Tags

, , , , ,



ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన సైనిక చర్య బుధవారం నాటికి 280 రోజులు. అగ్నికి ఆజ్యం పోస్తున్న మాదిరి వ్యవహరిస్తున్న పశ్చిమ దేశాలు దీన్ని ఇంకా ఎంత కాలం కొనసాగిస్తాయో ఎవరూ చెప్పలేని స్థితి. రష్యాతో చర్చలకు ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ తొలి రోజుల్లో సిద్దపడినప్పటికీ అమెరికా, బ్రిటన్‌ ఇతర నాటో దేశాలు వాటిని పడనివ్వలేదని తరువాత స్పష్టమైంది. అమెరికా, దాన్ని అనుసరించే పశ్చిమ దేశాలు వేసిన తప్పుడు అంచనాలు, ఎత్తుగడల గురించి ఇతరులు చర్చించుకోవటం ఒక ఎత్తు కాగా తొమ్మిది నెలల తరువాత ఐరోపా సమాఖ్యలోని కొన్ని దేశాలు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ సంక్షోభంతో తలెత్తిన పరిస్థితి, పర్యవసానాలు కార్మికవర్గం మీద ప్రభావం చూపటం ప్రారంభమైంది. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు చలి కాలం ఎలా గడపాలిరా బాబూ అని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.


మరోవైపున ఈ సంక్షోభాన్ని అమెరికా తన లాభాల కోసం వినియోగించుకుంటున్నదని ఐరోపా గొణగటం ప్రారంభించింది.ఉక్రెయిన్‌ సంక్షోభం మీద తటస్థ వైఖరిని అనుసరిస్తున్న భారత్‌, చైనా తదితర దేశాలు పశ్చిమ దేశాల బెదరింపులను పక్కన పెట్టి రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడిచమురును చౌకధరలకు కొనుగోలు చేసి పుతిన్‌కు లబ్ది కలిగించటంతో పాటు డాలర్లను పొదుపు చేసుకుంటున్నాయి. డిసెంబరు ఒకటవ తేదీన చైనా అధినేత షీ జింపింగ్‌ ఆహ్వానం మేరకు ఐరోపా సమాఖ్య మండలి అధ్యక్షుడు ఛార్లెస్‌ మైఖేల్‌ చైనా రానున్నాడు. క్రిమియా వంతెన పేల్చివేతకు ఉక్రెయిన్‌ చేసిన కుట్ర వెల్లడి కావటంతో రష్యా దళాలు విద్యుత్‌ కేంద్రాలను దెబ్బతీశాయి. దీంతో రాజధాని కీవ్‌తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో మంచినీరు, విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చలికాలాన్ని ఆయుధంగా చేసుకొని తమ దేశం మీద పుతిన్‌ దళాలు విరుచుకుపడుతున్నట్లు జెలెనెస్కీ ఆరోపించాడు. డిసెంబరు ఐదు నుంచి రష్యా చమురును తాము నిర్ణయించిన ధరలకే కొనుగోలు చేయాలనే ఆంక్షలను అమెరికా, నాటో కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. దాన్ని ఉల్లంఘించిన వారి మీద చర్య తీసుకుంటామని అమెరికా చెప్పగా ధరల అదుపును అంగీకరించిన దేశాలకు అసలు తాము విక్రయించేది లేదని రష్యా స్పష్టం చేసింది.


ఒక వైపు ఉక్రెయిన్‌కు తాము మద్దతుగా ఉన్నామని చెబుతూనే ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా ఆర్థిక అంశాల దగ్గరకు వచ్చేసరికి లాభాలు మీకు – భారాలు మాకా ఏమిటీ పద్దతి అని ఐరోపా దేశాలు అమెరికాను ఇప్పుడు అడుగుతున్నాయి. అమెరికా చేసిన దురాగతాలన్నింటిని ఆమోదించి అనుసరించిన గతం వాటిని వెన్నాడుతోంది. అనేక విధాలుగా అమెరికా బంధంలో చిక్కుకొని ఉన్నాయి. ఉక్రెయిన్‌ పరిణామాలను చూస్తే ఐరోపా కంటే అమెరికాపెత్తనమే ఎక్కువగా ఉంది. నాటో పేరుతో అక్కడ తిష్టవేసేందుకు చూసిన సిఐఏ పథకంలో భాగంగా 2014లో జరిగిన తిరుగుబాటులో నయా నాజీలను అధికారానికి తెచ్చారు. ఈ పూర్వరంగంలో జనాభిప్రాయానికి అనుగుణంగా గతంలో తమ ప్రాంతంగా ఉన్న ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని తనలో విలీనం చేసుకుంది. అదేబాటలో నడచిన డాంటెస్క్‌ ప్రాంతంలోని జనాన్ని ఉక్రెయిన్‌ మిలిటరీతో అణచివేతకు పాల్పడటం, గతంలో రష్యాకు ఇచ్చిన హామీకి భిన్నంగా నాటో విస్తరణకు పూనుకోవటంతో ఈ ఏడాది ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్యను ప్రారంభించింది.


చర్చలను అడ్డుకోవటంతో పాటు దీర్ఘకాలం కొనసాగేలా, తీవ్ర పర్యవసానాలకు దారి తీసేందుకు దోహదం చేసే విధంగా భారీ ఎత్తున అమెరికా ఆయుధాలను అందిస్తున్నది. మరోవైపున రష్యా నుంచి చమురు తదితర దిగుమతులను నిషేధించి ఐరోపాను తమపై ఆధారపడేట్లు చేసుకుంది. గోడదెబ్బ చెంపదెబ్బ మాదిరి ఐరోపా దేశాలు ఉక్రెయిన్నుంచి వచ్చిన శరణార్ధుల భారంతో పాటు పెరిగిన చమురు, విద్యుత్‌ ధరల భారాలను అనుభవిస్తున్నాయి. కరోనాకు ముందే తక్కువ వృద్ధి రేటుతో ఉన్న పరిస్థితి తరువాత మరింత దిగజారింది. దాని మీద ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంతో ద్రవ్యోల్బణం, ధరల భారాలతో ఆర్థిక రంగం కుదేలౌతున్నది. ఇది పాలకపార్టీల మీద వత్తిడితో పాటు జనాన్ని వీధుల్లోకి రప్పిస్తున్నది. మరోవైపు రాజకీయంగా అమెరికాతో స్నేహం కోసం కొన్ని దేశాలతో వైరం తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇప్పుడిప్పుడే వాస్తవాలు బోధపడుతుండటంతో సుభాషితాలు చెబుతున్న నాయకగణం నేల మీద నడిచేందుకు చూస్తున్నది. తాము చేయాల్సింది చేయకుండా వ్లదిమిర్‌ పుతినే అన్నింటికి కారణం అని చెబితే నమ్మేందుకు జనాలు సిద్దంగా లేరు.


తాజాగా పొలిటికో అనే పత్రికలో ఒక విశ్లేషణ వెలువడింది. ” ఉక్రెయిన్‌పై తొమ్మిది నెలల దురాక్రమణ(ఇది పొలిటికో పదజాలం) తరువాత పశ్చిమ దేశాల ఎముకలు విరగ్గొట్టేందుకు పుతిన్‌ పూనుకుంటున్నాడు. ఐరోపా ఉన్నతాధికారులు జో బైడెన్‌ అధికార యంత్రాంగం పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఐరోపా సమాఖ్య దేశాలు ఇబ్బందులు పడుతుండగా అమెరికన్లు యుద్దం నుంచి లాభాలు పొందుతున్నారు.” అని పేర్కొన్నది. ఇన్ని నెలలుగా పుతిన్‌ శకం ముగిసింది, ఉక్రెయిన్‌ గెలిచింది అంటూ గంతులు వేసిన వారు ఇప్పుడు ఎముకలు విరగ్గొట్టటం గురించి మాట్లాడటం గమనించాలి. విధించిన ఆంక్షలు వికటించి ఐరోపాకు దిక్కుతోచని స్థితిలో జో బైడెన్‌ అమెరికా పరిశ్రమలకు ఇస్తున్న పన్ను, హరిత రాయితీలు ఐరోపా పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని తమ మిలిటరీ పరిశ్రమలకు లబ్ది చేకూర్చేందుకు ఉపయోగించుకుంటున్నారని, శాంతియుత పరిష్కారానికి పూనుకోవాలన్న తమ వినతులను చెత్తబుట్టలో పడవేస్తున్నారని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఐరోపా అధికారి ఒకరు చెప్పినట్లు పొలిటికో పేర్కొన్నది. ” వాస్తవం ఏమంటే, మీరు గనుక నిమ్మళంగా చూస్తే ఈ యుద్దం నుంచి ఎక్కువగా లబ్ది పొందిన దేశం ఏదంటే అమెరికా, ఎందుకంటే వారు అధిక ధరలకు గాస్‌ అమ్ముతున్నారు, ఎక్కువగా ఆయుధాలు అమ్ముతున్నారు. మేము నిజంగా ఇప్పుడు చారిత్రాత్మక సంకట స్థితిలో ఉన్నాము. ముందు చెప్పినట్లుగా అమెరికా ఇస్తున్న సబ్సిడీలు, అధిక ఇంథన ధరల ముప్పు అట్లాంటిక్‌ కూటమి(నాటో),యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం మారుతున్నది. అనేక ఐరోపా దేశాలలో ప్రజాభిప్రాయం మారుతున్నదని అమెరికా గుర్తెరగాల్సిన అవసరం ఉంది.” అని కూడా సదరు అధికారి చెప్పినట్లు పొలిటికో పేర్కొన్నది.


రష్యా అంటే ఒంటికాలి మీద లేచే ఐరోపా సమాఖ్య విదేశాంగ విధాన అధిపతి జోసెఫ్‌ బోరెల్‌ ఉక్రెయిన్‌కు ఉమ్మడిగా సాయపడాలనే భావననే ప్రశ్నించాడు. ” అమెరికన్లు – మా స్నేహితులు – నిర్ణయాలుతీసుకుంటారు, అవి మాపై ఆర్ధిక ప్రభావం చూపుతాయి ” అన్నాడు. ” అమెరికా మాకు అమ్ముతున్న గాస్‌ ధర అట్లాంటిక్‌ దాటే సరికి అనేక రెట్లు పెరిగి నాలుగింతలు అవుతున్నది. అమెరికన్లు మా స్నేహితులనటంలో ఎలాంటి సందేహం లేదు….. కానీ మిత్రుల మధ్య ఎక్కడో తప్పు జరుగుతున్నది అనిపించినపుడు దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ” అని ఐరోపా అంతర్గత మార్కెట్‌ కమిషనర్‌ థెరీ బ్రెటన్‌ ఒక ఫ్రెంచి టీవీతో మాట్లాడుతూ చెప్పాడు. పొలిటికోతో మరొక ఐరోపా ప్రతినిధి మాట్లాడుతూ ద్రవ్యోల్బణాన్ని తగ్గించే చట్టం పేరుతో జో బైడెన్‌ సర్కార్‌ 369 బిలియన్‌ డాలర్ల పారిశ్రామిక రాయితీల పథకాన్ని ప్రకటించాడు. అది ఐరోపా రాజధానులన్నింటా ఆకస్మిక భయాన్ని కలిగించింది.ద్రవ్యోల్బణాన్ని తగ్గించే చట్టం అన్నింటినీ మార్చివేస్తున్నది. అమెరికా ఇప్పటికీ మా మిత్రదేశంగా ఉన్నట్లా లేనట్లా అని అడిగినట్లు పొలిటికో పేర్కొన్నది.


అక్టోబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభ తరువాత ఐరోపా సమాఖ్య నుంచి ఒక ఉన్నతాధికారి చైనా సందర్శించటం ఇదే ప్రధమం. చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకుంటే తప్ప ఐరోపా మండలి అధ్యక్షుడు ఛార్లెస్‌ మైఖేల్‌ బీజింగ్‌ సందర్శన జరుగుతుంది. చైనాను ఒంటరిపాటు గావించాలని, అక్కడి నుంచి సరకులు కొనుగోలు నిలిపివేయాలంటూ రోజూ పారాయణం చేస్తున్న అమెరికా వైఖరిని తోసిరాజనటమే ఇది. చైనా మిగతా దేశాలన్నింటికీ పోటీదారు, వ్యవస్థాపరంగా శత్రువు అని అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో అమెరికాకు మరింత దగ్గరైన ఐరోపా సమాఖ్య ప్రముఖుడు చైనా సందర్శన ఒక కీలక పరిణామం. ఎంతో కసరత్తు జరిగితే తప్ప ఇలాంటివి జరగవు.చైనా మీద గుర్రుగా ఉన్న ఐరోపా సమాఖ్యలోని అగ్రదేశం జర్మనీ ఛాన్సలర్‌ ష్కుల్జ్‌ ఇటీవల చైనా సందర్శించి తాము ఘర్షణకు సిద్దం కాదనే సందేశాన్ని నాటో కూటమికి పంపాడు. తరువాత బీజింగ్‌తో సంబంధాలకు సిద్దమే అని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటించాడు. దానికొనసాగింపుగా మండలి నేత వస్తున్నట్లు చెప్పవచ్చు. ఐరోపాను తన అవసరాలకు వాడుకుంటూ ఆ మేరకు లబ్ది పొందుతూ ఐరోపాకు వాటా ఇచ్చేందుకు అమెరికా నిరాకరిస్తున్నకారణంగానే అవసరమైతే తమదారి తాము చూసుకుంటామనే సందేశాన్ని ఐరోపా ఇస్తున్నది. అమెరికా పెత్తనాన్ని అడ్డుకొని తాము బతకాలంటే చైనా లేకుండా జరిగేది కాదన్న గ్రహింపు కూడా దీనిలో ఉంది. అంటే వారి అవసరాల కోసమే చైనాతో చెలిమి అన్నది స్పష్టం.


ఉక్రెయిన్‌ పోరు సంక్షోభం కారణంగా మరణించేవారి కంటే దాని పర్యవసానాలతో తలెత్తిన పరిస్థితి కారణంగా చలి కాలంలో ఎక్కువ మంది ఐరోపా వారు మరణిస్తారని బ్రిటన్నుంచి వెలువడే వారపత్రిక ఎకానమిస్ట్‌ నవంబరు 28వ తేదీ సంచిక విశ్లేషణ పేర్కొన్నది. ఐరాస అధికారికంగా ప్రకటించిన తాజా సమాచారం ప్రకారం ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా అక్కడ మరణించిన పౌరులు 6,900 మంది, గాయపడిన వారి సంఖ్య పదివేలకు చేరింది. మిలిటరీ పరంగా ఎందరు సైనికులు మరణించిందీ నిర్ధారించటం కష్టమని రెండు వైపులా మరణించిన వారు 25 నుంచి 30వేల చొప్పున ఉండవచ్చని ఎకనమిస్ట్‌ పేర్కొన్నది. చలికాలంలో ఇంథన ధరలు పెరిగితే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే ఇతివృత్తంతో గత సమాచార ప్రాతిపదికన ప్రాణ నష్టం గురించి పేర్కొన్నది. అసాధారణ రీతిలో గాస్‌, విద్యుత్‌ ధరలు పెరిగిన కారణంగా రానున్నది ప్రత్యేకమైన చలికాలంగా మారితే సాధారణ మరణాలకంటే లక్షా 47వేల మంది అదనంగా మరణిస్తారని పేర్కొన్నది. చలి మరింత తీవ్రంగా ఉంటే, వాతావరణ మార్పులు జరిగితే ఈ సంఖ్య 3,35,000 ఉండవచ్చని పేర్కొన్నది. చలి తక్కువగా ఉన్నప్పటికీ కనిష్టంగా 79 వేలు అదనంగా ఉండవచ్చని తెలిపింది.జూన్‌-ఆగస్టు నెలలతో పోలిస్తే డిసెంబరు-ఫిబ్రవరి మధ్య మరణాలు 21శాతం ఎక్కువగా ఉంటాయని అంచనా. ఈ విశ్లేషణ తరువాత ఐరోపా ప్రభుత్వాలు, సమాజాల్లో స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.రికార్డు స్థాయిలో పెరిగిన ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కారణంగా పేదలు, మధ్యతరగతి జనాలు చలికాలంలో ఆహారానికి ఎక్కువ సొమ్ము వెచ్చించాలా గృహాలను వెచ్చచేసుకొనే ఇంథనానికి ఎక్కువ ఖర్చు చేయాలా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.2000 నుంచి 2019 ధరలతో పోల్చితే గాస్‌ ధర 144, విద్యుత్‌ ధర 78శాతం పెరిగింది. ఇటలీలో 2020 నుంచి 200శాతం వరకు విద్యుత్‌ బిల్లులు పెరిగాయి. ఎక్కువగా నష్టం, ఇబ్బందులు పడుతున్నది ఐరోపా సమాజమే గనుక దాన్నుంచి బయటపడేందుకు ఉక్రెయిన్‌ – రష్యా చర్చలకు వత్తిడి తెచ్చే అవకాశం ఉంది.