Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


” ప్రబల డాలర్‌ ఉరుములతో శాంతి లేని భారత రూపాయి ” అనే శీర్షికతో అక్టోబరు ఏడవ తేదీన రాయిటర్‌ సంస్థ ఒక వార్తను ప్రపంచానికి అందించింది. శనివారం నాడు రూపాయివిలువ 82.82గా ఉన్నట్లు ఎక్సేంజ్‌ రేట్స్‌ అనే వెబ్‌సైట్‌ చూపింది. ఇలా రికార్డుల మీద రికార్డులు నమోదవుతుండటంతో గతంలో సిఎంగా ఉన్నపుడు రూపాయివిలువ పతనం గురించి నిర్దాక్షిణ్యంగా మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను తూర్పారపట్టినది గుర్తుకు వచ్చి ఇప్పుడు నరేంద్రమోడీ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండాలి లేదా దానికి విరుద్దంగా ప్రశాంతంగా ఉండి ఉంటారు. కానీ దేశం, జనం అలా ఉండలేరే !


సెప్టెంబరు 30తో ముగిసిన వారంలో దేశ విదేశీమారక నిల్వలు 532.664 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. ఏడాది క్రితంతో పోల్చితే 110బి.డాలర్లు తక్కువ. 2008 సంక్షోభ తరుణంలో 20శాతం నిల్వలు తగ్గాయి. ఇప్పుడు కొందరు దాన్ని గుర్తు చేస్తున్నారు. తీవ్ర మాంద్య ముప్పు పొంచి ఉండటంతో డబ్బున్నవారందరూ ఇతర కరెన్సీల్లో ఉన్న ఆస్తులన్ని అమ్మి డాలర్లలో దాచుకోవటం మంచిదని కొందరు, బంగారంలో మంచిదని మరికొందరు వాటి వైపు పరుగుతీస్తున్నారు. ఇది కూడా ఆందోళన కలిగించేదే ! అన్నీ ప్రతికూల వార్తలే !!


కేంద్ర ప్రభుత్వం జూలై 11న పార్లమెంటులో అంగీకరించినదాని ప్రకారం గడచిన ఎనిమిది సంవత్సరాల్లో డాలరుతో మారకంలో రూపాయి విలువ రు.16.08(25.39శాతం) పతనమైంది. ఆరోజు మారకపు విలువ రు.79.41గా ఉంది. ఇప్పుడు 83 వైపు పరుగు పెడుతోంది. అన్ని కరెన్సీల విలువలు పడిపోతున్నపుడు మనది ఎలా తగ్గకుండా ఉంటుందని పాలకపార్టీ నేతలు వాదనలు చేస్తున్నారు. ఇతర కరెన్సీలతో విలువ తగ్గలేదంటున్నారు. చైనా యువాన్‌తో కూడా మన కరెన్సీ గత ఐదు సంవత్సరాల్లో రు. 9.8 నుంచి 11.64కు పతనమైంది. మరి ఇదెలా జరిగింది?


అమెరికా ఫెడరల్‌ రిజర్వు మరొక శాతం వడ్డీ రేటు పెంచవచ్చని ముందే సూచించింది. అదే జరిగితే దేశం నుంచి డాలర్లు మరింతగా వెనక్కు పోతాయి. రూపాయి పతనం కొనసాగుతుంది. ఇప్పటికే అంచనాలకు మించిన వేగంతో దిగజారింది. ఆర్‌బిఐ తన దగ్గర ఉన్న డాలర్లను మరింతగా తెగనమ్మవచ్చు. ఎగుమతులు తగ్గటం దిగుమతులు పెరగటం, వాణిజ్యలోటు పెరుగుదలకు దారితీస్తోంది. రాయిటర్స్‌ నిర్వహించిన సర్వేలో పాల్గ్గొన్న ఆర్ధికవేత్తలు, విశ్లేషకులెవరూ సమీప భవిష్యత్‌లో రూపాయి విలువ పెరిగే అవకాశం లేదని, 82కు దిగజారవచ్చని చెప్పగా శనివారం నాడు 83కు చేరువలో ఉంది. డిసెంబరు నాటికి 82-84 మధ్య కదలాడవచ్చని కొందరు చెప్పారు. ఒక వేళ కోలు కుంటే ఆరు నెలల్లో 81.30కి ఏడాదిలో 80.50కి పెరగవచ్చన్నారు. వర్దమాన దేశాల కరెన్సీ విలువ పెరగాలంటే పెద్ద మొత్తంలో వడ్డీ రేట్లు పెంచాలని ఎక్కువ మంది చెప్పారు. అదే జరిగితే పారిశ్రామిక, వాణిజ్య, నిర్మాణ రంగాలు పడకేస్తాయి. ఇప్పటి వరకు విదేశీ వత్తిళ్లకు విదేశీమారక నిల్వలు గురైతే ఇక వడ్డీ రేట్లు కూడా తోడు కానున్నాయి. అక్టోబరులో మన కరెన్సీ విలువ రు.80.17-82.65 మధ్య ఉంటుందని గతనెలలో స్పెక్యులేటర్లు చెప్పగా,అది మొదటి పది రోజుల్లోనే తప్పింది. ఆకస్మికంగా 80.80కి దిగజారవచ్చని చెప్పారు, అది కూడా జరిగింది. స్టాక్‌ మార్కెట్‌ సమాచారం ప్రకారం అక్టోబరు మూడు నుంచి ఏడువరకు రుణ మార్కెట్‌ నుంచి విదేశాలకు వెళ్లిన పెట్టుబడుల మొత్తం రు.2,948 కోట్లు కాగా, స్టాక్‌మార్కెట్‌కు వచ్చిన ఎఫ్‌పిఐ మొత్తాలు రు.2,440 కోట్లు. సెప్టెంబరు నెలలో వెళ్లిన మొత్తం రు.7,624 కోట్లు తప్ప వచ్చినవేమీ లేవు. వర్తమాన సంవత్సరంలో మార్కెట్‌ నుంచి వెనక్కు వెళ్లిన మొత్తం రు.1,72,891 కోట్లు.


మన ఇరుగు పొరుగు దేశాల గురించి తమకు అవసరమైనపుడు పోల్చుకొనే కాషాయ దళాల గురించి తెలిసిందే. ప్రతిదీ నిరంతరం మారుతూనే ఉంటుంది. అక్టోబరు ఏడవ తేదీతో ముగిసిన వారంలో ప్రపంచంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన కరెన్సీగా పాకిస్తాన్‌ రూపీ ఉన్నట్లు ఇండియా అబ్రాడ్‌ న్యూస్‌ సర్వీస్‌(ఐఎఎన్‌ఎస్‌) శనివారం నాడు ఒక వార్తనిచ్చింది. ఐదు పని దినాల్లో డాలరుకు రు. 219.92కు చేరి 3.9శాతం బలపడింది. పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ దేశంలోకి వచ్చే అవకాశం ఉందన్న అంచనా దీనికి కారణంగా పేర్కొన్నారు. పదకొండు రోజులుగా అది బలపడుతూనే ఉంది. జూలై నెలలో రికార్డు కనిష్టంగా 240 నమోదైంది. పాకిస్తాన్‌ దివాలా అంచున ఉన్నట్లు అప్పుడు చెప్పారు.పాక్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న కారణంగా కరెన్సీ కోలుకుందని విశ్లేషకులు చెప్పారు. అక్టోబరు చివరి నాటికి 200కు పెరగవచ్చని ఆర్ధిక మంత్రి ఇషాక్‌ దార్‌ చెప్పారు.దిగుమతులు తగ్గుతుండటం, రానున్న రోజుల్లో 2.3 నుంచి 2.5 బిలియన్‌ డాలర్లవరకు ఏడిబి రుణం ఇవ్వనుందనే వార్తలు పాక్‌ కరెన్సీ విలువ పెరుగుదలకు దోహదం చేస్తోంది. సెప్టెంబరు 20న మన ఒక రూపాయి 2.99 పాకిస్తాన్‌ రూపీకి సమానంగా ఉండగా అక్టోబరు 8వ తేదీకి 2.67కు బలపడింది.


మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో రూపాయి ప్రభుత్వ చేతగాని తనం వల్లనే పతనమైందని ధ్వజమెత్తిన నరేంద్రమోడీ ఇంతవరకు తన పాలనలో పతనం గురించి ఎక్కడా మాట్లాడలేదు. తాజాగా బిజెపి ఎంపీ, మాజీ మంత్రి జయంత్‌ సిన్హా( యశ్వంత సిన్హా కుమారుడు) గతంలో మన కరెన్సీ ఒక్కటే పతనమైందని, ఇప్పుడు మన కంటే ఇతర ప్రధాన కరెన్సీలన్నీ పడిపోతున్నట్లు చెబుతూ గతానికి ఇప్పటికీ పోలికే లేదని సమర్ధించుకున్నారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఇదే వాదనలు చేశారు. కొందరు విశ్లేషకులు కూడా అప్పటికీ ఇప్పటికీ పోలిక లేదనే వాదనలు ముందుకు తెచ్చారు. కాసేపు అది నిజమే అని అంగీకరిద్దాం. అదో తుత్తి అన్నట్లుగా ఉండటం తప్ప మనకు ఒరిగేదేమిటి ? గతంలో ఇతర కరెన్సీలతో కూడా పతనమైనందున మనకు జరిగిన భారీ ఆర్ధిక నష్టం ఎంతో, ఇప్పుడు ఇతర దేశాల కరెన్సీలతో విలువ పెరిగినందువలన వచ్చిన లాభం ఏమిటో బిజెపి పెద్దలు వివరిస్తే వారి వాదనల డొల్లతనం వెల్లడవుతుంది. ఇప్పుడు అన్ని కరెన్సీల విలువలు పడిపోతున్నందున మనకు వస్తువులను అమ్మేవారు డాలర్లను తప్ప మరొక కరెన్సీ తీసుకోరు.


మాక్రోట్రెండ్స్‌ నెట్‌ సమాచారం మేరకు 2004 నుంచి 2013 వరకు పది సంవత్సరాల్లో సగటున మన జిడిపిలో 22.09 శాతం విలువగల వస్తు,సేవల ఎగుమతులు జరిగాయి. 2014 నుంచి 2021వరకు ఎనిమిది సంవత్సరాల సగటు 19.85శాతమే ఉంది. నరేంద్రమోడీ విదేశాల్లో మన ప్రతిష్టను పెంచారని, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా పిలుపులు, ఎగుమతి ప్రోత్సాహకాలు, భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు తెచ్చారని, సులభతర వాణిజ్య సూచికను ఎంతగానో మెరుగుపరిచారని చెప్పిన కబుర్లు, ప్రచారం ఏమైనట్లు ? ఎగుమతుల శాతం ఎందుకు తగ్గినట్లు ? దీనికి కూడా కాంగ్రెస్‌, నెహ్రూ పాలనే కారణమంటారా ?


మా నరేంద్రమోడీ విశ్వగురు పీఠం ఎక్కారు , అందునా పుతిన్‌ -జెలెనెస్కీ మధ్య రాజీకోసం కేంద్రీకరించారు . రూపాయి పతనం గురించి చూసుకోమని నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు గనుక దీన్ని పట్టించుకోలేదు గానీ, ఉక్రెయిన్‌ సంక్షోభం ముగిసిన తరువాత రూపాయి విలువ పెంచటం చిటికెలో పని అని మోడీ మద్దతుదారులు అంటే అనవచ్చు. కాసేపు వారిని సంతుష్టీకరించేందుకు నిజమే అనుకుందాం. ఓకల్‌ ఫర్‌ లోకల్‌ అంటూ స్థానిక వస్తువులనే కొనాలని నినాదమిచ్చిన మోడీ గారు మిగతా దేశాల కరెన్సీలు ఏ గంగలో కలిస్తే మన కెందుకు ముందు లోకల్‌ రూపాయిని రక్షించాలి కదా అని ఎవరైనా అంటే ఉడుక్కోకూడదు మరి !