Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఏం జరుగుతోంది ? అందరూ శాకాహారులే రొయ్యలబుట్ట మాయం అన్నట్లుగా దేశంలో అందరూ సత్యహరిశ్చంద్రుల వారసులం, అవినీతి అంటే అదేమిటో తెలియని వారం అన్నట్లుగా ఉంటారు. అయినా అవినీతి గురించి మాట్లాడని రోజు లేదు. దేశంలో అవినీతిని రూపు మాపేందుకు ఒక నిపుణుల కమిటీని వేసేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ బిజెపి నేత అశ్వనీ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన దరఖాస్తును సుప్రీం కోర్టు కొట్టివేసింది. అదే బిజెపి నేతలు మరొక వైపు దేశంలో అవినీతి లేదు అక్రమాలు లేవంటూ రోజూ ఢంకా బజాయించి మరీ చెబుతుంటారు. స్వచ్చత సూచికలను ప్రకటిస్తున్న మాదిరి నెల లేదా మూడు నెలలకు ఒకసారి అవినీతి అధికారుల మీద ఉన్న కేసుల ఆధారంగా వివిధ శాఖలకు కూడా సూచికలను ప్రకటించాలని ప్రధాని నరేంద్రమోడీ చెబుతారు. ఆచరణ చూస్తే విస్తుపోతారు. అవినీతి గురించి 2014 తరువాత చెప్పిన వాటిని అమలు చేయకుంటే బిజెపికి వ్యతిరేకంగా తమ బృందం ఆందోళనకు దిగుతుందని అన్నాహజారే కార్యదర్శి కల్పనా ఇనాందార్‌ ప్రకటించారు. కొంత మంది నమ్ముతున్నట్లుగా ఆ జగన్నాటక సూత్రధారి ఎవరిని ఎలా ఆడిస్తున్నాడో, ఎందుకు అలా ఆడిస్తున్నాడో అర్ధం కావటం లేదు.


అవినీతి సూచికలో మన దేశ స్థానాన్ని మెరుగుపరిచేందుకు ప్రపంచంలో తొలి 20 స్థానాల్లో ఉన్న దేశాలు అనుసరిస్తున్న అవినీతి నిరోధక విధానాలు, అవగాహన ఏమిటో తెలుసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిపుణులతో కమిటీలు వేసేవిధంగా, దేశ అవినీతి సూచిక మెరుగుపడే విధంగా అవగాహనకు సూచనలు చేసే విధంగా లా కమిషన్ను ఆదేశించాలని అశ్వినీ ఉపాధ్యాయ పిటీషన్‌ దాఖలు చేశారు. సంబంధిత అంశాలపై పని చేస్తున్న వారిని సంప్రదించాలని, మన దగ్గర ఇప్పటికే ప్రత్యేక చట్టాలున్నాయని, అవినీతి నిరోధానికి చర్యల గురించి లా కమిషన్ను అడుగుతామంటూ పిటీషన్ను కోర్టు కొట్టివేసింది. నరేంద్రమోడీకి అధికారాన్ని కట్టబెట్టంలో కాంగ్రెస్‌ నేతల అవినీతి, అక్రమాలు ప్రధాన పాత్ర పోషించిన అంశం తెలిసిందే.ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ (టిఐ) ప్రకటించిన అవినీతి సూచికలో 2012, 13 సంవత్సరాల్లో మన దేశం 94వ స్థానంలో 2014లో 85, 2015లో 76కు ఎదిగింది. తరువాత క్రమంగా దిగజారుతూ 2020లో 86, 2021లో 85లో ఉంది.2022 సూచికను వచ్చే ఏడాది జనవరిలో ప్రకటిస్తారు. అవినీతి అంతం గురించి చెప్పిన నరేంద్రమోడీ ఏలుబడిలో తిరిగి అది కోరలు చాస్తోందన్నది స్పష్టం. టిఐ సూచికలు సరైనవా కాదా అన్న చర్చకు వస్తే కాంగ్రెస్‌ పాలనలో-బిజెపి ఏలుబడిలో సూచికలను ఇచ్చింది కూడా అదే సంస్థ కనుక మోడీ పాలన గురించి ఇచ్చింది తప్పైతే కాంగ్రెస్‌ పాలన గురించి చెప్పింది కూడా తప్పే అవుతుంది. ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తోంది కనుకనే అసలు దాని గురించి చర్చకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. వచ్చినా మా మోడీ మీద ఇంతవరకు ఒక్క ఆరోపణలేదుగా అని ఎదురుదాడికి దిగుతున్నారు. ఆ మాటకొస్తే మన్మోహన్‌ సింగ్‌ మీద కూడా ఏమీ లేవు.


ఇటీవల నిఘా చైతన్య వారోత్సవాల్లో ప్రధాని నరేంద్రమోడీ ఎన్నో సుభాషితాలు పలికారు. అధికారుల మీద అపరిష్కృతంగా ఉన్న కేసుల సంఖ్యను బట్టి వివిధ శాఖలకు సూచికలు ఇవ్వాలని సూచించారు. ఆ నిర్ణయం చేసి ఆ సభలో పాల్గొని ఉంటే విశ్వసనీయత ఉండేది.ఎవరు అడ్డుపడ్డారు ? కేంద్ర నిఘా సంస్థలో ఫిర్యాదుల యాజమాన్య వ్యవస్థను ప్రధాని ప్రారంభించారు. అవినీతి నిరోధక సంస్థలలో పని చేస్తున్నవారి మీద బురద చల్లేందుకు, పని చేయనివ్వకుండా చూసేందుకు స్వప్రయోజనపరులు చూస్తారని,ఆ క్రమంలోనే తనను కూడా లక్ష్యంగా చేసుకున్నారని, కానీ జనం దేవుళ్లు వారికి నిజం తెలుసు, తరుణం వచ్చినపుడు వారు నిజానికి మద్దతుగా నిలుస్తారు అన్నారు. కేంద్ర నిఘా సంస్థ 2021 వార్షిక నివేదిక ప్రకారం కేంద్ర శాఖల్లోని అధికారులు, సిబ్బందిపై వచ్చిన 1,09,214 ఫిర్యాదుల్లో ప్రధాని తరువాత స్థానంలో ఉన్న అమిత్‌ షా నిర్వహిస్తున్న హౌంశాఖ మీద వచ్చినవి 37,670, తరువాత 11,003తో రైల్వే, 6,330తో బాంకులు ఉన్నాయి. 2013లో సివిసికి 35,332 వచ్చాయి. ఆ తరువాత నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. దీని భావమేమి తిరుమలేశా ! మోడీ అధికారానికి వచ్చిన తరువాత అధికారుల్లో అవినీతి పెరిగినట్లా తగ్గినట్లా !!


కేసుల గురించి సూచికలు ఇమ్మని ప్రధాని చెప్పారు సరే, తన ఏలుబడిలోని ప్రభుత్వ శాఖలు ఎలా పనిచేస్తున్నట్లు ? కామన్‌వెల్త్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇనీషిఏటివ్‌ సంస్థ ఒక సమాచారహక్కు ప్రశ్నకు ఇచ్చిన సమాధానాన్ని వెల్లడించింది. దాని ప్రకారం 2013 ఏప్రిల్‌ నుంచి 2017 ఫిబ్రవరి వరకు డిజిఎఫ్‌టి కార్యాలయాలకు అందిన 181 అవినీతి ఫిర్యాదులపై ఒక్కదాని మీద కూడా ఎలాంటి చర్యలు ప్రారంభించలేదని, 2009లో వచ్చిన వాటిలో ఒక కేసులో ఒక అధికారిపై విధించిన పెనాల్టి వివరాలను కూడా సమాచార హక్కు కింద ఇవ్వలేదని తేలింది.దరఖాస్తులకు సమాధానాలు కూడా ఇవ్వలేదు. కర్ణాటక లోకాయక్త సమాచారహక్కు ప్రశ్నకు ఇచ్చిన సమాధానం మరింత దారుణంగా ఉంది. అవినీతి కేసులు,తాను దర్యాప్తు చేసిన వాటి వివరాలను గణాంకాలను నిర్వహించాల్సిన బాధ్యత తమకు లేదని, 2006లో కేంద్ర సమాచార కమిషన్‌ జారీ చేసిన ఉత్తరువు ప్రకారం పెద్ద ప్రజా ప్రయోజనం ఉంటే తప్ప సమాచారం ఇవ్వనవసరం లేదని, సమాచారం గనుక ఇస్తే నిందితులైన అధికారుల గోప్యతకు భంగం కలుగుతుందని కూడా సమాధానమిచ్చింది. నిఘా చైతన్య వారోత్సవాల్లో ఇలాంటి సంస్థలు, వ్యవస్థ అధికారులకే నరేంద్రమోడీ సుభాషితాలను వినిపించారు.


నరేంద్రమోడీ పాలనలో అవినీతి పెరిగిందని, గ్రామాల సంపదలను పారిశ్రామికవేత్తలు లూటీ చేస్తుంటే ప్రభుత్వం మౌనంగా ఉందని అన్నా హజారే కార్యదర్శి కల్పన నవంబరు పదవ తేదీన లక్నోలో రాష్ట్రీయ కిసాన్‌ మంచ్‌ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చెప్పారు.2011లో అన్నా ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఆందోళన కారణంగా కాంగ్రెస్‌కు మారుగా బిజెపి అధికారానికి వచ్చిందని ఎనిమిది సంవత్సరాలుగా చేసిందేమీ లేదన్నారు. గతంలో కూడా అన్నా హజారే ఇలాంటి హెచ్చరికలే చేశారు. ఇప్పుడేం చేస్తారో చూడాల్సి ఉంది. మోడీ అధికారానికి వచ్చిన తరువాత ఇడి తదితర సంస్థల దాడులు విపరీతంగా పెరిగాయి. అవినీతి మీద పోరులో తమ తీరుకు ఇది నిదర్శనం అని బిజెపి చెప్పుకుంటుంది. అసలు కథలు వేరే అన్నది తెలిసిందే. ఆర్ధికరంగం క్రమబద్దీకరణ జరిగి పన్ను ఎగవేతలు, ఆర్ధిక నేరాలకు తావు లేదంటున్నారు, మరి గత ఎనిమిదిన్నర సంవత్సరాల్లో దాడుల సంఖ్య విపరీత పెరుగుదలకు కారణం ఏమిటి ? 2004 నుంచి 2014 వరకు 112 ఇడి దాడులు జరిగితే 2014నుంచి 2022 వరకు3,010 దాడులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. నూటపన్నెండు దాడుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం రు.5,346 కోట్లు , 3010 దాడుల్లో చేసుకున్నది రు.99,356 కోట్లు.3010 కేసుల్లో శిక్షలు పడింది కేవలం 23 ఉదంతాల్లోనే, అందుకే వీటిని ప్రతిపక్షాల నేతల మీద బెదిరింపు దాడులని జనాలు అనుకుంటున్నారు. ఏటా జిఎస్‌టి 85వేల కోట్ల మేరకు ఎగవేస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన రుబిక్స్‌ సంస్థ అంచనా వేసింది. ఇలా అవినీతి గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు.


ఇటీవలి కాలంలో సమాచార కేంద్రాల అనుసంధానం కారణంగానే చట్టబద్దంగా జరిగే లావాదేవీల మీద నిఘాతో పాటు అక్రమాలను కనుగొనటం కూడా సులభతరమైంది. వాటి ఆధారంగా అక్రమార్కుల మీద తీసుకొంటున్న చర్యలే ప్రశ్నార్దకం. రెండవది అక్రమాలకు పాల్పడుతున్నవారు గతంలో మాదిరి నగదుతోనే పని నడిపిస్తున్నారు. అందుకే దాడులు జరిపితే టన్నుల కొద్దీ నగదు పట్టుబడుతున్నది. పెద్ద నోట్ల రద్దు తరువాత ఆర్ధిక రంగంలో నగదు సరఫరా 17.7లక్షల కోట్ల నుంచి 32లక్షల కోట్లకు పెరిగింది. అవినీతి పెరుగుదలకు ఇదొక సూచిక. మోడీ సర్కార్‌ చెబుతున్నట్లు లావాదేవీలన్నీ బాంకుల ద్వారా జరిగితే ఇటీవల తెలంగాణాలోని మునుగోడు, అంతకు ముందు హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో వందల కోట్ల ఖర్చు గుట్టువెల్లడికావాలి. అలాంటిదేమీ లేదు.


2014కు ముందు అవినీతి ప్రభుత్వానికి ఒక అత్యవసరమైన భాగంగా ఉండేది, ఇప్పుడు ఏ మాత్రం సహించని విధానం అనుసరిస్తున్నామని నరేంద్రమోడీ హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల సభల్లో చెప్పారు. మాటలు కాదు ఆచరణ అన్నది అసలు జరుగుతున్నదేమిటో మనకు చూపుతుంది.లోక్‌ పాల్‌ జోక్‌ పాల్‌గా మారిందని కేంద్ర సమాచార కమిషన్‌ మాజీ సభ్యుడు శైలేష్‌ గాంధీ చమత్కరించారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేసిన ఆందోళనకు మోడీ అండ్‌ కో మద్దతు ఇచ్చింది. దాన్నే ఒక ప్రధాన ఎన్నికల అంశంగా చేసుకొని లబ్ది పొందింది. అలాంటి పెద్దలు సుప్రీం కోర్టు ఆదేశించిన తరువాతనే ప్రధాని పీఠం ఎక్కిన ఐదు సంవత్సరాల తరువాత ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లు లోక్‌పాల్‌ నియామకం జరిపారు.
అన్నా హజారే తదితరుల ఆందోళన, అనేక అవినీతి ఆరోపణల పూర్వరంగంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం 2013లో లోక్‌పాల్‌, లోకాయక్త చట్టాలను చేసింది. ఈ వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ అంతకు ముందు ఎప్పటి నుంచో ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చిన ఐదు సంవత్సరాల తరువాత ఏర్పాటు చేశారు. లోక్‌పాల్‌ వ్యవస్థలో బిజెపి అనుకూలురను నింపి దాన్ని ఒక ప్రహసన ప్రాయంగా మార్చారనే విమర్శలు ఉన్నాయి. అన్నా హజారే బృందంలోని కిరణ్‌ బేడి తరువాత బిజెపిగా అసలు రూపాన్ని వెల్లడించారు.అరవింద్‌ కేజరీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రధాని అధ్యక్షతన లోక్‌పాల్‌ ఎంపిక కమిటీని ఏర్పాటు చేసిన తరువాత దాదాపు నాలుగు సంవత్సరాలు నరేంద్రమోడీ ఆ కమిటీతో ఒక్కసారి కూడా సమావేశం కాలేదని 2018లో సమాచర హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం వెల్లడించిందని అంజలీ భరద్వాజ తెలిపారు. అంతకు ముందు లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయకుంటే ఆందోళన చేస్తానని 2015లో అన్నా హజారే ప్రకటించారు. రెండేళ్ల తరువాత 2017లో మోడీని ప్రశ్నిస్తూ ఒక ప్రకటన చేశారు.2018లో ఆరు రోజులు నిరసన దీక్ష చేపట్టారు. లోక్‌పాల్‌ అంశం సుప్రీం కోర్టు ముందుకు వచ్చినపుడు అది ” ఒక సంక్లిష్టమైన ప్రక్రియ ” అని కేంద్ర ప్రభుత్వం నివేదించింది. ప్రభుత్వ వివరణ ఏమాత్రం సంతృప్తికరంగా లేదని సుప్రీం కోర్టు అన్నది. చివరకు 2019లో నియమించారు. ఎంపిక కమిటీ కూడా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రధాని అధ్యక్షులు, లోక్‌సభ స్పీకర్‌, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రతినిధి, ప్రతిపక్ష నేత, మరో ప్రముఖ న్యాయవాది, అంటే ముగ్గురు అధికారపార్టీ వారే ఉంటారు లేదా మద్దతుదారులు ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేను కమిటీ ఆహ్వానితుడిగా మాత్రమే పిలిచారు.ఎంపికలో తన పాత్ర ఉండదు కనుక సమావేశాన్ని బహిష్కరించారు. ఆ కమిటీ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మార్చినెలలో లోక్‌పాల్‌గా సుప్రీం కోర్టు జడ్జిగా పనిచేసిన పినాకి చంద్రను ఎంపిక చేశారు.


ఇక లోక్‌పాల్‌కు వచ్చిన ఫిర్యాదుల తీరుతెన్నులను చూస్తే 2019-20లో వచ్చిన 1,427లో 85 శాతం తమ పరిధిలోకి రావని, ఆరుశాతం సరైన పద్దతిలో నింపలేదని తిరస్కరించారు. మిగిలిన వాటిని విచారించి నిగ్గుతేల్చిందేమిటో జనానికి తెలియదు. నియామకం జరిగి ఏడాది కూడా నిండక ముందే లోక్‌పాల్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న దిలీప్‌ భోంసలే 2020 జనవరి ఆరున ” వ్యక్తిగత కారణాల ”తో రాజీనామా చేశారు. తరువాత వెల్లడైనదేమంటే భోంసలేకు ఆఫీసు లేదా అధికారిక పనిగానీ లేదంటూ మూడు లేఖలు రాసినా లోక్‌పాల్‌ చైర్మన్‌ పట్టించుకోలేదు.” తొలి రోజు నుంచీ పని చేయకపోవటాన్ని, మబ్బుగా ఉండటాన్ని చెబుతూనే ఉన్నాను. చైర్మన్‌ నా సూచనలను పూర్తిగా పక్కన పడేశారు. ఏ మాత్రం ఆసక్తి చూపలేదు, స్పందన ప్రతికూలంగా ఉంది ” అని భోంసలే చెప్పినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రాసింది. తన వద్దకు వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం నిరర్థకమైనవని, వాటి గురించి మూడు సంవత్సరాల తన పదవీకాలాన్ని గడిపితే సమయం వృధా తప్ప మరొకటి కాదని భోంసలే అన్నారు. పని చేయాల్సిన పద్దతి ఇది కాదు, పరిస్థితిని మెరుగుపరిచేందుకు చైర్మన్‌ ఎలాంటి చొరవ చూపలేదని అన్నారు.


జస్టిస్‌ భోంసలే రాజీనామా తరువాత మరొక జడ్జి కరోనాతో మరణించారు. ఆ రెండు పోస్టులను ఇంతవరకు నింపలేదు. విచారణ, ప్రాసిక్యూషన్‌ డైరెక్టర్ల పోస్టులతో పాటు అవసరమైన ఇతర సిబ్బందిని కూడా కేంద్రం నియమించలేదు. కేటాయించిన నిధుల్లో మూడో వంతు కూడా ఖర్చు పెట్టలేదని 2021లో పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆందోళన వెల్లడించింది. గుజరాత్‌ సిఎంగా నరేంద్రమోడీ లోకాయక్త గురించి అనుసరించిన వైఖరిని చూస్తే లోక్‌పాల్‌ జోక్‌ పాల్‌గా ఎందుకు మారిందో అర్ధం చేసుకోవచ్చు. పదేండ్ల పాటు గుజరాత్‌ లోకాయక్త నియామకం జరపలేదు లేదా వ్యతిరేకించారు. 2011లో నాటి గవర్నర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి జస్టిస్‌ ఆర్‌ఏ మెహతాను నియమించగా తొలగించాలంటూ నరేంద్రమోడీ సుప్రీం కోర్టు తలుపు తట్టి విఫలమయ్యారు. నరేంద్రమోడీ తీరు తెన్నులతో ఆగ్రహించిన జస్టిస్‌ మెహతా బాధ్యతలను తీసుకొనేందుకు తిరస్కరించారు. లోకాయక్తలు ప్రభుత్వ వ్యతిరేక వైఖరితో ఉండకూడదని మోడీ సర్కార్‌ వాదించింది. జస్టిస్‌ మెహతా తిరస్కరణ తరువాత ఏకంగా చట్టానికే సవరణలు తెచ్చారు. నియామక ప్రక్రియలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమేయం లేకుండా చేశారు.మొత్తం ప్రభుత్వానికే అధికారాన్ని కట్టబెట్టారు. నరేంద్రమోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన తరువాత 2016లో లోక్‌పాల్‌, లోకాయక్త చట్టాన్ని నీరుగార్చారు. ఎవరైనా అక్రమంగా సంపాదించిన వారు తమ కుటుంబ సభ్యుల పేర్లతో దాచుకుంటారు. సవరణల ప్రకారం అధికారుల పేరుతో ఉన్నవి తప్ప మిగతా కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేకుండా చేశారు. సమాచార హక్కు చట్టం ప్రకారం ఏ సమాచారం వెల్లడించాలో లేదో నిర్ణయించే అధికారం సమాచార కమిషన్‌కు ఇచ్చింది.

ప్రస్తుత లోక్‌పాల్‌, కమిటీ సభ్యుల ఎంపిక ప్రక్రియ సమావేశాల మినిట్స్‌ ఇవ్వాలని అడిగిన ప్రశ్నకు ఇవ్వనవసరం లేదని 2021లో ప్రభుత్వం పేర్కొన్నది. కేంద్ర సమాచార కమిషనర్ల ప్రక్రియలోనూ మోడీ సర్కార్‌ ఇలాగే తిరస్కరించింది. ఆచరణ ఇలా ఉంటే మరోవైపు బహిరంగ వేదికల మీద చెబుతున్న సుభాషితాలను చూస్తే దగా దగా కుడి ఎడమల దగా దగా అన్న మహాకవి శ్రీశ్రీ గుర్తుకు రావటం లేదూ ! ” నేను తినను ఇతరులను తిననివ్వను ” ఇదీ నరేంద్రమోడీ జనానికి చెప్పిన మాటలు. అంతే కాదు, జనం సొమ్ముకు చౌకీదారు(కాపలాదారు)నని కూడా చెప్పుకున్నారు. ఇంకేముంది ! అనుచర గణమంతా తమ పేర్ల చివర చౌకీదార్‌ అని తగిలించుకున్నారు. అందరూ జేజేలు పలికారు. అవినీతిని అంతం చేసే కొత్త దేవుడు దిగివచ్చారని ప్రచారం చేశారు. ఇంతకాలం తిన్న సొమ్మంతా అణాపైసలతో కక్కిస్తారని అనుకున్నారు. ఇప్పుడెవరూ చౌకీదార్‌ అని చెప్పుకోవటం లేదు. లోక్‌పాల్‌కు ఫిర్యాదులు ఎందుకు రావటం లేదంటే తమ పాలనలో అవినీతి లేనపుడు ఎలా వస్తాయంటూ బిజెపి నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు ! మహిమ కలికాలానిది అందామా నరేంద్రమోడీది అందామా ?అవినీతి గురించి అందరికీ తెలిసినందున ఎవరికి తోచింది వారు అనుకోవచ్చు. పైకి అంటే పంచాయితీ గానీ లోలోపల అనుకునేందుకు ఇంకా స్వేచ్చ ఉంది. మహాభారతంలో ధర్మపీఠం ఎక్కిన శకుని కౌరవులను నాశనం చేయాలనేఅంతరంగాన్ని వెల్లడిస్తాడు. మన పూర్వీకుల దగ్గర ఆ పాత పీఠాలు ఎక్కడైనా ఉన్నా లేదా దేశ భక్తులైన మన సంస్కృత పండితులు ఆ పరిజ్ఞానాన్ని వెలికి తీసి వాటిని రూపొందించి పుణ్యం కట్టుకుంటే మన పాలకులను వాటి మీద ఎక్కించి అంతరంగాలను బయట పెట్టించవచ్చు, అది తప్ప మరొక మార్గం లేదు, దేశం కోసం వారా పని చేస్తారా ?