Tags

, , , ,

 

డాక్టర్ కొల్లా రాజమోహన్,

 ఇతిహాసపు చీకటికోణం

అట్టడుగున పడి కాన్పించని

కధలన్నీ కావాలిప్పుడు!

దాచేస్తే దాగని సత్యం …

అంటారు మ‌హాక‌వి శ్రీ‌శ్రీ‌. ప్ర‌స్తుతం జరుగుతున్న  ఉక్రేయిన్, ర‌ష్యా దాడి అనంత‌రం   ప‌రిణామాలు గ‌మ‌నిస్తే అనేక అంశాలు ప్ర‌జ‌ల దృష్టికి రాకుండా చేస్తున్న కుట్ర‌లు స్ప‌ష్ట‌మౌతాయి. ఉద్దేశ పూర్వ‌కంగానే అమెరికా సామ్రాజ్య‌వాద శ‌క్తుల‌కు మ‌డుగులొత్తుతూ మీడియా చేస్తున్న ప్రాప‌కాండ అంతా ఇంతా కాదు.  అమెరికా దేశానికి మ‌ద్దతు ఇస్తున్న అనేక దేశాల్లో తెర‌చాటుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తే ఆయా దేశాల రాజ‌కీయ‌, ఆర్ధిక వ్య‌వ‌హారాలు తీవ్ర సంక్షోభంలో ఉన్న విష‌యం బ‌హిర్గ‌తమౌతుంది. 

రష్యాను లొంగతీసుకోవాలనే ఎత్తుగడతో అమెరికా ఆంక్షలను విధించింది. ఎత్తుగడ బెడిసికొట్టింది. రష్యా తన ఆయిల్ నిల్యలను ఆయుధాలుగా వాడుకుని ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలను వణికిస్తున్నది.  అమెరికా- రష్యాలనే కాకుండా ప్రపంచాన్నేఆర్ధికసంక్షోభంలోకి, ఆర్ధిక మాంద్యం దిశగా నెట్తున్నది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సామ్రాజ్యవాదం మొదటిసారిగా చిక్కుల్లో పడింది. బ్రిటన్ పౌండ్ రికార్డు స్ధాయిలో పతన మయింది. ఆర్ధిక సంక్షోభం వలన ధరలు పెరిగిపోతున్నాయి. రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరుపొందిన బ్రిటన్లో సంక్షోభం వలన ఇద్దరు ప్రధానులు మారిపోయారు. మూడో ప్రధాని వరసలో వున్నాడు. ఆహార ధరలు, గ్యాసు, పెట్రోలు ధరలు పెరిగిపోయాయి. ప్రజల ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కార్పోరేట్ అనుకూల విధానాలతో  ప్రధాని లిజ్ ట్రస్ 44 రోజులలోనే తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. *ఫ్రాన్స్ లో ప్రజలు రోడ్డెక్కారు.

. పోరాట సాంప్రదాయాలు కలిగిన ఫ్రెంచ్ కార్మికులు, విద్యార్ధులు ఆందోళనాపధంలో వున్నారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు పదవీగండం తెచ్చేటట్లున్నది.ఇటలీ. ఆస్ట్రియా, హంగెరీ, యూరోపియన్ దేశాలన్నిటిలో అసంతృప్తి ప్రజాందోళనలను ప్రభుత్వాలు తట్టుకోలేకపోతున్నాయి.సౌదీ అరేబియా అమెరికాకు ఎదురుతిరిగింది. అక్టోబరు 5 న ఒపెక్ ప్లస్  దేశాలు 2మిలియన్ బారళ్ళ చమురు ఉత్పత్తిని తగ్గించటానికి నిశ్చయించారు. ఫలితంగా ఆర్ధిక మాంద్యం కి చేరువలో వున్న యూరప్. అమెరికా లలో తీవ్ర ఆందోళన మొదలయింది.  ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసివస్తుంది.

 *అమెరికా లో రాజకీయ కల్లోలం* .

నవంబరు 8న జరిగే మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్లు విజయం సాధిస్తే ఉక్రెయిన్ కు అమెరికా చేస్తున్న సహాయాన్ని నిలిపేస్తామని రిపబ్లికన్ పార్టీ నాయకుడు కెవిన్ మెక్ కార్తీ విలేఖరుల సమావేశం లో చెప్పాడు. ఫిబ్రవరి లో రష్యా-ఉక్రెయిన్-నాటో యుద్ధం ప్రారంభమయిన దగ్గరనుంచీ అమెరికా ఆయుధాలు, నిధులు, నిఘా పరికరాలతోపాటుగా సైనిక శిక్షణ ను అందిస్తున్నది. శాటిలైట్ ల ద్వారా అత్యంత ఆధునిక నిఘావ్యవస్ధను ఉక్రెయిన్ కు ప్రతి నిముషం రష్యా సైనికుల కదలికలను తెలుపుతున్నది. ఇప్పటివరకూ 16.8 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించిందని అంచనా. ప్రభుత్వ ఖర్చులు పెరిగాయి. ద్రవ్యోల్బణం తీవ్రరూపం దాల్చింది. ప్రజాగ్రహం తో యుద్ద‌వ్యతిరేక ప్రదర్శనలు పెరుగుతున్నాయి.   

 *ఫ్రాన్స్, జర్మనీ ప్రజల  ప్రదర్శనలు  

అమెరికా మాట విని యూరప్‌ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. రష్యా తో వ్యాపారాలనన్నిటినీ ఆపేశారు. గ్యాస్ సరఫరా బందయింది. అమెరికా లిక్విఫైయిడ్ గ్యాసును సరఫరా చేస్తామంటే సంతోషించారు. లిక్విఫైయిడ్ గ్యాసును నాలుగు రెట్లు ధర ఎక్కువతో అందుబాటులోవుంచింది. కావాలంటే కొనుక్కోండంది. చౌకగా వస్తున్న రష్యన్ గ్యాసు రాకుండా చేసి కష్టకాలంలోవున్నమిత్రదేశంతో నెత్తురు పిండే వ్యాపారమేమిటని ఫ్రాన్స్, జర్మనీలు ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం జర్మన్ ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించవలసివస్తోంది. చలి రోజులు రానున్నాయి. ఎముకలు కొరుక్కుతినే చలిని తట్టుకోవటానికి వాతావరణాన్నివేడిగా వుంచే హీటర్లు కావాలి. హీటర్లు పని చేయటానికి గ్యాసు కావాలి. ఇంధనం కొరతతో ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి  పరిశ్రమలు నడవనందున కార్మికులు నిరుద్యోగులయ్యారు. వారు ఉద్యోగాలను కోల్పోతున్నారు. నాటో విధానాల ఫలితంగా రష్యా పై విధించిన ఆంక్షల వలన ప్రజలు ఆకలితో అలమటించడమే కాకుండా, నిరుద్యోగులుగా మారుతున్నారని జర్మన్లు గుర్తించడంతో వీధిలో ప్రదర్శనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

మీడియాలో చోటు చిక్కని యూరప్ ప్రజల నాటో వ్యతిరేక ప్రదర్శనలు..

ఫ్రాన్స్ లో ప్రజలు రోడ్డెక్కారు. సైన్యంతో వీధి పోరాటాలకు దిగారు. బారికేడ్లను, ముళ్ళకంచెలను ఎదుర్కొంటున్నారు. వేలాదిమంది భారీ ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. నాటో సైనికకూటమి నుండి వైదొలగమని కార్మికులు, విద్యార్దులు దేశవ్యాపిత సమ్మెకు దిగారు. ఆదివారం ప్యారిస్ లో భారీ మార్చ్ ను నిర్వహించారు. దేశవ్యాపితంగా 180 చోట్ల భారీ ప్రదర్షనలను నిర్వహించారు. అమెరికా ప్రేరేపిత యుద్ధం వలన. ఆయిల్, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయాన్ని కలిగించింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోతున్నాయి.  పరిశ్రమలు మూతపడుతున్నాయి. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఏమీకొనేటట్లు లేదు.  ఏమీ తినేటట్లులేదు. ద్రవ్యోల్బణం అదుపుతప్పి 6.2 శాతానికి మించింది. ఇంధన కొరతతో పెట్రోల్ పంపులముందు బారీక్యూ లైన్ల తో ప్రజలు విసుగెత్తిపోయారు. కొన్ని పెట్రోల్ పంపులలో ఇంధనం అందుబాటులో లేనందున ధరలు  ఆకాశాన్నంటాయి. దేశంలోని మూడోవంతు గ్యాసు స్టేషన్లలో ఇంధనం అయిపోయింది. రాబోయే చలికాలంలో ఇంటిలో వేడిచేసే గ్యాస్ లేక చలికి గడ్డకట్టుకుపోయే  పరిస్ధితులను ఊహించుకొని ఆందోళనకు గురవుతున్నారు. యుద్ధం, ఇంధన కొరత, ధరల పెరుగుదల వలన సంభవించిన కార్మికుల, ప్రజల ఆగ్రహం  ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు పదవీగండం తెచ్చేటట్లున్నది. ఫ్రాన్స్ లో ప్రపంచ యుధాలకు, అణచివేటకు కారణమైన నాటోను  రద్దు చేయమని ఫ్రెంచ్ కార్మికులు కోరుతున్నారు

 *అణుయుద్ధం తప్పదా..?* 

రష్యా భూభాగాన్ని రక్షించటానికి మాస్కో “తనకున్న అన్ని మార్గాలనూ” ఉపయోగిస్తుందని, తప్పనిసరి పరిస్ధితులలో అణ్వాయుధాలు ఉపయోగించటానికి వెనకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ హెచ్చరించాడు. రెండవ ప్రపంచయుద్ధంలో అణ్వాయుధాలను ఉపయోగించటం ద్వారా అమెరికా ఒక “ఆనవాయితీని” సృష్చించిందని హిరోషిమా, నాగసాకీలపై ణుబాంబుల దాడిని పుతిన్ గుర్తు చేశాడు. రష్యా మరియు నాటోదేశాల మధ్య అస్తిత్వ యుద్ధంగా ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని పుతిన్ అభివర్ణించారు. రష్యాను రక్షించేందుకు అణ్వాయుధాలను ఉపయోగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పాశ్చాత్య దేశాలను హెచ్చరించాడు. కొంతమంది విశ్లేషకులు పుతిన్‌ను “బ్లఫ్“చేస్తున్నారని అంటున్నారు, అయితే వాషింగ్టన్, పుతిన్‌ను తీవ్రంగా పరిగణిస్తోంది.60 ఎళ్ళ క్రితం క్యూబా మిస్సైల్ సంక్షోభం వచ్చింది. మరల ఇపుడు అణుయుధ ప్రమాదం తీవ్ర స్ధాయిలో వుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.

 అణ్వాయుధాలను తమ జాతీయ భద్రతకు హామీ ఇచ్చే ఆయుధాలుగా, యుధనిరోధక సాధనాలుగా అణ్వాయుధ దేశాలు పరిగణిస్తున్నాయి. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ న్యూక్లియార్ వార్ హెడ్స్ రష్యావద్ద 5977 వుండగా అమెరికా వద్ద 5428 న్యూక్లియార్ వార్ హెడ్స్ వున్నాయి తమ ప్రజల సంపదను ఫణంగా పెట్టి, తమ శక్తికి మించి ఖర్చు చేసి అణ్వాయుధాలను నిర్మిస్తున్నాయి.

యద్దం ఎపుడు ఆగుతుందో తెలియని అనిశ్చిత పరిస్ధితి దాపురించింది. బైడెన్ జనవరి 2021న అధ్యక్షపీఠాన్ని అదిష్టించినప్పటినుండీ  రష్యా సరిహద్దుదేశాలన్నిటిలో రష్యా వ్యతిరేక విష ప్రచారాన్నిఉధృతంచేశాడు.  రష్యాని నాశనం చేయపూనుకున్నాడు. సరిహద్దుల వైపు నాటో విస్తరణను కొనసాగించాడు. ఉక్రెయిన్ ను తటస్ధదేశంగా వుంచే అవకాశాన్ని జారవిడిచి రష్యాను నాశనం చేయాలనే తలంపుతో యుధానికి పాచికలు విదిలాడు. రష్యా, చైనాలపై విషాన్ని చిమ్మాడు. నాటో సైనిక కూటమి లో సభ్యత్వాలను ఆధారం చేసుకుని యూరోపియన్ యూనియన్ దేశానన్నిటినీ  ఉక్రెయిన్ కి సహాయంగా యుద్ధం లోకి లాగారు. రష్యా పైకి రెచ్చకొట్టాడు. సైనికంగా అమెరికా పై ఆధారపడిన నాటో దేశాలైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ ల నాయకత్వాలు అమెరికా ఉచ్చులో పడి బయటకు రాలేక ప్రజల క్రోధాగ్నిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా యుధోన్మాధం వలన ప్రపంచ ప్రజలంతా ద్రవ్యోల్బణంలో చిక్కుకుని గిలగిల లాడుతున్నారు. రష్యా సరిహద్దు దేశాలను నాటో సైనిక కూటమిలో చేర్చుకునేప్రయత్నంలో అమెరికా సఫలం అయింది. రష్యాను వేరు చేసి ఒక మూలకునెట్టి నాశనం చేయాలనే తలంపుతో పావులు కదుపుతుంది. రష్యా కమ్యూనిస్టు దేశం కాకపోయినా అమెరికా ను ఎదుర్కొనే సైనిక శక్తి, అణ్వాయుధాలు, సహజవనరులు గల శక్తివంతమైన దేశంగా వుంది. రష్యా కమ్యూనిజాన్నివదిలి , స్వేఛామార్కెట్ , ప్రజాస్వామ్యం అంటూ పెట్టుబడిదారీ విధానాన్ని, నాటోపట్ల మెతక వైఖరిని అనుసరించినా అమెరికా సామ్రాజ్యానికి తృప్తి కలగలేదు. యూరప్ కు దగ్గర కానీయలేదు. అమెరికా అగ్రరాజ్య అధిపత్యాన్ని ప్రశ్నించేవారిని సహించే పరిస్ధితి లేదు. బలమైన ప్రత్యర్ధిగా రూపొందే అవకాశం వున్నపెద్ద దేశాన్ని నాశనం చేయటమే ధ్యేయంగా అమెరికా నాటో ను విస్తరించింది. సోవియట్ యూనియన్ ని విఛిన్నం చేసిన గోర్బచేవ్ తో నాటో ను రష్యా వైపు విస్తరించబోమన్నవాగ్దాన భంగమే ఈ యుధానికి కారణం. నాటోను విస్తరించి పుతిన్ ని యుద్ధంలోకి లాగి ప్రపంచ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. అమెరికా యుద్దోన్మాదంతో ప్రపంచాధిపత్యంకోసం ఉక్రెయిన్ లో అంతర్యుధాన్నిప్రోత్సహించి రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూల్చేసి రష్యాని రెచ్చకొట్టింది.

 *అమెరికా దేశ భధ్రత… Vs…క్యూబా దేశభధ్రత* 

1962, క్యూబా మిస్సైల్ సంక్షోభానికి ఉక్రెయిన్ యుధానికి ఉన్న పోలికలను గమనించాలి. ఉక్రెయిన్ ను నాటో లో చేర్చుకుంటే మా దేశ భధ్రతకు ప్రమాదం అనే కారణంతో ఉక్రయిన్ పై రష్యా యుద్దానికి దిగింది. స్వతంత్రదేశమైన ఉక్రెయిన్ నాటో లో చేరాలనే నిర్ణయం తీసుకునే స్వేఛ ఉందని అమెరికా వాదన. అమెరికాకి 90 మైళ్ళ దూరంలో తన భధ్రతకు ప్రమాదమైన  అమెరికా వ్యతిరేక సోవియట్ అనుకూల ప్రభుత్వం వుంటానికే వీలులేదంది. ఆకాశమార్గంకుండా వేలాదిమంది తో సాయుధ దళాలను  క్యూబాదేశంలో దింపింది. ఒక స్వతంత్ర ప్రభుత్వాన్నికూలదోయటానికి “ బే ఆఫ్ పిగ్స్” పేరున సైనిక చర్య చేపట్టింది. క్యూబాప్రజలు విద్రోహ సైన్యాన్నిబంధించి అమెరికా కుట్రను భగ్నం చేశారు. చిన్న దేశమైన క్యూబా తన రక్షణ కోసం సోవియట్ సహాయం తీసుకుంది. సోవియట్ అణు క్షిపణులను క్యూబాలో ఏర్పాటు చేసుకున్నారు. మామీద దాడిచేస్తే 5 నిముషాలలో అమెరికా ప్రధాన నగరాలైన న్యూయార్క్, వాషింగటన్ లపై దాడి చేయగలమన్నారు. అమెరికాభధ్రతకు ప్రమాదమైన అణు క్షిపణులను క్యూబా నుండి తీసేయకపోతే యుద్ధం తప్పదని కెన్నడీ హెచ్చరించాడు. సోవియట్ నౌక లు క్యూబా రాకుండా నావికా దిగ్బంధాన్నివిధించారు. ఆరోజున అమెరికా తన భధ్రత కోసం స్వతంత్ర దేశమైన క్యూబా భూభాగం నుండి అణు క్షిపణులు తీసేయకపోతే యుద్ధం తప్పదన్నది. ఈ రోజున రష్యా తన భధ్రత కోసం ఉక్రెయిన్ దేశాన్ని నాటో సైనిక కూటమి లో చేర్చుకోవద్దంటున్నది. తన దేశ సరిహద్దుదేశాలలో అణ్వాయుధాలు మోహరించి నిముషాలలో దాడి చేసేపరిస్ధితి వస్తే అణుయుద్దానికైనా సిధం అంటున్నది.   

క్యూబా మిస్సైల్స్ సంక్షోభంలో ప్రపంచం అణుయుధపుటంచుకు చేరింది. ఏ క్షణమైనా క్యూబా పై అమెరికాదాడి చేయవచ్చనీ మరో క్షణంలో సోవియట్ అణ్వాయుధాలు అమెరికా పై ప్రయోగించటం తప్పదనీ ప్రపంచ నాశనం అనివార్యమనే పరిస్ధితి దాపురించింది.  క్యూబా నుండి అణు క్షిపణులను తొలగించటానికి రష్యా అంగీకరించింది. క్యూబా పై దాడి చేయనని అమెరికా హామీ ఇచ్చింది. రష్యా సరిహద్దున వున్న టర్కీనుండి అణుక్షిపణులను తొలగించటానికి అమెరికా అంగీకరించింది.  సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించి ప్రపంచ యుధాన్ని నివారించారు.

 *ప్రజలే చరిత్ర నిర్మాతలు.* 

ఈ రోజున రష్యా ఒక మూలకు నెట్టబడింది. అమెరికా ద్రవ్యోల్బణంలో చిక్కుకుంది. ఆర్ధిక మాంద్యం అంచుల్లో వుంది. నాటో నుండి వైదొలగమని యూరప్ ప్రజలు తిరగపడుతున్నారు. ప్రపంచ ప్రజల ఆహార భధ్రత ప్రమాదంలో పడింది. అణ్వాయుధ ప్రమాదం ముంచుకొస్తున్నది. అమెరికా కుట్రలను అర్దం చేసుకున్నయూరప్ యువత, కార్మికుల  ప్రజాందోళనలు యుద్ద‌గ‌తిని  మార్చబోతున్నాయి. అంతిమంగా ప్రజలే చరిత్ర నిర్మాతలు.

——————————————

డాక్టర్ కొల్లా రాజమోహన్,

నల్లమడ రైతు సంఘం.

9000657799