Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


” మనకు విశ్రాంతి లేదు, గెలుపుకోసం గట్టిగా పని చేయాలి. ఇంకా 28 రోజులే గడువు ఉంది ” బ్రెజిల్‌ వామపక్ష నేత లూలా డిసిల్వా అక్టోబరు రెండవ తేదీన జరిగిన ఎన్నికల్లో ప్రధమ స్థానంలో నిలిచినట్లు ఫలితాలు వెల్లడించిన తరువాత ఇచ్చిన పిలుపు, చెప్పిన మాటలవి. లూలా అంతిమ విజేతగా నిలిచేంత వరకు కార్మికులు, కష్టజీవులు రానున్న నాలుగు వారాలూ వీధులను ఆక్రమించాలని(ఎన్నిక కోసం పని చేయాలని) బ్రెజిల్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు లూసియానా శాంటోస్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల నిబంధనావళి ప్రకారం తొలి దఫాలోనే 50శాతంపైగా ఓట్లు సంపాదించి లూలా డిసిల్వా ఎన్నికౌతారనే ఎన్నికల పండితులు, సర్వేలకు భిన్నంగా 48.4 శాతం(5,72,59,405ఓట్లు) లూలాకు రాగా ప్రస్తుత అధ్యక్షుడు, పచ్చిమితవాది బోల్సనారోకు 43.2 శాతం(5,10,72,234 ఓట్లు) రాగా మరో మితవాద పార్టీ నేత టిబెట్‌కు 4.2శాతం(49,15,420 ఓట్లు) వచ్చాయి. మూడవ పక్షం మొత్తంగా బోల్సనారోకు బదలాయించినప్పటికీ స్వల్ప తేడాతో లూలా విజేతగా నిలిచే అవకాశాలున్నాయి. సాధారణంగా అలా జరగదు. ఇవిగాక వామపక్ష వాదినని చెప్పుకొనే సిరో గోమ్స్‌ అనే మరోనేతకు(మూడు శాతం) 36లక్షల ఓట్లు వచ్చా ఇవి లూలా వైపే మొగ్గే అవకాశం ఉంది. ఈ ఓట్ల తీరు తెన్నులను చూసినపుడు పురోగామి వాదులా మితవాదులా అన్నదే గీటురాయిగా ఓటర్లు ఆలోచించారు తప్ప మధ్యేవాదులను పట్టించుకోలేదన్నది స్పష్టం. ఇటీవల జరిగిన లాటిన్‌ అమెరికా ఎన్నికల్లో తొలి దఫా మొదటి స్థానంలో ఉన్నవారే విజేతలుగా నిలిచారు. అయినప్పటికీ ఆ ఖండంలో పెద్ద దేశమైన బ్రెజిల్‌ను వామపక్షాలకు దక్కకుండా తమ శిబిరంలో ఉంచుకొనేందుకు అమెరికా,ఇతర మితవాద శక్తులూ సర్వశక్తులను ఒడ్డుతాయి గనుకనే ఈనెల 30న జరిగే తుది ఎన్నికల వరకు విశ్రమించరాదని, జాగరూకులై ఉండాలన్నదే లూలా(వర్కర్స్‌ పార్టీ), కమ్యూనిస్టు పార్టీ పిలుపుల ఆంతర్యం. పార్లమెంటు ఎన్నికల్లో మొత్తంగా చూసినపుడు మితవాద శక్తులు రెండు సభల్లోనూ మెజారిటీ తెచ్చుకున్నాయి.


వర్కర్స్‌ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, గ్రీన్‌ పార్టీలు కలసి ” బ్రెజిల్‌ విశ్వాసం ” అనే కూటమిగా ఏర్పడ్డాయి. దీనికి మరో ఆరుపార్టీలు మద్దతు ఇస్తున్నాయి. వీటిలోని సోషలిస్టు పార్టీనేత గెరాల్డో ఆల్కమిన్‌ ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నాడు. పార్లమెంటు ఎన్నికల్లో బ్రెజిల్‌ విశ్వాసం కూటమి ఒకటిగా, మిగతా ఆరు పార్టీలు విడిగా పోటీ చేశాయి. మరోవైపు మితవాది బోల్సనారోకు స్వంత లిబరల్‌ పార్టీతో పాటు మరో రెండు పార్టీలు మద్దతుగా నిలిచాయి. మరోసారి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు బ్రెజిల్‌ వెల్లడించింది. తొలి రౌండ్‌లో విజేత లూలా, తుది దఫాలో కూడా మనమే విజేతలంగా ఉండాలని కమ్యూనిస్టు నేత శాంటోస్‌ చెప్పారు. తామింకేమాత్రం విద్వేషాన్ని,విభజన, హింస, ఆకలి, నిరంకుశత్వాన్ని కోరుకోవటం లేదని జనం వెల్లడించారు. అంతిమ విజయం, ప్రజాస్వామ్యం కోసం వీధుల్లోనే ఉండి కృషి చేయాలని శాంటోస్‌ పిలుపునిచ్చారు. వీధులను ఆక్రమించండి, ప్రతి మనిషితో మాట్లాడేందుకు కృషి చేయండి, ప్రజాచైతన్యాన్ని పెంచండని శాంటోస్‌ కోరారు.


తాను గనుక గెలవకపోతే ఫలితాన్ని అంగీకరించేది లేదని అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరి ముందుగానే బోల్సనారో ప్రకటించాడు. రెండవ దఫా పోటీకి అవకాశం కల్పించటంతో ప్రజలు మార్పును కోరుతున్నారని అన్నాడు తప్ప మరొక మాట మాట్లాడలేదు. ఎన్నికలు స్వేచ్చగా జరిగిందీ లేనిదీ తెలుసుకొనేందుకు రక్షణ శాఖ నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ప్రపంచమంతటా ఆసక్తి కలిగించిన ఎన్నికల్లో తనకు అవసరమైన 50శాతం పైగా మెజారిటీ రావటం లేదని స్పష్టం కాగానే తుది దఫా పోరుకు సిద్దం కావాలని ఆదివారం రాత్రే లూలా తన మద్దతుదార్లకు పిలుపినిచ్చాడు. గత ఎన్నికల్లో బోల్సనారో తొలిదఫా మొదటి స్థానంలో 46.03 శాతం ఓట్లు తెచ్చుకోగా రెండో స్థానంలో ఉన్న వర్కర్స్‌ పార్టీ నేత ఫెర్నాండో హదాద్‌కు 29.28 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. తుది దఫా ఎన్నికల్లో వారికి 55.13-44.87 శాతాల చొప్పున వచ్చి బోల్సనారో గెలిచాడు. తొలి దఫా పోలింగ్‌లోనే అతగాడు ఈ సారి దౌర్జన్యకాండకు తన మద్దతుదార్లను పురికొల్పే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు రానున్న నాలుగు వారాల్లో హింసాకాండ చెలరేగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. బోల్సనారో మరింతగా రెచ్చగొట్టటంతో పాటు మిలిటరీ కుట్రకు తెరలేచే అవకాశం ఉన్నట్లు కూడా చెబుతున్నారు.


అన్నీ సజావుగా ఉంటే ఈ ఎన్నికల్లో లూలా గెలిచినప్పటికీ బోల్సనారో, ఇతర మితవాద పార్టీల ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో మెజారిటీలో ఉన్నందున లూలా పధకాలన్నింటినీ ఆమోదించే అవకాశాలు లేవు.లూలాపై మోపిన తప్పుడు కేసులో శిక్ష వేసి జైలుకు పంపి గత ఎన్నికల్లో పోటీలో ఉండకుండా చేసి తరువాత బోల్సనారో ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మాజీ జడ్జి సెర్జీయో ఇతర అనేక మంది పేరు మోసిన మితవాదులందరూ తిరిగి పార్లమెంటుకు వచ్చారు. తొలి దఫా, పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత బోల్సనారో ముప్పు గురించి అనేక మంది హెచ్చరిస్తున్నారు. మేథావి, జర్నలిస్టు తియాగో ఆంపారో మాట్లాడుతూ కరోనా మహమ్మారి సందర్భంగా బోల్సనారో అనుసరించిన విధానాలకు గాను అతన్ని శిక్షించేందుకు ఈ ఎన్నిక తోడ్పడాలని కోరుకున్నారు. అది జరిగేది కాదు, ఈ ఎన్నికల ఫలితాలను చూసిన తరువాత మనం ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకూడదు, వీధుల్లోకి వెళ్లాల్సిన తరుణమంటూ, లేనట్లైతే మరోసారి అంధకార భవిష్యత్‌లోకి వెళతామని అన్నాడు.


తొలి దఫా ఓటింగ్‌లోనే లూలా గెలుస్తాడని వేసిన అంచనాలు ఎందుకు తప్పినట్లు అనే మధనం కొందరిలో ఇప్పుడు ప్రారంభమైంది. సర్వే సంస్థలు పేదలను ఎక్కువగా కలవటం, మితవాద శక్తుల మద్దతుదార్లు స్పందించకపోవటం వలన అంచనాలు తప్పినట్లు ఒక అభిప్రాయం. బోల్సనారోకు 36 లేదా 37శాతం ఓట్లు, లూలాకు 50శాతం పైన ఓట్లు వస్తాయని ప్రముఖ ఎన్నికల పండితులు చెప్పిన లెక్క తప్పింది. ప్రపంచంలో ఇలాంటి లెక్కలు తప్పటం ఇదే మొదటిది కాదు గానీ, బ్రెజిల్‌లో మితవాదులు-పురోగామి వాదుల సమీకరణలు ఇంత తీవ్రంగా ఉండటమే ఆందోళన కలిగించే అంశం. ఇటలీలో పచ్చి ఫాసిస్టు శక్తి అధికారానికి రావటం అనేక దేశాల్లో మితవాదులు బలం పుంజుకోవటం శుభ సూచికలు కాదు.2015లో బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ రావటం ఖాయమన్న సర్వేలు తప్పి మితవాద కన్సర్వేటివ్‌ పార్టీ వచ్చింది. తరువాత ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వేరు పడటం గురించి వెలువడిన అంచనాలు దాదాపు దగ్గరగా ఉన్నాయి.


పార్లమెంటు దిగువ సభ 513 మంది ఉండే ఛాంబర్‌ ఆఫ్‌ డిప్యూటీస్‌లో బోల్సనారో లిబరల్‌ పార్టీ తన స్థానాలను 77 నుంచి 99కి పెంచుకుంది. వామపక్ష ” బ్రెజిల్‌ విశ్వాసం ” కూటమి కూడా గతం కంటే మరో పదకొండు పెంచుకొని 80 గెలుచుకుంది. మొత్తం మీద చూసినపుడు పార్లమెంటు రెండు సభల్లో మితవాద శక్తులు 60శాతం సీట్లతో మెజారిటీగా ఉన్నారు. మొత్తం 27 రాష్ట్రాలలో, ముఖ్యంగా ధనికులు ఎక్కువగా ఉన్న ఎనిమిది చోట్ల మితవాదులే గెలిచారు.మరో ఆరుచోట్ల ఎవరికీ మెజారిటీ రాకపోవటంతో రెండవ సారి ఎన్నికలు జరగాల్సి ఉంది.


ప్రస్తుతం వామపక్ష కూటమి తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అల్కమిన్‌ సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ నేత. గతంలో లూలా పాలన, నాయకత్వం మీద తీవ్ర విమర్శలు చేశాడు. అరెస్టును కూడా సమర్ధించాడు. గతంలో తాను చేసిన ఆరోపణలన్నింటినీ వెనక్కు తీసుకొని వామపక్ష కూటమితో జతకట్టాడు. బోల్సనారో ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ఇలాంటి వారితో పాటు మరికొన్ని శక్తులతో కూడా లూలా ఈసారి రాజీపడినట్లు కొన్ని విమర్శలు, విశ్లేషణలు వచ్చాయి. దేశంలో ద్రవ్యోల్బణం పదిశాతం దాటింది, ధరల పెరుగుదలను అదుపు చేయటంలో విఫలమైనట్లు ఒక సర్వేలో 73శాతం మంది చెప్పారు. అమెజాన్‌ అడవులను వాణిజ్య అవసరాలకు అప్పగించేందుకు సుముఖత చూపటాన్ని ఇంటా బయటా వ్యతిరేకించారు. 2019జనవరిలో అధికారానికి వచ్చిన బోల్సనారో దేశ మిలిటరీ నియంతలను పొగడటం, మహిళలు, ఎల్‌బిజిటిక్యు జనాలమీద నోరుపారవేసుకున్నాడు.

ఎన్నికల ఫలితాలను అంగీకరించేది లేదంటూ బోల్సనారో చేసిన బెదిరింపుల తరువాత మిలిటరీ అప్రమత్తమై 2021జనవరి ఆరవ తేదీన అమెరికా పార్లమెంటుపై మాదిరి దాడి జరిగితే నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని కొన్ని అనధికారిక వార్తలు. వివిధ కార్యక్రమాలతో రూపొందించిన కాలెండర్‌ను ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని విభాగాలను కోరినట్లు, ఒక వేళ అమెరికా మాదిరి పరిణామాలు సంభవిస్తే ఎదుర్కొనేందుకు మొత్తం మిలిటరీని సిద్దం చేస్తున్నట్లు అధికారులు ఇష్టాగోష్టిగా విలేకర్లతో మాట్లాడినపుడు చెప్పారు. ఒక వేల బోల్సనారో తనకు అనుకూలమైన మిలిటరీ అధికారులతో కలసి తిరుగుబాటు చేస్తే సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకే ఈ పిలుపు అని ఒక భాష్యం చెబుతుండగా ఆ పేరుతో బోల్సనారోకు మద్దతు ఇచ్చేందుకు కూడా కావచ్చని కొందరు అంటున్నారు. ఇంత జరిగినా, విముఖత వెల్లడైనా ఊహించినదాని కంటే తొలిదఫా ఓట్లు ఎక్కువగా తెచ్చుకున్నందున బోల్సనారో దేనికైనా తెగించే అవకాశం ఉంది.దేశంలో ఎన్నికల ప్రక్రియ గురించి బోల్సనారో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయించాడని ఒక పోలీసు నివేదిక పేర్కొన్నది. ఫెడరల్‌ పోలీసు కమిషనరే ఈ నివేదికను రూపొందించారు. 2018 ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌లో అక్రమాలు చోటు చేసుకోనట్లైతే తొలి దఫాలోనే తానే గెలిచి ఉండేవాడినని బోల్సనారో చెప్పటం ఎన్నికల వ్యవస్దను కించపరచటమే అని నివేదికలో పేర్కొన్నారు.ఇప్పుడు ఇంకా ఎలాంటి ఆరోపణలు వెలువడనప్పటికీ సాకు కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. అతగాడి తీరుతెన్నులను చూస్తే ఏం జరుగుతుందో చెప్పలేని స్థితి. బహుశా అందుకే 30వ తేదీన రెండవ దఫా ఎన్నికల వరకు వామపక్షాలు వీధులను ఆక్రమించి కుట్రలను ఎదిరించాలని పిలుపు ఇవ్వటం అనుకోవాల్సి వస్తోంది.