Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


వృద్దులు, ఆధారం లేని ఇతరులకేనా సామాజిక న్యాయం, పెన్షన్‌, వీధుల్లో తిరిగే ఆవులకూ ఇవ్వాలి కదా అంటున్నారు ఓటు రాజకీయనేతలు. గుజరాత్‌లో ప్రతి పార్టీ పోటీ పడుతోంది. డిసెంబరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మనుషులతో పాటు ఆవులూ పార్టీలను ప్రభావితం చేస్తాయా అని కొందరు చర్చ చేస్తున్నారు. వట్టి పోయిన(పాలివ్వని) ఆవులను గతంలో రైతులు వధ శాలలకు తరలించే వారు, కొంత రాబడి వచ్చేది. కాషాయ మూకలు దిక్కుమాలిన ఆవు రాజకీయాలను రంగంలోకి తెచ్చిన తరువాత అలాంటి ఆవులను అమ్ముకోలేరు, గో గూండాల దాడులకు భయపడి కొనుగోలు చేసే వారూ లేరు. దాంతో రైతులు వాటిని మేపే స్తోమత లేక లేదా నష్టదాయకంగా భావించి వీధుల్లోకి వదలివేస్తున్నారు. అవి ఇబ్బడి ముబ్బడి కావటంతో గుజరాత్‌ హైకోర్టు అనేక సార్లు వాటి గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించింది. దాంతో విధిలేని స్థితిలో బిజెపి ప్రభుత్వం అలాంటి ఆవులను వదలివేసిన వారికి జరిమానా విధించే నిబంధనలతో తీవ్ర చర్చల తరువాత పట్టణాలలో ఆవుల నియంత్రణ బిల్లు-2022ను తేవాల్సి వచ్చింది. మార్చి నెల 31న మెజారిటీ ఓటింగ్‌తో ఆమోదించిన బిల్లుకు నిరసనగా ఆవుల యజమానుల ఆందోళనలు చేశారు. జుమ్లా, వుత్తినే బిల్లు తెచ్చాం తప్ప అమలు జరపం అని ప్రభుత్వం చెప్పినా వారు తగ్గలేదు, ఎన్నికల్లో బిజెపిని బహిష్కరిస్తాం అని అల్టిమేటం ఇచ్చారు. అనేక నియోజకవర్గాల్లో వారి ఓట్లు కీలకం, వాటికి ఎక్కడ గండిపడుతుందో అన్న భయరతో సెప్టెంబరు నెల అసెంబ్లీ సమావేశంలో ఏకగ్రీవంగా వెనక్కు తీసుకున్నారు.


చిత్రం ఏమిటంటే గోమాంసం కోసం ఆవులను తరలిస్తున్నారంటూ గో రక్షకుల ముసుగులో చేసిన దాడుల గురించి దేశంలోనే కాదు ప్రపంచవ్యాపితంగా మన దేశానికి ఎంత పేరు వచ్చిందో తెలిసిందే. అలాంటిది గుజరాత్‌లో గత పది నెలల్లో వీధుల్లో వదిలేసిన ” ఆవులు జరిపిన దాడుల్లో ” 4,860 ఉదంతాల్లో 28 మంది మనుషులు మరణించారని అధికారిక లెక్కలే పేర్కొన్నాయి. ఒక మున్సిపల్‌ కార్పొరేషన్‌తో సహా ఎనిమిది పెద్ద పట్టణాలు, 162మున్సిపాలిటీల్లో ఇవి జరిగాయి. మాజీ ఉపముఖ్య మంత్రి నితిన్‌ పటేల్‌ను పోరుబందరు పట్టణంలో ఒక ఆవు కుమ్మటంతో కాలు విరిగింది. మరుసటి రోజే కొత్త సిఎం భూపేంద్ర పటేల్‌ ఒక ప్రదర్శనలో ఉండగా ఒక ఆంబోతు దాని మీదకు వచ్చింది. వేశ్యా గృహాలకు తరలించే బాలికలను రక్షించి ప్రభుత్వ సంరక్షణ కేంద్రాలలో ఉంచటం తెలిసిందే. కబేళాలకు తరలించే ఆవులను కాపాడేందుకు ఏర్పడిన గో దళాలు రక్షించిన ఆవులను సంరక్షించేందుకు ప్రభుత్వం దాతృత్వ సంస్థలు ఏర్పాటు చేసే 450 గోశాలలకు( అవి ఎవరికి కేటాయిస్తారో చెప్పనవసరం లేదు) 2022-23లో గోమాత పోషణ యోజన కింద ఐదు వందల కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆరునెలలు గడిచినా పైసా విదల్చలేదు. ఈ పధకం కింద గోశాలలో చేర్చిన ప్రతి ఆవుకు రోజుకు 30 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతం గుజరాత్‌లో అమల్లో ఉన్న వున వృద్దాప్యపెన్షన్‌ పధకం కింద 60ఏండ్లు దాటిన వృద్ధ కుటుంబాలకు నెలకు రు.400, ఎనభై ఏండ్లు దాటిన వారికి రు.700 ఇస్తున్నారు. ఎన్నికల కోసం ఈ మొత్తాలను రు.1000-1250గా పెంచుతామని 2022-23 బడ్జెట్‌లో పేర్కొన్నారు.


ఆవులను గాలికి వదిలేస్తే జరిమానా వేస్తామంటే ఆవుల పెంపకందార్లు ఆగ్రహించారు. ఆ బిల్లును ఎత్తివేసి గోశాలల్లో చేర్చిన ప్రతి ఆవుకు నెలకు రు.900 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో ఇప్పుడు గోశాలల నిర్వాహకులు ప్రభుత్వం మీద ధ్వజమెత్తుతున్నారు. ఈ కేటాయింపు నిధులు వెంటనే ఇవ్వాలని, ఇది ఒక ఏడాదికి పరిమితం చేయకూడదని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో 1,700 గోశాలలు ఉండగా 450కి మాత్రమే అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఆవుల పెంపకందార్లు వట్టిపోయిన వాటిని వదలి వేస్తే ఇప్పుడు గోశాల నిర్వాహకులు ఆందోళనకు దిగి నిరసనగా గోశాలల్లో ఉన్న ఆవులన్నింటినీ వీధుల్లోకి వదలాలని చూస్తున్నారు. గత నెలాఖరులో వనస్కాంత జిల్లాలోని వీధులు, ప్రభుత్వ ఆఫీసుల్లోకి వదిలారు. తదుపరి ఆందోళనలో భాగంగా జిల్లా, తాలూకా ప్రభుత్వ ఆఫీసుల్లో గోమూత్రం, పేడ చల్లుతామని ప్రకటించారు.


గతంలో గోశాలల్లోని ప్రతి ఆవుకు రోజుకు రు.8 సబ్సిడీ ఇచ్చే పధకాన్ని 2001లో నరేంద్రమోడీ సిఎం కాగానే నిలిపివేశారని పదివేల మంది గోశాల ట్రస్టీల ప్రతినిధి కిషోర్‌ శాస్త్రి చెప్పారు. ఇటీవలి సంవత్సరాలలో ఉత్తర గుజరాత్‌లో తీవ్ర వరదలు వచ్చినపుడు ఒక్కో ఆవుకు రు.25 చొప్పున కేవలం రెండు-మూడు నెలలు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. రాజస్తాన్‌లో అశోక్‌ గెహ్లట్‌(కాంగ్రెస్‌) ప్రభుత్వం రోజుకు ప్రతి ఆవుకు రు.50 ఖర్చు చేసిందని, ఉత్తరాఖండ్‌ సర్కార్‌ 1000 గోశాలలను నిర్వహిస్తుండగా గోమాత మీద ప్రమాణం చేసి అధికారానికి వచ్చిన గుజరాత్‌ బిజెపి ప్రభుత్వం వార్షిక బడ్జెట్లను ఎందుకు కేటాయించదని శాస్త్రి ప్రశ్నించారు. వివిధ కోర్టులు ఇచ్చిన ఆదేశాల మేరకు వీధుల్లో తిరుగుతున్న ఆవులను పట్టుకొని దీశా-రాజపూర్‌ గోశాల వంటి వాటికి తరలించిన ప్రభుత్వానికి వాటి సంరక్షణ పట్టదా అని ప్రశ్నించారు. అక్కడ ఉన్న 8,900 ఆవుల్లో సగం ప్రభుత్వ పంపినవే అన్నారు. పోలీసులు పట్టుకున్న వస్తువులను కూడా అలాగే ఎక్కడో ఒక చోట పడవేస్తున్నారా అని కూడా ప్రశ్నించారు. పట్టణీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రాలలో గుజరాత్‌ ఒకటి. పరిశ్రమలు, పట్టణాల విస్తరణలో భాగంగా గ్రామాలు వాటిలో కలిసిపోతున్నాయి. ఆవులు, ఇతర పశువుల మేతకు గ్రామాల్లో ఉన్న గడ్డి భూములను కూడా పరిశ్రమలు, గృహనిర్మాణాలకు కేటాయిస్తుండటంతో పశువుల మేత కొరత ఏర్పడింది. దాంతో మరొక దారిలేని పెంపకందార్లు వాటిని వదలివేస్తున్నారు. పట్టణాల్లో ఇది సమస్యలకు దారి తీస్తున్నది.


గుజరాత్‌లో ఆవుల పెంపకందార్లను మాల్దారీలని పిలుస్తారు. సంతుష్టీకరణలో భాగంగా, వారి ఓట్ల కోసం ప్రతి పార్టీ, నేత ఆవుల మీద ప్రేమ ఒలకబోస్తారు. అసెంబ్లీలోని 182 స్థానాలకు గాను 46 చోట్ల ఈ సామాజిక తరగతికి చెందిన వారు సమీకరణలను తారు మారు చేస్తారని అంచనా. సంతుష్టీకరణ రాజకీయాలకు బద్ద వ్యతిరేకమని, కాంగ్రెస్‌ను నిరంతరం విమర్శించే ప్రధాని నరేంద్రమోడీ దీనికి మినహాయింపు కాదు.ఎక్కడైతే ప్రభుత్వానికి నిరసనగా ఆవులను ప్రభుత్వ ఆఫీసుల్లోకి వదిలారో అదే వనస్కాంత జిల్లాలోని అంబాజీలో సెపెంబరు 30 న నరేంద్రమోడీ ముఖ్యమంత్రి గోమాత పోషణ యోజన పథకాన్ని ప్రారంభించారు.ఆగస్టు నెలలో బిజెపి ఆధీనంలోని సూరత్‌ మునిసిపల్‌ అధికారులు అనుమతి లేని ఆవుల షెడ్లంటూ 222 కట్టడాలను కూల్చివేశారు. వెంటనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సిఆర్‌ పాటిల్‌ రంగంలోకి దిగి మాల్దారీ సమాజానికి జోలపాడారు. కూల్చివేతలను నిలిపి వేయించారు. ఎన్నికల రాజకీయమంటే ఇదే, అధికారులతో కూల్చివేయిస్తారు, తరువాత వచ్చి నిలిపివేసినట్లు కనిపిస్తారు. గుజరాత్‌ ప్రభుత్వం మాల్దారీల కోసం కామధేను విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నదని, ఆవు మూత్రం, పేడ, పాలు, నెయ్యి గురించి అక్కడ పరిశోధనలు చేస్తారని బిజెపి మాల్దారీ విభాగ నేత సంజయ దేశాయి చెబుతున్నారు.


ఆవు రాజకీయంలో కాంగ్రెసేమీ తక్కువ తినలేదు. గతంలో పశు సంవర్ధన గురించి పేర్కొన్నప్పటికీ తొలిసారిగా ఆవు సంరక్షణ గురించి ఎన్నికల ప్రణాళికలో చేర్చారు. ఆవు పాలకు లీటరుకు ఐదు రూపాయలు అదనంగా చెల్లిస్తామని, రాజస్తాన్‌ పధకాలను అమలు జరుపుతామని పేర్కొన్నారు. బిజెపి, కాంగ్రెస్‌లను వెనక్కు నెట్టి అధికారాన్ని పొందుతామని చెబుతున్న ఆమ్‌ఆద్మీ పార్టీ తక్కువ తినలేదు. తమకు అధికారమిస్తే రోజుకు ప్రతి ఆవుకు రు.40ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఢిల్లీలో ఇస్తున్నట్లు అరవింద కేజరీవాల్‌ చెప్పారు. లంపీ వైరస్‌ కారణంగా గుజరాత్‌లో లక్షకు పైగా ఆవులు మరణించినా ప్రభుత్వం కదల్లేదని తాము వాక్సిన్లు వేస్తామని గుజరాత్‌ ఆమ్‌ ఆద్మీ నేత సుదాన్‌ గధ్వీ ప్రకటించారు. గుజరాత్‌లో రు.40 ఇస్తామని ప్రకటించిన కేజరీవాల్‌ ఢిల్లీలో రు.20 మాత్రమే ఇస్తున్నారని, మరో రు.20 తమ ఏలుబడిలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ చెల్లిస్తున్నదని చెప్పిన బిజెపి ఢిల్లీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రు.40 చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నది.


గుజరాత్‌ దసరా సందర్భంగా నవరాత్రి ఉత్సవాలకు పెట్టింది పేరు. గర్బా పేరుతో పెద్ద ఎత్తున నృత్యం చేస్తారు. ఈ సందర్భంగా ప్రతిపార్టీ రాజకీయాలు చేసింది. పంజాబ్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ సిఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌ గర్బా డాన్సు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ అంబాజీలో ఆవు పూజ చేశారు. ఆరు నెల్లనాడు ప్రకటించిన పధకాన్ని ఎన్నికల ముందు ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల్లో బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చి ఆ పార్టీకి లబ్ది చేకూర్చేందుకు చూసిన మజ్లిస్‌ పార్టీ గుజరాత్‌లో కూడా అదే పని చేసేందుకు అక్కడ పోటీలో ఉంటానని ప్రకటించిందనే విమర్శలు వచ్చాయి.