Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


కొందరు వర్ణిస్తున్నట్లు ఉక్రెయిన్లో అసలైన పోరు ఇప్పుడే ప్రారంభమైందా లేక మరో పెద్ద మలుపు తిరిగిందా ? రోజులు గడిచే కొద్దీ కొత్త సందేహాలు, సమస్యలు. తాజా పరిణామాలను ఉక్రెయిన్‌ – రష్యా సంక్షోభ పునరుద్భవంగా కొందరు పేర్కొన్నారు. అసలేం జరగనుంది అనే ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు 231 రోజుల తరువాత కూడా కొనసాగుతూనే ఉన్నాయి.గత కొద్ది వారాలుగా ఎలాంటి దాడులు లేవు. కొన్ని ప్రాంతాల నుంచి పుతిన్‌ సేనలు వెనక్కు వెళ్లాయి.నాలుగు ప్రాంతాల పౌరులు కోరుకున్నట్లుగా వాటిని రష్యా విలీనం చేసుకున్నట్లు ప్రకటించిన తరువాత విమర్శలు తప్ప పెద్ద పరిణామాలేవు. అలాంటిది ఒక్కసారిగా సోమ, మంగళవారాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉక్రెయిన్‌ అంతటా అనేక పట్టణాలపై పెద్ద ఎత్తున రష్యా క్షిపణి దాడులు జరిగాయి. అనేక పట్టణాల్లో అంధకారం అలుముకుంది. వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పించాలని ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ పశ్చిమ దేశాలను వేడుకున్నాడు. మిలిటరీ వ్యవస్థలతో పాటు విద్యుత్‌ కేంద్రాలపై సోమ, మంగళవారాల్లో పుతిన్‌ దళాలు కేంద్రీకరించాయి. రాజధాని కీవ్‌లోని కొన్ని కీలక కేంద్రాలపై క్షిపణిదాడులు జరిగినా జెలెనెస్కీ నివాసం, అధికార కేంద్రాలపై ఇంతవరకు గురిపెట్టలేదు. ఇక ముందు అది జరగదని చెప్పలేము. ఇదంతా ఎందుకు అంటే !


అక్టోబరు 8 తేదీ శనివారం నాడు రష్యా క్రిమియా ద్వీపకల్పంలోని క్రిమియా లేదా కెర్చ్‌ వంతెన మీద పెద్ద పేలుడు జరిగింది. ఐదుగురు మరణించారని వార్తలు. ఉదయం ఆరు గంటలపుడు (మన కాలమానం ప్రకారం 9.30 గంటలు) ఈ ఉదంతం జరిగింది. ఉక్రెయిన్‌ ఉగ్రవాద ఆత్మాహుతి దళం తాము తెచ్చిన ఒక కారు, ట్రక్కును పేల్చివేసినట్లు ఒక కథనం కాగా, వంతెన కింద ఉన్న సముద్ర జలాల్లోనుంచి వచ్చిన ఒక అస్త్రంతో పేల్చివేసినట్లు మరొక విశ్లేషణ. ఈ ఉదంతం జరిగినపుడే ఉక్రెయిన్‌ మిలిటరీకి అమెరికా సరఫరా చేసిన ఒక మానవరహిత పడవ రష్యా ఓడరేవు సమీపంలో కనిపించటంతో ఈ అనుమానం తలెత్తింది. ఎలా జరిగిందనేది ఇంకా నిర్ధారణగాకున్నా పేలుడు జరిగింది. దానికి ప్రతి స్పందనగా సోమవారం నాడు వివిధ పట్టణాల మీద రష్యా త్రివిధ దళాల క్షిపణుల దాడి ప్రారంభమైంది. ఈ దాడిలో అనుమానితులుగా ఐదుగురు రష్యన్‌, ముగ్గురు ఉక్రేనియన్‌, ఆర్మీనియన్‌ పౌరులను అరెస్టు చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది.


ఈ వంతెన మీదుగా వెళ్లే ప్రతి వాహనం ఒక పెద్ద స్కానర్‌ గుండా వెళుతుంది. వాటిలో ఒకవేళ పేలుడు పదార్ధాలు ఉంటే వెంటనే తెలుసుకోవచ్చు. దాన్ని తప్పించుకొని వాహనాలు వెళ్లాయా, అప్పుడు అది పని చేయలేదా, తనిఖీలోపమా, విద్రోహమా లేక సముద్ర జలాల్లో నుంచి వచ్చిన ఏదైనా పడవ నుంచి పేలుడు జరిపారా అన్నది తేలాల్సి ఉంది. గతంలో అనేక మార్లు ఉక్రెయిన్‌ అధికారులు వంతెనలను పేల్చివేస్తామని ప్రకటించారు.జూలై నెలలో జెలెనెస్కీ సలహాదారు అరెస్తోవిచ్‌ త్వరలో తమ మిలిటరీ దాడి చేస్తుందని చెప్పాడు. వంతెనల మీద దాడి చేసినందుకు బహిరంగంగా ఎస్తోనియా విదేశాంగ మంత్రి అభినందనలు తెలిపాడు.ఈ దాడి వెనుక ఉక్రెయిన్‌ ప్రత్యేక కార్యకలాపాల దళపు హస్తం ఉందని కూడా చెప్పాడు. గత కొద్ది సంవత్సరాలుగా సిరియా, ఇతర ఇస్లామిక్‌ తీవ్ర వాదులను జెలెనెస్కీ సర్కార్‌ చేరదీస్తున్నదని, వారు ఐరోపా సమాఖ్య దేశాల్లో తిరిగేందుకు ఎలాంటి వీసాలతో నిమిత్తం లేకుండా చూసేందుకు ఉక్రెయిన్‌ పాస్‌పోర్టులు ఇచ్చారని, ఆ ఆత్మాహుతి దళాలతో పేలుడుకు పాల్పడి ఉండవచ్చని కొందరు అంటున్నారు.
వంతెన మీద పేలుడుతో సంబంధం లేకుండానే తమపై దాడికి ముందుగానే రష్యా పధకం వేసిందని ఉక్రెయిన్‌ ఆరోపించింది. వంతెన పేలుడు గురించి మౌనంగా ఉన్న అమెరికా, ఇతర దేశాలూ మరోవైపు క్షిపణి దాడులను ఖండిస్తూ విమర్శలకు దిగాయి. పుతిన్‌ సేనలను, రష్యాను దెబ్బతీయాలంటే ఎక్కువ దూరం ప్రయాణించి రష్యా మీద బాంబులను కురిపించే క్షిపణులను తమకు ఇవ్వాలని ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ అమెరికా, ఇతర నాటో దేశాలను కోరుతున్నాడు. అందుకు గాను పుతిన్ను మరింత రెచ్చగొట్టే ఎత్తుగడలో భాగంగా క్రిమియా వంతెన పేల్చి వేతకు పధకం వేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అది ఎంతో కీలకమైన రోడ్డు, రైలు వంతెన గనుక పుతిన్‌ తీవ్రంగా స్పందిస్తే ఆ సాకుతో అలాంటి క్షిపణులు ఇవ్వాలన్న ఎత్తుగడ ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక వేళ అందచేస్తే కొందరు చెబుతున్నట్లు అసలైన పోరు ప్రారంభానికి నాంది అవుతుంది. దానిలో అమెరికా, ఇతర నాటో దేశాల సైనికులు భౌతికంగా పాల్గొంటారా లేదా అన్నది ప్రశ్నార్ధకమైతే ఆ దేశం ఆధునిక ఆయుధాల ప్రయోగశాలగా మారుతుంది.


క్రిమియా ద్వీపకల్పంలో పేల్చిన వంతెన ఆ ప్రాంతానికి రష్యా ప్రధాన భూభాగాన్ని కలిపే పందొమ్మిది కిలోమీటర్ల రోడ్డు, పక్కనే ఉన్న రైలు వంతెన.పౌరులకు అవసరమైన సరఫరాలతో పాటు మిలిటరీ రవాణాకు సైతం అది కీలకం. ప్రజాభిప్రాయ సేకరణలో అక్కడి జనం తమ ప్రాంతాన్ని తిరిగి రష్యాలో కలపాలని కోరారు. ఆ మేరకు 2014లో విలీనం జరిగింది. తరువాతనే పుతిన్‌ ప్రభుత్వం ఆ వంతెనల నిర్మాణం చేసింది.స్వయంగా పుతిన్‌ కారు నడిపి వంతెనలను ప్రారంభించారు. నిజానికి ఆ వంతెనల వలన రవాణా వేగంగా జరగటం తప్ప ఆ ప్రాంతానికి దారి లేక కాదు. ఇక శనివారం నాటి పేలుడు జరిగిన చోట రోడ్డు వంతెన మీద ఒక వైపున ఉన్న ఇనుపకంచె(రెయిలింగ్‌) కొంత మేర విరిగి సముద్రంలో పడింది. పక్కనే ఉన్న రైలు వంతెన మీద ఉన్న రైలులోని ఇంధన టాంకర్లకు నిప్పంటుకుంది. కొంత సేపు రవాణా నిలిపివేసి అదే రోజు పునరుద్దరించారు. నష్టం పెద్దది కాదు గానీ తరువాత జరిగిన పరిణామాలకు అది నాంది పలికింది. ఈ పేలుడుకు తమదే బాధ్యత అని చెప్పుకొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఉక్రెయిన్లో సంబరాలు, నర్మగర్భంగా ఆ దేశ నేతలు చేసిన ప్రకటనలు, అది ఉక్రెయిన్‌ చేసిందే అని పేరు చెప్పని వారు తమకు చెప్పినట్లు అమెరికా పత్రికలు ప్రకటించటం వంటి పరిణామాలన్నీ వేలు జెలెనెస్కీవైపే చూపుతున్నాయి. ఇది పౌర, కీలకమైన మౌలిక సదుపాయాలను దెబ్బతీసే ఉగ్రవాద చర్య అంటూ భద్రతా మండలిలోని శాశ్వత దేశాల ప్రతినిధులతో పుతిన్‌ వీడియో కాన్ఫరెన్సు ద్వారా చర్చించాడు.


గత ఎనిమిది సంవత్సరాలుగా ఉక్రెయిన్‌ ఉగ్రవాద దళాలు స్వదేశంలోనూ, తమ ప్రాంతంలోనూ దాడులకు పాల్పడినట్లు రష్యా గతంలో కూడా పేర్కొన్నది.హిట్లర్‌ మూకలు పార్లమెంటు భవనాన్ని తగులబెట్టి నెపాన్ని కమ్యూనిస్టుల మీద మోపినట్లుగా జెలెనెస్కీ దళాలు స్వంత అణు విద్యుత్‌ కేంద్రాలపై దాడులకు పాల్పడి నెపాన్ని తమ మీద మోపేందుకు చూసినట్లు కూడా ఐరాసకు ఫిర్యాదు చేసింది. తమ కురుస్క్‌ అణు విద్యుత్‌ కేంద్రాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగా మూడు సార్లు విద్యుత్‌ లైన్ల మీద దాడులు చేసినట్లు, టర్క్‌ స్ట్రీమ్‌ గాస్‌పైప్‌లైన్‌ పేల్చివేతకు చూసిందని కూడా పేర్కొన్నది. బాల్టిక్‌ సముద్రంలో ఉన్న అంతర్జాతీయ గాస్‌ పైప్‌లైన్ల విధ్వంసానికి జరిపిన పేలుళ్ల విచారణ బృందంలో తమ ప్రతినిధులను అనుమతించలేదని రష్యా పేర్కొన్నది.
క్రిమియా వంతెన పేల్చివేతకు ప్రతిగా రష్యా క్షిపణులు జనావాసాలపై బాంబులు వేసినట్లు జెలెనెస్కీ, పశ్చిమ దేశాలు ఆరోపిస్తుండగా తాము ఉక్రెయిన్‌ ఇంథన, మిలిటరీ, సమాచార కేంద్రాల మీద దాడులు జరిపి ధ్వంసం చేసినట్లు పుతిన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. సోమవారం నాటి రష్యా దాడుల్లో 14 మరణించారని, 97 మంది గాయపడినట్లుగా ఉక్రెయిన్‌ పేర్కొన్నది. నిజంగా జనం ఉన్న ప్రాంతాల మీద క్షిపణులు పడి ఉంటే ఇంకా ఎక్కువ ప్రాణ నష్టం జరిగి ఉండేది.రష్యా ప్రత్యేక సైనిక చర్య ప్రారంభమై మంగళవారం నాటికి 230 రోజులు.(ఫిబ్రవరి 24) అప్పటి నుంచి ఐరాస లెక్కల ప్రకారం అక్టోబరు రెండవ తేదీనాటికి మరణించిన పౌరుల సంఖ్య 6,114 అంటే సగటున రోజుకు పాతిక మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం నాడు ఒకే సారి అనేక పట్టణాల మీద క్షిపణి దాడి జరిగింది. ఏ కారణంతోనైనా అమాయక పౌరుల మరణాలను సమర్ధించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. దాడుల స్వభావం గురించి జరుగుతున్న ప్రచారం గురించి తెలుసుకొనేందుకే ఈ వివరాలు. తమ ప్రతీకారం తీవ్రంగానే ఉంటుందని రష్యన్లు బాహాటంగానే చెబుతున్నారు. సోమవారం నాడు పుతిన్‌ సేనలు వదలిన 83క్షిపణుల్లో 43ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఉక్రెయిన్‌ సైనికులు 60 మంది మరణించినట్లు, అనేక లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు , ఒక మిగ్‌ విమానాన్ని కూల్చినట్లు రష్యా లెక్కలతో సహా ప్రకటించింది. నిజానికి ఇప్పటి వరకు 230 రోజుల పోరులో ఎటువైపు ఎంత నష్టం అన్నది ఇంతవరకు నిర్దారణగా వెల్లడికాలేదు. దేశమంతటా తమ విద్యుత్‌ వ్యవస్థకు ముప్పు వచ్చినట్లు ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ ప్రకటించాడు. పదకొండు ప్రధాన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు ప్రధాని వెల్లడించాడు. అనేక చోట్ల మంచినీరు, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఉక్రెయిన్‌లో ఫ్రెంచి పౌరులందరూ తమ ఇండ్లలోనే ఉండాలని ఫ్రాన్స్‌ కోరగా, దేశం విడిచి పోవాలని తమ పౌరులను అమెరికా కోరింది. అదనపు మిలిటరీ సరఫరాలను పంపుతామని ఐరోపా సమాఖ్య ప్రకటించింది. అనేక దేశాల నేతలకు ఫోన్‌ చేసిన జెలెనెస్కీ అందరం కలసి పోరాడాలని కోరాడు.


అనేక దేశాలలో అమెరికా కూటమి కిరాయి మూకలను రంగంలోకి దించుతోంది. ఉక్రెయిన్లో కూడా అదే జరుగుతోంది. వేలాది మందిని రష్యా మిలిటరీ పట్టుకోవటం, హతమార్చటం తెలిసిందే. ఇంకా వేలాది మంది ఉన్నారు. ఈ నేపధ్యంలో తాజాగా వస్తున్న వార్తలను బట్టి గతంలో తిరుగుబాటుదార్లుగా ఉండి పుతిన్‌ సర్కార్‌కు లొంగిపోయిన చెచెన్‌ సాయుధులను ఉక్రెయిన్‌పై దాడులకు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న అనుభవంతో ఉగ్రవాదుల తీరుతెన్నులు వారికి కొట్టిన పిండేగనుక ఉక్రెయిన్‌ ఉగ్రవాదులను అరికట్టేందుకు వారే సరైన వారని భావిస్తున్నట్లు చెప్పవచ్చు. ఇప్పటికే తమ వారు పదివేల మంది ఉన్నారని 70వేల మందిని రంగంలోకి దించనున్నట్లు కొద్ది రోజుల క్రితం రష్యా మిలిటరీలో జనరల్‌గా చేరిన రమజాన్‌ కదరయోవు చెప్పాడు. నాటో కూటమి నేర్పిన పాఠాలను తిరిగి వారికే నేర్పేందుకు పుతిన్‌ పావులు కదుపుతున్నట్లు కొందరు పేర్కొన్నారు. అమెరికా, ఇతర నాటో ప్రధాన దేశాల తీరు తెన్నులను చూసినపుడు ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఒక తీరులో దీర్ఘకాలం కొనసాగిస్తూ రష్యాను బలహీనపరిచి తమకు ఎదురులేదని, తమను ప్రతిఘటించేవారికి ఇదే గతి అని ప్రపంచానికి చెప్పేందుకు చూస్తున్నట్లు చెప్పవచ్చు.ఈ క్రమంలో వారు ఊహించని ఎదురు దెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుత శీతాకాలం గడవటం ఒకటైతే దిగజారుతున్న ఆర్ధిక పరిస్థితి నుంచి ఎలా నెగ్గుకు రావాలా అన్నది వాటి ముందున్న ప్రధాన సవాలు.


ఇప్పటి వరకు ఉక్రెయిన్‌ మిలిటరీకి నాటో కూటమి అందచేసిన అస్త్రాలన్నీ పరిమిత ప్రాంతాలకు పరిమితమైనవే. మూడు వందల కిలోమీటర్లు అంతకు మించి వెళ్లగల క్షిపణులను ఇంతవరకు ఇవ్వలేదు. వాటిని ఇస్తే సంక్షోభ స్వరూపం, స్వభావమే మారుతుంది. నాలుగు ప్రాంతాలను తనలో విలీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించిన తరువాత కూడా ఈ వైఖరిలో ఇంతవరకు ఎలాంటి మార్పు లేదు. రష్యా భూభాగమైన క్రిమియా వంతెనపై దాడి చేస్తే ఎలాంటి ప్రతి స్పందన ఉంటుందో చూసేందుకు ఒక పధకం ప్రకారం పశ్చిమ దేశాలు చేయించిన దాడి అన్నది స్పష్టం. రెండు రోజులుగా జరుపుతున్న దాడులను పుతిన్‌ నిలిపివేస్తారా, కానసాగిస్తారా? కొనసాగితే ఉక్రెయిన్‌ పౌరుల్లో తలెత్తే భయ, సందేహాలు ఏ పరిణామాలకు దారి తీస్తాయి, సంక్షోభం ఏ రూపం తీసుకుంటుంది, జెలెనెస్కీని మునగచెట్టు ఎక్కించిన పశ్చిమ దేశాలు ఏం చేస్తాయి. ఇలాంటి అనేక సందేహాలకు ఇప్పట్లో సమాధానం కనిపించేట్లు లేదు.


ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను మొత్తంగా చూస్తే మానవ నష్టాన్ని పరిమితం చేసేవిగా రష్యా దాడులున్నాయి. ఇక ముందు అలానే ఉంటాయా లేదా అన్నది ఎర్ర గీతలు దాటి రెచ్చగొడుతున్న పశ్చిమ దేశాలు, వాటిలో కీలుబమ్మగా మారిన ఉక్రెయిన్‌పై ఆధారపడి ఉంది.తనపై విధించిన ఆంక్షల కారణంగా ఐరోపాకు ఇంధన సరఫరా నిలిపివేసిన రష్యాను దెబ్బతీసేందుకు నోర్డ్‌స్ట్రీమ్‌ పైప్‌లైన్లను కొన్ని చోట్ల ధ్వంసం చేశారు. రష్యామహిళా జర్నలిస్టు దర్యా దుగీనాను హత్య చేశారు. కెర్చ్‌ వంతెనల పేల్చివేతకు చూశారు. రష్యా సరిహద్దులకు టాంకులు, క్షిపణులను తరలిస్తున్నారు.


తొలి రోజుల్లో చర్చలకు సిద్దమన్నట్లు జెలెనెస్కీ కనిపించినా అదంతా ఉత్తిదే అని తేలింది. తదుపరి చర్చలను నిషేధించే ఒక ఫర్మానాను జెలెనెస్కీ విడుదల చేసిన తరువాత అసలు స్వరూపం వెల్లడైంది. రష్యా ఇంథన సరఫరాల్లేకుండా చలికాలాన్ని అధిగమించటం ఐరోపాకు కాస్త ఇబ్బందైనా ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటుంది గానీ, పరిశ్రమల మూత, ద్రవ్యోల్బణం వంటి ఆర్ధికపరమైన అంశాలతో పుట్టి మునుగుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పుతిన్ను తమ కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని పశ్చిమ దేశాలు చూస్తుంటే జెలెనెస్కీ మీద పుతిన్‌ గురిపెట్టాడు. అన్ని దేశాలకూ ఈ సంక్షోభాన్ని పంచాలని చూస్తున్న అతను లొంగితే ఆ పరాభవం పశ్చిమ దేశాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అందుకే పెద్ద ఎత్తున ఆయుధ సరఫరాలు చేస్తున్నాయి. మొదటికే మోసం వస్తే అంటే తమ జీవితాలనే ఈ సంక్షోభం అతలాకుతలం గావిస్తే ఐరోపా జనం ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. గతంలో పుతిన్‌ విజయం సాధిస్తాడేమోనని నాటో భయపడితే ఇప్పుడు ఓడిపోతే అణ్వాయుధాలను రంగంలోకి తెస్తాడేమో అని భయపడుతున్నట్లు ఒక వార్తా సంస్థ కొత్త కథనాన్ని రాసింది. ఇది ఊహాజనితమే గాని దీని వెనుక రష్యా ఓడిపోనుందని, కొద్ది రోజులు ఇబ్బందులను భరించాలనే భావనలోకి పశ్చిమ దేశాల జనాన్ని తీసుకు వెళ్లే ఎత్తుగడ కూడా ఉంది.