Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


చైనా నుంచి పెద్ద ఎత్తున కంపెనీలు వెలుపలికి వస్తున్నాయి. అదింకేమాత్రం ప్రపంచ ఫ్యాక్టరీగా ఉండదు. చైనా వైఫల్యం – భారత అదృష్టం ఇలాంటి వార్తలు, విశ్లేషణలు ఇటీవల మరోసారి పెరిగాయి. ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. పరిస్థితులన్నీ ఒకే విధంగా ఎప్పుడూ ఉండవు. చైనా దానికి మినహాయింపు కాదు.దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమని చెప్పి పాలు పితికేందుకు పూనుకున్నట్లుగా కొందరున్నారు.ఆత్ర పడినంత మాత్రాన లేదా అదృష్టాన్ని నమ్ముకుంటే కంపెనీలు వస్తాయా ? మన దేశం చైనాను వెనక్కు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా మారుతుందా, పోటీ పడి మారాలని కోరుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు, అది వాస్తవాల ప్రాతిపదికగా ఉండాలి. ఇంతకూ అసలు నిజానిజాలేమిటి ?


2022 అక్టోబరు చివరి వారంలో అమెరికాకు చెందిన సిఎన్‌బిసి ఒక విశ్లేషణను ఇచ్చింది.2016 నుంచి 2022లో ఇప్పటి వరకు వచ్చిన మార్పులను అది పేర్కొన్నది. దాని ప్రకారం ప్రపంచ దుస్తులు, వాటి సంబంధిత వస్తువుల ఎగుమతుల్లో చైనా వాటా 41 నుంచి 37శాతానికి, ఫర్నీచర్‌లో 64 నుంచి 53కు, పాదరక్షలు 72 నుంచి 65, ప్రయాణ వస్తువులు, చేతి సంచుల వాటా 83 నుంచి 70శాతానికి తగ్గింది. ఇదే కాలంలో వియత్నాం వాటా ఫర్నీచర్‌లో 8 నుంచి 17 శాతానికి, పాదరక్షలు 12 నుంచి 16, ప్రయాణ వస్తువులు, చేతి సంచుల వాటా 6 నుంచి 10శాతానికి పెరిగింది. బంగ్లాదేశ్‌ నుంచి దుస్తులు పది నుంచి 12 శాతానికి పెరగ్గా, మలేషియా నుంచి దుస్తులు 14 నుంచి 19శాతానికి పెరిగి తిరిగి 14శాతానికి తగ్గాయి. మన దేశ వివరాలను అది అసలు పరిగణనలోకే తీసుకోలేదు. కఠినమైన కరోనా నిబంధనలు, లాక్‌డౌన్ల కారణంగా ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా తగ్గటానికి ఒక కారణంగా సిఎన్‌బిసి పేర్కొన్నది. జీరో కరోనా విధానాల కారణంగా ఉత్పత్తిమీద తిరోగమన ప్రభావం పడటంతో దిగుమతిదారులు ప్రత్యామ్నాయాలను చూసుకున్నారని ఎండిఎస్‌ ట్రాన్స్‌మోడల్‌ సలహాదారు ఆంటోనెలా టియోడోరో చెప్పాడు. చైనా వాటా తగ్గినందున అత్యధికంగా లబ్ది పొందింది వియత్నాం తప్ప మరొక దేశం కాదని అందరూ చెబుతున్నారు.2014 నుంచి అది సుదూర వాణిజ్యాన్ని 360 శాతం పెంచుకుందని ఆంటోనెలా చెప్పాడు. కరోనా నిబంధనలను ఎత్తివేస్తే తిరిగి చైనా వాటా పెరగనూ వచ్చు.


మన దేశంలో ఉన్న వారు ఆలోచించాల్సింది ఈ అవకాశాన్ని వినియోగించుకోవటంలో నరేంద్రమోడీ సర్కార్‌ఎందుకు విఫలమైందన్నదే. వస్తూత్పత్తి చౌకగా అంటే చౌకగా దొరికే శ్రామిక శక్తి వియత్నాంలో ఉన్నందున పరిశ్రమలు, పెట్టుబడులు అక్కడకు వెళుతున్నట్లు కొందరు చెబుతున్నారు. అదే గనుక అసలు కారణమైతే ఈ పాటికి మన దేశం ప్రపంచ ఫ్యాక్టరీగా మారి ఉండాలి. వికీపీడియా సమాచారం ప్రకారం వియత్‌నామ్‌లో 2020 వివరాల ప్రకారం ఏడాది కనీస వేతనం సగటున 1,591 డాలర్లు, మన దేశంలో 2015 వివరాల ప్రకారం 664 డాలర్లు, చైనాలో 2018 ప్రకారం 2,084 డాలర్లు ఉంది.( తాజా వివరాల ప్రకారం అదింకా పెరిగింది) పోనీ నరేంద్రమోడీ అచ్చేదిన్‌లో భాగంగా ఇప్పటికి కనీసవేతనం రెట్టింపు చేశారని అనుకున్నా, వియత్‌నామ్‌ కంటే తక్కువే ఉంటుంది.మోడీ సర్కార్‌ నైపుణ్యశిక్షణ ఇచ్చింతరువాత కూడా మరెందుకు చైనా కంపెనీలు మన వైపు రాకుండా అక్కడికి పోతున్నట్లు ?


ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సింది చైనా నుంచి గానీ మరొక దేశం నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులను అమెరికా లేదా ఐరోపాలోని ధనిక దేశాలు ఉత్పత్తి చేయలేనివి, అసాధ్యమైనవి అంతకంటే కాదు. శ్రమశక్తికి చెల్లించే వేతనాలు అసలు అంశం. తమ దగ్గర ఉన్న రేట్లను పోల్చి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడి ధనిక దేశాల పెట్టుబడిదారులు అక్కడికి పోతున్నారు. చైనాలో తక్కువ వేతనాలకు పనిచేసే కార్మికులు, జనాభా, అక్కడి మౌలిక సదుపాయాలు, మార్కెట్‌, తదితర అవకాశాలను చూసి గత నాలుగు దశాబ్దాల్లో చలో చైనా బాట పట్టారు.చైనాలో వేతనాలను పెంచుతున్న కొద్దీ చైనాలో ఉన్న విదేశీ కంపెనీల లాబీలు ప్రభుత్వాన్ని బెదిరించి వేతనాలు పెంచకుండా చూసేందుకు విశ్లేషణల పేరుతో కథనాలను వండివారుస్తున్నాయి. ఉదాహరణకు 2010 జూన్‌ నెలలో ఫైబర్‌ టు ఫాషన్‌ అనే వెబ్‌సైట్‌(పత్రిక)లో కార్మికవేతన ఖర్చు పెరుగుతున్న కారణంగా వస్తున్న వత్తిడితో అమెరికా దుస్తుల కంపెనీల సంస్థలు చైనా నుంచి వెలుపలికి పోయి ఇతర దేశాల్లో తమ సంస్థల ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని భారత్‌తో సహా ఆసియాలోని సహదేశాలు వినియోగించుకుంటాయా అనే పద్దతిలో ఒక విశ్లేషణ ప్రచురితమైంది. చిల్లర అమ్మకాల దిగ్గజాలైన కోచ్‌,ఆన్‌ టైలర్‌ స్టోర్స్‌,గస్‌,జె సి పెనీ వంటి కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను విదేశాలకు తరలించే ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నది. 2010 ఒక నివేదిక ప్రకారం గంటలకు కార్మికవేతన వేతనం( పెట్టుబడిదారుల పదజాలంలో ఖర్చు ) 1.84 డాలర్లని అంతకు ముందు ఏడాది కంటే 17శాతం పెరిగినట్లు అదే భారత్‌లో గంటకు 2.99 డాలర్లు, వియత్నాంలో 0.49 డాలర్లు ఉన్నట్లు తెలిపింది. చైనా వేతన ప్రమాణాలను పెంచటం, కరెన్సీ ఎన్‌ విలువ పెరగటం వంటి కొన్ని అంశాలను కూడా పేర్కొన్నారు.


ఆ తరువాత గడచిన పది సంవత్సరాల్లో కరోనాకు ముందు ఇప్పుడు కూడా ఇలాంటి విశ్లేషణలను ప్రచురించని ఏడాది లేదంటే అతియోక్తి కాదు. అయినప్పటికీ పొలోమంటూ మొత్తంగా చైనాను ఖాళీ చేసి విదేశీ బాట పట్టిందేమీ లేదు. దాని ఎగుమతుల్లో వచ్చిన మార్పును పైన చూశాము. 2022 నవంబరు ఏడవ తేదీన అంతకు ముందు ప్రచురించిన వివరాలను నవీకరించి చైనా బ్రీఫింగ్‌ డాట్‌ కామ్‌ అనే సంస్థ చైనాలో పెట్టుబడులు పెట్టదలచుకున్న వారికోసం అనేక వివరాలను ప్రచురించింది. దానిలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న కనీసవేతనాలు, నిబంధనలు తదితర అంశాలను వెల్లడించింది. దాని ప్రకారం 31రాష్ట్రాలలో షాంఘైలో కనీసవేతనం గరిష్టంగా నెలవారి 2,590యువాన్లు లేదా 400 డాలర్లు ఉండగా బీజింగ్‌లో గంటకు 25.3 యువాన్లు లేదా 3.99 డాలర్లు ఉంది. మిగతా చోట్ల రాష్ట్రాల వారీ అంతకంటే తక్కువ ఉన్నాయి. కనిష్టంగా అన్‌హులో 1,340యువాన్లు లేదా 212 డాలర్లు ఉంది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు జోన్లలో చివరిది ఒకటవ జోన్‌లో 1,650యువాన్లు ఉంది. ప్రతి చోటా ఇలా జోన్ల వారీ హెచ్చు తగ్గులుంటాయి. నవంబరు 8వ తేదీన ఒక డాలరుకు మన కరెన్సీ మారకం విలువ రు.81.80కి అటూ ఇటుగా, ఒక యువానుకు రు.11.26 ఉంది.
మన కనీస వేతనాల్లో వైద్య బీమా – ఇఎస్‌ఐ నిమిత్తం కార్మికులు,యజమానులు చెల్లించాల్సి వాటాలు ఎలానో చైనాలో ఇతర అంశాలతో పాటు ఇంటి బీమా కోసం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం క్రితపు ఏడాదిలో మూడు నెలల సగటు వేతనాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంటే సగం దానిలో కార్మికుడు చెల్లిస్తే మరో సగం కంపెనీ చెల్లిస్తుంది. ఆ నిధులను కార్మికులు గృహాలను కొనుగోలు చేసేందుకు మాత్రమే అనుమతిస్తారు. ఈ మొత్తాలు కనీస వేతనం పెరిగినపుడల్లా దానికి అనుగుణంగా పెరుగుతాయి. ఇవి కనీసవేతనాలు మాత్రమే. ఉదా షాంఘై నగరంలో 2020లో సగటు నెల కనీసవేతనం 1,632 డాలర్లు అంటే రు.1లక్షా 33వేలు. ఇది ప్రభుత్వం ప్రకటించిన నాటి కనీసవేతనం కంటే నాలుగు రెట్లు. మొత్తం వేతనంతో పాటు ఇతర సామాజిక రక్షణ పధకాలకు గాను యజమానులు చెల్లించాల్సిన మొత్తం 37శాతం ఉంటుందని వీటిని కూడా గమనంలోకి తీసుకోవాలని చైనా బ్రీఫింగ్‌ డాట్‌ కామ్‌ సమాచారం పేర్కొన్నది.


చైనా ఉత్పత్తులు నాసిరకమని అనేక మంది ప్రచారం చేశారు. నిజానికి చైనా బజార్ల పేరుతో మన దేశంలో విక్రయించే వస్తువులన్నీ చైనావి కాదు. తక్కువ ధరలకు వచ్చేవన్నీ నాసిరకమనే భావన మనలో ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. కానీ అమెరికా, ఐరోపా దుకాణాలన్నింటా చైనా వస్తువులే అన్నది తెలిసిందే. చైనా తన ఎగుమతుల్లో కేవలం రోజువారీ అవసరమైనవే గాకుండా ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వస్తువుల ఉత్పత్తి మీద కేంద్రీకరించింది. ఈ రంగంలో ఇప్పటికీ అమెరికా, ఐరోపా ధనిక దేశాలదే అగ్రస్థానం. నాలుగవ పారిశ్రామిక విప్లవంలో భాగంగా మేడిన్‌ చైనా 2025 పేరుతో అక్కడి ప్రభుత్వం 2015 ప్రారంభించిన పారిశ్రామిక విధానంలో ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తే వాటికి గండితో పాటు పోటీ పెరుగుతుంది. ధరలు కూడా తగ్గుతాయి. ఇది తమకు ముప్పు అని అందరికంటే ముందు గుర్తించింది అమెరికా, అందుకే డోనాల్డ్‌ ట్రంప్‌ 2018లో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించాడు.తమ ఉత్పత్తులకు ఎదురుకానున్న పోటీ గురించి చెప్పటానికి బదులు చైనా తమ పరిజ్ఞానాన్ని తస్కరించిందని, తమ భద్రతకు ముప్పు ఉందంటూ అమెరికా ప్రచారం చేస్తున్నది.


ఏ దేశానికి ఆ దేశం భిన్నమైన పేర్లతో ఇలాంటి విధానాలనే చేపట్టింది.” పరిశ్రమలు 4.0 అభివృద్ధి ప్రణాళిక ” పేరుతో జర్మనీ ప్రకటించింది. మన మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ వంటి వాటి గురించి తెలిసిందే. ప్రపంచం వంద సెమీ కండక్టర్లను వాడుతుంటే అందులో చైనా వాటా 60, దానికి గాను అది ఉత్పత్తి చేస్తున్నది పదమూడు మాత్రమే. చైనా ప్రకటించిన లక్ష్యాల ప్రకారం 2025నాటికి ఈ రంగంలో 70శాతం స్వయం సమృద్ధి సాధించాలని, 2049లో వందేళ్ల చైనా కమ్యూనిస్టు పాలన నాటికి హైటెక్‌ పరిజ్ఞానంలో అగ్రగామిగా ఉండాలని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే దుస్తులు, పాదరక్షల వంటి వాటి మీద పని చేస్తూనే ఇతర కీలక రంగాల మీద కేంద్రీకరించారు.లాభాలను మాత్రమే చూసుకొనే విదేశీ కంపెనీలు చైనాలో పెరుగుతున్న వేతన ఖర్చు, ఇతర రాజీలేని నిబంధనల కారణంగా ఇతర దేశాలవైపు చూస్తున్నాయి. అందువలన కొన్ని పరిశ్రమలు వెళ్లవచ్చు. అలా వెళితే వాటికే నష్టం. వాటి ఉత్పత్తులకు చైనా మార్కెట్‌లో అవకాశం ఉండదు. అందువలన ఎందరు ఎన్ని విశ్లేషణలు చేసినా, పారిశ్రామికవేత్తల ఆలోచనలు భిన్నంగా ఉంటున్నాయి.

చైనా చేపట్టిన సంస్కరణల గురించి భిన్న అభిప్రాయం వెల్లడించే కొందరు వామపక్ష వాదులు గానీ, అది కూలిపోతుంది, వాలిపోతుంది అని గత నాలుగు దశాబ్దాలుగా జోశ్యాలు చెబుతున్న చైనా వ్యతిరేకులకు గానీ ఇంత కాలం ఆశాభంగమే తప్ప మరొకటి లేదు. అయితే చైనాకు ఎలాంటి సమస్యలు, సవాళ్లు లేవా ? లేవని ఎవరు చెప్పారు ! పెట్టుబడిదారీ సమాజాన్ని నెలకొల్పేందుకు పూనుకున్నవారికి అంతా పూలబాటగా ఎలాంటి ప్రతిఘటన, సవాళ్లు లేకుండా అంతా సాఫీగా నడిచిందా, ఆధిపత్యం కోసం ఖండాలు, ప్రపంచ యుద్ధాలు చేసుకున్నారు. సోషలిస్టు సమాజ నిర్మాణంలో పెట్టుబడిదారుల నుంచి ప్రతిఘటన లేకుండా ఎలా ఉంటుంది ?


చైనా ఒక విధానాన్ని అనుసరించి అనూహ్య విజయాలను సాధించింది. ఆ…. అది ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం తప్ప సోషలిజం ఎక్కడుంది అనే వారు కొందరు. నిజమే, సోషలిజం లేనపుడు అది వద్దని కోరుకొనే వారు ఆ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానంతో చైనా మాదిరి ఎందుకు ముందుకు పోవటం లేదు ? అక్కడంతా నిరంకుశత్వం ఉంటుంది అనే వాదన మరొకటి. ప్రపంచంలో అనేక దేశాలు మిలిటరీ నిరంకుశపాలనలో ఉన్నాయి,మరి అవెందుకు చైనా మాదిరి పురోగమించలేదు. పత్రికల రాతలను చూసి గతంలో కంపెనీలు చైనాకు వరుసలు కట్టలేదు. ఇప్పుడు వీటిని చూసి తిరుగుముఖం పడితే ఏం చేయాల్సిందీ చైనా వారు చూసుకుంటారు. వసుధైక కుటుంబం, సర్వే జనా సుఖినో భవా, అందరూ బాగుండాలి-అందులో నేనుండాలి అనుకొనే దేశంలో చైనా ఆర్థికంగా దెబ్బతింటే బాగుపడేది మనమే లేదా మనకు మంచి అవకాశం అనే ఆలోచనలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. చైనా మీద విద్వేషాన్ని విపరీతంగా రెచ్చ గొట్టిన పర్యవసానమిది. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో మాదిరి కష్టపడకుండా లక్కు మీద ఆధారపడి పనీ పాటా లేకుండా తిరిగే సోంబేరుల మాదిరి ఉండి బాగుపడిన వారెవరూ లేరు. ప్రపంచ ఫ్యాక్టరీగా ఉన్న చైనా దెబ్బతింటే తప్ప మనకు అవకాశాలు రావని చెప్పే ప్రబుద్దుల మాటలు విని దాని కోసం ఎదురు చూస్తూ చేయాల్సినవి చేయకుండా కూర్చుంటే ఫలితం ఉండదని పాలకులకు, ఇతరులకు ఎవరు చెప్పాలి ?