Tags

, , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మన దేశ ఆర్ధిక పురోగతి గురించి వివిధ సంస్థలు వెల్లడిస్తున్న జోశ్యాలు గందర గోళం, ఆందోళన కలిగిస్తున్నాయి. మన్మోహానోమిక్స్‌ నుంచి మోడినోమిక్స్‌కు దేశం మారిందని గతంలో అనేక మంది చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే లేదు. మోడినోమిక్స్‌ అంటే నరేంద్రమోడీ మార్గదర్శకత్వంలో అమలు చేస్తున్న ఆర్ధిక విధానం. అనేక మంది పండితులు 2014 నుంచి అమలు జరుగుతున్నది మోడినోమిక్స్‌ అని తేల్చారు. పత్రికలు చదివే పాఠకులు, టీవీలు చూసే వీక్షకులు సంవత్సరం అంటే ఏదీ అని గందరగోళపడుతున్న అంశం మరొకటి. సంస్థలన్నీ ఒకే విధంగా చెప్పటం లేదు. కొన్ని కాలండర్‌(జనవరి నుంచి డిసెంబరు వరకు) మరికొన్ని ఆర్ధిక సంవత్సరం( ఒక ఏడాదిఏప్రిల్‌ నుంచి తదుపరి ఏడాది మార్చి వరకు) అని పేర్కొంటున్నాయి. ఒక విధంగా ఇది కాస్త ఇబ్బంది కలిగించేదే కావచ్చుగానీ ”అసలు విషయం ”లో పెద్ద తేడా ఉండదు.


వర్తమానానికి వస్తే ఐక్యరాజ్యసమితి వాణిజ్యం మరియు అభివృద్ధి కార్పొరేషన్‌(అంక్టాడ్‌) తాజాగా ప్రకటించినదాని ప్రకారం మన దేశ వృద్ధి రేటు కాలండర్‌ సంవత్సరం 2022లో 5.7శాతం, 2023లో4.7 ఉంటుందని ప్రకటించింది. ఆ తరువాత ప్రపంచబాంకు ఆర్ధిక సంవత్సరం 2023(2022-23)లో వృద్ధి రేటు 6.5శాతంఉంటుందని ప్రకటించింది. ఏ సంస్థ చెప్పినా వృద్ధి రేటు ఎంత అంటే సవరించిన ప్రతిసారీ తగ్గించి చెప్పటం తప్ప స్థిరత్వం కనిపించటం లేదు, ఇది నిజంగా ఆందోళన కలిగించే అంశం.అక్టోబరు ఏడవ తేదీన రూపాయి విలువ రు.82.63కు దిగజారి మరో కొత్త రికార్డు నెలకొల్పింది.


2022 ఆగస్టు ఒకటిన లోక్‌సభకు కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి రాతపూర్వకంగా వెల్లడించిన సమాచారం ప్రకారం 2021-22లో వాస్తవ జిడిపి వృద్ది రేటు 8.7శాతమని, కరోనాకు ముందున్న అర్ధిక స్థితికి పూర్తిగా దేశం కోలుకున్నదని, 2019-20 వాస్తవ జిడిపి వృద్ది కంటే 1.5శాతం ఎక్కువని పేర్కొన్నారు. ఇక్కడే ఒక తిరకాసుంది.కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 29న ప్రకటించిన వివరాల ప్రకారం 2019-20 జిడిపి గురించి తొలుత వేసిన అంచనాలన్నింటినీ సవరించి చివరకు వృద్ధి రేటు నాలుగు శాతమని ఖరారు చేశారు. అది కూడా కొత్త సంవత్సరంలో పది నెలల తరువాత అని గమనించాలి. దీని ప్రకారం ఒకటిన్నర శాతం ఎక్కువ అంటే 5.5 కానీ పార్లమెంటుకు 8.7 శాతమని ఎలా చెప్పారు. అంటే ఇది అంచనా మాత్రమే. దీన్ని కచ్చితంగా సవరిస్తారు. 2020-21లో 6.6శాతం తిరోగమనంలో( మైనస్‌) ఉన్నట్లు ప్రభుత్వం ఖరారు చేసింది.


దేశాన్ని సాధారణ పరిస్థితికి తిరిగి తీసుకు వచ్చామని చెబుతున్నారు. కనుకనే జిడిపిలో ప్రపంచంలో ఐదవ స్థానానికి దేశాన్ని పైకి లాగామన్నారు. అంతకంటే కావాల్సిందేముంది. మనం దిగుమతి చేసుకొనే లేదా ఎగుమతి చేసే వస్తువులకు సరఫరా వ్యవస్థల అంతరాయాల్లేవు. గాల్వన్‌ ఉదంతాల పేరుతో కాషాయ దళాలు తాట తీస్తాం,తోలు వలుస్తా అన్న పవర్‌స్టార్‌ మాదిరి ఎంతగా రెచ్చగొట్టినా చైనా మనకు వస్తువులను విక్రయిస్తూనే ఉంది. చైనాతో గత రికార్డులను బద్దలు కొట్టి నరేంద్రమోడీ సర్కార్‌ దిగుమతులు చేసుకున్నట్లు తిరుగులేని ఆధారాలుగా అంకెలున్నాయి. రష్యా నుంచి రికార్డులు సృష్టిస్తూ తక్కువ ధరకు చమురు దిగుమతి చేసుకుంటున్నాము. మన ప్రభుత్వం తీసుకున్న చర్యలు జనానికి కొనుగోలు శక్తిని పెంచిన కారణంగానే పెద్ద ఎత్తున దిగుమతులు జరుగుతున్నట్లు పాలకపార్టీ పెద్దలు వర్ణిస్తున్నారు. కాసేపు అంగీకరిద్దాం ! ఉత్పాదకతతో ముడి పేరుతో ప్రభుత్వం వేల కోట్లు ప్రోత్సాహకాలు ఇస్తున్నా ఎగుమతులు ఎందుకు పెరగటం లేదు ? లేక అదంతా అమిత్‌ షా మార్కు జుమ్లానా ! కార్పొరేట్‌లకు పన్ను తగ్గింపు, ఇతర నజరానాల వలన ఖజానాకు కచ్చితంగా రాబడి తగ్గుతుంది. దాన్ని పూడ్చుకొనేందుకు కొన్ని వస్తువుల మీద జిఎస్‌టి పెంచుతున్నారు. ఇక అప్పుల సంగతి సరేసరి. మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల ఏలుబడి చివరిలో రు.55.87లక్షల కోట్లు (జిడిపిలో 52.16శాతం) అప్పులతో దేశాన్ని నరేంద్రమోడికి అప్పగించారు. దాన్ని 2022 నాటికి 136లక్షల కోట్లకు పెంచారు. 2023 మార్చి నాటికి రు.152.19 లక్షల కోట్లకు పెరుగుతుందని ప్రభుత్వమే అంచనా వేసింది. ఇదంతా అభివృద్ది కోసమే అంటున్నారు, ఇంత చేస్తున్నా వృద్ధి రేటు ఎందుకు తగ్గుతున్నట్లు ? అడిగినా సమాధానం చెప్పేదెవరు ?వివిధ సూచికల్లో ఎక్కడో వెనుక లేదా దిగజారటం తప్ప మెరుగుపడింది లేదు.


నరేంద్రమోడీ తొలిసారి అధికారానికి వచ్చినపుడు కొందరు పండితులు మోడినోమిక్స్‌ అంటూ కొత్త అర్ధాలు చెప్పేందుకు ఎంతగానో కష్టపడ్డారు. కేంద్ర గణాంకశాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం 2004 నుంచి 2020 వరకు దేశ వార్షిక జిడిపి వృద్ధిరేటు 6.8 శాతం ఉంది. మంత్రదండం ఉందని చెప్పిన నరేంద్రమోడీ ఏలుబడిలో 2014 నుంచి 2020వరకు వార్షిక సగటు కూడా 6.8శాతమే ఉంది. మన్మోహన్‌ ఏలుబడి సగటు కూడా అంతే. మోడీ పాలన పది సంవత్సరాల సగటు తగ్గటం తప్ప పెరిగే అవకాశం లేదు. ఇక గృహస్తులు చేసిన ఖర్చును చూస్తే 2004-14 మధ్య జిడిపిలో 10.56శాతం ఉండగా, 2014-20లో 10.61 శాతం ఉంది. ప్రభుత్వ ఖర్చును చూస్తే ఈ కాలంలో 56.54-59.23 శాతాలుగా ఉంది. ఇక చేసిన అప్పులను చూస్తే మాక్రో ట్రెండ్స్‌.నెట్‌ సమాచారం ప్రకారం దేశం వెలిగిపోయింది అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ఎన్నికల బరిలో దిగిన వాజ్‌పాయి ఏలుబడిలో 1998లో జిడిపిలో 50.32 శాతంగా ఉన్న అప్పు 2004 నాటికి 62.59శాతానికి పెరిగింది. అది తరువాత మన్మోహన్‌ సింగ్‌ కాలంలో 2013 నాటికి 50.31 శాతానికి తగ్గింది. స్టాటిస్టా సంస్థ సమాచారం మేరకు 2017లో 69.68 శాతం ఉన్న అప్పు 2020లో 90.06 శాతానికి పెరిగింది.2021 నుంచి 2027 వరకు 86.76 నుంచి 84.18 శాతం మధ్య ఉండవచ్చునని అంచనా. గతంలో రిజర్వు బాంకు పేర్కొన్న ప్రకారం మన పరిస్థితుల్లో దేశ అప్పు జిడిపిలో 61శాతం లోపుగా ఉండాలని పేర్కొన్నది. అప్పులను తగ్గించిన మన్మోహన్‌ కాలంలో, విపరీతంగా పెంచిన మోడీ ఏలుబడిలోనూ సగటు వృద్ధి రేటు ఒకే విధంగా ఉంది.అభివృద్ది కోసమే అప్పులైతే తెచ్చిన అప్పులకు అనుగుణ్యంగా ఖర్చు పెరగలేదు.తేడా ఏమిటంటే మన్మోహనామిక్స్‌ పదేండ్ల కాలంలో మూడు సార్లు అంతకు ముందు సంవత్సరాల కంటే వృద్ధి రేటు తగ్గితే మోడినోమిక్స్‌లో ఏడు సంవత్సరాల్లోనే నాలుగేండ్లు తిరోగమనంలో పడింది. ఎందుకిలా ?


ఇదేమీ సమాధానం లేని అపూర్వ చింతామణి లేదా నువ్వు ఎవరు ప్రశ్న కాదు. జిడిపి ఖర్చులో ఫిక్స్‌డ్‌ గ్రాస్‌ కాపిటల్‌ ఫార్మేషన్‌ అంటే సులభంగా చెప్పుకోవాలంటే పెట్టుబడి 2004-14 సంవత్సరాల్లో 33.38 శాతం ఉండగా అది అచ్చేదిన్‌, గుజరాత్‌ నమూనా వృద్ధిని తెచ్చినట్లు చెప్పుకుంటున్న 2014-2020 మధ్య (కరోనాకు ముందే సుమా) 28.88 శాతానికి పడిపోయింది. పిండి కొద్దీ రొట్టె, పెట్టుబడి కొద్దీ వృద్ధి, కబుర్లతో కడుపునిండదు. వివిధ సంస్థలు మన జిడిపి గురించి వేసిన అంచనాలు- సవరించటంలో అంత తేడా ఎందుకు ఉంటోంది. వాస్తవాలతో నిమిత్తం లేకుండా నరేంద్రమోడీ దగ్గర మంత్ర దండం ఉందని అవి కూడా నమ్మినట్లా ? అంచనాలే గనుక పిసినారి తనం ఎందుకు మోడీని సంతోష పెడదామని అనుకున్నట్లా ? వివిధ సంస్థలు గతంలో వేసిన, తాజాగా సవరించిన అంచనాల వివరాలు ఇలా ఉన్నాయి.
సంస్థ పేరు ×××× గతంలో చెప్పినది×× తాజా అంచనా
ప్రపంచ బాంకు ×× 8.7 ××× 6.5
ఎస్‌ అండ్‌ పి ×××× 00. ××× 7.3
ఫిచ్‌ రేటింగ్స్‌ ×××× 7.8 ××× 7.0
ఇండియా రేటింగ్స్‌×× 7.0 ××× 6.9
ఓయిసిడి ×××× 00 ××× 7.0
అంక్టాడ్‌ ×××× 00 ××× 5.7
ఏడిబి ×××× 7.5 ××× 7.0
ఐఎంఎఫ్‌ ×××× 8.2 ××× 7.4
నొమురా ×××× 5.4 ××× 4.7
ఫిక్కి ×××× 7.4 ××× 7.0
ఎస్‌బిఐ ×××× 7.5 ××× 6.8
క్రిసిల్‌ ×××× 7.8 ××× 7.3
ఆర్‌బిఐ ×××× 7.2 ××× 7.0
ప్రపంచ ఆర్ధిక పురోగతి మందగించటం, దేశంలో వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం పెరుగుదల వలన మన ఎగుమతులకు, ఇతరంగా దెబ్బ అని అందరూ చెబుతుంటే ఆ పరిస్థితి మన దేశానికి సానుకూలమని, ముడి చమురు,ఇతర వస్తువుల ధరలు, పారిశ్రామిక లోహాలు, ఆహార వస్తువుల ధరలు తగ్గుతాయని, వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో వృద్ది రేటు 7.2-7.4 శాతం మధ్య ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్‌ చెప్పారు. అంకెలతో జనంలో గందరగోళం, ఆందోళనకరంగా పరిణామాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు.