Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


మేడిపండు చూడ మేలిమై ఉండు – పొట్ట విప్పిచూడ పురుగులుండు అన్న వేమన పిరికివాడి మదిని గురించి చెప్పారు. అది ప్రజాస్వామ్యానికి కూడా చక్కగా వర్తిస్తుంది. ఆ ముసుగువేసుకున్న వారి అంతరంగాన్ని చూస్తే అవగతం అవుతుంది. పెరూలో అదే జరిగింది.2021 జూన్‌ ఆరవ తేదీన జరిగిన తుది విడత పోలింగ్‌లో వామపక్ష విముక్త పెరూ పార్టీకి చెందిన పెడ్రో కాస్టిలో కేవలం 44,263 ఓట్ల మెజారిటీతో అధ్యక్ష పీఠాన్ని కైవశం చేసుకున్నాడు.జూలై 28న అధికారానికి వచ్చాడు, 2022 డిసెంబరు ఏడవ తేదీన అభిశంసన ఓటింగ్‌ ద్వారా పార్లమెంటు కాస్టిలోను పదవి నుంచి తొలగించింది. తిరుగుబాటు చేశారనే తప్పుడు ఆరోపణతో అరెస్టు చేశారు. ఏడు రోజుల రిమాండ్‌ పద్నాలుగవ తేదీతో ముగుస్తుంది. ఇప్పుడు తప్పుడు కేసులతో జైలుకు పంపేందుకు చూస్తున్నారు. కాస్టిలో తొలగింపునకు నిరసన తెలుపుతున్న వారిని అణచేందుకు మిలిటరీ రంగంలోకి దిగింది. ఆందోళనల కారణంగా మూడు విమానాశ్రయాలను మూసివేశారు.


పదవిలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రభుత్వాన్ని గుక్కతిప్పుకోనివ్వకుండా కాస్టిలోను గద్దె దింపేందుకు స్వదేశీ-విదేశీ శక్తులు పన్నని కుట్ర లేదంటే అతిశయోక్తి కాదు. ఒక స్కూలు టీచర్‌, కార్మిక సంఘనేతగా ఉన్న కాస్టిలో అన్ని రకాల మితవాద శక్తులను, వామపక్ష ముసుగువేసుకున్న ద్రోహులను ప్రతిఘటించి అధికారానికి వచ్చాడు. ఇప్పుడు ఉపాధ్యక్షురాలిగా ఉన్న దినా బొలార్టే గద్దెనెక్కారు.ఆమె పార్లమెంటుతో చేతులు కలిపి అధ్యక్ష పీఠాన్ని దురాక్రమణ కావించారని, తాను అధికారం నుంచి వైదొలగలేదని సోమవారం నాడు కాస్టిలో ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. మొత్తం పార్లమెంటును రద్దు చేసి తిరిగి ఎన్నికలు జరపాలని కాస్టిలో మద్దతుదార్లు జరుపుతున్న ఆందోళనలో ఇంతవరకు ఏడుగురిని ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది. ఆందోళన మరింత విస్తరించకుండా చూసేందుకు 2026కు బదులు 2024 ఏప్రిల్లో అంటే రెండు సంవత్సరాలు ముందుగా ఎన్నికలు నిర్వహించేందుకు పార్లమెంటును కోరతానని దినా బొలార్టే చేసిన ప్రకటనతో నిరసనలు ఆగలేదు, వెంటనే ఎన్నికలు జరపాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతున్నట్లు వార్తలు.నియంత ఫుజిమొరి ఏర్పాటు చేసిన రాజ్యాంగ పునాదుల మీద అమలు జరుపుతున్న నయాఉదారవాద ఆర్థిక విధానాలను మార్చేందుకు వీలుగా నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసేందుకు పూనుకోవటం అక్కడి పాలకవర్గాలకు అంగీకారం గాకపోవటమే ప్రజాస్వామిక కుట్రకు దారితీసింది.


కాస్టిలో ప్రజలెన్నుకున్న పార్లమెంటును రద్దు చేసేందుకు పూనుకున్న కారణంగానే దాన్ని కాపాడేందుకు అభిశంసన తీర్మానాన్ని పెట్టి ప్రజాస్వామికంగానే పదవి నుంచి తొలగించామని జనాన్ని నమ్మించేందుకు మితవాద శక్తులు చూస్తున్నాయి. పార్లమెంటుకు అలాంటి అధికారం ఇచ్చిన అక్కడి రాజ్యాంగం అదే పార్లమెంటు అప్రజాస్వామికంగా ఉంటే దాన్ని రద్దు చేసే అధికారాన్ని అధ్యక్షుడికి కూడా కట్టబెట్టింది.తన పాలనకు అడుగడుగునా అడ్డుపడుతున్న పార్లమెంటును రద్దు చేసేందుకు కాస్టిలో ఆ నిబంధనను ఉపయోగించుకున్నందుకే పదవి నుంచి తొలగించారు. పార్లమెంటులోని 130 స్థానాలకు గాను గతేడాది వామపక్ష ఫ్రీ పెరూ పార్టీకి వచ్చిన ఓట్లు 13.41శాతం కాగా 37 సీట్లు వచ్చాయి. పార్లమెంటులో మితవాద శక్తులే అధిక సీట్లను పొందారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎందరైనా పోటీకి దిగవచ్చు. పోలైన ఓట్లలో సగానికిపైగా తెచ్చుకున్నవారిని విజేతగా ప్రకటిస్తారు. అలా రాకపోతే రెండవ విడత ఎన్నిక జరిపి తొలి విడతలో మొదటి రెండు స్థానాలు వచ్చిన వారి మధ్య అంతిమంగా పోటీ జరుగుతుంది. ఆ విధంగా కాస్టిలో గెలిచాడు. కాస్టిలోను తొలగించేందుకు జరిపిన ఓటింగ్‌లో దానికి అనుకూలంగా 87 ఓట్లు, వ్యతిరేకంగా 45 ఓట్లు వచ్చాయి. నైతికంగా పదవికి అనర్హుడని పార్లమెంటు తీర్మానించి తొలగించే అధికారాన్ని దుర్వినియోగం చేశారు. 2020 అదే పేరుతో ఒక అధ్యక్షుడిని తొలగించారు.


నిరంకుశ, మితవాద శక్తుల మద్దతుతో లబ్ది పొందిన అక్కడి కార్పొరేట్‌ శక్తులకు కాస్టిలో ఎన్నిక మింగుడు పడలేదు. తాను గెలిస్తే నూతన రాజ్యాంగాన్ని ఆమోదించేందుకు గాను రాజ్యాంగసభ ఏర్పాటు గురించి ప్రజాభిప్రాయసేకరణ నిర్వహిస్తానని ఎన్నికల్లో కాస్టిలో వాగ్దానం చేశాడు. దాన్ని అడ్డుకొనేందుకు గతేడాది డిసెంబరులో పార్లమెంటులోని మితవాద శక్తులు ఒక తీర్మానాన్ని ఆమోదించాయి. సంస్కరణల కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపాలంటే ముందుగా పార్లమెంటు అనుమతి పొందాలని దానిలో పేర్కొనటం ద్వారా అధ్యక్షపదవి అధికారాలను పరిమితం చేశారు. పార్లమెంటు స్పీకర్‌ మరియా డెల్‌ కార్‌మెన్‌ అల్వా స్పెయిన్‌ పర్యటనలో అక్కడి పార్లమెంటులో ప్రసంగిస్తూ ” కమ్యూనిజం ఆక్రమణకు పెరూ గురైంది. పెడ్రో కాస్టిలోకు అధ్యక్షుడిగా ఎలాంటి చట్టబద్దత లేదు ” అని ఒక ప్రకటన చేయాలని స్పెయిన్‌ పాపులర్‌ పార్టీని కోరటాన్ని బట్టి అక్కడి మితవాదులు ఎలా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. తొలి కుట్ర అసలు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించకుండా చూసేందుకు ఆధారం లేని ఎన్నికల అక్రమాల ఆరోపణలు చేసి విఫల యత్నం చేశారు. తరువాత రెండుసార్లు అభిశంసన తీర్మానాలు పెట్టి తగినన్ని ఓట్లు రాకపోవటంతో వీగిపోయాయి.లాటిన్‌ అమెరికాలోని ఇతర వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వాలతో సంబంధాలు పెట్టుకోకుండా పార్లమెంటు చూసింది. ప్రతి విదేశీ పర్యటనకు అధ్యక్షుడు పార్లమెంటు అనుమతి పాందాలన్న నిబంధనను అడ్డుపెట్టుకొంటున్నది. 2022 ఆగస్టు ఏడున కొలంబియా వామపక్ష అధ్యక్షుడు గుస్తావ్‌ పెట్రో పదవీస్వీకారానికి వెళ్లకుండా అడ్డుకుంది. ఇంతే కాదు వాటికన్‌లో పోప్‌ను కలుసుకొనేందుకు, థాయిలాండ్‌లో ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార సంస్థ సమావేశానికి, నవంబరులో మెక్సికోలో జరగాల్సిన పసిఫిక్‌ కూటమి సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకుంది.


పెరూ రాజ్యాంగం ఆర్టికల్‌ 134 ప్రకారం అధ్యక్షుడు లేదా కాబినెట్‌ గానీ రెండు సార్లు విశ్వాస తీర్మానాలను కోరినపుడు తిరస్కరిస్తే పార్లమెంటును రద్దు చేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ప్రజాభిప్రాయసేకరణ జరపటంపై విధించిన ఆంక్షల తీర్మానాన్ని రద్దు చేయాలని కోరుతూ నవంబరులో ఒక విశ్వాస తీర్మానాన్ని ఆమోదించాలని ప్రధాని అనిబల్‌ కోరెస్‌ పార్లమెంటును కోరగా అసలు చర్చించేందుకే నిరాకరించారు. దానికి నిరసనగా నవంబరు 24న ప్రధాని రాజీనామా చేశాడు. దాంతో తదుపరి వచ్చిన కొత్త మంత్రి వర్గం తిరిగి అదే ప్రతిపాదన చేసినపుడు మరోసారి తిరస్కరిస్తే అధ్యక్షుడు పార్లమెంటును రద్దుచేసే అధికారం ఉంది. విశ్వాస ఓటును పార్లమెంటు తిరస్కరించినట్లు ప్రభుత్వం నవంబరు 25న ఒక అధికారిక ప్రకటన చేసింది. పార్లమెంటు చర్యలకు భాష్యం చెప్పే అధికారం అధ్యక్షుడికి లేదంటూ పార్లమెంటు స్పీకర్‌ వెంటనే స్పందించాడు. అదే రోజున బెట్సీ ఛావెజ్‌ను నూతన ప్రధానిగా కొత్త మంత్రి వర్గాన్ని కాస్టిలో ఏర్పాటు చేశాడు. నిబంధనల ప్రకారం నెల రోజుల్లోగా పార్లమెంటు విశ్వాసాన్ని పొంది బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. దీన్ని గనుక ఆమోదించకపోతే పార్లమెంటు రెండవ తిరస్కరణగా పరిగణించి రద్దు చేసే అవకాశం ఉంది.2026 వరకు పని చేయాల్సిన పార్లమెంటు రద్దు కోసం అలాంటి అవకాశాన్ని వినియోగించుకోవటం తమ ఉద్దేశ్యం కాదని బెట్సీ ఛావెజ్‌ చెప్పారు. ఆమె అలా మాట్లాడినప్పటికీ పార్లమెంటు మీద వేటు వేసేందుకు కాస్టిలో పూనుకున్నట్లు ఆరోపించిన మితవాదశక్తులు అభిశంసన తీర్మానాన్ని ఆమోదించి కాస్టిలోను గద్దె దించి అరెస్టు చేశారు. కుట్ర పేరుతో విచారణ బూటకానికి తెరలేపారు.


లాటిన్‌ అమెరికా ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ ప్రయోగశాల. ఆ ఖండంలోని దేశాల మీద రుద్దిన నయా ఉదారవాద విధానాలు, వాటిని వ్యతిరేకించిన కార్మికులు, కర్షకులను అణచివేసేందుకు మిలిటరీ, మితవాద నియంతలను రుద్దారు.ఎంత వేగంతో గోడకు కొడతామో అంతే వేగంతో వెనుదిరిగి వచ్చే బంతి మాదిరి అణచివేసినకొద్దీ ప్రజా ఉద్యమాలు పెరిగాయి. పాతకాలపు పద్దతులు పనికి రావని పెట్టుబడిదారీవర్గం, సామ్రాజ్యవాదులు గ్రహించారు. ఆ కారణంగానే ప్రజాస్వామ్యం, చట్టబద్ద పాలన అంటూ గోముఖాలతో జనం ముందుకు వచ్చారు. అణచివేత, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పి కలసి కదం తొక్కిన వారందరూ పూర్తిగా వామపక్షశక్తులు కాదు.తమకు మద్దతుగా విశాలవేదికల మీదకు వచ్చిన వారికి ఎన్నికల్లో జనం జైకొట్టారు. అధికారాన్ని అప్పగించారు. అలాంటి వారందరిని అక్కడి జనం, వెలుపలి వారు కూడా మొత్తంగా వామపక్ష శక్తులుగానే పరిగణించారు. బతుకుభారమై దిగజారిన జీవితాలకు ఊతం, ఉపశమనం కలిగించేవారి కోసం ఎదురు చూసిన జనం ఈ శక్తులు ముందుకు తెచ్చిన సంక్షేమ పధకాలు, దారిద్య్రనిర్మూలన పధకాలు పెద్ద ఎత్తున ఆకర్షించి ఒకటికి రెండుసార్లు వామపక్షాలకు పట్టంగట్టారు.


వామపక్ష నేత కాస్టిలో ఒక స్కూలు టీచరు. ఫుజిమోరి హయాంలో రూపొందించిన ప్రజావ్యతిరేక రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామని ఆయన వాగ్దానం చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా పెరూలో ధనికులు-పేదల మధ్య అంతరాలు పెరిగాయి. పెరూ ప్రయోజనాలకు విరుద్దమైన వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడులను సమీక్షిస్తామని, గ్యాస్‌ ప్రాజెక్టులను జాతీయం చేయటం వంటి చర్యలు తీసుకుంటామని, లూటీ చేసిన సంపదలను స్వాధీనం చేసుకుంటామని పెరూ విముక్త పార్టీ వాగ్దానం చేసింది. 2007లో తొలుత పెరూ విముక్త రాజకీయ ప్రాంతీయ ఉద్యమంగా ప్రారంభమైంది.2012లో పెరూ విముక్త పార్టీగా ఏర్పడింది.2016లో దీన్ని ఎన్నికల సంఘం దగ్గర నమోదు చేశారు. 2019లో పెరూ విముక్త జాతీయ రాజకీయ పార్టీగా పేరు ఖరారైంది.తమది సోషలిస్టు సంస్ధ అని, తాము మార్క్సిజానికి కట్టుబడి ఉంటామని ఆ పార్టీ ప్రకటించింది.


తొలి దశ ఎన్నికల్లో వామపక్ష కాస్టిలో ప్రధమ స్ధానంలో నిలవటంతో మీడియాలో, సామాజిక మాధ్యమంలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారు.మావోయిష్టు షైనింగ్‌ పాత్‌ సంస్ధతో సంబంధాలున్నాయని, కమ్యూనిస్టు అని ముద్రవేసి ఓటర్లను భయపెట్టేందుకు ప్రయత్నించారు. వెనెజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోతొ సంబంధాలు ఉన్నాయని మనం మరో వెనెజులాగా మారవద్దంటూ ధ్వజమెత్తారు. తనపై జరిగిన ప్రచారాన్ని ఖండిస్తూ, కొందరిలో ఉన్న అనుమానాలను తొలగిస్తూ మేం కమ్యూనిస్టులం కాదు, ఛావిస్తాలమూ(వెనెజులా ఛావెజ్‌) కాదు, ఉగ్రవాదులమూ కాదు. మేం కార్మికులం, మీ వంటి వారిమే,మనమందరం వీధుల్లో ఉన్నాం, ప్రశాంతంగా ఉండే వ్యవస్ధ కావాలని కోరుకుంటున్నాం అని ప్రచారంలో చెప్పారు. వామపక్షేతర శక్తులను కూటమిలో కలుపుకొనేందుకు అలా మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. అయితే కాస్టిలో అధికారానికి వచ్చిన తరువాత కొన్ని శక్తులు కాస్టిలోతో విబేధించి కూటమి నుంచి తప్పుకున్నాయి. ఇటీవల మితవాద శక్తులకు ఇది మరింత ఊతమిచ్చినట్లు కనిపిస్తోంది.


లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు అధ్యక్ష పదవులను గెలుచుకొని అధికారానికి వస్తున్నప్పటికీ పార్లమెంట్లలో మెజారిటీ తెచ్చుకోవటంలో విఫలం అవుతున్నాయి. కొన్ని దేశాల్లో సంఘటితమైన పార్టీల నిర్మాణాలు కూడా లేకపోవటం ఒక బలహీనతగా చెప్పాలి. వెనెజులా, అర్జెంటీనా, తాజాగా జరిగిన బ్రెజిల్‌ ఎన్నికల్లోనూ అదే జరిగింది.దీన్ని అవకాశంగా తీసుకొని మితవాద శక్తులు అడుగడుగునా కుట్రలకు తెరలేపుతున్నాయి. ఈ బలహీనతలను అధిగమించకుండా, నయాఉదారవాద పునాదుల మీద ఏర్పడిన రాజ్యాంగాలతో వామపక్ష శక్తులు కోరుతున్న కార్మికవర్గ సాధికారతను సాధించటం జరగదు. చివరకు సంక్షేమ పధకాలను కూడా పూర్తిగా అమలు జరపలేని ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాయి. మితవాద శక్తులకు వ్యతిరేకంగా కలసి వచ్చే ప్రజాతంత్ర శక్తులను కలుపుకొనేందుకు వామపక్షాలు కొన్నిసార్లు రాజీపడాల్సి వస్తోంది. పెరూలో జరిపిన ప్రజాస్వామిక కుట్రను నిరసిస్తూ కాస్టిలోకు మద్దతుగా, నూతన ప్రభుత్వం గద్దె దిగాలని, తిరిగి ఎన్నికలు జరపాలని కోరుతూ జనం వీధుల్లోకి వచ్చారు. ఆ డిమాండ్‌ను అంగీకరించేది లేదన్న నూతన అధ్యక్షురాలు ఒక అడుగు దిగి వచ్చి రెండేళ్ల ముందుగా ఎన్నికలు జరిపిస్తామని ప్రకటించినా ఆందోళన సద్దుమణగలేదు.ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.