Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


నిన్నా మొన్నా ఫేస్‌బుక్‌, ట్విటర్‌, అమెజాన్‌ సంస్థల్లో సిబ్బంది తొలగింపు వార్తలు, నేడు గూగుల్‌ ప్రకటన, రేపు ఏ కంపెనీ ఎందరిని తొలగిస్తుందో తెలవదు. ఈ ప్రకటనల నడుమ హైదరాబాద్‌లో అమెజాన్‌ కంపెనీ డేటా కేంద్రంతో వేలాది మందికి ఉపాధి కబురు. ఒక వైపు ఆర్థిక మాంద్యం గుబులు-మరోవైపు లాభాల వేటలో కంపెనీల కొత్త కేంద్రాల ఏర్పాటు ! ఐటి కంపెనీల్లో కోతలు, కంపెనీల్లో రోబోట్లు, ఆధునిక యంత్రాల ప్రవేశం వెరసి ఉద్యోగాలు హాంఫట్‌ ! ప్రపంచంలో ఏం జరుగుతోంది ? ఉన్న ఉపాధి కోల్పోయినా, కొత్త ఉద్యోగాలు రాకపోయినా కుటుంబాల మీద దాని ప్రభావం పడుతుంది. అది తిరిగి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. దాంతో మందగమనం తదుపరి మాంద్యం, అది ముదిరితే ఆర్థిక సంక్షోభం. కుటుంబాల మీద మరింత ప్రతికూల ప్రభావం, ఇదొక విష వలయం. ప్రపంచం, దేశం, రాష్ట్రం, కుటుంబాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న చర్చలు ప్రారంభం అయ్యాయి. ప్రపంచ ధనిక దేశాల్లో మాదిరి తీవ్ర పరిస్థితులు మన దేశంలో తలెత్తుతాయా ? తెలంగాణా మీద ఎలాంటి ప్రభావం పడుతుంది ? మనమందరం ప్రపంచీకరణ యుగంలో ఉన్నాం. అందువలన ప్రతి చోటా జరిగే ప్రతి పరిణామమూ తరతమ తేడాలతో అందరి మీదా పడుతుంది. అమెరికాలో ఫేస్‌బుక్‌, అమెజాన్‌, గూగుల్‌ వంటి కంపెనీల్లో ఉద్యోగులను తొలగిస్తే వారిలో మన భారతీయులు,తెలుగువారు, ఆంధ్ర, తెలంగాణా వారు కూడా ప్రభావితులైనారు. చివరికి వారిలో మన కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు కూడా ఉండవచ్చు.


ప్రపంచ వ్యాపితంగా ఆర్థికరంగం అనిశ్చితంగా ఉంది. వచ్చే ఏడాది అనేక దేశాలు మాంద్యంలోకి వెళ్ల వచ్చుననే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వృద్ధి రేటును ప్రకటిస్తారు. ఏ దేశంలో వరుసగా ఆరు నెలల పాటు తిరోగమన(మైనస్‌) వృద్ది నమోదైతే అది మాంద్యంలోకి జారినట్లు పరిగణిస్తారు. గతంలో అనేక దేశాలు అలా దిగజారి తిరిగి కోలుకున్నాయి. పెట్టుబడిదారీ విధానం అనుసరిస్తున్న దేశాల్లో ప్రతి పదేండ్లకు ఒకసారి ఈ పరిస్థితి ఏర్పడినట్లు గత చరిత్ర వెల్లడించింది. 2008లో, 2020లో కరోనా సందర్భంగా తలెత్తిన పరిస్థితి కంటే రానున్న మాంద్యం మరింత తీవ్రంగా ఉండనుందని ఐరాస హెచ్చరించింది. వాణిజ్యం-అభివృద్ది 2022 నివేదిక ప్రకారం ప్రపంచం మాంద్యం అంచున ఉంది, ఆసియాలోని అభివృద్ది చెందుతున్న దేశాలు దీని పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నది.

ఆర్థికవేత్తలు చెప్పిన వాటన్నింటినీ క్రోడీకరిస్తే మాంద్యానికి ఐదు ప్రధాన అంశాలు దోహదం చేస్తున్నట్లు చెబుతున్నారు. అమెరికా డాలరు గత కొన్ని నెలలుగా బలపడుతున్నది, గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది. మరింత బలంగా మారనుందని అంచనా. బలమైన డాలరు అమెరికాకు బలమూ, నష్టమూ కలిగించినట్లుగానే ప్రపంచ దేశాలకూ ఉంటుంది. బ్రిటీష్‌ పౌండ్‌,ఐరోపా యురో, చైనా, జపాన్‌, మనతో పాటు దాదాపు అన్ని దేశాల కరెన్సీల విలువలను కోల్పోయాయి. ఫలితంగా దిగుమతులు భారంగా మారుతున్నాయి. ఉదాహరణకు 2014లో అక్టోబరులో ముడిచమురు పీపా ధర 92 డాలర్లు ఉండగా మన కరెన్సీలో రు.5,650 చెల్లించాము. ఇప్పుడు 91 డాలర్లు ఉండగా పీపాకు రు.7,514 చెల్లించాము. దీనికి కారణం మన కరెన్సీ మారకపు విలువ 61.40 నుంచి 82.26 దిగజారటమే కారణం. అన్ని దిగుమతి వస్తువుల ధరలూ ఇదే మాదిరి పెరిగాయి. మన వారు విదేశాల్లో చదువుకుంటే వారి మీద ఇదే మాదిరి అదనపు భారం పడుతున్నది. ద్రవ్యోల్బణం పెరిగినపుడు, కరెన్సీ విలువలు పతనమైనపుడు అదుపు చేసేందుకు వడ్డీ రేట్లు పెంచుతున్నారు. ఇది కొత్త సమస్యలకు కారణం అవుతున్నది. ఇది అమెరికాకూ వర్తిస్తుంది. అక్కడ వడ్డీ రేట్లు పెంచినపుడల్లా ఇతర దేశాల నుంచి డాలర్లు అక్కడకు చేరుతున్నాయి.దీని వలన అమెరికన్లు లాభపడుతున్నారా అంటే అదీ లేదు.ద్రవ్యోల్బణంతో వృద్ధిరేటు దిగజారి మాంద్యంలోకి దిగజారే ముప్పు ఉంది.వడ్డీ రేట్లు పెరిగితే పరిశ్రమలు, వాణిజ్యాల పెట్టుబడులపై భారం పెరుగుతుంది. కొత్తగా పెట్టుబడులు ఉండవు, పరిశ్రమలూ రావు. రుణాలు తీసుకొని ఇండ్లు కొనుగోలు చేసిన వారికి భారం పెరుగుతుంది. ధరల పెరుగుదలతో జనాల జేబులకు చిల్లిపడి వస్తువులను తక్కువగా కొనుగోలు చేస్తారు. అది మాంద్యానికి దారితీస్తుంది. డిమాండ్‌ తగ్గటంతో ఆపిల్‌ ఐఫోన్‌ 14 ఉత్పత్తి తగ్గించింది. దాంతో దాని షేర్ల ధర తగ్గింది.

ఇతర దేశాల్లో మాంద్య పరిస్థితులు ఏర్పడితే వాటి మార్కెట్లపై ఆధారపడిన ప్రతిదేశమూ ప్రభావితం అవుతుంది. పశ్చిమ దేశాల్లో డిమాండ్‌ తగ్గిన కారణంగా రెండు సంవత్సరాల్లో తొలిసారిగా 2022 అక్టోబరులో మన ఎగుమతులు 16.7 శాతం తగ్గాయి. దిగుమతులు పెరిగినందున మన దేశంలో డిమాండ్‌ పెరిగిందని చెబుతున్నారు. మన పెట్టుబడులు ఎగుమతి ఆధారితంగా ఉన్నందున వృద్ధి రేటు పడిపోనుందని అంచనా వేస్తున్నారు, అదే జరిగితే అంతర్గత డిమాండ్‌ కూడా తగ్గుతుంది. అక్టోబరు నెలలో ఎగుమతి చేసే 30 వస్తువులకు గాను 24 తిరోగమనంలో ఉన్నాయి. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, బియ్యం, టీ, చమురు గింజలు, పొగాకు, చమురు గింజల ఉత్పత్తుల ఎగుమతుల్లో పెరుగుదల ఉంది. చమురు ఉత్పత్తుల ఎగుమతులు సెప్టెంబరులో 43శాతం పెరగ్గా అక్టోబరులో 11.4శాతం తిరోగమనంలో ఉన్నాయి. ఇంజనీరింగ్‌ వస్తువులు 21.3, ఆభరణాలు 21.6, రసాయనాలు 16.4, రెడీమేడ్‌ దుస్తులు 21.2,డ్రగ్స్‌-ఫార్మా 9.24 శాతాల చొప్పున తిరోగమనంలో ఉన్నాయి. తెలంగాణా, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ జాబితాలోని వస్తువుల ఎగుమతులు జరుగుతుంటే వాటి ప్రభావం రాష్ట్ర సంస్థలు, వాటిలో పని చేసే సిబ్బంది మీద కూడా పడుతుంది. రానున్న రోజుల్లో పశ్చిమ దేశాల్లో పరిస్థితులు ఇంకా దిగజారవచ్చని చెబుతున్నందున పరిస్థితిని ఊహించలేము.


పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభానికి గురైనపుడల్లా కార్మికవర్గం మీద దాని భారాలను మోపి తాను తప్పించుకొనేందుకు చూస్తుంది. 2008లో తలెత్తిన సంక్షోభం తరువాత కూడా అదే జరుగుతోంది. దానిలో భాగంగా ఐటి కంపెనీలన్నీ రోబో ప్రోసెస్‌ ఆటోమేషన్‌ (ఆర్‌పిఏ) వైపు కేంద్రీకరించాయి. ఇది ఏదో ఒక దేశానికే పరిమితం కాదు. బాంక్‌ ఆఫ్‌ అమెరికా గతంలో ఒక విశ్లేషణలో పేర్కొన్నదాని ప్రకారం 2022 నాటికి మన దేశంలోని కోటీ 70 లక్షల ఐటి, ఐటి సంబంధిత ఉద్యోగాల్లో 30లక్షలు రద్దవుతాయని అంచనా వేసింది. పరిశ్రమల్లో కార్మికుల బదులు రోబోలు పని చేస్తాయి. ఐటి రంగంలో రోబో ప్రాసెస్‌ అంటే ఇంజనీర్ల బదులు రోబోలు అని కాదు, వాటి ప్రోగ్రామ్స్‌లో చేసే మార్పులతో ఎక్కువ మంది సిబ్బందితో పనిలేకుండా చేస్తాయి. డేటా విశ్లేషణ, ఎకౌంటింగ్‌, ఫైనాన్స్‌, కస్టమర్‌ సర్వీస్‌ వంటి సేవలను ఆటోమేషన్‌, కృత్రిమ మేథతో చేసి కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకొని లాభాలకు ముప్పు లేకుండా చూసుకుంటున్నాయి. ఇప్పుడు అలాంటి క్రమంలోనే అమెరికాలో ఐటి రంగంలో ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఎంతో నిపుణులైన వారిని మాత్రమే ఉంచుకుంటారు. కొన్ని కంపెనీలు తొలగించకపోయినా కొత్తగా సిబ్బందిని తీసుకోకుండా సర్దుబాటు లేదా విస్తరణకు పూనుకుంటాయి.కొత్త కంపెనీలు పరిమిత సిబ్బందిని మాత్రమే చేర్చుకుంటాయి.


గార్టనర్‌ కార్పొరేషన్‌ పేర్కొన్న సమాచారం ప్రకారం 2022లో ఆర్‌పిఏ సాఫ్ట్‌వేర్‌ 20శాతం పెరుగుతుందని, అందుకోసం కంపెనీలు 290 కోట్ల డాలర్లను ఖర్చు చేయనున్నట్లు అంచనా వేసింది. ప్రపంచమంతటా 2023లో ఈ సాఫ్ట్‌వేర్‌ మార్కెట్‌ రెండంకెల వృద్ధి సాధిస్తుందని పేర్కొన్నది. అంటే అది పెరిగే కొద్దీ తీసివేతలు మరింతగా ఉంటాయి, కొత్త అవకాశాలు తగ్గుతాయి.ఆర్‌పిఏ సాఫ్ట్‌వేర్‌తో పని చేసే కంప్యూటర్ల మీద పనిచేసేందుకు సాంకేతిక అర్హతలున్నవారే ఉండనక్కరలేదు. మరోవైపున నైపుణ్యాలు ఎక్కువగా ఉన్న అవకాశాలు, వేతనాలూ పెరుగుతాయి. ఇదే సమయంలో జనాలకు మరింత వేగంగా సేవలు, కంపెనీలకు లాభాలు ఉంటాయి. సేవలు మెరుగుపడినందుకు సంతోషించాలా ? ఉపాధి తగ్గినందుకు విచారపడాలా ? ఇప్పుడు ప్రపంచమంతటా కంపెనీలన్నీ ఆర్‌పిఏ లాభ నష్టాల గురించి మదింపు చేసుకుంటున్నాయి. లాభం లేనిదే వ్యాపారి వరద ప్రాంతాలకు పోడు అన్న సామెత తెలిసిందే.వర్తమాన సంవత్సరంలో ఇంతవరకు ప్రపంచంలో 853 టెక్‌ కంపెనీలు 1,37,492 మందిని తొలగించినట్లు తాజా సమాచారం. అదే కరోనా మహమ్మారి తలెత్తినప్పటి నుంచి చూస్తే 1,388 సంస్థలు 2,33,483 మందిని ఇంటికి పంపాయని లేఆఫ్స్‌ డాట్‌ ఫై అనే సంస్థ వెల్లడించింది. ఐటి రంగంలో పని చేస్తున్న వారికి, ఉపాధికోసం చూస్తున్న వారికి 2022 సంవత్సరం ఒక పీడకలగా మిగిలిపోనుంది.


2023లో మాంద్యం తలెత్తితే మన దేశం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనే తర్జన భర్జన మొదలైంది. మన దేశం ప్రపంచీకరణలో మరీ లోతుగా దిగలేదు గనుక అంతగా మునగం అన్నది ఒక భావం. ప్రతి సంక్షోభంలో తొలుత నష్టపడేది కార్మికులు, సామాన్యులే అన్నది గత అనుభవసారం. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో మన జిడిపి వృద్ది గురించి అనేక సంస్థలు ప్రతినెలా అంచనాలను తగ్గిస్తూనే ఉన్నాయి. అంతిమంగా ఎంత ఉండేది చెప్పలేని స్థితి. కరోనా మహమ్మారి తలెత్తకుండా ఉండి ఉంటే 2016 నుంచి ప్రపంచ ఉత్పత్తి 23శాతం పెరిగి ఉండేదని, ప్రస్తుత అంచనా 17శాతమే అని చెబుతున్నారు. నిజమైన జిడిపి కరోనాకు ముందున్నదాని కంటే తక్కువే. దీని వలన 17లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం జరిగిందని అంచనా. గతంలో ఎక్కువ వృద్ది రేటు ఉన్న దేశాలే ఎక్కువ భాగం నష్టపడ్డాయి.2019 జిడిపి సూచిక 110 కాగా కరోనా లేకుంటే 2023 నాటికి 123.4 పెరిగి ఉండేది, అలాంటిది ఇప్పుడు 117.3కు మాత్రమే చేరుతుందని అంచనా. ఇటీవలి పరిణామాలు మన ఆర్థిక రంగం మీద తీవ్ర వత్తిడిని కలిగిస్తున్నాయి. ఆహార ధరల సూచిక 2021 నవంబరులో 148.2 ఉంటే 2022 అక్టోబరు నాటికి 165.2కు పెరిగింది. మన దేశం కొనుగోలు చేస్తున్న ముడి చమురు పీపా ధర 2020-21లో సగటున 44.82 డాలర్లుంటే 2021-22లో 79.18, 2022-23లో నవంబరు 22 నాటికి 100.2 డాలర్లు ఉంది. ఇలాంటి భారాలు ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో పరిమితం కావు. దేశమంతటా ఉంటాయి.


పశ్చిమ దేశాల్లో ఆర్థికరంగంలో సంభవించే మార్పుల పరిణామాలు, పర్యవసానాల గురించి అందుబాటులో ఉండే సమాచారము ఎక్కువగా ఉంటుంది గనుక విశ్లేషణలు కూడా వెంటనే వెలువడతాయి. మన దేశంలో దానికి విరుద్దం. సమాచార ప్రభావం ఎక్కడ తమ ఎన్నికల లబ్ది మీద పడుతుందో అని అధికారంలో ఉన్నవారు తొక్కి పట్టటం, ప్రభావాన్ని తక్కువగా చూపటం జరుగుతోంది. ఉదాహరణకు 2019లోక్‌ సభ ఎన్నికలకు ముందు నాలుగు దశాబ్దాల రికార్డును నిరుద్యోగం బద్దలు కొట్టిందని సమాచారం తెలుపగా దాన్ని వెల్లడించకుండా కేంద్ర ప్రభుత్వం తొక్కిపట్టింది. తీరా అది అనధికార మార్గాల ద్వారా బహిర్గతం కావటంతో అది తప్పుల తడక అని దాన్ని నమ్మవద్దంటూ కేంద్రం చెప్పింది. తీరా ఎన్నికలు ముగిసిన తరువాత అదే వాస్తవమంటూ ఆ విశ్లేషణను ఆమోదిస్తున్నట్లు ప్రకటించింది. 2014 నుంచి ప్రపంచ సంస్థలు వెలువరించే అనేక సూచికల్లో మన దేశం వెనుకబడి ఉండటాన్ని చూస్తున్నాము. అన్ని దేశాలకూ వర్తింప చేసే పద్దతినే మన దేశానికీ వర్తింప చేస్తున్నప్పటికీ మన దేశ వాస్తవాలను ప్రతిబింబించటం లేదని ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నది, నిరాకరిస్తున్నది తప్ప వాస్తవం ఏమిటో తన అంకెలను ఇంతవరకు వెల్లడించలేదు.


ధనిక పశ్చిమ దేశాల్లో జరిగే పరిణామాలు వెంటనే మన దేశం మీద పడే అవకాశం లేదు. 2008లో ఆ దేశాల్లో మాదిరి బాంకులు మన దేశంలో కుప్పకూలలేదు.కారణం అవి ప్రభుత్వరంగంలో ఉండటమే. ఇప్పుడు ఐటి కంపెనీల్లో జరుగుతున్న లేఆఫ్‌లు, తొలగింపులు ప్రధానంగా అమెరికాలో జరుగుతున్నాయి. ఆర్థిక మాంద్యం మహా సంక్షోభంగా మారినపుడు ప్రతి దేశాన్ని ఆవహిస్తుంది. మన జిడిపి వృద్ది రేటు బ్రిటన్‌లో మాదిరి తిరోగమనంలో పడలేదు. తాజాగా బ్రిటన్‌లో తలెత్తిన స్థితిని చూస్తే మాంద్యం కారణంగా ఎనిమిది సంవత్సరాల్లో పెరిగిన గృహస్తుల రాబడి హరించుకుపోయి జీవన వ్యయ సంక్షోభం తలెత్తింది.వంద బిలియన్‌ పౌండ్ల ప్రభుత్వ ఉద్దీపన ఉన్నప్పటికీ 2024 ఏప్రిల్‌ నాటికి నిజ ఆదాయాలు ఏడుశాతం తగ్గుతాయని అంచనా. ఉత్పత్తి రెండు శాతం తిరోగమనంతో ఐదులక్షల ఉద్యోగాలు పోయినట్లు అంచనా.


పశ్చిమ దేశాల్లో తలెత్తిన సంక్షోభం మన దేశంలో లేదా తెలంగాణాలో లేదు అంటే దాని అర్ధం అసలేమీ సమస్యలు లేవని అంతా సజావుగానే ఉందని కాదు. తెలంగాణా పౌరస్పందన వేదిక నిర్వహించిన ఒక సర్వే, యుటిఎఫ్‌ చెబుతున్న దాని ప్రకారం రాష్ట్ర పాఠశాలల్లో 26వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బంగారు, ధనిక రాష్ట్రం అని చెబుతున్న చోట ఇలాంటి పరిస్థితి ఉండటం ఆర్ధిక ఇబ్బందులకు నిదర్శనంగా చెప్పవచ్చు. మార్చి నెలలో సిఎం కెసిఆర్‌ ఆర్భాటంగా ప్రకటించిన 90వేల ఖాళీల భర్తీ ఎక్కడుందో ఎవరికీ అర్ధం కాదు. అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల గురించి చెబుతున్న అంకెలకు ఒకదానికి ఒకటి పొంతన ఉండటం లేదు. ప్రభుత్వం శ్వేత పత్రం ప్రకటిస్తే తప్ప జనానికి అర్ధం కాదు. ఉన్న సిబ్బంది, పెన్షనర్లకు సకాలంలో వేతనాలు చెల్లించలేని స్థితిలో ఈ ఖాళీలను భర్తీ చేస్తే ఏటా ఏడున్నరవేల కోట్ల మేరకు అదనంగా ఖర్చు అవుతుందని అంచనా. ఈ కారణంగానే గత ఎనిమిది సంవత్సరాలుగా సంక్షేమ పథకాలకు తప్ప ఉద్యోగాల భర్తీకి పూనుకోవటం లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక సాకు చెబుతున్నారు.ప్రభుత్వం మీద పైసా అదనపు భారం పడని వివిధ రంగాల కనీసవేతనాల సవరణకూ ప్రభుత్వం ముందుకు రావటం లేదు.


తెలంగాణాలో ఉన్న భూముల అమ్మకం, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపు వంటి చర్యల ద్వారా సమకూరుతున్న ఆదాయం సంక్షేమ పథకాలకు తప్ప వనరుల పెంపుదలకు అవసరమైన పెట్టుబడులు పెట్టటం లేదనే విమర్శ ఉంది. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను అతిక్రమించేందుకు ప్రభుత్వాలు తీసుకొనే రుణాలకు పరిమితులు ఏర్పడటంతో వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా అప్పులు తీసుకొని వాటికి ప్రభుత్వం హామీదారుగా ఉంటున్నది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఈ మొత్తాలను కూడా ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని ప్రకటించి వెనుకటి నుంచి అమలు జరుపుతామని ప్రకటించటంతో కొత్తగా తీసుకొనే రుణాల మొత్తం తగ్గే పరిస్థితి తలెత్తింది. ఇలాంటి అప్పులను బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా తీసుకుంటున్న కారణంగా వచ్చే ఏడాది నుంచి అమలు జరుపుతామని చెప్పటంతో కాస్త ఊరట లభించింది. వర్తమాన సంవత్సర జిఎస్‌డిపి పదమూడు లక్షల కోట్లుగా అంచనా వేశారు.దీని ప్రకారం నాలుగుశాతం అంటే 52వేల కోట్ల మేరకు అప్పులు తీసుకోవచ్చు. హామీ రుణాలను కూడా పరిగణనలోకి తీసుకోవటంతో 43వేల కోట్లకు మించి తీసుకొనే అవకాశం లేకపోయింది. దీంతో నెలవారీ ఖర్చులు – రాబడి తేడా ఒకటి నుంచి రెండువేల కోట్ల వరకు ఉండటంతో ప్రతినెలా ఇబ్బంది పడుతున్నది. అనేక అభివృద్ధి పనులకు కోతలు పెడుతున్నారు.2020-21లో ఇండ్ల నిర్మాణానికి 10,591 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది కేవలం ఆరువందల కోట్లే. అలాటే పట్టణాభివృద్దికి 13,053 కోట్లకు గాను ఖర్చు 3,816 కోట్లు మాత్రమే. అందుకే రెండు పడకల ఇండ్లు లేవు, పట్టణాల్లో వరదలు వస్తే తట్టుకొనే స్థితిలేదు. ఈ ఏడాది ప్రకటించిన బడ్జెట్‌లో ఎన్నికోతలు పెట్టేది తరువాత గానీ వెల్లడి కాదు. ప్రపంచం, దేశంలో మాంద్యం తలెత్తితే తెలంగాణాకు మినహాయింపు ఉండదు.