Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


నూటనలభై రోజులుగా లాటిన్‌ కాథలిక్‌ చర్చి తిరువనంతపురం పెద్దల మార్గదర్శనంలో నడిచిన విఝంజమ్‌ రేవు నిర్మాణ వ్యతిరేక కమిటీ డిసెంబరు ఆరవ తేదీన బేషరతుగా ఆందోళనను విరమించింది. ఇది తాత్కాలికమని కూడా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిఎంతో చర్చలు జరిపిన తరువాత ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ కమిటీ అంతకు ముందు లేవనెత్తిన ఏడు డిమాండ్లలో రేవు నిర్మాణం ఆపాలన్నదాన్ని మినహ మిగిలిన ఆరింటిని ప్రభుత్వం ఎప్పుడో అంగీకరించింది. అయినప్పటికీ తరువాత కూడా దాన్ని కొనసాగించేందుకు, శాంతి భద్రతల సమస్య సృష్టికి చూసినప్పటికీ సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం, పోలీసు శాఖ ఎంతో సంయమనం పాటించిన కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. మంగళవారం నాడు చర్చల్లో ఆందోళన కమిటీ కొత్తగా లేవనెత్తిన ఏ డిమాండ్‌ను ప్రభుత్వం ఆమోదించలేదు. అంతకు ముందు ఈ ఆందోళనను ఆసరా చేసుకొని ప్రభుత్వం, సిపిఎం గురించి తప్పుడు ప్రచారం చేసేందుకు, వాస్తవాలను వక్రీకరించేందుకు చూశారు. వాటిలో ఒకటి ” అదానీ విఝంజమ్‌ రేవు నిర్మాణానికి చేతులు కలిపిన సిపిఐ(ఎం)-బిజెపి ” అంటూ పత్రికల్లో వచ్చిన వార్త శీర్షిక.నవంబరు 26, 27 తేదీలలో రేవు నిర్మాణ ప్రాంతంలో జరిగిన విధ్వంసకాండపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)తో విచారణ జరిపించాలన్న వినతిని హైకోర్టు తిరస్కరించింది. అదానీ కంపెనీ కోరినట్లుగా రేవు రక్షణకు కేంద్ర బలగాల ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం, సిపిఎం చెప్పగా బిజెపి వ్యతిరేకించింది. తాము కూడా రేవు నిర్మాణానికి అనుకూలమే అన్న కాంగ్రెస్‌ దాన్ని అడ్డుకోచూసిన ఆందోళన కారులకు పరోక్షంగా వత్తాసు పలికింది. తిరువనంతపురం కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌ రేవు నిర్మాణం జరగాలంటూనే ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నట్లు విలేకర్లతో చెప్పారు. వాస్తవాలను వివరించేందుకు ప్రజల వద్దకు వెళతామని సిపిఎం ప్రకటించింది. మరోవైపున మతం రంగు పులిమేందుకు, రెచ్చగొట్టేందుకు కాషాయ దళాలు విఫలయత్నం చేశాయి. రేవు నిర్మాణం ఆపేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటన్నింటిని చూసినపుడు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టికి కుట్ర జరిగిందా అన్న అనుమానం తలెత్తింది. కేరళలో తాజా పరిణామాలు వెల్లడిస్తున్న అంశాలేమిటి?


కేరళ రాజధాని తిరువనంతపురం దగ్గర నిర్మితమౌతున్న రేవు నిర్మాణం మీద తలెత్తిన వివాదం గురించి జరుగుతున్న పరిణామాలపై వాస్తవాలను తప్పుదారి పట్టించే ప్రచారానికి పైన పేర్కొన్న వార్తా శీర్షిక ఒక ఉదాహరణ. వాటిని పట్టుకొని అదానీని ఇతర చోట్ల వ్యతిరేకించి తమ పాలనలో ఉన్న కేరళలో కమ్యూనిస్టులు సమర్దించారంటూ కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో రెచ్చి పోయారు. రేవు అభివృద్ధిని వ్యతిరేకిస్తూ ఆందోళన జరుపుతున్న వారు లేవనెత్తిన ఏడు డిమాండ్లలో ఆరింటిని అంగీకరించామని, నిర్మాణం ఆపాలి, వద్దు అన్న ఏడవ అంశాన్ని అంగీకరించేది లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. తమ ఆందోళన ఒక దశకు వచ్చినందున తాత్కాలికంగా విరమిస్తున్నామని ఆందోళన కమిటీ కన్వీనర్‌ ఫాదర్‌ ఫెరీరా మంగళవారం సాయంత్రం ప్రకటించారు. అంతకు ముందు కమిటీ ప్రతినిధి వర్గం సిఎంను కలిసింది.విఝంజమ్‌ రేవు వద్ద జరిగిన ఉదంతాలపై న్యాయవిచారణ జరిపించాలని, సముద్ర పోటుకు ఇండ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించేంత వరకు నెలకు ఎనిమిది వేలు అద్దెగా చెల్లించాలని, దీనిలో రేవు కంపెనీ అదాని కంపెనీ సొమ్ము ఉండకూడదని, ఈ ప్రాంతంలో సముద్రతీర కోతపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసే కమిటీలో స్థానిక ప్రతినిధి ఒకరు ఉండాలని ఆందోళనకారులు ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్లను ఉంచారు. దేన్నీ ప్రభుత్వం అంగీకరించలేదు. అద్దెగా చెల్లించాలన్న ఎనిమిది వేలలో ప్రభుత్వం ఐదున్నరవేలు, అదానీ రేవు కంపెనీ సిఎస్‌ఆర్‌ నిధుల నుంచి మరో రెండున్నరవేలు చెల్లించేందుకు చూస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను చర్చి పెద్దలు తిరస్కరించారు. తాము అదానీ కంపెనీ డబ్బు తీసుకోబోమని, ఐదున్నరవేలకే పరిమితం అవుతామని చెప్పారు. చర్చి అధికారులు, ఇతరులపై మోపిన తీవ్రమైన కేసుల గురించి కూడా ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదు. కేసులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.


విఝంజమ్‌ రేవును మూడు దశల్లో నిర్మించాలన్నది పథకం.2019 డిసెంబరు నాటికి తొలి దశ పూర్తి కావాలనుకున్నది జరగలేదు, తరువాత 2020 ఆగస్టుకు పొడిగించారు, కరోనా, భూసేకరణ పూర్తిగానందున అది కూడా జరగలేదు. 2023 సెప్టెంబరు నాటికి పూర్తి చేసేందుకు జరుగుతున్న పనులను రేవు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారికి స్థానిక చర్చి నేతలు మార్గదర్శకులుగా ఉన్నారు. ప్రయాణీకులు, కంటెయినర్‌, ఇతర సరకు రవాణా ఓడలను నడిపేందుకు కేరళ ప్రభుత్వం విఝంజమ్‌ ఇంటర్నేషనల్‌ సీ పోర్ట్స్‌ లిమిటెడ్‌(విఐఎస్‌ఎల్‌) పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ రేవు అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ ఓడల రవాణా మార్గానికి చాలా దగ్గరగా ఉన్నందున ఇతర దేశాల నుంచి వచ్చే వాటిని కూడా ఆకర్షించి ఇతర రేవుల నుంచి వచ్చే సరకుల ఎగుమతి-దిగుమతి ఓడల అవసరాలకు ఇది అనువుగా ఉంటుంది. కొలంబో, సింగపూర్‌, దుబాయి రేవులకు వెళ్లే కొన్ని ఓడలు ఇటు మరలుతాయి. దీని నిర్మాణం గురించి పాతిక సంవత్సరాలుగా చర్చ ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్దతిలో చేపట్టేందుకు గతంలో రెండు సార్లు టెండర్లు పిలిచినా ఫలించలేదు. తొలుత ఒక చైనా కంపెనీకి టెండరు దక్కినా కేంద్రం నుంచి దానికి భద్రతా పరమైన అనుమతి రానందున రద్దైంది. తరువాత లాంకో గ్రూపుకు ఇవ్వటాన్ని జూమ్‌ డెవలపర్స్‌ అనే సంస్థ కోర్టులో సవాలు చేసింది. దాంతో అదీ జరగలేదు. మూడవసారి 2014లో పిలిచిన టెండర్లకు అదానీ సంస్థ ఒక్కటే వచ్చింది, దాంతో 2015లో నాటి యుడిఎఫ్‌ (కాంగ్రెస్‌కూటమి) ప్రభుత్వం అదానీ కంపెనీకే ఇచ్చి ఒప్పందం చేసుకుంది. నాటి సిఎం ఊమెన్‌ చాందీ శంకుస్థాపన కూడా చేశారు. దీని ప్రకారం వెయ్యి రోజుల్లో రేవు నిర్మాణం పూర్తి కావాలి. రు.7,525 కోట్ల ఈ పథకానికి నిరసనగా 2022 ఆగస్టు 16 నుంచి స్థానిక మత్స్యకారులు ఆందోళనకు పూనుకున్నారు. దానికి చర్చి పెద్దలు నాయకత్వం వహించారు. ప్రతి ఆదివారం చర్చి ప్రార్ధనల్లో ఆదేశాలు జారీ చేశారు. కొందరు పర్యావరణ వేత్తలు కూడా రేవును వ్యతిరేకిస్తున్నారు.దీని వలన తీర ప్రాంతం మీద ప్రతికూల ప్రభావం పడుతుందన్నది వారి వాదన. సముద్ర తీరం కోతకు గురవుతుందని, తమ జీవనాధారం దెబ్బతింటుందని చేపలు పట్టేవారు అంటున్నారు. అలాంటిదేమీ ఉండదని పరిశీలన జరిపిన కమిటీ చెప్పింది. ఆందోళన ప్రారంభం నాటికి సగం రేవు పనులు పూర్తైనందున ఆపే అవకాశం లేదని ప్రభుత్వం అప్పుడే స్పష్టం చేసింది. గతంలో చర్చలకు వచ్చిన ప్రతినిధులు సమావేశాల్లో సంతృప్తిని ప్రకటించి వెలుపలికి వచ్చిన తరువాత ఆందోళనను కొనసాగిస్తున్నారు. మరోసారి చర్చలకు రావాలంటే ముందుగా నిర్మాణ పనులు ఆపాలనే షరతు విధిస్తున్నారు.ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. వారు లేవనెత్తిన మిగిలిన ఆరు డిమాండ్లను అమలు జరిపేందుకు, పరిశీలించేందుకు అంగీకరించింది.


ఆగస్టు నుంచి నిరసన తెలుపుతున్నవారు ఆందోళనకు సంబంధించి గతంలో నమోదైన కేసులో ఉన్నవారిని, ఇతరులను రేవు పనులను అడ్డుకుంటున్నందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విడుదల చేయాలనే నెపంతో నవంబరు 26 రాత్రి 27వ తేదీన తీవ్ర హింసాకాండకు దిగారు. పోలీస్‌ స్టేషన్‌ మీద దాడి చేశారు, పరిసరాల్లో ఉన్న ఇండ్లపై రాళ్లు వేశారు. రెండు వాహనాలను దగ్దం చేసి అనేక మంది పోలీసులను గాయపరిచారు. వారిని ఆసుపత్రికి తీసుకు వెళ్లటాన్ని కూడా అడ్డుకున్నారు. రోడ్లను ఆక్రమించారు. రేవు నిర్మాణంలో తమకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ దళాలను రప్పించాలని అదానీ గ్రూపు రాష్ట్ర హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు తమకు కేంద్ర దళాల అవసరం లేదని, కావాలని అదానీ కంపెనీ కోరింది తప్ప తాము కాదని రాష్ట్ర రేవుల శాఖ మంత్రి అహమ్మద్‌ దేవరకోవిల్‌ స్పష్టం చేశారు. కేంద్రం పంపితే తమకేమీ అభ్యంతరం లేదని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.


ఈ రేవు నిర్మాణం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) పద్దతికి మారుగా కౌలు పద్దతిని పాటించాలని నాడు ప్రతిపక్షంలో ఉన్న ఎల్‌డిఎఫ్‌ కోరింది. పిపిపి పద్దతిలో రు.7,525 కోట్లకు గాను అదానీ రు.2,454 కోట్లు మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. ఒక ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నదాన్ని తరువాత వచ్చిన ప్రభుత్వం తిరగదోడితే నిర్మాణ హక్కు పొందిన వారికి పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందువలన తాను వ్యతిరేకించినప్పటికీ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అమలుకు కట్టుబడి ఉంది.ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరి, తమ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం గురించి వేరే విధంగా మాట్లాడటం వెనుక ఓట్ల రాజకీయం ఉంది. లాటిన్‌ కాథలిక్‌ మతపెద్దలు గతంలో ఆ పార్టీకి మద్దతు ఇచ్చినందున ఆ పార్టీ లబ్ది పొందింది. 2021 ఎన్నికల్లో కూడా మద్దతు ఇచ్చినా దక్షిణ, మధ్య కేరళలోని చర్చి ప్రభావితం చేసే 34 చోట్ల నాలుగు అసెంబ్లీ సీట్లు మాత్రమే కాంగ్రెస్‌కు వచ్చాయి. రేవు ప్రాంతంలోని రెండు సీట్లను కూడా ఎల్‌డిఎఫ్‌ గెలుచుకుంది. తిరిగి చర్చి మద్దతు పొందేందుకు రేవు ఆందోళనను ఆసరాగా చేసుకోవాలని కాంగ్రెస్‌ చూసింది, సకాలంలో నిర్మించలేదని, చర్చి డిమాండ్లను పరిశీలించలేదని ఆరోపించింది.


రేవు నిర్మాణాన్ని అడ్డుకుంటూ ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు అడ్డుగా నిలిచారు. దాంతో పనులను కొనసాగనివ్వాలని నవంబరు చివరి వారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఆందోళనకారులు ఉల్లంఘించి విధ్వంసకాండకు పాల్పడ్డారు. పోలీసులు ఎంతో సంయమనం పాటించారు. ఒక వైపు క్రైస్తవ మత పెద్దలు పల్లెకారులను రెచ్చగొట్టి ఆందోళనకు పురికొల్పుతుంటే మరోవైపు దాన్ని సొమ్ము చేసుకొనేందుకు బిజెపి మద్దతు ఉన్నశక్తులు రేవుకు మద్దతు పేరుతో హిందూ ఐక్యవేదిక వంటి సంఘపరివార్‌ సంస్థలకు చెందిన వారు కాషాయ జండాలతో మరోవైపున టెంట్లు వేసి రెచ్చగొట్టేందుకు, మత రంగు పులిమేందుకు చూశారు.ఈ అంశంలో రెచ్చగొట్టేందుకు క్రైస్తవ మత పెద్దలు కూడా తక్కువ తినలేదు.రేవు నిర్మాణ వ్యతిరేక ఆందోళన కారుల సంస్థ నే తలలో ఒకరైన ఫాదర్‌ థియోడోసియస్‌ డి క్రజ్‌ జనాన్ని రెచ్చగొడుతూ మత్స్యశాఖ మంత్రి అబ్దుర్‌రహిమాన్‌ పేరులోనే ఒక ఉగ్రవాది దాగి ఉన్నాడని నోరుపారవేసుకున్నారు. ఎల్‌డిఎఫ్‌కు చెందిన వివిధ సంస్థలు, ఇతరుల నుంచి సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలు రావటం, హింసాకాండను ప్రోత్సహించినందుకు చివరికి మద్దతు ఇస్తున్న వారిలో, సాధారణ జనంలో సానుభూతి కనుమరుగు కావటం, పోలీసులు వివిధ కేసులను పెట్టిన పూర్వరంగంలో సదరు ఫాదర్‌ నోరు జారి మాట్లాడానని క్షమించాలని కోరారు.


కొన్ని స్వార్దపరశక్తులు రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయని, కొందరు ప్రతిఘటించి బెదరించినంత మాత్రాన విశాల ప్రయోజనాలకోసం ఉద్దేశించిన దానిని నిలిపివేసే ప్రసక్తి లేదని సిఎం పినరయి విజయన్‌ స్పష్టం చేశారు.అదే జరిగితే రాష్ట్రం విశ్వసనీయత కోల్పోతుందని అన్నారు.విఝింజమ్‌ రేవు పరిరక్షణ సమితి పేరుతో ఉన్న వారు ఇచ్చిన పిలుపులో భాగంగా జరిగిన ప్రదర్శనలలో పార్టీలతో నిమిత్తం లేకుండా రేవు నిర్మాణం జరగాలని కోరుకోనే వారందరూ పాల్గొన్నారు. అది ఒక పార్టీకి చెందిన వేదిక కాదు. దానిలో సిపిఎం, బిజెపి ఇతర సంస్థల స్థానిక నేతలు పాల్గొన్నారు. దాన్నే రెండు పార్టీలు చేతులు కలిపినట్లుగా కొందరు చిత్రించారు. కేంద్ర దళాలను పంపాలని అదానీ కంపెనీ కేరళ హైకోర్టును కోరింది, ఇప్పటికే కొన్ని సంస్థలను కేంద్ర దళాల పరిధిలో ఉన్నందున మరొకదానికోసం పంపితే తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీని మీద వైఖరిని తెలపాలని కేంద్రాన్ని కోర్టు కోర్టు కోరింది. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు.


కేంద్ర దళాలు వస్తే తమకు అభ్యంతరం లేదని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం హైకోర్టుకు తెలపటం వెనుక పెద్ద రాజకీయ ఎత్తుగడ ఉన్నందున కేంద్ర పార్టీ దృష్టికి తీసుకు వెళ్లాలని రాష్ట్ర బిజెపి నేతలు నిర్ణయించినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక రాసింది. ఒక వేళ కేంద్ర దళాలు వచ్చినపుడు ఏదైనా అవాంఛనీయ ఉదంతం జరిగితే ఒక్క లాటిన్‌ కాథలిక్‌ చర్చ్‌కు చెందిన వారే కాదు మొత్తం క్రైస్తవులు పార్టీకి మరింత దూరం అవుతారని బిజెపి భావిస్తున్నట్లు పేర్కొన్నది. ఆ వార్త సారాంశం ఇలా ఉంది. ” కొంత కాలంగా వివిధ క్రైస్తవ సమూహాలకు చేరువ కావాలని బిజెపి, సంఘపరివార్‌ ప్రయత్నిస్తున్నది. వీరిలో ఒక తరగతి మద్దతైనా లేకుండా రాష్ట్రంలో ఎన్నికలలో నిలబడలేమని బిజెపికి తెలుసు. ఇటీవలి కాలంలో వివిధ చర్చ్‌ల అధికారులతో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నాయకత్వం, ప్రధాని నరేంద్రమోడీ కూడా పలుసార్లు మీటింగ్‌లు జరిపారు.ఈ వెలుగులో హైకోర్టుకు ఎల్‌డిఎఫ్‌ వెల్లడించిన వైఖరి వెనుక రాజకీయం ఉందని బిజెపి నేతలు భావిస్తున్నారు. బిజెపి రాష్ట్ర ఇంఛార్జులుగా ఉన్న ప్రకాష్‌ జవదేకర్‌,రాధామోహన్‌దాస్‌ అగర్వాల్‌తో కేంద్ర మంత్రి మురళీధరన్‌తో కలసి రాష్ట్ర నేతలు దీన్ని గురించి చర్చించనున్నారు. విఝుంజమ్‌లో కేంద్ర దళాల గురించి విలేకరులతో మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని మురళీధరన్‌ ఆరోపించారు. రేవు వద్ద ఏదైనా జరిగితే దానికి బాధ్యత బిజెపిదే అని, కేంద్ర ప్రభుత్వం క్రైస్తవ మైనారిటీలకు వ్యతిరేకమని చిత్రించేందుకు ఎల్‌డిఎఫ్‌ చూస్తున్నదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి కృష్ణకుమార్‌ చెప్పారు.సిపిఎం, ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలతో ఉంది అది కుదరదు ” అన్నట్లు ఆ పత్రిక పేర్కొన్నది.


ఇక్కడే బిజెపి దుష్ట ఆలోచన వెల్లడైంది. ఏదైనా జరుగుతుందని ముందే ఆ పార్టీ కోకిల ఎందుకు కూస్తున్నట్లు ? రేవు వద్ద ఒక పథకం ప్రకారం జరిపిన హింసాకాండ వెనుక ఉన్న శక్తుల ఎత్తుగడ తెలుసుగనుకనే పోలీసులు ఎంతో నిబ్బరంగా ఉన్నారు. రానున్న రోజుల్లో అందోళన చేస్తున్న వారు తిరిగి విధ్వంసకాండకు పాల్పడతారని బిజెపికి ముందే తెలుసా ? అందుకే కేంద్ర దళాలు వద్దని చెప్పిందా అన్న అనుమానాలు కలగటం సహజం. గతంలో శబరిమల పేరుతో హింసాకాండను రెచ్చగొట్టేందుకు కాషాయ దళాలు చూసిన సంగతి తెలిసిందే.


తిరువనంతపురం కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న శశిధరూర్‌ డిసెంబరు ఐదున క్రైస్తవమత పెద్దలను కలసిన తరువాత విలేకర్లతో మాట్లాడుతూ రేవు నిర్మాణం ఆపాలనటాన్ని తాను సమర్ధించటలేదంటూ, నిలిపివేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న వారికి మాత్రం మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.సిరో మలబార్‌ కాథలిక్‌ చర్చి ఆర్చిబిషప్‌ మార్‌ జార్జి ఆలెన్‌ చెరీ విలేకర్లతో మాట్లాడుతూ రేవు అంశాన్ని కేరళ కాథలిక్‌ బిషప్పుల కౌన్సిల్‌ సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించారు. శశి ధరూర్‌తో జరిపిన సమావేశంలో ఏదో ఒక అంశం గురించి మాత్రమే గాక అనేక అంశాలను చర్చించినట్లు చెప్పారు. సిరో-మలంకర కాథలిక్‌ చర్చి కార్డినల్‌ బేసిలోస్‌ క్లీమిస్‌తో ప్రతి రోజూ చర్చిస్తున్నట్లు శశిధరూర్‌ చెప్పారు. రేవు నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూసిన వారు గతంలో కమ్యూనిస్టు నేత నంబూద్రిపాద్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిఐఏ అందించిన సొమ్ముతో అన్ని రకాల మతశక్తులు, కాంగ్రెస్‌ కలసి విముక్తి సమరం సాగించినట్లుగా మరోసారి చేస్తామని కొందరు రెచ్చగొట్టేందుకు చూశారు. కొన్ని శక్తుల కుట్రల గురించి తెలుసుగనుకనే గత నాలుగున్నర నెలలుగా ఎంతగా రెచ్చగొడుతున్నా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం సహనంతో ఉంది. చివరికి ఆందోళన కారులే దాడికి దిగారు. అది వికటించటంతో బేషరతుగా వెనక్కు తగ్గారు.