూరులో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ పదవి గౌరవాన్ని మంటకలిపి వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష నేతల స్థాయి దిగజారవద్దని గవర్నర్‌కు హితవు చెప్పారు. ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ స్వామిభక్తిపరుడిగా, కమ్యూనిస్టు వ్యతిరేకిగా ప్రవర్తిస్తున్నారని రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని అర్ధం చేసుకోవాలని అన్నారు. రాజ్యాంగపదవిలో ఉండి వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించకూడదన్నారు. వామపక్ష ప్రభుత్వ కమ్యూనిస్టు భావజాలం విదేశీ, ఇక్కడికి తీసుకువచ్చారని, అసమ్మతిని అణచేందుకు హింసను అనుమతిస్తుందని అంతకు ముందు గవర్నర్‌ విలేకర్ల సమావేశంలో ఆరోపించారు.దాన్ని ప్రస్తావించిన విజయన్‌ ఇటలీలోని ఫాసిజం ప్రాతిపదికపై ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉందని దాన్ని అక్కడి నుంచి, కమ్యూనిజం, క్రైస్తవం, ముస్లిం వ్యతిరేకతను హిట్లర్‌ నుంచి అరువు తెచ్చుకున్నారని చెప్పారు. ఈ రోజు కమ్యూనిజం విదేశీ అంటున్న గవర్నర్‌ రేపు ప్రజాస్వామ్యం కూడా అలాంటిదే వద్దంటారని ధ్వజమెత్తారు.


గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ రాజభవన్ను బిజెపి భవన్‌గా దిగజార్చమే కాదు, పార్టీ నేత మాదిరి అవకాశం వచ్చినపుడల్లా ప్రభుత్వం, పాలక సిపిఎం మీద విరుచుకుపడుతున్నారు. 2019 డిసెంబరులో కన్నూరులో తనపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని వెల్లడిస్తానంటూ 2022 సెప్టెంబరు 19న విలేకర్లను రాజభవన్‌కు రప్పించారు. కొండంత రాగం తీసి కీచుగొంతుతో అరచినట్లు ప్రహసన ప్రాయంగా ముగించారు. మూడు సంవత్సరాల నాడు కన్నూరులో జరిగిన భారత చరిత్రకారుల సభలో ప్రారంభ ఉపన్యాసం పేరుతో చేసిన గవర్నర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆ సభలో పాల్గొన్నవారు తీవ్ర నిరసన తెలిపారు. ఆ సందర్భంగా పోలీసులతో తోపులాట జరిగింది.చరిత్రకారుల సభలో సంబంధిత అంశాలు గాకుండా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ(సిఎఎ), ఎన్‌ఆర్‌సికి మద్దతు పలుకుతూ వ్యతిరేకిస్తున్నవారిని విమర్శించటంతో సభలో కొందరు తీవ్రనిరసన తెలిపారు. ఆ సభలో వేదిక మీద ఉన్న ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ గవర్నర్‌ చర్యకు నిరసన తెలుపుతూ ఈ విధంగా మీరు మాట్లాడేట్లయితే గాంధీ బదులు గాడ్సే గురించి చెప్పండనటాన్ని పత్రికలు ప్రస్తావించాయి. తన అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉందంటూ నిరసన తెలుపుతున్నవారితో గవర్నర్‌ వాదులాటకు దిగారు.ఈ తరుణంలో వేదిక మీద ఉన్న సిపిఎం నేత కెకె రాగేష్‌ పోలీసులు-నిరసన తెలుపుతున్నవారి వద్దకు వెళ్లి సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. ఆ దృశ్యాలున్న వీడియో క్లిప్పింగ్‌ను గవర్నర్‌ విలేకర్లకు అందచేశారు.


ఆ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న రాగేష్‌ విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవటం, తనను అవమానించటం,భయపెట్టటం కుట్రలో భాగమని ఆరోపించారు.ఆ సభకు తనను ఆహ్వానించిన కన్నూరు విశ్వవిద్యాలయ ఉపకులపతి గోపీనాధ్‌ రవీంద్రన్‌ కూడా కుట్రలో భాగస్వామే అన్నారు. ఇన్ని సంవత్సరాల తరువాత ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తుతున్నారన్న ప్రశ్నకు తనకు ఇటీవలే నాటి వీడియో దొరికిందని, దాన్లో పోలీసులను అడ్డుకుంటున్న రాగేష్‌ను చూశానని గవర్నర్‌ చెప్పుకున్నారు. ఈ కుట్ర గురించి ఇటీవలే తెలిసిందని కూడా చెప్పారు. అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన ఒక స్నేహితుడు కన్నూరులో ఏం జరగనుందో తమకు ఐదు రోజుల ముందే తెలుసునని చెప్పాడని కేరళ ఇంటిలిజెన్స్‌ ఏం చేస్తున్నదని కూడా అడిగాడంటూ గవర్నర్‌ కథ వినిపించారు. ప్రముఖ చరిత్ర కారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ తనపై హత్యాయత్నం చేశాడని చెప్పటం అతిశయోక్తి కాదా అన్న ప్రశ్నకు గవర్నర్‌ ఇర్ఫాన్‌ హబీబ్‌ను కించపరుస్తూ దూషణలకు దిగి హబీబ్‌ తనను బెదిరించేందుకు, భయపెట్టేందుకు చూశారని ఆరోపించారు. అంతే కాదు అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయరోజుల నుంచి హింసాత్మక చర్యలకు పాల్పడేవారని, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘానికి నాయకుడిగా ఉన్నారని, దెబ్బలాటలకు దిగేవారని అందువలన ఇక్కడ కూడా అదే చేశారని అనుకున్నానని కానీ తరువాత ఒక కుట్ర ప్రకారమే జరిగిందని తెలిసిందని ఆరోపించారు. గవర్నర్‌ ప్రదర్శించిన క్లిప్పింగ్‌ను చూసిన వారెవరికీ ఇర్ఫాన్‌ హబీబ్‌ అనుచితంగా ప్రవర్తించినట్లు ఏమాత్రం అనిపించలేదు.అయితే దాన్ని చూసినపుడు గవర్నర్‌ చేసిన అనుచిత ప్రసంగం హబీబ్‌కు ఆగ్రహం తెప్పించినట్లుగా కనిపించింది.మౌలానా అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ గురించి తప్పుగా ఉటంకిస్తున్నారని దాని బదులు గాడ్సే గురించి చెప్పాలని తన స్ధానం నుంచి లేచి ఇర్ఫాన్‌ హబీబ్‌ అన్నట్లు దానిలో ఉంది. గవర్నర్‌ ఆరోపణలు పసలేని, కట్టుకధలు తప్ప మరొకటి కాదు. ఆ సభలో సంబంధం లేని అంశాలను గవర్నర్‌ మాట్లాడతారని ఎవరికైనా ముందుగా ఎలా తెలుస్తుంది. ఈ పత్రికా గోష్టిలోనే గవర్నర్‌ కమ్యూనిజం మీద, పాలకపార్టీ నేతల మీద నోరుపారవేసుకున్నారు. వారిని ఉగ్రవాదులతో పోల్చారు.


వివాదాస్పద బిల్లులపై తాను ఆమోదం వేసేది లేదని ప్రకటించిన గవర్నర్‌ అదే చేశారు.అసెంబ్లీ ఆమోదించిన పదకొండింటికి గాను ఐదింటి మీద సంతకం చేసి అక్టోబరు మూడు వరకు ఢిల్లీలో ఉండేందుకు బుధవారం నాడు వెళ్లిపోతున్నట్లు ప్రకటించారు. ప్రతిదాని మీద సంతకం చేసేందుకు తాను రబ్బరు స్టాంపును కానని కొద్ది రోజుల క్రితం గవర్నర్‌ ప్రకటించారు. అసెంబ్లీలకు బిల్లులను ఆమోదించే అధికారం ఉంటే వాటిని తన ఆమోదానికి పంపినపుడు అవి రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నదీ లేనిదీ నిర్ణయించే అధికారం తనకు ఉన్నదని అన్నారు. ఒకసారి తిప్పి పంపిన బిల్లులను మరోసారి సవరణలతో లేదా వాటినే తిరిగి అసెంబ్లీ పంపితే వాటిని ఆమోదించటం మినహా మరొక మార్గం గవర్నర్లకు లేదని నిబంధనలు చెబుతున్నాయి. తాజా పరిణామాలను బట్టి ప్రభుత్వంతో లడాయి పెట్టుకొనేందుకు గవర్నర్‌ సిద్దపడుతున్నట్లు స్పష్టం అవుతున్నది.


కాంగ్రెస్‌ జోడో యాత్రలో సావర్కర్‌ చిత్రం !
తనను విడుదల చేస్తే బ్రిటీష్‌ వారికి లొంగి వారి సేవ చేసుకుంటానంటూ లేఖలు రాసి జైలు నుంచి బయపడిన వివాదాస్పద హిందూత్వ నేత విడిసావర్కర్‌ చిత్రాన్ని ఇతర స్వాతంత్య్ర సమరయోధుల సరసన బానర్‌లో పెట్టిన కాంగ్రెస్‌ నిర్వాకం కేరళలో జరిగింది.కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ జోడో యాత్ర బుధవారం నాడు ఎర్నాకుళం జిల్లా ఆలువలో ప్రవేశించినపుడు ఏర్పాటు చేసిన బానర్లలో ఇది ఒకటి. ఈ చిత్రం సామాజిక మాధ్యమంలో వైరల్‌ కావటంతో కాంగ్రెస్‌ నేతలు సావర్కర్‌ బొమ్మ మీద మహాత్మా గాంధీ చిత్రాన్ని అంటించారు. అప్పటికే జరగాల్సిన ప్రచారం జరిగింది. దీనికి చెంగన్మాడ్‌ నియోజకవర్గ ఐఎన్‌టియుసి అధ్యక్షుడు సురేష్‌ కారకుడంటూ అతడిని కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ చేశారు. దీనికి కాంగ్రెస్‌కు లేదా జోడో యాత్ర నిర్వాహకులకు సంబంధం లేదని, స్థానిక కార్యకర్తలు చేసినపని అని కాంగ్రెస్‌ సంజాయి షి చెప్పుకుంది.


అవినీతి కేసులో అడ్డంగా దొరికిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సురేంద్రన్‌ !
ఆదివాసి గోత్ర మహాసభ నేతగా కేరళలో ప్రాచుర్యం పొందిన సికె జాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు, బిజెపి కూటమిలోకి వచ్చేందుకు గాను లంచం ఇచ్చిన కేసులో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్‌ అడ్డంగా దొరికారు. జనాధిపత్య రాష్ట్రీయ సభ పేరుతో 2016లో ఆమె ఏర్పాటు చేసిన పార్టీ అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఏ పేరుతో బిజెపితో కలసి పోటీ చేసింది.ఎన్‌డిఏ నుంచి విడిపోతున్నట్లు 2018లో ప్రకటించింది. తిరిగి 2021 ఎన్నికల్లో తమతో కలసి పోటీ చేయాలని కోరిన బిజెపి ఆమెకు డబ్బు ఇచ్చింది. మంతన్‌వాడి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ తొలి విడతగా పది లక్షలు ఇచ్చారు. ఫోన్లో మాట్లాడారు. మరో పాతిక లక్షలు ఇస్తానని చెప్పారు. ఈ అంశాన్ని జాను సహచరిగా ఉన్న ప్రసీత చెప్పటమే గాక ఆధారంగా ఫోన్‌ సంభాషణ రికార్డులను వెల్లడించారు. దీని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు సురేంద్రన్‌, ఇతరుల గళాలను రికార్డు చేసి ఫోరెన్‌సిక్‌ లాబ్‌ పరీక్షకు పంపారు. బుధవారం నాడు వెలువడిన పరీక్ష నివేదికలో ప్రసీత విడుదల చేసిన రికార్డుల్లో ఉన్న గళం సురేంద్రన్‌ గళం ఒక్కటే అని నిర్ధారణైంది. ఇప్పుడు పోలీసులు చార్జిషీట్లను దాఖలు చేయాల్సి ఉంది. సురేంద్రన్‌పై మరొక అవినీతి కేసు ఉంది. 2016 ఎన్నికల్లో మంజేశ్వరమ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సురేంద్రన్‌ కేవలం 89 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో బిఎస్‌పి తరఫున కె సుంద్ర పోటీ చేసి 467 ఓట్లు తెచ్చుకున్నారు. ఇద్దరి పేర్లు పక్క పక్కనే ఒకే విధంగా ఉండటంతో తనకు పడాల్సిన ఓట్లు సుంద్రకు పడి తాను ఓడినట్లు బిజెపి నేత భావించారు.తిరిగి 2021 ఎన్నికల్లో కె సుంద్ర పోటీకి దిగారు. దాంతో పోటీ నుంచి తప్పుకుంటే కొంత డబ్బుతో పాటు తమ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇల్లు, ఒక వైన్‌ షాపు ఇప్పిస్తానని బిజెపి నేత ప్రలోభపెట్టారు. ఆ ఎన్నికల్లో 1,143 ఓట్ల తేడాతో ఓడారు. తనకు కేవలం రెండున్నర లక్షల నగదు, పదిహేను వేల విలువ గల సెల్‌ ఫోన్‌ మాత్రమే ఇచ్చారని, వాగ్దానం మేరకు ఇతరంగా ఏమీ ఇవ్వలేదని కె సుంద్ర వెల్లడించాయి .దాంతో పోలీసులు అవినీతితో పాటు ఎస్‌సి,ఎస్‌టి వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు.