Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగాలను ఖండించేందుకు,మరిన్ని ఆంక్షలను మోపేందుకు సోమవారం నాడు జరిగిన భద్రతా మండలి సమావేశం చైనా, రష్యా అభ్యంతరాలతో ఎలాంటి ప్రకటన చేయకుండానే ముగిసింది. దీంతో వత్తిడి పెంచేందుకు అధ్యక్ష స్థానం పేరుతో ఖండన ప్రకటనకు అమెరికా ప్రతిపాదించింది. నవంబరు నెలలో ఘనా ప్రతినిధి అధ్యక్షత వహిస్తుండగా డిసెంబరు నెలలో మన దేశ వంతు రానుంది. పదిహేనుకు గాను భారత్‌తో సహా ఎనిమిది భద్రతా మండలి సభ్యదేశాలు, అమెరికాను అనుసరించే మరో ఆరు, 14 దేశాలు ఉత్తర కొరియాను ఖండిస్తూ చేసిన ప్రకటనను అమెరికా ప్రతినిధి మండలి సమావేశంలో చదివి వినిపించారు.ఉత్తర కొరియా నవంబరు 18వ తేదీన తన దగ్గర ఉన్న శక్తివంతమైన క్షిపణి ప్రయోగం జరిపిందని, అది అమెరికా ప్రధాన భూ భాగం మీద కూడా దాడి చేసే సత్తాకలిగినదని జపాన్‌ రక్షణ మంత్రి హమదా చెప్పాడు. ఈ క్షిపణి జపాన్‌ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో పడింది.


కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరగటం. వైరుధ్యం తీవ్రం కావటం పట్ల తాము కూడా ఆందోళన చెందుతున్నట్లు సోమవారం నాడు ఐరాసలో చైనా రాయబారి ఝాంగ్‌ జున్‌ అన్నాడు.అయితే భద్రతా మండలి ఉద్రిక్తతలను సడలించటానికి బదులు ఎప్పుడూ ఉత్తర కొరియాను ఖండించటం, వత్తిడి తెస్తున్నదని విమర్శించాడు. న్యాయమైన ఉత్తర కొరియా ఆందోళనలకు ప్రతిస్పందనగా వాస్తవికమైన ప్రతిపాదనలను ముందుకు తెచ్చేందుకు అమెరికా చొరవ తీసుకోవాలని ఝంగ్‌ అన్నాడు. అన్ని పక్షాలూ సంయమనం పాటించాలని, జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికాడు. రష్యా ప్రతినిధి అనా విస్టిజెనీవా మాట్లాడుతూ ఏకపక్షంగా ఆయుధవిసర్జనకు ఉత్తర కొరియాపై అమెరికా వత్తిడి తెస్తున్నదని, అమెరికా, దాని అనుచర దేశాలు జరిపిన సైనిక విన్యాసాల కారణంగానే క్షిపణి పరీక్షలు జరిపినట్లు చెప్పారు. అమెరికా రాయబారి లిండా థామస్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ మాట్లాడుతూ బీజింగ్‌, మాస్కో అడ్డుకుంటున్న కారణంగానే ఉత్తరకొరియాకు ధైర్యం వస్తున్నదని, ఈ రెండు దేశాలూ ఈశాన్య ఆసియా, మొత్తం ప్రపంచానికి ముప్పు తెస్తున్నట్లు ఆరోపించారు.తమకు శత్రువుల నుంచి అణు ముప్పు కొనసాగుతున్నట్లయితే తమ పార్టీ, ప్రభుత్వం కూడా అణ్వాయుధాల తయారీతో సహా అన్ని రకాలుగా ధృడంగా ఎదుర్కొంటామని ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రకటించాడు. ఉత్తర కొరియా అణు, క్షిపణి కార్యక్రమాలను నిరోధించే పేరుతో 2006 నుంచి భద్రతా మండలి ఆంక్షలను విధిస్తూ తీర్మానాలు చేస్తున్నది.


ఒక పధకం ప్రకారం అమెరికా, దాని మిత్ర దేశాలు తమ పధకాలు, ఎత్తుగడల్లో భాగంగా అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నాయి. అలాంటి వాటిలో చైనా, రష్యాలతో సరిహద్దులను కలిగి ఉన్న కొరియా ద్వీపకల్పం ఒకటి. రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ ఆక్రమణల నుంచి వియత్నాం, కొరియాలను విముక్తి చేసే క్రమంలో ఒక వైపు నుంచి సోవియట్‌, మరోవైపు నుంచి అమెరికా సేనలు జపాన్ను ఓడించటంలో కీలక పాత్ర వహించాయి. ఆ క్రమంలో ఎవరి ఆధీనంలోకి వచ్చిన ప్రాంతంలో వారు స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. పరిస్థితులు చక్కబడిన తరువాత విడిన రెండు దేశాలను విలీనం చేయాలని ఒప్పందం జరిగింది. ఆ మేరకు సోవియట్‌ సేనల రక్షణలో ఉన్న ఉత్తర వియత్నాం, ఉత్తర కొరియాలలో జపాన్‌ వ్యతిరేక పోరాటంలో ఆయుధాలు పట్టిన కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. సోవియట్‌ సేనలు వెనక్కు వెళ్లాయి. అమెరికా ప్రాబల్యం కింద ఉన్న దక్షిణ వియత్నాం, దక్షిణ కొరియాలలో తన తొత్తులుగా మారిన మిలిటరీ నియంతలను రుద్దారు. అంతేగాక రకరకాల సాకులతో అమెరికా అక్కడ సైనికంగా తిష్టవేసింది. దక్షిణ వియత్నాంలో కమ్యూనిస్టులు, జాతీయ వాదులు ఏకమై అమెరికా, దాని తొత్తులను తరిమి కొట్టి 1975లో రెండు దేశాలను విలీనం చేశారు. మొత్తం సోషలిస్టు దేశంగా మారింది.


దక్షిణ కొరియాలో తిష్టవేసిన అమెరికా, దాని తొత్తులు కలిసి ఉత్తర కొరియా ప్రాంతాన్ని ఆక్రమించేందుకు 1950దశకంలో పూనుకోవటంతో చైనా, సోవియట్‌ సేనలు అడ్డుకొని తిప్పికొట్టాయి. అప్పటి నుంచి అమెరికా తన సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏదో ఒకసాకుతో ఉభయ కొరియాల విలీనాన్ని అడ్డుకుంటున్నది. జపాన్ను లొంగదీసుకొని తన రక్షణ ఒప్పందంలో భాగస్వామిగా చేసి అక్కడ కూడా తన స్థావరాలను ఏర్పాటు చేసింది. ఆ రెండూ కలసి అప్పటి నుంచి చైనా, గతంలో సోవియట్‌, అది విచ్చిన్నం తరువాత రష్యాలను దెబ్బతీసేందుకు నిరంతరం ఏదో ఒక పేరుతో రెచ్చగొడుతున్నాయి. అక్కడ శాశ్వతంగా తిష్టవేసేందుకు పూనుకుంది. అక్కడ జరుగుతున్న పరిణామాలకు అసలు కారణం ఇదే. దక్షిణ కొరియాలో చాలా కాలం మిలిటరీ, ప్రస్తుతం పేరుకు పౌరపాలన ఉన్నా అంతా మిలిటరీ,దాని వెనుక ఉన్న అమెరికా కనుసన్నలలోనే ఉంటుంది. ఐరోపాలో జర్మనీ విభజన జరిగి ఇదే మాదిరి రెండు ప్రాంతాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అమెరికా, ఫ్రాన్స్‌,బ్రిటన్‌ ప్రాబల్యంలో పశ్చిమ జర్మనీ, సోవియట్‌ అదుపులో తూర్పు జర్మనీ ఉంది. రెండింటినీ విలీనం చేసేందుకు 1952లో సోవియట్‌ నేత స్టాలిన్‌ ఒక ప్రతిపాదన చేశాడు. దాని ప్రకారం ఐక్య జర్మనీ తటస్థ దేశంగా ఉండాలి. దానికి అమెరికా, పశ్చిమ జర్మనీ పాలకులు అంగీకరించలేదు. వెంట వెంటనే జరిగిన పరిణామాల్లో అది ఐరోపా సమాఖ్య, నాటో కూటమిలో చేరింది. తూర్పు జర్మనీ సోషలిస్టుదేశంగా కొనసాగింది. నాటో ముసుగులో అమెరికా సేనలు తిష్టవేశాయి. 1990దశకంలో తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాల్లో జరిగిన పరిణామాలు, సోవియట్‌ విచ్చిన్నం తరువాత రెండు జర్మనీలను కలిపివేశారు. దాన్ని అంగీకరించిన అమెరికా ఆసియాలో కొరియా విలీనానికి మోకాలడ్డుతోంది. ఉత్తర కొరియాను బూచిగా చూపుతోంది. దానికి జపాన్‌ వంతపాడుతోంది.


ఐరాస ప్రధానకార్యదర్శి గుటెరస్‌ ఈ ఉదంత పూర్వపరాలను పరిగణనలోకి తీసుకోకుండా రెచ్చగొట్టే పనులకు పూనుకోవద్దని తమను హెచ్చరించటంపై ఉత్తర కొరియా తీవ్ర విచారం ప్రకటిస్తూ గర్హనీయమైన వైఖరిని ప్రదర్శించారని విదేశాంగ మంత్రి చో సన్‌ హుయి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐరాస ఏర్పాటు, దాని నిబంధనలు, లక్ష్యాలు అన్ని అంశాల్లో నిష్పాక్షికత, వాస్తవికత, సమానత్వం పాటించాల్సి ఉందని అలాంటి సంస్థ ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ అమెరికా తొత్తు మాదిరి ఉన్నాడని ఉత్తర కొరియా మంత్రి చెప్పారు. ఆందోళనకరంగా ఉన్న భద్రతా వాతావరణంలో ఆత్మరక్షణకు అన్ని చర్యలూ తీసుకోవాల్సి ఉంటుదని తమ దేశం స్పష్టం చేసిందని, అమెరికా, దాని చేతికింద ఉండే ప్రమాదకరమై మిలిటరీ సహకారంతో ఈ ప్రాంతంలో కలిగిస్తున్న ఉద్రిక్తతల కారణంగానే ఇదంతా జరుగుతుండగా అమెరికాను వదలి ఐరాస తమను మాత్రమే తప్పు పట్టటం ఏమిటని ఉత్తర కొరియా ప్రశ్నిస్తున్నది. పద్దెనిమిదవ తేదీన ఆ దేశ అధినేత కిమ్‌ పర్యవేక్షణలో జపాన్‌ మీదుగా 1,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సముద్రంలో పడిన క్షిపణి గురించి అమెరికా, దాని భజన బృందం నానా యాగీ చేస్తున్నది. ఈ క్షిపణి పరీక్ష జరిగిన వెంటనే అమెరికా-జపాన్‌ వైమానిక దళాలు జపాన్‌ సముద్రంపై విన్యాసాలు జరిపి ఉత్తర కొరియాను బెదిరించినప్పటికీ గుటెరస్‌కు పట్టలేదు.


ఆగస్టు నెల నుంచి అమెరికా – దక్షిణ కొరియా అనేక చిన్నా చితకవాటితో పాటు ఐదు భారీ మిలిటరీ విన్యాసాలు జరిపిన సంగతి, గడచిన రెండు నెలలుగా రోజూ ఏదో ఒక క్షిపణి ప్రయోగం పశ్చిమ దేశాల మీడియా, గుటెరస్‌ వంటి వారికి కనిపించదని అనుకోవాలా లేక చూసేందుకు నిరాకరిస్తున్నట్లా ?నవంబరు ఐదవ తేదీన రెండు దేశాలూ 240 విమానాలతో గతంలో ఎన్నడూ జరపని డ్రిల్లు జరిపిన తరువాతే 18వ తేదీ కిమ్‌ తమ దగ్గర ఉన్న తీవ్రమైన క్షిపణిని వదిలి వారికి చూపించాడు. ఐదవ తేదీకి ముందు కూడా కొన్నింటిని ప్రయోగించాడు. అమెరికా బెదిరింపులు పెరిగిన పూర్వరంగంలో సెప్టెంబరు తొమ్మిదవ తేదీన ఉత్తర కొరియా పార్లమెంటు ఆమోదించిన ఒక బిల్లు ప్రకారం దేశ రక్షణకు అవసరమైతే అణ్వస్త్రాల ప్రయోగానికి కూడా అధ్యక్షుడికి అనుమతి ఇచ్చారు.


గతంలో ఇరాక్‌ మీద దాడి జరిపి సద్దామ్‌ను హతమార్చాలని పథకం వేసిన అమెరికా దానికి ముందు పచ్చి అబద్దాలను ప్రచారం చేసింది. సద్దామ్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసి పరిసర దేశాలకు ముప్పుగా మారాడని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉత్తర కొరియాను కూడా అదే మాదిరి బూచిగా చూపేందుకు చూస్తున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు క్షిపణి ప్రయోగాలను నిరంతరం జరుపుతూనే ఉంటాయి. కానీ ఉత్తర కొరియా జరిపినపుడు తమ మీద దాడి జరుగుతున్నట్లుగా జనాన్ని భ్రమింపచేసేందుకు సొరంగాల్లోకి, ఇతర రక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జనాలకు చెప్పి జపాన్‌ ప్రభుత్వం హడావుడి చేస్తున్నది. ఇంతవరకు ఒక్కసారి కూడా విఫలమైన క్షిపణులు గానీ మరొకటి గానీ జపాన్‌ భూభాగంపై పడిన దాఖలా లేదు. దానికి సుదూరంగా సముద్రంలో మాత్రమే పడ్డాయి. ఉత్తర కొరియా వద్ద శక్తివంతమైన క్షిపణులు ఉన్నది వాస్తవం, ఇతర దేశాల మాదిరి నిరంతరం వాటి పరిధిని పెంచేందుకు పరిశోధనలు చేస్తున్నారు. అణు కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ప్రపంచాన్ని తన మిలిటరీ శక్తితో శాసించేందుకు చూస్తున్న అమెరికా ఏకంగా తన ముంగిట ఉన్న తరువాత ఉత్తర కొరియా తన భద్రతను తాను చూసుకోకుండా ఎలా ఉంటుంది. అమెరికా,జపాన్‌ దేశాల వద్ద క్షిపణులను పసిగట్టి వాటిని కూల్చివేసే ఆధునిక వ్యవస్థలున్నాయి. అందుకే వాటి రాడార్లకు దొరక్కుండా వేగంగా, తక్కువ ఎత్తులో ఎగురుతూ సుదూరంలోని లక్ష్యాలను చేరే సూపర్‌ సోనిక్‌ క్షిపణుల కోసం నిరంతరం తన అస్త్రాలకు పదును పెడుతున్నది. ఇంతవరకు మరొక దేశం మీద దాడికి దిగిన దాఖలాల్లేవు. అమెరికా ఆయుధాలను మిత్ర దేశాలకు ఇస్తున్నట్లుగానే ఉత్తర కొరియా కూడా తన మిత్ర దేశాల నుంచి సాయం పొందటంలో తప్పేముంది?


ఉత్తర కొరియా దగ్గర ఎంత దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు ఉన్నదీ ఎవరికి వారు ఊహించుకోవటం తప్ప నిర్ధారణ లేదు. ఒక దుష్ట దేశంగా చిత్రించేందుకు పెద్ద ఎత్తున ప్రచారదాడి జరుగుతున్నది. వారి దగ్గర పదిహేనువేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అమెరికాలోని ఏ ప్రాంతం మీదైనా దాడి చేయగల సత్తా కలిగినదని జపాన్‌ రక్షణ మంత్రి సుకాజు హమడా ప్రకటించాడు. మమ్మల్ని రక్షిస్తామని చెబుతున్న మీ మీదే దాడి చేయగల క్షిపణులు కిమ్‌ దగ్గర ఉన్నట్లు జపాన్‌ చెప్పటం అమెరికాను రెచ్చగొట్టటం తప్ప మరొకటి కాదు. శుక్రవారం నాడు వదిలిన క్షిపణి ఒకేసారి అనేక బాంబులను మోసుకుపోగలదని, రక్షణ వ్యవస్థలను తప్పించుకోగలదని కొందరు విశ్లేషించారు. 2017లో చివరి సారిగా ఉత్తర కొరియా అణుపరీక్షలు జరిపింది. అప్పటి నుంచి అమెరికా రెచ్చగొడుతూనే ఉంది. దానిలో భాగంగా గత ఐదేండ్లలో తొలిసారిగా నవంబరు మొదటి వారంలో పెద్ద మొత్తంలో అస్త్రాలను మోసుకుపోగల బి-1బి బాంబర్లను అమెరికా ఐదింటిని దక్షిణ కొరియాకు తరలించింది. ఆంక్షలను కఠినతరం గావించేందుకు అమెరికా పూనుకోవటం, చైనా, రష్యా వాటిని వీటో చేయటం జరుగుతోంది. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు వస్తాడు అన్నట్లుగా సాంకేతిక పరిజ్ఞానం ఒకరి సొత్తు కాదు, వెనుకా ముందూ ఉండటం తప్ప ఎవరికీ అసాధ్యం కాదు. అమెరికా ఇప్పుడు ఆర్థికంగా, మిలిటరీ పరంగా అనేక దేశాలను బెదిరిస్తున్నది, ప్రలోభపెడుతున్నది, లొంగదీసుకుంటున్నది. ఉత్తర కొరియా, ఇరాన్‌ వంటివి దానికి కొరకరాని కొయ్యలుగా మారాయి. నిరంతరం ఎక్కడో అక్కడ ఉద్రిక్తతలను రెచ్చగొట్టే క్రమంలో ఇప్పుడు అమెరికా ఆసియాలో చిచ్చు పెట్టింది. గడచిన మూడు దశాబ్దాలుగా అమెరికా బెదిరింపులకు లొంగని ఉత్తర కొరియాను ఇప్పుడు అదుపులోకి తెచ్చుకోవాలనుకోవటం అమెరికా పగటి కల తప్ప మరొకటి కాదు.