Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


జైల్లో 580 రోజులు గడిపిన వామపక్ష నేత లూలా రాజకీయ జీవితం ముగిసినట్లే అని ఆశించిన మితవాద శక్తులకు, వారిని బలపరిచిన అమెరికా, ఇతర దేశాలకు చెంపపెట్టు. మరోసారి అధికారపీఠాన్ని అధిరోహించేందుకు జనం ఆమోదం తెలిపారు. ఆదివారం నాడు (అక్టోబరు 30వ తేదీ) బ్రెజిల్‌ అధ్యక్షపదవికి జరిగిన తుది విడత పోరులో వర్కర్స్‌ పార్టీకి చెందిన వామపక్ష నేత లూలా డిసిల్వా మూడవ సారి అధికారానికి వచ్చారు. జనవరి ఒకటవ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. కార్పొరేట్ల అనుకూల మితవాద, ప్రజాస్వామ్య విధ్వంసశక్తులు- ప్రజానుకూల వామపక్ష, ప్రజాస్వామ్య పరిరక్షణ శక్తుల మధ్య పోటాపోటీగా జరిగిన పోరులో నిరంకుశ జైర్‌ బోల్సనారో మట్టి కరిచాడు. పోలింగ్‌ ముగిసిన కొద్ది గంటల్లోనేే ఆదివారం రాత్రే ఫలితాలను ప్రకటించారు. పోలైన ఓట్లలో లూలాకు 50.9శాతం (6,03,45,499) రాగా, బోల్సనారోకు 49.1శాతం( 5,82,06,356) వచ్చాయి. లూలా మెజారిటీ 21,39,143 కాగా చెల్లని, తిరస్కరించిన ఓట్లు 57,00,443 ఉన్నాయి. బ్రెజిల్‌ నిబంధనల మేరకు అధ్యక్షపదవికి వేసిన ఓట్లనే ఉపాధ్యక్ష పదవికీ వర్తింప చేసి విజేతగా ప్రకటిస్తారు. ఆదివారం రాత్రే ఫలితాలను ప్రకటించినప్పటికీ మంగళవారం రాత్రి రెండు నిమిషాల పాటు మాట్లాడుతూ ఓటమిని అంగీకరిస్తున్నట్లు ప్రకటించకుండానే అధికార మార్పిడికి ఏర్పాట్లు చేయాలని కోరాడు. తాను ఓడితే తీర్పును అంగీకరించేది లేదని ఎన్నికలకు ముందే చెప్పాడు. బోల్సనారో గట్టి మద్దతుదారైన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మాత్రం బోల్సనారో కోసం వేచి చూడకుండా వెంటనే లూలాకు అభినందనలు తెలిపాడు.ఫలితాలు తెలిసిన గంటలోపే , ఎన్నికలు ” స్వేచ్చగా, న్యాయంగా, విశ్వసనీయంగా జరిగినట్లు ” బైడెన్‌ తన సందేశంలో పేర్కొన్నాడు. అమెరికాను అనుసరించే అనేక ఐరోపా, ఇతర దేశాల నేతలు కూడా అదే బాట పట్టి అభినందనలు తెలిపారు. దేశంలోని అనేక చోట్ల రోడ్ల మీద బోల్సనారో మద్దతుదార్లు ఏర్పాటు చేసిన ఆటంకాలన్నింటినీ తొలగించాలని బ్రెజిల్‌ సుప్రీం కోర్టు ఆదేశించింది. మద్దతుదార్లు తమ నేత ఆదేశాల కోసం ఆదివారం నుంచి ఎదురు చూశారు.


లాటిన్‌ అమెరికాలో అతి పెద్ద దేశమైన బ్రెజిల్‌ జనాభా 22 కోట్లు. అమెరికా మద్దతుతో 1964లో మిలిటరీ తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకొని 21 సంవత్సరాల పాటు ఉక్కుపాదాలతో కార్మికులు, రైతులను అణచివేసింది. దానికి వ్యతిరేకంగా పోరు సాగించిన వారిలో ఒకరైన లూలా తదితరులు 1980లో వర్కర్స్‌ పార్టీని ఏర్పాటు చేశారు.తమది డెమోక్రటిక్‌ సోషలిస్టు సిద్దాంతం అని ప్రకటించారు. 1982లో పార్టీకి గుర్తింపు లభించింది.1988 స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక ప్రముఖ పట్టణాల్లో ప్రజాదరణ, విజయాలను సొంతం చేసుకుంది. తరువాత జరిగిన మూడు ఎన్నికలలో లూలా అధ్యక్ష పదవికి పోటీ చేశాడు.2002 ఎన్నికలు, తరువాత 2006 ఎన్నికల్లో గెలిచాడు. తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో వర్కర్స్‌ పార్టీ నాయకురాలు దిల్మా రౌసెఫ్‌ గెలిచారు. రెండవ సారి ఆమె పదవిలో ఉండగా 2016లో మితవాద శక్తులు కుట్రచేసి తప్పుడు ఆరోపణలతో పార్లమెంటులో తమకున్న మెజారిటీని ఆసరాచేసుకొని ఆమెను అభిశంసించి పదవి నుంచి తొలగించారు. తరువాత లూలాపై తప్పుడు కేసులు పెట్టి 2017లో తొమ్మిదిన్నర సంవత్సరాల జైలు శిక్ష విధించారు.ఆ కేసును విచారించిన జడ్జి తరువాత బోల్సనారో ప్రభుత్వంలో మంత్రి అయ్యాడు. లూలా 580 రోజులు జైల్లో ఉన్నారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసేందుకు చూడగా శిక్ష పడిందనే పేరుతో అనుమతించలేదు. తరువాత జరిగిన పరిణామాల్లో 2019నవంబరులో సుప్రీం కోర్టు లూలాను జైల్లో ఉంచటం అక్రమం అంటూ విడుదలకు ఆదేశించింది.శిక్షపై అప్పీలు చేసినందున జైల్లో ఉంచకూడదని చెప్పింది. తరువాత 2021 మార్చినెలలో కేసును విచారించిస జడ్జి తీర్పు లూలా మీద కేసులను కొట్టివేశారు.అంతకు ముందు శిక్ష విధించిన జడ్జికి తగిన అధికారాలు లేవని, లూలా పౌరహక్కులను పునరుద్దరిస్తూ తీర్పు చెప్పారు. దాంతో ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత లభించింది.


మిలిటరీ నిరంకుశ పాలన ముగిసిన 1980దశకం తరువాత పదవిలో ఉండి రెండవసారి పోటీ చేసిన వారిలో తొలిసారిగా ఓడిన ఘనత బోల్సనారోకు దక్కింది. తొలి దఫాలోనే ఓడిపోతాడని చెప్పిన సర్వేలు వాస్తవం కాదని తేలింది. రెండు రౌండ్లలోనూ భారీగానే ఓట్లు సంపాదించటాన్ని బట్టి బ్రెజిల్‌ సమాజంలో సమీకరణలు ఎంత బలంగా ఉన్నదీ వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓడినప్పటికీ పార్లమెంటులో మితవాద శక్తులదే పైచేయిగా ఉంది.పార్లమెంటు దిగువ సభ 513 మంది ఉండే ఛాంబర్‌ ఆఫ్‌ డిప్యూటీస్‌లో బోల్సనారో లిబరల్‌ పార్టీ తన స్థానాలను 77 నుంచి 99కి పెంచుకుంది. వామపక్ష ” బ్రెజిల్‌ విశ్వాసం ” కూటమి కూడా గతం కంటే మరో పదకొండు పెంచుకొని 80 గెలుచుకుంది. మొత్తం మీద చూసినపుడు పార్లమెంటు రెండు సభల్లో మితవాద శక్తులు 60శాతం సీట్లతో మెజారిటీగా ఉన్నారు. లాటిన్‌ అమెరికా వామపక్షాలు గెలిచిన ప్రతి దేశంలోనూ ఇదే విధమైన బలహీనతను ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా ఉన్నట్లు నిర్దారణ కాగానే లూలా డిసిల్వా మద్దతుదార్లతో మాట్లాడుతూ మెజారిటీ బ్రెజిలియన్లు మరింత ప్రజాస్వామ్యాన్ని, మరింత సమానత్వం, సౌభ్రాత్వత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పాడు. తన పదవీ స్వీకరణ ఉత్సవానికి రానవసరం లేదు గానీ ప్రజలిచ్చిన తీర్పును బోల్సనారో గుర్తించాలని లూలా హితవు చెప్పాడు. ప్రజలే తనకు పదవీ పట్టం గట్టారని అన్నాడు. గత ఆరు సంవత్సరాల్లో ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాల బోల్సనారా ఏలుబడిలో ప్రజాస్వామిక వ్యవస్థలను, అమెజాన్‌ అడవులను ధ్వంసం చేసిన తీరు, కరోనాలో జనాన్ని గాలికి వదలివేసిన బాధ్యతా రాహిత్యాన్ని చూసిన వారు, వామపక్షాల వైఖరితో ఏకీభవించని వారు కూడా బోల్సనారో ఓడిపోవాలని కోరుకున్నారు.కరోనా వచ్చినపుడు లాక్‌డౌన్లు వద్దన్నాడు, తరువాత వాక్సిన్లను తిరస్కరించాడు, చివరికి కొనుగోలు చేసిన వాటిలో కుంభకోణానికి పాల్పడ్డాడు. ఆరులక్షల 80వేల మంది ప్రాణాలు పోవటానికి కారకుడయ్యాడు.


తాను ఓడితే ఫలితాలను అంగీకరించనని, అవసరమైతే వీధులకు ఎక్కుతానని బెదిరించిన బోల్సనారో రెండో విడత పోలింగ్‌ రోజు లూలా మద్దతుదార్లను ఓటింగ్‌కు రాకుండా తన మద్దతుదార్లను ఉసిగొల్పి అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి. అంతకు ముందు రేడియోలో తన ప్రకటనలను ప్రసారం చేయకుండా అడ్డుకుంటున్నారని, తన ఫిర్యాదులపై విచారణ జరపకపోతే పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని బెదిరించాడు. బోల్సనారో కుమారుడు,ఎంపీ ఎడ్వర్డ్‌ బోల్సనారో గురువారం నాడు ఒక టీవీలో మాట్లాడుతూ ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేశాడు. మొత్తం నమోదైన ఓటర్లు 15,64,54,011 మంది కాగా తుది విడత పోలింగులో 12,42,52,716 మంది పాల్గన్నారు. ఐదువందలకు పైగా ఉదంతాల్లో బోల్సనారో మద్దతుదార్లు, వారికి మద్దతుగా కేంద్ర పోలీసులు ఓటర్లను అడ్డుకున్నట్లు ఫిర్యాదులు రాగా వాటిలో సగం లూలాకు గట్టి పట్టున్న ఈశాన్య ప్రాంతాల నుంచే ఉండటం గమనార్హం. అధ్యక్ష భవనంలో నెల రోజులకు ముందే బోల్సనారో రూపొందించిన ఒక పధకం ప్రకారమే ఇలా అడ్డుకున్నట్లు టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయి. ఓటర్లను నిరోధించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినప్పటికీ పోలీసులు తప్పుడు సాకులు చూపి తామెవరినీ అడ్డుకోలేదని చెప్పారు. ట్రక్కుల యజమానులు,డ్రైవర్లు బ్రెజిల్‌ రాజకీయాల్లో మితవాద శక్తుల మద్దతుదార్లుగా ఉన్నారు. వారంతా రెండవ విడత పోలింగ్‌ జరుగుతుండగా రోడ్ల మీద ట్రక్కులను అడ్డం పెట్టి లూలా మద్దతుదార్లను కదలకుండా చేశారు. గతంలో వర్కర్స్‌ పార్టీ ప్రభుత్వం మీద తలెత్తిన అసంతృప్తిని ఆసరా చేసుకొని వీరంతా వీధుల్లోకి వచ్చి బోల్సనారోకు మద్దతుగా నిలిచారు. మరోవైపు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బోల్సనారో అనేక పధకాలను ప్రకటించాడు.తనకు వ్యతిరేకంగా మీడియా-ఎన్నికల సంఘం కుట్ర చేసిందని లేకుంటే తాను తొలి దఫా ఎన్నికల్లోనే గెలిచి ఉండేవాడినని, 60లక్షల ఓట్లు తనకు పడకుండా చేశారని బోల్సనారో ఆరోపించాడు.

గతంలో ఎనిమిది సంవత్సరాల పాలనా కాలంలో లూలా అమలు జరిపిన సంక్షేమ చర్యలతో కోట్లాది మంది దారిద్య్రం నుంచి బయటపడ్డారు, ఉన్నత విద్యను పేదలకు అందుబాటులోకి తెచ్చారు. అయితే ఇవన్నీ అంతకు ముందు నుంచి కొనసాగుతున్న నయా ఉదారవాద చట్రం నుంచే అమలు జరిపారు. అందువలన లాటిన్‌ అమెరికాలోని ఇతర వామపక్ష ప్రభుత్వాలు ఎదుర్కొన్న సమస్యలు, ప్రజల అసంతృప్తిని దిల్మారౌసెఫ్‌ ప్రభుత్వం కూడా ఎదుర్కొన్నది. గత ఎన్నికలలో వర్కర్స్‌ పార్టీ ఓడిపోయింది. తాను ఆర్ధిక రంగాన్ని చక్కదిద్దుతానని ముందుకు వచ్చిన మితవాది బోల్సనారో ప్రజలను గాలికి వదలివేయటంతో తిరిగి వర్కర్స్‌ పార్టీకి జనం పట్టం గట్టారు. ఈ ఎన్నికల్లో లూలా-బోల్సనారో ఇద్దరూ దేశ ఆర్థికపరిస్థితి గురించి ప్రధానంగా ప్రచారంలో ప్రస్తావించారు.ఆకలి, దారిద్య్రం పెరగటానికి బోల్సనారో విధానాలే కారణమని లూలా విమర్శించాడు. ఇప్పుడు లూలా ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలుగా మారనుంది.

స్పెయిన్‌ – పోర్చుగీసు వలస పాలకుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 1500సంవత్సరం ఏప్రిల్‌ 22 నుంచి పోర్చుగీసు పాలనలోకి బ్రెజిల్‌ వంచ్చింది. ఆ ప్రాంతంలో చెరకు తోటల్లో, ఇతరంగా పని చేసేందుకు అప్పటి నుంచి తెల్లవారి వలసలతో పాటు దాదాపు 30లక్షల మంది బానిసలను ఆఫ్రికా నుంచి రప్పించారు. దీర్ఘకాలం సాగిన పోరు తరువాత 1825 ఆగస్టు 29న స్వతంత్ర దేశంగా అవతరించింది. ప్రస్తుతం దేశ జనాభాలో 47.73 శాతం తెల్లవారు, 43.13శాతం బ్రెజిల్‌ స్థానిక తెగలు – సంకర వర్ణాలకు చెందిన వారు. లూలా ఈ సామాజిక తరగతికి చెందిన వారు. వీరుగాక 7.61శాతం మంది ఆఫ్రో-బ్రెజిలియన్లు ఉన్నారు. బోల్సనారో మూలాలు ఇటాలియన్‌-జర్మన్‌ జాతీయులవి. జనాభాలో ఉన్న ఈ పొందిక అక్కడ జాత్యహంకార, వివక్ష సమస్యలను కూడా ముందుకు తెస్తున్నాయి. మత రీత్యా 89శాతం మంది క్రైస్తవులు కాగా వారిలో నాలుగింట మూడు వంతులు రోమన్‌ కాథలిక్కులు.

అమెరికా, ఐరోపా దేశాలతో సత్సంబంధాలను కోరుతున్నట్లు లూలా ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నాడు.ఒక ఎత్తుగడగా లేదా అనివార్యమైగానీ ఈ దేశాలు వెంటనే స్పందించి అభినందన సందేశాలు పంపాయి. చైనాతో సంబంధాల గురించి ప్రత్యేకంగా విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. బోల్సనారో పాలనలో చైనా వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున సాగినప్పటికీ పెట్టుబడులు, వాణిజ్య లావాదేవీలు పెద్దగా ప్రభావితం కాలేదు. ఇప్పుడు లూలా వాటితో పాటు ఇతర అంశాలల్లో చైనాతో సంబంధాలకు ముందుకు పోతారని చెబుతున్నారు. ఇప్పటికే బ్రెజిల్‌, రష్యా,భారత్‌,చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ” బ్రిక్స్‌” బృందం సంబంధాలు మరింతగా విస్తరించవచ్చు. బోల్సనారో ఎంతసేపటికీ పశ్చిమ దేశాలతో కూడిన ఓయిసిడి కూటమి వైపు మొగ్గుచూపాడు.చైనా చొరవతో అమలు జరుపుతున్న బిఆర్‌ఐ పధకంలో భాగంగా ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో తన పాలనా కాలంలో అమలు జరిపిన సంక్షేమ పధకాలను ఎన్నికల ప్రచారంలో లూలా మరోసారి గుర్తుకు తెచ్చారు.
ప్రపంచబాంకు నివేదిక ప్రకారం లూలా పాలనా కాలంలో 2003-2009 కాలంలో బ్రెజిల్‌ మధ్యతరగతి కుటుంబాలు 50శాతం పెరిగాయి. బ్రెజిల్‌తో సహా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, మాంద్యం, వృద్ధి రేట్లు పడిపోవటం వంటి పరిణామాలు, పర్యవసానాల నేపధ్యంలో గతంలో మాదిరి సంక్షేమ పధకాలను ఎలా అమలు జరుపుతారన్నది అనేక మందిలో ఉన్న సందేహం. ఆదాయం పెరిగినకొద్దీ పన్ను రేట్లు పెంచుతామని, ప్రభుత్వ ఖర్చు మీద విధించిన ఆంక్షలను ఎత్తివేస్తానని, కనీసవేతనాల పెంపుదల ద్వారా అర్థిక అసమానతల తగ్గింపు, సామాజిక న్యాయం అమలు చేస్తానని వాగ్దానం చేశాడు. సవాళ్లతో పాటు లాటిన్‌ అమెరికాలో వామపక్షాల విజయపరంపరలో లూలా గెలుపు కార్మికోద్యమాలకు, అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకించే శక్తులకు మరింత ఊపు,బలాన్ని ఇస్తుంది.