ఎం కోటేశ్వరరావు
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు గాను పాకిస్తాన్ వద్ద ఉన్న ఎఫ్-16 యుద్ద విమానాలను మెరుగుపరుస్తున్నట్లు అమెరికా చెబితే నమ్మేంత వెర్రి వెంగళప్పలు ఎవరూ లేరని మన విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. అది నిజమే ! అమెరికా పర్యటనలో భాగంగా సెప్టెంబరు 25 ఆదివారం నాడు వాషింగ్టన్ నగరంలో భారతీయుల సమావేశంలో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గౌతముడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయమై బుద్ధుడిగా మారినట్లు చెప్పే అంశం తెలిసిందే. అమెరికా గురించి జైశంకర్ లేదా మన పాలకులకు ఎప్పుడు, ఎలా జ్ఞానోదయమైందో తెలుసుకొనే హక్కు దేశపౌరులందరికీ ఉంది. నిజంగా బుద్ది వికసించిందా లేక ప్రశ్నించేవారిని, అమెరికా వైఖరిని బహిరంగంగా సమర్ధించలేని కాషాయ దళాలను సంతుష్టీకరించేందుకు,ప్రచార అవసరార్ధం అలా మాట్లాడారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఆ మరుసటి రోజే అదే అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో కలసి ఉమ్మడిగా విలేకర్ల సమావేశంలో భద్రతా అంశాలకు సంబంధించి అమెరికా ఎంతగానో అంతర్జాతీయ వైఖరితో వ్యవహరిస్తోందని అదే నోటితో జై శంకర్ ప్రశంసలు కురిపించటం ఎవరిని వెంగళప్పలను గావించేందుకు ?
అమెరికా-ఇరాన్ మధ్య తలెత్తిన వివాదంలో మన మిత్రదేశమైన ఇరాన్నుంచి చమురు కొనుగోలు చేయవద్దని బెదిరిస్తే అమెరికాను సంతుష్టీకరించేందుకు చిత్తం అని నిలిపివేసిన మన పాలకుల ధైర్య, సాహసాలు తెలిసినవే. ఇప్పుడు అదే అమెరికా మరోసారి మన దేశంలో ఉన్న తిబలాజీ పెట్రోకెమ్ అనే పెట్రోకెమికల్ కంపెనీ లావాదేవీల మీద అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది.ఈ కంపెనీ వివిధ దేశాలతో ఉన్న కంపెనీలతో సమన్వయం చేసుకొని ఇరాన్ చమురు, ఇతర ఉత్పత్తులతో లావాదేవీలు నిర్వహిస్తున్నది.ఇరాన్ నుంచి పెట్రోకెమికల్స్‌ను తెచ్చి వాటిని ట్రిలియన్స్ అనే మరో కంపెనీ ద్వారా చైనాకు సరఫరా చేస్తున్న కారణంగా ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా అసలు ఇరాన్ మీద ఏకపక్ష ఆంక్షలు విధించటమే తప్పు, వాటికి ఐరాస ఆమోదం లేదు. భాగస్వామ్యం, స్నేహం పేరుతో అమెరికా పాటలకు నృత్యం చేసేందుకు మనం అంగీకరించి ఇరాన్నుంచి చమురు దిగుమతులను నిలిపివేశాము. ఇప్పుడు దాని కొనసాగింపుగా అది మన దేశంలోని కంపెనీలపై ఆంక్షలు విధించింది. ఎవరో మనల్ని అదుపు చేయటం ఏమిటి, డామిట్ ! మనమే అందరినీ అదుపుచేసే స్థితిలో ఉన్నామని చెప్పుకొనే గిరీశాలు ఏం చేస్తారో చూడాల్సి ఉంది. ఇలా అమెరికా ఆంక్షలకు తలొగ్గితే విదేశాల నుంచి మన దగ్గరకు రావాలనుకొంటున్న కంపెనీలు వస్తాయా ? దేశంలో ఉన్న కంపెనీలు అమెరికా గీచిన గీతల్లోనే నడిచేందుకు పెట్టుబడులు పెడతాయా ?
ఇక మంత్రి జైశంకర్ విమర్శలకు సంబంధించిన అంశాన్ని చూద్దాం. నలభై ఐదు కోట్ల డాలర్ల విలువ గల ఎఫ్-16 విమానాలకు అవసరమైన మెరుగుదల, పరికరాలకు సంబంధించి అమెరికా-పాక్ మధ్య ఒప్పందం కుదిరింది. వాషింగ్టన్ సభలో దీనికి సంబంధించిన ప్రశ్నకు జైశంకర్ బదులిస్తూ చివరకు ఒకరోజు ఎవరైనా వచ్చి ఉగ్రవాద నిరోధం కోసమే ఇదంతా అని చెబుతారు, మీరు చెబుతున్నది ఎఫ్-16 విమానం గురించి కనుక, వాటిని ఎక్కడ మోహరిస్తారో, వాటి ఉపయోగం, సామర్ధ్యం గురించి అందరికీ తెలిసిందే. ఇలాంటి మాటలు చెప్పటం ద్వారా మీరు(అమెరికా) ఎవరినీ వెంగళప్పలను చేయలేరు.” అన్నారు. మరో ప్రశ్నకు బదులిస్తూ పూర్వపు సోవియట్ తరువాత రష్యాతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా 1965 నుంచి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మన దేశానికి అమెరికా ఎలాంటి మిలిటరీ పరికరాలను విక్రయించలేదని, దీనికి రెండు వైపుల నుంచి కారణాలున్నాయని, అణుఒప్పందంతో ఈ పరిస్థితి మారిందన్నారు. ఇప్పుడు మనం అనేక అమెరికా విమానాలు, హెలికాప్టర్లను వాడుతున్నామని, రెండు దేశాల సంబంధాలు ఇంకా పెరుగుతాయని చెప్పారు.
భారత్ – పాక్‌లతో సంబంధాల అంశంలో ఒకదానితో మరొకదానికి సంబంధం లేదని, దేనికదేనంటూ రెండు దేశాలూ తమకు కావలసినవే అని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పాడు. రెండింటితో అవసరాలు వేర్వేరన్నాడు. తమ గడ్డ మీద ఉగ్రవాద నిరోధానికి కృషి చేయటం లేదంటూ డోనాల్డ్ ట్రంప్ 2018లో పాకిస్తాన్‌కు సాయం నిలిపినట్లు ప్రకటించిన తరువాత ఇప్పుడు ఉగ్రవాద నిరోధానికి అనే సాకుతో బైడెన్ యుద్ధ విమానాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటికీ ఇప్పటికీ మారిన పరిస్థితులు ఏమిటో చెప్పటం లేదు. తాము ఇప్పుడు చేస్తున్న సాయంతో ఇప్పటికే పాక్ వద్ద ఎనభైకి పైగా ఉన్న ఎఫ్-16 విమానాలు లేదా వాటి ఆయుధ సామర్ధ్యం పెంచటం లేదని మనలను నమ్మించేందుకు అమెరికా చూస్తున్నది. ఇవి యుద్ధాలకు తప్ప ఉగ్రవాదుల నిరోధానికి పనికి వచ్చేవి కాదు. 2019లో బాలకోట్ దాడుల తరువాత పాకిస్తాన్ వాటిని మన దేశం మీద మోహరించింది. ఒక విమానాన్ని మన దళం కూల్చివేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ విమానాల ద్వారా మాత్రమే సంధించే ఆధునిక క్షిపణి శకలాలను తరువాత మన మిలిటరీ ప్రదర్శించింది.
ఈ ఉదంతాల తరువాత ఈ ఏడాది జరిగిన ఒక సంఘటనకు తాజా ఒప్పందానికి సంబంధం ఉందా అన్నదాన్ని కూడా చూడాల్సి ఉంది.2022 మార్చి 9న మన దేశం రష్యా భాగస్వామ్యంతో రూపొందించిన బ్రహ్మౌస్ సూపర్‌సోనిక్ క్షిపణిని వదిలింది. అది నలభైవేల అడుగుల ఎత్తులో 124 కిలోమీటర్లు వెళ్లి పాకిస్తాన్‌లోని చన్ను అనే పట్ణణ సమీపంలో పడింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దాని గురించి పాకిస్తాన్ వెల్లడించిన తరువాతనే మన దేశం స్పందించి సాంకేతిక లోపంతో వచ్చి మీ గడ్డమీద పడిందని చెప్పింది.తరువాత మరొక ప్రకటనలో మానవ తప్పిదమని పేర్కొన్నది. ఆరునెలల తరువాత ముగ్గురు వైమానిక దళ సిబ్బందిని సర్వీసు నుంచి తొలగించినట్లు ప్రకటించింది. దీన్ని అంగీకరించని పాకిస్తాన్ ఈ ఉదంతం మీద ఉమ్మడి విచారణ జరపాలని ఇది అనధికారికంగా వదిలినదా నిజంగా తప్పిదమా అన్నది తేల్చాలని కోరుతోంది.
అమెరికా తన వ్యూహంలో మన దేశాన్ని ఇరికించేందుకు 1947 నుంచి చూస్తున్నది. చైనాను దెబ్బతీసేందుకు బలమైన సాధనంగా మన దేశం, పశ్చిమాసియాలో తన ఎత్తుగడల అమలుకు పాకిస్తాన్ పనికి వస్తుందన్నది దాని అంచనా. అందుకోసం రెండు దేశాలనూ చెప్పుచేతల్లో ఉంచుకొనేందుకు చూసింది. ఇప్పుడు కూడా వేర్వేరు అంశాలతో అవసరం ఉందని చెప్పటం దానిలో భాగమే. పాక్ భుజం మీద తుపాకి పెట్టి మనలను లొంగదీసుకోవాలని చూసింది. కాశ్మీరు ఆక్రమణకు పాక్‌ను ప్రోత్సహించటం, తరువాత ఉగ్రవాదులను మన మీదకు వదలటం, కాశ్మీరులో చిచ్చు ఇవన్నీ దానిలో భాగమే. మరోవైపు ఆప్ఘనిస్తాన్‌లో అమెరికా పధకాలకు పాకిస్తాన్ ప్రధాన సాధనంగా తాలిబాన్ల సృష్టి, శిక్షణకు కేంద్రంగా మారిన సంగతి తెలిసిందే. మన పాలకవర్గం తనకు ప్రయోజనం కలిగించే విదేశీ, స్వదేశీ విధానాలకే ప్రాధాన్యత ఇవ్వటం, స్వంతంగా తాము కూడా ఎదిగేందుకు సోవియట్‌తో సంబంధాలే మెరుగు అని భావించిన కారణంగానే అది ఉనికిలో ఉన్నంత వరకు అమెరికాకు అవకాశం దొరకలేదు. దాని పతనం తరువాత అమెరికాకు జూనియర్ భాగస్వామిగా ఉంటూ లబ్ది పొందవచ్చని భావించటం, మరొక మార్గం లేకపోవటంతో ఆవైపు మొగ్గింది. ఎప్పుడైతే ఇది జరిగిందో తనకు కావాల్సిన భారత్ దొరికిన తరువాత పాకిస్తాన్‌తో సంబంధాలను కొనసాగిస్తూనే మన దేశంలో ఉన్న పాక్ వ్యతిరేకతను గమనంలో ఉంచుకొని తన ఎత్తుగడలను మార్చుకుంది. మనకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు నమ్మించేందుకు చూసింది.
ఎప్పుడైతే మనతో సంబంధాలను బలపరచుకుంటున్నదో ప్రచ్చన్న యుద్దసమయంలో మన పాలకవర్గం అనుసరించిన ఎత్తుగడను తరువాత పాక్ అనుసరిస్తున్నది. అమెరికాను వ్యతిరేకించే చైనాకు దగ్గర కావటం దానిలో భాగమే. చైనాకు పాకిస్తాన్ అవసరం ఉంది కనుక వచ్చిన అవకావశాన్ని అది అందిపుచ్చుకుంది. ఇది కొత్త పరిణామాలను ముందుకు తెచ్చింది. ఇప్పుడు తన అవసరాలకు భారత్ – పాకిస్తాన్ రెండూ అవసరమే గనుక, మన దేశం తమ బంధం నుంచి తప్పుకొనే అవకాశాలు లేకుండా బిగింపు పూర్తైనట్లు భావిస్తున్న కారణంగా, అంతర్జాతీయ అవసరాల రీత్యా అమెరికా ఇప్పుడు పాకిస్తాన్‌కు తిరిగి తన సాయాన్ని అందిస్తున్నది. నిజానికి దాన్ని ఎన్నడూ వదలిపెట్టలేదు. 1970దశకంలో చైనాతో సంబంధాలు పెట్టుకొనేందుకు అమెరికన్లు పాకిస్తాన్ ద్వారానే కథ నడిపించారన్నది తెలిసిందే. ఇప్పుడు పాకిస్తాన్ను పటిష్టపరచటాన్ని ఎలా చూడాలి. ఉక్రెయిన్ సంక్షోభంలో తటస్థం పేరుతో తమ కూటమిలో చేరనందుకు గుర్రుగా ఉన్న అమెరికా దాన్నే గనుక కొనసాగిస్తే మీ ఇష్టం అని పరోక్షంగా హెచ్చరించటం కూడా కావచ్చు. నరేంద్రమోడీ దాన్ని తట్టుకొని నిలబడగలరా ? ఇది మన దేశం మీద మాత్రమే వత్తిడి అనుకుంటే పొరపాటు, పాకిస్తాన్‌పై చైనా ప్రభావం పెరగకుండా చూసుకోవటం కూడా దీని వెనుక దాగి ఉంది.అమెరికా తన ప్రయోజనాలకే ఎల్లవేళలా పెద్ద పీటవేస్తుంది అని మరచిపోరాదు. ముందే చెప్పినట్లు అటు అమెరికా ఇటు చైనా మద్దతు, సాయం పొందేందుకు పాక్ పాలకవర్గం చూస్తున్నది.
ఎఫ్-16 విమానాలను ఉగ్రవాద నిరోధం కోసం అని అమెరికా ఎందుకు చెబుతున్నది ? టర్కీ, ఇరాన్, ఇరాక్, సిరియాల్లో ఉన్న కర్దులు తాము నివసించే ప్రాంతాలతో కర్దిస్తాన్ ఏర్పాటు కోరుతూ దశాబ్దాల తరబడి పోరాటం చేస్తున్నారు. వారిని ఉగ్రవాదులుగా చిత్రించి అణచేందుకు టర్కీ ఎఫ్ -16 యుద్ధ విమానాలతో వారి ప్రాబల్యం ఉన్న ప్రాంతాలపై దాడులు చేస్తోంది. అంతే తప్ప ప్రపంచంలో ఎక్కడా ఉగ్రవాదులపై దాడులకు వాటిని మోహరించలేదు. పాకిస్తాన్‌కు చేస్తున్న సాయాన్ని సమర్ధించుకొనేందుకు చెబుతున్నసాకు తప్ప మరొకటి కాదు. రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లను అణచేపేరుతో తిష్టవేసిన అమెరికా వాటిని వినియోగించిన దాఖల్లాలేవు. అమెరికా మనకు ఎఫ్ – 16 విమానాలు అమ్మితే పాక్ వైపు నుంచి కూడా జై శంకర్ మాదిరి స్పందనే వస్తుంది. మనం కూడా ఉగ్రవాదుల అణచివేతకే అని చెప్పగలమా ?
మన పక్కలో బల్లెంలా ఉన్న పాకిస్తాన్‌కు అమెరికా సాయం చేస్తుంటే మౌనంగా ఎందుకు ఉన్నారనే ప్రశ్న సహజంగానే తన మద్దతుదార్ల నుంచే నరేంద్రమోడీ సర్కార్‌కు ఎదురౌతుంది. పాకిస్తాన్ మీద విద్వేష ప్రచారంలో తలమునకలైన కాషాయదళాలు ఇబ్బందికర పరిస్ధితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.బహుశా వారి కోసం జైశంకర్ గట్టిగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. ఎవరి అవసరం వారిది. అమెరికా మనకు మరింత దగ్గర అవుతుందని చంకలు కొట్టుకొనే వారి గాలి తీస్తూ అమెరికా ప్రతినిధి మాత్రం రెండు దేశాలు తమకు సమానమనే చెప్పారు తప్ప మనవైపు మొగ్గుచూపలేదు. గతంలో మనకు ప్రాధాన్యత ఇచ్చినట్లు భావించిన పాకిస్తాన్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని అలాంటిదేమీ లేదని స్పష్టం చేసేందుకు ఎఫ్-16 విమానాల మెరుగుదలకు అంగీకరించటం, ఇద్దరూ సమానమే అని చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అవమానకరంగా వెనుదిరిగినప్పటికీ అమెరికా దాన్ని పూర్తిగా వదులుకోదు. అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అందుకు నిఘా సమాచారంతో సహా అన్ని రకాలుగా పాకిస్తాన్ అవసరం ఉంది. ఒసామా బిన్ లాడెన్ తరువాత ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థ నేతగా ఉన్న అల్ జవాహిరీని ఈ ఏడాది జూలై 31న ఆఫ్ఘనిస్తాన్‌లో డ్రోన్ ద్వారా అమెరికా మట్టుపెట్టింది. ఇది పాకిస్తాన్ సాయంతోనే జరిగిందని అందరూ నమ్ముతున్నారు.
అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ ఎలాంటి శషభిషలు లేకుండా సరళంగా సూటిగా చెప్పాడు. భారత్-పాకిస్తాన్లతో భిన్నమైన ప్రాంతాల్లో భిన్నమైన ప్రయోజనాలున్నట్లు చెప్పటమంటే రెండు దేశాలను ఎక్కడ ఎలా అవసరమైతే అక్కడ అలా ఉపయోగించుకుంటామని చెప్పటమే. గతంలో పాకిస్తాన్ అలా ఉపయోగపడిన చరిత్ర ఉంది. మన దేశాన్నీ అదే బాటలో నడిపిస్తారా ? ఐరోపాలో హంగరీ నాటో సభ్య దేశం. ఉక్రెయిన్ సంక్షోభంలో అమెరికా, ఇతర ధనిక దేశాలు విధించిన ఆంక్షలను అది కూడా సమర్ధించింది. తీరా అవి తమ మెడకే చుట్టుకుంటున్నట్లు కనిపించటంతో ఈ ఏడాది ఆఖరు నాటికి ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికాను ఐరోపా అడగాల్సిన తరుణం వచ్చిందని ఆ దేశ ప్రధాని విక్టర్ ఒర్బాన్ పార్లమెంటులో చెప్పాడు. అమెరికా చమురు కంపెనీలు ఈ యుద్ధంతో లాభాలు పొందుతున్నాయని విమర్శించాడు.రష్యాపై ఆంక్షలను కొనసాగించాలా లేదా అన్న అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిపే ఆలోచనల్లో ఉన్నట్లు వార్తలు. మరోవైపున ఈ సంక్షోభం కారణంగా రష్యా నుంచి చౌక ధరలకు చమురును తెచ్చుకుంటున్న మన (దేశం) నరేంద్రమోడీ సామరకండ్ షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో ఇది యుద్దాల యుగం కాదంటూ పుతిన్‌కు చెప్పి అమెరికాను సంతుష్టీకరించేందుకు తెరతీశారు. ఆరునెలల్లో వారు వీరవుతారు అంటే ఇదేనా !