Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు


చైనాను వెనక్కు నెట్టి అమెరికాతో పోటీ పడే విధంగా దేశాన్ని ముందుకు తీసుకుపోగల సమర్ధుడు ప్రధాని నరేంద్రమోడీ అని ఇప్పటికీ అనేక మంది భావిస్తున్నారు. దాని వలన దేశానికి ఎలాంటి ఉపయోగం లేకున్నా వారి మనోభావాలను గౌరవిద్దాం, అదే సమయంలో ప్రపంచం, దేశంలో జరుగుతున్నదాన్ని గురించి కూడా చెప్పుకుందాం. వారు వింటారా లేదా అన్నది వారికే వదలివేద్దాం. శుక్రవారం నాడు (2022 సెప్టెంబరు 23) ప్రధాని నరేంద్రమోడీ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి చేరింది. లండన్‌లోని ఎక్సేంజ్‌ రేట్స్‌ . ఓఆర్‌జి.యుకె సమాచారం ప్రకారం శుక్రవారం నాడు మన దేశంలో రాత్రి ఎనిమిది గంటలు, లండన్‌లో మధ్యాహ్నం మూడున్నర గంటలపుడు డాలరుకు రూపాయి విలువ రు.81.4101గా ఉంది.( అంతర్జాతీయ మార్కెట్లో ప్రతి క్షణం రేట్లు మారుతూ ఉంటాయి .) సహజంగా ఏ దేశంలో స్టాక్‌మార్కెట్‌ ప్రారంభం-ముగింపు సమయాల్లో ఎంత ఉంటుందో ఆ రోజుకు ముగింపు విలువను పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు మన దేశంలో శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రు.81.11 ఉంది. అంతకు ముందు 81.23కు పతనమైంది. శనివారం నాడు లండన్‌లో తెల్లవారు ఝామున 3.20కి (మన దగ్గర 7.50) రు.81.2485 దగ్గర ఉంది. రానున్న మూడు నాలుగు నెలల్లో అది రు.82- 83 మధ్య ఉంటుందని, తరువాత 85-86కు దిగజారవచ్చని కొందరి అంచనా.

తరలిపోతున్న ఎఫ్‌పిఐ పెట్టుబడులు నిలిచినా, తిరిగి వచ్చినా రు.81-82 దగ్గర స్థిరపడవచ్చని, వర్తమాన ఆర్ధిక సంవత్సరం మిగిలిన రోజుల్లో 79-83 మధ్య ఉండవచ్చని, పరిపరి విధాల ఎవరి జోశ్యం వారిది. ఎవరు చెప్పినా 2014 ఎన్నికలకు ముందు బిజెపి నేతలు చెప్పిన రు.38-48కి పెరగటం గురించి ఎవరూ ప్రస్తావించటం లేదు. ఆర్‌బిఐ ఇప్పటికే రూపాయి పతనాన్ని అరికట్టేందుకు ఇప్పటికే ఆర్‌బిఐ 80బి.డాలర్లను విక్రయి ంచిందని, రూపాయి పతనమైతే దాన్ని వదలివేయటం తప్ప ఆర్‌బిఐకి మరొక మార్గం లేదని కొందరు చెబుతున్నారు. గత ఏడు నెలల కాలంలో గురువారం నాడు ఒక్కరోజే 83పైసలు పతనమైంది. ఎవరేం చెప్పినప్పటికీ ప్రపంచీకరణతో బంధం వేసుకున్నందున మన చేతుల్లో అనేక అంశాలు ఉండవు. ఏం జరుగుతుందనేది ఎవరు చెప్పినా అయితే లేదా కాకుంటే అన్న జాగ్రత్తలతో చెప్పేవే తప్ప మరొకటి కాదు. కొద్ది వారాలుగా చమురు ధరలు తగ్గుముఖం పట్టినందున కొంత మేర ఒకవైపు ఊరట కలుగుతున్నది.మరోవైపు కరెన్సీ విలువ పతనంతో హరించుకుపోతున్నది.


ఆర్‌బిఐ శుక్రవారం నాడు విడుదల చేసిన సమాచారం ప్రకారం గత ఏడు వారాలుగా వరుసగా మన విదేశీమారక ద్రవ్య నిల్వలు పడిపోతూ సెప్టెంబరు 16 నాటికి 545.652 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.2020 అక్టోబరు రెండవ తేదీ తరువాత ఇంత తక్కువగా ఎన్నడూ లేవు. తగ్గటానికి కరెన్సీ మారకపు విలువలో మార్పులు కొంత మేరకు కారణం కాగా రూపాయి విలువ పతనాన్ని అరికట్టేందుకు ఆర్‌బిఐ తీసుకుంటున్న చర్యలే ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు కొందరి అభిప్రాయం. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై నెలలో రూపాయి పతనాన్ని అడ్డుకొనేందుకు ఆర్‌బిఐ 35 బి.డాలర్లను, ఈ మొత్తంలో జూలై నెలలో 19బి.డాలర్లను విక్రయించింది. సెప్టెంబరు ఇరవై మూడవ తేదీన ఒక్క రోజే రెండు బిలియన్‌ డాలర్లను విక్రయించినట్లు వార్తలు. 2021 సెప్టెంబరు మూడవ తేదీన 642.45బి.డాలర్లు మన దగ్గర ఉన్నాయి. విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లటం, మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా పెరగటంతో పాటు మన కరెన్సీ విలువ తగ్గినందువలన కూడా డాలరు నిల్వ కరిగిపోతున్నది.


ప్రపంచ ధోరణులకు అనుగుణంగా రూపాయికి ఏం జరిగితే అది జరుగుతుందని(పాత సినిమాల్లో డాక్టర్లు ఇక ఆ దేవుడిదే భారం అన్నట్లు) వదలి పెట్టటం తప్ప అక్టోబరు-మార్చి నెలల్లో ఆర్‌బిఐ అరకొర తప్ప తీసుకొనే పెద్ద రక్షణ చర్య లేవీ ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకు చేసుకున్న జోక్యం ఫలితాలనివ్వలేదని పతన తీరు సూచిస్తున్నది. విదేశీ మారక ద్రవ్యంగా చెబుతున్న మొత్తంలో అన్నీ డాలర్లే ఉండవు. ఆర్‌బిఐ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం మన దగ్గర ఉన్న 545.652 బిలియన్‌ డాలర్లలో నగదు 484.901 బి.డాలర్లు కాగా బంగారం రూపంలో 38.186, ఎస్‌డిఆర్లు 17.686, ఐఎంఎఫ్‌ వద్ద 4.880బి.డాలర్లు ఉన్నాయి . ప్రస్తుతం దిగుమతులు-ఎగుమతుల అంతరం పెరిగి జిడిపిలో 4శాతానికి కరెంటు ఖాతాలోటు పెరిగినా మొత్తం నిల్వలు 510 బి.డాలర్లకు తగ్గవచ్చని, 2013 మే నెలలో ఉన్న 300 బి.డాలర్లతో పోలిస్తే పరిస్థితి మెరుగేనని కొందరి అభిప్రాయం. పది సంవత్సరాల క్రిందట ఆ నిల్వలు 4.1నెలల దిగుమతులకు సరిపోగా ఇప్పుడున్న నిల్వలు 8.9 నెలలకు వస్తాయని అంచనా. రూపాయి విలువ పతనమైతే మన దేశం నుంచి డాలర్లు వెలుపలికి పోతే విదేశాల్లో ఉన్న మన జాతీయులు డాలర్లను మన దేశానికి పంపుతారు. వాటికి గతం కంటే ఇక్కడ ఎక్కువ రూపాయలు వస్తాయి.


వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మన జిడిపి వృద్ధి గురించి గతంలో వేసిన అంచనాలను క్రమంగా తగ్గించటమే తప్ప స్థిరంగా ఉంటుందని ఏ సంస్థా చెప్పటం లేదు. ప్రస్తుతం ఏడు శాతంగా చెబుతున్నారు, వచ్చే ఏడాది 6.4శాతానికి తగ్గుతుందని అంచనా. ఆర్‌బిఐ వడ్డీ రేట్లను ఇంకా పెంచనుందనే వార్తల పూర్వరంగంలో వృద్ధి రేటు ఇంకా తగ్గేందుకే అవకాశం ఉంది. డాలరు రేటు పెరిగింది తప్ప మన కరెన్సీ విలువ తగ్గలేదని కొందరు వాదిస్తున్నారు. ఉక్రెయిన్‌ మీద సైనిక చర్య జరుపుతున్న రష్యా మీద అమెరికా కూటమి దేశాలు అనేక ఆంక్షలు విధించినా దాని కరెన్సీ రూబుల్‌ విలువ పెరిగింది. మన జిడిపి ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంటే దాని జిడిపి పదకొండవదిగా ఉంది. అలాంటపుడు మన కరెన్సీ విలువ ఎందుకు పెరగలేదు ? జపాన్‌ ఎన్‌ విలువ పెరిగింది, దక్షిణ కొరియా కరెన్సీ వన్‌ పెరిగింది. అందువలన పతనమైన వాటితో చూపి మనదీ అలాగే ఉందని చెబుతామా, మెరుగ్గా ఉన్నవాటితో పోల్చుకుంటామా ? మనకు పతనం కావటమా, పెరగటమా ఏది లాభం. దిగుమతులు ఎక్కువగా ఉన్నందున ఎక్కువ మందికి పెరగటం లాభం. ఎగుమతులు తక్కువగా ఉన్నందున కొందరికి తగ్గటం లాభం.


మన కరెన్సీతో దిగుమతులు చేసుకొనేందుకు కొన్ని దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.దీంతో డాలర్లకు గిరాకీ తగ్గి కొంత వెసులుబాటు కలుగుతుంది తప్ప మనకు కలిగే లబ్ది ఏముంటుంది. ఏ దేశమైనా డాలరుతో పోల్చి దాని బదులు దాని విలువకు సమానమైన రూపాయలు అడుగుతుంది తప్ప రోజు రోజుకు దిగజారుతున్న మన కరెన్సీని స్థిర విలువకు ఎవరూ అంగీకరించరు. మనం ఇతర దేశాల కరెన్సీ తీసుకున్నప్పటికీ ప్రాతిపదిక అదే ఉంటుంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెంచుతున్నారు గనుక అక్కడ పెట్టుబడులు పెట్టినా లేదా ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేసినా మదుపుదార్లకు లాభం కనుక ఇతర దేశాల నుంచి డాలర్లు అమెరికా చేరుతున్నాయి. వడ్డీ రేటు తగ్గితే అంతకంటే ఎక్కువ వడ్డీ వచ్చే దేశాలకు తిరిగి దారిపడతాయి . మన ఆర్‌బిఐ వడ్డీ రేటు పెంచటం వెనుక మతలబు ఇదే. అయి తే అది మన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు, రుణాలు తీసుకొని ఇండ్లు, వాహనాలు కొనుగోలు చేసిన వారి మీద అదనపు భారం మోపుతుంది. డాలర్లు కొని విదేశాల్లో చదువుకొనే వారికి, టూర్లకు వెళ్లే వారికి భారం పెరుగుతుంది. మంచి పనితీరును కనపరచిన ఎనిమిది కరెన్సీలలో మనది ఒకటని విశ్లేషణలు వెల్లడించాయి.దాన్ని పట్టుకొని మన సామర్ధ్యానికి భంగం కలగలేదని బిజెపి నేతలు చెబుతున్నారు. నిజం కావచ్చు, దాని వలన మనకు ఒరిగేదేమిటి ? కేసుపోతేనేం గానీ మన ప్లీడరు భలేవాదించాడు అన్నట్లుగా ఉంది.


ప్రపంచంలో తమ వద్ద డిపాజిట్‌ చేసిన మదుపుదార్లకు బాంకులు వడ్డీ చెల్లించటం తెలిసిందే. కానీ ఐదు దేశాల్లోని బాంకులు తమ వద్ద డబ్బుదాచుకున్న వారి నుంచి ఎదురు వడ్డీ వసూలు చేస్తున్నాయి, వినటానికి చిత్రంగా ఉన్న అది నిజం. పెట్టుబడిదారులు ఏది చేసినా తమ లాభాలకే అన్నది గ్రహిస్తే ఇది కూడా దానిలో భాగమే అన్నది స్పష్టం. బహిరంగ మార్కెట్లో ఉన్న వడ్డీ రేట్ల కంటే మన దేశంలో బాంకుల వడ్డీ రేటు తక్కువ. పెట్టుబడిదార్లకు చవకగా రుణాలు కావాలంటే బాంకులు కావాలి. వాటి దగ్గర డిపాజిట్లు ఉండాలి కనుక మన బాంకులు డిమాండ్‌ను బట్టి వడ్డీ రేట్లను ఖరారు చేస్తాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో అతి తక్కువ వడ్డీ రేట్లు అక్కడి వారికి లబ్ది చేకూర్చేందుకే. వడ్డీ తక్కువ ఉంటే వారి వస్తువుల తయారీ ఖర్చు తక్కువగా ఉండి ప్రపంచ మార్కెట్లో పోటీ పడవచ్చు.ఐదు దేశాల బాంకుల్లో డిపాజిట్‌ చేసిన వారే అవి నిర్ణయించిన మేరకు ఎదురు వడ్డీ చెల్లించాలి. డబ్బు వచ్చేకొద్దీ అవి కూడా రేట్లు మారుస్తూ ఉంటాయి. ఎదురు వడ్డీ స్విడ్జర్లాండ్‌లో 0.75, డెన్మార్క్‌ 0.60, జపాన్‌ 0.1, స్వీడన్‌ 0.25, స్పెయిన్‌0.0 శాతం ఉంది. అనేక ఐరోపా ధనిక దేశాల్లో వడ్డీ రేట్లు నామమాత్రంగా ఉంటాయి. ఇలా ఎందుకు అంటే పొదుపు వద్దు- ఖర్చే ముద్దు అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఖర్చు చేస్తేనే కదా కార్పొరేట్ల వస్తువులు, సేవలకు గిరాకీ ఉండేది, లాభాలు వచ్చేది. జపాన్‌లో ఎలాంటి వడ్డీ లేకుండా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం, బాంకులు రుణాలు ఇస్తాయి. డాలరు దెబ్బకు జపాన్‌ ఎన్‌ కూడా ప్రభావితమైంది. దాంతో 1998 తరువాత తొలిసారిగా గతవారంలో జపాన్‌ రిజర్వుబాంక్‌ రంగంలోకి దిగి తమ కరెన్సీ విలువ పడిపోకుండా, పెరిగేందుకు జోక్యం చేసుకుంది.2011లో ఎన్‌ విలువ పెరగటంతో తగ్గేందుకు లేదా స్థిరంగా ఉండేందుకు చూసింది. ఎగుడు దిగుడులు సహజం, ఇబ్బందులు, పతనాలు తాత్కాలికం అంటూ కొందరి నోట ఉపశమనాలు వినిపిస్తున్నాయి , మంచిదే అంతకంటే కావాల్సింది ఏముంది ? అందుకోసం సమర్ధుడైన నరేంద్రమోడీ చేస్తున్నదేమిటి అన్నదే ప్రశ్న.

.