Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ రక్షణ పేరుతో రష్యా మీద ఆంక్షలు, ఆయుధాలతో ఉమ్మడిగా పోరుచేస్తున్న అమెరికా – ఐరోపా సమాఖ్య మధ్య అమెరికా సబ్సిడీలు కొత్త వాణిజ్య పోరుకు నాంది కానున్నాయా అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఈ రాయితీలు ప్రధానంగా జర్మనీ, ఫ్రెంచి కార్ల కంపెనీలకు ముప్పుగా కనిపించటంతో ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. జర్మనీ కాస్త ఆచితూచి స్పందిస్తున్నది.ఉక్రెయిన్‌ పోరులో అన్ని రకాలుగా అమెరికా లబ్ది తమకు ఇబ్బందులా అన్న ఉక్రోషం ఇప్పటికే ఐరోపాలో ప్రారంభమైంది. దాన్ని మరింతగా పెంచేదిగా తాజా పరిణామాలున్నాయి. సబ్సిడీ వివాదం టీ కప్పులో తుపానులా ముగుస్తుందా మరింత తీవ్రం అవుతుందా ? అమెరికాలో తయారైన ఉత్పత్తులకు పెద్ద ఎత్తున అక్కడి ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ, పన్ను రాయితీల గురించి ఐరోపా సమాఖ్య ఒక్కటిగా ఉండాలని తొలిసారిగా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లేయాన్‌ పిలుపునిచ్చారు.అనుచిత పోటీకి దారితీసి మార్కెట్ల మూత, సరఫరా గొలుసుల విచ్చిన్నానికి దారి తీస్తుందని వాన్‌డెర్‌ అన్నారు. నిజానికి ఆమె ఐరోపాలో అమెరికా అనుకూల నేత, అంతరంగంలో ఏమున్నప్పటికీ ఐరోపాలో తలెత్తిన ఆందోళనను ప్రతిబించించే విధంగా ఆమె మాట్లాడాల్సి వచ్చింది.


ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం(ఐఆర్‌ఏ) పేరుతో జో బైడెన్‌ సర్కార్‌ 430 బిలియన్‌ డాలర్ల పథకాన్ని ప్రకటించింది. దీనిలో అమెరికాలో తయారైన వస్తువులను కొనుగోలు చేసే వారికి రాయితీలు ఇస్తారు. ఇది అక్కడి కంపెనీలకు ఇచ్చినట్లే. ఈ పధకం అమెరికాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం చేసుకున్న కెనడా, మెక్సికో దేశాలకు కూడా వర్తిస్తుంది. మరోవైపు తమ కంపెనీలకు నష్టదాయకమని ఐరోపా సమాఖ్య ఆందోళన వెల్లడించింది. అమెరికాకు ప్రతిగా సమాఖ్య కూడా తన స్వంత నిబంధనలను సరి చేసుకొని అమెరికాకు పోటీగా చర్యలు తీసుకోవాలని ఉర్సులా సూచించారు. అమెరికా ఐఆర్‌ఏ చట్టం గురించి ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ)కు ఫిర్యాదు చేయాలని ఐరోపా పార్లమెంటు వాణిజ్య కమిటీ అధిపతి బెరెండ్‌ లాంగే అన్నాడు. అమెరికా ఇప్పటికే చట్టాన్ని ఆమోదించినందున పెద్దగా ఒరిగేదేమీ ఉండదని కూడా అన్నట్లు వార్తలు.ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం పేరుతో ఇస్తున్న సబ్సిడీ నిజానికి పోటీదార్లను బలహీనపరిచేందుకు తప్ప మరొకటి కాదు. ఇదే విధంగా అమెరికా చిప్స్‌ చట్టం పేరుతో తీసుకున్న చర్య తన స్వంత సెమికండక్టర్‌ పరిశ్రమ రక్షణ కోసమే.


అమెరికా ప్రకటించిన సబ్సిడీల మొత్తం అమెరికాలో ఉత్పత్తి అయిన వాటికి ఇవ్వటం డబ్ల్యుటిఓ నిబంధనలకు విరుద్దమని, దానితో తాము పోటీ పడలేమని 27దేశాల ఐరోపా సమాఖ్య అంటోంది. అమెరికా సబ్సిడీలు మహా కలహశీలమైనవి, పశ్చిమ దేశాలను విడదీస్తాయని ఫ్రెంచి అధినేత మక్రాన్‌ వాషింగ్టన్‌ పర్యటనలోనే తన అసమ్మతిని వెళ్లగక్కాడు. మరోవైపున ఐఆర్‌ఏలో ఎలాంటి మార్పులు చేసేది లేదని అధికార డెమోక్రాట్లు స్పష్టం చేశారు. లోపల ఏమి ఉన్నప్పటికీ సబ్సిడీల వివాదాన్ని అట్లాంటిక్‌ వ్యాపిత దేశాల వాణిజ్య వివాదంగా మార్చకుండా చూడాలని మక్రాన్‌-జో బైడెన్‌ ప్రకటించారు. అమెరికా సబ్సిడీలకు ఐరోపా నుంచి గట్టి స్పందన ఉండాలని జర్మనీ ఆర్థిక మంత్రి రాబర్ట్‌ హెబెక్‌ అన్నాడు. జర్మనీ విత్త మంత్రి క్రిస్టియన్‌ లిండ్‌నెర్‌ స్పందిస్తూ అమెరికాతో వాణిజ్యపోరుకు సిద్దపడాలన్నాడు. తమ వాణిజ్య ప్రయోజనాల రక్షణకు ఆర్థిక దౌత్యం మీద ఆధారపడాలని కూడా చెప్పాడు. ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో అమెరికా-ఐరోపా ప్రతినిధులు టెక్‌ సహకారం గురించి చర్చలు జరపనున్నారు. ఈ చర్చలల్లో సబ్సిడీల గురించి తేలేదేమీ ఉండదు గనుక ఐరోపా తన పరిశ్రమకు మద్దతు ఇచ్చేందుకు సిద్దం కావాలని ఐరోపా పార్లమెంటు వాణిజ్య కమిటీ అధిపతి బెరెండ్‌ లాంగే అన్నాడు. ఐరోపా అంతర్గత మార్కెట్‌ కమిషనర్‌ థిర్రీ బ్రెటన్‌ మాట్లాడుతూ ఐరోపా పరిశ్రమలను కాపాడుకొనేందుకు ఒక నిధిని ఏర్పాటు చేసుకోవాలని సూచించాడు.అమెరికాకు ప్రతిగా ఇతర దేశాలు కూడా కొన్ని ప్రతికూల చర్యలు తీసుకోకపోలేదు. ఉదాహరణకు డిజిటల్‌ సార్వభౌమత్వం పేరుతో అమెరికా టెక్‌ కంపెనీల మీద ఫ్రాన్సు డిజిటల్‌ పన్ను విధించింది. అమెరికా మీద ఆధారపడకుండా సబ్సిడీలతో ఐరోపా సెమికండక్టర్‌ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించింది. అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి అమెరికా కంపెనీలను తమ దేశంలో కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా నిషేధించాలని చూస్తున్నది. నిజంగా విబేధాలు ముదిరితే ఇలాంటి వాటిని చూపి అమెరికా ఎదురుదాడికి దిగవచ్చు.


అమెరికా-ఐరోపా మధ్య వాణిజ్య పోరు జరిగే అవకాశాలున్నాయనే ఆందోళన పెరుగుతోందని, ఈ పూర్వరంగంలో తాము మూల్యం చెల్లిస్తూ అమెరికా పెత్తనానికి తలవంచి అనుసరించటం కంటే తమ ప్రయోజనాల రక్షణకు స్వంత నిర్ణయాలు తీసుకోవటం మంచిదని చైనా విశ్లేషకులు ఐరోపాకు సూచించారు. ప్రస్తుతం ఐరోపా నేతలు అటు అమెరికా ఇటు చైనాతోను సంబంధాలను కొనసాగిస్తున్నారు.చైనాతో విడగొట్టుకోవాలని అమెరికా నిరంతరం ఇతర దేశాలకు చెబుతోంది.ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మక్రాన్‌ జనవరిలో చైనా రానున్నాడు. ఎలక్ట్రిక్‌ వాహనాలు, క్లీన్‌ ఎనర్జీకి అమెరికా ఇస్తున్న భారీ సబ్సిడీల కారణంగా పెట్టుబడులు ఐరోపా నుంచి అమెరికాకు తరలుతాయని భావిస్తున్నారు. అందుకే ప్రతి ఐరోపా నేత వాటి గురించి ఆందోళన వెల్లడిస్తున్నారు.


ఉదాహరణకు అమెరికాలో తయారు చేసిన ఒక విద్యుత్‌ వాహనాన్ని కొనుగోలు చేసిన వారికి ధరను బట్టి గరిష్టంగా ఏడున్నరవేల డాలర్లు సబ్సిడీ ఇస్తారు. సదరు కారు విడి భాగాలు అమెరికా లేదా అమెరికాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం ఉన్న దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవై ఉండాలి. ఐరోపా సమాఖ్య – అమెరికాకు అలాంటి ఒప్పందాలు లేవు. అందువలన ఐరోపా కార్లకు సబ్సిడీ వర్తించదు.సోలార్‌ పానెల్స్‌, హీట్‌ పంప్స్‌, బయోమాస్‌ స్టవ్‌ల వంటి వాటికి కూడా సబ్సిడీలు ఇస్తారు. ఇవి జనవరి నుంచి అమల్లోకి రానుండటంతో ఆగస్టులోనే అమెరికా చట్టం చేసినా ఇప్పుడు ఐరోపాలో చర్చగా మారింది. మాతో సహకరిస్తున్నవారికి హాని కలిగించం అని జో బైడెన్‌ చెబుతూ ఐరోపాను బుజ్జగిస్తున్నప్పటికీ చట్టంలో మార్పులు చేసేందుకు అవకాశాలు లేవని చెబుతున్నారు.


ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు దాఖలు చేస్తే అది ఎంత కాలానికి తేలుతుందో, ఏ తీర్పు వస్తుందో అన్న అనుమానాలు కూడా ఐరోపాలో ఉన్నాయి. అమెరికా కంపెనీ బోయింగ్‌- ఐరోపా కంపెనీ ఎయిర్‌బస్‌ విమానాలకు ఇచ్చే సబ్సిడీ వివాదం పదిహేడు సంవత్సరాలు నడిచింది. ఆ సంస్థలో కొత్త జడ్జీల నియామకాన్ని అమెరికా అడ్డుకుంటున్నది, అందువలన అసలు కొత్త కేసులను అది చేపట్టటం కూడా అనుమానమే. దెబ్బకు దెబ్బ పంటికి పన్ను అన్నట్లుగా మనం కూడా సబ్సిడీలు ఇద్దామని మక్రాన్‌ అంటున్నాడు. ఐతే ఈ చర్య ఐరోపా అంతర్గత మార్కెట్‌ను దెబ్బ తీస్తే సమాఖ్య వాటిని తిరస్కరించే అవకాశం ఉంది. ఉమ్మడి పారిశ్రామిక విధానంతో పాటు సబ్సిడీలు ఇచ్చేందుకు కూడా ఉమ్మడి నిధి అవసరం, దాని కోసం అప్పు తేవాలి లేదా దేశాలన్నీ నిధులు సమకూర్చాలి. ఇప్పుడున్న స్థితిలో దాన్ని ఏమేరకు అంగీకరించేది అనుమానమే. కావాలంటే ఐరోపా కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తే తాము ఇస్తున్నదానికి సరితూగవచ్చు అని అమెరికా వాణిజ్య కాథరీన్‌ తాయి సలహా ఇచ్చారు. అలా ఇవ్వగలిగిన అవకాశం జర్మనీకే ఉంది. ఒక వేళ ఇస్తే ఒకే మార్కెట్‌ అన్న ఐరోపా సమాఖ్య లక్ష్యానికే ఎసరు వస్తుంది. చిన్న దేశాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే పెరిగిన ఇంథన ధరల నుంచి గృహాలు, వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగించేందుకు జర్మన్‌ ప్రభుత్వం ముందుకు తెచ్చిన 206 బిలియన్‌ డాలర్ల సబ్సిడీ పథకం మీద మిగతా దేశాలు గుర్రుగా ఉన్నాయి.


ఐరోపా కార్పొరేట్ల లబ్ది ప్రధానంగా రష్యా నుంచి చౌకగా వచ్చే ఇంథనం, చైనా నుంచి వస్తువుల మీద ఆధారపడి ఉంది. అమెరికాకు తోకగా మారి నడుస్తున్న కారణంగా ఇప్పుడు రష్యా నుంచి ఇంథనం నిలిచి ధరలు విపరీతంగా ధరలు పెరిగాయి. పరిశ్రమలకు ముప్పు వచ్చింది. దీనికి అమెరికా సబ్సిడీలు తోడైతే ఐరోపా పరిశ్రమల భవిష్యత్‌ సందిగ్దంలో పడుతుంది. ఇప్పటికే అక్కడ ఇంథన ధరలు విపరీతంగా పెరగటంతో అనేక మంది ఐరోపా పారిశ్రామిక, వాణిజ్య వేత్తలు తమ స్వంత దేశాల్లో బదులు అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. వారికి కావాల్సింది లాభాలు తప్ప మరొకటి కాదు. ఈ స్థితిలో అమెరికా మాట నమ్మి చైనాతో కూడా తెగతెంపులు చేసుకొంటే ఇబ్బంది పడేది ఐరోపా దేశాలే. అందువలన అది జరగకపోవచ్చు. అమెరికా-ఐరోపా మధ్య దూరం పెరిగే అవకాశాలు వస్తే చైనా దాన్ని వదులు కోదన్నది తెలిసిందే.


ఇతర దేశాల సబ్సిడీల గురించి వివిధ రకాలుగా నానా గొడవ చేస్తున్నది అమెరికా, ఐరోపా దేశాలు. పలు రకాలుగా వాటిని అదుపు చేస్తూ తమ మార్కెట్‌ను కాపాడుకుంటున్నాయి. ఇప్పుడు అమెరికా జాతీయవాదం, రక్షణాత్మక చర్యలకు దిగింది.అమెరికాకు అగ్రస్థానం అన్న విధానానికి డోనాల్డ్‌ ట్రంప్‌ తెరతీస్తే జో బైడెన్‌ దాన్ని కొనసాగిస్తున్నాడు. దీన్ని ఎదుర్కొనేందుకు ఐరోపా వద్ద ఎక్కువ అస్త్రాలు లేవు. తొలుత చర్చలతో ప్రారంభించి కుదరకపోతే ప్రపంచ వాణిజ్య సంస్థను ఆశ్రయించవచ్చు. వాటితో అమెరికా కొంత మేర దిగిరావచ్చు లేదా ససేమిరా అంటే నీవు నేర్పిన విద్యే అన్నట్లుగా ఐరోపా కూడా సబ్సిడీలు ప్రారంభించటం, అమెరికా వస్తువులపై పరిమితులు విధింపు వంటి పనులకు పూనుకోవచ్చు. ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితిలో అమెరికా తెగేదాకా లాగుతుందా ? చైనా, రష్యాలను అదుపు చేసేందుకు దానికి ఐరోపా అవసరం. అందువలన ఇతరంగా దానికి లబ్ది చేకూర్చేందుకు పూనుకుంటుందా? కొందరు ఐరోపా నేతలు, పెద్దల్లో అమెరికా గురించి ఇంకా భ్రమలు ఉన్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభంతో ఇంథన సరఫరాకు ఇబ్బందులు, ధరల పెరుగుదలతో ఇప్పటికే ఐరోపా అతలాకుతలం అవుతున్నందున ఇప్పుడు అమెరికా సబ్సిడీలతో తన పరిశ్రమలను కూడా దెబ్బతీస్తే జనం ఊరుకుంటారా ? ఐరోపా సమాఖ్య ఒకటిగా ఉన్నట్లు కనిపిస్తున్నా అన్ని దేశాలు ఒకే విధంగా లేవు. అమెరికాతో రాజీకి కొన్ని సుముఖంగా, మరికొన్ని స్వతంత్ర వైఖరితో ఉండాలని కోరుకుంటున్నాయి. జర్మనీ, ఫ్రాన్సు వంటి దేశాలు అవసరమైతే తాము చైనాకు దగ్గర అవుతామనే సంకేతాలను పంపటం అమెరికా నుంచి మరిన్ని రాయితీలు పొందేందుకే అన్నది స్పష్టం. మక్రాన్‌ వాషింగ్టన్‌లో జో బైడెన్‌తో చర్చలు జరుపుతున్న సమయంలోనే బీజింగ్‌లో షీ జింపింగ్‌తో పెట్టుబడుల గురించి ఐరోపా కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైఖేల్‌ భేటీ జరిపాడు. నిజంగా అమీ తుమీ తేల్చుకోవాల్సి వస్తే ఎవరెటు ? ఏం జరుగుతుందనేది తెరమీద చూడాల్సిందే !